ప్రమద

రోజు కూలీ నుండి పిహెచ్. డీ వరకు చేరుకున్న 

 సాకే భారతి

-నీలిమ వంకాయల

          మొక్కవోని దీక్షకు నిలువుటద్దమే సాకే భారతి . పేదరికం, అనారోగ్యం, రెక్కాడితే గానీ డొక్కాడని దినచర్య. వీటినన్నింటిని అధిగమించి ఈమె ఉన్నత విద్యను అభ్యసించిన విధానం ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తిగా నిలుస్తుందనటంలో సందేహం లేదు. అలుపెరగని శ్రమకు, సన్నగిల్లని పట్టుదలను కలిపి చేసిన విజ్ఞానమథనంతో ఆమె  డాక్టరేట్ పట్టా తీసుకుంది. ఉన్నత చదువులు గొప్పింటి వారికే పరిమితం అనే భ్రమను తొలగిస్తూ పేదింటికి సరస్వతీ దేవి దిగి వచ్చిందా అన్నట్లుగా సాగిన “సాకే భారతి” ప్రయాణం ఒక్క సారి తెలుసుకుందాం.

          సాకే భారతి జన్మస్థలం అనంతపురం జిల్లా సింగనమల మండలం, నాగులగడ్డ. తల్లి, తండ్రులకు ముగ్గురు ఆడపిల్లలు. వారిలో ఈమె పెద్దది. నిరుపేద ఎస్టీ కుటుంబం లో పుట్టిన భారతి తల్లికి ముగ్గురూ ఆడపిల్లలే కావడంతో తండ్రి మగబిడ్డను కనలేదని తీవ్రంగా హింసించేవాడు. బాధ్యతల భారం చేత కుటుంబ ఆర్థిక స్థితి బాగోలేక పదో తరగతి చదువుతుండగానే మేనమామ శివ ప్రసాద్ తో ఆమె వివాహం చేసారు.

          ఆమె భవిష్యత్ గురించి ఎన్నో కలలను కన్నా ఎవరికీ చెప్పుకోలేక పోయింది. పెళ్ళి అయ్యి ఒక ఆడ బిడ్డ పుట్టిన తర్వాత ఆమె భర్త శివ ప్రసాద్ ఆమె కోరకను అర్ధం చేసుకుని భర్త సహకారం అందించాడు. తన  తాతయ్య ఇచ్చిన ప్రోత్సాహం, భర్త సహకారంతో చదువును కొనసాగించింది. తన జీవితాన్ని బాగుచేసుకునేందుకు చదువు కొనసాగించ డమే మార్గమని ఆమె భావించింది.

          చిన్నప్పటి నుంచీ బాగా చదువుకోవాలను కునేది భారతి. తన కూతురు గాయత్రి ఆలనా పాలనా చూసుకుంటూనే చదువూ, పనులూ సమన్వయం చేసుకునేది. రోజూ రాత్రి పొద్దుపోయే వరకూ, మళ్ళీ కోడి కూయక ముందే లేచి పుస్తకాలతో కుస్తీ పట్టేది. 10th క్లాస్ సింగనమల ZP హైస్కూల్ లో, ఇంటర్ పామిడి కాలేజీలో చదివింది. కాలేజీకి వెళ్ళా లంటే ఊరి నుంచి కనీసం 28 కిలో మీటర్లు ప్రయాణించాలి. రవాణా ఖర్చులు భరించ లేని పరిస్థితి. అందుకే, ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని గార్లదిన్నె వరకూ నడిచి వెళ్ళి  అక్కడ బస్సెక్కేది. కూలిపనులు చేస్తూ, గొడ్లు మేపుతూ చిన్న రేకుల షెడ్ లోనే కాపురం చేస్తూ ఉన్నత చదువులు చదివింది. పుస్తకాలు పెట్టుకునేందుకు కూడా స్థలంలేని ఆమె ఎరువుల గోనె సంచిలోనే వాటిని దాచుకొంది. ఇన్ని కష్టాల మధ్య డిగ్రీని అనంతపురం SK ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి తరగతిలో, అదీ రెగ్యులర్ స్టూడెంట్ గా పాస్ అయ్యింది. అక్కడితో ఆగకుండా బిఇడి కూడా చేసింది. పి.జి మంచి మార్కులతో పాస్ అయ్యింది.

