నడక దారిలో-34

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి కలం స్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాల తో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి కుటుంబం విడిపోయి వేరు కాపురాలు అయ్యాయి. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, మాకు పుట్టిన బాబు అనారోగ్యం, ఎమ్మే తెలుగు పరీక్ష లు పూర్తయిన మూడురోజులకు బాబు అస్వస్థతతో చనిపోయాడు.బియ్యీడీ ఎంట్రెన్స్ పరీక్ష రాసి రేంకు రావటంతో ఆంధ్రమహిళాసభ బియ్యీడీ కాలేజి లో సీటు వచ్చింది. హార్డిల్ రేసులో ఒడిదుడుకులతో బియ్యీడీ పుర్తిచేసాను. తర్వాత—

***

 
          ఓ రాత్రి మా బాత్రూమ్ పక్కనే పెరటిగోడ కూలిపోయింది. గోడని ఆనుకొని క్షత్రియ హాస్టల్ ఉండటం వలన మాకు ఇబ్బంది మొదలైంది. అక్కడే మా బాత్ రూం ఉంటుంది కనుక నాకూ, పల్లవికీ స్నానాలకు ఇబ్బంది కలిగేది. ఇంటి ఓనర్ తో చెప్తే విసురుగా మాట్లాడింది. దాంతో వేరే ఇల్లు వెతుక్కోవాలని నిర్ణయించుకున్నాం. పాత నల్లకుంటలో రామడుగు రాధాకృష్ణ మూర్తి గారి ఇంటికి రెండు సందులు ఇవతల ఇల్లు దొరికింది. ముందువైపు ఇంటి వాళ్ళు ఉంటారు వెనుక వైపు రెండు చిన్నచిన్న రూములు, చిన్న వంటగది. మాకు చాలా ఇరుకుగా ఉండేది.          
 
          పల్లవికి తన వయసు అమ్మాయిలు చాలా మంది స్నేహితులు అయ్యారు.అక్కడే ఉన్న రామాలయంలో ఒక ఆయన సంగీతం నేర్పిస్తారని తెలిసి అక్కడ చేర్చాను. ఈ ఇంటికి స్కూలు కొంచం దగ్గర అయ్యింది. నడిచే వెళ్ళిపోతుండేది.
 
          అక్కడకు ఫర్లాంగు దూరంలోనే ఉన్న ఇంటిలో నా చిన్ననాటి స్నేహితురాలు జానకి వాళ్ళు ఉంటారని తెలిసింది. నాకు చాలా సంతోషం కలిగింది. మేము తరుచూ కలుసుకునే వాళ్ళం. కుమారికి ఈ విషయం చెప్తే ఆమె కూడా అప్పుడప్పుడు వస్తుండేది. చిన్ననాటి కబుర్లు కలబోసుకునేవాళ్ళం. రాగలత చెల్లెలు హైదరాబాద్ లోనే డిగ్రీలో చేరింది. అందుచేత రాగలత కూడా తన చెల్లెలుతో కలిసి మా ఇంటికి దగ్గరలోనే రూం తీసుకొని ఉండేది.
 
          ఒకరోజు నాకు ఉద్యోగానికి కాల్ లెటర్ వచ్చింది. ఇంకా రిజల్ట్ రాలేదు. నేను అప్లై చేయలేదు. ఎలా వచ్చిందా అనుకున్నాను. అంతలో రాగలత కూడా వచ్చి తనకు కూడా అదే స్కూల్ నుండి కార్డు వచ్చిందని చెప్పింది. ఇద్దరం నారాయణగూడ చౌరాస్తాలోని సెయింట్ పాల్ హైస్కూల్ కి వెళ్ళాము. మా ఇద్దరినీ ఇంటర్వ్యూ చేసి మేము చదివిన బియ్యీడీ కాలేజి ప్రిన్సిపల్ మా పేర్లు రికమెండ్ చేసారని చెప్పారు. ప్రస్తుతం నెలకు అయిదు వందలు ఇస్తామని, రిజల్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ క్లాస్ వస్తే పెంచుతామని అన్నారు. సర్లే అని ఇద్దరం చేరిపోయాము.
 
