విషాదమే విషాదం

ఫ్రెంచ్ మూలం: జ్యూల్ లఫోర్గె

ఆంగ్లం నుండి అనువాదం: ఎలనాగ

నేను నా అగ్నిని తల్చుకుంటాను
ఒక ఆవులింతను నొక్కి బయటికి రాకుండా చేస్తాను
గాలి ఏడుస్తుంది వర్షం నా కిటికీ మీద
ధారలై కొడుతుంది
పక్కింట్లో పియానో మీంచి
బరువైన సంగీతకృతి వినిపిస్తుంది
బతుకెంత విషాద భరితం
జీవితం ఎంత మెల్లగా సాగుతుంది

నేను మన భూమికోసం
శాశ్వత తారకల అనంత యవనికమీది
క్షణపరమాణువు కోసం
మన నిస్త్రాణ చక్షువులను చదివిన
అతి కొద్ది మంది కోసం
నిర్దయగా మన అవగాహనకు
అందనిదాని కోసం పాడుతాను

ఇక మనం ఏ రకం వాళ్ళం
మనదెప్పుడూ అదే ప్రహసనం
దుర్గుణాలు దుఃఖాలు దిగులు నలత
అయినా మనం అందమైన
అడవి పువ్వులను వికసింపజేస్తాం

విశ్వం మనను తిరిగి పొందుతుంది
మనదైనదేదీ మిగిలి వుండదు
అయినా ఇక్కడున్న ప్రతీదీ తిరిగి కొనసాగనీ
నిజంగా మనమెంత ఒంటరివాళ్ళం
జీవితం ఎంత విషాదభరితం

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.