మిట్ట మధ్యాహ్నపు మరణం- 25

– గౌరీ కృపానందన్

          రాకేష్ విభ్రమ చెందిన వాడిలా ఆమెను చూశాడు.“టెలిగ్రాం నీ కోసం కాదు ఉమా. వేరే ఎవరికో వచ్చినట్లు ఉంది” అన్నాడు.

          “ఏమని వ్రాసి ఉంది?”

          “అర్థం కాలేదు. ఏదో గ్రీటింగ్స్ టెలిగ్రాంలా ఉంది.”

          “అలాగైతే ఆ టెలిగ్రాం మెసెంజరుకే ఇచ్చెయ్యండి. అదిగో వెళుతున్నాడు. ఎవరిదో, వాళ్లకి ఎంక్వయిరీ చేసి ఇచ్చేస్తాడు.”

          “ఇదిగో ఇప్పుడే ఇచ్చి వస్తాను.” రాకేష్ టెలిగ్రాం మెసెంజర్ వైపు వెళుతుండగా ఉమ ఇంట్లోకి వచ్చింది.

          అత్తగారు ఇంట్లో లేదు. గుడికి వెళ్ళి ఉంటుంది. మామగారు వాకింగ్ కి వెళ్ళి ఉంటారు. రాకేష్ ఆ టెలిగ్రాం ఇచ్చేటట్లు వెళ్ళి చింపి పారేసి ఐదు నిమిషాలలో తిరిగి  వచ్చేసాడు.

          ఈ లోపల ఏదైనా చేయాలి. ఏం చేయాలి?

          ఉమ చేతులుసన్నగా కంపించాయి. టెలిగ్రాం చదవలేదని ఆమె రాకేష్ తో అబద్దం చెప్పింది. రాకేష్ సంతకం పెట్టి దాన్ని ఆమె చేతికి ఇచ్చినప్పుడు. ఆ మసక వెలుతురులో ఆ వాక్యాలను చదవడం కాస్త కష్టంగా ఉన్నా చదివేసింది.

          “రాకేష్ దగ్గర జాగ్రత్త గా ఉండు. అతను నీ భర్తను చంపిన హంతకుడు. … మాధవ రావు”

          చదివిన వెంటనే ఎదురుగా నిలబడ్డ రాకేష్ గుర్తుకు రాగా,“కాస్త ఉండండి. లైటు వేసి వస్తాను” అని ఎలాగో తమాయించుకుని చెప్పి వరండాలోకి వెళ్ళింది. మై గాడ్! ఇతనితో ఇంత దగ్గరగా వచ్చిన తరుణంలో ఈ కబురు వచ్చింది. ఇప్పుడు ఏం చెయ్యాలి ? లైటు వేయడానికి ముందు టెలిగ్రామును చదువుతున్న రాకేష్ ను దూరం నుంచి చూసింది. మారుతున్న ముఖ కళవళికలు… అతను నేరస్తుడు కాబట్టే, టెలిగ్రాంలో ఏముందని అడిగినప్పుడు అబద్దం చెప్పాడు. తనకి తెలిసి పోయిందని అతనికి తెలియ కూడదు. అది ముఖ్యం!

          ఇప్పుడు ఎవరూ లేని ఈ సమయంలో, నాకు తెలిసి పోయిందని అతను గ్రహిస్తే, అతని ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పలేము. పారి పోవచ్చు. ఒంటరిగా నేను అతన్ని పట్టుకోలేను.

          పట్టుకోగలనా? చూద్దాం.

          అతను తిరిగి వచ్చే  లోపల ఏం చేయాలో ఆలోచించింది. పక్కనే ఉన్న షాప్ కి వెళ్ళి అక్కడి నుంచి ఎస్.టి.డి. చేసి మాధవరావుకి తెలియ జేయడమా? లేకపోతే ఇక్కడి పోలీసులకి తెలియ చేయడం మంచిదా? మొదట అతన్ని ఇక్కడి నుంచి పంపించెయ్యా లి.

          రాకేష్ ని చూసి చిన్నగా నవ్వింది.

          “రేపు చూద్దాం” అంది.“టెలిగ్రాం తిరిగి ఇచ్చేశారా?”