          అయితే ఆ స్కూల్ లో రోజంతా అన్ని పీరియడ్స్ క్లాసుల్తో, క్రమశిక్షణ లేని పిల్లలతో చాలా కష్టం అయ్యేది. అంతలో మా రిజల్ట్ వచ్చింది. నేనూ, రాగలత కూడా ఫస్ట్ క్లాసులో పాసయ్యాము. నా సంతోషానికి అవధుల్లేవు.
 
          సెయింట్ పాల్ హైస్కూల్ యాజమాన్యంకి రిజల్ట్ గురించి చెప్పి ఫస్ట్ క్లాస్ వస్తే జీతం పెంచుతామని అన్న విషయం గుర్తుచేసాం. కానీ, ఆరునెలలు దాటాక జీతం పెంచుతామన్నారు. చెప్పిన మాట తప్పిన యాజమాన్యం ప్రవర్తనకి రాగలతా, నేను కొంత అసంతృప్తికి లోనయ్యాము.
 
          కాంగ్రెసేతర పార్టీ ప్రభుత్వం ఏర్పడటంతో రాష్ట్రంలో కూడా చాలా సంచలనాలు కలగటం మొదలైంది. చిరకాల కాంగ్రెసు ప్రభుత్వాన్ని త్రోసిరాజని తొలిప్రాంతీయపార్టీ రాష్ట్రపగ్గాలు చేపట్టటం భరించరానిదయింది. రాష్ట్రంలో అందులోనూ హైదరాబాద్ లో మత కల్లోలాలు రాజుకొనేలా ప్రత్యర్థులు చేసారు.
 
          ఈలోగా మాకు ఈసారి ఇద్దరికీ వేర్వేరు స్కూల్స్ నుండి కాల్ లెటర్ వచ్చింది. ఒక రోజు సెలవు పెట్టి వెళ్ళాం. నేను న్యూ ప్రొగ్రసివ్ స్కూల్ కి వెళ్ళాను. నేనేకాక నాతో చదివిన భాగ్యలక్ష్మి, మరో అమ్మాయి ఆంధ్రావాణీ కూడా వచ్చారు. అందర్నీ తీసుకున్నా రు. అయితే SGBT స్కేల్ ప్రకారమే జీతం ఇచ్చేవారు.
 
          నాకు ప్రాధమిక తరగతులకు రెండవభాష తెలుగు, గణితం ఇచ్చారు. ఆ స్కూలు పేరుకు ఇంగ్లీష్ మీడియం. కానీ, పిల్లలంతా 98 శాతం ముస్లింలు. టీచర్లలో మేం ముగ్గురం కాక హైస్కూల్ లెక్కలకు, తెలుగు టీచర్లు మాత్రమే హిందువులం.
 
          పిల్లలకు ఇంగ్లీషు రాదు, తెలుగు రాదు. వచ్చినా ఉర్దూ కలిసిన తెలంగాణా భాష. నాకు అంతంత మాత్రం ఇంగ్లీష్, ఉర్దూ అసలు రాదు. ఇంక నా అవస్థలు చూడాలి. ఆ ఏడాదిలో నాకు మాత్రం ఉర్దూ కాస్తంత వచ్చేసింది.
 
          ఒకవైపు మాటిమాటికీ కర్ఫ్యూలతో హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. మా స్కూల్ టీచర్స్, విద్యార్థులు కూడా చాలా మంది పాతబస్తీకి, ముస్లిం ప్రాంతాలకూ చెందిన వాళ్ళు. ఏ మూలో నిప్పురవ్వపడి మతకల్లోలాలు గుప్పుమనేవి. పిల్లల కోసం తల్లి దండ్రులు బడికి పరిగెత్తుకుని వచ్చేవారు. హడావుడిగా పిల్లల్ని వదిలేసి బడి మూసేసే వారు. మేము గుండె దడదడ లాడుతుండగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఏ రిక్షానో మాట్లాడుకొని ఇంటికి చేరే వాళ్ళం. అదృష్టవశాత్తు లెక్కల టీచర్ ఇల్లు కూడా శంకర మఠం దగ్గరే కావటంతో ఇద్దరం కలిసి ఇంటికి వచ్చే వాళ్ళం.
 
