కథా మధురం 

ఆ‘పాత’ కథామృతం-10

యల్లాప్రగడ సీతాకుమారి

 -డా. సిహెచ్. సుశీల

విద్యా, వైజ్ఞానిక రంగాలలో ఎంత అభివృద్ధి చెందుతున్నా, ప్రగతి శీల దృక్పథం, దేశభక్తి భావన, విశ్వమానవ సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తోందని వేదికల మీదా, అక్షరాల్లోనూ మాత్రమే కనిపిస్తోందని చెప్పక తప్పదు. కులమూ, మతమూ, ప్రాంతమూ, భాషావైషమ్యా లతో మనుషులు ముక్కలు ముక్కలుగా విడదీయబడడం జరుగుతూనే ఉంది. ఇది అన్యాయమే కాక అనైతికం. 
 
          మతం కన్నా మానవత్వం మిన్న. నిజానికి మతం అంటే “అభిప్రాయం”, “అభిమతం”, ” విశ్వాసం” అని అర్థం. “ప్రేమ” అన్నిటికన్నా మిన్న. వివిధ వైషమ్యాలను వివక్షతలను తొలగించే సామాజిక చైతన్యం కలిగినప్పుడే “జీవితం” విలువ గ్రహింపుకు వస్తుంది. అనేక కారణాలను సాకుగా చూపి “దూరం” పెంచుకుంటూ పోతే…! మనిషి ఎక్కడ తేలుతాడు! సత్సంకల్పం ఉన్నప్పుడే , ఆచరణలో చూపినప్పుడే మనుషులు ఏర్పరచుకున్న అసమానతలు తొలిగే అవకాశం ఉంటుంది.
 
కులమా? ప్రేమా?
 
          శంపాలత, మీర్జా క్లాస్ మేట్స్. మంచి స్నేహితులు. శంపా వాళ్ళ నాన్నగారు ఇంగ్లాండ్ వెళ్ళి బారిష్టర్ చదివి వచ్చారు. ‘సివిలిజేషన్’ కి ఏమి తక్కువ లేదు. భార్య కూడా అభ్యుదయ భావాలు కలదే కాబట్టి వారి సంసారం సజావుగా జరిగిపోతోంది. ముఖ్యంగా స్త్రీలకి స్వాతంత్రం ఉండాలని, విద్యావంతులై, తమ ఆశయాన్ని నెరవేర్చు కోవడానికి సహనశక్తి నిగ్రహ శక్తి ఉండి, స్త్రీలు బ్రహ్మచారిణిలుగా ఉండాలని ఆమె అభిప్రాయం. మీర్జా తండ్రి ఉస్మాన్ జా శంపా తండ్రి కార్పొరేషన్ మెంబర్లు. కొద్దిగా పరిచయం ఉంది. మీర్జా శంపా ఇంటికి వస్తూ ఉంటాడు. వాళ్ళ అమ్మతో కలిసి సినిమా లకు వెళ్ళడం, ఎప్పుడైనా రాత్రులు ఆలస్యమైతే వారే కారులో అతన్ని ఇంటికి పంపుతూ ఉండడం జరిగేది. వారిద్దరి స్నేహం పట్ల ఎలాంటి అభ్యంతరము చూపలేదు. సైకిల్ మీద వారి ఇంటికి వచ్చి తర్వాత వారి కారులో ఇద్దరు కాలేజీకి వెళ్ళమని కూడా శంపా తండ్రి చెప్పారు.
 
          రచయిత్రి కథనంతా ఉత్తమ పురుషలో చెప్పడం వల్ల శంపా మనసులోని సున్నిత మైన భావాలు సూటిగా పాఠకులను తాకుతాయి. 
 
          మొదట శంపా మనసులోనే ప్రేమ భావన ఉదయించింది. అది అతనికి ఎలా తెలియజేయాలో తెలియక ఒక చర్చను మొదలు పెట్టింది. 
 
          ” మీకు ఐడల్ వర్షిప్ పనికిరాదు కదా! మరి మసీదులోకి వెళ్ళి నమాజు చేయటం ఎందుకు? అది కూడా ఫిక్స్డ్ టైంలో, అంతా ఒకచోట చేరి చేయాలని ఎందుకు? ఎవరి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడబడితే అక్కడ చేసుకోకూడదా?”
 
          ఈ చర్చలో రచయిత్రి భావాలు, ఈ కథలో ఏం చెప్పాలనుకుంటున్నారో కనిపిస్తూ ఉంటాయి…
 
          ” ఏమి పని లేని వాళ్ళు మతం గురించి వెక్కిరిస్తూ కూర్చుంటారు. మంచి ఆదర్శా లు ఎవరి మతంలో ఉన్నా మనం తీసుకోవాలి. అసలు ఇప్పుడు ఎవరైనా సరే ఏ పనైనా ధైర్యంతో చేశారంటే దానికి మతం అడ్డమే కాదు. పోనీ మీ ఫాదర్ ఇంత రిఫార్మర్ కదా! మీ రిలీజియన్ ఒప్పుకుంటుందా నీకిన్నాళ్ళదాకా మ్యారేజ్ చెయ్యకుండా చదువు చెప్పిస్తుంటే? మీ బ్రాహ్మిన్స్ అంతా ఊరుకున్నారా లేదా” అన్నాడు.
 
