‘భిన్నసందర్భాలు’ – పునరుత్పత్తి రాజకీయాలు

– ప్రొ కె. శ్రీదేవి

 

          మహిళా సంఘాలు, స్త్రీవాదులు పునరుత్పత్తి, రాజకీయ రంగాలలో  లేవనెత్తిన అనే క ప్రశ్నలను ఓల్గా “భిన్నసందర్భాలు” కథాసంపుటిలో చర్చించారు. శ్రమ విభజన, లైంగికతను నిర్వచించడంలో ఉండే రాజకీయ అంశాలను నిర్దిష్టమైన జీవన సందర్భాల లోంచి ఓల్గా విశ్లేషించారు. పునరుత్పత్తిలో ప్రధానపాత్ర వహిస్తున్నది స్త్రీలే అయిన ప్పటికీ, అందులో స్త్రీలకు ఎటు వంటి స్వేచ్ఛలేదు. ఈ స్వేచ్ఛారాహిత్య స్థితిని ప్రశ్నించటమే కాక, స్త్రీలు పిల్లల్ని కనే యంత్రాలుగా మార్చబడుతున్న విధానాలను చిత్రించారు. భారతీయ వివాహ వ్యవస్థలో స్త్రీకి ఎటువంటి స్వతంత్రత లేదు. స్త్రీల లైంగిక అవసరాలతో సమాజానికెటువంటి పనిలేదు. స్త్రీలచేత అన్ని రంగాలలో పురుషు లకు సేవలు  చేయించటమే దాని లక్ష్యం. అటువంటి వివాహవ్యవస్థలో వుండే అసమంజసత్వాన్ని, దాన్ని రూపొందించి నడుపుతున్న పురుషస్వామ్యాన్ని ఓల్గా ‘భిన్నసందర్భాలు’ కథలు నిలదీసి ప్రశ్నించటమే కాక చర్చలకు ఆహ్వానిస్తాయి.

        “భిన్నసందర్భాలు” కథా సంపుటిలోని కథలు స్త్రీల లైంగికత్వం, (Sexuality) స్త్రీల పునరుత్పత్తి రాజకీయాల వెనుకవున్న పితృస్వామిక స్వభావాన్ని ఆవిష్కరిస్తాయి. లైంగిక సంబంధాలలో వుండే ‘భిన్నసందర్భాలు’ విభిన్న అనుభవాలలోని అసమాన అధికార రాజకీయాలను, వాటి స్వభావాన్ని నొక్కి చెబుతాయి. ఆత్మీయమైన, వ్యక్తిగత మైన సంబంధాలలో కూడా రాజ్యం పోషించే పాత్రను, దాని రాజకీయ స్వభావాన్ని పునరుత్పత్తి హక్కుల నేపధ్యంలో ఈ సంపుటంలోని కథలు చర్చిస్తాయి. “వ్యక్తిగతం కూడా రాజకీయమే” అన్న స్త్రీవాద ఉద్యమ నినాదంలోని అర్థమేమిటో ఈ కథల ద్వారా అవగాహనలోకి వస్తుంది.

          ఓల్గా లైంగికత్వాన్ని ప్రధాన రాజకీయ ప్రశ్నగా లేవనెత్తి దానికి సంబంధించిన విషయాలను ఇక్కడ ప్రస్తావించారు. పిల్లలు కనకుండా గర్భనియంత్రణ సాధనాలను వాడటానికి, గర్భస్రావం చేయించుకునే హక్కు కోసం, వివాహంతో ప్రమేయంలేకుండా తల్లులయ్యే స్వేచ్ఛకోసం ‘భిన్నసందర్భాలు’ కథలోని  సుభద్ర, శాంతి పాత్రలు సంఘర్షి స్తాయి.

          భారతీయ సమాజంలో స్త్రీల లైంగికక్రియ వివాహం వలన మాత్రమే కుదురు తుందనీ, వివాహానికి వెలుపల గల లైంగిక సంబంధాలన్నీ అక్రమ సంబంధాలుగానే చూడబడుతున్నాయి. అలాగే లైంగిక సుఖావసరం స్త్రీలకంతగా ముఖ్యంకాదని కూడా నమ్మించారు. ఆ భావజాలంలోంచే స్త్రీల శరీరాన్ని వివాహం, సంతానం కోసం మాత్రమే ఉపయోగపడే పరికరాలుగా తయారుచేసే వ్యవస్థగా మన వైవాహిక వ్యవస్థ స్థిరీకరించ బడింది. అలా స్థిరీకరించబడిన వ్యవస్థలోని అసమంజసత్వాన్నినిలదీస్తాయి. పితృస్వామ్య వ్యవస్థ నిర్ధారించిన క్రమంలోకాక విద్యావంతులైన స్త్రీల ఆలోచనలలో వ్యక్తీకరించబడిన భిన్నమైన, ప్రత్యేకమైన వ్యక్తిత్వాలను, స్త్రీలకు పునరుత్పత్తి హక్కుల పట్లగల భిన్నమైన ఆలోచనలను సమర్థవంతంగా ఈ కథా సంకలనంలో ప్రతిపాదించడం జరిగింది.

          స్త్రీ గర్భం ధరించడం, ధరించకపోవడం అనే అంశాలు స్త్రీల చేతుల్లో లేవన్న నిజాన్ని ఎత్తిచూపిన కథ ‘భిన్నసందర్భాలు’. “స్త్రీ గర్భం ధరించడం” అనే విషయం ఒకటే అయినా, భిన్నసందర్భాలలో అంటే పెళ్ళికి పూర్వం గర్భం ధరించడానికి, పెళ్ళి తర్వాత గర్భం ధరించడానికి ఇలా రెండు వేరు వేరు సందర్భాలలో స్త్రీలు ఎదుర్కొం టున్న సంఘర్షణలను ఈ కథలో రచయిత చర్చకు పెట్టారు.

          ‘భిన్నసందర్భాలు’ కథలో సుభద్ర, శాంతి, లీల ప్రధాన పాత్రలు. ప్రపంచ స్త్రీల ఉద్యమంలో ప్రధానంగా చర్చనీయాంశమైన పునరుత్పత్తి స్వేచ్ఛ గురించి ప్రశ్నలు లేవనెత్తిన పాత్ర శాంతి. చురుకుదనం, తెలివితేటలు, ప్రగతిశీల భావాలు కలిగిన యువతి ఈమె. “పెళ్ళి” అంటే స్పష్టమైన అభిప్రాయం ఈమెకు వుంది. శాంతికి పెళ్ళంటే యిష్టంలేదు. మొగుడికి చాకిరీ చేసి, అతని చెప్పుచేతల్లో వుండటం నా ఒంటికి సరిపడదు అంటుంది. రెండవ పాత్ర సుభద్ర. ఈమె సంప్రదాయ చట్రంలో వుంటూనే  చిన్నతనంలో ఏర్పడిన భయం వలన పిల్లల్ని కనటం తన కిష్టంలేదని వ్యతిరేకిస్తుంది. ఇక మూడవ పాత్ర లీల. ఈమె సుభద్ర చెల్లెలు. సుభద్ర, లీల ఇద్దరికి ఎలాంటి ప్రజా సంఘాలతో పరిచయం లేదు. వీరు సంప్రదాయ కుటుంబ నేపధ్యం నుండి వచ్చారు. కానీ సుభద్రకు ఎదురైన పరిస్థితులే వారిలో స్త్రీఅస్థిత్వ స్పృహను కలిగిస్తాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, లీల పాత్రకు స్పష్టమైన అభిప్రాయాలు గానీ, ఖచ్చితంగా ఇలాగే వుండాలన్న స్పృహగానీ లేదు. అందరి అభిప్రాయాలను వింటూ పాత కొత్త భావాల సంఘర్షణలో కొట్టుమిట్టాడే పాత్ర. అందుకే ఆమె ఇలా అంటుంది. తనకు మతి పోగొట్టటానికే సుభద్ర అక్కయ్యగా పుట్టిందనీ శాంతి ఫ్రెండయ్యిందనీ వ్యాఖ్యానిస్తుంది.  

