మనసంతా నువ్వే!

(నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కథ)

-రామలక్ష్మి జొన్నలగడ్డ

కొన్ని హిస్టరీలంతే- చెరిగిపోవడమే వాటికున్న అర్హత!
ఆ విషయం నేను గ్రహించిన ఆ రోజు…….
వెదకబోయిన తీగ కాలికి తగలడం అదో ఆనందం.
కానీ వెదకాలనుకోని తీగ తగిలి, వళ్ళంతా కారం పూసినట్లయింది నాకు.
తగిలింది కూడా మామూలు తీగ కాదు. మెరుపుతీగ!

          ఆ తీగ పేరు గీత. ఏడేళ్ళ క్రితం నా భార్య. ఐదేళ్ళ క్రితం విడిపోయాం. తర్వాత మళ్ళీ ఇదే చూడ్డం. చూసీచూడగానే గుర్తు పట్టాను. అప్పుడెలాగుందో ఇప్పుడూ అలాగే ఉంది- సన్నగా నాజూగ్గా హుషారుగా….

          అదే- ఆ హుషారే నా వంటికి కారం పూస్తోంది.

          పెళ్లయ్యేక- వాళ్ళింట్లో మూడూ, మా ఇంట్లో మూడూ నిద్దర్లు చేసేక- ఆమె నాకు చాలా నచ్చింది.

          గీత పల్లెటూళ్ళో పుట్టి పెరిగింది. అక్కడే డిగ్రీదాకా చదివింది. తలిదండ్రులు పేదవాళ్ళు. ఓ పెళ్ళిలో మా అమ్మ కంటబడకపోతే- గంతకు తగ్గ బొంతలాంటివాణ్ణి చేసుకునుండేది. తంతే బూర్లెగంపలో పడ్డట్లు, నెలకి రెండులక్షల జీతగాణ్ణి నాకు ఇల్లా లయింది. అదీ పైసా కట్నం లేకుండా.

          మావాళ్ళ పట్ల కృతజ్ఞతతో పడిపోతుందనుకున్నాను. నాకు అణగిమణగి ఉంటుం దనుకున్నాను. కానీ, కాపురానికొచ్చిన నెల్లాళ్ళలోనే, అర్థాంగిలా ఫీలవడం మొదలెట్టింది. నన్నూ, నా అలవాట్లనీ శాసించసాగింది. ఆమె తీరు చూస్తే అమ్మ గుర్తుకొచ్చేది. కా అంటే కా, కీ అంటే కీ అనేటంత గారంగా పెరిగినా- అమ్మ అదుపుకి మాత్రం లొంగేవాణ్ణి. అమ్మ దృష్టిలో నేనెప్పుడూ చిన్నపిల్లాణ్ణే. ఎప్పుడేంచెయ్యాలో, ఎక్కడెలా మసలాలో ఇప్పటికీ చెబుతూంటుంది. తననేమనలేక, పెళ్ళి కోసం ఎదురుచూశాను. నాకంటే చిన్నదైన నా
భార్యమీద అజమాయిషీ చేసి, పెద్దరికాన్ని పొందాలనుకున్నాను. కానీ, గీత నాకు అమ్మ కాని మరో అమ్మై శాసిస్తోంది.

          పల్లెటూరిదాన్నన్న సంకోచం లేదు. విద్యాధికులైన నా ఫ్రెండ్సుతో మాట్లాడ్డానికి బెరుకు లేదు. వాళ్ళలో అబ్బాయిలు, ‘మీ ఆవిడ నీకంటే స్మార్టు’ అనేవారు. అమ్మాయి లేమో, “అమ్మో! మీ ఆవిడ మా కంటే ఫాస్టు” అని అబ్బురపడేవారు. ఇంత చదువుకుని, ఇంత సంపాదిస్తూ- ఓ పల్లెటూరిపిల్లకి తక్కువైపోవడం నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసింది. తట్టుకోలేకపోయాను.

          ఒకరోజామెకు మా వాళ్ళ కామెంట్సు చెప్పి, “వాళ్ళది మెప్పు కాదు, వెటకారం. పల్లెటూరిదానివి, పల్లెటూరిదానిలాగే ఉండు. అదే నీకు గౌరవం” అని ఆమె నేపథ్యం గుర్తు చేశాను.

          గీత చలించలేదు, “మా ఊళ్ళోనూ నేనిలాగే ఉంటాను. అక్కడ నన్ను ఫాస్టు అనే వారు కాదు. నాది ఆత్మవిశ్వాసం అనేవారు” అందామె.

