నది – నేను (హిందీ అనువాద కథ)

హిందీ మూలం – డా. రమాకాంత్ శర్మ

తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు

          నది తను ఉద్భవించే చోటునుండి వెలువడినప్పుడు ఏం ఆలోచిస్తుందో తెలియదు. తను ఎంత దూరం ప్రయాణం చేయవలసి వస్తుందో, ఎక్కడెక్కడి నుంచి ముందుకు వెళ్ళాలో, ఏయే అనుభవాలను ఎదుర్కోవాలో, ఏ పరిస్థితులతో పోరాటం చేయాలో, చివరకు ఎక్కడ ఏ సముద్రం ఒడిలో కలిసిపోవాలో అనే ఆలోచన కూడా తన మనస్సులో వస్తుందా అని. తను అసలు ఏమీ ఆలోచించకుండా తనను తాను ప్రవాహా నికి అధీనంగా వదిలేసుకుంటుందన్నది కూడా కావచ్చు.

          నా జీవితం కూడా ఒక నదిలాగే ఉందని నాకనిపిస్తుంది. నా జన్మస్థలం నాకు జ్ఞాపకం లేదు. కాని, ఈ రోజున జీవితంలోని తొంభై సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసు కున్నప్పుడు అంతా నదీప్రవాహంలాగే  ప్రవహిస్తోందని అనిపిస్తుంది. ఎప్పుడైనా గోముఖం నుండి వెలువడే గంగని చూశారా? ఉత్సాహంగా ఉరకలు వేసే తెల్లని నిర్మల మైన జలాన్ని, హిమాలయాల ఒడిలో ఆడుతూ కేరింతలు కొడుతూ ముందుకు వెడుతున్న జలధారని, పిల్లల్లాగా ఉత్సాహంతో తెలియని విషయాలను తెలుసుకుంటూ ఒక్కొక్క క్షణాన్ని జీవించాలనే ఆత్రుతతో ప్రవహించే సలిలాన్ని. నిజంగా, నదీజలం దేన్నీ లెక్కచెయ్యకుండా చుట్టుపక్కల ఉన్న లోకాన్ని ఆశ్చర్యంగా అవలోకిస్తూ ముందు న్న ప్రయాణం కోసం పట్టుదలతో పయనిస్తున్నట్లుగా ఉంటుంది. అంతా ఎంత అద్భుతం, ఎంత స్వర్గతుల్యం.      

          నేను కూడా అమ్మ ఒడిలో ఇలాగే కేరింతలు కొడుతూ, మారాంచేస్తూ ఉండి వుంటాను. ఊహ తెలిసిన తరువాత నా చుట్టూవున్న ప్రపంచాన్ని నేను ఆశ్చర్యంగా చూసేదాన్ని. నీలాకాశం, కాంతివంతమైన చంద్రుడు, మెరుస్తున్న నక్షత్రాలు, పగటిని ఏర్పరుస్తూ, తిరిగి దాన్ని తనతోనే తీసుకుపోయే సూర్యుడు. చెట్లని, మొక్కలని, వాటి పై వేలాడుతున్న పళ్ళని, రంగురంగుల పూలని, వాటి పైన ఎగురుతున్న రంగురంగుల సీతాకోకచిలుకలని, ఎగురుతున్న నల్లని తుమ్మెదలని, ఎగురుతున్న రక రకాల పక్షులని చూసి, ఆటబొమ్మలని, కొండలని, దారులని, మెరుస్తున్న మెరుపులని, జంతువులని, ఎన్నోరకాల వస్తువులని చూసి ఆశ్చర్యం కలిగేది.

          ఆకాశంలో మబ్బులు మూసుకొచ్చి జోరుగా వాన పడినప్పుడు ఈ లోకం ఇంకా అందంగా కనిపించేది. అమ్మ వద్దంటున్నా నేను డాబామీదికి వెళ్ళి ఒళ్ళు మాత్రమే కాక మనస్సును కూడా తడిపి ఆహ్లాదపరిచే వానజల్లుల ఆనందాన్ని పొందుతూ ఉండేదాన్ని. అమ్మ మందలింపు, తరువాత నా ఒళ్ళు తుడుస్తున్న ఆమె చేతుల స్పర్శ అలౌకికంగా ఉండేది. నేను అమ్మ నడుము పట్టుకుని వేళ్ళాడేదాన్ని. “ఉండు. వదిలిపెట్టవే నన్ను” అని ప్రేమగానే మందలించేది. ఆ తరువాత రేకుతో చేసిన పై కప్పు ఉన్న వసారాలో కూర్చోబెట్టేది. ఆ రేకుల్లోంచి పడుతున్న చినుకుల్ని లెక్కపెడుతుండగానే నా చిన్న చిన్న చేతుల్లో రుచిగావున్న కొంచెం అల్లంపచ్చడితో పాటు బాగా వేగిన పరాఠా పెట్టేది. రేకుల్లోంచి పడుతున్న వర్షపు చుక్కల టపటపల సంగీతంతో పాటు ఆ పచ్చడి, పరాఠాల రుచి ఇంక దేనితోనూ పోల్చలేనిది.

