కథా కథనం ఒక ప్రదర్శన కళ (కె. గీత వీమా కథ పై పరామర్శ)

  -ఎ. కె. ప్రభాకర్

 

          ఇక్కడ చాలా మంది కథను చదివారు, ఇప్పుడు విన్నారు.  కానీ నేనైతే చూశాను. గీత ముఖంలో ప్రతిక్షణం కదలాడిన ఫీలింగ్స్,  వాటి వ్యక్తీకరణ రీతి, చదివేటప్పుడు గొంతులో వినిపించిన ఉద్వేగం, మాటల్లో యెక్కడయెంత అవసరమయితే అంత వూనిక, ఆ మాట వైఖరి … యిలా యిదంతా ఒక పెర్ఫార్మెన్స్. ఇప్పుడయితే మనం కథ చదువు కుంటున్నాం గాని, కథ మౌలికంగా ఒక ప్రదర్శన కళ. అందుకే కథను చూశాను అనడం. చిన్నప్పుడు అమ్మ, అమ్మమ్మలు  చెప్పినప్పుడు కథలు విన్నాం. అయితే వాటికీ యీ కథకీ తేడా వుంది. అవి మౌఖిక కథలు. ఇది లిఖిత కథ. లిఖిత కథను మనం వింటు న్నప్పుడు కథలోని వివిధ పార్శ్వాలు రూపుకడతాయి. ఆయా పాత్రల స్వరూప స్వభావాల చిత్రణ కావచ్చు, హావభావాల వర్ణన కావచ్చు, సంభాషణలు ఉచ్చరించే విధానంకావచ్చు ఉద్వేగానుగుణంగా వుండే అందులోని ఆర్టిక్యులేషన్ కావచ్చు, ఆ పాత్రల గొంతుకలో పలికే యాసలు కావచ్చు కథనాన్ని రక్తి కట్టిస్తాయి. ఇదంతా శాస్త్రం. యాస అంటే ప్రాంతీయమో సామాజికమో మాత్రమే కాదు. ప్రతి వ్యక్తికీ ఒక డైలెక్ట్ వుంటుంది. దాన్ని భాషా శాస్త్రంలో వైయక్తిక వాగ్భేదం (idiolect) అంటారు. అది వ్యక్తిగతమైన వాగ్వ్యవహారం. ఏ యిద్దరు వ్యక్తులకూ ఒకేలా వుండదు. కథలో సాగర్ ఒకలా, సుమ ఒకలా, వీమా ఒకలా, డాక్టర్స్ ఒకలా, కౌన్సిలర్లు ఒకలా, సైకాజిస్ట్ ఒకలా మాట్లాడుతూ వుంటారు. ఈ మాటలన్నీ యివాళ వినగలిగాం, ప్రదర్శన రూపంగా చూడగలిగాం, వైవిధ్యాన్ని ఆస్వాదించగలిగాం. వాళ్ళందరూ గీత కథనం ద్వారా బొమ్మకట్టి నాకు కళ్ళముందు సాక్ష్యాత్కరించారు. ఆడియో వీడియో సాంకేతికత ద్వారా  లిఖిత కథని మౌఖికం చేయడం యిటీవల యెక్కు వైంది. అచ్చు యంత్రం వచ్చాకా మౌఖిక కథ లిఖితమైన కారణంగా కథా నిర్మాణంలో మార్పులు వచ్చినట్టు ముందు ముందు ‘ప్రదర్శన కోసం వీక్షకుల్ని/శ్రోతల్ని వుద్దేశించి రాసే’ కథల్లో రూపపరమైన మార్పులు వస్తాయేమో, మిశ్ర మౌఖిక/లిఖిత పాఠ్యం కొత్తగా రూపొందుతుందేమో; చూడాలి. ఇది కథకి సంబంధించిన రూప చర్చ.

          ఇప్పుడిక ‘వీమా’ కథలోకి వెళదాం. ఇది కథ. ఇది కథేనా? ఇది కథ అనేదిస్టేట్మెంట్. ఇది కథేనా అనేది ప్రశ్న. ఈ రెండూ నాలోనే పుట్టాయి. కథకి కావలసిన లక్షణాలుయేంటి, అవి యీ కథలో యెలా చోటుచేసుకున్నాయి అనేది నేను ఒక పాఠకునిగా/శ్రోతగా  మాట్లాడతాను. అప్పుడు నా ప్రశ్నకి సమాధానం కూడా దొరుకుతుందేమో!

