ఒక అపరిచిత సంబంధం (హిందీ అనువాద కథ)

హిందీ మూలం – డా. సోహన్ శర్మ

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

          లాస్ ఏంజలిస్ లో ఇది నా ఆఖరి సాయంత్రం. ఇంత పెద్ద నగరంలో సాయం కాలం నెమ్మది-నెమ్మదిగా జరుగుతూ దగ్గరికి వస్తోంది. నేను సాయంత్రానికి కార్యక్రమం ఏదీ ప్రత్యేకించి నిర్ణయించుకోలేదు.

          ఇంతకు ముందు అయిదారు రోజులపాటు సాయంత్రాలు నాకు తగిన ఏర్పాటులు
చేసుకోవడంలోనే గడిచిపోయాయి. ఏదయినా కొనుక్కోదలుచుకున్నా, లేదా సామానులు ప్యాక్ చేసుకోవడానికి సమయం గడిపినా దానికి వీలుకలిగేలా నన్ను ఆహ్వానించిన నా స్థానిక హోస్టులు ఈ ఆఖరి సాయంత్రాన్ని నా కోసం ఖాళీగా ఉంచారు. నేను కొనేదేమీ లేదు. రెండోది ఒక సూట్ కేసును మూసి లాక్ చేసుకోవడానికి ఎంతో సమయం పట్టదు. నేను నా హోటల్లో కూర్చుని సాయంత్రం ఎలా గడుపుదామా అని ఆలోచిస్తున్నాను. మైళ్లకొద్దీ దూరం వరకూ వ్యాపించిన రోడ్లతో ఉన్న లాస్ ఏంజలిస్ నాకు ఒక విహంగమ నగరంలా అనిపిస్తోంది. ప్యారిస్ లేదా రోమ్ లాగా ఏదో వీధుల్లో, సందుల్లో తిరిగినంత మాత్రాన ఆనందించగలమని కాదు. మరి సాయంత్రం ఏం చేయాలి. ఈ సాయంత్రాన్ని ఎలా గడపటం.

          వాషింగ్టన్ నుంచి బయలుదేరేటప్పుడు మారియా చెప్పిన మాట గుర్తుకొచ్చింది. మీరు లాస్ ఏంజలిస్ వెడుతున్నారు గనుక నా స్నేహితురాలు సోనమ్ ని తప్పకుండా కలుసుకోమని అంది. తనకి సాహిత్యంలో అభిరుచి ఉంది. కాబట్టి తనను కలుసుకుంటే మీకు బాగుంటుంది. సోనమ్ అడ్రసు, ఫోన్ నెంబరు తన పాకెట్ డైరీ లోని కాగితం మీద రాసి నాకిచ్చింది. ఆ కాగితాన్ని నేను నా పర్సులో పెట్టుకున్నాను. లాస్ ఏంజలిస్ లో ఆఖరి సాయంత్రం సరదాగా గడుస్తుందనే ఆశతో ఆ కాగితంలో రాసిన అడ్రసు ప్రకారం అడుగుతూ నేను సోనమ్ ఇంటికి చేరుకున్నాను. అపార్ట్ మెంట్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డు నన్ను సోనమ్ దగ్గరికి తీసుకువెళ్ళాడు.

          కేన్ తో చేసిన ఊగుతున్న కుర్చీలో కూర్చుని సోనమ్ బహుశా నా కోసమే ఎదురు చూస్తున్నట్లుంది.

          “ప్రశాంత్ మీరేనా? ఇండో-అమెరికన్ కల్చర్ లో స్కాలర్! మారియా మీ గురించి ఫోన్ లో చెప్పింది. రండి. సోనమ్ నేనే. నిజానికి నాపేరు నాన్సీ. నాన్సీ నోట్ష్…. నా ఒక  ఇండియన్ ఫ్రెండ్ కూతురు పేరు సోనమ్… నాకీ పేరు బాగా నచ్చింది. అందుకే నేను కూడా నా పేరు సోనమ్ అని పెట్టుకున్నాను. నేననుకోవడం మనకి సంతోషాన్నిచ్చే పేరే మనం పెట్టుకోవాలి. ఎవ్విరి థింగ్ ఈజ్ ఇన్ ది నేమ్…. షేక్స్ పియర్ ఈ సంగతిని అర్థం చేసుకోలేకపోయాడు….. కాని నాకు మీ మీద చాలా కోపంగా ఉంది. మీ సామాను ఎక్కడుంది? బహుశా హోటల్లో ఉన్నట్లున్నారు. ఎందుకని? సరే, ఏం ఫరవాలేదు. మీ సామాను ఇక్కడికే తెప్పించుకోవచ్చు. నాతో బాటు రాత్రిపూట ఇక్కడ ఉండటం వల్ల మీకేమీ ఇబ్బంది లేదుకదా?”