          రోజులు గడుస్తున్నకొద్దీ ఆమె ఆత్మవిశ్వాసం నాకు పొగరులా ఉండేది. ఏడాది తిరక్కుండా మా ఇద్దరికీ అభిప్రాయభేదాలు పెరిగాయి. ఆమె ఎక్కడా తగ్గకపోవడంతో, “విడాకులిస్తే నీ బ్రతుకు కుక్కలు చింపిన విస్తరి ఔతుంది” అని బెదిరించానోసారి. దానికామె, “నా బ్రతుకు చిరగడం కోసం, మిమ్మల్ని మీరు కుక్కలతో పోల్చుకోకండి” అని ఊహించని చురక వేసింది. ఉక్రోషం పట్టలేక- వెంటనే విడాకులకు ప్రయత్నం మొదలెట్టాను. ఆమె బెదరలేదు. బ్రతిమాలలేదు. విడాకులకు తన వంతు సహకారం అందించింది. పెళ్లై రెండేళ్ళు తిరక్కుండా ఇద్దరం విడిపోయాం.

          ఆ తర్వాత ఇన్నేళ్ళకి ఈ రోజు వైజాగులో రామకృష్ణా బీచ్ వద్ద ఆమెని చూశాను.
నన్ను చూసింది కానీ గుర్తుపట్టినట్లు లేదు. కారణం ఊహించగలను. అప్పటి మీద కొంచెం లావెక్కాను. అప్పుడు మీసాల్లేవు. ఇప్పుడు పెంచాను. ఆ పైన నల్ల కళ్ళద్దాలు.
గీత ఈసురోమంటూ, చేసిన తప్పుకి పశ్చాత్తాపపడుతూ, దీనంగా, భారంగా- ఎక్కడో బ్రతుకీడుస్తూంటుందనుకున్నాను. కానీ, నాతో కాపురాని కొచ్చిన కొత్తలో ఉన్నంత ఉత్సాహంగా ఉంది.

          అప్పుడూ ఇప్పుడూ తను మెరుపుతీగే!

          ఏమిటి కారణం?

          ఆలోచిస్తున్నాను. అంతలో రెండు పాప్‌కార్న్ పొట్లాలతో అక్కడికొచ్చాడో యువకుడు. ఆమెకో పొట్లాం అందించి,

          “కూర్చుందామా?

          తిరుగుదామా?” అన్నాడు.

          కూర్చుందామన్నట్లు సైగ చేసిందామె.

          ఇద్దరూ కూర్చున్నారు దగ్గరదగ్గరగా.

          వాళ్లిద్దరి బాడీలాంగ్వేజిని బట్టి అతడామె భర్త అయుంటాడనుకున్నాను. మరి అంత సులభంగా ఆమెకి పెళ్ళి కుదిరిందా? అదీ మళ్ళీ పెళ్ళి!

          ఆ కృతఘ్నురాలిని, పొగరుబోతుని- ఆ చేసుకున్నవాడెలా భరిస్తున్నాడు? అతణ్ణి తేరిపారచూశాను. ఎక్కడో చూశాననిపించింది. అనిపించడమేమిటి- గుర్తు రావడానికి క్షణం పట్టలేదు. అంతే- ఉలిక్కిపడ్డాను.

          అతడు వాచస్పతి!

          నాలుగేళ్ళ క్రితం ఢిల్లీలో ఓ హొటల్లో అనుకోకుండా ఇద్దరం రూం షేర్  చేసు కున్నాం.

          అతడు కలుపుగోలు మనిషి, అరగంట పరిచయంలోనే ఆత్మీయులమైపోయాం.
అప్పటికతడు పెళ్ళి ప్రయత్నాల్లో ఉన్నాడు. నేను గీతకి విడాకులిచ్చి ఏడాదయింది.
ఆడాళ్ళంటే అసహ్యం, ద్వేషంతో రగిలిపోతున్నాను. పెళ్ళికి విముఖుణ్ణయినా- వయసు పోరు తట్టుకోలేక, ఆ సుఖాన్ని డబ్బుతో కొంటూ అదే బాగుందనుకుంటున్నా. ఆ విషయం అతడి బుర్రకీ ఎక్కించాలనుకుని, “నన్నడిగితే- ఆడదాన్ని ఆడదిగానే చేరదీ యాలి. భార్యగా ఆహ్వానిస్తే, అంతే సంగతులు. ఇది యథాలాపంగా అనడం లేదు” అంటూ నా పెళ్ళి ఎలా పెటాకులైందో చెప్పాను.

