అనుసృజన

ఒంటరి స్త్రీ శోకం

హిందీ మూలం: సుధా అరోడా

అనువాదం: ఆర్.శాంతసుందరి

ఒకరోజు ఇలా కూడా తెల్లవారుతుంది
ఒక ఒంటరి స్త్రీ
భోరుమని ఏడవాలనుకుంటుంది
ఏడుపు గొంతులో అడ్డుపడుతుంది దుమ్ములా
ఆమె వేకువజామునే
కిశోరీ అమోన్ కర్ భైరవి రాగం క్యాసెట్ పెడుతుంది
ఆ ఆలాపనని తనలో లీనం చేసుకుంటూ
వెనక్కి నెట్టేస్తుంది దుఃఖాన్ని
గ్యాస్ వెలిగిస్తుంది
మంచి టిఫిన్ ఏదైనా చేసుకుందామని తనకోసం
ఆ పదార్థం కళ్ళలోంచి మనసులోకి జారి
ఉపశమనం కలిగిస్తుందేమోననే ఆశతో
తినేది గొంతులోంచి జారుతుంది
కానీ నాలుకకి తెలియనే తెలియదు
ఎప్పుడు పొట్టలోకి వెళ్ళిందో
ఇక ఏడుపు దుమ్ములా పేగులని చుట్టేస్తుంది
కళ్ళలోంచి బైట పడే సొరంగం కోసం వెతుకుతూ
ఒంటరి స్త్రీ
ఒంటరిగానే వెళ్తుంది సినిమా చూసేందుకు
ఏదో సీన్ చూసి హాలు నవ్వులతో మారుమోగిపోయినప్పుడు
సిగ్గుపడుతుంది తను అక్కడ లేనందుకు
తనని వెతుక్కుంటుంది పక్కనున్న ఖాళీ సీటులో…
అక్కడ నీళ్ళసీసా పెట్టి మర్చిపోయినట్టు
మళ్ళీ తన సీటులో కూర్చుంటుంది ముడుచుకుని
ఒంటరి స్త్రీ
చదువుతుంది పుస్తకంలో ఇరవైరెండో పేజీ
మర్చిపోతుంది
ముందు చదివిన ఇరవైఒక్క పేజీల్లో ఏమి చదివిందో…
పుస్తకం మూసి
పక్కన ఉన్న మెదడు తీసి
తలమీద పెట్టుకుంటుంది గట్టిగా
మళ్ళీ మొదలుపెడుతుంది చదవటం మొదటి పేజీ నుంచీ…
ఒంటరి స్త్రీ ఆరుబైట మైదానంలో కూడా
ఊపిరి పీల్చుకోలేదు హాయిగా
పచ్చదనంలో వెతుకుతుంది ఆక్సిజన్ కోసం
ఊపిరితిత్తులు బోలుగా ఉన్నట్టనిపిస్తుంది
వాటిలో వచ్చి పోయే ఊపిరి
అనిపించదు ఊపిరిలా
నోటితో పీల్చుకుంటుంది గాలిని
తను బతికే ఉన్నానా లేదా అని
తాకి చూసుకుంటుంది…
ఒంటరి స్త్రీ
ఉన్నట్టుండి
శోకం నిండిన పెట్టెని
తెరుస్తుంది తనముందు పెట్టుకుని
అందులో ఉన్నవన్నీ చెదిరిపోనిస్తుంది వరసగా
సాయంత్రం పొద్దుపోయేదాకా ఏడుస్తుంది మనసుతీరా
అప్పుడు అనిపిస్తుందామెకి
హఠాత్తుగా ఊపిరి పీల్చటం
సాఫీగా సాగుతోందని…
… ఆ తరవాత ఒకరోజు
ఒంటరి స్త్రీ ఒంటరిగా మిగలదు
తన వేలు అందిపుచ్చుకుంటుంది
తనతోనే సినిమా చూస్తుంది
వెతకదు పక్క సీట్లో నీళ్ళసీసా కోసం
పుస్తకంలో ఇరవైరెండో పేజీని దాటి సాగుతుంది ముందుకి
గుండెలనిండా ఊపిరి పీల్చుకుని
ఆఘ్రాణిస్తుంది దాన్ని మల్లెల సువాసనలా
తన చిరునవ్వుని సాగదీయగలుగుతుంది
కళ్ళ కొసలదాకా
తనకోసం సృష్టించుకుంటుంది సరికొత్త నిర్వచనం
నేర్చుకుంటుంది
ఒంటరితనాన్ని ఏకాంతంగా మార్చుకునే
ఉపాయం.
 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.