          మంచు పర్వతాలలోంచి కిందికి దిగే నది కూడా ఈ ఆకాశాన్ని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, చెట్లని, పూలని, పక్షులని, రంగురంగుల సీతాకోకచిలుకలని చూసి ఉండవచ్చు. నింగి నుండి కురిసే వర్షంలో తనుకూడా తడిసి స్నానంచేసి ఉండవచ్చు, ఆనందంతో గంతులువేసి ఉండవచ్చు. ఆ వర్షంలో గట్టు తెంచుకుని బయటికి రావద్దని దాన్ని ఎవరు ఆపుజేసి వుంటారు? ఏమనుకున్నా నది అనేది నదే కదా, ఇవన్నీ చూసి సంతోషంతో కలకలమని ప్రవహిస్తూ ముందుకి వెళ్ళేది. దానికి కొత్త కొత్త వస్తువులు కనిపిస్తూవుండేవి. అలా జిజ్ఞాసతో నిండిన కెరటాలతోనూ, ఆశ్చర్యంతో కూడిన తరంగాలతోనూ తన అజ్ఞాత యాత్రను కొనసాగించి ఉంటుంది.    

          జీవితయాత్ర కూడా ఎంత నిగూఢంగా, అజ్ఞాతంగా మొదలవుతుంది! నదిలాగే గాలివాటుతో ముందుకు వెడుతూ, వంపులు తిరుగుతూ కొనసాగే ప్రయాణం. ఎక్కడెక్కడ నుంచి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. లోకంలోని దృశ్యాలను చూస్తూ కేవలం వెడుతూ ఉండటమే ముఖ్యం. మన చేతుల్లో ఏమీ లేదు, మొదలూ చివరా కూడా. ప్రతి రోజు ఒక కొత్తరోజు. నెమ్మదిగా కొత్త రహస్యాలను వెలికితీస్తూ, కొత్త సంఘటనలతో కొట్టు మిట్టాడే కొత్తరోజు.

          పుస్తకాలబ్యాగ్ తీసుకొని స్కూలుకి వెళ్ళడం, దగ్గర అమ్మ లేకుండా రోజంతా అక్కడ గడపడం కష్టంగానే ఉండేది. అమ్మ పొద్దున్నే నిద్ర లేపేది. స్నానం చేయించేది.స్కూలు యూనిఫారం తొడిగేది. జడ వేస్తూవుంటే నేను చాలా ఏడ్చేదాన్ని. కొంచెం ఇబ్బంది మాత్రం జుట్టుని లాగడం వల్లనూ, ఎక్కువగా స్కూలుకి వెళ్ళ వలసివస్తోందనే ఆలోచన తోనూ. నన్ను తన నుంచి వేరుచేసే ఆ తెలియని టీచర్ల మధ్యకి, పిల్లల మధ్యకి పంపు తున్న అమ్మ ఎంత కఠినురాలిగానో కనిపించేది. నేను కొంచెం ఏడిస్తేనే బాధపడుతూ, నన్ను ఊరుకోబెట్టేందుకు టాఫీ తెచ్చిఇస్తానని మాట ఇవ్వడానికి పరుగెత్తుకుంటూ వచ్చే నాన్నగారు, స్కూలుకి వెళ్ళకుండా నన్ను రక్షించడానికి నా కన్నీళ్ళు చూసి ఎందుకు బాధపడటంలేదో తెలిసేది కాదు. ఆయనకి ఈ విషయంతో ఏమీ సంబంధం లేనట్లు ఉండేవారు. అమ్మ చేసే ఈ అత్యాచారాన్ని చూసికూడా చూడనట్లు తప్పించుకునేవారు. నాకెంత బాధకలిగేదో తెలుసా?      

          నా లాంటి ఎందరో పిల్లలు గత్యంతరంలేక స్కూలుకి వచ్చేవారు. బహుశా మా వయస్సు, భావాలు మమ్మల్ని ఒకరికొకరు దగ్గర కావడానికి దోహదం చేశాయి. ఎంతో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే క్రమంగా స్కూలు మాకు బాగుందనిపించసాగింది. రోజూ స్నేహితులని కలుసుకోవడానికి, వాళ్ళతో మాట్లాడుకోవడానికి, మా చిన్న-చిన్న కష్టసుఖాలు చెప్పుకోవడానికి, వాళ్ళతో కీచులాడుకునేందుకు స్కూలుకి వెళ్ళడం అనేది జీవితంలో ఒక అవసరమైన భాగం కాసాగింది. 

          నదికి కూడా తనకు తెలియని, ఇష్టంలేని, ఎత్తుపల్లాల దారుల్లో, చిన్నా-పెద్దా రాళ్ళని, వాడిగా ఉన్న ముళ్ళపొదలని, రకరకాల వస్తువులని ఎదుర్కొంటూ వెళ్ళడం నచ్చకుండా ఉండి వుండవచ్చు. కాని, మరో గత్యంతరం లేని పరిస్థితిలో వాటితోనే దారి ఏర్పరుచుకోక తప్పదు. ఈ చిన్న-పెద్ద అడ్డంకులను లెక్క చేయకుండా అది ముందుకు సాగిపోతుంది. గమ్యం ఏదో తెలియని నది తన దారిలో పూర్తిగా ఆనందాన్ని పొందుతూ పురోగమిస్తుంది.

