జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-12 

   -కల్లూరి భాస్కరం

          మనుషుల వలస గురించిన సమాచారాన్నిజన్యు ఆధారాలతో రాబట్టడం మూడు పద్ధతులలో సాధ్యం. మొదటిది, తల్లి నుంచి సంతానానికి సంక్రమించే mtDNA, తండ్రి నుంచి కొడుకులకు సంక్రమించే వై-క్రోమోజోమ్ హేప్లోగ్రూపుల వ్యాప్తిని బట్టి వలసలను ఉజ్జాయింపుగా అంచనా వేయడం. ఇటు వంటి అధ్యయనాలు మనదేశంలో చాలా జరిగాయనీ, ఏయే వలసలు మనదేశ జనాభాను రూపొందించాయో అవి కొంత అవగాహన కలిగించాయనీ టోనీ జోసెఫ్ అంటాడు.

          ఉదాహరణకు, మనదేశంలోని mtDNA హేప్లోగ్రూపులలో 70నుంచి 90 శాతం తాలూకు మూలాలు, 65వేల సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చిన తొలి భారతీయులలో ఉన్నట్టు ఈ అధ్యయనాలు తేల్చాయి. అంటే, mtDNA పారంపర్యాలలో కేవలం 10 నుంచి 30 శాతం మాత్రమే వలసల ద్వారా ఏర్పడ్డాయన్నమాట.

          అదే, మనదేశ జనాభాలోని వై-క్రోమోజోమ్ హేప్లో గ్రూపుల విషయానికి వస్తే, వాటిలో 10 నుంచి 40శాతం తాలూకు మూలాలు మాత్రమే తొలి భారతీయులలో ఉన్నాయి. అంటే, 60శాతం వై-క్రోమోజోమ్ హేప్లోగ్రూపులు వలసల ఫలితంగా ఏర్పడ్డాయని అర్థం! ఇంతకు ముందు చెప్పుకున్నట్టు (జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-10), mtDNA, వై-క్రోమోజోమ్ హేప్లోగ్రూపుల శాతాల మధ్య ఈ వ్యత్యాసానికి కారణం-స్త్రీలు చాలా వరకు ఇక్కడివారు, పురుషులు బయట నుంచి వచ్చినవారు కావడమే. mtDNA పారంపర్యాలలో 10 నుంచి 30శాతం వలసల ఫలితం కావడం కూడా- కొత్తరాతి యుగంలో పశ్చిమాసియా నుంచి కొందరు స్త్రీ-పురుష వ్యవసాయ జనాలు మనదేశానికి రావడం వల్లనే.

          అయితే, వలసల నిర్ధారణలో ఇలాంటి అధ్యయనానికి గల పరిమితి ఏమిటంటే, ఇది ఆయా వ్యక్తుల మొత్తం జెనోమ్ లో కేవలం కొద్ది భాగం గురించిన సమాచారాన్ని మాత్రమే ఇస్తుంది. దీనికన్నా కొంచెం మెరుగైనది, కిందటి వ్యాసభాగంలో మనం చెప్పుకున్న పూర్తి జెనోమ్ సీక్వెన్సింగ్ పద్ధతి. ఈ పద్ధతిలో సేకరించే సమాచారం, వలసల కారణంగా ఆయా జనాల మధ్య ఏర్పడిన జన్యుసంబంధాన్ని చెబుతుంది తప్ప; ఆ వలసలు ఎటువైపు నుంచి జరిగాయో చెప్పలేదనీ, ఈ పరిమితిని అడ్డుపెట్టుకునే లాల్జీ సింగ్, తంగరాజ్ లు భారత్ లోకి ఇండో-యూరోపియన్/ఆర్యజనాల వలసను తోసిపుచ్చారనీ, దాంతో రాజీమార్గంగా ఏన్ సెస్ట్రల్ నార్త్ ఇండియన్(ANI), ఏన్ సెస్ట్రల్ సౌత్ ఇండియన్(ASI) అనే మాటలను తెరమీదికి తెచ్చారని కూడా అనుకున్నాం.

