యాదోంకి బారాత్-9

-వారాల ఆనంద్

 

నటరాజ కళానికేతన్- సభలు సమావేశాలూ

1975-76 ప్రాంతం. డిగ్రీ చదువుతున్న రోజులు. అప్పుడప్పుడే టీనేజీ దాటుతున్న కాలం. ఒక వైపు అకాడెమిక్ చదువులు వాటి వొత్తిడి. మరోవైపు సాహిత్యం పత్రికలు సభలు సమావేశాలూ జీవితాన్ని కమ్ముకుంటున్న సమయం. ఇటు కరీంనగర్ లోనూ అటు వేములవాడలోనూ సాహిత్య నాటక సభలు నా ఒక్కడి కాలాన్నే కాదు నా సహచరుల అందరి జీవితాల్నీ బాగా ప్రభావితం చేసాయి. మరో వైపు సిరిసిల్లా జగిత్యాల పోరాటాల ఆరంభం విస్తరణ కూడా అదే సమయం.

కరీంనగర్ మున్సిపల్ ‘కళాభారతి’ ఆడిటోరియంలో త్యాగరాయ లలిత కళాపరిషత్ ఆధ్వర్యంలో నాటకాలు, ‘కళాభారతి’ వెనకాల పౌరహక్కుల సంఘం ఆధ్వర్యం లో శ్రీశ్రీ సభలు, మరో వైపు నెహ్రు యువక కేంద్ర కొఆర్దినేటర్ శ్రీ వి.రామారావు ఆధ్వర్యంలో
యువజన సంఘాల కార్యక్రమాలతో కరీంనగర్ అంతా యమ ఆక్టివ్ గా వుండేది. సరిగ్గా అదే సమయంలో వేములవాడలో నటరాజ కళానికేతన్ స్థాపన.

***

          ఇక నా విషయానికి వస్తే నాకు అప్పటికి సభలు సమావేశాలు అంటే గొప్ప ప్రేరణ. మంచి వక్తలు మాట్లాడితే ఎంతో ఉత్సాహం. కానీ సభా వేదిక అంటే భయం. సభా కంపం. మైకు చూస్తే మాట పలికేది కాదు.

          కానీ వేములవాడ నటరాజ కళానికేతన్ ఏర్పాటులోనూ నడకలోనూ నేనూ భాగస్వామినే. చర్చల్లో ప్రణాళికల్లో ముఖ్య పాత్రదారినే. కాని, నిర్వహణ వచ్చేసరికి కొంత అవుట్ సైడర్ గానే వున్నాను. జింబో ఇంట్లో, మంచే సత్యనారాయణ ఇంట్లోనో, చొప్పకట్ల
చంద్ర మౌళి సార్ దగ్గరో లేదా నగుబోతు చంద్రమౌళి గారి వెంకటేశ్వర మెడికల్స్ లోనొ కూర్చుని జరిగిన మాటల్లో చర్చల్లో నేనూ వున్నాను. కళానికేతన్ అనుభవాలూ,  వివరాలూ జింబో, వఝల శివ కుమార్, పి.ఎస్.రవీంద్రలలో ఎవరయనా రాస్తే పూర్తి
సాధికారికంగా రాయగలరేమో. ఖచ్చితంగా రాయాలి ఎందుకంటే అది ఈ ప్రాంత సాహిత్య చరిత్ర. ఒక తరం కవులు సాహిత్యకారులు ఉదయించడానికి ప్రేరణగా నిలిచిన సంస్థ అది. దాని గమనాగమనాల్ని నిక్షిప్తం చేయాల్సిన అవసరం ఎంతయినా వుంది.

          నా మట్టుకు నేను నా యాదిలో వున్న విషయాల్ని రాస్తూ వున్నాను. సాహితీ సాంస్కృతిక సంస్థగా మే 23 1976 రోజున ఆవిర్భవించిన కళానికేతన్ మొదటి సమావేశం ‘భీమేశ్వర సభామంటపం’ లో జరిగింది. కోరుట్లకు చెందిన శ్రీ అందే వెంకటరాజం అతిథి గా హాజరవ్వగా నిజామాబాద్ తదితర అనేక ప్రాంతాల నుండి కవులు హాజరయి కవి
సమ్మేళనాన్ని గొప్పగా విజయవంతం చేసారు.