          వాచస్పతి వెంటనే, “అన్ని విషయాల్లోనూ ఇతరుల అనుభవాల్ని పట్టించుకో కూడదు. నేను పెళ్ళి చేసుకుంటాను. మగాణ్ణి మగాడిగాకాక భర్తగా ఆహ్వానించే అమ్మాయి కావాలి నాకు. కాబట్టి ఆడదాన్ని భార్యగానే తప్ప ఆడదిగా చేరదియ్యకపోవడం నాకు ధర్మం” అన్నాడు.

          కొట్టినట్లే చెప్పాడు. అయినా తమాయించుకుని, “మరి మీక్కావల్సిన అమ్మాయి నెలా గుర్తిస్తారు?” అనడిగాను.

          అతడు వెంటనే, “అది మీకర్థం కావాలంటే, నా కథ వినాలి” అన్నాడు.

          అతడికో మరదలుంది. బాగుంటుంది. చిన్నప్పట్నించీ ఆమే అతడి పెళ్లామనే వారు అటూఇటూ పెద్దలు. అతడూ అలాగే అనుకున్నాడు కానీ కాలేజిలో ఆమె తన క్లాస్‌మేట్‌తో కొన్నాళ్ళు ప్రేమ వ్యవహారం నడిపింది. కొన్నాళ్ళు కలిసి తిరిగేక, ఆ
అబ్బాయి లవ్‌కి బ్రేకప్ చెప్పేశాడు. ఆమె కృంగిపోలేదు. వాచస్పతితో పెళ్ళికి సిద్ధమని పెద్దలకు చెప్పింది.

          వాచస్పతి ఒప్పుకోలేదు. తనకి కాబోయే భార్య మనసులో తను తప్ప మరో మగాడుండకూడదన్నాడు.

          దానికామె, ‘నువ్వనేది నా ఎక్స్ గురించే కదా! వాణ్ణెప్పుడో మనసులోంచిచెరిపేశాను. ఇప్పుడు నా మనసంతా నువ్వే!’ అంది.

          వాచస్పతి నమ్మలేదు.

          ‘హిస్టరీ చింపేస్తే చిరిగిపోదు. చెరిపేస్తే చెరిగిపోదు’ అని ముళ్ళపూడి వారు అన్న సినీవ్యాఖ్యని అతడు సీరియస్‌గా తీసుకుంటాడు. “అది ముఖ్యంగా స్త్రీపురుషుల శారీరక సంబంధానికి పూర్తిగా వర్తిస్తుంది. ప్రేమించుకుని కొన్నాళ్ళు తిరిగేక- తర్వాత  విడి పోయినా, ఆ హిస్టరీ మాత్రం వాళ్ళ మెదళ్ళలో చెరగని ముద్రగా ఉండిపోతుంది. అలా జరగలేదంటే, ఆ హిస్టరీ ఊహకందనంత జుగుప్సాకరమై ఉండాలి. అది చాలా అరుదు. ఐనా నిజనిర్ధారణకు నా మరదల్ని నాలుగు రోజులు స్టడీ చేసి, ఆ హిస్టరీ ఆమె మెదడులో చెరిగిపోలేదని గ్రహించేకనే ఆమెని రిజెక్ట్ చేశాను” అన్నాడు వాచస్పతి.

          నేను నవ్వి, “అలా స్టడీ చేసి కన్ఫర్మ్ చెయ్యడానికి, మీరేమైనా సైకాలజిస్టా?” అన్నాను.

          వాచస్పతి కూడా నవ్వి, “మీకు తెలియదేమో! కావడానికి కంప్యూటర్ ఇంజనీర్నే కానీ, సైకలాజికల్ స్టడీ నాకు హాబీ. ఎవరితోనైనా పది నిముషాలు మాట్లాడేనంటే వాళ్ళ  మనసుల్లోంచి వాళ్ళకి తెలియని గుట్లు కూడా పసికట్టెయ్యగలను” అన్నాడు. నా గురించీ ఏమైనా పసికట్టాడా అని తడబడినా అంతలోనే సద్దుకున్నాను.

          వాచస్పతి లాంటివాళ్ళు కొందరు నాకు తెలుసు.

          ‘నేను బిర్యానీ చేస్తే- క్వాలిటీ ఫైవ్ స్టార్‌కి ఓ మెట్టు పైనే ఉంటుంది’ అంటుంది మా పెద్దమ్మ. ‘మనసు పెట్టి కథ రాయాలి కానీ, పోటీకి పంపితే ఫస్ట్ ప్రైజ్ నాకే’ అంటాడు రెండో మూడో కథలు ప్రచురించిన నా ఫ్రెండొకడు.
అవి బడాయిలని నాకు తెలుసు.