          ‘వీమా’ కథ చదువుతున్నప్పుడు, గీత చెబుతున్నప్పుడు ముందుగా డా. వి. చంద్రశేఖర రావు రాసిన ‘జీవని’ కథ గుర్తుకు వచ్చింది. అదే మొదటిసారి నేను డౌన్ సిండ్రోమ్ వస్తువుతో కథ చదవడం. ఆ కథలో తల్లితండ్రులు యిద్దరూ, బిడ్డ విషయంలో, ఆమె పేరు జీవని, యిటు వంటి సంఘర్షణకే గురి అవుతూ వుంటారు. నిజానికి యింకా భయంకరమైన సంఘర్షణకి గురి అవుతారు. ఇక్కడ, యీ ‘వీమా’ కథలో తల్లి చాలా దృఢంగా, స్ట్రాంగ్ గా, బేలెన్స్ డ్ గా ఉంది. ప్రతి క్లిష్ట సందర్భాన్ని ఆమె స్థైర్యంగా యెదుర్కొంది. బిడ్డ పెంపకంలో భర్త చాలా అనుకూలంగా చేదోడు వాదోడుగా వున్నాడు. ఇంతకు ముందు కథ చదవగానే యెవరో శ్రోత యిది యెందరో తల్లులకు ‘కనువిప్పు’ అన్నారు. ఇది చాలా మంచి మాట. ఇటు వంటి తల్లులకేనా, యిటు వంటి తండ్రులకేనా కనువిప్పు? ఇటు వంటి తల్లితండ్రులకే కాదు, కౌన్సిలర్లకీ, స్పెషల్ స్కూళ్ళలో పనిచేసే ఎడ్యుకేటర్స్ కి కూడా యిది కనువిప్పు. డౌన్ సిండ్రోమ్ వున్న పిల్లల పట్ల మొత్తం సమాజం వ్యవహరించాల్సిన తీరుకి ఒక చక్కటి పాఠం. కథకి అనేక పార్శ్వాలున్నాయి. ఇతివృత్త నిర్వహణలో సమస్యలున్నాయి. ప్రధానంగా, ఇటు వంటి కథలు రాసేటప్పుడు సమాచారాన్ని యివ్వడం ఒక ఛాలెంజ్. ‘జీవని’ కథ రచయిత వైద్యవిద్య అభ్యసించిన డాక్టర్ కాబట్టి సమాచారాన్ని యివ్వడానికి యిబ్బంది కలగలేదు. కానీ ఇక్కడ, రచయితకి అంతా కొత్తే. ప్రతీదీ అనుభవం ద్వారా ప్రయోగం ద్వారా తెలుసుకున్నదే. డౌన్సిండ్రోమ్ అంటే యేంటి? డౌన్సిండ్రోమ్ వున్న పిల్లల లక్షణాలు యేంటి? డౌన్సిండ్రోమ్ ఉన్న పిల్లలు యెలా ప్రవర్తిస్తారు? వారి మానసిక శారీరక బౌతిక అవసరాలు యేంటి? వాళ్ళ యిబ్బందులు యేంటి? ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా యెదుర్కోవాలి? తల్లితండ్రులు యేం చేయాలి? అనేది పేరెంటింగ్ సమస్య, ఇది చాలా క్లిష్టమైన అంశం. వాటికి సంబం ధించిన  సమాచారాన్నంతా రచయిత కథలోకి చాకచక్యంగా తీసుకువచ్చారు. ఈ వివరాలు అన్నీ ఆమె ఒకేసారి ఇవ్వలేదు. టైం టు టైం  వివిధ సన్నివేశాల్లో కథలో గర్భితం చేస్తూ చెప్పుకుంటూ వెళ్ళారు. మొత్తం సమాచారాన్ని ఒకేసారి యిస్తే అది సమాచారాన్ని గుప్పించినట్లో, కుప్పబోసినట్టో అవుతుంది, కథని చదవడం/వినటం బరువుగా తయారవుతుంది. కథ వ్యాసంగానో ఉపన్యాసంగానో పరిణమించే ప్రమాదం వుంది. అలా చేయకుండా కథ పొడవునా సందర్భోచితంగా ఆ సిండ్రోమ్ సంబంధించిన అన్ని విషయాల్నీ, శాస్త్రీయమైన విషయాల్ని కూడా (ఉదా. డౌన్ సిండ్రోమ్ కి కారణాలు, ట్రైసమీ 21, 23 జతల క్రోమోజోములు దగ్గర నుంచి జన్యుపరమైన వైద్యపరిభాషకు సంబంధించిన అనేక విషయాలు) యెక్కడా విసుగు కలిగించకుండా పాఠకులకి చెప్పడం గొప్ప. గమనించాల్సిన సంగతి యేమిటంటే, ఇది స్వీయ జీవిత అనుభవం కాబట్టి చెప్పడంలో వెసులుబాటు వుంటుంది. చాలా యిబ్బంది కూడా వుంటుంది. ప్రతి జీవిత అనుభవం కథ అవుతుందా? కథకి కావలిన లక్షణాలు యేమిటి? సమాచారం వ్యాస రూపంగా మారకుండా వుండడానికి రచయిత అనుసరిస్తున్న వ్యూహం యేమిటి? పాటిస్తున్న శిల్పం యేమిటి? తన జీవిత అనుభవాన్ని ఒక డైరీలా ఆవిష్కరిస్తున్నారా? మూడో వ్యక్తిగా తటస్థంగా చెబుతున్నారా? కథ యెవరు యెవరికి యెలా చెప్తున్నారు? కంఠస్వరం ఎవరిది? ఇవన్నీ కథా నిర్మాణంలో పరిగణనలోకి వస్తాయి. వీమా తల్లిదే కంఠస్వరం. తల్లి వైపు నుంచే చెప్పిన కథ. అయితే  ఎవరి కథ? పాపదా? తల్లిదా? కాదు.  పాప యెదిగిన క్రమంలో తల్లి యెదుర్కొన్న ట్రోమా, దు:ఖం … (ఒక సందర్భంలో పాప ఆయుష్షు యెంత అని డాక్టర్ ని అడగాల్సిన చేదు వాస్తవం గుండెను పిండేస్తుంది) వాటిని అధిగమించిన సంతోషం .. యిలా అన్ని రకాలైన వుద్వేగాలు కథలో భాగ మయ్యాయి. పాఠకులకు కథని దగ్గరచేశాయి.