          “దానికి పెళ్ళి కావాలి గానీ పిల్లలొద్దు. నీకు పిల్లలు కావాలిగానీ పెళ్ళివద్దు. మీరు ఏమవుతారోనని నాకు చెడ్డభయంగా వుందే…. అందరిలాగా మామూలుగా వుండండి’ అని అడుగుతుంది. శాంతి మాత్రం ఆమె భయాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా మేమవుతాం? నీకెందుకు టెన్షన్? నేను పెళ్ళి చేసుకోకుండా పిల్లల్ని కంటాను. మీ అక్క పెళ్ళి చేసుకొన్నా కూడా పిల్లల్ని కనదు అంతేగదా. అని చాలా సాధారణంగా తీసుకొంటుంది. అలా అంటుందే కానీ ఆ మాటలు వాళ్ళ జీవితంలో అత్యంత సంక్షోభానికి ప్రధాన కారణ మవుతాయి.

          స్త్రీల లైంగికత్వాన్ని, నిర్వచించడంలో స్త్రీల పునరుత్పత్తి హక్కులు ప్రధానమైనవి. పిల్లల్ని కనాలా? వద్దా? అనే విషయంలో స్త్రీలకు స్వయం నిర్ణయాధికారం లేనంతకాలం స్త్రీలు స్వతంత్రులు కాలేరు. ఇంటి చాకిరి, పిల్లల పెంపకంలోకి బలవంతంగా నెట్టబడ్డం త కాలం స్త్రీలు పురుషులతో సమానులు కాలేరు. అందుకే జండర్ సమతౌల్య (gender equity) సమాజానికి ఉత్పత్తి మీద శ్రామికుల కంట్రోలు మాత్రమే సరిపోదనీ, సంతానోత్ప త్తిలో కూడా ప్రజాతంత్ర విధానం వుండాలని, “పునరుత్పత్తి ప్రజాస్వామ్యాన్ని” (Democracy in Reproductivity) ఈ రోజు స్త్రీవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఇంత వరకు స్త్రీలు తమకు ఇష్టమై పిల్లల్ని కంటున్నారా లేక పిల్లల్ని కనాలి అనే నిర్ధేశిత నియంత్రణ వారి పైన వుంది కాబట్టి పిల్లల్ని కంటున్నారా? అన్న ప్రశ్నకు స్పష్టమైన అవగాహన ఏర్పరచే సాహిత్యం మనకింత వరకు నిర్దిష్టంగా రాలేదు. కొంత వరకు చలం, కొ.కు. ఈ సమస్యల పై అపుడపుడు కొంత కామెంట్స్ రూపంలో కొన్ని వాక్యాలు రాసినా వాటి పై చర్చకూడా జరగలేదు. అయితే స్త్రీవాద ఉద్యమం తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన క్రమంలో స్త్రీవాదులు ముందుకు తెచ్చిన పునరుత్పత్తి హక్కుల అజెండాను తన కథలలో ముఖ్యంగా “భిన్న సందర్భాలు” కథా సంకలనంలోని సగం కథలు చర్చిం చాయి.

          ఇంత కాలం స్త్రీల జీవితాలను శాసిస్తున్న పితృస్వామ్య వ్యవస్థ స్త్రీల శరీరాల చుట్టూ ఎంతకాల్పనిక సాహిత్యాన్ని విరజిమ్మినా, స్త్రీ శరీరవయవాలకు సంబంధించిన స్పృహను కలిగించడంలో మాత్రం పూర్తిగా విఫలమైంది. ఆడవాళ్ళు ఎంత అమాయ కంగా వుంటే, పితృస్వామ్య వ్యవస్థ ఉనికి అంత స్థిరంగా వుంటుంది. అందుకే స్త్రీల శరీరాలను వారికి పరాయిగా చేసిన తీరును రచయిత సుభద్ర, ఛాయల మధ్య జరిగిన సంభాషణల్లో ఓల్గా స్పష్టంచేశారు.

          “అసలివన్నీ మనకు తెలిసే అవకాశం వుండాలి ఎలా వుంటుంది?, ఉండే వుంటాయి. మనకు తెలియదు. మొన్నొక పుస్తకం చూశా అందులో ఈ విషయం వుంటుం దనిపించింది గానీ షాపులో ఆ పుస్తకం తిరిగేయాలన్నా, కొనాలన్నా, చచ్చే మొహమాటం గా అనిపించింది….యేంటే యివన్నీ నిషిద్ధ విషయాలలాగా వుంటాయంటుంది” సుభద్ర పెళ్ళిగాని ఆడపిల్లలకివన్నీ అనవసరం అనీ, వాటిని తెలుసుకున్న వాళ్ళు మంచివాళ్ళు కాదనీ, పెళ్ళయ్యాక వాటంతటవే తెలుస్తాయి. కాబట్టి ఈ విషయాలు ఆడవాళ్ళకి అక్కర్లేదనుకుంటారని ఛాయ అంటుంది. పునరుత్పత్తిలో అమలయ్యే గుప్తతపట్ల, అమ్మాయిలకున్న భయాలను, సందేహాలను పెంచే అంశాలపట్ల తన అసహనాన్ని ప్రదర్శిస్తుంది.

          ఎంతో మంది స్త్రీలు గర్భధారణ గురించి ఏమి తెలియకుండా వాళ్ళ, ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండానే తల్లులవటం ఒక ఎత్తైతే,  పిల్లల్ని ఎప్పుడు కనాలి,  ఎందర్ని కనాలి,  ఎలా పెంచాలి? అన్న విషయాలు నిర్ణయించేది పురుషాధిపత్య సమాజమే. చాకిరి చేసేది మాత్రం స్త్రీలేనన్న గమనాన్ని ఓల్గా ఈ కథలో ఒక చర్చలాగా పునరుత్పత్తి అంశాల పట్ల చైతన్యాన్ని కలిగిస్తారు. అది కూడా ఒంటెత్తు పోకడగా కాక సమస్య రెండు ముఖాలను విభిన్న అభిప్రాయాలు కలిగిన రెండు పాత్రలను సృజించి, అందించడం ద్వారా పాఠకులకు పూర్తి అవగాహన కలుగుతుంది.