          ఈ దారి అనేదే నిజానికి జీవితం. గమ్యం అనేది జీవితానికి అంతమే. ఈ దారిలోని ఆనందం పొందటమే జీవితాన్ని జీవితంగా చేస్తుంది. చిన్న-పెద్ద కష్టసుఖాలు, కోపగించు కునే-బతిమాలే నాటకాలు, తనవి, ఇతరులవి అయిన అమాయకత్వాలు, కొంటెపనులు, ఎన్నోసందర్భాలకి చెందిన తీపి-వెగటు జ్ఞాపకాలు, ఈ దారిని అందంగానూ, సులభం గానూ మారుస్తాయి. జీవన ప్రవాహం నదీ ప్రవాహంలాగానే దేన్నీ లెక్క చేయకుండా ముందుకు కొనసాగుతుంది. నా జీవితం కూడా ఇలాగే దేన్నీ పట్టించుకోకుండా ముందు కు సాగిపోతోంది. తల్లిదండ్రులకి ఒకే సంతానం అయిన కారణంగా వాళ్ళ ప్రేమసముద్రం లో మునిగి ఉండేదాన్ని. మనస్సులోని ప్రతి అభిలాష తీరే అంతులేని సుఖం నాకు దొరుకుతూ ఉండేది.

          బాల్యం ఎప్పుడు వెనక్కి వెళ్ళి పోయిందో తెలియనే తెలియదు. నది మైదానం ప్రాంతాలలోకి ఎప్పుడు దిగివస్తుందన్నట్లుగానే. ఆడుకునే బొమ్మలు, గవ్వలు, ఆలిచిప్ప లు, ఇసుకతో బొమ్మరిళ్ళు చేసుకోవడం, లక్కపిడతలు, దాగుడుమూతలు, తొక్కుడు బిళ్లలు మొదలైన ఆటలు ఆడటం… ఇవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. చాలా మంది స్నేహితురాళ్ళు కూడా దూరమైపోతారు. నిద్రపోతున్నప్పుడు, మెలకువగా ఉన్నప్పుడు కళ్ళలో నిండివుండే కలల రంగులు, స్వరూపాలు కూడా మారిపోతాయి. కొంటెతనం, విపరీతంగా అల్లరి చేయడం ఎక్కడ మాయమైపోతాయో తెలియదు. సమతలమైన మైదానాల్లో ప్రవహించే నదిలాగా నెమ్మది, శాంతి, గాంభీర్యం మొత్తం వ్యక్తిత్వంలో నిండి పోతాయి. నదికూడా చిప్పలు, శంఖాలు లాంటి తన ఆట వస్తువులు తీరాల మీద విడిచి ముందుకు సాగుతుంది. దాని జీవితంలో కూడా మార్పు వస్తుంది. అలరించే ప్రకృతిదృశ్యాల ఆనందంలో మునిగిపోయిన నదికి ఒక్కసారిగా గ్రామాలు, పట్టణాలు, మురికిగా వున్న రేవులు, తన నీటిలోకి వచ్చిపడుతున్న మురికినీళ్ళు, బట్టలు ఉతుకు తున్నవారు, స్నానాలు చేస్తున్నవారు, గుండెల మీద బరువుగా మారిన పడవలు, ఎక్కడి నుండో వచ్చి తనలోపల పెరిగిన పాములు, తాబేళ్ళు, మొసళ్ళు, చిన్నచేపలను తినే పెద్దచేపలు, పెద్ద-పెద్ద వలలు, పార్థివ శరీరాలు కనుపించడం మొదలుపెడతాయి. ప్రయాణంలో ఉన్న ఆనందాన్ని చవిచూస్తూ వెడుతున్న నదిలో తగ్గిపోతున్న ఉత్సాహం తేలిగ్గానే కనిపిస్తుంది. అది భయంతో సంకోచపడుతుంది.

          జీవితం నదీప్రవాహంలోని ప్రారంభంలో ఉండే నిర్మలమైన నీళ్ళలాగా ఎప్పుడూ ప్రవహిస్తూ ఉంటే ఎంత బాగుండును. అలా అయితే నదిలోకాని, జీవితంలోకాని నిర్మలత్వం అంతరించిపోకుండా ఉండేది. చిన్నతనంలో జీవితం ఎంత బాగుండేది. పెద్ద అయ్యాక ఈ కలలు నెరవేరుతాయని అప్పుడు అనిపించేది. ప్రతి పుట్టినరోజు కోసం ఎదురుతెన్నులు చూడటం జరిగేది. నా పుట్టిన రోజు త్వర-త్వరగా ఎందుకు రాదనిఎన్నో సార్లు నేను అనుకున్నాను. ఈ పుట్టిన రోజులు కూడా శైశవాన్ని వెనక్కి నెట్టేసి నెమ్మదిగా ఎదుగుతూ పెద్దవాళ్ళ సమూహంలోకి ఎప్పుడు తీసుకువస్తాయో తెలియనే తెలియదు.   

అమ్మ ప్రతివిషయంలోనూ నాకు అడ్డుచెబుతూ చెప్పడం మొదలుపెట్టింది- “ఇప్పుడు నువ్వు ఎదిగావు. చిన్నతనం వదిలిపెట్టు. ఇక్కడ కూర్చోకు. అక్కడ నుంచోకు. ఈ బట్టలు వేసుకో. అవి వేసుకోకు. ఇది తిను. అది తినకు. చదువులో మనస్సు పెట్టు. కాలేజీ నుంచి తిన్నగా ఇంటికి వచ్చేయ్. ఇవీ అవీ చేయడం నేర్చుకో, రేపు అత్తారింటికి వెళ్ళా  వంటే ఉపయోగిస్తుంది.” నది కూడా అత్తవారింటికి వెళ్ళ వలసివస్తుందా? మరి దాని మీద కూడా ఎందుకు ఆంక్షలు విధిస్తారు. దాని ప్రవాహాన్ని బలవంతంగా దారి మల్లుస్తారు. కావాలనుకున్నచోట ఆనకట్టలు కట్టి ఆపుజేస్తారు. దాని తీరాలను పరిమితం చేస్తారు.