          ఇబ్బందా? నేను పలుచగా పారదర్శకంగా ఉన్న వస్త్రాలలో మిలమిలా మెరుస్తూ
అందంగా చెక్కిన శిల్పంలా ఉన్న ఆమె శరీరసౌష్ఠవాన్ని చూసి లాస్ ఏంజలిస్ లో ఆ సాయంత్రాన్ని ఒంటరిగా గడపాలనే దిగులు నుండి విముక్తి పొందుతున్నాను. నేను ఒక నెలరోజుల పాటు ఆఫీసు పని మీద అమెరికా వచ్చానన్న సంగతి మరిచిపోతున్నాను…. నా రీసెర్చ్ ప్రాజెక్టులో నాకు సహాయపడుతుందనే సదుద్దేశంతో మారియా నాకు సోనమ్ అడ్రసు ఇచ్చిందన్న విషయం మరిచిపోతున్నాను. రేపే నేను తిరిగి వెళ్ళాలనీ, ఈ విశాలమైన నగరంలో ఇదే నా ఆఖరి సాయంత్రం అనీ కూడా నేను మరిచిపోతున్నాను.

          “అబ్బే, అదేం లేదు. మీకెందుకు శ్రమ? అందులోనూ ఈ నగరంలో ఇదే నాకు ఆఖరి సాయంత్రం…”

          “ఇది అసలు బాగుండ లేదు….మీరు ఇక్కడికి చేరుకున్నప్పుడే నాకు తెలియపర్చ వలసింది. మారియాకు నేనిది తప్పకుండా చెబుతాను… ఇంక మీరు ఒకటి-రెండు రోజులు ఇక్కడ ఉండి తీరాలి. లాస్ ఏంజలిస్ ని మీరు సరిగా చూసి కూడా ఉండరు.”

          “ఇక్కడికి రాగానే మీకు తెలుపనందుకు క్షమించాలి… లాస్ ఏంజలిస్ అయితే
కొంచెం చూశాను….నా రీసెర్చి ప్రాజెక్టు గురించి ఇద్దరు-ముగ్గురితో ఇంటర్వ్యూ చేయ వలసిన పని వుంది. కొన్ని పుస్తకాలు, పత్రికలు కొనే అవసరం కూడా ఉంది. ఈ పని పూర్తయిపోయింది. మిమ్మల్ని కలుసుకోవడం ఒకటే మిగిలింది…. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది… రేపు వెళ్ళిపోతాను.”

          నేను సోనమ్ అపార్ట్ మెంట్ లోని అలంకరణని చూస్తున్నాను.

          “అలా కాదు. లాస్ ఏంజలిస్ మీకు నేను చూపిస్తాను… ఎల్.ఎ. అంటారు దీన్ని.
ఫాషన్ ప్రపంచానికి తీర్థస్థలం ఇది. బ్రేబ్లీ హిల్స్… హాలీవుడ్ లోని ప్రసిద్ధ వ్యక్తులకి నివాస స్థలం…. ఇంకా మైనం మ్యూజియం… ప్రపంచంలోని చాలా గొప్ప వ్యక్తుల మైనంతో చేసిన విగ్రహాలు ఉన్నాయక్కడ. క్రీస్తు నుంచి లిజ్ టేలర్ వరకూ… చార్లీ చాప్లిన్… ఇంకా
చాలా మంది నేతలు… అభినేతలు… అసలు ముందు మీరు కూర్చోండి….” సోనమ్ ఎదురుగా ఉన్న సోఫాని చూపించింది.

          నేను సంకోచిస్తూనే కూర్చున్నాను, “మీ అపార్ట్ మెంటు చాలా బాగుంది….విలువ చాలా ఎక్కువే ఉండవచ్చు…” సంభాషణ వైఖరిని మార్చడానికి ప్రయత్నించాను.