          ఒక స్వీయ జీవిత అనుభవం కానీండి, సమాచారం కానీండి, కథగా మారాలంటే అనేక కథాంగాలు అవసరమౌతాయి. కేవలం సమాచారం యిచ్చినా, జీవితాన్ని యథా తథంగా చెప్పినా అది  కథ కాదు. అది కేవలం వాస్తవం. వాస్తవాన్ని కథీకరించడానికి, వాస్తవాన్ని సాహిత్యీకరించడానికి, కళగా మార్చడానికి యెన్నో దినుసులు అవసరమవు తాయి. కొన్ని ఉద్వేగాలు, సంఘటనలు, సన్నివేశాలు, సంభాషణలు, పాత్రలు, సంఘర్షణలు అవసరమవుతాయి. ఇవి చాలా ముఖ్యమైనవి. డా.వి.చంద్రశేఖర రావుకి వెసులుబాటు యేమిటంటే అతను తన సొంత కథ చెప్పలేదు. ఒక డాక్టరుగా ‘తటస్థుడి’ గా తానెరిగిన జీవితానికి కొంత కాల్పనికతని జోడించి కథని నిర్మించాడు. తన పాత్రలకి దూరంగా వుండి వాటిని తీర్చిదిద్దగలిగాడు. కానీ యీ కథలో రచయితే ప్రధాన పాత్ర. చంద్రశేఖరరావు కథ రాసింది 1991లో. అంటే ఇప్పటికి దాదాపు 32 సంవత్సరాలు పూర్వం. ఆ రోజుకీ యీ రోజుకీ  డౌన్ సిండ్రోమ్ పిల్లల్ని పెంచడంలో యెన్నో మార్పులు  వచ్చాయి. కుటుంబంలో సమాజంలో వాళ్ళ పట్ల వ్యవహరించే తీరు మారింది. కొత్తగా శాస్త్రం, వైద్యం అభివృద్ధి  చెందిన తరువాత అందుబాటులోకి వచ్చిన అవకాశాలు యేంటి? ఇండియాలో వున్న తల్లితండ్రులకీ అమెరికాలో వుండే తల్లితండ్రులకీ బిడ్డల పెంపకంలో ఉత్పన్నమయ్యే సమస్యలు యేంటి? ఇవన్నీ పరిగణనలోకి వస్తాయి. ‘వీమా’  కథా నేపథ్యం అమెరికా; అందులోనూ కాలిఫోర్నియా. డౌన్ సిండ్రోమ్ వున్న పిల్లల పెంపకంలో స్థానికంగా వున్న చట్టాలు ప్రభుత్వం కల్పించే సదుపాయాలు యివన్నీ కథలోకి అలవోకగా వచ్చి చేరాయి. రచయితకి కథను యింత చక్కగా అల్లటం యెలా సాధ్యమయింది? అంటే యిది ఆమె అనుభవ గాఢతలోంచి రూపుదిద్దుకున్న కథ. ‘ఎడా పెడా కవిత్వం వ్రాసే’ గీతకి, అప్పుడప్పుడు కథలు రాసే గీతకి యీ అల్లిక విద్య  (knitting /fabrication) యెలా అలవాటు అయ్యిందంటే, నాకు ఆమె రాసిన ‘సిలికాన్ లోయ సాక్షిగా’ కథలు గుర్తుకు వచ్చాయి. అందులో కూడా స్వీయ జీవిత అనుభవాలకి కొంత కాల్పనికతని జోడించడం ద్వారా వాస్తవం సాహిత్య రూపం ధరిస్తుంది. కానీ యిక్కడ యీ కథలో ఒక్క అక్షరం కూడా కాల్పనికతకి  చోటు లేదు. అది ప్రధానంగా గమనించాల్సిన  అంశం. కఠోర జీవన వాస్తవికతను చెప్పడం చాలా కష్టం. వాస్తవం, డైరీ, సమాచారం వాటికవే కథలు కావు అని చెప్పుకున్నాం, కానీ స్వీయ జీవితానుభవంలో సైతం ఉద్వేగా లుంటాయి, సంఘర్షణ ఉంటుంది కదా అంటే నిజమే. ఆత్మకథ వేరు. ఆత్మకథాత్మక కాల్పనిక రచన వేరు. బయోగ్రఫీని బయోగ్రఫికల్ ఫిక్షన్ గా మార్చడానికి, దాన్ని సాహిత్యికరించడానికి కాన్షియస్ ఎఫర్ట్ పెట్టారు రచయిత. కథలో పాత్రగా లీనమౌతూనే తాటస్థ్యం వహించడానికి గొప్ప సంయమనం అవసరం. ఆ సంయమనం రచయితలో ఉందని గీత కథ చదువుతున్నప్పుడు చూడగలిగాం. తన నుంచి తాను విడిపోయి తన పాత్రకు తనకూ సమదూరం పాటిస్తూ రచయిత చేయాల్సిన/చేసిన అభ్యాసం చిన్నదేం కాదు.

