బతుకు చిత్రం-30

– రావుల కిరణ్మయి

జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించుకుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది .

***

          జాజులమ్మ పనులన్నీ త్వరత్వరగా ముగించుకొని కూలి పనులకు బయలుదే రింది. పిల్లలలను అత్తకు అప్పగించి కమలను సమయానికి అన్నం తిని హాయిగా రెస్ట్ తీసుకొమ్మని చెప్పి ,సైదులు కోసం చూసింది.

          గమనించిన ఈర్లచ్చిమి వాడు లేవంగనే అవుతలవడ్డడు. పనికి సుతం పోవుడు ఉన్నదో లేదో?

          అయితేమాయే తీ ! అత్త శాతనయిత లేదేమో! 

          ఏమో మరి ! కూకుండవెట్టి తినవెట్టి నేను మీ మామను తయారుజేసిన నువ్వు ఈన్ని
జెయ్యి అన్నది.

          ఏ గట్లెందుకయితదత్త !నువ్వు ఫికరు వడకు.

          ఫికరెందుకు ?ఒక్క చెయ్యి ఆడంగ ఎబ్న్మండుగురం తినవడితిమి. ఇంకా ఫికరెందు కు వడుత

          అంటుండగ ,

          జాజీ ..జాజీ ..!వత్తన్నవానే అనే కేక బజారులో నుండి వినిపించగానే , పొయ్యొస్త అత్తా !

          పైలం, పురుగు బూసి అన్నది.

          మీ అత్త ఏంది పిల్ల? ఎప్పుడు అగులు బుగులు అవుకుంట పైలం ..పైలం అంటది. మన బతుకులు ఎప్పుడో గాలిల పెట్టిన దీపాలసొంటిఎనాయే? అన్నది ఒగామె జాజులమ్మతో .

          అట్లని ఇప్పుడే జీవిడువలెం గదా !

          మంచి మాటన్నవ్! బిడ్డ ! పుట్టిచ్చినోడు పిల్సేదాంక ఉండి పోరాటం చెయ్యాల్సిం దే. అన్నది ఇంకోగామే.

          ఇట్లా మాట్లాడుతూ నడుస్తున్నా వాళ్లకి సయిదులు ఎదురయిండు.

          ఓ పిల్ల !నడువాల్నా ?వత్తవా ?అన్నది ఒగామే జాజులును ఉద్దేశించి.

          నడువుండ్రి ,నేనందుకుంట. అని ఆగింది.

          యాడికి పోయినవే ? నేను బోతాన. పిలగాండ్లు పయిలం. అన్నది.

          గదేంది, నాకు జెప్తవ్ !అవ్వున్నది గదా ! నేను పని పోతన. అని కదిలిండు.

          పనికి పోతాండా? లేడాని? ఎంత మర్మంగ తెలుసుకున్నవ్ బిడ్డా? అని ఎనుకవడి తనతో కలిసిన మంగళమ్మ అన్నది.

          లేకుంటే మా మొగోల్లకు కోప్పలు ఎక్కువ? నన్నే అడిగేదానివా? అని నానామాటలు
అంటరు అని, మామను దృష్టిలో పెట్టుకొని చెప్పి, నువ్వెందుకు ఎనుకైనవ్? అడిగింది.

          మా చిన్నత్త చిన్న కోడలు ఇంట్ల పంచాయిదికి మందు దాగిందని పోనత్తే, మాట్లాడి
వత్తాన.

          అయ్యో !గిప్పుడేట్లున్నది ?

          ఎట్లుంటది? దావఖాన్ల ఎసింద్రట. చూసద్దును గని ఎవలను చూడనిత్తలేరట. అవ్వ
గారింటికి బొయ్యి ఉసురు తీసుకోబోయింది. పొల్ల. వల్ల గుండెలు పగులుతానయట. ఇటు
వీళ్ళకు అటోఇటో అయితే ఎట్లరా? దేవుడాని ఈళ్ళ గుండెలు అదురుతానయ్. గీ భయ మేదో అప్పుడే ఉంటె గాక పోవునా? పీక మీదికచ్చినంక ఒగిలిత్తే ఏమున్నది? ఎన్ని
మాట్ల జెప్పినమని. లోల్లులు వద్దు, కూసుండి మాట్లాడుకొండ్రని. ఇంటేనా? చెర్ల నీళ్ళు ఒయ్యి చేరువెంక వడ్డంక ఏముంటది? అని మాటల్లల్లనే పని కాడ చేరుకున్నారు.

