కథా మధురం 

ఆ‘పాత’ కథామృతం-9

భండారు అచ్చమాంబ

 -డా. సిహెచ్. సుశీల

 

“నేను పెండ్లాడిన భార్యను గాని దాసిని గాను. వివాహమాడుట వలనను భర్తకు దాసి నగుదునా యేమి ?”

          తెలుగు సాహిత్యంలో తొలి తెలుగు కథ 1910 లో గురజాడ అప్పారావు రాసిన “దిద్దుబాటు” (ఆంధ్ర భారతి పత్రికలో) అని అత్యధికులు భావించారు. చాలా ప్రక్రియ లకు కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు ప్రారంభకులు అని తీర్మానం చేయడం వల్లనో, మరే కారణం వల్లనో కానీ చాలా కాలం ఈ అభిప్రాయమే చెలామణిలో ఉంది. విమర్శకులు, పరిశోధకులు, ముఖ్యంగా స్త్రీవాదులు తమ పరిశీలనలో భండారు అచ్చమాంబ తొట్టతొలి కథకురాలిగా నిర్ధారించారు. 1902 లోనే “ధన త్రయోదశి” కథ రాసిన అచ్చమాంబ 1893 నుండే కథలు రాసినట్లు తెలుస్తోంది కానీ ఇప్పుడు పది మాత్రమే లభ్యమౌతున్నాయి. (సంగిశెట్టి శ్రీనివాస్ సంకలనం “తొలి తెలుగు కథలు”).
ధన త్రయోదశి, గుణవతి యగు స్త్రీ, లలితా శారదలు, జానకమ్మ, దంపతుల ప్రధమ కలహము, సత్పాత్ర దానము, స్త్రీ విద్య, భార్యాభర్తల సంవాదము, అద్దమును సత్యవతి యును, బీద కుటుంబము వంటి లభ్యమయిన కథలే కాక మరికొన్ని కథలు‌ రాసినట్టు తెలుస్తున్నది. చారిత్రక మహిళల జీవితాలు వివరాలు, విశ్లేషణలతో “అబలా సచ్చరిత్ర రత్నమాల” రెండు భాగాలుగా రచించారు.

          “నూరేళ్ళ పంట” కథా సంకలనంకి ముందు మాట రాస్తూ భార్గవీరావు – ” 1902 లోనే బందరులో తొలి మహిళా సమాజాన్ని (బృందావన స్త్రీ సమాజాన్ని) స్థాపించిన అచ్చమాంబ గారు మొదటి రచయిత్రి అని గర్వంగా చెప్తూ, వారి రచన “స్త్రీ విద్య”ను మొదటి కథగా వేసుకున్నాము. గురజాడ వారి దిద్దుబాటు మొదటి కథ అనుకోవడం పొరబాటని సవినయంగా మనవి చేస్తున్నాము” అని నిర్ధారించారు.

          హిందూ సుందరి పత్రికలో 1902 నవంబర్లో అచ్చైన అచ్చమాంబ కథ ధన త్రయోదశిని వివరిస్తూ ప్రముఖ స్త్రీవాద పత్రిక భూమిక సంపాదకీయంలో కొండవీటి సత్యవతి -” తెలుగు సాహిత్య చరిత్రలో ఆ నాటి రచయిత్రులకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. తెలుగులో తొలి ఆధునిక కథ రాసిన భండారు అచ్చమాంబకు జరిగిన అన్యాయం గురించి కె. లలిత బయటపెట్టే వరకు ఎవరికీ తెలియదు” అన్నారు.
కథానిలయం ట్రస్ట్ 2008లో తొలి తెలుగు కథలు – ఏడు అభిప్రాయాలు అనే పుస్తకంలో అచ్చమాంబ కథలను ప్రచురించింది. అందులో మొదటి రెండు కథలు 1902 లోనే అచ్చమాంబ రాసిన “ధన త్రయోదశి”, “స్త్రీ విద్య”.