          ఆ ఏడాదంతా స్కూలుకి వెళ్ళిన రోజులు తక్కువే అయ్యాయి. అయితే ఏప్రిల్ లో స్కూల్ ఆఖరి పనిదినం రోజున మమ్మల్ని పిలిచి సెలవుల్లో జీతం ఇవ్వమని చెప్పి, తిరిగి స్కూల్ తెరిచాక రమ్మన్నారు.
 
          ఇంకా మళ్ళీ ఉద్యోగం వేట మొదలెట్టాలి అనుకున్నాను.
 
          వీర్రాజు గారు ఎన్టీఆర్ ప్రభుత్వం వచ్చిన దగ్గర్నుంచి బిజీ అయిపోయారు. అంతకు ముందు ముఖ్యమంత్రులకు కూడా ఈయనే ప్రసంగాలు రాసేవారు. అయితే వాళ్ళు ఏది రాస్తే అది చదివేవారు కనుక ఇబ్బంది కలుగలేదు కానీ తెలుగు దేశం వచ్చాక సినిమా డైలాగుల్లా వచ్చే వరకూ తిరిగి తిరిగి రాయవలసి వచ్చి  విసుక్కునేవారు. అందు వలన ఆయన ఇంట్లో ఉండటం తగ్గిపోయింది. 
 
          ఒకరోజు రాగలత టీచర్ల కోసం అడ్వర్టైజ్మెంట్ తీసుకుని వచ్చింది. సరే అని నేనూ, రాగలతా ఆ స్కూలుకు వెళ్ళి అప్లికేషన్ రాసి ఇచ్చాము. ఇంటర్వ్యూకి ఫలానా రోజు రమ్మని చెప్పారు.
   
        వాళ్ళు చెప్పిన రోజుకు వెళ్దామని రాగలతని పిలుస్తే తెలుగు మీడియం స్కూల్ నేను చెప్పలేనని చెప్పి రాలేదు. నేను ఒక్కదాన్నే వెళ్ళాను.
 
          ఇంటర్వ్యూకి ఒక్క పోష్ట్ కి నలభై మందికి పైగా వచ్చారు. నాతో ప్రోగ్రసివ్ స్కూల్ లో పనిచేసిన ఆంధ్రవాణి కూడా వచ్చింది. ఎందుకో నాతో ఆమె ఏడాదిపాటు కలిసి ఉద్యోగం చేసినా పరిచయంగానే మిగిలిపోయింది.స్నేహితురాలు కాలేదు. ఆ అమ్మాయి డామినే టింగ్ ప్రవర్తన మా మధ్య దూరాన్ని పెంచింది.
 
          ఆ అమ్మాయి చాలా మాటకారి వచ్చిన దగ్గర్నుంచి డీయీవో, డెప్యూటీ డీఈవో తనకు బాగా తెలుసును అన్నట్లుగా మాట్లాడుతూనే ఉంది. తీరా ఆ రోజు మమ్మల్ని ఇంటర్వ్యూ చేసేందుకు వాళ్ళు రాక పోవటంతో వాయిదావేసి వారం తర్వాత రమ్మన్నారు.
 
          వారం తర్వాత మళ్ళా వెళ్ళాను. ఈ సారి ఇంటర్వ్యూకి అంతకు ముందు వచ్చిన వారిలో సగం మందేవచ్చారు. ఆంధ్రవాణి వచ్చి ఈ సారి కూడా తనకు డిప్యూటీ డీఈవో ఎంతబాగా తెలుసో జానాతికంగా వైనాలు వైనాలుగా చెప్తోంది. మాటిమాటికీ మమ్మల్ని కూర్చో బెట్టిన గది ద్వారం దగ్గరకు వెళ్ళి “రామచంద్రరావు గారి కారు ఇంకా రాలేదేమిటీ” అంటూ తనలో తాను అనుకున్నట్లుగా అనటమే కాక “ఈ స్కూల్లో ఎవరిని తీసుకోవాలో ముందే నిర్ణయం ఐపోయింది. ఇది కేవలం నామినల్ గా చేసే ఇంటర్వ్యూ మాత్రమే” అనటం మొదలెట్టింది. దాంతో మా అందరికీ నిరాశ కమ్మేసింది. అంతలో అటెండర్ వచ్చి ” డీయీవోగారికి వేరే పని పడింది. రేపు ఇదే సమయానికి రమ్మ”ని చెప్పాడు.
 
