మా కథ (దొమితిలా చుంగారా)- 45

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

          హోటల్లో నాకో ఈక్వెడార్ స్త్రీతో దోస్తీ కలిసింది. మేమిద్దరమూ కలిసి సమావేశ స్థలానికి చేరాం. ఐతే చర్చలు శుక్రవారం ప్రారంభమైతే నేనక్కడికి సోమవారానికిచేరాను!

          మేం ఓ నాలుగైదు వందల మంది స్త్రీలు సమావేశమైన హాల్లోకి వెళ్ళాం. నాతో పాటు ఉన్న స్త్రీ “రా! స్త్రీలు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్యల గురించి ఇక్కడ చర్చిస్తారు. మనం మన గొంతు వినిపించాల్సిందిక్కడే” అని నన్ను తీసుకెళ్ళింది. ఆ హాల్లో సీట్లేమీ ఖాళీ లేవు. మేం చాల ఆసక్తితో అక్కడ మెట్ల మీదనే కూచున్నాం. అప్పటికే ఒకరోజు సమావేశం పోగొట్టుకున్నాం గనుక మా ఆసక్తి రెట్టింపైంది.

          నాకు అదే మొదటి అనుభవం కావడం వల్ల అక్కడేవో గొప్ప సంగతులు వింటానని, పోరాటంలో, జీవితంలో పనిలో ముందుకు పోవడానికి ఉపయోగపడే విషయాలేవో వింటానని నేనాశించాను.

          సరే-అప్పుడొక విదేశీయురాలు మైకు ముందుకెళ్ళింది. రాగి వెంట్రుకలతో, మెడ చుట్టూ ఏవో ఆభరణాలు పెట్టుకొని ఉన్న ఆవిడ జేబుల్లో చేతులు పెట్టుకొని మాట్లాడడం మొదలెట్టింది. “నేను నా అనుభవాలు మీతో పంచుకోవడానికి ఈ మైకు ముందుకొచ్చాను. వేశ్యలమైన మేం అనేక మంది పురుషుల్ని సంతృప్తి పరచడానికి సాహసిస్తున్నాం గనక పురుషులు మాకు వెయ్యిన్నొక్క పతకాలైనా ఇవ్వవచ్చును” అనే తరహాలో ఈ ఉపన్యాసం సాగింది. చాల మంది స్త్రీలు సెబాస్, సెబాస్ అని చప్పట్లు కొడుతున్నారు.

          నేను, నా స్నేహితురాలు అక్కడి నుండి లేచి మరో గదిలోకి వెళ్ళాం. అక్కడ లెస్బియన్లు ఉన్నారు. వాళ్ళ చర్చ అంతా “స్త్రీ మరో స్త్రీని ప్రేమించడంలో ఎంత ఆనందం, గర్వం పొందగలదో, తమ హక్కుల కోసం వాళ్ళు ఎలా పోరాడాలో …” మొదలైన విషయాల గురించి సాగుతోంది.

          ఇవి నాకు ఆసక్తి కలిగించే విషయాలు కావు. ఇలా సమావేశం పేరుమీద, ఈ విషయాలు చర్చించడానికి ఇంత డబ్బు ఎందుకు తగలేయాలో నాకు అర్థం కాలేదు. నేను గనిలో పనిచేస్తుండే నా భర్తమీద ఏడుగురు పిల్లల బాధ్యతనూ వదిలేసి ఇంత దూరం ఎందుకొచ్చానంటే, నా మాతృదేశం ఎలాంటి స్థితిలో మగ్గిపోతున్నదో, అది ఎలా కష్టాల పాలవుతున్నదో, అక్కడ ఐక్యరాజ్యసమితి నిబంధనలు ఎలా కాలరాచివేయ బడుతున్నాయో ప్రపంచానికి చాటి చెప్పడానికొచ్చాను. ఇదంతా ఇతర దేశాల పీడిత జనానికి చెప్పి, వారి వారి దేశాల గురించి వారేం చెప్తారో, విముక్త దేశాల వాళ్ళేం చెప్తారో వినడానికొచ్చాను. కాని, ఇలాంటి సమస్యలు చర్చించబడుతుండడం చూసి నాకు అంతులేని నిరాశ కల్గింది. అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు? – పురుషులే మన శత్రువులు, మగవాడే మన పగవాడు, మగవాళ్ళు యుద్ధాలు చేస్తారు, అణ్వాయుధాలు తయారు చేస్తారు. స్త్రీలను కొడతారు…. అలాంటి దుర్మార్గాలెన్నో చేస్తారు. స్త్రీలకు సమాన హక్కుల కోసం మనం చేయాల్సిన మొట్టమొదటి పోరాటం ఏమంటే పురుషుల మీద యుద్ధం ప్రకటించాలి. పురుషునికి పది మంది ప్రియురాళ్ళుంటే స్త్రీ పది మంది ప్రియులను సంపాదించుకోవాలి. పురుషుడు తన డబ్బంతా తాగి తందనాలాడితే స్త్రీలూ అదే పని చేయాలి. మనం ఈ స్థాయికి చేరుకున్నప్పుడే పురుషులు, స్త్రీలు భుజం కలిపి దేశ విముక్తి కోసం, దేశంలోని జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం పోరాడగలరు. అక్కడ చాల బృందాల మనస్తత్వం, దృక్పథం ఇదే. నాకీ మాటలు విని ఒళ్ళు జలదరిం చింది. మేం వేరు వేరు భాషలు మాట్లాడుతున్నామని నాకర్థమై పోయింది. ఇక ఈ సమావేశంలో నేను కొనసాగడం కష్టసాధ్యమని నాకనిపించింది. అంతే కాదు, అలా మాట్లాడే వాళ్ళకే అక్కడ మైక్ మీద అధికారం ఉంది.