          జాజులమ్మ అడిగింది. ఇంతకు పంచాయిది ఎందుకని ?

          ఎందుకంటే మగపోరన్ని కనలే, మల్లో లగ్గం జేత్తమని .

          ఆ పిల్ల దేవుడిచ్చినదానికి నేనేం జేత్త. ఎవలేం జేత్తరు? నా బిడ్డలకు ముక్కు
వంకరనా? మూతి వంకరనా? కన్ను వంకరనా? కాలు వంకరనా? ఆల్లను సాది మంచిగా సదువిత్తే ఆళ్ళ బతుకు ఆళ్ళు బతుకుతరని తెగేసి చెప్పింది.

          ఔ గదా! అందామను కొని ఆగి పోయింది. తన మామ అట్లంటేనే గదా పిలాగాన్డ్లకు ఈన్త నీడలేకుంట అయితదని కమలతోని పెళ్ళి చేసింది గుర్తుకు రాగా ఊరుకుంది పోయింది.

          పిల్లల కర్సుకు ఇంకిన్ని పైసలు దెమ్మని దినాము లోల్లె, అట్ల సుతం మా ఒళ్లకు
నేనోక్కదాన్నేనా కడుమ చెల్లెళ్ళ ఖర్సులు ఎట్లా ఎల్లదీత్తరని బాగనే కొట్లాడింది.

          మరి గింత ధైర్నం గల్లది పొల్లగాండ్లను ఆగం జేసుడేంది?

          గదేగదా! కొట్టంగ కొట్టంగ రాయి సుతం కరుగుతదని ఈల్లు వెట్టె బాధకు తిట్టే
తిట్లకు, మల్ల ఒక్కదాన్ని గాదాయే వాళ్ళ ఆవ్వ అయ్యలను గూడ తిట్ట వట్టిరి. సాలేదా వోతదని, బరాయించుకోలేక ఇగ పాణం దీసుకోను తయ్యారయింది. 

          మరి తల్లి గారింటికి ఏమ్పనికి పోయింది? సావైనా. బతుకైన ఈన్నె ఉండక?

          అడిగింది.

          ఎట్లుంటది? పొల్ల గాండ్లను ఎవరో సాదుకుంటమని అడిగిండ్రట. ఇంట్ల అందరు ఏకమై ఇచ్చుడే ఆన్నన్న పిలగాండ్లు మంచిగా బతుకుతరు మనకు సుతం ఒగరి బరువు దిగుతదని మాట్లాడిండ్రట. కండ్ల మునగత ఉంటె గిట్నే సాదిత్తరని ఓ నాలుగోద్దులు జరిగినంక మల్లోద్ధమని పోయిందట. గింతల్నే మొగడు పొయ్యి నేను మాటిచ్చిన వాళ్ళు
కాయిదాలు తయారు చేసుకొని వత్తాండ్రు అని రమ్మన్నడట. తల్లిగారోళ్ళు తల్లడమల్లడ అల్లుడని గూడ సూడక బాగనే అర్సుకున్నరట. దాంతోని కొంచెం భయం సొచ్చి అట్లయి తే ఇగ జేయ్యతీ అని మాటిచ్చి సక్కగ అచ్చిండట.

          ఇగ కాసేపటికి పొల్ల కక్కుడు సురువు జేసి కిందవండి బోర్లుతాంటే గప్పుడు దవాఖానకు ఎస్కపోతే ఆళ్ళు ముచ్చట చెప్పిండ్రట.

          అయితే ఈ మగడే వచ్చేటప్పుడు దానికి అదేందో సల్లగుంటది గది తెచ్చి తాపిచ్చిండట. గప్పుడే గండ్ల మందు కలిపి ఉంటడని అనుమానం పడుతాండ్రు. అని ఆమె చెప్పుకుపోతున్న మాటలు మనసును మెలిపెడుతుండగా ఇంక ఆ ముచ్చట మార్చింది జాజులమ్మ.