          ఇంట్లో నా పెళ్ళి గురించి మాటలు మొదలయ్యాయి. నేను లోలోపలే సంతోషి స్తున్నా, బయటికి మాత్రం అనేదాన్ని- “దీనికి తొందరేముందమ్మా. నన్ను ఇంటి నుంచి ఇంత తొందరగా బయటికి పంపించేద్దామని అనుకుంటున్నావు. నేనింకా చదువు కోవాలనుకుంటున్నాను. నాకో కెరియర్ నిర్మించుకోవాలని అనుకుంటున్నాను.” కాని, అమ్మ మాత్రం నవ్వేసి మాట దాటవేసేది. పైగా అనేది- “నేను కూడా నా యిల్లు వదిలి పెట్టి మీ నాన్నగారి యింటికి వచ్చిన దాన్నే. ఆడదాని ఇల్లు ఆమె భర్త యిల్లే అవుతుంది. పుట్టిల్లు కూడా జ్ఞాపకం రానంతగా కొద్ది రోజుల్లోనే నీకు ఆ పరాయి ఇల్లు ఇంతగా స్వంత యిల్లుగా మారిపోతుంది. నీ కోసం నేను ఒక రాజకుమారుడిని వెతికి తీసుకువస్తాను. వచ్చి నిన్ను తనయింటికి తీసుకువెళ్ళి పోతాడు.”

          అమ్మ మాటలు నాకు అర్థంలేనివిగా అనిపించేవి. నా బాల్యం, ఆటపాటల వయస్సు గడిచిన యిల్లు, యవ్వనం అడుగుపెట్టిన యిల్లు నాకు పరాయి ఇల్లు ఎలా అవుతుంది? ఈ ఆలోచనతోనే మనస్సులో కలలు కూడా కనిపించేవి. నేను పెళ్ళి కూతురుని అవుతున్నట్లు, రాజకుమారుడు వచ్చినట్లు, తన ఇంటికి నన్ను తీసుకు వెళ్ళినట్లు.

          ఇంక అలాగే జరిగింది. నేను పెళ్ళికూతురినయ్యాను. రాజకుమారుడు వచ్చాడు. నన్ను తన యింటికి తీసుకువెళ్ళాడు. పెళ్ళి అయిన తరువాత ఆడదాని జీవితం ఎంత మారిపోతుంది. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త సంస్కృతి, కొత్త వాతావరణంతో అవినాభావ సంబంధం ఏర్పరుచుకోవలసి వస్తుంది. భర్త సాన్నిధ్యం జీవితానికి కొత్త అర్థం ఇవ్వడంతో బాటు దాన్ని సంతోషకరంగా చేస్తుంది. దానితో పాటు చాలా మంది అవసరాలు, ఇల్లు, సంసారం బరువు బాధ్యతలు అప్రయత్నంగానే తన ఆటపాటల వయస్సును లాగేసుకుంటాయి. వెనక్కి నెట్టేస్తాయి.

          భగవంతుడు తొమ్మిది నెలల వరకు తన గర్భంలో శిశువును పెంచి, ఉంచి ఈ లోకంలోకి తీసుకువచ్చే శక్తిని స్త్రీకి మాత్రమే ఇచ్చాడు. నేను తల్లిని కాబోతున్నానని తెలిసినప్పుడు నా అణువణువూ పులకరించింది. నాట్యం చేసింది. ఈ వార్తతో నా భర్తకి, ఇంట్లోని అందరికి సంతోషం వెల్లివిరిసింది. “చూస్తూ ఉండండి. మనవడే పుడతాడు. మా యింట్లో మొదట మగబిడ్డ పుట్టడమే మాకు ఆనవాయితీ.” మా అత్తగారు ఇలా అంటూనే తన ఊహాలోకంలో తన ఒడిలో తన మనవడిని ఆడిస్తూ ఉండేది. ఆవిడ ముఖంలో ఆనందం చిందులువేసేది. ఆవిడ తన మనవడికి పేరు కూడా ఆలోచించివుంచింది – రాకేష్.  

          నేను మొదటిసారిగా నా పక్కన నా కూతురిని నిద్రపోతూఉండగా చూసినప్పుడు దూదిలా మెత్తగా ఉన్న దాని శరీరాన్ని నా హృదయానికి హత్తుకున్నాను. సృజించే ఆనందం నా అణువణువులోనూ పరుగులు పెడుతోంది. నా కూతురిని నేను ఎన్నిసార్లు ముద్దులాడానో నాకు జ్ఞాపకం లేదు. నేను మాటిమాటికీ తనని చూస్తూ ఆలోచించాను- “అహా, నా కూతురికి నేను జన్మనిచ్చాను. ఇది నా రక్తమాంసాలనూ, మజ్జనూ పంచుకుని పుట్టింది. నా శరీరంలో తొమ్మిది నెలలపాటు ఉంది.” నా ఒళ్ళు ఆపాదమస్తకం పులకరించిపోయేది. కాని ఇటు వంటి పులకరింత నా యింట్లోవాళ్ళకి ఎందుకు కలగటం లేదో తెలియదు. వాళ్ళు చాలా వ్యాకులపడుతూ  అనుకోవడం నాకు వినిపించింది- “అవును. అమ్మాయి పుట్టింది.” నేను మొదటిసారి తల్లినయినప్పుడు నాకు కలిగిన అనుభూతిలాగానే నా భర్త కూడా తొలిసారి తండ్రి అయినప్పుడు అదేవిధంగా అనుభూతి చెందుతూ వుండవచ్చునని నేననుకున్నాను. కాని, పిల్లను ఒళ్ళోకి తీసుకుంటు న్నప్పుడు ఆయన ముఖంలోని భావాలు చూసి నాకు ఆశ్చర్యం కలిగింది.

