ఒక సహాయం రెండు ఆనందాలు

-కందేపి రాణి ప్రసాద్

          ఒక దట్టమైన అడవిలో పెద్ద చెరువు ఉన్నది. చెరువు గట్టున పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చెట్లన్నీ చెరువు వైపుకు వంగి చెరువుతో ముచ్చట్లు పెడుతుండేవి. చెట్ల నిండా రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని నివసిస్తూ ఉండేవి. చెరువు లోపల మొసళ్ళు, చేపలు, కొంగలు, తాబేళ్ళు, కప్పలు నివసించేవి. అన్నీ కలసిమెలసి జీవించేవి.
         
          కలువలు, తామరలు చెరువంతా విస్తరించి చాటల్లాంటి ఆకులతో నీళ్ళనుకప్పేస్తూ ఉండేవి. నీటి మొక్కలు, నాచు వంటివి కూడా వీటితో కలిసి ఉండేవి చెరువంతా ఒక గేటెడ్ కమ్యూనిటీలా ఆన్ని రకాల కుటుంబాలతో అందంగా ఉండేది.
 
          ఒక రోజు ఒక మొసలి చెరువు ఒడ్డుకు వెళ్ళి కూర్చుంది. రోజూ కాస్త ఎండవేళలో వెళ్ళి ఒడ్డున పడుకుంటుంది. ఆ సమయంలో జంతువులేవీ నీళ్ళు తాగటానికి రావు కానీ ఈ రోజేమో పెందలాడే ఒడ్డుకు పోయి కూర్చుంది. తాబేలు కూడా ఒడ్డుకు వచ్చి “ఏం మొసలి మామా ఏమైందివాళ ఈ సమయంలో ఆహారం తీసుకుంటావు కదా! ఇక్కడికొచ్చి కూర్చున్నావేమి” అని అడిగింది.
 
          “ఈ రోజు ఆహారం తినలేకపోతున్నాను అల్లుడూ! నా దవడలు వాచిపోయి ఉన్నాయి. నా పళ్ళ సందుల్లో ఇరుక్కున్న ఆహారం బయటకు రావడం లేదు. రెండు మూడు రోజుల్నుంచీ అలాగే ఉన్నది. అందుకే ఏమీ తినలేక పోతున్నాను. అంతేకాక పళ్ళు దవడ నెప్పిగా ఉన్నాయి” ఆన్నది మొసలి నోరు తెరిచి అబ్బా అనుకుంటూ!
 
          అయ్యో!  మొసలి మామా. నాలుకతో అటూ ఇటూ కదిలించకలేకపోయావా?ఇరుక్కు పోయిన తిండి పదార్థాలు బయటకు వస్తాయేమో! లేకుంటే నోట్లో నీళ్ళు పోసుకుని పుక్కిలించి చూడు! ఫలితం ఉంటుందేమో అంటూ తాబేలు సలహా ఇచ్చింది.
 
          చేసి చూసాను అల్లుడూ!  ఏమీ ఫలితం లేకపోయింది. నేను పెద్దదాన్నయి పోతున్నా కదా! పళ్ళ మధ్యలో సందులు అటూ ఇటూగా మారినట్లున్నాయి. అబ్బా! మాట్లాడటానికి కూడా రావడం లేదు “అంటూ నోరు గట్టిగా పట్టుకొని విలవిల్లాడింది” మొసలి.
 
          చాలా బాధపడుతున్నావు మామా, ఏం చేయాలో తెలియడం లేదే! నేను తీయగల నేమో చూస్తానుండు అంటూ తాబేలు మొసలి నోరును గమనించింది.
 
          మొసలి నోరు తెరిచింది. పళ్ళ మధ్యలో మాంసం ఇరుక్కుపోయి గట్టిగా ఉన్నది. తాబేలు లాగి చూసింది కానీ రావడం లేదు. మొసలి మామ రంపపు పళ్ళు గుచ్చుకుంటా యేమో అని భయం భయంగా చూస్తూ తీద్దామని ప్రయత్నిస్తే రాలేదు.
 
          తాబేలుకు ఒక ఉపాయం తట్టింది “మామా నువ్విక్కడే ఉండు నేనిప్పుడే వస్తా” అంటూ నీళ్ళలోకి దూకింది.
 
          చెరువులోకి వెళ్ళిన తాబేలు కొంగ కోసం వెతికింది వెతకగా వెతకగా “ఒక చోట దిగాలుగా కూర్చున్న కొంగ కనిపించింది”. కొంగ బావా! ఏం చేస్తున్నావు అంటూ నవ్వుతూ పలకరించింది.
 
          “ఏమి లేదు తాబేలు బావా! ఏం లేదు రెండు రోజుల నుంచీ ఒక్క చేపా దొరకలేదు. తిండి లేక నీరసంగా ఉన్నది”. నీరసంగా జవాబిచ్చింది కొంగ.
 
          అలాగా నేనొక మాట చెపుతాను విను. నువ్వు చేసిన పనికి తిండి కూడా లభిస్తుంది. మన చెరువులోని మొసలి మామ ఉన్నాడు. కదా! తనకు పళ్ళలో మాంసం ఇరుక్క పోయింది. నీకు పొడవు ముక్కు ఉన్నది కాబట్టి దాన్ని బయటకు తియ్యగలవు మొసలి మామకు సహాయం చేసినట్లు ఉంటుంది. నీ ఆకలి బాధ తీరుతుంది ఏమంటావు. పెద్ద మనిషిలాగా సలహా ఇచ్చింది తాబేలు.
 
          “ఇది కుదిరే పని కాదులే తాబేలు బావా, మొసలి మామ పళ్ళు చాలా వాడిగా ఉంటాయి. ఆహారాన్ని తీసే క్రమంలో నాకు గుచ్చుకున్నాయనుకో ప్రాణమే పోతుంది. తిండి కోసం ఆశపడితే ఏదో ఒక నష్టం జరుగుతుంది” నిరాశగా అన్నది కొంగ.
 
          “అలా అనుకోవద్దు బావా! అనవసరంగా ఆశపడటం లేదు. మనం సహాయం చేస్తున్నాం. సహాయానికి ప్రతిఫలంగా తిరిగి సహాయం లభిస్తున్నది అనుకో. ఉచితంగా తెచ్చుకుంటే ఆశ అవుతుంది. తప్పుగా ఆలోచించవద్దు” హిత బోధ చేస్తున్నట్లుగా చెప్పింది తాబేలు.
 
          కొంగ కొద్దిగా ఆలోచిస్తూ “ఒకవేళ పళ్ళ సందులోని ఆహారం తినేటపుడు మొసలికి నొప్పి వచ్చిందనుకో, నొప్పితో నోరు కదిలించిందనుకో. ఆ రంపాల వంటి పళ్ళ మధ్య అప్పడంలా నలిగిపోతాను. అన్నది తాబేలును చూస్తూ.
 
          “నీ అనుమానం నిజమే కాదనటం లేదు. జరిగే అవకాశం ఉంది కాని మొసలి మామకు ముందే చెబుదాం. కొద్దిగా, జాగ్రత్తగా ఉంటాడు కదా! లేదంటే ఒక చెక్కముక్కను అడ్డంగా పెడదాం. అప్పుడు నీకేమీ నష్టం వాటిల్లదు ఏమంటావు. అడిగింది తాబేలు.
 
          ఇంతగా చెబుతున్న తాబేలు వంక సాలోచనగా చూస్తూ “అంతే అంటావా తాబేలు బావా. సరే పోదాం పద” అంటూ బయలుదేరింది కొంగ.
 
          తాబేలు, కొంగ కలిసి మొసలి మామ దగ్గరకు వెళ్ళారు. మొసలి నోరు తెరిచి జాగ్రత్తగా పెట్టుకున్నది తాబేలు కూడా కాపలగా ఉన్నది. కొంగ తన పొడవు ముక్కును సాచి దాని పళ్ళలో ఇరుక్కున్న మాంసం ముక్కల్ని తీసింది. మెల్లగా అన్ని మాంసం ముక్కల్ని బయిటకు తీసింది కొంగ. మొసలి నోట్లో బాధ పోయి సంతోషంగా ఉంది. ఆ తీసిన మాంసం ముక్కల్ని తిని కొంగ తన ఆకలి తీర్చుకున్నది. ఇరువురూ ఒకరి కొకరు సహాయం చేసుకున్నారు ఇద్దరూ సంతోషపడ్డారు.
 
          వీళ్ళద్దర్ని చూసిన తాబేలు కూడా ఆనందించింది. తన వల్ల ఒక మంచి కార్యం జరిగినందుకు తృప్తిగా ఉన్నది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.