          “ఇచ్చేశాను. అది నీకు వచ్చింది కాదు.”

          “తప్పు అడ్రసు కాబోలు.”

          “రేపు ఉదయం రానా?”

          “సరే. రాత్రి ఆలోచించి ప్రొద్దున్న నీకు నా నిర్ణయం తెలియ చేస్తాను.”

          అతను కాస్త ఇబ్బందిగా నవ్వాడు.“వెళ్ళిరానా మరి” అని బయలుదేరి వెళ్ళాడు.

          అతను కనుమరుగు అయ్యే వరకు అలాగే నిలబడింది. ఆమె శరీరం కంపించ సాగింది.

వెంటనే ఫోన్ చెయ్యాలి. ఎదురింట్లో ఫోన్ ఉంది. కానివాళ్ళ ఇల్లు తాళం వేసి ఉంది. వీధి చివరన పబ్లిక్ బూత్ ఉంది. కానీ అంత దూరం వెళ్ళాలి. పక్కనే ఉన్న మెడికల్ షాప్ కి వెళదామా? తడబడింది. అత్తగారు, ఆనంద్ ఇంకా రాలేదు. గబ గబా నడిచి టెలిఫోన్ బూత్ కి వెళ్ళింది. పోలీసు నంబర్ ఏది? 100 ? కాదు99 కదా. దేవుడా? డైరక్టరీ కూడా అక్కడ లేదు. అటువైపు ఒక కిరాణా షాప్ ఉంది. అక్కడ ఒక్క రూపాయి ఫోన్ కాల్ అని వ్రాసి ఉంది.

          “సార్! కాస్త అర్జంటుగా పోలీసుకి ఫోన్ చేయాలి.”

          “పోలీసుకా?’

          “అవును. ఒక ముఖ్యమైన విషయాన్ని పోలీసులకి తెలియ చేయాలి.”

          “పోలీస్ గీలీస్ అంటే ఇక్కడి నుంచి చెయ్యద్దు. పబ్లిక్ ఫోన్ బూత్ ఉంది. అక్కడికి వెళ్ళండి.”

          “అక్కడ డైరక్టరీ లేదండి. నాకు నంబరు కూడా సరిగ్గా తెలియదు.”

          “నంబరు కావాలంటే చెబుతాను. అక్కడికి వెళ్ళి ఫోన్చేసుకోండి. రండి రావుగారూ! ఒరేయ్! ఆ కుర్చీ ఇలా పట్రా.”

          “ఏంటి సార్? నేను అర్జంట్ అని చెపుతున్నాను. మీరు కొంచం కూడా రెస్పాన్స్ చెయ్యడం లేదు.”

          “చూడమ్మా. ఇలాగే కాస్త దూరం వెళ్ళా వంటే పోలీస్ స్టేషన్ వస్తుంది. అక్కడికి వెళ్ళి కంప్లయింట్ చేసుకో.”

          లాగిపెట్టి అతని చెంప మీద ఒక్కటి ఇవ్వాలనిపించినా ఎలాగో నిగ్రహించుకుని నడిచింది.

          “సార్! పోలీస్ స్టేషన్ కి ఎటువైపు వెళ్ళాలి?”

          “ఎడమ పక్క తిరిగి నేరుగా వెళ్ళండి.”

          గబగబా అడుగు ముందుకేసింది. ఎక్కడ ఉంది పోలీస్ స్టేషన్? ఇంకా కనపడదేం? వెనకాల అడుగుల చప్పుడు వినబడి తిరిగి చూసింది.

          “ఏమయ్యింది ఉమా? ఎక్కడికి ఇంత వేగంగా వెళ్తున్నావు?”

          రాకేష్ నవ్వుతూ నిలబడ్డాడు. అదిరిపడింది ఉమ.

          “ఏం లేదు రాకేష్. మా అత్తగారు వస్తున్నారా అని చూద్దామని.”

          “మీ అత్తగారు ఇటు వైపే వెళ్ళిందా?” చాలాశ్రద్దగా అడిగాడు.