          ఇక ఈ పునరుత్పత్తి అంశానికి అత్యంత దగ్గరగా చర్చించాల్సిన అంశం అత్యాచారం. ఇది కేవలం బలవంతపు లైంగిక క్రియ మాత్రమే కాదు. స్త్రీని ఒక వ్యక్తిగా, మనిషిగా పురుషుడు గుర్తింప నిరాకరించే చర్య. ఆడవాళ్ళు ఆడవాళ్ళుగా పుట్టినందుకు సమాజం వేసే శిక్ష. (ఒక మనిషిని హీనపరచి, హేయంగా చూసి, నువ్వు ఆడదానివి అని చెప్పటానికి మగవాళ్ళు చేసే దౌర్జన్యం. ఆడవాళ్ళను అదుపులో వుంచటానికి, తమ కోర్కెలు తీర్చే సాధనంగా మార్చటానికి చేసుకునే ప్రయత్నం.) ఇది ఒక వ్యక్తి తన కిష్టమైన మరోవ్యక్తి మీద దౌర్జన్యం చేసే చర్యేకాదు. అధికారంలో వున్న వ్యక్తి మరో వ్యక్తిని అణచివేసే రాజకీయ చర్య. భార్యను సొంత ఆస్తిగా చూస్తూ తన ఆస్తిని తాను అనుభవిం చటంలో మరొకరి ప్రమేయం అక్కర్లేదనే అవగాహన పురుషస్వామ్య సమాజం పురుషుల కిచ్చింది. అత్యాచారం విషయంలో భార్యయినా, మరొకరైనా వారి ఇష్టానికి వ్యతిరేకంగా జరిపే అణచివేత చర్యగా అత్యాచారాలను స్త్రీవాదులు గుర్తించినారు. ఈ క్రమంలో వాసులాంటి వాళ్ళు స్త్రీలు పిల్లల్ని కనకపోవటం అనేది పురుషాధిపత్య సమాజం నిర్ధారించిన కట్టుబాట్లను ధిక్కరించటంగానే చూస్తారు. అందుకే సుభద్ర భర్తవాసు ఆమె పిల్లల్ని కనకపోవటాన్ని “పిచ్చిపనిగా, పనికిమాలిన పనిగా, పొగరెక్కి చేసిన పనిగా” వర్ణిస్తాడు.

          “భిన్న సందర్భాలు” కథ పునరుత్పత్తిలో భాగమైన మాతృత్వం చుట్టూ అల్లబడిన అందమైన భావజాలాన్నే స్త్రీలకు సమాజం చూపిస్తుంది. కానీ ఆ మాతృత్వాన్ని సాధించ డంలో వాళ్ళు పడుతున్న శ్రమ, భయం మాత్రం చర్చలోకి రాకపోవటంలోని పురుష రాజకీయాల్ని మనం కొంచెం లోతుగానే గమనించాలి. స్త్రీలను తయారు చేయడంలో వున్న శ్రద్ధ, శిక్షణ స్త్రీల శ్రమను అర్ధంచేసుకోవటంలోగానీ, వారి భయాలను పోగట్టే ప్రయత్నంలోగానీ ఈ సమాజం ఎక్కడ విఫలమౌతుందో  ఓల్గా ఈ కథలో బట్టబయలు చేశారు.

          శాంతి పెళ్ళి అనే తంతులేకుండా తను ప్రేమించిన కిషోర్ తో బిడ్డను కనాలను కుంటుంది. పెళ్ళి కుదరదని ఖచ్చితంగా తెలిసీ, కిషోర్ తో సంబంధంలోకి వెళ్ళటం, బిడ్డను కనాలనుకోవటం ఇవన్నీ మామూలుగా స్త్రీల జీవితాలలో జరిగే విషయం కాదు. అట్లని శాంతి ఖచ్చితంగా “పెళ్ళేచేసుకోను. పెళ్ళిచేసుకోకుండానే బిడ్డను కంటాను” అని కూడా నిర్ణయించుకొని ప్రవర్తించిన పాత్రకాదు.యాదృఛ్చికంగా జరిగిన సంఘటనలు, వాటి పర్యవసానాలను, స్త్రీల జీవితంలోని అధికార సంబంధాల వాస్తవికతను అర్థం చేసుకోటానికి లైంగిక విషయాలలో ఒక్క పితృస్వామ్య దృష్టితోనో లేదా వర్గ దృష్టితో మాత్రమే చూస్తే సరిపోదు. వర్తమాన సమాజంలో ఏ ఆధిపత్యాన్నైనా సరే విశ్లేషించటానికి రెండూ అవసరమే అన్న వాస్తవం ఈ కథలో అటు సుభద్ర పాత్ర ద్వారా, ఇటు శాంతి పాత్ర ద్వారా రచయిత వ్యక్తంచేసారు.

          శాంతి తండ్రి రంగనాథం శాంతి ఆలోచనలకు, అభిప్రాయాలకు ఏమాత్రం అడ్డు తగలడు. ఆయన తనతరంలో కుటుంబ వ్యవస్థ ఏర్పరచిన భావజాలానికి విరుద్ధంగా శాంతి కిషోర్ విషయం చెప్పినపుడుగానీ అతను రహస్యజీవితంలోకి వెళ్ళడం వల్ల పెళ్ళి చేసుకొని అందర్లా బ్రతకడం సాధ్యంకాదని చెప్పినప్పుడుగానీ ఒక్కక్షణం నివ్వెర పోయినా శాంతి అభిప్రాయాన్ని గౌరవిస్తాడు. అందుకు కేవలం శాంతి వ్యక్తిత్వం, సంస్కారం పట్ల అతనికి వున్న నమ్మకం. ఆ నమ్మకం వల్లనే శాంతి తల్లి జానకమ్మ ఆలోచనా పరిధిలో ఏ మాత్రం అభ్యుదయ భావాలకు అవకాశం లేకపోయినా శాంతి నెలసరి కాకపోవడం పట్ల అనుమానం వున్నా, శాంతి ప్రవర్తన పై వున్న నమ్మకంతో ఆమెను అడగలేకపోతుంది. కనీసం జానకమ్మ అనుమానించే సాహసం చేయలేక పోతుంది. సంఘం ఏర్పరచిన కట్టుబాట్లకు భయపడి శాంతి తీసుకున్న నిర్ణయం పట్ల ఎంత నమ్మకం, సానుభూతి వున్నా కూడా జానకమ్మ ఆమె నిర్ణయాన్ని సడలించే ప్రయత్నం చేసి విఫలమవుతుంది. వివాహతంతు లేకుండానే బిడ్డను కనాలనే తన కోరిక సమాజ ఆమోదానికి వ్యతిరేకంగా వున్నప్పటికీ తన పునరుత్పత్తి హక్కును శాంతి కాపాడుకో గలుగుతుంది.

          సుభద్ర ఇష్టానికి వ్యతిరేకంగా ఆమె భర్త వాసు బిడ్డల కోసం జరిపే అత్యాచారాలను తట్టుకోలేక, అతని హింస నుంచి బయటపడుతుంది. సుభద్ర తన చెల్లెలికి ఉత్తరం రాస్తూ ఇలా అంటుంది “ఎదకాని ఆవు – తల్లి కావాలనే కోర్కె కలగని రుతువులో ఆవు అట్లా దొరికిపోదు. మనుషులకు కానీ ఆంబోతులకు కానీ మగవాళ్ళు తమ పెంపుడు జంతువుల గర్భధారణ కోసం యేర్పాట్లు చేసినట్లు, తమ కోసం కూడా యేర్పాటు చేసుకొ ని”, పెళ్ళిని కనిపెట్టారని వ్యాఖ్యానిస్తుంది.