          అది చూసి భర్త, టీచర్లూ పీహెచ్‌డీ దిశగా ఆలోచించమన్నారు. ఇక 2016 లో అనంతపురం శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో Phdచేయడానికి సంకల్పించింది. ప్రయత్నిస్తే ప్రొఫెసర్‌ డా.ఎంసీఎస్‌ శుభ దగ్గర ‘బైనరీ మిక్చర్స్‌’ అంశం పై పరిశోధనకు అవకాశం లభించింది. ఇందు కోసం వచ్చే ఉపకార వేతనం భారతికి కొంత సాయ పడింది. Phdజాయిన్ అయ్యాక కూలికి పోయెందుకు కుదరక రేషన్ బియ్యం, పచ్చడి మెతుకులతోనే గడిపి నిత్యం ఆటోలో ప్రయాణిస్తూ ఉన్నత చదువు కోసం మైళ్ళ దూరం ప్రయాణం చేస్తూ పెద్ద భగీరద ప్రయత్నమే చేసింది. ‘‘డాక్టరేట్‌ చేస్తే వర్సిటీ స్థాయిలో ఉద్యోగం అందుకోవచ్చు. అది మా జీవితాల్ని బాగు చేస్తుంది. నేను నేర్చుకున్న జ్ఞానాన్ని మరెంతో మందికి పంచొచ్చు. నేను సాధిస్తే అది మరెంతో మందికి ప్రేరణ కూడా కల్పిస్తుంది”… అని భారతి తన ఆశయం గురించి చెబుతూ ఉండేది.

          శ్రమలోనే ఆనందాన్ని వెతుక్కునే పోరాట యోధురాలు తన లక్ష్యం చేరుకు నేందుకు అన్ని ఆటంకాలను ఎదుర్కుంటూ  ఫిజికల్ కెమిస్ట్రీ విభాగంలో ‘THE STUDY’S OF BINARY LIQUID MIXER’S’ అనే అంశం పై ఈ ఏడాది ఏప్రిల్ లో థిసెస్ సమర్పించింది. SK యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా Phd పట్టాను సగర్వంగా అందుకొని తన ప్రతిభను లోకానికి ఘనంగా చాటింది. ఫిజికల్ కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్ కావాలన్నదే తన లక్ష్యమని దాని కోసమే కృషి చేస్తానని ఈ సందర్భంగా సాకే భారతి తెలియజేశారు.

          ఆకలి కష్టపడటాన్ని అలవాటు చేస్తుంది. శ్రమ లోంచే ఆలోచన పుడుతుంది. పట్టుదల  జీవితాన్ని లక్ష్యం వైపు కు కదిలేలా చేస్తుంది. దీనికి కళ్ళముందు కదిలే సాక్ష్యమై నిలిచింది భారతి. రోజుకూలీగా ఎండ, వానా లెక్క చేయక పొట్టకూటి కోసం శ్రమ పడింది. చదువు పై ఉన్న ఆసక్తితో పగలు, రాత్రి కృషి చేసి లక్ష్యాన్ని చేరుకుంది. ఉన్నతంగా నిలబడాలన్న ఆశయంతో…కోచింగ్‌లూ, అదనపు తరగతుల సాయం లేకుండా రసాయన శాస్త్రాన్ని ఔపోసన పట్టింది. రసాయన శాస్త్రంలో పీహెచ్‌డీ సాధిం చింది.

          ఎస్టీ సామాజిక వర్గానికి చెంది, దినసరి వ్యవసాయ కూలీ వేతనంతో బతుకుతూ, కటిక పేదరికంలోనే సాకే భారతి పీహెచ్ చేయడం సాధారణ విషయం కాదు. మూడు ప్రతికూలతల్ని అధిగమిస్తూ ఆవిడ పీహెచ్ పట్టా పొందారు. ఒకటి ఆవిడ ఎస్టి రెండు మహిళ. మూడు పేదరికం. అందువల్ల ఆవిడ సాధించిన దాన్ని మామూలు అకడమిక్ కొలతలతో, సామాజికంగా, సాంస్కృతికంగా అభివృద్ధి చెందిన వర్గాల వారితో సమానంగా ఆమె సాధించిన దాన్ని చూడటం అన్యాయం. ఆవిడ కోరుకున్న అసిస్టెంట్ ప్రొఫెసర్  ఉద్యోగాన్ని (అదీ బాక్లాగ్ లో ఖాళీగా పడి వున్న పోస్టుని) ఆమెకు ఇవ్వడానికి ప్రభుత్వం చొరవ చూపించాలి.