          ఒకనాడు ఆయన అనేశారు- “ఈనాడు నా ఒళ్ళో కూతురు బదులు కొడుకు ఉంటే ఎంత బాగుండేదో, మనవడిని ఆడించాలని ఉవ్విళ్ళూరుతున్న మా అమ్మ కల నెర వేరేది.”

          నేను అడిగాను- “మీకు సంతోషంగా లేదా?”

          “నాకో కూతురుందని సంతోషంగానే ఉంది. కాని కొడుకైతే ఇంకోలా ఉండేది.” ఆయన నా వంక చూడకుండానే అన్నారు. ఉయ్యాలలో పిల్లని పడుకోబెట్టి వెంటనే గదిలోంచి బయటికి వెళ్ళి పోయారు.

          నేను మా తల్లిదండ్రులకి ఒకే కూతురిని. నేను జన్మించడం వల్ల వారు బాధపడుతు న్నట్లు నాకు ఎప్పుడూ ఏ మాత్రం అనిపించలేదు. మరి వీళ్ళు ముద్దులొలుకుతున్న ఈ బంగారుపాప పుడితే సంతోషించడానికి బదులు దిగులుగా ఎందుకు ఉన్నారు.

          నాకు రెండో సంతానం కూడా ఆడపిల్ల పుట్టినప్పుడు ఇంట్లో దుఃఖభరిత వాతావరణం నెలకొంది. చందమామలా వున్న అందమైన పాప వచ్చినప్పుడు సంతోషిం చడానికి బదులు ఇంట్లో ఒక విచిత్రమైన నిస్తబ్ధత వ్యాపించడం నన్ను నిలువునా వ్యథతో నింపింది. మూడో ఆడబిడ్డ పుట్టినప్పుడయితే నా పట్ల అందరి వైఖరి మారిపోయింది. అంతా నాకు ఒక నేరస్థురాలిననే భావన కలిగిస్తున్నారు. నాకు మిగిలినవారి గురించి లెక్కలేదు గాని మా వారి వ్యవహారం నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. ఆయన తనలోని అంశం నుంచి సాధ్యమయినంత దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని క్షణాలపాటు ఆయన కళ్ళలో కూతుళ్ళ మీద ప్రేమ కనిపించేది. కాని, మళ్ళీ  ఆవిరిలా అదృశ్యమైపోయేది. నేను అశాంతికి లోనై ఉండిపోయేదాన్ని. నేను కొడుకులని కాకుండా కేవలం కూతుళ్ళని కన్నందు వల్లనే నాకు ఇంట్లో గౌరవం తగ్గిపోయింది.  నా మనస్సు చాలా కలతచెందేది. మనస్సులో ఎప్పుడూ ఏదో బాధ సలసలా మరుగుతూ ఉండేది. దాన్ని శాంతపరచడానికి నేను ప్రయత్నిస్తూ ఉండేదాన్ని.

          మన దేశంలో స్త్రీలకి దేవతలతో సమానంగా ఉన్నతస్థానం ఇచ్చారు. అలాంట ప్పుడు పరిస్థితి అంతా ఇలా ఎందుకు ఉంది? నది కూడా స్త్రీలింగమే కదా. కాబట్టి స్త్రీకి, నదికి అదృష్టాన్ని బహుశా ఒకే కలంతో రాసి ఉండచ్చునని నాకనిపించేది. ఈ రెండింటికీ దేవతలా ఉన్నత స్థానం లభించింది. కనుక ఇద్దరూ కష్టాలని ఎదుర్కొంటు న్నారు. దేవతలా పూజింపబడే నదిలో రకరకాల చెత్తని పడవేసి దానికి అసలైన స్థాయిని తెలుపుతూ వుంటారు. అలాగే స్త్రీని అవమానానికి, తలవంపులకి, తక్కువ తనానికి, నిస్సహాయతకి గురి చేస్తూ ఆమె స్థితిని చూపిస్తూవుంటారు.