          “ఎక్కువ విలువా!…” సోనమ్ పగలబడి నవ్వింది… “మనం ఏదయినా కొనదల్చు కుంటే దాని విలువ ఎక్కువ అని చెప్పుకోవచ్చు… ఇక్కడ అమెరికాలో ఎవరూ ఏదీ కొనరు… కొనడంలో ఇగో ప్రాబ్లమ్ ఉంది… అక్కరలేని అహంకారం!… ఇక్కడ అన్నీ అద్దెకి దొరుకుతాయి… అపార్ట్ మెంట్, కారు, ఫర్నిచరు నుంచి ధరించే డ్రస్సు వరకూ…అయితే ఇంత వరకూ బంధుత్వాలు అద్దెకి దొరకడం మొదలుకాలేదు… మచ్చుకి కొడుకూ-కూతురూ, తల్లీ-తండ్రీ… భార్య-భర్త మొదలైనవి… కాని తొందరలోనే ఇది కూడా సాధ్య మవుతుందని ఆశించవచ్చు…”

          సోనమ్ కంఠస్వరంలో విచిత్రమైన భావతీవ్రత వ్యక్తమవుతోంది.

          నేను ఆశ్చర్యంగా ఆమెను చూస్తూ ఉండిపోయాను… మారియా ఈ అమ్మాయి గురించి విపులంగా చెప్పలేదు, ఈమెను తప్పకుండా కలుసుకోమనీ, తను మీ అమెరికన్ కల్చర్’ యొక్క స్టడీకి చెందిన ప్రాజెక్టు గురించి చాలా విషయాలు చెప్పగలుగుతుందనీ మాత్రమే అంది.

          నేను నా ప్రాజెక్టు గురించి చేసిన అధ్యయనంలో చాలా తెలుసుకున్నాను…ఇక్కడి `కౌ-బాయ్’ ల గుర్రాలు-తుపాకులతో భూమిని ఆక్రమించుకునే పరంపర నుంచి స్వాతంత్య్ర సంగ్రామం వరకు… అబ్రహాం లింకన్ తరువాత స్వాతంత్య్రన్ని సమర్థించే అతి పెద్ద దేశంగా అమెరికా ఇమేజ్… ఇక్కడి పౌరసత్వానికీ, చట్టబద్ధతకూ చెందిన సూత్రవాక్యం… `ఫ్రీడమ్ అండ్ జస్టిస్ ఫర్ ఆల్’ కి సంబంధించిన చాలా రూపాలను కూలంకషంగా పరిశీలించాను… కాని, సోనమ్ నాకు చెబుతున్నదంతా విచిత్రంగా ఉంది.

          ఇక్కడ విజృంభిస్తున్న వినియోగదారుల సంస్కృతి ప్రభంజనం గురించి నేను తెలియనివాడిని కాను… కాని, అద్దెకి సంబంధాలు దొరుకుతాయనే ఆశతో జీవిస్తున్నవారి కల్పన కూడా నాకు నమ్మశక్యం కావడంలేదు… నేను మౌనంగా ఉండిపోయాను. అప్పుడే సోనమ్ మొబైల్ మోగింది…కొన్ని క్షణాలు సోనమ్ అవతలి నుంచి వస్తున్న మాటలు వింటూ ఊరుకుంది… తరువాత శాంతస్వరంతో అంది- “మైకేల్, ఇలా జరగడంలో ఆశ్చర్యం లేదు. నేను నిన్ను ముందే `వార్న్’ చేశాను…అప్పుచేసి పప్పుకూడు తినే సిద్ధాంతాన్ని అనుసరించవద్దని నీకు చెప్పాను. నువ్వు ఇంతకు ముందు ఉండే అద్దె అపార్ట్ మెంట్ లో ఏం తక్కువని… కాని నీకు నీ స్వంత అపార్ట్ మెంట్ కావాలను కున్నావు. నీ నెత్తిమీద `ఓనర్ షిప్’ దెయ్యం తాండవించింది. ఇప్పుడింక బ్యాంకు లోన్ తీర్చలేకపోతే అపార్ట్ మెంట్ వదిలిపెట్టి రాక తప్పదు… నేనేం చెయ్యగలను…ఎక్కువలో ఎక్కువగా రెండు-మూడు రోజులపాటు నా దగ్గర ఉండనివ్వగలుగుతాను… ఆ తరువాత నువ్వు ఏదో ఒక ఏర్పాటు చేసుకోవలసి వుంటుంది… ఇక్కడికి రావాలనుకుంటే రేపు నాకు చెప్పు… నేను కూడా నా `షెడ్యూలు’ ప్లాన్ చేసుకోవాలి… అంతేకాక నువ్వుకూడా చాలా రోజులు నా ఏకాంతాన్ని… నా ఫ్రీడమ్ ని… డిస్టర్బ్ చెయ్యాలని అనుకోవు… యూ నో ఐ
లవ్ టూ లివ్ అలోన్ అండ్ ఫ్రీ… కాని నీలాంటి స్నేహితుడి కోసం కొన్ని రోజులు సహించు కుంటాను… ఇంతకన్నాఎక్కువ నేనేం చెయ్యలేను…”