***

          అదిగో, అదే హిందుత్వ అనుకూల రాజకీయ, సామాజిక వర్గాల్లోనూ; వారికి అనుకూలించే మీడియాలోనూ, వక్రీకరణలకు, అసత్యాలకు, అర్ధసత్యాలకు తలుపులు తెరచి కావలసినంత గందరగోళాన్ని సృష్టించింది. అందులోనూ మరింత ఆశ్చర్యకరం ఏమిటంటే, జన్యుసంబంధమైన ఆయా అధ్యయనపత్రాల కూర్పులో డేవిడ్ రైక్ తదితరులతో పాటు భాగస్వాములైన ఒకరిద్దరు భారతీయ శాస్త్రవేత్తలు కూడా ఇందుకు పాల్పడడం!

          అయిదారేళ్ళ క్రితం మీడియా, కొందరు వ్యక్తులు సృష్టించిన ఈ గందరగోళాన్ని గమనించినప్పుడు ‘గోరా ఎఫెక్ట్’ తలకిందులైన తీరు కళ్ళకు కట్టింది. టాగోర్ నవలలోని గోరా తనవి భారతీయమూలాలు కావని తెలుసుకున్నప్పుడు కుల, మత, దేశభేదాలకు అతీతమైన ఒక విశ్వజనీన అనుభూతికి లోనవుతాడు. ఇందుకు పూర్తి విరుద్ధంగా, ఆర్యుల వలసను తోసిపుచ్చడానికి మనవాళ్ళు కొందరు అబద్ధాల అంధకూపంలోకి జారిపోయా రు.

          కొన్ని రోజుల క్రితం మిత్రులు బి.పి. పడాలగారు నా ఫేస్ బుక్ వాల్ మీద షేర్ చేసిన ఒక లింక్ దీనినే ఎత్తిచూపింది. ‘సెల్ (Cell)’, సైన్స్ (Science)’ అనే రెండు జర్నల్స్ ప్రచురించిన రెండు అధ్యయనాలు ఇండో-ఆర్యుల వలసను ధ్రువీకరించి నప్పటికీ భారతీయ మీడియా దానికి వ్యతిరేకంగా ఎందుకు రిపోర్ట్ చేస్తోందని ప్రశ్నిస్తూ షోయిబ్ డేనియల్ అనే ఆయన 2019, సెప్టెంబర్ లో స్క్రోల్.ఇన్ లో రాసిన ఒక వ్యాసం తాలూకు లింక్ అది. మీడియాలో అనేక మంది ఈ అధ్యయన ఫలితాలను ఒక రాజకీయ దృక్కోణానికి అనువుగా వక్రీకరించారనీ, చివరికి ఈ అధ్యయన పత్రాల సహరచయితల్లో కూడా కొందరు అవి వెల్లడించిన ఫలితాలతో విభేదిస్తున్నట్టు కనిపించారనీ ఆయన అంటాడు.

          ఉదాహరణకు, “ఆర్యులు దక్షిణాసియా పై దాడి చేశారనో, లేదా దక్షిణాసియాకు వలస వచ్చారనో -చిరకాలంగా ఉన్న సిద్ధాంతం పై ఈ పరిశోధన సందేహాలను లేవనెత్తిం” దని ది ఎకనామిక్ టైమ్స్ రాసింది. “ఆర్యులు దురాక్రమణ జరిపారన్న వాదం పూర్తిగా అబద్ధమని రుజువైంది; భారత్ దక్షిణాసియాకు గురుస్థానం వహిస్తోంది” అని అత్యధిక సర్క్యులేషన్ గల హిందీ పత్రిక అమర్ ఉజాలా రాసింది. వీటికి భిన్నంగా పాశ్చాత్య మీడియా వాస్తవాలను రిపోర్ట్ చేసిందని వ్యాసరచయిత అంటాడు. 

