జ్ఞాపకాల సందడి-48

-డి.కామేశ్వరి 

కావమ్మ కబుర్లు – 25

          అమ్మమ్మ, అమ్మ తరంలో ఆడవాళ్ళ బతుకులు. అధ్వాన్నంగా ఉండేవి.  పిల్లలను కనడం పెంచడం వంటింటి చాకిరీతో, రాత్రి పగలు సతమతమవడం తప్ప వారికంటూ వేరే ప్రపంచం ఉండేది కాదు. ప్రతి ఇంటా ఇవే కథలు, ఇదే చాకిరీ. కనీసం ఇంటికో విధవరాలుండేది. చిన్నప్పుడే,  పదేళ్ళకే పెళ్లి చేయడం, కాపురానికి వెళ్ళకుండానే, భర్త పోతే గుండు గీసి, తెల్ల పంచ కట్టించి కూర్చో పెట్టేవారు. మిగతా కులాల సంగతులు నాకు తెలియవు కానీ, బ్రాహ్మణ కులంలో మాత్రం ఈ బాల వితంతువులు ఇంటికొక్కరైనా ఉండేవారు. వాళ్ళ బతుకులు వీళ్ళ ఇంట వాళ్ళింట పురుళ్ళు పోయడానికి వెళ్ళి, చాకిరీకి పనికి వచ్చేవారు. ఎవరి సంగతో ఎందుకు? అమ్మమ్మ, అమ్మ రెండు పురుళ్ళు ఒకేసారి అయితే ఇంట్లో మడి చాకిరీకి వచ్చేది. ఆవిడ పేరు కామేశ్వరమ్మ మా అమ్మమ్మ కజిన్ సిస్టర్. పాపం పదో యేట పెళ్ళి అయిందా ఇంకా కాపురానికి వెళ్ళక ముందే, భర్త పొలంలో పాము కరిచి చనిపోయాడు. ఆ రోజుల్లో ఏదో జబ్బు చేసి చిన్నప్పుడే మొగుళ్ళు పోతే, (వైద్య సదుపాయాలు అన్నిచోట్లా దొరికేవికావు.) వీళ్ళు జన్మంతా ఎవరి ఇంట్లో అవసరం వచ్చినా వెళ్ళి ఆదుకునేవారు. రాత్రిపూట ఉప్పుడు పిండి తిని, తిండికి కూడా నోచుకోని బతుకులు ఉండేవి.

          మా తరానికి వచ్చేసరికి బతుకు చాలా బాగుపడింది. ఓ సారి ఎవరో, ఆడదాని అభ్యుదయం ఎంత వరకు వచ్చినదని అడిగితే, చేతికి వాచీ కట్టుకుని మొగుడితో సినిమాకి వెళ్లేంత వరకూ వచ్చిందని రంగనాయకమ్మ జవాబిచ్చింది. అక్షరాలా నిజం. అందరం ఏదో కాస్త చదువుకుని, సినిమాలు, షికార్లు అంటూ మొగుడితో తిరిగాం. ఇంట్లో వంట పిల్లలు వున్నా ఇద్దరు ముగ్గురు పిల్లలతో సరిపెట్టి, వంటింట్లో ఇరవై నాలుగు గంటలూ మగ్గిపోకుండా, పుస్తకాలు చదవడం, రేడియో వినడం, శెలవు రోజు వస్తే ఏ స్నేహితుల ఇంటికో వెళ్ళడం ఆరంభమైంది. మగవాళ్ళు చదివి, ఉద్యోగాలకి వేరే ఊర్లకి వెళ్లడంతో అత్తింటి కాపురాలు పోయి, స్వంత కాపురాలు, స్వంత టేస్ట్ లు మారడం, పార్టీలకి మొగుడితో వెళ్ళడం వచ్చాయి. ఆడదాని అభిప్రాయాలు అడగడం, సలహాలు సంప్రదింపులు ఉండేవి. అపుడు మొగుడిదే ఇంట్లో పెత్తనం. మొగుడి మాటే చెల్లడం, మొగుళ్ళు చెప్పినట్లు చేయకపోతే తిట్లు సంసారాల్లో ఉన్నా, ఇంట్లో భార్య అన్న దానికి విలువ వచ్చింది. కొట్టుకున్నా, తిట్టుకున్నా అలకలు, బతిమాలుకోడాలు…  మగవారిదే కాపురంలో మాట చెల్లుబాటు అయినా ఆడదే సర్దుకునేది. ఇంకా ఆడదానికి ఆర్థిక స్వతంత్రం లేదు. కొందరు ఉద్యోగం చేసిన డబ్బులు తెచ్చి మొగుడి చేతులో పోయడం తప్ప ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టే స్వతంత్రం ఉండేది కాదు. మొత్తానికి మా తరంలో మార్పు వచ్చినా, ఇల్లు, సంసారం, పిల్లల చుట్టూనే ఎక్కువ తిరిగేది. మొగుడంటే భయం, భక్తి ఉండేది.