          “భారతి పి.హెచ్.డి సాధించిన నేపధ్యాన్ని, ఆమెకు జరగవలసిన న్యాయం గురించి ప్రస్తావిస్తూ సామాజికవేత్త ఒకరు సోషల్ మీడియాలో ఈ విధమైన కథనాన్ని  ప్రచురిం చారు. ఆమె అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం కోరుకుంటుంటే ఆమెకి జూనియర్ లెక్చరర్ కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చారు. జూనియర్ లెక్చరర్ ఉద్యోగం ఇవ్వగలిగిన ప్రభుత్వం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఎందుకివ్వలేక పోతున్నది? ఈ ప్రశ్నకి సరైన సమాధానం దొరకడం లేదు. మరొక్క అడుగు ముందుకేయడానికి ప్రభుత్వానికి అడ్డు వస్తున్నదేమిటి? రేపు పీహెచ్డి  చేసిన ఎస్టీ వర్గపు ప్రజలు ఇలాగే డిమాండ్ చేస్తారని భయమా? లేదా లీగల్ కేసులొస్తాయని జంకా? రిక్రూట్మెంట్ రూల్స్ వుంటాయి. అలాగే రిలాక్సేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ రూల్స్ కూడా వుంటుంది. ప్రభుత్వానికున్న ఆ రిలాక్సేషన్ పవర్ని ఏ న్యాయస్థానమూ ప్రశ్నించదు. ఆ రిలాక్సేషన్ కిందనే ఎన్నో రకాలుగా ఎంతో మందికి ప్రభుత్వోద్యోగాలు దొరుకుతున్నాయి. తాము తీసుకునే జీతానికి ఒక్క రూపాయి పని చేయని క్రీడాకారుల పాలిట చూపించిన ఉదారత భారతి పట్ల ఎందుకు చూపించలేక పోతున్నారు? క్రీడాకారులు దేశానికి కీర్తి ప్రతిష్ట తీసుకొచ్చారు కాబట్టి వారికివ్వడం న్యాయమని వాదించొచ్చు. సరే నిజమే అనుకుందాం. ప్రజల సొమ్ముని పింఛనులా ప్రతినెలా వాళ్ళ ఖాతాల్లో జమ కానివ్వండి. కానీ భారతి వంటి వారు పేదరికాన్ని, సామాజిక వెనుక బాటుతనం వంటి ప్రతికూలతల్ని, జెండర్ లోకువ భావాల్ని అధిగ మిస్తూ సమాజానికి ఇస్తున్న ప్రేరణ ఒలింపిక్ పతాకంతో సమానమే అనుకుంటున్నా.

          ఆమెకి ఇల్లు మంజూరు చేశారంటున్నారు. ఇంటి స్థలం అనేక మంది మహిళలకి ఇచ్చారు ఎక్కడో జనావాసాలకు దూరంగా. అలాగే భారతికి కూడా ఇచ్చారు. ఏమిటి తేడా? ఇచ్చింది తీసుకోవాలి అంటున్నారు. గట్టిగా మాట్లాడితే డిమాండ్ చేయడానికి ఆమెకేం హక్కుందని అంటున్నారు. ఆమె హక్కేమిటో సామాజిక న్యాయమనే దృక్పథం నుండి చూస్తే మనకి అర్ధమవుతుంది. సామాజిక న్యాయంలో సాంకేతికతలకి ప్రధమ స్థానం వుండదు. అందరికీ సమాన అవకాశం కల్పించడమే సామాజిక న్యాయం. బతక డానికి శ్రమిస్తూ జీవితంలో ఏదైనా సాధించిన వారు సమాజానికో ప్రేరణ. ఆ ప్రేరణని సమాజం స్వీకరిస్తే అలాంటివారు అనేక మంది వస్తారు. సాకే భారతి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా జాయిన్ అవుతే అది కింది వర్గాల మీద చూపించే ప్రభావం అపారం. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. ఆ సానుకూల దృక్పథం నాయకులకు వుండాలి.