          “వేద కాలంలో పురాణ కాలంలో కూడా ఆడవాళ్ళు చదువుకున్నారు. కనుక నేను చదువుకున్నంత మాత్రాన నా మతం ఎక్కడికి పోదు. మరీ చిన్నపిల్లలకి పెళ్ళి చేయటం ఈ మధ్య వచ్చింది కానీ పూర్వం మాలో కూడా పెద్దవాళ్ళకే పెళ్ళిళ్ళు చేసేవారు” అన్నది శంపా.
 
          “మరి అన్ని కులాల వాళ్ళ ఇళ్ళల్లో భోజనం చేయడం, కులాంతర వివాహం…” అని మీర్జా అడిగితే “ఉన్నాయనే చెప్పాలి. సామాన్యంగా పురోహితులంతా బ్రాహ్మణులే ఉండే వాళ్ళు. కానీ వాళ్ళంతా రాజుల ఇళ్ళలో భోంచేసేవాళ్ళే. కనుక భోజనాల్లో పట్టింపు లేదని తెలుస్తోంది. కొంత మంది రాజు కూతుళ్ళని పెళ్ళి చేసుకున్నారు. కానీ వాళ్ళ బ్రాహ్మణ్యం పోలేదు. దేవయాని అనే బ్రాహ్మణ స్త్రీ రాజుని పెళ్ళి చేసుకుంది. తర్వాత చంద్రగుప్తుడు గ్రీక్ గరల్ ను పెళ్ళి చేసుకున్నాడు. కానీ వాళ్ళ మతం ఎక్కడికి పోలేదు” అని చెప్పింది శంపా.
 
          ఈ సంభాషణ జరిగిన తర్వాత మీర్జా మనసులో ఉన్న సంకోచాలు తొలగినట్లే కనిపిస్తాడు. 
 
          కానీ, ఒకరోజు  హడావిడిగా వచ్చి తమ దూరపు బంధువు లతీఫ్ హుస్సేన్ గారి కూతురుతో మ్యారేజ్ అన్న విషయం ఇంట్లో ప్రస్తావిస్తున్నట్లు చెప్పాడు. తన నిశ్చితార్థ అభిప్రాయం చెప్పి ధైర్యంగా ఉండమని చెప్పింది శంపా. మీర్జా శాఖాహారి, దేశాభిమాని, విద్యావంతుడు, సంస్కారి కాబట్టి తండ్రి ఒప్పుకుంటాడని ఆమె ధైర్యం. తండ్రికి చెప్పగా ఆయన మీర్జా ఇంటికి వెళ్ళి ఉస్మాన్ జా గారితో మాట్లాడారు. లతీఫ్ హుస్సేన్ కి మాట ఇచ్చానని, తమ బంధువుల్లో ఎవరూ  హిందువుని పెళ్ళి చేసుకోలేదని అభ్యంతరం చెప్పారాయన. మీర్జా తండ్రి మాట జవదాట లేకపోయాడు. తర్వాత అతని పెళ్ళి  జరిగి పోయింది.
 
          తన మనసులో మీర్జానే స్థిరంగా నిలుపుకున్న శంపా బ్రహ్మచారిణిగానే ఉండిపో దలచింది. ఎమ్మెస్సీ యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిన ఆమె ఇంగ్లాండుకు పై చదువుల కోసం వెళ్ళింది. మూడేళ్ళ తర్వాత డి.ఎస్.సి డిగ్రీ తీసుకొని ఇండియా వచ్చింది. ఆ సందర్భం గా వారి ఇంట్లో జరిగిన పార్టీకి పెద్ద ఆఫీసర్లు, డాక్టర్లు, వకీళ్ళు, కౌన్సిల్ మెంబర్లు, జాతిమత బేధాలు లేకుండా హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, పార్సీలు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లు వచ్చారు. మీర్జా రాలేదు కానీ ఉస్మాన్ జా గారు కూడా వచ్చారు.
 
          పెళ్ళి అయిన దగ్గర నుండి మీర్జా శారీరకంగా మానసికంగా చాలా కృంగిపోయాడని, అతని నిరాదరణ భరించలేక భార్య ఆత్మహత్య చేసుకున్నదని, ఉస్మాన్ జా చెప్పి, శంపా తో పెళ్ళి అంగీకరించక చాలా తప్పు చేశానని పశ్చాత్తాప పడ్డారు ఆయన.
 