          ఇక లాటిన్ అమెరికన్ స్త్రీలం కొందరం కలిసి ఈ పద్ధతంతా మార్చేశాం. మా ఉమ్మడి సమస్యలేమిటో తెలుపుకున్నాం. స్త్రీల అభివృద్ధి అంటే మా దృష్టిలో ఏమిటో మేం ప్రకటించాం. ప్రపంచంలో అత్యధిక సంఖ్యాక స్త్రీలు ఎలాంటి జీవనం గడుపు తున్నారో మేం తెలుసుకున్నాం. మా ప్రధాన కర్తవ్యం మా భర్తలకు వ్యతిరేకంగా తిరగ బడడం కాదనీ, వాళ్ళతో భుజం కలిపి మరో నూతన వ్యవస్థ కోసం, ఏ వ్యవస్థలోనయితే పురుషులకూ, స్త్రీలకూ సమానంగా బతికే హక్కూ, పనిచేసే హక్కూ, సంఘటితపడే హక్కూ ఉంటాయో ఆ వ్యవస్థ కోసం పోరాడడమే అని కూడా స్పష్టీకరించుకున్నాం.

          సమావేశంలో వాళ్ళకు ఎంత పట్టు ఉన్నదో మొదట నాకు అర్థం కాలేదు. కాని ఉపన్యాసాలు, ప్రకటనలు మొదలయ్యాక ఈ విషయం స్పష్టమయింది. ఉదాహరణకు వేశ్యా వృత్తి, జనన నిరోధం మొదలైన విషయాల గురించి మాట్లాడిన వాళ్ళు, ఆ విషయాలే మౌలిక సమస్యలుగా చర్చించబడాలని వాదించారు, పట్టుబట్టారు. అవి నిజమైన సమస్యలనే మాట మేం ఒప్పుకున్నాం, కాని అవే ముఖ్యమైనవంటే మాత్రం ఒప్పుకోలేకపోయాం.

          తినడానికి సరైన తిండిలేని పేదరికంలో మేం అంత మంది పిల్లల్ని కనకుండా జనన నియంత్రణ పనిచేస్తుందని వాళ్ళన్నారు. మానవజాతి ఎదుర్కొంటున్న సమస్య లకూ, ఆహార కల్తీకీ ఏకైక పరిష్కారం జనాభా నియంత్రణేనని వాళ్ళన్నారు. కాని వాస్తవా నికి వాళ్ళు చెప్పిన ప్రకారమే చూసినా మా దేశంలో జనాభా నియంత్రణ అమలు పరచడం వీలుపడదు. బొలీవియాలో ఇప్పుడున్న జనాభాకు నియంత్రణ అమలుచేస్తే కొన్నాళ్ళకు బొలీవియా ప్రజలు లేని దేశమయిపోతుంది. అంటే మాదేశాన్ని పూర్తిగా తమ అధికారం కింద ఉంచుకోదలచు కున్న వారికి మా దేశం అప్పనంగా అమరుతుందన్న మాట, అంతేనా? మేం ఇలాగే ఇంత దుర్భరంగా బతుకులీడ్వ వలసిన అవసరమేమీ లేదు. బొలీవియాలో ఉన్న సహజ సంపదలను బట్టి దీన్నంతా మార్చేయవచ్చు. కాని ప్రభుత్వానికా కోరిక లేదు. బొలీవియన్ ప్రజల తక్కువ స్థాయి జీవన ప్రమాణాన్నీ, తాను చెల్లించే తక్కువ జీతాలనూ ప్రభుత్వం సమర్థించు కుంటుంది. జనాభా నియంత్రణకు నిర్విచక్షణగా తలపడుతుంది.