          శాంతంగా ప్రవహించే నది అప్పుడప్పుడూ కోపంతో రగులుతూ ఉంటుంది. విరుచు కు పడుతుంది. తనతో అనుచితంగా వ్యవహరించడాన్ని సహించుకోలేక పోతుంది. తన తీరాలని తెంచుకుంటూ అంతా నష్టపరిచి తన పగ తీర్చుకునేందుకు సిద్ధమవుతుంది. కుటుంబం కోసం ఒక్క వారసుడు లభిస్తే చాలని నా భర్తకి రెండోపెళ్ళి చెయ్యాలనే ప్రస్తావన విన్నప్పుడు కేవలం ఆకారణంతోనే నేను కూడా నదిలాగే విరుచుకు పడ్డాను. జగదీష్… అంటే మా వారి మౌనం నన్ను ఆపాదమస్తకం విచలితురాలిని చేసింది. ఎప్పుడూ శాంతంగా ఉండే నేను ప్రత్యక్షంగా గట్టిగా మండిపడ్డాను. విడాకులు తీసుకునే నిర్ణయం తీసుకున్నప్పుడు నా మనస్సు ఏమాత్రం కంపించ లేదు. కొడుకు కావాలనే అభిలాషలో నా యీ నిర్ణయాన్ని లోలోపలే స్వాగతం పలికారు. నా కూతుళ్ళని నా తోనే ఉంచుకుంటానన్న నా తిరుగులేని నిర్ణయాన్నికూడా ఎక్కువ కాదనలేదు. ఆ అమాయకులైన అవాంఛితులైన ఆడపిల్లల మీద ఎవరికైనా ఏం వ్యామోహం ఉంటుంది. ఆ పిల్లల తండ్రిగారు కొంచెం అభ్యంతరం చెప్పినప్పటికీ, తనతల్లి నచ్చజెప్పిన మీద అంగీకరించారు.

          నేను నా పిల్లలని తీసుకొని నా పుట్టింటికి వచ్చేశాను. నా తల్లిదండ్రులు ఈ విషమ పరిస్థితిని చూసి సహజంగా లేకపోయినప్పటికీ, నాకు తోడ్పాటు ఇవ్వడానికి వెనుకంజ కూడా వెయ్యలేదు. నేనుకూడా నా పిల్లలని ఎవరి మీదా ఆధారపడకుండా స్వయంగానే పోషించుకోవడానికి నిర్ణయించుకున్నాను. అందరూ గర్వించే విధంగా వాళ్ళు తమకాళ్ళ మీద తాము నిలబడగలిగేలా వాళ్ళని పెంచాలని నేను ఆలోచించుకున్నాను. నది తెలియనివాళ్ళ పోషణలో కూడా సహాయపడుతుంది, వాళ్ళకి నీళ్ళు ఇస్తుంది, వాళ్ళ  పొలాలని తడుపుతుంది, వాళ్ళకి ముత్యాల వంటి అమూల్యరత్నాలు ఇస్తుంది. ఎంతో మంది జనులకి రకరకాల జీవనాధారం కల్పిస్తుంది. నది కేవలం ఇవ్వడంలో మాత్రమే విశ్వసిస్తుంది. నదికి ఎవరైనా ఏం ఇవ్వగలరు.

          నాలో ప్రవహిస్తున్న నది తన మొత్తం శక్తినంతా తన పిల్లల జీవితాలను సరిదిద్దడం లోనే వినియోగించింది. వీళ్ళు ఏ కొడుక్కి అయినా ఏ విధంగానూ తక్కువకాకూడదని నా ఆకాంక్ష. అమ్మ-నాన్నలు కాలంచేసిన తరువాత నేను నా మనస్సుని ఇంకా దృఢం చేసుకున్నాను.      

          విడాకులు తీసుకున్న కొంత సమయం తరువాతే జగదీష్ రెండో పెళ్ళి చేసు కున్నారు. ఆయన భార్యకి కలిగిన సంతానం కూడా ఆడపిల్లేనని నాకు తెలిసినప్పుడు నాలో ఒక క్రూరమైన ఆనందం తల ఎత్తసాగింది. కాని, మరుక్షణమే చెప్పలేని భయం కలిగింది. ఆ నిరపరాధి అయిన ఆడదానికి ఎంత ఆరాటం కలిగి వుంటుందో ఊహించు కోవడం నా కన్నా మరెవరికి బాగా సాధ్యం. అప్రయత్నంగా నేను నా చేతులు దేవుడిని ప్రార్థిస్తూ జోడించాను- “ప్రభూ, నువ్వు ఆమెకి కూతురు వంటి అమూల్యరత్నాన్ని ఇచ్చి తల్లి అయ్యే అదృష్టం ప్రసాదించావు. ఆమెకి ఒక కొడుకుని కూడా ఇయ్యి. ఆమె కూడా నాలాగే బాధితురాలు కావాలని నేను కోరుకోవడంలేదు.”

          ఎదుగుతున్న నా పిల్లల ముందు నేనేమీ దాచలేదు. తన తండ్రిని గురించి మనస్సులో రేకెత్తుతున్న ప్రశ్నలకు జవాబు వెతుక్కునేందుకు వాళ్ళు ఎక్కడెక్కడో అన్వేషించుకునే అవసరం ఉండకూడదని నేననుకున్నాను. ఒకసారి దారిలో జగదీష్ మమ్మల్ని చూసి ఆగారు. నేను కావాలనుకుంటే తేలిగ్గా మరోదారి పట్టుకుని ఆయన్ని పట్టించుకోకుండా వెళ్ళి పోయివుండేదాన్ని. కాని నేను కఠినమైనదైనా ఒక అవసరమైన దారినే అనుసరించాను. నా పిల్లలతో ఆయన్ని పరిచయం చేశాను. ఆయనే మీ తండ్రి గారని చెప్పాను. నా పిల్లలు ఆయనతో సహజంగా వ్యవహరించినప్పుడు నా కెంతో ముచ్చటయింది. ఆయన మమ్మల్ని ఒక రెస్టారెంట్ కి తీసుకువెళ్ళి కాఫీ-టిఫిన్లు ఇప్పిం చారు. మాటల్లోనే ఆయన అన్నారు- “అనుప్రియా, నిన్నూ, నీ పిల్లలనీ పోగొట్టుకుని నేను సంతోషంగా లేను. కాని వంశం కూడా నిలబెట్టాలి కదా. నాకు గత్యంతరం లేకపోయింది. మోహిని అమ్మ కోరిక నెరవేర్చింది. ఒక కూతురు తరువాత ఆమె ఒక కొడుకుని కూడా ఇచ్చింది.”