          ఆమెకు కొంచెం వైద్యం తెలిసి ఉండడంతో, నడుము నొప్పికి ఏం మందున్నది జర జెప్పక పోతివి అని అడిగింది.

          ఎవలకు? నేకేనా? రాక ఏమయితది? పుట్టెడు పని నెత్తిల ఏసుకొని సేత్తవాయే. ఆముదం గింజలు రెండో, మూడో పిప్పి తీసి, దోసెడు బియ్యం పాలు చేక్కరతో పాయసం
చేస్కొని దినం రెండు సార్లు తాగాలే, అట్లాగాకుంటే నల్ల తుమ్మ బంక ఆవు నెయ్యిల వేయించి దంచి మెత్తగ పొడి జేసుకొని నగుబోతుతోటి కలిపి తింటే బొక్కలకు బలమత్తది.
మింగ మెతుకు లేదు గని మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు నాకు ఆవు నెయ్యి ఎద
దొరుకుతది గని, ముందు జెప్పిందే జేస్త.

          మరి పోయేటప్పుడు సీదా మా ఇంటికే రా ! ఆముదం ఇత్తులు ఒరవెట్టిన. ఇత్త అన్నది. 

          అట్ల అన్నం తినే సమయం కావడంతో అందరు మర్రి చెట్టు కిందికి చేరుకున్నారు.
ఒక్కొక్కరు ఒక్కో తీరు కూర తెచ్చిండ్రు. తలా ఇంత పంచుకుంటుంటే జాజులమ్మ వారితో కలవ లేక పోయింది. తను నిమ్మకాయ పచ్చడి తప్ప ఏం తేలేక సిగ్గు పడి తనది తనే తినసాగింది.

          మంగళమ్మ చూడనే చూసింది .

          జాజీ !ఓ నాడు నీకున్టది. ఓనాడు నాకుంటది. అందరియి గవ్వే బతుకులాయే. గిట్ల సిన్న వోతే ఎట్లా? ఇగ వటు రాత్తిరి బొమ్మ శాపల శారు జేసిన పటు అని పోసింది.

          చాలా రుచిగా ఉండడంతో ఆబగా తినేసింది. ఒక్కసారి ఇంట్లోళ్ళు గుర్తుకు వచ్చి వాళ్ళు ఏం తిన్నరో ఏందో? పోయేటప్పుడు ఉంటె శాపలు తీసుకోవాలె ఎట్లన్న అను కున్నది.

          అందరు కాసేపు సెట్టు నీడకు నడుం వాల్చిండ్రు.

          మంగళమ్మ ఓ పాట పాడరాదే అన్నది ఒగామె .

          మంగళమ్మ అప్పటి కప్పుడే పాట కట్టి పాడుతది. అందుకే అట్ల అడిగి మరీ పాడించుకుంటారు.

          ఎవల మీదనే అన్నది .

          నా మీదనే అన్నది ఆమె .

          పాట మొదలు వెట్టింది .

సుక్కా సుక్కల సీర సక్కంగా కట్టినాది మాసెల్లె యాదమ్మ
సుక్కాల రయిక మీద అద్దాల పోత పోసి అన్చేసినాది ……….

పిట్టేమో రెట్టేయంగా మొగునితో మొత్తుకొంగా
నాయి మొగడెమో బిరా బిరా గులేరువట్టి మబ్బుల్ల గురివెట్టే ………

యాదమ్మ అందం జూసి పిట్ట కన్ను గుత్తి రెట్ట వేస్తే , యాదమ్మ మొగుడికి
జెప్తే ఆయన గులేరు వట్టి మబ్బులకు గురివెట్టినాడని, అది దొరికేదేప్పుడో /మా
సెల్లె నవ్వేదేప్పుడో ? అని పాడుతుంటే అందరూ కష్టం మరిచి కడుపారా నవ్వుకొని
మళ్ళీ పని లోకి దిగారు.