          ఏదో రకంగా సమావేశాన్ని మౌలిక సమస్యలు కాని వాటితో పక్కదారి పట్టించాలని వాళ్ళు ప్రయత్నించారు. కనుక మేం ప్రాథమిక సమస్యలేమిటో అక్కడి వాళ్ళకి తెలియ జెప్పాల్సి వచ్చింది. అయితే వాళ్ళు మైక్రోఫోన్ ముందు రెండు నిముషాలే మాట్లాడనిచ్చే వాళ్ళు గనుక నేను ఎన్నోసార్లు చిన్న ఉపన్యాసాలిచ్చాను.

          నాకీ సమావేశం సంగతి చెప్పిన బ్రెజిలియన్ దర్శకురాలి సినిమా ‘ది డబుల్ డే’ కూడ అక్కడ ప్రదర్శించారు. ఆ సినిమా సమావేశంలో పాల్గొన్న వారికెందరికో అంత వరకూ తెలియని లాటిన్ అమెరికన్ కార్మిక, కర్షక స్త్రీల గురించి అర్థం చేయించింది. ఆ సినిమాలో చాకిరీలో మగ్గిపోయే స్త్రీలు కనిపిస్తారు. దాంట్లో అమెరికాలోని స్త్రీలకూ, మెక్సికో లోని స్త్రీలకూ, అర్జెంటీనాలోని స్త్రీలకూ తేడా కనిపించింది. ఈ రెండు రకాల స్త్రీల మధ్య ఎంత పెద్ద అఖాతముందని! ఈ అఖాతం బొలీవియా దృశ్యాన్ని వివరించినప్పుడు మరింత పెరిగిపోయింది. లాస్ లామాలో పనిచేస్తున్న ఒక గర్భిణి స్త్రీని చూసి “నువ్వీ సమయంలో కూడ ఎందుకింత కష్టపడుతున్నావు?” అని అడిగారు. తన భర్త. రిటైరై ఉన్నాడు గనుక తనకూ, పిల్లలకూ, భర్తకూ తిండి సంపాదించాలంటే తాను కష్టపడ వలసిందేనని ఆమె చెప్పింది. రిటైర్ చేయడమంటే సిలికోసిస్ జబ్బు ఉన్నదనే పేరుతో వెళ్ళగొట్టడమేనని సంగతి ఇది వరకే చెప్పాను గదా. “మరి పెన్షన్లో బతకొచ్చుగదా” అని ఆవిడ్ని మళ్ళీ ప్రశ్నించారు. అప్పుడా గని కార్మికుని భార్య కంపెనీ ఇచ్చే పెన్షన్ ఎంత ఉంటుందో, కంపెనీ కార్మికుల్ని ఎట్లా పీల్చి పిప్పి చేసి పని నుంచి తొలగిస్తుందో వివరించింది. ఆయన మొఖాన వాళ్ళు పారేసే పెన్షన్ చాల తక్కువ. అది ఆయన చికిత్సకే సరిగా సరిపోదు. ఈ దృశ్యం చాల బాగుండింది. అది ఎన్నో విషయాల్ని వివరించింది. సమావేశంలోని ఎందరో స్త్రీలు నేనప్పటి వరకూ చెప్తూ వస్తున్నవి అబద్ధాలు కావని గుర్తించారు.

          ఆ తర్వాత సినిమాలో నేను కూడా కనిపించాను. సినిమా ఐపోగానే వాళ్ళు నన్ను మాట్లాడమన్నారు. ఈ సినిమాలో చూపిన పరిస్థితి నిరుపేద స్త్రీలకు బతుకుతెరువు చూపాలని ఏ ఒక్క ప్రభుత్వమూ ఆలోచించక పోవడం వల్ల వస్తున్నది, స్త్రీలు వంటింటి చాకిరీకే పరిమితమయ్యారని, అది కూడ ఉచితంగా చేస్తున్నదేనని వివరించాను. నా భర్త జీవితంలో కుటుంబ రాయితీ అనే పేరు మీద నెలకు 14 పిసోలు కలుపుతారు. నా పనికి వాళ్ళిచ్చే జీతం అదన్నమాట. 14 పిసోలంటే ఎంత? నెలకు ఒక డాలర్ లో మూడింట రెండు వంతులకు సమానమవుతుందది! దానితో ఏమొస్తుంది? రెండు సీసాల పాలుగానీ, ఒక అరడబ్బా టీ పొడిగానీ ….

          అందుకే మనం బతుకుతూ ఉన్న పెట్టుబడిదారీ వ్యవస్థను మార్చే వరకూ మనకే పరిష్కారమూ దొరకదనే విషయం అర్థం చేసుకొమ్మని వాళ్ళను కోరాను. వాళ్ళలో చాలా మంది నేను చెప్పేదానితో అప్పుడప్పుడే అంగీకారం కుదురుతోందన్నారు. మరి కొందరైతే ఏడ్చారు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.