          ఇతనికి ఇంకా తెలియదు, తనకి విషయం తెలిసి పోయిందని. ఎలాగైనా ఇతడిని మానేజ్ చేయాలి.

          “అవును. గుడికి వెళ్ళింది.”

          “చీకట్లో ఒంటరిగా వెళ్తున్నావెందుకు? నేను టాక్సీ కోసం చూస్తూ ఉంటే నువ్వు వేగంగా నడిచి వెళ్ళడం చూశాను. అందుకే వెనకాలే వచ్చాను, ఏమైనా కావాలేమో కనుక్కుందామని.”

          “థాంక్స్!”

          “నేను నీతో వీధి దాకా వస్తాను. ఇలా చీకటి సందులో నువ్వు రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్ళకూడదు.”

          “ఇంటికి వెళ్ళిపోతాను.”

          “ఇంటిదాకా వచ్చి దిగబెడతాను.”

          “వద్దు. నేను వెళ్ళిపోగలను. దగ్గిరేగా ఇల్లు.”

          “ఉమా! ఎనీ థింగ్ రాంగ్?”

          “ఏమీ లేదు రాకేష్. ఈ రోజు సాయంత్రం నీతో మాట్లాడిన తరువాత కొంచం…”

          “ఒంట్లో బాగా లేదా ఉమా?”

          “ఛ.. ఛ.. అదేమీ లేదు. బాగానే ఉన్నాను.”

          “నన్ను తరిమేయాలని చూస్తున్నావు. నేను నిన్ను విడిచి పెట్టేది లేదు.” నవ్వాడు అతను.

          “ఛ.. అలాంటిది ఏమీ లేదు. భేషుగ్గా మా యింటికి రావచ్చు.” కంపిస్తున్న చేతులను కొంగు చాటున దాచుకోవడానికి విశ్వప్రయత్నం చేసింది. నా భర్తను చంపిన హంతకుడు నాతోనే నడిచి వస్తున్నాడు. పోలీసులకు కబురు చెయ్యడానికి వీలు లేకుండా నేను చిక్కుల్లో పడ్డాను. ఒక అమ్మాయి ఒంటరిగా ఏం చేయగలదు? బాధ్యత లేని పోలీసులు. ఎలాగైనా ఇతన్ని వదిలించుకోవాలి. వీధి మలుపును చేరుకోగానే బజారులో హోటల్ ఒకటి కనబడింది.“రాకేష్! ఎక్కడైనా రెస్టారెంట్ కి వెళ్ళి కాఫీ తాగుదామా. తలనొప్పి విపరీతంగా ఉంది.”

          “తప్పకుండా. ఉమా! నీతో గడిపే ఒక్కొక్క క్షణం నాకు స్వర్గంతో సమం.”

          హోటల్ లో పై అంతస్థు ఉంది. క్రింద గల్లా పెట్టె దగ్గిర ఫోన్ ఉంటుంది.

          ఉమ ఆలోచించింది. హోటల్ లో క్రింద సందడిగా, బిజీగా ఉంది. వీళ్ళిద్దరినీ చూడగానే, హోటల్ యజమాని,“మేడ మీద ఏ.సి. హాల్ ఉంది సార్” అన్నాడు.

          “అక్కడికే వెళ్దాం’ అనబోయింది ఉమ.

          అంతలో “అక్కడికి వెళదాం” అన్నాడు రాకేష్.

          “ఈ సారి బిల్లు నేనే ఇస్తాను. నా వంతు ఈ సారి.”

          “అలాగే కాని. ఇంకా కొన్ని రోజుల్లో మనం యిద్దరం ఒకటి అవబోతున్నాముగా.”

          నాకంతా తెలిసి పోయిందని ఇతనికి ఇంత వరకు తెలియదు.

          ఏ.సి. హాల్ విడిగా ఉంది. లోపల నలుగురు ఐదుగురు ఉన్నారు. మసక వెలుతురు లో తింటూ, మాట్లాడుతూ ఉన్నారు.

          రాకేష్, ఉమ మూలనఉన్న టేబిల్  ముందు ఎదురెదురుగా కూర్చున్నారు.