          పై రెండు అధ్యయనపత్రాల సహరచయిత, పురాతత్వ శాస్త్రానికి సంబంధించి మనదేశం మొత్తంలోనే అగ్రశ్రేణి సంస్థ దక్కన్ కాలేజీకి వైస్ ఛాన్సలర్ అయిన వసంత్ షిండే సైతం వాటి ఫలితాలను వ్యతిరేకిస్తూ సెప్టెంబర్(2019)లోనే ఒక  పత్రికా ప్రకటన జారీ చేశారు. “ఆర్యుల వలస/దురాక్రమణ సిద్ధాంతాన్ని ఈ ఫలితాలు పూర్తిగా తోసిపుచ్చా”యనీ, “హరప్పన్ ప్రజలు వైదిక జనాలే, వారు సంస్కృతం మాట్లాడేవారనీ” చెప్పుకుంటూ వచ్చారు. స్టెప్పీల నుంచి పెద్ద సంఖ్యలో జనం రాలేదనీ, దానిని వలస అనడానికి వీల్లేదనీ అన్నారు. అయితే, ‘సైన్స్’ ప్రచురించిన అధ్యయనానికి సహ భారతీయ రచయితలైన వాగీశ్ నరసింహన్ (హార్వర్డ్ మెడికల్ స్కూల్ లోని జెనెటిక్స్ విభాగంలో పనిచేశారు) ఈ వ్యాఖ్యలతో విభేదించారు. అలాగే, సింధునాగరికత, వేద సంస్కృతి ఒకటేననడాన్ని మరో సహరచయిత నీరజ్ రాయ్ (బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పేలియోసైన్సెస్, లక్నో)వ్యతిరేకించారు.

***

          ఇక వలసల నిర్ధారణకు సంబంధించి మూడవ పద్ధతికి వద్దాం. ఇది మొదటి రెండు పద్ధతులతో పోల్చితే మరింత ఖచ్చితమైన ఫలితాలను ఇవ్వగలిగినది. అదే, ప్రాచీన DNA ఆధారిత పరిశోధన. ఒకే ప్రాంతంలోని వివిధ ప్రదేశాలకు చెందిన ప్రాచీన మానవు ల అవశేషాల నుంచి DNA మచ్చులను తీసుకుని పరిశీలించడం ద్వారా ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవచ్చునని టోనీ జోసెఫ్ అంటాడు. ఆయనే ఇచ్చిన ఉదాహరణ ప్రకారం, ‘ఎక్స్’ అనే ప్రదేశంలో క్రీ.పూ.2000కు చెందిన మానవ అవశేషాల నుంచి DNAను తీసుకుని పరిశీలించామనుకుందాం. అందులో ఏదైనా మధ్యాసియా ప్రాంతానికో, లేదా స్టెప్పీలకో చెందిన పారంపర్యాన్ని వెల్లడించే సాక్ష్యం కనిపించలేదనుకుందాం. అదే, క్రీ.పూ. 1000 తర్వాతి కాలానికి వస్తే, పైన చెప్పిన ప్రాంతాలకు చెందిన జనాల పారంపర్యాలను సూచించే సాక్ష్యాలు ఆ ‘ఎక్స్’ అనే ప్రదేశం లో కనిపించాయనుకుందాం. అప్పుడు, క్రీ.పూ.1000 తర్వాత స్టెప్పీ జనాలు ఆ ప్రదేశానికి వలస వచ్చినట్టు ఖచ్చితంగా చెప్పవచ్చు.

          అయితే, ఈ ప్రాచీన DNA ఆధారిత పరిశోధన అందుబాటులోకి వచ్చింది 2013 తర్వాతే. అప్పటి నుంచి ఒక్కో ఖండంలోని జనాల చరిత్రను అది తిరగ రాయడం మొదలు పెట్టిందని, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ఎక్కడెక్కడికి వలస వెళ్లారో అది చూపినకొద్దీ, తద్వారా శాస్త్రీయంగా ఒక ఏకీభావం ఏర్పడుతున్న కొద్దీ దానిని తోసిపుచ్చ డం అసాధ్యంగా మారిందని టోనీ జోసెఫ్ అంటాడు. అయినాసరే, ఇండో-యూరోపియన్/ఆర్యజనాల వలస విషయానికే వస్తే, అందుకు సంబంధించిన శాస్త్రీయ ఆధారాలను ఆ తర్వాత కూడా ఎలా తోసిపుచ్చారో, అందుకు అర్ధసత్యాలను, వక్రీకరణలను ఎలా ఆశ్రయించారో పైన, 2019నాటి స్క్రోల్.ఇన్ వ్యాసం ద్వారా చెప్పుకున్నాం. ఇందులో మీడియాతో పాటు, స్వయంగా ప్రాచీన DNA ఆధారిత అధ్యయనంలో పాల్గొన్న శాస్త్రవేత్త లు కూడా భాగస్వాములు కావడం అతిపెద్ద విషాదమూ, వైపరీత్యమూ.

          కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ ప్రాచీన DNA ఆధారిత అధ్యయనం, భారత్ పురాచరిత్రకు సంబంధించి దీర్ఘకాలంగా ఉన్న అనేక ప్రశ్నలను ఎలా పరిష్కరించిందో టోనీ జోసెఫ్ చెప్పుకుంటూ వచ్చాడు. ‘దక్షిణ, మధ్య ఆసియాలలో జన్యుసంబంధమైన అమరిక’ అనే పేరుతో, 2018 మార్చిలో ఈ అధ్యయనపత్రం వెలుగు చూసింది. డేవిడ్ రైక్ సహమార్గదర్శనంలోనూ, సహ కర్తృత్వంలోనూ రూపొందిన ఈ పత్రంలో వివిధ దేశాలకు, వివిధ రంగాలకు చెందిన 92మంది శాస్త్రవేత్తలు సహరచయితలుగా భాగస్వాములయ్యారు. వీరిలో  జేమ్స్ మేలరీ, డేవిడ్ ఆంథోనీ వంటి ప్రముఖ పురాతత్వ, మానవశాస్త్రవేత్తలు ఉన్నారు. మరీ ముఖ్యంగా, ఇంతకు ముందు చెప్పుకున్న వసంత్ షిండే, తంగరాజ్, నీరజ్ రాయ్, వాగీశ్ నరసింహన్ తోపాటు; ప్రియా మూర్జాని (యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా), ఆయుషీ నాయక్ (మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, జర్మనీ) తదితర భారతీయ శాస్త్రవేత్తలు ఉన్నారు.

          ప్రాచీనకాలానికి చెందిన 612మంది తాలూకు DNA ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. వీరిలో- నేటి ఇరాన్, తుర్క్ మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్ లలో క్రీ.పూ. 5600-1200 మధ్య కాలంలో జీవించినవారు; ఉరల్ పర్వతానికి తూర్పున ఉన్న స్టెప్పీ భూముల్లో (కజక్ స్తాన్ సహా) క్రీ.పూ. 4799-1000 మధ్యకాలంలో జీవించినవారు; నేటి పాకిస్తాన్ లోని స్వాత్ వ్యాలీలో క్రీ.పూ. 1200-క్రీ.శ.1వ శతాబ్దం మధ్యలో జీవించినవారు ఉన్నారు. ఆ పైన, దక్షిణాసియాలో నేటి కాలానికి చెంది, 246 రకాల జాతుల వర్గీకరణ కిందికి వచ్చే 1789 మంది తాలూకు జన్యుసమాచారంతో, పై ప్రాచీన DNA సమాచారాన్ని పోల్చిచూసి విశ్లేషించడం ద్వారా; ఎవరు ఎక్కడి నుంచి వలస వెళ్ళారో, ఎవరితో మిశ్రమం చెందారో ఒక ఖచ్చితమైన నిర్ధారణకు రాగలిగారు.   

***

          ఈ వలసల వివరాలు కొంత వరకు వ్యవసాయ విస్తరణతో కూడా ముడిపడి ఉన్నాయి కనుక మొదట దాని గురించి క్లుప్తంగా స్పృశిస్తూ అసలు విషయంలోకి వెడదాం. టోనీ జోసెఫ్ తన పుస్తకంలో, ‘తొలి భారతీయులు’ పేరుతో రాసిన తొలి అధ్యాయం తర్వాత వెంటనే రెండవ అధ్యాయాన్ని, ‘తొలి వ్యవసాయదారులు’ అనే శీర్షికతో ప్రారంభించడం- వలసలతో ముడిపడిన వ్యవసాయ విస్తరణ ప్రాముఖ్యాన్ని సూచిస్తుంది. ఆధునిక కాలంలో పారిశ్రామికీకరణ, పారిశ్రామిక సంస్కృతి ఎలా ప్రపంచీకరణ చెందాయో; అలాగే చరిత్ర పూర్వకాలంలో వ్యవసాయమూ, వ్యవసాయ సంస్కృతీ ప్రపంచీకరణ చెందాయి. అంటే, అప్పటి నుంచి దాదాపు ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా నిర్విరామంగా కొనసాగుతూ వచ్చిన ప్రధానజీవనోపాధి రంగం వ్యవసాయమే.