          దిద్దుబాటు, ధన త్రయోదశి రెండు కథలలోనూ కథాంశం భర్తను సంస్కరించడమే. అయితే ధనత్రయోదశి కథను తొలి కథగా అంగీకరించక పోవడానికి కారణాలు రెండు అని చెబుతున్నారు. ఒకటి గ్రాంథిక భాష. రెండు ఆధునిక కథకు ఉండాల్సిన లక్షణాలు లేవు. అయితే గురజాడ దిద్దుబాటు కథను మొదట గ్రాంథిక భాషలో రాసి తర్వాత సరళ గ్రాంథికంలోకి మార్చినట్టు తెలుస్తోంది. రెండో దానికి వివరణ – 19 శతాబ్దంలో “కథ” ఒక సాహిత్య ప్రక్రియగా ఏర్పడి, కొన్ని లక్షణాలు స్ధిరపరచుకుంటున్న సమయం. అయినా ఎలా చూసినా అచ్చమాంబ కథలు తీసి పారేయాల్సిన అవలక్షణాలు ఏమీ లేవు. కథానిక లక్షణాలన్నీ అమరినదే.

          అచ్చమాంబ చాలా కథలు 1902 లోనే రాసినట్లు తెలుస్తోంది. కనుకనే కొందరు “స్త్రీ విద్య” మొదటి కథ అనీ, “ధన త్రయోదశి” మొదటి కథ అని ప్రస్తావిస్తున్నారు.
కనుకనే ఆ రెండు కథలు కాకుండా మరో మంచి ( స్త్రీవాద) కథను విశ్లేషించుకుందాం.

దంపతుల ప్రధమ కలహం

ఈ కథ హిందూ సుందరి 1902 లో ప్రచురితమైంది. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా జీవించాలని, కుటుంబం మొత్తం సామరస్య పూర్వక వాతావర ణాన్ని కల్పించుకోవాలని తెలియజెప్పే కథ.

          “నేను పెండ్లాడిన భార్యను గాని దాసిని గాను. వివాహ మాడుట వలనను భర్తకు దాసినగుదునా యేమి” … అనే తీవ్రమైన వాక్యాలతో మొదలైన ఈ కథ బహుశా అప్పుడు ఒక సంచలనమే కలిగించి ఉంటుంది. స్త్రీ ధిక్కార స్వరం నాటి రచయితలకు కర్ణ కఠోరంగా ఉండి వుండొచ్చు.

          లలిత, నారాయణరావు భార్యాభర్తలు. లలిత అనుకూలవతి అయిన భార్య యే. కానీ ఒకరోజు తనను సంప్రదించకనే నాటక ప్రదర్శనకు వెళ్ళడానికి టిక్కెట్లు తీసుకొని వచ్చి, స్నేహితులందరూ భార్యాసమేతంగా రావలెననుకొంటిమి అన్నందుకు లలితకు కోపం వచ్చింది. తనను అడగకుండా టిక్కెట్లు తీసుకొని వచ్చి, రావలసిందేనని పట్టు బట్టడం నచ్చలేదు. ఒకరకంగా తన మాటకు విలువ లేకుండా బలవంత పెట్టడం ఏమిటి అనుకున్నది. రానని ఖచ్చితంగా చెప్పడంతో నారాయణరావు అలిగి బయటకు వెళ్ళిపోయాడు. అదే కోపంతో తన అమ్మమ్మ ఇంటికి వచ్చి ” అమ్మమ్మా, ఇది మీ కాలము కాదు. మా వంటి పత్నులు పురుషుల యహంకారము నెంత మాత్రము సహింపజాలరు” అంది. ఆ అమ్మమ్మ యే కాదు, నాటి స్త్రీ పురుషులందరు లలిత మాటలను అంగీకరించ రేమో. పైగా “నేనొకసారి నిశ్చయించిన కార్యము నీవలి సూర్యుడావల బొడిచిననువిడుచు దానను గానను సంగతి నీకు దెలిసినదే” అన్నది.

          ” మీరిరువురును మీ మీ స్వాతంత్య్రములను హెచ్చింపుచుండినచో కలహము ముదిరి గృహమొక యరణ్యము వలె నుండి దుఃఖప్రదము మగును” అని నచ్చజెప్ప బోయింది అమ్మమ్మ.

          చివరికి – గతంలో తన తొందరపాటు, దాని పర్యవసానాలు మనమరాలికి చెప్పక తప్పలేదు. పూర్వం తను ఇలాంటి పరిస్థితుల్లో ‘మొండిగా వాదించడం వల్లనే గౌరవం హెచ్చింపబడుటకు మార్గమ’ని నమ్మి ప్రవర్తించడం వల్ల భర్త ఇంటి నుండి వెళ్ళిపోయి నాడని, మరల ఎన్నడూ తిరిగి రాలేదని చెప్తూ దుఃఖించసాగింది. అప్పటికే ఒక కూతురు ఉండడంతో ఆమెను చూసుకుని బ్రతికానని, లలిత వంటి మనుమరాలిని పొందానని చెప్పింది. వివాహమై కొద్ది కాలమే అయింది, ఇంకా పిల్లలు కూడా కలుగలేదు, అతను చేసింది కూడా పెద్ద అపరాధం కాదు అని నచ్చజెప్పడంతో లలిత ఇంటికి తిరిగి వచ్చింది.