          వాచస్పతి హాబీ, ప్రతిభా అలాంటి బడాయేననుకుని- “ఐనా దీనికి సైకలాజికల్ టెస్టులు అవసరమా? కామన్ సెన్సు చాలదూ” అన్నాను.

          వాచస్పతి నవ్వేసి, “నాకైతే చాలదు” అన్నాడు.

          ఆ సైకాలజిస్టు వాచస్పతి- చివరికి పెళ్ళి చేసుకున్నది గీతని! ఆ గీత ఇష్టంగా కొన్నాళ్ళూ, అయిష్టంగా మరికొన్ని నెలలూ నాతో కాపురం చేసింది. విడిపోయినా ఆ హిస్టరీ నా మెదడులోంచి చెరిగిపోలేదు. గీత మెదడులోంచీ చెరిగిపోతుందనుకోను.
అది వాచస్పతి టెస్టుల వైఫల్యమో, ఆమె జాణతనమో- ‘మనసంతా నువ్వే’నని అతణ్ణి నమ్మించగలిగింది!

          అతణ్ణి చూస్తే మహా హుషారుగా ఉన్నాడు. ముఖంలో నామ మాత్రంగా నైనా దిగులు లేదు. అదలాగుంచితే, గీత కూడా ఆనందోత్సాహాలకు మారుపేరులా ఉంది. 

          నాలో అసూయాగ్ని రగిలిపోదూ!

          వాళ్ళ పెళ్లై ఎన్నాళ్ళయిందో! గీత గతం గురించి అతడికి తెలుసో లేదో! తెలిసుండ దనే అనిపిస్తోంది. వెంటనే వాచస్పతికి ఆమె గతం చెప్పాలనీ ఉంది. కానీ ఆమె ముందే చెబితే, నేను ఏవన్ విలన్ ఐపోతాను. అది నాకిష్టం లేదు. అందుకే వాచస్పతి ఒంటరిగా దొరక్కపోతాడా అని చూస్తున్నాను.

          నా సంకల్పబలమో ఏమో- ఉన్నట్లుండి ఎక్కణ్ణించో ఒకామె వచ్చి, “హాయ్ గీతా!” అంది. ఆ వెంటనే, “ఏమనుకోకండి గీతాపతిగారూ! ఒక్క పది నిముషాలు గీతని నా కొదిలేయాలి. పెర్సనల్” అంది వాచస్పతితో. 

          వాళ్ళిద్దరూ కొంచెం దూరం వెళ్ళగానే నేను వాచస్పతిని సమీపించి, “మీరు వాచస్పతి కదూ! వాటే సర్ప్రయిజ్!” అన్నాను.

          అతడూ ఆశ్చర్యపడ్డాడు.

          ఇద్దరూ పాత పరిచయాన్ని పునరుద్ధరించుకోవడంలో- అప్పటి హొటల్ సంభాషణ ని స్మరించుకున్నాక, “గీత మీ భార్యా?” అన్నాను. గీత అనడంలో ధ్వనించిన చనువుని బట్టి, “ఔను. మా పెళ్లై రెండేళ్ళు దాటింది.

          గీత మీకు తెలుసా?” అన్నాడు.

          “ఆ విషయం తర్వాత చెప్తాను కానీ, ముందు నాకిది చెప్పండి. పెళ్ళి విషయంలో ఆమె మీ సైకలాజికల్ టెస్టులు పాసయిందా లేక మీరే కాంప్రొమైజ్ అయ్యారా?”అన్నాను.

          “నేనా, కాంప్రొమైజా, నెవ్వర్!” అన్నాడతడు.

          “పోనీ పెళ్ళయ్యేక, ఆర్యూ రియల్లీ హాపీ విత్ హెర్! ఇలా అడిగేనని ఏమనుకోవద్దు. పెళ్ళి విషయంలో ఫెయిలైన మగాడిగా జస్ట్ క్యూరియాసిటీ, అంతే!” అన్నాను.

          “హాపీయా! ఇప్పటికీ ఐయామ్ ఆన్ క్లౌడ్ నైన్! ఆమె నా కోసం దివి నుంచి భువికి దిగొచ్చిన దేవత. ఆమె లేకుండా ఇన్నేళ్లేలా బ్రతికానా అని ఆశ్చర్యపోతుంటాను. ఇక ముందు ఆమె లేకుండా బ్రతగ్గలనా అని భయం….” 

          తెల్లబోయాను, “అలా అనిపించడానికి కారణం?” అడిగాను.