          బిడ్డ కడుపులో పడినప్పట్నుంచి 10 ఏళ్ళు వచ్చేవరకు కథ నడుస్తుంది. గీత యీ కథని గత 10 ఏళ్ళుగా రాస్తున్నారనుకుంటా. ఇది గత 10 ఏళ్ళగా ఆమెలో నలుగుతున్న కథ, బయటికి చెప్పుకోవలసినటు వంటి కథ, బయటికి ఎలా చెప్పాలో తెలియనటువంటి కథ. ఇంకోటి, ఏ రూపంలో చెప్పాలి అన్నది పెద్ద ప్రశ్న. ప్రయోగం చేయవచ్చు. ఇప్పుడు ఈ కథ అంతా సుమ (బిడ్డ తల్లి) వెర్షన్ లోనే వుంది. సాగర్ వెర్షన్ వేరే వుంటుంది. దాదాపు గంటసేపు నడిచింది గీత కథనం. చాలా పెద్ద కథ. ఇది చదివినంత సేపు, వింటున్నంత సేపు దీన్ని నవలగా రాస్తే బాగుండును అనే ఆలోచన వచ్చింది. నవలకు కావలసినంత 10 సంవత్సరాల జీవితాన్ని, యింత సమాచారాన్ని, ఎర్లీ స్టార్ట్, ప్రీస్కూల్, కిండర్ గార్టెన్  స్కూల్ యీ ప్రాసెస్ అంతా చెప్పడం వొక యెత్తైతే, ఆ బిడ్డకి ఏర్పడే సమస్యల్ని చెప్పటం, ఆ బిడ్డని అర్థం చేసుకోవడంలో తల్లిగా ఆమె పడే వేదనని చెప్పడం మరో యెత్తు. బిడ్డ పెంపకంలో తండ్రి యేమనుకొంటున్నాడు, సాగర్ వెర్షన్ యేమై వుంటుంది? యిది నన్ను ఆలోచింపచేసిన విషయం. అతని వైపు నుంచి మరో కథనం నడపొచ్చు. అప్పుడు యిద్దరి అంతరంగాలూ వ్యక్తమౌతాయి. కథ బలం యెక్కడ వుందంటే, సంఘర్షణలో వుంది. సంఘర్షణ లేకుంటే యిటువంటివి కథలుగా మారవు. సంఘర్షణ మొట్టమొదటిగా ఆ బిడ్డను ఉంచుకోవాలా లేదా అనే దగ్గర మొదలయింది. ఇక్కడ రెండు సంఘర్షణలు యేర్పడవచ్చు. ఒకటి: సుమ  తనలో తాను పడే సంఘర్షణ, రెండు: భర్తకి, ఆమెకి మధ్యన. బిడ్డని ఉంచుకుందామని ఆమె, వద్దని భర్త, లేదా vice versa. ఇలా సంఘర్షణ క్రియేట్ చేయవచ్చు. జీవని కథలో అలా ఉంది. బిడ్డ పుట్టిన తరువాత యెదుర్కొనే సవాళ్ళలో కూడా సంఘర్షణ వుంటుంది. ఈ కథలో అది బాగా ఎస్టాబ్లిష్ అయింది. నాకు డా. ధేనువకొండ శ్రీరామమూర్తి (ఈయన ఆయుర్వేద వైద్యుడు) రాసిన మరో కథ గుర్తొచ్చింది, ఆ కథ పేరు: ‘చిగురించని శిశిరం’. పుట్టేటప్పుడు బిడ్డ మెదడుకి సరిగా ఆక్సిజన్ అందకపోవడం వల్ల వచ్చే బుద్ధిమాంద్యానికి సంబంధించిన కథ. అది తండ్రి తరపున చెప్పినటు వంటి కథ. ఇక్కడ తల్లి తరపున చెప్పిన కథ. అక్కడ అత్తగారి కి ఆ బిడ్డ అంటే ఇష్టం లేదు. ‘జీవని’ కథలో తండ్రికి ఆ బిడ్డంటే ఇష్టం ఉండదు, ఆ బిడ్డ పెరిగి పెద్దదై స్కిల్స్ డెవలప్ చేసుకొని మంచి చిత్రకారిణిగా మారినప్పుడు, ఆ బిడ్డ నాది అంటాడు, అంత వరకు దెయ్యం పిల్ల అని ప్రక్కకు త్రొసేసిన జీవని తండ్రి. (ఇటీవలే స్వయంసిద్ధ ఒంటరి స్త్రీల గాథలు సంకలనం కోసం డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి డౌన్ సిండ్రోమ్ తో బిడ్డ పుట్టిన కారణంగా భర్త వొదిలి వేస్తే ఆ బిడ్డని పెంచడానికి ‘ఒంటరి పోరాటం’  చేసిన తల్లి వాస్తవ జీవితాన్ని సంఘర్షణా భరితమైన కథగా మలిచారు).‘వీమా’  కథలో పుట్టక ముందు చోటుచేసుకున్న సంఘర్షణ వుంది. కానీ దాని రూపం భిన్నమైంది. కడుపులో బిడ్డ యెదుగుదల తెలుసుకునే ‘ఆమ్నియోసింటసిస్’ టెస్ట్ చేయించుకోవాలా వద్దా, ఒకవేళ ఏదైనా లోపం బయటపడితే బిడ్డను వుంచుకోవాలా లేదా అన్న మరో సంఘర్షణ. కానీ రచయిత దాన్ని పూనికతో నివారించారు. అందువల్ల ‘వీమా’ కథ ప్రధానంగా పేరెంటింగ్ కేంద్రంగా నడిచింది. బిడ్డ పెరిగే క్రమంలో సాగర్ ఆమెని బయటకు తీసికెళ్ళడానికి, నలుగురిలో తిరగడానికి కించపడుతూ ఉంటాడు. బర్త్ డే పార్టీలకి వద్దంటాడు, అదో సంఘర్షణ. ఈ సంఘర్షణలు నవలలో అయితే ఇంకా విడ మరచి elaborate గా చూపించవచ్చు.

          నిజానికి కథ రాయడం చాలా కష్టం (ఈ మధ్య ఒక ప్రసిద్ధ రచయిత నవల రాయడం ఈజీ, కథ రాయడం చాలా కష్టం అన్నాడు). కథకి  బ్రీవిటీ  కావాలి, పాఠకులను కట్టిపడేసే బిగువు కావాలి, అతి తక్కువ స్థల కాలాల్లోనే ఇతివృత్త నిర్వహణకు  వొక వాతావరణాన్ని క్రియేట్ చేయాలి, ప్రతి మూడ్ ని చిత్రించాలి, మూడ్ కి  అనుగుణమైన వాతావరణాన్ని యేర్పరచాలి. కథలో రచయితకి సంచారం తక్కువైన కొద్దీ పాఠక సంచారానికి అవకాశం యెక్కువౌతుంది. వీమా కథలో హాస్పిటల్ వాతావరణం వేరు, ఎర్లీ స్టార్ట్ వాతావరణం వేరు, ప్రీస్కూల్ వాతావరణం వేరు, కిండర్ గార్టెన్ వాతావరణం వేరు, ఇంటి వాతావరణం వేరు. వాటితో పాటు మనసులో వున్నటు వంటి భావాలకు అనుగుణం గా అంతరంగ వాతావరణ చిత్రణ, తల్లిదండ్రులు హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు అక్కడ మోడువారిన చెట్టు వర్ణన, ఇంటి దగ్గర అత్తగారు తిట్టేప్పుడు మరొక సన్నివేశ కల్పన.. ఇలా యివన్నీ పాఠకులకు భావనామాయ ప్రపంచ సంచారానికి అవకాశం కల్పిస్తాయి. రచయిత్రి ఆయా సందర్భాల్లో కూడా ఒక సున్నితమైన రొటీన్ సంఘర్షణ చూపిస్తూ కూడా సమాచారాన్ని అందిస్తుంది. ఉదాహరణకి: అత్తగారి మాటల్లో 35 యేళ్ళు వచ్చే వరకు బిడ్డలు వద్దనుకున్న విషయంలో కోడలిని యెత్తిపొడుస్తుంది. ఎందుకొచ్చిందీ మాట అంటే వయసు మీరిన తర్వాత ఆలస్యంగా పుట్టే బిడ్డలు డౌన్ సిండ్రోమ్ తో పుట్టే అవకాశం వుంది. ఇదొక శాస్త్రీయ సమాచారం. దాన్ని యథాలాపంగా చెప్పినట్టు సంభాషణలోకి చొప్పించారు రచయిత (రచయిత 18 పేజీల కథ రాస్తే డౌన్సిండ్రోమ్ గురించి యిటు వంటి వివరాలు తెలుసుకోడానికి నేను 180 పేజీలు చదువుకోవలసి వచ్చింది. పాఠకులకు పని పెట్టడం అంటే యిదే. నవలలో సాధారణంగా ఆ బాధ్యత  రచయితే తీసుకుంటుంటారు). ఎప్పుడో మణిరత్నం అంజలి కమలహాసన్ స్వాతి ముత్యం అలాగే స్పెషల్ చిల్డ్రన్ కి సంబంధించినటు వంటి ఆమేర్ ఖాన్ తారె జమీన్ పర్ లాంటి సినిమాలు చూశాం గానీ యీ సబ్జెక్టు మీద మనకున్న ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ. అంటే ఇన్ఫర్మేషన్ యివ్వాలి, దానితో పాటు ఉద్వేగాలని బేలన్స్ చేస్తూ నడపాలి కథ. అదీ ఈ కథ రాయడంలో రచయితకున్న మరో పెద్ద సమస్య. కథ పొడవునా అనేక ఉద్వేగాలు వున్నాయి. కథ మొదలయ్యేటప్పుడు సాగర్ ఉద్విగ్నతతోనే ప్రారంభం అయింది. ఆత్మాశ్రయంలో నడిచిన కథ కదా ఇది, ఉత్తమపురుషలో నడుస్తు న్న కథలో ఉండే యిబ్బంది యేమంటే, తన గురించి చెప్పుకోగలరు గాని పరోక్షంలో జరిగే ఘటనల్నీ, యెదుటివాళ్ళ మనసులోని ఆలోచనలనీ చెప్పలేరు కదా! కానీ మొట్ట మొదట్నుంచీ సాగర్ ఇలా, సాగర్ అలా .. అన్న ప్రస్తావన ప్రయత్నపూర్వకంగా వస్తూనే వుంటుంది. కథ నుంచి సాగర్ ప్రక్కకు తప్పుకోలేదు. అతని వేదన, దాన్నుంచి బయటపడటానికి ఆఫీసులో యెక్కువసేపు గడపటం, తరువాత కౌన్సిలింగులకు పోక పోవడం, సామాజికమైన సంబంధాలకు దూరంగా తప్పించుకోవడం .. వీటన్నిటినీ సుమ అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తుంది. బిడ్డ పెంపకంతో బాటు ఫేమిలీ రిలేషన్ ని కాపాడు కోవడం అన్న మరో అదనపు భారం ఆమెకు వున్నప్పటికీ తన వేదన చెప్తూ, సాగర్ వేదన చెప్పడం, సాగర్ కి తనకి మధ్య వున్నది సంఘర్షణని మించిన సహభావనే అని తెలియ జేయడానికే అనుకోవాలి. రచయిత ఉద్దేశ పూర్వకంగానే యీ టెక్నిక్ ని ఆశ్రయించి నట్టున్నారు. ఈ కథని మరింత విస్తృతపరిస్తే భర్తకి తల్లికి మధ్య ఘర్షణ జరగొచ్చు. పాపకి తల్లికి కూడా ఘర్షణ జరగొచ్చు, బిడ్డని అర్ధం చేసుకోవడంలో తల్లి, తల్లిని అర్ధం చేసుకోవ డంలో బిడ్డ, అంటే తల్లి కథనం, తండ్రి కథనం, పాప కథనం కావాలి; కానీ చెప్పలేదు. ఇది పాపే చెప్పాలి. అయితే రచయిత పాప కథనం కూడా చెప్పొచ్చు. ఈ కథను నవలగా చేస్తే, టెక్నిక్ గా అయితే, సుమ కథనం సుమ చెప్పుకుంటుంది. తండ్రి కథనం సాగర్ చెప్పుకుంటాడు. పాప కథనం కూడా, తన భాషలో, చెప్పుకుంటూ వెళ్లొచ్చు. 10 సంవత్సరాలు కదా, పాప యెదిగిన తరువాత ఆమె ఆలోచన్లు యెలా వుంటాయో, తల్లికి చెప్పలేక పోవడం, తల్లి అర్థం చేసుకోక పోవడం, ఏడవటం, కోపించడం, ఉద్విగ్నురాలు కావడం …  ఇలాంటివేవో వుంటాయి కదా! అవి వూహించి చెప్పొచ్చు. అప్పుడు మరింత పెద్ద కాన్వాస్ అవసరమౌతుంది.

          ఈ కథలో పెద్ద విశేషం యేమిటంటే, కథ నడిచే క్రమంలో ప్రీ స్కూల్లో గాని, యితరత్రా గాని వీమా లాంటి బిడ్డల తల్లిదండ్రులతో ఇంటరాక్షన్ యేర్పడుతుంది. వాళ్ళ సంభాషణలతో కథ వైయక్తిక తలం నుంచి సామాజిక తలంలోకి పయనించింది. అప్పుడు కథ వీమాకి పరిమితం కాకుండా యెందరో వీమాల కథగా పరిణామం చెందింది. కవి/రచయిత రచనని సామాజికం చేయాలి, ఒక ఇంటికి కాని, ఒక వ్యక్తికి గాని పరిమిత మైన కథను సామాజికం చేయకపోతే ఏమవుతుంది? అంటే నిర్దిష్టత నుంచి సాధారణీ కరణ జరగదు. కథలో మనం యేదో ఒక కారక్టర్ తో గుర్తింపబడాలి కదా! మామూలు కథల్లో యెక్కడో ఒకచోట యేదోఒక రూపంలో ఐడెంటిఫై అవుతాం. కానీ యిక్కడ ప్రత్యేకమైన బిడ్డ కథ చెబుతున్నప్పుడు, మనకి యెక్కడ యే ఉద్వేగంతోటి మమేకత కలుగుతుంది? ఈ మమేకత లేకపోతే కథ నిలబడటం కష్టం. ఈ కథలో సాధారణీకరణకు అవకాశం తక్కువ. ఒక పేరెంటుగా ఆ ఫీలింగ్స్ ని పూర్తిగా అందుకోలేము. కానీ అందుకోవటానికి అవసరమైన  ఉద్వేగభరిత సన్నివేశాలను రచయిత సృజించగలిగారు. సుమలోని తల్లిదనంతో మనం ఐడెంటిఫై అవుతాం. డౌన్సిండ్రోమ్ ఉన్న బిడ్డ తల్లిగా ఆమె  పడుతున్న ఆవేదనని సహజంగా, ప్రతీకాత్మకంగా వర్ణించారు. డాక్టర్ గీత మౌలికంగా కవయిత్రి కాబట్టి తల్లి వాత్సల్యం చుట్టూ అల్లుకుని ఉండే యెన్నో సున్నితమైన అంశాలను కథలోకి తీసుకు రాగలిగారు. అందువల్ల కథ, కథ అయ్యింది. ఇది కథేనా అన్న నా ప్రశ్నకి నేను సమాధానం వెతుక్కునే క్రమంలో యిటు వంటి అంశాల వైపు దృష్టి సారించాను. కథ, కథ యెందుకు అయ్యింది. నిర్దిష్టతకి సాధారణీకరణకు గల సంబంధం ఏమిటి? స్వీకరించిన కథా వస్తువు యే కొద్ది మందికి మాత్రమో సంబంధిం చినది. నేను చదివిన దాని ప్రకారం ప్రతీ 750 మందిలో ఒక్కరికి యిలా పుట్టే అవకాశం  వుంది. ఇలా అతి అరుదుగా జరుగుతుంది. ఇలా తమకే యెందుకు జరిగింది? అన్న ప్రశ్నలో మరో సంఘర్షణకు కూడా అవకాశం కూడా వుంది (అందుకే ఈ కథని నవలగా చేయమని నా రిక్వెస్ట్. నవలకు కావలసినంత కంటెంట్ ఉంది). అది యెవరి కారణంగా జరిగింది అనే ప్రశ్న రావడం జనరల్ టెండెన్సీ. సమాజంలో ఆడపిల్ల పుట్టినా తల్లి మీదకే నెట్టేస్తారు. ఎటువైపు నుంచి వస్తుందీ సమస్య? అనేది డాక్టర్లే చెప్పలేకపోయారు. కానీ విషయాన్ని చాలా జాగ్రత్తగా బాలాన్స్ చేశారు. ఇదే నవల అయితే ఇది భర్త వైపు నుంచి, ఇది భార్య వైపు నుంచి అనే ఘర్షణని చూపించవచ్చు. కథలో ఆ విషయాన్ని స్పృశించారు గానీ దాని మీద వివాదం సృష్టించలేదు.

          మరో ముఖ్యమైన  విషయం, యిటు వంటి పిల్లల పెంపకంలో సాధారణంగా తల్లి/ స్త్రీ తనను తాను కోల్పోయే అవకాశం వుంది. తనకి తాను సమయం కేటాయించు కోలేదు. అంటే 10 సంవత్సరాలుగా ఒక చంటిపిల్లని పెంచుతున్నట్లే. బిడ్డల్ని పెంచేటప్పుడు తల్లి తన సమయాన్ని చాలా కోల్పోతుంది. చాలా మంది తల్లులు, ఉద్యోగాలు చేసేవారు పసిబిడ్డల పెంపకం కోసం ఉద్యోగాలు మానేసేవారు కూడా వుంటారు. కానీ అది కొంత కాలమే. కానీ యిక్కడ పేరెంటల్ కేర్ జీవితకాలం అవసరమౌతుంది. తల్లి ఒక విధమైన తట్టుకోలేని మానసిక ఒత్తిడికి, frustration కి గురయ్యే అవకాశం వుంది. సకృత్తుగా తల్లిగా సుమ ఒకవిధమైన ఒంటరితనం ఫీలయింది. ఆ విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ ఒంటరితనాన్ని యెదుర్కోవడానికి సోషలైజేషన్ మొదలయింది. ఒక పేరెంట్ కి వచ్చే అన్ని ఇబ్బందులను అధిగమిస్తూ ఆమె జీవితాన్ని యెలా నిర్వహించుకోగలిగింది అనేది కథలో చాలా చక్కగా చెప్పగలిగారు. తనని తాను కోల్పోతున్న ఫీలింగ్ ని ఆమె జయిం చింది. బిడ్డని పెంచుతూనే ఆమె తనదైన అస్థిత్వాన్ని కాపాడుకుంది. ఎం.