          వివాహితుడైన  పురుషుడు కోరుకున్నంత కాలం భార్య తల్లికావటానికి సిద్ధంగా వుండాల్సిందే. పునరుత్పత్తిలో పురుషుడి అధికారం ఏ స్థాయిలో కొనసాగుతుందో తెలియ జేస్తాయి. ఎలిజిబెత్ ఫిషర్ చెప్పినట్లు పురుషులు పశువుల పెంపకం మీద సంతానో త్పత్తిలో తాము నిర్వహించాల్సిన పాత్ర గురించి నేర్చుకున్నారు. పశువులను బలవంతంగా జత చెయ్యటం నుంచి, పురుషులకు స్త్రీలను బలాత్కరించ వచ్చుననే ఆలోచన వచ్చింది. పశువుల పెంపకంలో వున్న మొరటుదనం, కర్కశత్వం, హింస యివి పురుషుల వ్యవస్థీకృతమైన లైంగిక దురాక్రమణకు దారితీశాయని భావించే విశ్లేషణల నేపథ్యంలోంచే సుభద్ర చాలా లోతుగా స్త్రీలను సంతానోత్పత్తి సాధనంగా ఏర్పరచిన చారిత్రక క్రమాన్ని, తన పైన జరిగిన లైంగికదాడి అనుభవంలోంచి చూడగలుగుతుంది. స్త్రీల అణిచివేత రాజకీయాలకు గల మూలాల పట్ల ఓల్గాకు గల అవగాహన సుభద్ర, శాంతి, పాత్రచిత్రణలో చాలా స్పష్టంగా తెలుస్తుంది.

          ‘పెళ్లైన ఆడది పిల్లల్ని కని తీరాలి’ అనే శాసనం ఆడదాని భద్రతకే కల్పించబడి నట్లుగా పురుష సమాజం చిత్రించింది. స్త్రీలే తన తోటిస్త్రీలకు బోధించే స్థాయిలో స్త్రీల మెదళ్ళకు శిక్షణనిచ్చి పునరుత్పత్తి రాజకీయాలు స్త్రీలను పాలించాయి. అసౌకర్యంగా, తప్పనిసరిగా కనిపెంచాల్సిన భారం స్త్రీల పై పెట్టడం, యువతులకు గర్భనియంత్రణ గురించి సరైన సమాచారం యివ్వక పోవటం లాంటి అంశాలు స్త్రీల మీద మాతృత్వం బలవంతంగా రుద్దబడిన చర్యగా అర్థమవుతోంది. అందుబాటులో వున్నవోరల్ పిల్స్ గానీ, కాపర్ టీలాంటి గర్భనిరోధక సాధనాలు చాలా వరకు సరిగా పనిచేయనివిగా, ఖరీదైనవిగా, ఒక్కొక్కసారి ప్రమాద కరమైనవిగా కూడా వుంటున్నాయి. పితృస్వామ్యం గర్భస్రావానికి పరిమితులు విధించి చాలాసార్లు  గర్భస్రావం చేసుకునే అవకాశాన్ని పూర్తిగా నిరాకరించి, అదే సమయంలో స్త్రీలను లైంగిక సంబంధాలలోకి తప్పనిసరిగా వెళ్ళేలాగా తీవ్రమైన ఒత్తిడిని వారి పై కలుగజేస్తున్నది.

          మాతృత్వ భావజాలం స్త్రీల అణచివేతకు గల పునాదుల్లో ఒకటి. దీని ద్వారానే పితృస్వామ్యాన్ని స్థిరపరచటం సాధ్యమవుతుంది. సునంద తండ్రి, సునంద భర్త నరేంద్ర, అతని తల్లి,  మిగిలిన బంధువులు అందరిలో పాతుకుపోయిన పితృస్వామిక స్వభావాన్ని చిత్రించటం ద్వారా పునరుత్పత్తిలోని వ్యక్తిగత రాజకీయదృక్కోణాన్ని ఓల్గా నిరూపించే ప్రయత్నం చేశారు.

          పశువులకంటే హీనంగా స్త్రీలను పోల్చడం, స్త్రీల పై జరుపుతున్న అణచివేతకు, హింసాస్వరూపాన్ని అర్థంచేయించడానికి రచయిత తీసుకున్న ‘భిన్న సందర్భాలలోని కథా వస్తువు ఓల్గాగారి అభివ్యక్తి గాఢతకు నిదర్శనం. సుభద్ర తాను తల్లినయ్యే అవకాశా న్ని అబార్షన్ ద్వారా రద్దు చేసుకుంటే, శాంతి అబార్షన్ను వ్యతిరేకించి పెళ్ళి కాకపోయినా తల్లి కావాలనుకుంటుంది. తల్లికావటంలో శాంతి భావుకత్వానికి లోనైతే, సుభద్ర భయానికి లోనయ్యింది. ఏమైనప్పటికి, సుభద్ర, శాంతి ఇద్దరు కూడా తమ అభీష్టాలు నెరవేర్చు కోవడంలో కొంత వ్యతిరేకతకు, సంఘర్షణకు లోనయినా తాము వాంఛించినట్లు గానే నడచుకున్నారు. వ్యక్తులుగా తమ భావస్వాతంత్య్రాయాన్ని తాముగా ఒక హక్కుగా పొంద టానికి  పోరాటమార్గాన్ని ఎంచుకున్న మహిళా సంఘాల ద్వారానే తమ స్వేచ్ఛను నిలబెట్టు కోవాల్సి వచ్చింది. సుభధ్ర, శాంతి ఈ రెండు పాత్రల సృష్టిలో రచయిత తాను చెప్పదలచుకున్న అంశాన్ని కొంత భావుకత్వం చోటుచేసుకున్నా ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేశారు. ప్రయత్నిస్తే తమ పునరుత్పత్తి హక్కుల్ని స్త్రీలు కొంత ఘర్షణ ద్వారా నైనా సాధించు కోవచ్చనే అభిప్రాయాన్ని”భిన్న సందర్భాలు” కథలో సందేశాత్మ కంగా ఓల్గా సూచించారు.

          ఈ కథ కొంత సుధీర్ఘంగా సాగినా, పునరుత్పత్తి హక్కుల్ని పొందడానికి వాళ్ళిద్దరూ చేసిన జీవన పోరాటంతో తమ హక్కుల్ని ఎలా సాధించారో చెప్పటానికి ఆ పాత్రల స్వభా వాలను, చైతన్యాన్ని చిత్రించే క్రమంలో కొంత వరకు సుదీర్ఘత కూడా అనివార్యమేన నిపిస్తుంది.  