          సరిగ్గా అదే రోజు తన జర్నలిస్టు జీవితం మొదలయిందని మిత్రుడు కవి  పి.ఎస్. రవీంద్ర సంతోషంగా గుర్తు చేసాడు. ఆ నాటి సభా వివరాల్ని రాసివ్వమని సలంద్ర వొత్తిడి చేసి తనతో రాయించాడు. ఆ వార్తను అచ్చు వేయడమే కాకుండా కరీంనగర్ జిల్లా విలేఖరిగా నియమించాడు. అప్పటిదాకా కవిగా నిలదొక్కుకుంటున్న రవీంద్ర జర్నలిస్టు గా మొదలయి అనంతర కాలంలో పూర్తిస్థాయి జిల్లా ప్రతినిధిగా, బ్యూరో చీఫ్ గా అనేక పత్రికలకు పనిచేసాడు.( ఆ వివరాలు మళ్ళీ రాస్తాను).

          ప్రారంభ సమావేశ సమయంలో మైసూరులో వున్న చొప్పకట్ల వేములవాడ చేరాక కళానికేతన్ కు సలహాదారుగా తన ముద్రను వేయడం ఆరంభించారు. డాక్టర్ రఘుపతి రావు (మామయ్య),చొప్పకట్ల, నగుబోతు చంద్రమౌళిల ప్రోత్సాహం కళా నికేతన్ కు గొప్ప
బలాలయ్యాయి. శ్రీ మధు మృత్యుంజయశర్మ, కే.రాజ శర్మల సహకారం కూడా మరువ లేనిది. అప్పటికే చొప్పకట్ల రాష్ట్ర అభ్యుదయ రచయితల సంఘం కార్యవర్గ సభ్యుడు.
అందుకే కళానికేతన్ వార్శిక కార్యక్రమానికి శ్రీ గజ్జెల మల్లారెడ్డి అతిథిగా విచ్చేసారు. అందులో సంస్థ వెలువరించిన మొదటి వార్షిక “నవత” ప్రత్యేక సంచికను ఆవిష్కరిం చారు. శ్రీ దాశరధి రంగాచార్య మరో అతిథిగా పాల్గొన్నారు. ఇక మరుసటి రోజు జరిగిన కవి సమ్మేళనానికి గజ్జెల మల్లారెడ్డి అధ్యక్షత వహించగా శ్రీ ఎల్లోరా ముఖ్య అతిథిగా హాజర య్యారు.

          ఈ కార్యక్రమాల ప్రభావాల గురించి ఆలోచిస్తే అప్పటికే స్వాతి పేరుతో కథలు రాస్తున్న మంగారి రాజేందర్ జింబో, కవులుగా వఝల శివకుమార్, పి.ఎస్. రవీంద్రలు విరివిగా రాయడం ఆరంభించారు. ఇక మధు రవీంద్ర, రమేష్ చంద్ర, రాచకొండ మోహన్, పి.కిషన్, ప్రతాప చంద్ర శేఖర్. కొడం పవన్ కుమార్, లీల, శోభారాణి, ఏ.విజయలు కళానికేతన్ ప్రేరణతో కవులుగా మొదలయ్యారు. ఇక డాక్టర్ రఘుపతి రావు, డాక్టర్ సిహెచ్ హన్మంత రావు తదితరులు కూడా తమ కలాల్ని తెరిచి రాయడం మొదలు పెట్టారు. నాటక రంగంలో వున్నా మంచే సత్యనారాయణ కూడా తన స్వీయ కవితలు లేదా రవీంద్ర ప్రభావ కవితలతో రాయడం ఆరంభించారు. ఇట్లా కళానికేతన్ అనేక
మంది చేత రాయించింది. ముందుకు తోసింది. నిలబెట్టింది.