          మా పిల్లల తరంలో, చదువులు కనీసం డిగ్రీలయ్యాయి. ఉద్యోగాలు ఎక్కువ య్యాయి. సమస్యలూ ఎక్కువయ్యాయి. ఇంటా బయటా చక్కదిద్దుకోలేక ఆడవాళ్ళు  నలిగిపోయారు. కాపురాల్లో కలతలు, సర్దుబాటులు తక్కువయ్యాయి. నీవంటే నీవులు మొదలయ్యాయి. మితిమీరితే విడాకులు ఆరంభమయ్యాయి. మనదేశంలో పిల్లల వల్ల కాపురాలు నిలుస్తూ, పిల్లల కోసం అన్ని సహిస్తూ పడివుండేవారి సంఖ్య పెరిగింది. మొత్తానికి చూస్తే ఏదోలా సంసారాలు సాగిస్తున్నారు.

          ఇంకా ఇప్పటి తరం చూస్తే డబ్బు… డబ్బు సంపాదన ఒక్కటే ధ్యేయంలా ఆడ, మగ చదువులు సమంగా చదివేసి, ఉద్యోగాలు చేస్తూ అన్నిటిలో సగం సగం అను కుంటూ… పనులు, బాధ్యతలు  పంచుకుంటూ, ఆడామగా తేడాలేని తరం వచ్చేసింది.  ముందెవరు వస్తే వాళ్ళు కుక్కరు పెట్టాలి. గిన్నెలు ఒకరు తోమాలి, ఒకరు బట్టలు ఉతకాలి… పిల్లలుంటే ఆడ, మగ పనులు పంచుకోవాలి. అంతా బాగానే ఉంది. స్త్రీకి సమాన హక్కులు వచ్చేసాయా? అర్థం  కాని విషయము.

          మగవారి వల్ల బాధలు తగ్గిపోయాయా? హెరాస్మెంట్స్,  కాల్చుకు తినడం, చేయి చేసుకోడాలు, ఆడది కనిపిస్తే వెకిలివేషాలు, నవ్వులు, ఫోన్లలో ఏడిపించడాలు, తాగి ఇంటి ఆడదాన్ని ఎన్నిరకాలుగానో కాల్చుకు తినడం. ఆఫీసుల్లో తోటి స్త్రీని వేధించడం. ఇవన్నీ తగ్గి, స్త్రీ అంటే గౌరవం వచ్చేసిందా?

          ఏదో, మన ఇళ్ళల్లో సరే… మిగతా స్త్రీల బతుకులు బాగుపడ్డాయా? నాలో ప్రశ్నలు! పురుషుడితో సమానత్వం అంటే ఇద్దరు చెరో చిరుగుల హాఫ్ ప్యాంటు వేసుకుని, ఫోన్లు పట్టుకు కూర్చోడమా? నేను ఈ తరం దాన్ని కాకపోవడం వల్ల ఈ ప్రశ్నలు పుడుతు న్నాయా? ఉద్యోగాలు చేసినంత మాత్రాన  సమానత్వమని సంతోషిద్దామా? అన్ని ప్రశ్నలే… మీకు తెలిస్తే జవాబు చెప్పండి .

          ఇంక ఏ ముంది రాయడానికి! మా తరం నుంచి అందరికి తెలిసిందే. అందరూ చదువుతున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు! ప్రతీ ఇంట్లో ఏవో గొడవలుంటాయి, అవేం చెప్పుకునేంటంత గొడవలు కావు, మగవాడి ఇగో తగ్గేదికాదు, అడ్జస్ట్మెంట్ తప్పదు సంసారంలో. సంసారం నిలవాలంటే, వివాహ వ్యవస్థ నాలుగు కాలాలు నిలవాలంటే సర్దుబాటు తప్పదు ఆడైనా, మగయినా. .ఇంతే నేను చెప్పగలి గింది!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.