          భారతి విజయాన్ని విద్యారంగ విజయంగా భావించి వుంటే ఆమె అర్హతలకి తగ్గ న్యాయం ఆమెకి జరిగి వుండేది. అసలు ఆమె విజయానికి ఉబ్బి తబ్బిబ్బవాల్సింది బదులుగా ప్రభుత్వంలోని పెద్దల దగ్గర నుండి అనేక మంది అకడమీషియన్స్ ఒక కల్చరల్ షాక్ కి గురయ్యారనిపిస్తుంది. ఆ కల్చరల్ షాక్స్ ఎక్కువవడం సమాజానికి మంచిది. ఆవిడ పట్ల సానుభూతి చూపిస్తూనే ఆవిడ నియామకం పట్ల సానుకూల అభిప్రాయం లేనివారికి ఎందుకో కానీ ఆవిడ అప్పియరెన్స్, భాష, యాస పట్ల అభ్యంతర ముందేమో అనిపిస్తుంది. మనుషుల భాషలు, వేషాలు, యాసలు అర్హతల్ని నిర్ణయించే సాంస్కృతిక దురాగత ఆలోచనల నుండి మనం బైటపడేంత వరకూ భారతీయ సమాజం బాగుపడదు. ఆవిడ ప్రైవేట్ కేండిడేట్ గా పిజి వరకు చదవలేదు. రెగ్యులర్ కేండిడేట్ గానే చదివారు. 2016 నుండి 7 సంవత్సరాల పాటు రిసెర్చ్ చేశారు. ఎందు కింత కష్టపడ్డావని అడిగితే ‘పేదరికం నుండి బైటపడాలంటే చదువొకటే మార్గమని చదివాను.’ అని సమాధానం ఇచ్చారు ఆవిడ. ఇదెంత గొప్ప విషయం? సమాజానికి ఇంత గొప్ప సందేశాన్ని ఆచరణాత్మకంగా నిరూపించిన వ్యక్తికి ఆవిడ అర్హతల మేరకి తగిన ఉద్యోగం ఇవ్వడానికి ఎందుకిన్ని శషబిషలు? ఆవిడకి ఉద్యోగం ఇవ్వడానికి రిక్రూట్మెం ట్రూల్స్ రిలాక్స్ చేసే అవసరం లేదని కూడా కొందరు మిత్రులంటున్నారు. మరింక ఏమిటి ఇబ్బంది? ఆ ఇబ్బంది మన అంతరంగాల్లో దాక్కొని వున్న వివక్షేనా? అవసర మైతే రిక్రూట్మెంట్ రూల్స్ ని రిలాక్స్ చేస్తూ సాకే భారతికి బాక్ లాగ్ లో వున్నఅసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం ఇవ్వాలనే డిమాండ్ తో నేనూ గొంతు కలుపుతున్నా. ఆమెకి అకడమిక్ గా, సామాజికంగా ఆ పోస్టుని డిమాండ్ చేసే హక్కుంది.”

          కాబట్టి ప్రభుత్వం సాకే భారతి అర్హతకు తగిన ఉద్యోగం ఇచ్చి న్యాయం చేయాలని కోరుకుందాం.

          జీవించే మార్టినలైజ్డ్ సెక్షన్స్ ప్రజలు సాధించిన అకడమిక్ విజయాల్ని మామూలు లెక్కలతో చూడకూడదు. అలా చూశామంటే మనలో సామాజిక న్యాయ దృక్పథం లేనట్లే.

          అలాంటి వాళ్ళు ఒక్క వారం రోజులు ఆమె ఇంటి వాతావరణంలో బతికి, ఆ తరువాత మాట్లాడాలి అని నా సూచన.

          భారతి ఆమె భర్త ఇద్దరూ కూలి పనికి వెళ్తే కానీ పూట గడవని పరిస్థితిలో తన కల నెరవడం కష్టం అని భావించిన సందర్భాలు కూడా లేకపోలేదు. యూనివర్సిటీ ఫీజులు, పుస్తకాలు, థీసిస్  లు ఇవ్వన్నీ తలుచుకుని చదువు ఆపాలి అనే స్థితిని ఎదుర్కోవలసి వచ్చింది.