***

          అప్పుడప్పుడప్పుడే వెలువడుతున్న ప్రముఖ పత్రిక “ప్రజాతంత్ర”. మమ్మల్ని గొప్పగా ప్రభావితం చేసింది. నేనేమో ‘గొడుగు దాని పుట్టు పూరోత్తరాలు’ లాంటి వ్యాసాలు అందులో అప్పటికే రాసాను. జింబో కథలు అందులో వచ్చాయి. ప్రజాతంత్ర మీది అభిమానంతో హైదరాబాద్ నాంపెల్లిలో వున్న ఆ పత్రిక ఆఫీసుకు ఇద్దరం వెళ్ళాం. సంపాదకులు శ్రీ దేవిప్రియ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించాడు. ఏవో కొన్ని సాహిత్య విషయాలు మాట్లాడిం తర్వాత తనని వేములవాడ సభకు రమ్మని ఆహ్వానించాం.
సంతోషంగా వొప్పుకున్న దేవిప్రియ తప్పకుండా వస్తానన్నారు. కాని ఒక సూచన చేసారు. సభలో తాను గొప్పగా మాట్లాడలేనని తన మిత్రుడు కవి కే.శివారెడ్డిని కూడా తీసుకు వస్తానన్నాడు.

          శివారెడ్డి బాగా మాట్లాడతాడని సభ బాగా జరుగుతుందని అన్నాడు. మేము కొంత మౌనంగా వుండడం గమనించి చార్జీల విషయం ఇబ్బంది పడొద్దు మీరు ఖర్చులు ఒకరికే భరించండి మేము వచ్చేస్తాం అన్నాడు. మేము సరేనన్నాము. 7 ఆగస్ట్ 77 రోజున జరిగే సభకు వారిని వెంట వుండి తీసుకువచ్చే బాధ్యత రవీంద్రకు అప్పగించాం.

          గౌలిగుడా బస్ స్టాండ్ లో ఆ ఇద్దరినీ కలుసుకుని వెంట రావడం ఆయన పని. ఉదయాన్నే మొదట దేవిప్రియ రాగా కే.శివారెడ్డికి వీడ్కోలు చెప్పి పంపించేందుకు సిద్దారెడ్డి కూడా వచ్చాడని రవీంద్ర చెప్పాడు. సిద్దారెడ్డి ఆప్పుడు ఒక ఆసక్తికర ప్రశ్న
వేశాడని రవీంద్ర చెప్పాడు. మీరు మొదట గజ్జెల మల్లారెడ్డి, ఏటుకూరి ప్రసాద్ తది తరులని పిలిచారు. ఇప్పుడు కే.శివారెడ్డి దేవిప్రియల్ని పిలుస్తున్నారు మీరు ఎ వైపు అని
అడిగాడంట (గుర్తుందా సిద్దారెడ్డి).

          తర్వాత జరిగిన వార్షిక సభల్లో జ్వాలాముఖి ప్రధాన అతిథిగా హాజరయి నవత సంచికను ఆవిష్కరించారు. సభలో ఆయన చేసిన ఉద్వేగ పూర్వక ప్రసంగం ఇప్పటికీ గుర్తుంది. ఆ సభలో ఆయన నవత సంచికను మొత్తంగా సమీక్షించారు.

“రాత్రి చనిపోయింది”
వర్షం భోరున ఏడుస్తుంది
అప్పుడే వెళ్ళిపోయాడు చంద్రుడు
నాకేమిటని,
గాలి వీస్తుంది
నేనూ వున్నానని,
సూర్యుడు తొంగి చూస్తున్నాడు
మేఘాల తెర అడ్డంగా వస్తుంది
నేనూ అప్పుడే లేచి చూసాను
చని పోయింది ఎవరా అని ?
ఆలోచిస్తే తేలింది
చనిపోయింది రాత్రే అని !
…. పి.ఎస్.రవీంద్ర

          రాసిన ఆ కవితని జ్వాలాముఖి ఆ రోజు సభలో ఆకాశానికి ఎత్తేశాడు. అందరికీ గొప్ప ఉత్సాహం కలిగిన సందర్భమది. ఆ నాటి సభ మొత్తం ఆడియో రికార్డ్ చేసారు. కానీ తర్వాత జ్వాలాముఖి ప్రసంగంలోని రవీంద్ర ప్రశంసాంశం ఎగిరి పోయింది. ఆ మొత్తం ప్రసంగం గొప్ప సాహిత్య విలువలతో కూడినది. చారిత్రకంగా అమూల్యమయింది కూడా అని నేననుకుంటాను.