          సాయంత్రం పనిదిగే వేళ కావడంతో అందరూ తిరుగు ప్రయాణమయ్యారు.

          మంగళమ్మ జాజులమ్మను ఆముదం గింజలకు రమ్మని అన్నది .

          అంత అవసరం లేకున్నా అడిగినందుకయినా పోకుంటే మల్లోసారి అవసరమున్న ప్పుడు ఏమంటదోనని సరేనని ఆమెతో వాళ్ళింటికి బయలు దేరింది .

***

          వీళ్ళు ఊళ్ళో అడుగు పెడుతుండంగానే ఒకటే బొబ్బ. వసంత సచ్చిపోయిందట
అని. మంగళమ్మ అయ్యో బిడ్డా ..!ఎంతపనాయె ?అని ముక్కు జీదుకుంట నడక వేగం పెంచింది.

          జాజులమ్మకు అర్థం అయింది ఆమె పొద్దున చెప్పినామే అని. మనసు చివుక్కు మంటుండగా …నేను మల్లెప్పుడన్న వత్తతీ! అని ఇల్లు జేరింది. ఈమెను పట్టించుకునే స్థితిలో ఆమె లేదు.

          దాగుడుమూతలు ఆడుకుంటున్న ముగ్గురు బిడ్డలను ఒక్కసారిగా పిల్లల కోడిలా
అదుముకొని చూసుకుంటూ ఉండగా ఈర్లచ్చిమి చిత్రంగా చూస్తూ ఏమాయెనే ?ఊరవతల నుండి అచ్చి గట్ల పొదువుకుంటానవ్. పొల్లగాండ్లకు ఏమన్న అంటుకుంట ది. అంటూ కోపం చేస్తుండగా లేచి జాలాట్లకు కదిలింది.

          సరపిండ్ తెచ్చిచ్చి ఇప్పుడు జెప్పు ఏమయింది ?

          జాజులమ్మ పొద్దున మంగళమ్మ చెప్పిన దగ్గరి నుండి ఇప్పుడు వచ్చేముందు తను విన్న విషయం వరకు పూసగుచ్చినట్టు చెప్పింది.

          ఆడపొలగాండ్లు ఉంటె ఇంత అన్నాలమా? సర్కారు చట్టాలు తెచ్చినా ఇటు వంటివి ఆగక పాయె !నేను ఒప్పుకోకుంటే నన్ను గట్నే జేత్తే నా పొలగాండ్లు గాయి గాయి గాలి పటాలే గదా ! అన్నది .

          పిస్స లేసినట్టు మాట్లాడుతవెందే ? నేనుండగా గట్ల జరగనిత్తునా ? అంతటి పాపపు
జన్మలు గావే ? మావి అన్నది , మామ ఆస పడుతాండు గని పంతం పడతలేడు బిడ్డా ! ఆయనను నేనున్నా లేకున్నా మీరు మంచిగా జూసుకోవాలే, ఇంటు వంటి కచ్చలు పెట్టుకో వద్దు బిడ్డా !అనంగానే ..

          జాజులమ్మకు తన తప్పు తెలిసివచ్చింది, ఆమె ఆరోగ్యం బాలేదని తెలిసి తను  ఎంత పొరపాటు మాట్లాడింది తెలిసి రాగా

          అత్తా! నా తప్పు ఒగ్గెయి. ఏదో కాష్టం వాయిరాగ్యం అనుకోరాదు అత్తా! అని
బ్రతిమిలాడుకున్నది .

          సరెలేవే! ఎవరి భయం వాళ్ళది. నేను అట్టు పోయి చూసి వత్త. అనుకుంట పోయింది.

          కమల విని ఏమీ మాట్లాడలేదు. నీరసంగానే కనిపించి, జాజులమ్మ కమలా!ఎట్లున్నదే? ఏమన్న తినబుద్ధి అయితాందా? అడిగింది.

          లోపల చేపల కూర తినాలని ఉన్నా లేలే మంచిగనే ఉన్న అన్నది.

          జాజులు రేపు ఎట్లనన్న షాప్లు తెప్పించి వందియ్యాలని అనుకున్నది.

*****

ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.