          ఒకవైపు ఆంధ్రవాణి మాటలు వింటుంటే మళ్ళా మర్నాడు హాజరు కావాలనిపించ లేదు. నీరసంగా ఇల్లు చేరాను. రాగలత వస్తే విషయం చెప్పాను. “ఆంధ్రవాణి కావాలని అలా చెప్తుందేమో” అని అనుమానంగా అంది రాగలత. వీర్రాజు గారు కూడా అదే అన్నారు.
 
          సరే మర్నాడు కూడా వెళ్ళాను. ఆ రోజు ఓ పదిమంది మాత్రమే వచ్చారు. యథా తథంగా ఒక్కొక్కరిని పిలిచి అక్కడ ఉన్న ఆరుమంది ఇంటర్వ్యూ చేసారు. ఇంటర్వ్యూ చేసాక భౌతిక రసాయన శాస్త్రంలో ఒక పాఠం రేపు వచ్చి చెప్పమన్నారు. నమస్కారం చేసి బయటకు రాగానే ఆంధ్రవాణి ఏమన్నారని అడిగింది. సమాధానం చెప్పి ఇంటికి వెళ్ళిపోయాను.
 
          పదవతరగతి భౌతికశాస్త్రంలో ఒక అంశం తీసుకుని బియ్యీడీ ట్రైనింగ్ లో నేర్చు కున్న పద్ధతిలో లెసన్ ప్లాన్ తయారు చేసుకుని, ఒక చార్ట్ కూడా వేసుకుని మర్నాడు వెళ్ళాను.
 
          ఆంధ్రవాణి కాక మరొక అబ్బాయి కూడా వచ్చాడు. అంటే ముగ్గురిని పిలిచారన్న మాట అనుకున్నాను.
 
          నా చేతిలో లెసన్ ప్లాన్ చూసి ఆంధ్రవాణి “అయ్యో నేను లెసన్ ప్లాన్ రాయలేదు” అంటూ పక్కనే ఆ స్కూల్ ఆఫీసు రూమ్ లోకి వెళ్ళి రెండు తెల్ల కాగితాలు తీసుకుని రాయటం మొదలుపెట్టింది.
 
          అంతలోనే పదో తరగతిలో లెసన్ చెప్పమని పిలిచారు. ముగ్గురి పాఠం విని పంపిం చేసారు.
 
          ఆంధ్రవాణి నాతో మా ఇంటికి వస్తానని వచ్చింది. నాకు ఇష్టం లేకపోయినా మొగ మాటంతో మౌనం వహించాను. దారిలో ” డిప్యూటీ తనకు తెలుసని తనకే వస్తుందని “ఖచ్చితంగా చెప్పింది. నేనేం మాట్లాడలేదు.
 
          మళ్ళా మర్నాడు చీకటి పడుతున్నా వేళ ఆంధ్రవాణి మా ఇంటికి వచ్చింది. వీర్రాజుగారు ఇంట్లో ఉంటం వలన లోపలికి రాకుండా నాతో మాటలు మొదలుపెట్టింది.
 
          “సుభద్రా డెప్యూటీ రామచంద్రరావుకి 2000/-రూపాయలు ఇస్తే నీకు ఉద్యోగం వచ్చేలా చేస్తారు. నీకు ఈ ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగం వయసు దాటిపోతుంది. గవర్న మెంటు జాబ్ రాదు. డబ్బు నాకు ఇవ్వక్కరలేదు. నువ్వే నాతో వచ్చి ఇవ్వొచ్చు.”అంది.
 
          “పరిస్థితులరీత్యా నాకు ఉద్యోగం అవసరమే కానీ ఇలా లంచాలు ఇచ్చి తెచ్చు కోవటం ఇష్టం లేదు. ఇది కాకపోతే ప్రైవేటు స్కూల్లో చెప్పుకుంటాను. అంతే కానీ ఇటు వంటి వాటికి మేం విరుద్ధం “అన్నాను.
 