          నేను గట్టిగా నవ్వాను. జగదీష్ చెప్పిన ఆ గత్యంతరం లేని విషయానికి నేను నవ్వక తప్పలేదు. ఆయన ఆశ్చర్యంగా నా ముఖం చూడసాగారు. కొడుకు పుట్టినందుకు కంగ్రాట్స్ చెప్పి నేను లేచాను.

          జగదీష్ నోటి నుండి థ్యాంక్స్ అన్నమాట రాలేదు. మరికొంత సేపు ఆగమని కోరుతూ ఆయన అన్నారు- “ఎప్పుడైనా ఏదైనా అవసరముంటే నాకు తప్పకుండా చెప్పు. ఈ పిల్లలకి తండ్రి ఇంకా జీవించే ఉన్నాడని గుర్తు పెట్టుకో.” ఆయన మాటలని వినీ వినకుండా మేము రెస్టారెంట్ నుండి బయటికి వచ్చేశాం. నా పిల్లలు ఇదంతా సహజంగా తీసుకున్నందుకు నాకు ఆశ్చర్యంతో బాటు తృప్తిగా కూడా ఉంది. నాకున్న ఒక పెద్ద భయం ఆ రోజు తొలగిపోయింది.

          అంతా మరిచిపోయి నేను తన మార్గాన్ని తనే నిర్మించుకుంటూ, దారిలోని అన్ని ఇబ్బందులనూ తన వేగంతో పక్కకి తోసివేస్తూ నిర్భయంగా నిరంతరం ప్రవహించే నదిలాగా అయిపోయాను.

          ఏ మలుపు నుంచి నేను జీవితంలో కఠినమైన మార్గాన్ని ఎంచుకున్నానో అప్పటి నుంచి ఇప్పటి వరకూ నదిలో ఎంత నీరు ప్రవహించిందో తెలియదు. నా పెద్ద కూతురు ఐఏఎస్ పరీక్ష ప్యాస్ అయినప్పుడు నేను నా ఆనందాశ్రువులను దాచుకోలేక పోయాను. రెండో కూతురు మనస్తత్వశాస్త్రంలో ప్రొఫెసర్ గా దేశంలోని అతిపెద్ద యూనివర్సిటీలో జాయిన్ అయినప్పుడు నాకు నా కల నెరవేరడం మొదలైందని అనిపించింది. అందరి కన్నా చిన్న కూతురు యానిమేషన్ లో కోర్సు పూర్తి అయిన తరువాత తను స్వయంగా పని మొదలు పెట్టినప్పుడు నేను జీవితంలో కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణురాలిని అయినట్లుగా నాకనిపించింది.              

          ఆ రోజు తలుపు బయట నుంచి బెల్ మోగగానే నా పెద్దకూతురు ఆఫీసు నుంచి వచ్చిందేమోననుకున్నాను. చిన్నవాళ్ళిద్దరూ ఇంటికి ఎప్పుడో వచ్చేశారు. కాని, తన కారు ఆగి, తలుపు తెరిచిన చప్పుడు వినిపించలేదు. రకరకాల అనుమానాల మధ్య నేను తలుపు తెరిచాను. ఎదురుగా జగదీష్ నిలబడి ఉండటం చూసి ఆగిపోయాను. జగదీష్ తల మీది జుట్టు తెల్లబడటం స్పష్టంగా తెలుస్తోంది. నేను వద్దనుకుంటున్నా సహజంగా ఉండలేక పోయాను. నిశ్శబ్దాన్ని ఆయనే భంగం చేశారు- “లోపలికి రమ్మని కూడా అనవా అనుప్రియా?” నేను తలుపు దగ్గర నుంచి తప్పుకున్నాను. ఆయన లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నారు.

          తలుపు తెరిచిన చప్పుడు విని ఇద్దరు పిల్లలూ తమ గదుల్లోంచి బయటికి వచ్చారు. జగదీష్ అక్కడ కూర్చుని వుండటం చూసి వాళ్ళకి కూడా ఆశ్చర్యం కలిగింది. ఇద్దరూ ఆయనకి నమస్తే చెప్పారు. ఆయన లేచి ఇద్దరి తలల మీద ఆశీర్వదిస్తున్నట్లుగా చెయ్యి పెట్టారు. నాకు కొంచెం అసహజంగా ఉండి, నన్ను నేను సంబాళించునేందుకు మంచి నీళ్ళు తెచ్చే వంకతో కిచన్ లోకి వెళ్ళాను. నేను తిరిగి వచ్చేసరికి ఇద్దరు పిల్లలూ వాళ్ళ గదుల్లోకి వెళ్ళిపోయారు.

          మంచినీళ్ళు అందిస్తూ నేను జగదీష్ ని అడిగాను- “ఏమిటి ఇలా వచ్చారు? ప్రత్యేకంగా ఏమయినా పని వుందా?”