          సుభద్ర, శాంతి పాత్రల సృష్టిలో రచయిత శ్రద్ధకూడా వ్యక్తమవుతుంది. ఎందు కంటే, స్త్రీవాద ఉద్యమ చైతన్యానికి పూర్వం స్త్రీల పునరుత్పత్తి హక్కుల కోసం పోరాడే స్త్రీల సంఖ్య నిష్పత్తిరీత్యా చాలా తక్కువ. అలాంటప్పుడు సుభద్ర, శాంతి మామూలు విషయాల కోసం ఎందుకు అంత పోరాడాల్సి వచ్చింది. అసలు అంత చైతన్యం ఆ పాత్రలకు ఉందా? అన్న సందేహం రాకుండా శాంతి, సుభద్ర, ఛాయ, లీల, రాజేశ్వరి, లెక్చరర్ రాధాకృష్ణలతో కూడిన వాళ్ళ కళాశాల జీవితాన్ని కూడా చిత్రించాల్సి వచ్చింది. అధ్యాపకులు, కాలేజీ కమిటీ  ఏకగ్రీవంగా అమ్మాయిల నాటకాలను నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పట్టుదలతో సాధించగలిగారు. తమ అభీష్టాన్ని వారికి నివేదించడానికి వాళ్ళు జరుపుకున్న సమావేశాలలోని వేడి, వేడి చర్చలు అమ్మాయిలంతా కలసికట్టుగా వుండి తీసుకున్న నిర్ణయాలు మొదలైన సన్నివేశాలను చిత్రించడం ద్వారా సుభద్ర, శాంతి పాత్రల చిత్రణ వాస్తవానికి దగ్గరగా రూపకల్పన చేయటంవల్లనే సాధ్యమయ్యింది.

          అలాగే స్త్రీల జీవితాలను లైంగికతను, పునరుత్పత్తిని కంట్రోలుచేసే క్రమంలో స్త్రీల జీవితం ఎంత హింసాపూరితంగా వుంటుందో ఆవిష్కరించే  కథే “హింస”. పద్దెనిమిదేళ్ళ సుగుణ పెళ్ళైన రెండు సంవత్సరాల వరకూ గర్భం ధరించకపోవడంతో అత్త మహాలక్ష్మమ్మతో మాటలు పడుతుంది. సుగుణ గర్భధారణ సమయంలో ‘వల్లల్ ఎడీమా’ అనే భయంకరమైన వ్యాధికి గురవుతుంది. ఈ వ్యాధి లక్షణం పొత్తికడుపు వాచిపోయి, యోని దగ్గరా, తొడల దగ్గరా నీరు చేరుతుంది. పొత్తికడుపులో చేరిన నీరును సిరంజి ద్వారా తీసివేయకపోతే భయంకరమైన బాధ, అలాతీయటం కూడా స్పృహతప్పేంత బాధే. ఈ హింసనంతా భరిస్తూ బిడ్డకు జన్మనివ్వాలను కుంటుంది సుగుణ. 20 రోజుల కొకసారి ఈ హింసనంతా భరించాల్సి రావడం ఎంతో నరకయాతనగా వుంటుంది. సుగుణ ఈ బాధనంతా భరిస్తూ కూడా, తన ప్రాణానికి, కడుపులో బిడ్డ ప్రాణానికి ముప్పని తెలిసినా కూడా ఆ హింసనంతా భరిస్తూంటుంది. పునరుత్పత్తి క్రమంలో స్త్రీలు గురయ్యే ఇలాంటి బాధలను రచయిత కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు.

          ప్రాణాన్ని లెక్కచెయ్యకుండా, దుర్భరమైన బాధను భరిస్తూ సుగుణ లాంటి స్త్రీలు ఎందుకిలా మొండిగా వున్నారన్న ప్రశ్న పాఠకుల్ని వెంటాడుతుంది. ఆ మొండితనానికి కారణం ఆదర్శీకరించబడిన ‘మాతృత్వభావన’వల్లే. తల్లి కాకపోతే తన జన్మే వృథా అనుకునేంత బలమైన భావజాలాన్ని ఆమె చుట్టూవున్న సమాజం క్షణక్షణం గుర్తు చేస్తుంటుంది. అందుకే సుగుణలాంటి స్త్రీలు తల్లికాలేనపుడు ఆడది చచ్చినా బతికినా ఒకటే అనుకుంటుంది. బిడ్డను కనడంలో చచ్చిపోయినా ఫరవాలేదను కుంటుంది. అవమానాలు పొందడం కంటే, ప్రాణం పోవడమే మేలని బలంగా నమ్ముతుంది. మాతృత్వ భావనలు సమాజంలో ఎంత లోతుగా పాతుకు పోయాయో సుగుణ బలవన్మర ణానికి సైతం సిద్ధపడటంలోనే తెలుస్తోంది.

          స్త్రీలను నడిచే గర్భసంచులుగా చూసినంత కాలం, స్త్రీలు మాతృత్వం చాటున దాగిన ఈ హింసనంతా భరిస్తూనే వుంటారు. పురుషులు స్త్రీలనలా చూడటమే కాదు, ఆడవాళ్ళు కూడా తమను తాము అట్లా చూసే వాతావరణం, భావజాలం సమాజంలో బలంగా వేర్లూనుకొనేట్లు చేశారు. అలాకాని పక్షంలో స్త్రీలు అంత పెద్ద హింసను, దానికి అనుగుణంగా చేసే త్యాగాలకు సైతం సిద్ధపడే ఉద్వేగం స్త్రీలు చూపరు. పునరుత్పత్తి క్రమంలో ఎదురయ్యే వేదనకు స్త్రీలను సిద్ధం చేయడానికి పితృస్వామ్య సంస్కృతి మోసపూరితమైన భాషను, మాతృత్వాన్ని ఉదాత్తపరిచే పదజాలాన్ని సిద్ధం చేసుకున్న క్రమం ఈ కథలో ఆవిష్కరించబడింది.

          స్త్రీలు పునరుత్పత్తిలో ఎదురయ్యే హింసకు అలవాటు పడిపోయారు. ఎందుకింత  హింసపడాలని ఆలోచించరు. పైగా అది తమ స్త్రీత్వనిరూపణ అనుకొంటారు. హింసకు స్త్రీలను ఆమోదించేట్లు చేయటం, అలవాటు చేయటంతో హింసకు ఎక్కడలేని బలం వస్తుంది. కొన్నిరోజులు తర్వాత, ప్రశ్నించబడని ఈ హింసే మామూలు వ్యవహారంగా అంటే, సహజసిద్ధమైనదిగా ఆచరణయోగ్యతను పొందుతుందనే అవగాహన బలంగా ఈ కథలో వ్యక్తమవుతుంది.

          పురుషులు స్త్రీల సంతానోత్పత్తి శక్తిని కూడా కంట్రోలు చేస్తారు. చాలా సమాజాల్లో స్త్రీలకు ఎంత మంది పిల్లలను కనాలి. గర్భనిరోధక సాధనాలు వాడొచ్చా? వాడకూడదా? గర్భాన్ని తీయించుకోవాలా? వద్దా? మొదలైన విషయాలు నిర్ణయించుకొనే స్వేచ్ఛ వుండదు. వ్యక్తులుగా పురుషులు విధించే కంట్రోలుతో పాటు పురుషాధిపత్య సంస్థలైన మతం, రాజ్యం కూడా స్త్రీల సంతానోత్పత్తి శక్తి పై ఆంక్షలు విధిస్తాయి. ఇది సంస్థాగత మైన కంట్రోలు. ఉదాహరణకు స్త్రీ పురుషులు గర్భనిరోధ పద్ధతులు వుపయోగిస్తే ఏ పద్ధతులు వుపయోగించాలి. పిల్లలు వద్దనుకున్నపుడు స్త్రీలు గర్భస్రావం చేయించు కోవచ్చా. అనే విషయాల పై, ఎలాంటి అవగాహన స్త్రీలకు ఏర్పరచకుండానే ప్రభుత్వా లు కుటుంబ నియంత్రణ పద్ధతులను అమలు చేస్తుంటాయి. అలా అమలు చేయడం లో స్త్రీల శరీరాలను పరాయీకరణకు గురిచేస్తున్న వైనాన్ని “పురిటినొప్పులు” కథ తెలుపుతుంది.