          నేను విస్మయంగా సోనమ్ ని చూస్తున్నాను… సంఘం…సంస్కృతి…స్వాతంత్య్రం … జీవనవిధానం గురించిన నా అధ్యయనంలో ఒక కొత్త అధ్యాయం వచ్చి చేరుతున్నట్లు గా నాకు అనిపించింది.

          “ఏమీ ఆశ్చర్యపడక్కరలేదు” సోనమ్ శాంతంగా అంది, “ఇక్కడ ఇదంతా జరుగు తూనే ఉంటుంది… ఇతను మైకేల్. బ్యాంకు నుంచి అప్పు తీసుకుని ఒక అపార్ట్ మెంట్
కొనుక్కున్నాడు. చాలా నెలలుగా అప్పు వాయిదాలు చెల్లించలేకపోయాడు. ఇప్పుడు బ్యాంక్ వారు అప్పుని వసూలు చేసుకునేందుకు ఇతని వెనకాల పడ్డారు…మైకేల్ త్వరలోనే రోడ్డుమీదకి వచ్చిపడతాడు… కాని `వెల్ఫేర్ స్టేట్’ అతని కోసం ఏదో ఒక ఏర్పాటు చేస్తుంది. `వెల్ఫేర్ స్టేట్’ ని మీ దేశంలో ఏమంటారు…?”

          “సంక్షేమ రాజ్యం” నేను యాంత్రికంగా అన్నాను.

          “ఇప్పుడు చూడండి. ఈ రోజుల్లో మా సంక్షేమరాజ్యం ఎంత చురుగ్గా పనిచేస్తోందో… మీరు టి.వి.లో చూసివుండచ్చు, వినివుండచ్చు… పేపర్లలో చదివివుండచ్చు. ఇక్కడి పెద్ద పెద్ద ఇన్సూరెన్స్ కంపెనీలు మునిగిపోయాయి… ఎన్నో బ్యాంకులకి తాళం పడింది. స్టేట్ వీటిని తన `ఓనర్ షిప్’ లోకి తీసుకుంటోంది… వాళ్ళకి బిలియన్ల డాలర్ల సహాయం అందిస్తారు… `స్పెషల్ ప్యాకేజీ’… నేను చెబుతున్న మాటలతో మీరు బోరు కావడం లేదు కదా?”

          ఉన్నట్టుండి ఆమె మౌనం వహించింది.

          “లేదు!” ఈ ఒక్క చిన్న పదం మాత్రం నా నోట్లోంచి వెలువడింది,   

          “ఆగండి! మీకు వైన్ ఇస్తాను. డ్రింక్ చెయ్యండి… ఇది కాలిఫోర్నియాలోని అన్నిటి కన్నా మిన్న అయిన వైన్.” ఆమె లేచి అలమరలోంచి వైన్ బాటిల్ తీసింది. గ్లాసు స్టాండ్ నుంచి రెండు గ్లాసులు తీసింది. ఎదురుగా ఉన్నటీపాయ్ మీద కొన్ని డ్రైఫ్రూట్లు ఒక పెద్ద బౌల్ లాగా ఉన్న కప్పులో ఉంచింది. ఆ కప్పు ఆకారం కొంచెం విచిత్రంగా ఉంది… ఒక కప్ప వీపు మీద లోతుగా గొయ్యిలా ఉంది. దానికి రెండువైపులా రెక్కలు ఉన్నాయి. ఈ రెక్కలు హ్యాండిల్ లా పని చేస్తాయి… ఒక కప్ప ఎగరడానికి సిద్ధమవుతున్నట్లుగా వుంది. నాకు మన సామెత ఒకటి జ్ఞాపకం వచ్చింది… నూతిలోని కప్ప… తన పరిమితమైన లోకం లో సంతోషంగా ఉంటుంది! తన చిన్న ప్రపంచాన్ని మొత్తం లోకమంతా ఇదే అనుకునే భ్రమలో మునిగి ఉంటుంది… కాని ఈ కప్ప మాత్రం ఎగరాలనే అభిలాషతో ఉన్నట్లు కనిపిస్తోంది… వైన్ గ్లాసు ఇంచుమించు సగం ఖాళీ అయింది…

          “నెమ్మదిగా తాగండి. సిప్ చేస్తూ గుక్కలుగా… ఇది విస్కీలాంటిది కాదు…. గంట
సమయంలో ఒక గ్లాసు ఖాళీ చెయ్యండి… తరువాత చూడండి ఎటువంటి తియ్యతియ్యని మత్తు ఎంత బాగా వస్తుందో… ఏ వస్తువు నుంచి అయినా ఆనందం కంగారుపడుతూ పొందలేము. జీవితంలో కూడా అంతే… చూడండి. మా తాతగారు చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చారు… మొదట్లో బొగ్గుగనిలో సూపర్ వైజరుగా పనిచేశారు, తరువాత నెమ్మది నెమ్మదిగా పైకి వచ్చారు… మానేజరు… డైరెక్టరు… తరువాత యజమానిగా…. బిలియన్లకు యజమాని అయ్యారు… మా నాన్నగారయితే కంగారుపడ్డారు… ఆయన చాలా గనులకి యజమాని కావాలని అనుకునేవారు… ఎవరో ఆయనకి షేర్ మార్కెట్ దారి చూపిం చారు… ఆయన తన తొందరలో ఆ మార్గాన్ని అనుసరించారు… కొన్ని సంవత్సరాలలోనే మొత్తం అంతా నాశనమైపోయింది… మా తాతయ్య గారికి మనుమరాలైన నేను అద్దెకి
తీసుకున్న అపార్ట్ మెంట్ లో ఉంటున్నాను. మూడు-నాలుగు న్యూస్ పేపర్లకి రెగ్యులర్ గా ఏదో ఒకటి రాస్తూ వుంటాను… లోటు లేకుండా గడిచిపోతోంది…” “పెళ్లి?” వైన్ నన్ను కొంచెం ఇన్ఫార్మల్ గా చేస్తోంది. “చేసుకున్నాను, కాని సంవత్సరంలోగానే `డైవర్స్’ అయింది. నేను ఒక కొడుకు కావాలనుకున్నాను… ఆయన మాత్రం ముందు చాలా డబ్బు సంపాదించుకుందాం, ఆ తరువాత నువ్వు తల్లి కావాలనే హాబీ కూడా  నెరవేర్చు కుందువు గాని అని తన మొండిపట్టు మీదనే నిలబడ్డాడు… చెప్పండి! తల్లి కావడం కూడా ఏమన్నా హాబీయా…? కేవలం ఈ విషయం మీదనే డైవర్స్ తీసుకున్నాం… మీరు చెప్పండి… 

          తల్లి కావడం ఏమన్నా హాబీనా?”

          ఆమె గ్లాసు ఖాళీ అయిపోయింది. రెండో గ్లాసు నింపుకుని ఆమె ఒక పెద్ద గుక్క తీసుకుంది. నేను నెమ్మది-నెమ్మదిగా సిప్ చేయమని ఆమె చెప్పిన సలహా ప్రకారం
నడుస్తున్నాను. నా ఎదురుగా ఇంద్రధనుస్సులోని ఎన్నో రంగులు వెల్లివిరుస్తున్నాయి… ఆ రంగుల్లో వర్షాకాలపు సెలయేళ్లలాగా ఒక మాతృహృదయంలో నుంచి క్షీరధారలు
వెలువడుతున్నాయి… బహుశా ఏ స్త్రీ అయినా మొదటిబిడ్డకి పాలు పట్టే సమయంలో తన మనస్సులో ఉదయించే భావాలను వ్యక్తం చేసి స్పష్టీకరణ ఇవ్వలేకపోవచ్చు… బిడ్డ పాలు తాగుతున్నాడు… తల్లి శిశువును ముద్దు పెట్టుకుంటోంది…ఆమెకి తన భర్త జ్ఞాపకం
వస్తున్నాడు…భర్త…బిడ్డ…భర్త మరియు తల్లి… స్త్రీకి అన్నిటికన్నా ఎత్తైన  ఆకాశ విహారం… హిమాలయ శిఖరం…ధరణికి ఆధారం…ఇది తల్లి…ప్రకృతిలోని  అన్నిటికన్నా బహు మూల్యమైన కళాకృతి… ఇంద్రధనుస్సు రంగుల్లో రాజా రవివర్మ, మైకేల్ ఏంజేలో భవ్యమైన కళాకృతులు తిరుగుతున్నాయి…

          వైన్ సీసా ఖాళీ అయిపోయింది.

          “ఇంకా తాగుతారా?”

          నేను `నో’ అర్థంలో తల తిప్పాను.

          “అయితే స్కాలర్! ఈ కల్చర్-గిల్చర్ విషయాలు విడిచిపెట్టండి. అవి మనం పొద్దున్న మాట్లాడుకుందాము. అమెరికన్ కల్చర్ గురించి నేను మీకు చెబుతాను… ఇప్పుడు కొంచెం ఉదరపూజ చేసుకుందాం.” ఆమె ఫ్రిజ్ లోంచి తినే వస్తువులు బయటికి తీసింది. హాట్ ప్లేట్ మీద వేడి చేసింది. నా ఎదురుగా పెడుతూ అంది- “మొదలు పెట్టండి.” ఆమె ప్లేటులో రెండు చికన్ ముక్కలు, కొంచెం సలాడ్ ఉన్నాయి… తినడం అయిన తరువాత నేను ఇటూ-అటూ దృష్టి సారించాను. ఇంద్రధనుస్సు ఇంకా మిలమిలా మెరుస్తోంది. నేను లేచి నిలబడ్డాను… “ఇంక నేను వెడతాను! కొంచెంప్యాకింగ్ కూడా చేసుకోవాలి.” నాకు మరో కారణం ఏదీ స్ఫురించడంలేదు. ఆమె దగ్గర ఉండ కుండా వెళ్లిపోవాలనే నిర్ణయం కొంచెం ఇబ్బంది కలిగించేదైనా అనుకోకుండా  తీసు కున్నది కాదు.

          అద్దెకి సంబంధాలు దొరికే ఆశల మధ్య… లేదా తల్లి కావాలనే ఆకాంక్షను హాబీగా అర్థం చేసుకునే మనస్తత్వం యొక్క అనుభూతిని నా దగ్గరగా చూడడం చాలా-చాలా ఇబ్బంది కలిగిస్తుంది… ఇంతగా సహించుకునే శక్తి నాలో లేదు…

          “వెడుతున్నారా!” ఆమె కూడా లేచి నిలబడింది.

          “అవును…” నా చేయి పట్టుకుని నన్నుఆగమని ఆమె పట్టుపడుతుందేమోనని నేను
భయపడుతున్నాను. కాని ఆమె అలా ఏం చెయ్యలేదు.

          తిరిగి వస్తూంటే నాకు మారియా చెప్పిన మాట జ్ఞాపకం వస్తోంది-“…సోనమ్ ని తప్పకుండా కలుసుకోండి. పేరు చూసి భ్రమపడవద్దు… ఇండియన్ కాదు….శుద్ధమైన అమెరికన్. కాని హిందీ బాగా మాట్లాడుతుంది. ఆమెని కలుసుకోకుండా కల్చర్ స్టడీ చేసే మీ ప్రాజెక్టు అసంపూర్తిగా ఉండిపోతుంది.”

***

డా. సోహన్ శర్మ – పరిచయం

సుప్రసిద్ధ హిందీ కవి, రచయిత డా. సోహన్ శర్మ (1942-2011) జన్మస్థానం తీతరడీ గ్రామం, ఉదయపూర్, రాజస్థాన్.

          వీరి నాలుగు కవితా సంకలనాలు, నాలుగు కథా సంకలనాలు, మూడు నవలలు
ప్రచురితమయ్యాయి. `మీణా ఘాట్’ అనే నవలకు మహారాష్ట్ర సాహిత్య అకాడమీ, రాజస్థాన్ సాహిత్య అకాడమీల ద్వారా అవార్డులు లభించాయి. `అహో ముంబయి’ (భలే ముంబయి) అనే నవల వీరి అసంపూర్ణ రచన. వీరు అధికారిగా సేవలందించి బ్యాంక్ ఆఫ్ బరోడా, ముంబయిలో డిప్యూటీ జనరల్ మానేజరుగా రిటైరయ్యారు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.