జ్ఞాపకాల ఊడలు

(నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)

– దుద్దుంపూడి అనసూయ

ఎప్పుడు మొలిచానో 
ఆమె చెబితే గాని నాకు
తెలియనే తెలియదు కానీ
తన అమృత హస్తాలతో 
లాల పోయటం 
విన కమ్మని జోల పాటతో
నిదుర పొమ్మని జోకొట్టటం 
గుర్తొస్తూ ఉంటుంది
 
నడక నేర్చిన సంబరంతో
నేను పరుగెడుతుంటే
పడిపోకుండా పట్టుకుంటు 
కోట గోడలా నా చుట్టూ
చేతులు అడ్డు పెడుతూ 
పహారా కాయటం
గుర్తొస్తూ ఉంటుంది
 
వచ్చీ రాని నా మాటలకే
నేనేదో ఘన కార్యం చేసినట్లు 
నా నత్తి నత్తి మాటలనే 
నారాయణ మంత్రంలా 
నాలాగే పలుకుతూ పదే పదే 
పది మందితో పంచుకోవటం
గుర్తొస్తూ ఉంటుంది
 
పాల బువ్వ పెట్టేటప్పుడు 
బొజ్జ నిండిందో లేదో తడిమి 
తుది ముద్దతో దిష్టి తీయటం 
ఆమెని ఏమార్చి కట్టు కధలల్లి
ఉట్టుట్టి ఒట్లు పెట్టి 
పట్టు బడినప్పుడు
ఆమెతో తీపి తిట్లు తినడం
గుర్తొస్తూ ఉంటుంది 
 
ఆమెనే అనుసరిస్తూ 
అనుకరిస్తూ ఆటలాడే నాకు 
పలకా బలపం చేతికిచ్చి 
పాఠశాలలో  నన్నొదిలేసి  
తిరిగెళ్లే తనలో బెంగా బెరుకూ 
నా పెళ్ళిలో అప్పగింతలప్పుడు  
తన తడి కళ్ళలో మళ్ళీ చూడటం
గుర్తొస్తూ ఉంటుంది 
 
నేనమ్మనైనా అమ్మమ్మ నైనా
వటవృక్షంలా వృద్ధి చెందినా
ఆనాటి తన అమ్మ  తనం 
చాటున నా చిన్నతనమంతా
ఇంకా మదిలో మెదులుతూనే ఉంది
ఎన్నేళ్ళు గడిచినా అన్నీ
జ్ఞాపకాలై మనసు కొమ్మలను 
వీడకుండా మర్రి ఊడల్లా
వేలాడుతూనే ఉన్నాయి. 

*****

Please follow and like us:

3 thoughts on “జ్ఞాపకాల ఊడలు (నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)”

  1. అమ్మ ను తలచుకొనే మరొక మధురమైన జ్ఞాపకం
    రచయిత్రికి ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published.