          పితృస్వామ్య సమాజంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమాల ద్వారా స్త్రీల సంతానోత్పత్తి శక్తిని కంట్రోలు చేయాలని ప్రయత్నిస్తోంది. దేశంలో ఎంత జనాభా వుండవచ్చో రాజ్యం నిర్ణయించి దాని ప్రకారం పిల్లల్నికనటానికో, కనకుండా ఉండటానికో స్త్రీలను ప్రోత్సహిస్తుంది. భారతదేశంలో గర్భనియంత్రణ కార్యక్రమాల్ని ఉధ్భతంగా అమలు చేసి కుటుంబం సైజుని పరిమితం చేస్తుంది. ప్రభుత్వం విధించే ఈ ఆంక్షల వల్ల స్త్రీల శరీరా లు ప్రయోగశాలల కంటే అధ్వాన్నంగా మారుతున్న స్థితి గతులు వైద్య పరిజ్ఞానం లేని ఆడవాళ్ళకు అర్ధం కాదుగానీ, వైద్య వృత్తిలో వున్న డా॥ వనజకు మాత్రం బాగా అర్థమయింది. “జనాభా తగ్గించండి అనే కేకలేగాని ఆడవాళ్ళ ఆరోగ్యం గురించి యెవరికీ శ్రద్ధలేదు” అని ఆమె తనలో తాననుకునే మాటల్లో రాజ్య స్వభావం వ్యక్తమవుతుంది.

          రాజ్యం తన కుటుంబ నియంత్రణ కార్యక్రమాల ద్వారా స్త్రీల సంతానోత్పత్తి శక్తిని కంట్రోలు చేయటంలో భాగంగా స్త్రీల పై అన్ని పథకాలను అమలు చేస్తుంది. తప్ప, ఇద్దరూ సంతానోత్పత్తిలో భాగమైనపుడు స్త్రీల పైనే తన నియంత్రణ పద్ధతులను, ఆధిపత్యాన్ని కొనసాగించడంలో పురుషకేంద్రక దృష్టి వ్యక్తమవుతుంది. ఎందుకంటే, ఈ దృష్టి వలన ఎదురయ్యే భౌతిక, మానసిక హింసను స్త్రీలు మాత్రమే భరించాల్సి వచ్చినపుడు, పురుషుడు బయటపడగలుగుతున్నాడు. ఈ వైఖరి మారనంత కాలం రాజ్యం స్త్రీల శరీరాలను ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా ఒక ప్రయోగశాలగానే మిగిలిస్తుంది. ఇలా కుటుంబ నియంత్రణ పేరుతో అమలవుతున్న పునరుత్పత్తి రాజకీయాలను  “పురుటినొప్పులు” కథలో ఓల్గా బహిర్గతం చేయగలిగారు.

          మైనర్ బాలికలు అత్యాచారాలకు గురైన ఫలితంగా గర్భవతులవుతున్నారు. పునరుత్పత్తి క్రమంలో ఆ పసివాళ్ళు ఎదుర్కొంటున్న హింసకు మరొక సజీవ సాక్ష్యం “మొదటి చావు” కథ. మైనర్ బాలికల పై జరిగే అత్యాచారం వలన వాళ్ళు పడే శారీరక, మానసిక సంవేదనలను ఈ కథ తెలియజేసింది. అమ్మాయిలు అత్యాచారానికి గురవడమే ఒక హింసైతే, పర్యవసానంగా ‘అబార్షన్’ రూపంలో, ఎదురయ్యే హింసను అనుభవించ డంలో ఆ పసివాళ్ళు పలుమార్లు చావుకు దగ్గరగా వెళుతున్నారన్న నగ్నసత్యాన్ని ఈ కథలో ఓల్గా ఆవిష్కరించారు.

          దళిత పేద వర్గాల స్త్రీలు పేదరికంతో పాటు పురుషాహంకారమనే అదనపు హింసకు గురవుతున్నారు. అనుక్షణం ఆడపిల్లల్ని ‘మగపశువులకు’ బలివ్వలేక, కష్టమో సుఖమో కట్టుకున్నవాడే చూసుకుంటాడన్న ఉదాసీన భావంతో తల్లులు ఆలోచిస్తూ వుంటారు. నన్నొక సందేహం నిరంతరం పీడిస్తుండేది. తల్లిదండ్రులు ఆడపిల్లలకు చిన్నప్పుడే పెళ్ళిళ్ళు ఎందుకు చేస్తారో అని ఆలోచించేదాన్ని. ఈ సందేహాలకు గల మూలకారణాల్ని ఈ కథ పరోక్షంగా చెప్పినట్లయింది. పనుల కోసం వెళ్ళే ఆడపిల్లలు పనిచేసేచోట ఎన్ని రకాలుగా అత్యాచారాలకు గురికావలసివస్తుందో, వాటన్నింటిని శ్రామిక తల్లులు తప్పించలేరు. పని వెసులుబాటు లేకపోవడం వల్లే చిన్నారి ఇందిర లాంటి శ్రామిక బాలికలు అనునిత్యం చావుకు దగ్గరవుతారన్న వాస్తవాన్ని ఓల్గా ఈ కథలో సంకేతించారు.

          బిడ్డల పెంపకంలో లైంగికత్వం విషయంలో తమకే తెలియని విషయాలు తమ బిడ్డలకే విధంగా చెప్పాలో తెలియనితనం చదువుకున్న స్త్రీల కంటే చదువుకోని స్త్రీలకు మరింత అయోమయానికి గురిచేస్తుంది. చదువుకొన్న స్త్రీలు కూడా వృక్షశాస్త్రమో, జీవశాస్త్రమో, ఆర్థిక శాస్త్రమో, చరిత్రో,  పాఠాలుగా, చదువుకుంటారే గానీ, తమ శరీరాలకు సంబంధించిన పూర్తి జ్ఞానాన్ని వారికి మన సమాజం అందుబాటులో ఉంచదు. స్త్రీల ఉద్యమాలు అందించిన సిఫారసుల మేరకు పాఠ్యపుస్తకాలలోకి పునరుత్పత్తి పాఠాలు ఎక్కినా, వాటిని బోధించే అధ్యాపకులు ఆ విషయాలను ఉచ్ఛరించడానికి సిగ్గుపడు తూనో లేదా కొంత మంది పురుష అధ్యాపకులు అత్యుత్సాహంగానో చెప్పడం వలన అమ్మాయిలు వాటికి సంబంధించిన జ్ఞానాన్ని పొందడంలో సఫలీకృతులు కావడంలేదు.