          యూనిఫారంలో వచ్చిన సర్వర్ అడిగినప్పుడు రెండు కాఫీలను ఆర్డర్ ఇచ్చింది. సర్వర్ వెళ్ళిపోయాడు.

          రాకేష్ లేచి ఉమ పక్కనే వచ్చి కూర్చున్నాడు. అతను తనకి అంత దగ్గిరిగా కూర్చోవడాన్ని భరించలేక పోయింది ఉమ. అలాగే అతని గొంతునులిమేస్తే…

          “ఏమిటి అలా చూస్తున్నావు ఉమా?’

          “మిమ్మల్ని సరిగ్గా చూడాలని ఉంది.”

          “దేనికీ?”

          “మీ గురించి ఇంకా తెలుసు కోవడానికి.”

          “ఏం తెలియాలి నా గురించి?”

          “మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడగాలి.”

          “మొదట కాఫీ తాగు.”

          ఇంత తొందరగా తెచ్చేసాడా. “ఇక్కడ లేడీస్ రెస్ట్ రూమ్ ఎక్కడ ఉంది?”

          “ఇదిగో. ఎదురుగానే.”

          బాత్ రూమ్ కి వెళ్ళి వస్తానని చెప్పి క్రిందికి వెళ్ళి ఫోన్ చేసి వద్దామనుకుంటే బెడిసి కొట్టింది. ఇతనితో మాట్లాడుతూ, ఇతను ఇక్కడే ఉండేటట్లు చేసి, పోలీసులకి కబురు పంపించి, వాళ్ళు వచ్చి పట్టుకుని… ఇదంతా ఎలా ఎలా సాధ్యం?

          “ఏమిటి ఉమా? ఎప్పుడు చూసినా ఆలోచిస్తూనే ఉన్నావు.”

          “మీకు నచ్చిన మంచి కొటేషన్ ఏదైనా చెప్పండి రాకేష్.”

          “ఆస్కార్ వైల్డ్ చెప్పినది. ‘The only way to get rid of a temptation is to yield to it. Resist it”

          “బ్రిల్లియంట్! దీనిని నేను వ్రాసి పెట్టుకుంటాను”అని తన హ్యాండ్ బాగ్ నుంచి చిన్న కాగితాన్ని, బాల్ పాయింట్ పెన్ను తీసింది.“చెప్పండి ది ఓన్లీ వే…”

          అతను ఒక్కొక్క పదం నిదానంగా చెబుతూ ఉండగా ఉమ దాన్ని వ్రాస్తున్నట్లు నటిస్తూ,“అర్జంట్! పోలీసులకి ఫోన్ చేయండి. నేను ఒక హంతకుడి దగ్గర చిక్కు కున్నాను. …. ఉమా మూర్తి” అని వ్రాసింది.

          దాన్ని మడిచి పెట్టుకుంది. సర్వర్ బిల్లుతో వచ్చాడు. రాకేష్ తన పర్సును తీయబోయాడు.

          “నేను పే చేస్తానని ముందు మీతో చెప్పాను” అంది ఉమ.

          అతను నవ్వుతూ,“ఆల్ రైట్” అన్నాడు.

          యాభై రూపాయల నోటుని తీసి మడిచి, మడతకు మధ్యలో తను వ్రాసిన కాగితాన్ని పెట్టి బిల్లు తెచ్చిన ప్లేటులో ఉంచింది.

సర్వర్ తీసుకుని వెళ్ళి పోయాడు.

          రాకేష్ ఆమెనే చూస్తూ కూర్చున్నాడు. ఉమకి చాలా భయంగా అనిపించింది. భగవంతుడా! హోటల్ సర్వర్ ఆ కాగితాన్ని తీసి చూడాలి. పారేయకుండా చదివి ఫోన్ చెయ్యాలి. మధ్యలో కాగితం ఎక్కడైనా పడిపోతే?

          “రాకేష్ ఇంకో కాఫీ తాగుదామా?”

          “దేనికీ?”

          “మీతో ఇంకా కొంచం సేపు ఉండాలని నాకు కోరికగా ఉంది” అంది ఉమ.

          “పోలీసులు వచ్చే దాకానా?” అన్నాడు రాకేష్.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.