***

నటరాజ కళానికేతన్ వెలువరించిన సైక్లోస్తయిల్డ్ పత్రికలు గొప్ప సాహిత్య ప్రయత్నాలు. వాటి తరవాత కళానికేతన్ ‘నవత’ రెండు వార్శికసంచికలు వెలువరిం చింది. ఒకటవ ప్రత్యేక సంచికలో కథా కవిత్వం అన్ని సాహిత్య ప్రక్రియలకూ స్థానం కల్పించారు. చొప్పకట్ల సంపాదకులుగా ఆ సంచిక రూపొందగా కరీంనగర్ లో దాని
ప్రింటింగ్ బాధ్యతల్ని నేను స్వీకరించాను. గుర్తునంత వరకు శారదాప్రెస్ లో అది అచ్చయింది.

దాంట్లో మామిడిపల్లి సాంబశివ శర్మ (భారతీయ విలాపం), గజ్జెల మల్లారెడ్డి (వద్దు వద్దు గాంధీజీ), జువ్వాడి శోభారాణి (నాకు రాయాలని వుంది), వఝల శివ కుమార్ (చైతన్య శిఖరం), వీపీ చందన్ రావు ( శవం పెడుతున్న కూడు), పీ ఎస్ రవీంద్ర (నా ఇజం లోని నిజం), కందాలై రాఘవాచార్య (పుకార్లు) రాసిన కవితలు, జింబో (నిశ్శబ్ద ఘోష). సి హెచ్ మధు (మలుపు), వారాల ఆనంద్ ( రాసికి రాని రాశి ఫలం) కథలు, అంపశయ్య నవీన్ రాసిన ‘నవల ప్రాముఖ్యం’వ్యాసం, వద్దిరాజు రాంమోహన్ రాసిన ‘జగత్తంతా శరత్తు నింపిన శరత్ చంద్రుడు’ తదితర రచనలున్నాయి.

          వెంకటేశ్వర మెడికల్స్ లో కూర్చున్నప్పుడు సంపాదకుడిగా చొప్పకట్ల నా కథను విశేషంగా ప్రశంసించాడు. కాని తన అనుమతి లేకుండా కరీంనగర్ లో రాంమోహన్ వ్యాసాన్ని చేర్చడం పట్ల నా పైన తీవ్ర నిరసన వ్యక్తం చేసాడు. సంపాదకుడిగా చొప్పకట్ల
నిబద్దత అది. ఇక ‘నవత’ రెండవ అచ్చు సంచిక కవితల ప్రత్యేక సంచికగావెలువడింది. అందులో జింబో, వజ్జల శివకుమార్, మధు రవీంద్ర, రమేష్ చంద్ర, రాచకొండ మోహన్, డాక్టర్ రఘుపతిరావు, డాక్టర్ హన్మంత రావు, డాక్టర్ దయాదేవి, రేగులపాటి కిషన్ రావు, నలిమెల భాస్కర్, పి.ఎస్.రవీంద్ర, అలిశెట్టి ప్రభాకర్, చీటీ జగన్రావు, పి.కిషన్, లీల, బల్మూరి యుగందర్ రావు, పోరండ్ల మురళీధర్, ఎ.విజయ, ఎర్రోజు సత్యం తదితరుల కవితలున్నాయి.

          అట్లా నటరాజ కళానికేతన్ ఆనాడే సాహితీ రంగంలో విశేష కృషి చేయడమే  కాకుండా తెలుగు సాహిత్య ప్రపంచానికి ప్రతిభావంతులయిన కవుల్ని అందించింది. అందులో పలువురు సాహిత్యంలో నిలబడ్డారు. 

నటరాజ కళానికేతన్- శాఖలు-విస్తరణ-విలక్షణత

ఏదీ మొదలయినచోటే వుండదు. ఎవరూ తొలి అడుగు వేసి అట్లా నిలబడిపోరు.  అందు లోనూ ఒక సంస్థ లేదా ఒక మనిషి కొంత చలనశీలంగా వుంటే మరింత విస్తరణ  అనివార్యం. అంతే కాదు ఆ విస్తరణలో విలక్షణత కూడా పెరుగుతుంది. దాని ప్రభావాలూ ఫలితాలూ ఎక్కువగానే వుంటాయి. నటరాజ కళానికేతన్ సంస్థగా విస్తరణ చెందడమే కాకుండా అందులో భాగాస్వాములయిన రచయితలు, కవుల్లో కూడా వైవిధ్యాన్ని పెంచింది. ఉన్న చోట ఉండనీయకుండా భిన్న వస్తు కళారూపాల్లో తమ సృజనను పెంపొందించుకునేలా చేసింది. వారిలో కొందరిని సాహిత్య రంగంలో వుంటూనే అర్థవంతమయిన సినిమా వైపు, రూల్ ఆఫ్ లా ‘న్యాయం’ వైపు, పత్రికా రంగంలో నిజాయితీ వైపు ఎదిగేలా చేసింది. అయితే వారంతా ఆర్ద్రతా, మనుషుల పట్ల ప్రేమా, సమాజం పట్ల బాధ్యతల తోటే రచనలు చేస్తూ వచ్చారు. చుట్టూ గ్రామాల్లో రాజకీయాలు పెల్లుబుకు తున్న నేపధ్యంలో కూడా కళానికేతన్ నుంచి ఎదిగిన రచయితలెవరూ ఏ సంస్థల్లో కానీ ఎవరో ఒక కవి గ్రూపులో కానీ చేరక పోవడం విలక్షనతే, అయినా వారెప్పుడూ ప్రగతిశీల విప్లవ భావాల పట్ల గొప్ప అభిమానం తోటే వున్నారు. వుంటారు కూడా.

***

          నటరాజ కళానికేతన్ వేములవాడలో ప్రాంభమయి కరీంనగర్లో శాఖను ఏర్పాటు చేసుకున్నంక జిల్లా వ్యాప్త విస్తరణ వైపు దృష్టి సారించింది. అప్పటికి ఇంకా ప్రసార మాధ్యమాలు ఇప్పటిలా విస్తరించలేదు. సాహితీ కార్యక్రమాల వార్తలు ఎప్పటికో ఒక
సింగిల్ కాలం వార్తలుగా రిపోర్ట్ అయ్యే కాలమది. కానీ అప్పుడు నిర్వాహకులకు కానీ రచయితలకు కానీ, కళాకారులకు కానీ దాని మీద పెద్ద ధ్యాస వుండేది కాదు. ఇప్పటిలాగా వార్తా పత్రికల్లో వార్తల పట్ల అప్పుడు యావ లేదు. కానీ సంస్థల్ని విస్తరించుకోవాలనే
ధ్యాస వుండేది. దాంట్లో భాగంగానే 15 ఆగస్ట్ 1977 రోజున ఎల్లారెడ్డి పేట గ్రామంలో కళానికేతన్ రెండవ శాఖ ప్రారంభోత్సవం జరిగింది.

          ఆ సభలో “ఉషస్సు” లిఖిత సాహిత్య సంచికను వెలువరించారు. సిరిసిల్లా కామారెడ్డి రహదారిలో వున్న ఎల్లారెడ్డిపేట చాలా చైతన్య వంతమయిన వూరు ( ఆ తర్వాత ఆ వూర్లో ఫిలిం సొసైటీ కూడా ఏర్పాటు చేసారు.. వివరాలు మరోసారి రాస్తాను). ఆ నాటి సభలో ప్రముఖ కవులు కనపర్తి, చొప్పకట్ల చంద్రమౌళి, కసిరెడ్డి వెంకట్ రెడ్డి, కే. మురళీధర్, నలిమెల భాస్కర్, రేగులపాటి కిషన్ రావు తదితరులు పాల్గొని ప్రసంగిం చారు.

          తర్వాత 14 నవంబర్ 77 రోజున ఎల్లారెడ్డిపేట కళానికేతన్ “కిరణాలు” కవితా సంకలనాన్ని వెలువరించింది. అట్లా ఎల్లారెడ్డి పెట కొన్ని ఏళ్ళపాటు మంచి సాహితీ చైతన్యంతో కృషి చేసింది. రేగులపాటి కిషన్ రావు పలు నవలలు రాసారు. ఆ తర్వాత 5 డిసెంబర్ 77న కళానికేతన్ తమ జిల్లెళ్ళ శాఖను డాక్టర్ రఘుపతి రావు ప్రారంభించారు. ఆ సందర్భంగా సంస్థ సభ్యుల రచనలతో “వెలుగు” కవితా సంకలనాన్ని  వెలువరిం చారు. శ్రీ చొప్పకట్ల చంద్రమౌళి ఆవిష్కరించారు. ఆనాటి సభలో వేముగంటి నరసింహా చార్యులు, మధు మృత్యుంజయ శర్మ, పోరండ్ల మురళీధర్, టి.నరసింహాచార్య, మంచే సత్యనారాయణ తదితరులు ప్రసంగించారు.

          ఇట్లా నటరాజ కళానికేతన్ సాహిత్య కార్యక్రమాలతో పాటు ‘గుండెలుమార్చబడును’ లాంటి నాటికలు అనేక సాంస్కృతిక కార్యక్రమాలనీ నిర్వహించింది.

          వీటన్నింటితో పాటు కళానికేతన్ వెలుగున ఒక విలక్షణ కార్యక్రమం జరిగింది. ఇందులో యువకులుగా మా కృషి పెద్దగా లేదు కాని కళానికేతన్ సలహాదారులు డాక్టర్ మంగారి రఘుపతి రావు, బీ.డీ. వొ.మల్లయ్య, ఈవో జాగారావులు ముందుండి చొరవ తీసుకుని “వేములవాడ అన్నమయ్య”గా పేరు గాంచిన మామిడిపల్లి సాంబశివ శర్మ గారి గృహ నిర్మాణం కోసం 78-79 లోనే నిధులు సేకరింఛి నిర్మాణం పూర్తి చేసారు. ఒక కవికి ఒక సంస్థ ఇంటిని నిర్మించి ఇవ్వడం మామూలు మాట కాదు. ఆ నాటికి ఈ నాటికి అది ఒక గొప్ప కార్యక్రమమే.

***

          అప్పుడే మా అందరిలో రాయాలనే తపన పెరిగింది. ‘నవత’ ఆరంభమవుతున్న రోజులవి. నేనూ, మంగారి రాజేందర్ జింబో, పి.ఎస్.రవీంద్ర, మంగారి శివప్రసాద్, బల్మూరి యుగేందర్ రావు, రఫీక్, బాపురెడ్డి, ఎడ్ల రాజేందర్, వఝల శివ కుమార్, మధు రవీంద్ర, సాంబ శివుడు, రమేష్, ఇట్లా అనేక మందితో కూడిన బాచ్ మాది. 

          అప్పుడే రాత కోతలు మొదలవుతున్న సమయం. ఎవరు ఏ పేరు పెట్టుకుని రాయాలన్న చర్చ మొదలయింది. అప్పటికే ‘స్వాతి’ పేరుతో పలు కథలు రాసిన రాజు మామ ‘జింబో’ పేరుని ఫైనల్ చేసుకున్నాడు. వెంకటేశ్వర మెడికల్స్ లో కూర్చున్న ప్పుడు పి.రవీందర్ పేరు పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసాడు రవి. ఏ పేరయితే  బాగుంటుంది అన్న చర్చ వచ్చింది. మీ పూర్తి ఇంటి పేరేమిటి అని అడిగాను.  పిన్నమ శెట్టి అన్నాడు. ఇంకేముంది దాన్ని పి.ఎస్. అనీ రవీందర్ ను రవీంద్ర అని మారుద్దామ న్నాను. వెంటనే అంతా ఓకే అనేసారు అట్లా నా కంటే పెద్ద వాడయిన తనకి నేను పేరు
పెట్టిన వాడి నయ్యాను. ఇక కరీంనగర్ దామోదర్ తాను ‘బ్లూ స్టార్’ పేరు అనుకుని కొన్ని కవితల్ని రాసాడు. మిగతా వాళ్ళం మా ఇంటి పేరుతో కొనసాగాలనుకున్నాం.

***

          ఇక రోజూ ఇళ్ళలోంచి బయలుదేరితే చాలు అంతా కలిసే వెళ్ళే వాళ్ళం. అందులో దాదాపు అందరికీ అప్పటికే కళ్ళకు అద్దాలు వచ్చాయి. దాంతో ఎవరయినా కొత్త వాళ్ళు కలిస్తే పి.ఎస్. ‘రండి మా అద్దాల ప్రపంచంలోకి మా అందాల ప్రపంచంలోకి’ అని
పిలిచేవాడు. ఎప్పుడో ఒక సారి తప్ప దాదాపు చాలా హుందాగా వుండేది మా టీం. ఒక్క సారి మాత్రం ఉలిక్కిపడి తల దించుకోవాల్సి వచ్చింది. మా టీములోకి కొత్తగా సుధాకర్ రావు చేరాడు. తను ఆ వూరికి కొత్తగా వచ్చిన పోలీసు ఇన్స్పెక్టర్ మురళీధర్ రావు గారి
తమ్ముడు. టెన్త్ ఫెయిల్ అయి అన్న దగ్గరికి వచ్చాడు. రఘుపతి మామయ్య వూర్లో మెడికల్ ఆఫీసర్ కనుక వాళ్ళ కుటుంబంతో స్నేహం కుదిరింది. ఫలితంగా సుధాకర్ మాబాచ్లో చేరాడు. దారిలో వెళ్తున్నాం ఒక్కసారిగా ‘ఎవరీ చక్కని చుక్క..’ అని పాడడం మొదలు పెట్టాడు. ఏయ్ అని నోరు మూసాం. అలా వెళ్తున్న అమ్మాయి సాంబుడి చెల్లెలు. బుద్దిలేదా అని అందరం సుధాకర్ మీద పడ్డాం. తప్పు తెలుసుకున్న సుధాకర్ సాంబశివుడిని తప్పయిందని ఎన్నిసార్లు బతిమిలాడాడో.. గుర్తోస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది. అది కూడా రాయడం అవసరమా అని మా ఇందిర అంటే గొప్పలే కాదమ్మా తప్పులూ రాయాలి అన్నాను నేను.

***

          ఇట్లా కళానికేతన్ కార్యక్రమాలు కొనసాగుతూ ఉండగానే పై చదువుల గురించి ఆలోచన మొదలయింది. అప్పటికి పాస్ అయిన వాళ్ళు కొత్త విద్యా సంవత్సరం కోసం, మిగతా వాళ్ళు సప్లిమెంటరీల కోసం చూడడం.

          అప్పటికే మా మూడో మేనమామ రాంచందర్ రావు కాంట్రాక్టులు, ఇన్సురెన్స్ లు లాంటి పలు వృత్తుల అనంతరం బ్రాందీ షాప్ వ్యాపారంలోకి వచ్చాడు. మొదట సిరిసిల్లాలో కమలాకర్ వైన్స్ పెట్టి వదిలేసి వేములవాడలో మొదలు పెట్టాడు. మొదట
పార్టనర్ షిప్ తో మొదలయి తర్వాత తానే సొంతంగా అమర్ బ్రాందీ షాప్  ఆరంభిం చాడు. ఆ షాప్ మొదట జాతరా గ్రౌండ్ మెయిన్ రోడ్డులో వుండేది. రామచంద్రం మామ హోల్ సెల్ షాప్ కనీ ఇతర పనులకని కరీంనగర్ తరచుగా వెళ్ళేవాడు. తాను వూర్లోలేని
నాడు రాజుమామ, శివన్నబావ లేదా నేను ఇట్లా మాలో ఎవరికో ఒకరికి షాప్ డ్యూటీ పడేది. అప్పుడిక రోజంతా షాప్ కౌంటర్లో కూర్చోవడమే పని. అంత సీరియస్ గా షాప్ డ్యూటీ చేసి ఆ వాతావరణంలో వున్నాకూడా మాకెవరికీ తాగుడు అలవాటు కాక పోవడం చిత్రమే. మా సాహిత్య సంపర్కమే దానికి కారణమనుకుంటాను. కేవలం అంతా రాజ్ ఫోటో స్టూడియో వెంగయ్యతో కలిసి నటరాజ్ హోటల్లోనో, ఉడిపి హోటల్లోనో స్పెషల్ టీ తాగడం మాత్రం తప్పనిసరి.

          అమర్ బ్రాందీ షాపులో కూర్చుని కూడా కవిత్వ చర్చలు చేసే వాళ్ళం. సిరిసిల్లా నుండి జూకంటి జగన్నాధం వచ్చేవాడు. జూకంటి అప్పటికి తంగళ్ళపల్లిలోనే ఉండే వాడు. సిరిసిల్లలో కనపర్తి, వెంకటరాజం, నిజాం వెంకటేషంల తోటే తన తొలి సాహితీ లోకం. 

          తర్వాత వేములవాడకు వచ్చినప్పుడల్లా జింబోతో ఎక్కువగా చర్చలు, తన దగ్గరి నుంచి పుస్తకాలేమయినా తీసుకోవడం లాంటివి చేసేవాడు. నేను ఎప్పుడూ కొంత శుభ్రంగా ఉండేవాడిని దాంతో జుకంటి పౌడర్ వేసుకుని నీట్ గా వున్నావ్ అని ఆట పట్టించేవాడు. సరదా వుండేది.

***

          తెలుగు సాహితీ ప్రపంచంలో అప్పటికే ‘మినీ కవిత్వం’ ప్రవేశించింది. గొప్పగా ప్రాచుర్యం పొందడం మొదలయింది. కానీ కుందుర్తి లాంటి సీనియర్ కవులు మినీ కవిత్వాన్ని కవిత్వంగా అంగీకరించడానికి ఇష్టపడలేదు. ఒక రకంగా తీవ్రమయిన వాద వివాదాలు సాగుతూ ఉండేవి. అప్పుడే కళానికేతన్ ఆధ్వర్యంలో మినీ కవితా చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేయాలనే ఆలోచన వచ్చింది. ప్రతాప చంద్రశేఖర్, పిన్నమశెట్టి కిస్తాన్ లాంటి యువకుల రాత గీతాల్ని వాడుకోవాలని వెంగయ్య లాంటి ఫోటోగ్రాఫర్లను
ఉపయోగించుకోవాలని అనుకున్నాం. ప్రదర్శనకు కుందుర్తిని అతిథిగా పిలవాలని కూడా నిర్ణయించుకున్నాం. ఇంకేముంది ఏర్పాట్లు షురూ అయ్యాయి. భీమేశ్వర సభా మంటపం సభకు, గెస్ట్ హౌస్ ప్రదర్శనకు సిద్దమయింది. చొప్పకట్ల అధ్యక్షతన సభ, కవి
సమ్మేళనం జరిగాయి చివరన నేను లేచి కుందుర్తి గారిని నేనే లేచి అడిగాను  “కవిత్వం లో భావ వ్యక్తీకరణే ప్రధానం కదా, నిడివి అప్రధానం కదా, దీర్ఘ కవిత అని మినీ కవితను నిరాకరిస్తున్నారు ఎందుకని” (మాటలు సరిగ్గా ఇవే కాక పోవచ్చు కానీ భావం ఇదే). సభ
డిస్టర్బ్ అవుతుందని కొందరన్నారు కానీ కుందుర్తి మాత్రం చాలా ఓపిగ్గా తన అభిప్రాయా ల్ని వివరించారు. తర్వాత కవితా చిత్ర ప్రదర్శన ఆయనే ప్రారంభించారు. విజయవంత మయిన ప్రదర్శన అది. కళా నికేతన్ కవులతో పాటు జూకంటి జగన్నాధం, అలిశెట్టి తదితరులు అనేక మంది పాల్గొన్నారు.

          నాకు తెలిసి ఆ ప్రదర్శన తర్వాతే అలిశెట్టి ప్రభాకర్ తన ‘కవితా చిత్ర ప్రదర్శనలు’ ఏర్పాటు చేసి పెద్ద ఉద్యమంగా తీసుకెళ్ళాడు. ధిల్లీ జవహార్ లాల్ నెహ్రు  విశ్వ విద్యాలయంతో పాటు అనేక కాలేజీల్లో ఊర్లల్లో అలిశెట్టి కవితా చిత్ర ప్రదర్శనలు విజయ వంతమయి ఒక ఒరవడిని సృష్టించాయి. అట్లా నటరాజ కళానికేతన్ అనేక కార్యక్రమా లతో ఒక ప్రగతిశీల సాహితీ వాతావరణాన్ని కల్పించింది. తర్వాత మా బాచీ అంతా చదువుల కోసం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాం.. వివరాలతో మళ్ళీ కలుద్దాం.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.