          అందుకే “మొదటి చాపు” కథలోని పన్నెండేళ్ళ ఇందిర తన శరీరంలో జరుగు తున్న మార్పుల్ని చూసి తల్లి కలవరపడితే, “నేనేం సిన్నపిల్లనా! పెద్దయిన గదా! నా గురించి నువ్వెందుకు బుగుల్ పడ్తున్నవ్” అని అడుగుతుంది. అందుకు ఆమె తల్లి “నువ్వు సిన్న పిల్లవైతే నేనెందుకు బుగులు పడ్తానే పెద్దనయినవనే నా పరేశాని” అంటుంది. అడవిలో క్రూర మృగాల బారిన పడకుండా ఎలా తప్పించుకోవాలో అలాగే జనారణ్యాలలో సైతం మగవాళ్ళ బారిన పడకుండా స్త్రీలు, పిల్లలు భయపడుతూ బ్రతకడంలో వున్న హింసరూపం ఎంత బలీయమైందో ఆ తల్లీకూతుళ్ళ మాటల్లో అర్థమవుతుంది.

          తమకు లేని జ్ఞానాన్ని తమ బిడ్డలకు అందించలేని అసహాయత, అజ్ఞానం వాళ్ళలో ఉక్రోషాన్ని పెంచుతుంది. ఆ తెలియనితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు పిల్లల్ని విసుక్కోవడంలోనూ, వాళ్ళడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక  చేయి చేసుకోవడంలో తమ అసహనాన్ని ప్రదర్శిస్తుంటారు. అసలు ఆడపిల్లగా పుట్టడం, పెరగడమే నేరమనే ట్లుగా ప్రవర్తిస్తున్న తల్లులను అర్ధంచేసుకోలేని నిస్సహాయ బాలికలు తమకెదురయ్యే లైంగిక దాడుల పట్ల సరైన అవగాహన లేక సమస్యలను ఎదుర్కొనే సమయంలో తమ ప్రాణాలు కోల్పేయేంత ప్రమాద స్థితికి గురవుతున్నారని ఈ కథలో రచయిత వ్యక్తీకరిం చారు.

          ‘విముక్తి’ కథ కూడా మైనర్ బాలికల పై జరిగే లైంగిక దాడి వలన గర్భం ధరించి ప్రాణాలు కోల్పోయిన అనాధ బాలిక కథ. ఈ నాటికి కూడా చిన్నపిల్లల మీద జరిగే అమానుషమైన, రాక్షసమైన లైంగిక దాడులు జరుగుతున్న సంధర్భంలోనే మనమున్నాం. ఎంతో మంది అమ్మాయిలు తమ బాల్యంలో ఇలాంటి సంఘటనలను ఎదుర్కొలేక దాడి జరిపిన వారి పై పెద్దవాళ్ళకు చెప్పి వాళ్ళచేత కూడా చీవాట్లు తినే ధైర్యంలేక మౌనంగా భరిస్తున్న వైనాన్ని ఈ కథ తెలియజేస్తుంది. వాళ్ళ మూగరోదనల్ని నిస్సహాయతను ఈ కథలో ఏమి చేయలేని ఒక అసహాయస్థితిని చిత్రించడం జరిగింది. చిన్నప్పుడు జరిగిన లైంగికదాడి ఒక డాక్టరుగా ఎదిగినా, ఇందిర లోపలి గాయం యెప్పుడూ రేగుతూ వుండటం వల్ల తన భర్తతో లైంగికంగా దగ్గర కాలేక ఫ్రిజిడిటికి లోనవు తుంది. పేషంట్ గా వచ్చిన చిన్నపిల్ల కూడా ఆమెలాగే బాల్యం నుండి అత్యాచారాలకు గురవుతూనే వుంటుంది. లైంగికదాడి ఆమెకు అలవాటయి పోయింది. స్త్రీలు జీవితకాల మంతా ఇలాంటి గాయాలు అట్లా నిరంతరం రక్తం స్రవించడాన్ని అలవాటుగా చేసుకుంటూనే వున్నారు. సుందర స్వప్నాలు కనాల్సిన వయసులో భయంకరమైన రాక్షస రతికి బలౌతూ “చిన్నాయన్ల నుండీ, సమీప బంధువుల నుండీ, వార్డన్ల నుండీ తప్పించుకోలేక పోతున్నారు. కనీసం బహిర్భూమికి పోయే చోట, పనులు చేసే చోట కాపుకాసే పెద్దపులుల పంజాల నుండీ విముక్తి” లభించేది వారికి చావుతోనే అని డా.ఇందిర ఉదాసీన వైఖరిని ప్రకటిస్తుంది. అలా ప్రకటించడంలో ఎంతో మంది నిరుపేద స్త్రీల నిస్సహాయత దాగివుందని ఈ కథలో నిరూపితమవుతుంది.

          ఒక ’రాజకీయకథ’లో ఉత్పత్తి, పునరుత్పత్తి సంబంధిత రాజకీయాల్ని బహిర్గతం చేయటం ఈ కథలో మరింత కీలకాంశం. మధుసూదన్ తను పనిచేస్తున్న ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగి చేతివేళ్ళు పోగొట్టుకుంటాడు. ఆ సందర్భంలో తన తోటి వర్కర్స్ అందరూ అతనికి సంఘీభావం ప్రకటించడం, ఆర్థిక సహాయం చేయటమేకాక అతనికి అండగా యూనియన్ ఉందని గొప్ప భరోసా ఇస్తారు. ఈ సంధర్భంలోనే మధుసూదన్ భార్య గర్భవతి అవుతుంది. బిడ్డ గర్భసంచిలో కాకుండా, గర్భసంచికి ముందుండే ట్యూబులో పెరిగి,  అండం విఛిత్తి జరిగి ఆమె పొత్తి కడుపంతా రక్తం మడుగై పోతుంది. ఆమెకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు ఇక ఆమెకు పిల్లలు పుట్టే వీలులేదని ప్రకటిస్తారు. అంటే, ఆమెలో పునరుత్పత్తి చేసే శక్తిలేదని నిర్ధారిస్తారు. ఈ సంఘటన జరిగిన తరువాత ఆమె పట్ల కుటుంబంలోని వ్యక్తుల వైఖరి పూర్తిగా మారిపోతుంది.

