“నెచ్చెలి”మాట 

అంతర్యాన్

-డా|| కె.గీత 

ఔరా
చంద్రుని పై
భారతయాన్ కాలుమోపినట!
అదేనండీ
చంద్రయాన్ –

అక్కణ్ణించి
చూసి
కుందేలు
ఏమనుకుంటుందో
మరి!

తన తలకాయంత
లేని దేశంలో
చీమ తలకాయంత
లేని మనిషి
ఇంతదూరపు
యానం
ఎలా చేసాడబ్బా!

అనో-

అక్కడ
ఆకలితో మలమలమాడే
పొట్టలు నింపడం
కంటే
తను సంచరించే
ప్రదేశంలో
ఏముందోనన్న
ఉత్సుకతకే
ఎక్కువ ఖర్చుపెడుతున్నారు వీళ్ళు!

అనో-

అది
చంద్రయాన్ అయితే
ఏవిటి
మంగళ
బుధ
ఆదిత్య యాన్
అయితే ఏవిటి

ఏదేమైనా
మేల్ ఇగోలు
ఫిమేల్ డామినేషన్లు
అని కొట్టుకుఛస్తున్న
పరమ కిరాతక
మానవులు
ఇక్కడా
తగలడతారేమో!

అనో


మానవులని
సుదూరం నించి
చూసే
తన లోపల
నీళ్ల జాడంతా
ఎప్పుడో
ఆవిరై
పోయింది కదా!

అనో

గడ్డకట్టిన గుండెల్లో
దుఃఖంలా
మిగిలిన
ఉన్న ఊట
కూడా
ఎక్కడ
పోతుందోనని
భయపడి
ఛస్తూనో

ముడుచుక్కూర్చుంది
పాపం!

మరా
కుందేటి
అంతర్యాన్
చెయ్యడం
సబబేనా!

అయినా
మనకెందుకులెండి
సెల్ ఫోన్లకి
అతుక్కుపోయి
బతుకులీడ్చే
మనం
ఆలోచించేది
మహా అయితే
రీఛార్జీ
ఖర్చు గురించి
మాత్రమే!

****

నెచ్చెలి పాఠకులందరికీ సదవకాశం: 

          ప్రతినెలా నెచ్చెలి  పత్రికలో వచ్చే   రచనలు / “నెచ్చెలి” యూట్యూబ్ ఛానెల్లో వచ్చిన ఆర్టికల్స్ వేటిపైనైనా వచ్చిన కామెంట్ల నించి ప్రతి నెలా ఒక ఉత్తమ విశ్లేషణా త్మక కామెంటుని ఎంపిక చేసి  ప్రకటిస్తాం. పాత రచనల మీద కూడా కామెంట్లు చెయ్యవచ్చు. 

          మరింకెందుకు  ఆలస్యం? రచనల్ని చదివి వివరంగా కామెంట్లు పెట్టడం ప్రారంభించండి.  

          వినూత్నం, వైవిధ్యం ప్రధాన నిలయాలైన  “నెచ్చెలి” వస్తున్న వివిధ వినూత్న రచనల్ని తప్పక చూసి, చదివి ఆనందిస్తారు కదూ!

*****

ఆగస్టు  2023 లో ఎంపికైన ఉత్తమ కామెంటు రాసిన వారు: ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

ఉత్తమ కామెంటు అందుకున్న పోస్టు: నడక దారిలో – శీలా సుభద్రాదేవి

 ఇరువురికీ  అభినందనలు!

*****

Please follow and like us:

4 thoughts on “సంపాదకీయం-సెప్టెంబర్, 2023”


  1. మానవులని
    సుదూరం నించి
    చూసే
    తన లోపల
    నీళ్ల జాడంతా
    ఎప్పుడో
    ఆవిరై
    పోయింది కదా! అంటూ మన పర్యావరణ సమస్యను చాల చక్కగా చెప్పారు . తద్వారా మానవాళి యొక్క భవిష్యత్తు కూడా ఒక ప్రస్నార్ధకమే అన్న విషయం కూడా పాఠకులకు మంచిగా గుర్తుచేశారు , ధన్యవాదములు .

  2. “ఏదేమైనా మేల్ ఇగోలు ఫిమేల్ డామినేషన్లు అని కొట్టుకుఛస్తున్న పరమ కిరాతక మానవులు
    ఇక్కడా తగలడతారేమో!” …. సత్యాన్ని బట్ట బయలు చేశారు. నాకు నచ్చింది. మీకు అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.