          వెంటనే ఆయనతో పాటు వారి ఇంటికి వెళ్ళింది శంపా. తేజో రహితంగా, జీవ కళ లేకుండా, ఎముకల గూడు లా పడకకుర్చీలో ఉన్నాడు మీర్జా. దగ్గరకు వచ్చిన శంపాను చూసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. అంతలోనే అతని కళ్ళు శాశ్వతంగా మూతపడ్డాయి. హృదయ చలనం ఆగిపోయింది.
 
          తర్వాత శంపాలత ఆ ఊరిలో ” హిందూ ముస్లిమ్ లీగ్ స్ధాపించి, శక్తినంతా ధారపోసి హిందూ మహమ్మదీయుల ఐకమత్యానికి పాటుపడుతూ ఉండిపోయింది.
***
          ప్రముఖ కథా రచయిత్రి స్వాతంత్ర సమరయోధురాలు శ్రీమతి యల్లా ప్రగ్గడ సీతాకుమారి జనవరి 1 1911 న బాపట్లలో జన్మించారు. భర్త నారాయణరావుతో కలిసి 1920 లలో హైదరాబాద్ వచ్చి సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారు. సీతాకుమారి నిజాం ఆంధ్ర మహాసభలకు హాజరు కావడమే కాకుండా 1932లో ఖమ్మంలో జరిగిన మూడవ ఆంధ్ర మహాసభ మహిళా విభాగానికి అధ్యక్షత కూడా వహించారు. హైదరాబాదులో పద్మజా నాయుడు ప్రారంభించిన స్వదేశీ ఉద్యమంలో ఖద్దర్ ప్రచార కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. 1936 లో సీతా కుమారి ఇల్లిందల సరస్వతి దేవిలతో కలిసి ఆంధ్ర యువతీ మండలి స్థాపించారు. జాతీయోద్యమ కాలంలో హైదరాబాద్ లో ఖాదీ వస్త్రాల అమ్మకం, ప్రచారం విస్తృతంగా చేసారు. 1934 నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభకు అధ్యక్షత వహించా రు.  చిక్కడపల్లి “ప్రమదావనం” స్ధాపించి స్త్రీల వికాసానికి దోహదం చేసారు.
 
          నిజాం పాలనలో “అక్కిరెడ్డి పల్లి” గ్రామంలో జరిగిన స్త్రీల పై అత్యాచారం పై విచారణ జరిపే సంఘంలో సభ్యురాలిగా, అత్యాచారం జరిగిన ప్రాంతాలలో పర్యటిం చారు. అనాధలకు, వితంతువలకు, భర్తలు వదిలేసిన స్త్రీలకు ఆశ్రయం కల్పించి ఆదుకున్నారు. 
 
          స్త్రీల సమస్యల పై, సాంఘిక దురాచారాల పై స్పష్టమైన అవగాహన గల సీతా కుమారి తన అభిప్రాయాలను కథలలో నిర్భయంగా నిర్మొహమాటంగా రాసారు. ఆమె  ఉపన్యాసాలు, దురాచార వ్యతిరేకతా వ్యాసాలు గోల్కొండ పత్రికలో ప్రచురింపబడేవి. 1957 లో బాన్సువాడ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యారు. సీతాకుమారి జనవరి 2 1986న మరణించారు.
 
          సీతాకుమారి కథలు భారతి, గృహలక్ష్మి, యువ, ఆంధ్రపత్రిక, రచన వంటి పత్రికల్లో ప్రచురింపబడ్డాయి.
 
          ఈ కథ ముగింపు ఆనాటి సినిమా ప్రభావంతో ఉన్నట్టు అనిపించినా – యల్లాప్రగడ సీతాకుమారి ఈ కథను 1933 (ఆంధ్రపత్రిక ఉగాది సంచిక) లో రాసారని మర్చిపో కూడదు. ఆ కాలంలో ఆడపిల్లలు పెద్ద చదువులు చదవడం, అబ్బాయిలతో స్నేహం చేయడం, బైట పార్కులు సినిమాలకు వెళ్ళడం కొంత నవ్య పంధానే. అందుకే ముందు గానే తండ్రి ఇంగ్లాండ్ లో బారిష్టర్ చదివి వచ్చారని, తల్లి అభ్యుదయ భావాలు కలదని మొదట్లోనే కథకు ఒక  నేపధ్యాన్ని పునాదిగా వేసారు. హిందూ ముస్లిమ్ వివాహం అనే ఇతివృత్తాన్ని తీసుకోవడం ఆ రోజుల్లో ఒక సాహసమే.
 