          నారాయణరావు కూడా నాటకము కాసేపు చూసి, భార్య మనసును కష్టపెట్టితి నన్న వికల మనస్సుతో, హాలు నుండి బయటకు వచ్చి, గోదావరి నది ఒడ్డుకు వెళ్ళి కూర్చు న్నాడు. ఆమెకు ఇష్టం లేకుండా నాటకానికి రమ్మని బలవంత పెట్టడం సరికాదని పశ్చాత్తాప పడ్డాడు.

          ఇంటికి వచ్చిన లలిత పనివాళ్ళను పంపింది నారాయణరావు ఎక్కడ ఉన్నాడో చూడమని. చాలాసేపు అయిన తర్వాత ఆతృతతో దీపం తీసుకొని బైటకు వచ్చింది. పంచలో ఎవరో పడుకొని ఉండడం చూసి దగ్గరకు వెళ్ళి చూడగా – అతడు నారాయణ రావు. ఆ తర్వాత “వారిరువురకూ కలహము జరుగక వారు సుఖముగా నుండిరి. ఇందు వలన వారి ప్రథమ కలహము యంత్య కలహమయ్యెను” అని కథను ముగించారు.

          బండారు అచ్చమాంబ 1874లో కృష్ణాజిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలులో పుట్టారు. (కృష్ణ జిల్లా రచయితల సంఘం ప్రచురణ లలో) . పదో ఏటనే ఆమెకు మేనమామ భండారు మాధవరావుతో పెళ్ళయింది. అప్పటి వరకు ఆమె ఏమి చదువు కోలేదు.

          ఆమె తల్లి, తమ్ముడు కూడా ఆమెతో పాటే ఉండేవారు. తమ్ముడు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, చరిత్ర పరిశోధనలకు ప్రసిద్ధి చెంది, తెలుగులో మొట్టమొదటి విజ్ఞాన సర్వస్వ సృష్టి కర్త. ఆయనకు చదువు చెప్పడానికి ఉపాధ్యాయుడు వచ్చినపుడు తను కూడా పక్కనే ఉండి చదవడం రాయడం నేర్చుకున్నారమె. సోదరుని ప్రోత్సాహంతో, సహాయంతో, పుస్తకాలు సేకరించి ఆసక్తితో చదువుకున్నది. హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, సంస్కృతం భాషలు నేర్చుకున్న విదుషీమణి అచ్చమాంబ. వివిధ భాషల్లో స్త్రీ సాహిత్యం రాసిన రచయిత్రులు గురించి పరిశోధన చేసి, విషయాలు సేకరించి అబలా సచ్చరిత్రమాల అనే గ్రంథాన్ని రచించిన ప్రథమ స్త్రీవాద చరిత్ర కారిణి. భర్త ఉద్యోగరీత్యా మధ్యప్రదేశ్ లో ఉండి, తన ముప్పై ఏళ్ళ వయసుకే 1905 జనవరి 18 న మరణించారు. ఆ నాడే స్త్రీ వాద భావాలతో, స్త్రీలకు విద్య ద్వారానే మంచి భవిష్యత్తు అని మనసా నమ్మిన స్త్రీవాద సంస్కర్త, సత్యాన్వేషి. చిన్న వయసులోనే కుమారుడు, కుమార్తె మరణించడంతో తీవ్రమైన దుఃఖాన్ని అనుభవించింది. తన ఇంటిలో చిన్నపిల్లలకు ఆశ్రయమిచ్చి చదివించింది. స్త్రీల సంక్షేమం కోసం వివిధ ప్రాంతాల్లో పర్యటించారు.

          అచ్చమాంబ నైజాం ప్రాంతంలోని మునగాల సంస్థానంలోని నందిగామలో జన్మించారని, తెలుగులో మొట్టమొదటి రచయిత్రి మాత్రమే కాక “తెలంగాణ తొలి రచయిత్రి ” అని కొందరు అంటారు. అయితే అసలు విషయం ఏమిటంటే నాటి కృష్ణా జిల్లాలోని మునగాల ప్రాంతం నైజాం పరిపాలనలో ఉండేది.