          ” సుభద్రా ఆలోచించు. మంచి అవకాశం. మీ వారికి కూడా చెప్పు. పోనీ నేను ఆయన తో మాట్లాడనా” అని నన్ను ఒప్పించాలని చాలా చూసింది.
 
          “మా ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఆయనతో చెప్తే నన్నే కాదు నీకు కూడా తిట్లు పడతాయి. ఇలాంటివన్నీ నాకు చెప్పకు వెళ్ళు” అని కాస్త సీరియస్ గా అన్నాను. నన్ను చూపించటానికి ఎంత ప్రయత్నించినా నేను లొంగలేదు.
 
          అలా ఓ వారం గడిచాక ఒకరోజు పదకొండు గంటలకి నాకు ఒక కార్డు వచ్చింది. ఆ కార్డులో “ఫలానా తేదీ రెండుగంటలలోగా జాయిన్ కావాలని లేకపోతే తర్వాత వారికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తామ”ని ఉంది. ఆ రోజే రెండుగంటల లోపునే వెళ్ళాలి. పల్లవి కి వళ్ళు తెలియని జ్వరం. వీర్రాజు గారు ఆఫీసుకి వెళ్ళిపోయారు. నాకు ఏం చెయ్యాలో తోచలేదు. పల్లవికి కొంచెం జావ చేసి ఇచ్చి తలుపు దగ్గరకు వేసి గొళ్ళెం నొక్కి పక్క సందులోనే ఉంటున్న రాగలత ఇంటికి వెళ్ళాను. అదృష్టం కొద్దీ ఇంట్లోనే ఉంది. విషయం చెప్పి నేను వచ్చే వరకు పల్లవికి తోడుగా ఉండమని అడుగుతే రాగలత వచ్చింది. నేను హడావుడిగా చీర మార్చుకుని రిక్షా ఎక్కి ఆర్టీసి హైస్కూల్ కు వెళ్ళాను.
 
          స్కూల్ కి వెళ్ళి ప్రధానోపాధ్యాయుల గదిలో ప్రవేశించి నమస్కరించగానే ప్రధానోపాధ్యాయులు శిరోమణి థామస్ గారూ, రాజ్యలక్ష్మి గారూ మరో ఇద్దరు టీచర్లూ ఆత్మీయంగా ఆహ్వానించారు. చేతికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి మరునాటి నుంచి తొమ్మిది కల్లా స్కూల్ లో ఉండాలని చెప్పారు. ఆత్మీయంగా ప్రేమపూర్వకమైన వాళ్ళ పలకరింపుతో నా హృదయం గాలిలో తేలినట్లుగా పరవశించింది.
 
          నేను తిరిగి ఇంటికి వెళ్ళటానికి గేటు దగ్గరకి వచ్చేసరికి ఆంధ్రవాణి ఎదురైంది. ఆర్డరు ఇచ్చారా ఏదీ చూపించు అని అడిగింది. నేను చూపించగానే అందులోని టెంపరర్లీ అన్న పదాన్ని చూపి “నిన్ను టెంపరర్లీ తీసుకున్నారు. నన్ను పెర్మనెంట్ గా తీసుకుంటారట” అంది.
 
          అంతకు ముందు రెండు స్కూల్స్ లో అలాగే పనిచేసాను కనుక నేనేమీ సమాధానం ఇవ్వకుండానే వచ్చేసాను.
 
          వీర్రాజుగారు వచ్చాక ఆర్డర్ చూపించి ఇది టెంపరర్లీ ఇచ్చినదా అని అడిగాను. “మొదటి ఆర్డర్ ఇచ్చినప్పుడు అలాగే ఇస్తారు. తర్వాత అప్రూవల్ వస్తుంది. ఆంధ్రవాణి మాటలు పట్టించుకోకు తీసేస్తే మరోటి వెతుక్కుంటావు. అంతేకదా” అన్నారు.
 
          అప్పటికి మనసు కుదుటపడింది.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.