          “ఎవర్ని ఉద్దరించడానికి? మోడల్లే వాడికి పడి ఏడవటానికి కాకపోతే, ఎందుకు బతికినట్టు ఎంత పాడు బతుకైపోయింది. బిడ్డనెత్తుకునే అదృష్టం లేకపోయ” అని ఆమె అత్త అంటుంది. సూటిపోటి మాటలతో ఆమెకు నరకం చూపించడమే కాక కొడుకుకు రెండో పెళ్ళి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇరుగుపొరుగు ఆడవాళ్ళు కూడా అత్త వాదనకు మద్ధతిస్తారు. ఆడవాళ్ళందరూ ఒకటిగా ఎందుకులేరు? తల్లులుగా, భార్యలు గా, కూతుళ్ళుగా, అత్తలుగా, కోడళ్ళుగా, ఆడబిడ్డలుగా ఎందుకు విడిపోయారు.’ ఎవరు విడగొట్టారు? దాంపత్యం పేరిట, మాతృత్వం పేరిట ఎందుకింత మోసం చేస్తున్నారు? ఈ మోసం ఎవరికేలాభాలను ఆర్జించి పెడుతుంది.” అనే విషయాలకు సమాధానాలు అన్వేషించి, వాటిని మొత్తం స్త్రీజాతికి తెలియజెప్పాలి అన్న ఓల్గా తపన ఈ కథలో కనబడుతుంది. ఈ ఓల్గాకు ఆడవాళ్ళందర్ని సంఘటితం చేయటంలో తన జీవిత గమ్యం ఉందని ఆమె నిర్ణయించుకుంటుంది. ఈ నిర్ణయానికి రావటంలో కొంత నాటకీయత ఉన్నప్పటికీ తెలుగు కథాసాహిత్యంలో కార్మికుడి ఉత్పత్తి చరిత్రకు ధీటుగా, స్త్రీ పునరుత్పత్తి చరిత్రను చర్చకు పెట్టడం. అదికూడా చాలా సాధికారికంగా ఆ విషయాన్ని కథలో చర్చకు పెట్టడం, మొట్టమొదటిసారి.

          అలాగే, పునరుత్పత్తి క్రమంలో, స్త్రీల కుండాల్సిన హక్కుల్ని మరింత సాధికారి కంగా ముందుకు తెచ్చిన కథ ‘కేసు’. ఈ కథలో రమ్య అనే వివాహిత స్త్రీ, ఉద్యోగిని. ఆమె పిల్లల్ని కనటం వ్యక్తిగత విషయం కాదని, దానితో ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఉందని, వాదిస్తూ కోర్టుకెళుతుంది. స్త్రీలు మౌలిక ప్రశ్నలు వేసినపుడు కొంత అభ్యుదయ కరంగా ఉన్న వ్యక్తులు, సంస్థలు కూడా వాళ్ళతో గొంతు కలపటానికి జంకుతాయని కొన్ని సందర్భాలలో వ్యతిరేకిస్తాయని కూడా ఈ కథలో ఓల్గా సోదాహరణంగా రుజువుచేస్తారు. ఈ కథలో రమ్య వేసిన ప్రశ్న ఏమంటే, మనం సమాజంలో భాగం కాబట్టి మనం చేసే పనులకూ, సమాజానికీ సంబంధం ఉంటుంది. నేను పిల్లాణ్ణి కన్నాను అంటే, ఆ పిల్లాడు నా ఒక్క దానికేనా? మనింట్లో ఆవు కాదుగదా ఆ పిల్లాడు. మన పెరట్లోని జామచెట్టు కాదుగదా ఆ పిల్లాడు. వాడు పెరిగి పెద్దవాడవుతాడు. సమాజంలో భాగమవుతాడు. వాడు వ్యక్తిగతంగా ఏం చేస్తాడో చేయ్యడో గానీ సమాజానికి మటుకు కొంతచేస్తాడు. అలాంటి పిల్లాడిని కనటం నా సొంత సమస్యా? అని ప్రశ్నించడం ద్వారా సమాజానికి పునరుత్పత్తికి గల సంబంధాన్ని ‘కేసు’ రూపంలో ఓల్గా చర్చకు పెడుతుంది.

          రెండు కథలు కూడా స్త్రీలు పురుషస్వామ్య ఆర్థిక వ్యవస్థలో కేవలం ఉపయోగితా విలువ (use value) మాత్రమే కలిగి ఉండే వస్తువులుగా దిగజార్చబడ్డారనే విషయాన్ని రుజువు చేస్తాయి. అదే సందర్భంలో న్యాయ వ్యవస్థ పురుషుడికే అనుకూలంగా ఉందనే విషయాన్ని కూడా ఓల్గా కథలు రుజువుచేస్తాయి. అలాగే పునరుత్పత్తి రాజకీయాలను చర్చకు పెట్టిన మరొక శక్తివంతమయిన కథ ‘ఆర్తి’. ఈ కథ ప్రధానంగా మూడు అంశాల మీద కేంద్రీకరిస్తుంది.

          ఒకటి.    పురుషస్వామ్యం స్త్రీలలో ప్రశ్నించే శక్తిని ఎలా చంపుతుంది?

        రెండు.    స్త్రీలలో ఉండే లైంగిక వాంఛలను ఎలా అణచివేస్తుంది.

        మూడు.  ఈనాడు స్త్రీలు తమ శరీరాల మీద తమకున్న పునరుత్పత్తి హక్కుల్ని స్త్రీలు ఎలా assert చేసుకోవాలి.

          ఈ మూడు అంశాల మీద కేంద్రీకరించి ఓల్గా తనదైన శైలిలో ఈ కథను నడిపారు. ఆత్మకథాత్మక కథనంలాగా నడిచే ఈ కథలో ప్రధాన పాత్ర అనేక ప్రశ్నలను లేవనెత్తు తుంది. ఒక రకంగా కథంతా ప్రశ్నల మయమే. ఈ ప్రశ్నలన్నీ పురుషస్వామ్య వ్యవస్థను అన్ని పార్శ్వాలలో నిలదీసే ప్రశ్నలే.

          స్త్రీలు, బాలికలు అనేక రూపాల్లో హింసను ఎదుర్కొంటున్నారు. లైంగిక అత్యాచారం, ఇతర లైంగికపరమైన అవహేళనలు, అవమానాలు, గర్భస్థ శిశువుల హత్య, భార్యలను వేదించడం, తమ మాటకు, చేతలకు అడొచ్చిన భార్యలను చంపడం వరకు ఎన్నో రూపాల్లో స్త్రీల పై హింస అమలవుతోంది. ఈ హింస, ఫలితంగా స్త్రీలలో పాతుకు పోయిన భయాలు, అభద్రతాభావం, వాళ్ళను ఇంటికే పరిమితం చేసిన సంధర్భాలు మరింత లైంగిక దోపిడికి, సాంఘిక అణచివేతకు గురిచేస్తాయి. కుటుంబంలో, సమాజంలో, రాజ్యంలో జరిగే హింసకు వ్యతిరేకంగా ప్రస్తుతం జరుగుతున్న పోరాటాల్లో హింస ఇంత హెచ్చుగా పెరగడానికి రాజ్య స్వభావం కూడా కారణంగా గుర్తించారన్న స్పృహ ఈమె కథలు కలిగిస్తాయి.

          ఈ విషయాలను ప్రచారం చేయటం ద్వారా పురుషస్వామ్యం తనకు అవసర మున్న, ప్రయోజనమున్న తీరులోనే స్త్రీలను స్త్రీల లైంగికతను రూపొందిస్తుంది, చూస్తుంది. ఆ విధంగానే ఆడపిల్లలకు తర్ఫీదు కూడా ఇస్తుంది. స్త్రీవాద మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఇటీవలికాలంలో ఈ విషయాలను చాలా లోతుగానే విశ్లేషించగలిగారు. బాల్యంలో పడే ముద్రలు ముఖ్యంగా లైంగికత విషయంలో ఎంత గాఢంగా ఉంటాయో Joseph Bristow అనే విమర్శకుడు చాలా చక్కగా వివరించారు. అవన్నీ కూడా కథాంశాలలో ప్రతిఫలించాయి.

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.