          అయితే అచ్చమాంబ తన ఆరేళ్ళ వయసులో తండ్రి మరణించడంతో తల్లి, సోదరునితో తన సవతితల్లి కొడుకైన కొమర్రాజు శంకరరావు ఉంటున్న నల్లగొండ జిల్లా లోని దేవరకొండ ప్రాంతానికి వచ్చారు. ఏది ఏమైనా ఆమె తెలంగాణ ప్రాంతంలో జీవించిన విషయం నిజమేనన్నది చారిత్రక సత్యం. భర్త ఉద్యోగరీత్యా నాగపూర్, దిలాపూర్ ప్రాంతాలలో ఉండవలసి వచ్చింది.

          ఆమె జీవించింది ముప్పై ఏళ్ళు. లోకం పోకడ తెలుసుకునే సరికి ఎవరికైనా పదిహేనేళ్ళు పడుతుంది. మిగిలిన పదిహేనేళ్ళలో ఇంతటి సాహిత్యాన్ని సృజించడం సాధారణ విషయం కాదు. ఆమె రచనా ప్రణాళిలు ఇంకా చాలా ఉన్నాయి. చిన్న వయసులోనే మరణించడం దేశానికి, సమాజానికి, స్త్రీలకు, ముఖ్యంగా సాహిత్యానికి తీరని లోటు. ఆమె తొలి చరిత్రకారిణిగా, తొలి మహిళా చరిత్రకారిణిగా, తొలి కథా రచయిత్రిగా, తొలి స్త్రీ వాద రచయిత్రిగా నిలిచిపోయారు.

*****

వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

Please follow and like us:

5 thoughts on “కథామధురం-ఆ‘పాత’కథామృతం-9 భండారు అచ్చమాంబ”

 1. బండారు అచ్చమాంబ తొలి చరిత్రకారిణిగా, తొలి మహిళా చరిత్రకారిణిగా, తొలి కథా రచయిత్రిగా, తొలి స్త్రీ వాద రచయిత్రిగా ప్రపంచానికి గుర్తుచేస్తూ రాసిన ప్రొఫెసర్ సుశీల గారి వ్యాసం అభినందనీయం. .

  *****

 2. సుమారు వంద సంవత్సరాల తర్వాత భండారు అచ్చమాంబ తొలి రచయిత్రిగా వెలుగులోకి తీసుకు వచ్చినవారిని అభినందించాలి.ఆమె కథల్ని సేకరించి గ్రంథస్తం చేసిన సంగిశెట్టి శ్రీనివాస్ వలన తెలిసాయి.
  అచ్చమాంబ కథల్లో అందరికీ తెలిసిన ప్రత్యేకంగా చెప్పదగిన కథ ధనత్రయోదశి అయినా మరొక కథ “దంపతుల ప్రథమకలహం” ని ఎంపిక చేసుకొని సుశీలగారు పరిచయం చేయటం వలన పాఠకులు కొందరికైనా అచ్చమాంబ మరొక కథని తెలిసేలా చేసినట్లు అవుతుంది. అందుకని సుశీల గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

 3. , తొలి మహిళా చరిత్రకారిణి,తొలి కథా రచయిత్రి,తొలి స్త్రీ వాద రచయిత్రి బండారు అచ్చమాంబ గారి పరిచయం చాల బాగుంది. “దంపతుల ప్రధమ కలహం”కథ విశ్లేషణ చాల బాగుంది. ఆ “పాత” కథామధురంను పంచుతున్న
  సుశీల గారికి ధన్యవాదాలు💐

 4. 1902 లోనె అచ్చమాంబగారు రాసిన కథ చదివి ఆశ్చర్యం .ఎంతటి ధిక్కార స్వరం!! సంసారంలొ సామశ్యం ఎంత ముఖ్యమని తెలియజేశారు. భార్యాభర్తలిద్దరికీ మనసులో ఒక realisation కలుగుతుంది. అది చాలా బాగుంది. మంచి కథను పరిచయం చేశారు. ధన్యవాదాలు.

 5. మేడమ్ సుశీల గారు మంచి కథలని అందిస్తూ, రచయిత్రులని పరిచయం చెయ్యడం చాలా బావుంది.. మనహ్పూర్వక అభినందనలు మేడమ్🌹💐🙏🏻

Leave a Reply

Your email address will not be published.