ఎస్. చేసింది, ఉద్యోగంలో చేరింది. ఈ బాలెన్సింగ్ కథకి ప్రాణం. ‘కనువిప్పు’ అంటే carry home message కూడా యిదేనేమో! కథలో ఉద్వేగాలున్నాయి, సంఘర్షణ ఉంది, సంభాషణ లున్నాయి. చాలు కదా అంటే – కాదు; వాటితో పాటు దృక్పథం కూడా ప్రధానం అని నేనంటాను. కొంత మంది నాతో విభేదించవచ్చు. కథలో రచయిత దృక్పథం యిక్కడ వ్యక్తమైంది. ఈ కోణంలో జరిగిన  సంఘర్షణ అన్నిటికన్నా చాలా బలమైంది. అది కథని వేరే యెత్తులో కూర్చోబెట్టింది. తల్లికి వుండే ప్రసూతి భయాలు, మాతృత్వపు తొలి మధురిమ, అత్తగారితో అదృశ్య సంఘర్షణ, పసిబిడ్డ ఆరోగ్యం విషయమై తల్లిదండ్రుల ఆందోళనలు, భర్తని కాదని బర్త్ డే పార్టీకి తీసుకొని వెళ్ళడం, తిరిగొచ్చి ఆ వీడియో చూపించడం, చూపించినపుడు అతను కన్విన్స్ కావడం, మొట్టమొదటి సారి డాడీ అని పిలవడం, అమ్మ అని పిలవక పోవడం ..  ఇవన్నీ కథకు సంబంధించిన అందాలు కదా! ఇవన్నీ ఆమె పట్టుకోగలిగారు. అలాగే తనకి తాను సమయం కేటాయించుకోగలగడం  చాలా ముఖ్యమైన పాయింటు. ఇవన్నీ కథ కావడానికి రచయిత తీసుకొన్న జాగ్రత్తలు. అంతే కాదు; ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కోడలిగానే గాక సిస్టంతో కూడా ఆమె ఘర్షణ పడింది. ఇది అమెరికా కథ అవటం ద్వారా, ‘వర్క్ వీసాలో ఉన్న మనం’, ‘వలస వచ్చిన మనం’ అన్న చోట ఆవిష్కారమైన భయాలు చిన్నవేం కావు. మొత్తం వ్యక్తుల జీవితానికీ పరాయి దేశంలో అస్థిత్వానికీ  చెందిన  సంఘర్షణ. దీన్ని కూడా రచయిత కథలోకి బలంగా తీసుకురాగలిగారు. ఈ పొర లేకుంటే కథ చిన్నబోయేదేమో! ఈ కథ ఇండియా లో జరిగితే .. అనే ఒక ఆలోచన వచ్చింది, దాన్ని కూడా వదలకుండా గీత కథలో ప్రస్తావించారు. ఇండియాలో అయితే డౌన్ సిండ్రోమ్ గల పిల్లలు సామాజిక వెలివేతకి గురౌతారు అనే అంశం మరో పేరెంట్ ద్వారా చెప్పిస్తారు. ఇన్ని మైన్యూట్ విషయాలు కథలోకి తేవడం వల్ల మాత్రమే రచయిత్రి కథకి సమగ్రతని సాధించగలిగారు. సూక్ష్మాతి సూక్ష్మాంశాల్నీ జారిపోకుండా పట్టుకోగలిగారు. ఏ కథ అయినా లోపల బాగా నలిగినపుడు మంచి కథ బయటికి వస్తుంది. అలవోకగా నాలుగు సంభాషణలు, పాత్రలు క్రియేట్ చేసినంత మాత్రాన మంచి కథ తయారు కాదు, మెప్పించడం కుదరదు. పొరలు పొరలుగా చెప్పాలి. వేదనలోంచి కథ వస్తుంది కానీ ఆ వేదనని సాహిత్యీకరించడం ఎలా? అన్నది చాలా ముఖ్యం. అది సాధన ద్వారా అలవడుతుంది. ఇలా సాహిత్యీకరించడానికి కావలసిన సమస్త వనరులు కధాంగాలు యీ కథలో వుండటం వలన యిది పరిపూర్ణమైన కథ అయింది. అయినా కానీ ఈ కథ సశేషం. నామాట కూడా సశేషం. ఇంకా చాలా చెప్పాల్సి వుంది. వీమా టీనేజిలోకి ప్రవేశించాకా యెదుర్కొనే ఎమోషనల్ నీడ్స్ సామాజిక సంబంధాలు శారీరిక  సమస్యలు భిన్నంగా వుంటాయి. అవన్నీ అది మరో కథ. కానీ యెక్కడోచోట ఆపాలి కాబట్టి, రచయిత  లాగానే నేను కూడా  యిప్పటికి యిక్కడ ఆపుతాను. థేంక్యూ.

(‘వీక్షణంబే ఏరియా సాహితీ గవాక్షం 131 సమావేశంలో చేసిన ప్రసంగం నుంచి)

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.