          ‘మంత్రకవాటం తెరిస్తే మహాభారతం మనచరిత్రే’ అనే నా పుస్తకంలో వ్యవసాయ విస్తరణ గురించి, దాని ప్రపంచీకరణ స్వభావమూ, చరిత్ర గురించి, మనిషి పై అది చూపిన వివిధ ప్రభావాల గురించి కొంత ప్రస్తావించాను. అసలు మహాభారత ప్రారంభమే వ్యవసాయాభివృద్ధిని, దాని వల్ల అసాధారణంగా జనాభా పెరగడాన్ని సూచిస్తూ ఒక సామాజికార్థిక సంబంధమైన అధ్యయనాన్ని స్ఫురింపజేస్తుంది. ఈ సంగతిని ఇంత వరకు ఎవరూ గుర్తించి చర్చించిన దాఖలా నాకు కనిపించలేదు.

          ప్రత్యేకించి నాకు సంతోషం కలిగించిన విషయమేమిటంటే, టోనీ జోసెఫ్ వ్యవసాయ విస్తరణ గురించి చేసిన వ్యాఖ్యలు నా చిత్రణను ధ్రువీకరిస్తూ ఉండడం! అనేక ప్రయోగాల తర్వాత, క్రీ.పూ.9700-5000 మధ్య కాలంలో, నేటి ఇరాక్, ఇరాన్, లెబనాన్, సిరియా, జోర్డాన్, పాలస్తీనా, భారత్, ఈజిప్టు, చైనాలలో వ్యవసాయం పాదుకున్న దరిమిలా మానవ జనాభా ఎన్నడూ ఎరగని స్థాయిలో ‘విస్ఫోటించడం’ ప్రారంభించిందనీ, ఆ జనాభావృద్ధి పెద్ద ఎత్తున వలసలకు దారితీసిందనీ, ఆ వలసలు యూరప్, మధ్యాసియా, దక్షిణాసియా, తూర్పు ఆసియాలలో అంత వరకు ఉన్న జనాభా అమరికను మార్చివేసాయని ఆయన అంటాడు. ప్రత్యేకించి పశ్చిమాసియాలో వ్యవసాయ ప్రారంభం గురించి ఆయన రాస్తూ, దాదాపు మూడు లక్షల సంవత్సరాలకు విస్తరించిన ఆధునిక మానవుల చరిత్రలో ఇంతగా మంత్రముగ్ధం చేసే నాటకీయ ఘట్టం మరొకటి ఉండదంటాడు. వ్యవసాయం అభివృద్ధి చెందిన మిగతా ప్రాంతాల కథ కూడా అంతే సమ్మోహనకరంగా ఉండవచ్చు కానీ; ఆధునిక మానవుల మనుగడలో సంభవించి న ఈ మహత్తరమైన మలుపును నమోదు చేయడం, పరిశోధించడం, ఎంతో సవివరంగా, సూక్ష్మంగా, కళ్ళకు కట్టినట్టు విశ్లేషించడం జరిగింది మాత్రం పశ్చిమాసియాలోనే నంటాడు.

          ప్రపంచాన్నే సమూలంగా మార్చివేసే పర్యవసానాలకు దారి తీసిన ఈ వ్యవసాయ ప్రారంభంతో మనదేశాన్ని ముడివేస్తున్న అతి ప్రాచీన జనావాసం మెహర్ గఢ్! ఇప్పుడు పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ లో ఉన్న ఆ మెహర్ గఢ్ మీదుగా, అసలు విషయమైన వలసలలోకి తర్వాత వెడదాం.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.