          “ఏముంది? నాకేమవసరమో, ఏది అనవసరమో- నా కంటే తనకే బాగా తెలుసు. నా కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు నా నిర్ణయాల కంటే గొప్పగా ఉంటాయి. మరో విషయం. ఆడది ఒంటరిగా బ్రతలేరనుకుంటామే, ఆ అభిప్రాయం తప్పు. నిజానికి మగాడే ఒంటరిగా బ్రతకలేడు. బాల్యంలో తల్లి, ఆ తర్వాత భార్య- అతడికి తోడై ధైర్యాన్ని స్తారు. గీత నాకిప్పుడు మరో అమ్మ!” అన్నాడు వాచస్పతి.

          ఇదో కొత్త థియరీలా ఉంది. “మరి భర్త గురించిన నిర్ణయాలు భార్య తీసుకుంటే, ఆ భర్తకి అహం దెబ్బ తినదా?” అన్నాను.

          “తినకూడదు. కానీ తింటుంది. అందుకని ప్రతిఘటిస్తాడు. వయొలెంటు కూడా ఔతాడు. అలాంటప్పుడు భార్య అతడికి తెలియకుండా, నేర్పుగా తన నిర్ణయాన్నే అతడి నిర్ణయంగా నమ్మించి, అతడి అహాన్ని కాపాడుతుంది. ఏం చేసినా అతడికోసమే తప్ప తనకోసం కాదు”

          “ఐతే- ఇది తెలిసి కూడా మీరు మీ భార్య నిర్ణయమే మీ నిర్ణయమని సరిపెట్టు కుంటున్నారా?” అన్నాను.

          “లేదు. గీత పూర్తిగా వేరు. తను ముక్కుసూటి మనిషి. పైగా ఆత్మవిశ్వాసం ఎక్కువ. అదున్నవాళ్ళు ఎదుటివాళ్ళ అహాన్ని పట్టించుకోరు. ఆమెలో నాకు నచ్చింది ఆ ఆత్మ విశ్వాసమే!” అన్నాడు వాచస్పతి.

          నేనొచ్చిన పనేమిటి, జరుగుతున్నదేమిటి? అదేమిటో, అతడేం చెప్పినా, అది నన్నే గుచ్చుతోంది. ఇక లాభం లేదనుకుని, “ఇంతకీ గీతకి ఇదివరకే పెళ్ళయిందనీ, భర్తతో రెండేళ్ళు కాపురం చేసిందనీ మీకు తెలుసా?” అన్నాను.

          షాక్ తింటాడనుకున్నా. కానీ, “తనకిదివరకే పెళ్ళయిందని తెలుసుకానీ, ఆ భర్తెవరో నాకు తెలియదు. తెలిస్తే అతణ్ణి కలుసుకుని, ‘నువ్వు విడాకులివ్వడం వల్లే గీత వంటి దేవత నాకు దక్కింది బ్రదర్’ అని కాళ్ళ మీద పడాలనుంది” అనేసి నాకే షాకిచ్చాడు.
తేరుకోవడానికి కాసేప్పట్టింది. అప్పుడు, “అంతగా మీకతణ్ణి కలుసుకోవాలనుంటే, ఆమె నడిగితే చెప్పేదిగా!” అన్నాను.

          “తనకిది రెండోపెళ్లి అన్న విషయం, వాకబులో ఇతరుల ద్వారా తెలిసింది నాకు. తనకైతే ఆ పెళ్ళే గుర్తులేదు. ఇప్పుడామె మనసంతా నేనే కదా! ఆ హిస్టరీ మొత్తం చెరిగి పోయుంటుంది” అన్నాడు వాచస్పతి గర్వంగా.

          ఒక్కసారి గీత నన్ను చూస్తే, అతడి గర్వం ఎగిరిపోతుందని తెలుసు. ఎంత నటించినా ఒకప్పటి మా సాన్నిహిత్యం ఆమె కళ్ళలోనైనా ప్రతిఫలించి తీరుతుంది మరి!

          ఫ్రెండ్సుతో కబుర్లయినట్లున్నాయి- గీత వచ్చింది.

          వాచస్పతి నన్నామెకు పరిచయం చేసి, “ఇతడు నీకు నాకంటే ముందే తెలుసను కుంటాను” అన్నాడు కుతూహలంగా.

          ఆమె నన్ను పరీక్షగా చూసి, “తెలియడానికి నా ఫ్రెండైతే కాదు. నీ ఫ్రెండైతే నువ్వెప్పుడూ పరిచయం చేసిన గుర్తు లేదు” అంది.

          అప్పుడామె కళ్ళు చూస్తే- ఆమె మెదడులో నాది పూర్తిగా చెరిగిపోయిన హిస్టరీ అని గ్రహించడానికి- సైకాలజిస్టునే కానవసరం లేదు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.