          ఈ మతాంతర పెళ్ళిళ్ళలో ముస్లిమ్ హిందూమతంలోకి మారాలనే కఠిన ఆంక్షలు లేవు కానీ, ముస్లిమ్ యువకుడిని వివాహ మాడాలంటే హిందూ స్త్రీ “కల్మా” ఆచరించాలని నియమం. అంటే ప్రవక్తని నమ్మి, పేరు మార్చుకుని, “నిఖా” చేసుకోవాలి.
 
          నిజానికి “ప్రేమ” కి నిబంధనలు, సరిహద్దులు లేవు. దానిని బలవంతాన నియంత్రించరాదు. పైగా మనది మత రాజ్యంగా ప్రకటింపబడలేదు. లౌకిక రాజ్యాంగం. పైగా  ‘కల్మా’ చేయాలని ఇస్లామిక్ ‘లా’ చెప్తుంది కానీ బలవంతం పెట్టాలని లేదు.
 
          కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రభుత్వంలో పెద్ద ఆఫీసర్ అయిన సయ్యద్ సలీం బ్రాహ్మణుల అమ్మాయి గీతను వివాహం చేసుకున్నారు. ఇంటర్, డిగ్రీ, పి.జీ. లో ఇద్దరూ క్లాస్ మేట్స్. స్నేహం. అది ప్రేమగా మారి గీత గారే మొదట అడుగు వేసారు. వారి అమ్మానాన్న ఒప్పుకున్నారు. కానీ సలీం గారి కుటుంబం కరుడు గట్టిన మతవాది. ఒప్పుకోలేదు. బహుశా ఇప్పటికీ రాజీ పడలేదనుకుంటా. గీతగారు మతం మార్చుకోలేదు. పేరు మార్చుకోలేదు.
 
          ఈ కథ విషయం సలీం గారితో ప్రస్తావిస్తే ” హిందూమతం చాలా సంస్కారవంత మైంది. కఠిన ఆంక్షలు ఉండవు. ఎన్ని మతాలు ఈ దేశంలోకి వచ్చినా ఆదరించారు. తమలో కలుపుకున్నారు. ముఖ్యంగా బ్రాహ్మణులలో సహనము, సంయమనం ఉందని నా స్వానుభవం. మా పిల్లల్ని కూడా బ్రాహ్మణులతోనే పెళ్ళిళ్ళు చేసాం. చాలా హ్యాపీగా ఉంది మా జీవితం ” అన్నారు తృప్తిగా.
 
          పెద్దలు చూసి నిర్ధారించగా ఇద్దరు “అపరిచితులు” వివాహమాడడం, అప్పటికి ఒకరినొకరు చూడనైనా లేకపోవడం జరిగేది ఆ రోజుల్లో. ఇప్పుడు పెళ్ళిచూపులు జరిగిన తర్వాత ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరి అభిప్రాయాలు అభిరుచులు మరొకరు తెలుసుకోవడం, అర్ధం చేసుకోవడం జరుగుతుంది. “ప్రేమ” విలాస వస్తువు కాదని, తీయని అనుభూతి, జీవన మాధుర్యం అని, కలిసిన మనసులు ఏకమైతే జీవితం స్వర్గ తుల్యం అని నేటి యువత నమ్ముతోంది.
 
          కానీ, ఆనాటి పరిస్థితులు వేరు. దేవదాసు పార్వతి, సలీం అనార్కలి, రోమియో జూలియట్, లైలా మజ్ను ప్రేమ విఫలమై ప్రాణాలు కోల్పోయి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. ప్రేమ త్యాగాన్ని కోరుతుందనీ, పెద్దలను ఎదరించకూడదని నమ్మే కాలంలో రాసిన కథ ఇది. అప్పుడే కాదు ఇప్పటికీ ఇది జటిలమైన సమస్యనే. అయితే ఇది స్పష్టంగా “మతము – ప్రేమ” సమస్య. 
 
          మరి రచయిత్రి “కులమా – ప్రేమా” అని శీర్షిక పెట్టడంలో క్లారిటీ లోపించిందని చెప్పక తప్పదు.
 
          ఇప్పటికీ సజావు కాలేని ఈ సమస్యను 1933 లోనే ధైర్యంగా రాసిన యల్లాప్రగడ సీతాకుమారి అభినందనీయురాలు.

*****

వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం

Please follow and like us:

2 thoughts on “కథామధురం-ఆ‘పాత’కథామృతం-10 యల్లాప్రగడ సీతాకుమారి”

  1. సుశీల గారూ
    సీతాకుమారి గారి కధలు, వ్యక్తిత్వాన్ని చక్కగా చూపించారు.

  2. ఆ నాటి అభ్యుదయ రచయిత్రి..శాసన సభ్యులు అయిన యల్లాప్రగడ సీతా కుమారి రచన గురించిన Visleshatmakamaina వ్యాసం చక్కగా రాశారు సుశీల గారు.

Leave a Reply

Your email address will not be published.