          నేడు చదువులో అత్యున్నతమైన డాక్టరేట్ పట్టా ఆమె మట్టిచేతుల్లో అందాన్ని పుణికి పుచ్చుకుంది. ‘అద్భుతం జరిగేప్పుడు ఎవరూ గుర్తించలేరు… జరిగాక గుర్తించా ల్సిన అవసరం ఉండదు’ అని సినీ దర్శకుడు త్రివిక్రమ్ అన్నట్లు ప్రస్తుతం విజయం కూడా ఒక అద్భుతమే అని చెప్పొచ్చు. ఒక సాధారణ గృహిణి రాష్ట్రస్థాయిలో వార్తంశా లలో నిలవడం వెనుక ఆమె శ్రమ, త్యాగం, ఎంతో శ్రమ దాగివున్నాయి. సాకే భారతి కాస్తా డాక్టర్ భారతిగా మారిన ఆమె చదువుల మజిలీని పరికిద్దాం ఓసారి…:

          తను, భర్త కూలి చేస్తేకాని గడవని పరిస్థితి ఒకవైపు, మరోవైపు చదువు సాగించాలా అపాలా అనేలా చేసాయి. ప్రస్తుతం SK యూనివర్సిటీ స్నాతకోత్సవంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ జస్టిస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా PHD పట్టాను సంగర్వంగా అందుకొని తన ప్రతిభను లోకానికి ఘనంగా చాటింది. ఫిజికల్ కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్ కావాలన్నదే తన లక్ష్యమని దానికోసమే కృషి చేస్తానని ఈ సందర్భంగా సాకే భారతి పేర్కొంటున్నారు.

పరిస్థితులనుండి ప్రేరణ: దీనితో భారతి తాతయ్య దగ్గర పెరిగింది. ఆమె తాతయ్యకు చదువు పై అవగాహనా ఉండడంతో గొప్ప ప్రేరణగా నిలిచినట్లు ఆమె పేర్కొన్నది. పదో తరగతిలో ఉండగానే వయస్సులో పెద్దవాడైనా మేనమామతో వివాహం జరిగినా చదువు ఆపలేదు. తనను చూసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్న, అవమానాలు, కష్టాలను దిగమింగుకుని తన భర్త సహాయంతోనే ఈ ఘనత సాధించినట్లు భారతి కన్నీళ్ళ పర్యంతమవుతు చెబుతోంది. ఉన్నత ఉద్యోగం సాధించి, తన కుటుంబాన్ని చక్కదిద్దుకోవడమే కాకుండా తన కుమార్తెను డాక్టరును చేయడమే తన ద్యేయంగా భారతి చెబుతోంది.

సర్వత్రా అందుతోన్నా అభినందనలు: పేదింటి విద్యారత్నం Sakhe Bharathi సాధించిన విజయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ధీక్ష పట్టుదల ఉంటే కటిక దరిద్రం వున్నా పరిస్థితులకు ఎదురేగి నిలవవచ్చని భారతి నిరూపించింది. SKU  స్నాతకోత్సవం అనంతరం వెలుగులోకి వచ్చిన ఈ అంశం పై సోషల్ మీడియా, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో సాకే భారతి చదువుపట్ల ఇన్స్పిరేషన్ కథనాలు వచ్చాయి. పలువురు ఆర్ధికంగాను సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఏపీ ప్రభుత్వంకూడా భారతీ ప్రతిభను అభినందిస్తూ ఇల్లును మంజూరు చేసింది. SK యూనివర్సిటీలో వున్నా బ్యాకలాగ్ పోస్టును ఆమెకు కేటాయించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వం నుండి హామీ లభించింది. పేదరికంలో విరిసిన ఈ చదువుల తల్లి పై సర్వత్రా హర్షద్వానాలు వెల్లు వెత్తుతున్నాయి. ఈమె ప్రతిభకు మెచ్చిన ఎమ్మెల్సీ కుంబా రవిబాబు భారతికి తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీలో ఫ్యాకల్టీగా చేసే అవకాశం కల్పించారు.

*****

Please follow and like us:

One thought on “ప్రమద – సాకే భారతి”

Leave a Reply

Your email address will not be published.