          “పనేదీ లేకుండా నేను ఇక్కడికి రావడం సాధ్యం కాదు. ఈ హక్కు నేను ఎప్పుడో కోల్పోయాను. నువ్వు నిజం చెబుతున్నావు. నేను ఇక్కడికి కొంచెం ముఖ్యమైన పనిమీదనే వచ్చాను. దీని కోసం నేను చాలా ధైర్యం కూడా తెచ్చుకోవలసి వచ్చింది. మోహిని ఆరోగ్యం ఏమీ బాగుండటం లేదు. అబ్బాయికి ఈ వూరు ట్రాన్స్ ఫర్ అయితే బాగుంటుం దని అనుకుంటున్నాను. వాడు బయట వుండి మూడేళ్ళ కన్నా ఎక్కువే అయింది. ప్రయత్నాలన్నీ చేశాను. కాని ఇంత వరకూ ఏదీ ఫలించలేదు.”

          నాకు చాలా ఆశ్చర్యం కలిగింది- “ఇందులో నేనేం చెయ్యగలను?”

          “మన… కాదు-కాదు నీ కూతురు గౌతమి ఇందులో సహాయం చెయ్యగలుగుతుంది. తనే ఈ డిపార్ట్ మెంటుకి హెడ్. అంతా తన చేతిలోనే ఉంది. తను ఒక సంజ్ఞ చేస్తే సరి పోతుంది.”

          ఓహో. అయితే జగదీష్ తన కొడుకు ట్రాన్స్ ఫర్ చేయించుకునేందుకు గౌతమి సహాయం తీసుకునేందుకు వచ్చారన్న మాట. ఎందుకనో… నా కళ్ళు చెమ్మగిల్లాయి.

          అప్పుడే గౌతమి వచ్చేసింది. తను జగదీష్ కి నమస్కారం చేసి లోపలికి వెళ్ళబోతూ వుంటే నేను దాన్ని అక్కడే ఆగమని విషయం అంతా చెప్పాను. తను అంతా విన్నాక అంది- “ఇదేం పెద్ద విషయం కాదు.  పని అవుతుంది.”       

          జగదీష్ లేస్తూ అన్నారు-“థాంక్యూ అమ్మా.”

          గౌతమి చెప్పిన సమాధానం నన్ను నిలువెల్లా ఆర్ద్రం చేసింది- “అమ్మ రికమెండ్ చేసింది. పని కూడా చిన్నది. అందువల్ల ఇందులో థ్యాంక్స్ చెప్పేదేమీ లేదు.”

          బయటికి వెడుతున్న జగదీష్ ముఖంలో రంగులు మారటం నేను గమనించాను. ఆయన నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నారు.

          ఈ రోజున నా ముగ్గురు కూతుళ్ళు తమ-తమ ఇళ్ళలో గౌరవంగా ఉంటున్నారు. వాళ్ళు ఎంత వేడుకున్నా, ప్రయత్నించినా నేను నదిలాగా ఒంటరిగానే నా ప్రయాణం కొనసాగించాలని నిర్ణయించుకున్నాను. నాకు ఏర్పరిచిన మొత్తం సౌకర్యాలన్నీ చూడటా నికి వాళ్ళు వస్తూ ఉంటారు. నన్ను సంతోషంగా ఉండటం చూసి వెడతారు. వెళ్ళేటప్పుడు లాజో తో చెప్పడం మరిచిపోరు- “ఆంటీ, అమ్మకేం కావాలో జాగ్రత్తగా కని పెట్టి చూస్తూవుండు.” నాకు పైబడుతున్న వయస్సుని చూసి వాళ్ళు నేనెంత వద్దంటు న్నా లాజో ని నన్ను కనిపెట్టుకుని ఉండటానికి నా దగ్గర ఉండే ఏర్పాటు చేశారు.

          ఇప్పుడు నేను తొంభై యేళ్ళదాన్నయ్యాను. వెనక్కి తిరిగి చూసుకుంటే కేవలం ఒక ప్రవహించే నది కనిపిస్తుంది. అది ఏదో పెద్ద సముద్రంలో తన అస్థిత్వాన్ని విలీనం చేసుకోవడానికి ముందుకి వెడుతోంది. అనంతమైన బ్రహ్మ నా కోసం చేతులు చాచి నిలబడివున్నాడు. వెళ్ళి అందులో కలిసిపోవడానికి నేను శాంతంగా ఉన్న, సంతృప్తితో నిండిన మనస్సుతో సాగిపోతున్నాను.

***

డా. రమాకాంత్ శర్మ – పరిచయం

1950 లో భరత్ పుర్, రాజస్థాన్ లో జన్మించిన డా. రమాకాంత్ శర్మ 90 కి పైగా కథలు వ్రాశారు. నాలుగు కథా సంకలనాలు, రెండు వ్యంగ్యసంకలనాలు, నాలుగు నవలలు, ప్రచురితమయ్యాయి. కొన్ని కథలకు ప్రతిష్ఠాత్మకమైన యు.కె. కథాకాసా, కమలేశ్వర్ స్మృతి పురస్కారంతోబాటు మహారాష్ట్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ, కియాన్ ఫౌండేషన్ ల ద్వారా సన్మానం పొందారు. కొన్ని కథలు ఇతర భాషలలోకి అనువదించ బడ్డాయి. బ్యాంకింగ్, మానేజిమెంట్ మొ. విషయాల పైన వ్రాసిన పుస్తకాలకు రాష్ట్రపతి మరియు
కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డులు పొందారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జనరల్ మానేజరుగా రిటైరయ్యాక ముంబయిలో ఉంటున్నారు.

*****

Please follow and like us: