వ్యాధితో పోరాటం-21

కనకదుర్గ

          ఫైనల్ ఇయర్ ఫేయిలవుతానేమో అని భయమేసేది కానీ చదువు మీద దృష్టి పెట్టలేకపోయాను. అమ్మ వాళ్ళ పెద్దన్నయ్య, దాశరధి , ప్రముఖ కవి, ప్రజాకవి, సినీ కవి, కొన్నాళ్ళు ఆస్థాన కవిగా ఉన్నారు…. అంతకంటే ముఖ్యమైంది ఆయన నిజాం రాజుకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించి, ఎన్నోసార్లు జైలు కెళ్ళి జైలు గోడల పైన “నిజాము రాజు తరతరాల బూజు,” “రైతుదే తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు”. “నా తెలంగాణ కోటి రతనాల వీణ.” అని గొంతెత్తి నినదించిన కవి. సాంప్రదాయ వైష్ణవ కుటుంబంలో పుట్టినా కమ్యునిస్టు పార్టీవారితో కలిసి పోరాటం చేసాడు. ఆయన ఎన్నో కవితా సంకలనాలను రచించారు, “రుద్రవీణ,” “అగ్నిధార,” తిమిరంతో సమరం,” “కవితాపుష్పకం,” “నేత్రపర్వం,” లాంటివి. ’వాగ్ధానం’ సినిమాకి ఆత్రేయాగారు పెద్దమామయ్యను పిలిపించుకుని, ” నా కంటిపాపలో నిలిచిపోరా నీ వెంట లోకాల గెలువనీరా,” అనే పాట రాయించుకున్నారు. ఆయన మద్రాస్ నుండి వచ్చాక నేను, అక్క వాళ్ళింటికి సెలవులకు వెళ్ళే వాళ్ళం. ఆయనకు పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన ఇంట్లో ఉంటే మమ్మల్ని ట్యాంక్ బాండ్ దగ్గర పార్క్ కి తీసుకెళ్ళేవాడు. మేము ఆడుకుంటుంటే ఆయన వాక్ చేసేవారు. నేను కాలేజ్ కొచ్చాకే ఆయన రాసినవి, దాశరధి రంగాచార్యా, చిన్న మామయ్య రాసిన నవలలు, “చిల్లర దేవుళ్ళు,” మోదుగు పూలు,” లాంటివి చదవడం జరిగింది. అదే సమయంలో ఎంతో మంది నవలలు చదివే అవకాశం వచ్చింది. మాక్సిం గోర్కీ “మదర్,” నేను చదవడమే కాకుండా అందరితో చదివించాను. ఏ పుస్తకాలు చదివినా రాని విమర్శ నేను రంగనాయకమ్మ గారి నవలలు చదివినప్పుడు వచ్చేది. యద్దనపూడి సులోచనరాణి గారి నవలలు చదివితే ప్రేమ, పెళ్ళి అని ఇంట్లో నుండి వెళ్ళిపోయే అవకాశం ఉందట, రంగనాయకమ్మ గారి నవలలు చదివితే బుర్ర పాడవుతుందట, ఆచారాలు, సాంప్రదాయాలను పాటించరు, పెద్దవాళ్ళని ఎదిరిస్తారట. అమ్మ ఎపుడూ అలా అనేది కాదు, అమ్మకి రంగనాయకమ్మ గారి “బలి పీఠం,” అంటే చాలా ఇష్టం. నేను చదివేటపుడు ఏమి అనేది కాదు అమ్మ. పుస్తకాలు చదవడం, నా ఆలోచనా పరిధిని పెంచుకోవడానికి ప్రయత్నం చేసేదాన్ని. ఇంట్లో ఎక్కువ మనుషులంటే నేను పెరట్లో చెట్ల క్రింద కూర్చుని చదివేదాన్ని, ఎండాకాలం సెలవుల్లో.  ఒకోసారి విసుగొచ్చినప్పుడు, “నేనేమన్నా కూరగాయనా, పండునా పాడయి పోవడానికి, కుళ్ళిపోవడానికి,” అనేదాన్ని.

          మా అన్నయ్య ఉదయభాను పుస్తకాలు తెచ్చిచ్చేవాడు, ప్రోత్సహించేవాడు కూడా.

          నేను నా చుట్టూ జరిగే సంఘటనలకు బాగా స్పందించేదాన్ని. మొట్టమొదటిసారి డెక్కన్క్రానికల్ లో కట్నాల గురించి స్టూడెంట్స్ అభిప్రాయాలు రాయమన్నపుడు కట్నాలకు వ్యతిరేకంగా నా అభిప్రాయం రాసాను చిన్నగా రెండు పేరాగ్రాఫ్ లు పబ్లిష్ చేసారు. ఫస్ట్ టైం అచ్చులో నా పేరు చూసుకున్నాను, 14 ఏళ్ళ వయసులో. ఆ తర్వాత పంజాబ్ లో మొదటిసారి ఉగ్రవాదులు బస్ ని బాంబ్ పెట్టి పేల్చేసినపుడు, బాధ, ఆవేశం లో నుండి వచ్చిన భావానికి అక్షర రూపాన్ని ఇచ్చి ఆంధ్రజ్యోతి జనశక్తి కి పంపించాను, పాఠకుల ఉత్తరాలను పబ్లిష్ చేసేవారు జనశక్తి లో, ఇంత జరిగినా మనుషుల్లో ఏ స్పందన లేకుండా, ఏమి జరగనట్టు ఎలా మాములుగా తిరగగలుగు తున్నారని అనిపిం చేది. . పోస్ట్ కార్డ్ పైన రాసి పంపించేదాన్ని. తెలుగులో రాసినపుడు, ఆంధ్రజ్యోతికి, ఇంగ్లీష్లో రాసినపుడు డెక్కన్ క్రానికల్ కి పంపేదాన్ని. ప్రతి ఒక్కటి వేసుకునేవారు. అలా నాకు జర్నలిస్ట్ ని అవ్వాలని కోరిక మొదలైంది. ఇవన్నీ తీసుకెళ్ళి పెద్దమామయ్యకి చూపించి ఆయన అభిప్రయం అడుగుదామని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ చేయలేక పోయాను. అమ్మకు నా రాతలు చూసి చాలా సంతోషమేసేది, కానీ నా ఆలోచనల వల్ల పెళ్ళి కాకుండా పోతుందేమో అని భయ పడేది. ఒకసారి నాకు చెప్పకుండా అమ్మ నా రాతలు తీసుకెళ్ళి పెద్దమామయ్యకి చూపించిందట.

          “బాగా రాస్తుందమ్మ! ఎడిటర్ కి నచ్చితే కానీ ’లెటర్స్ టు ది ఎడిటర్,’ లో కానీ ’ఉత్తరాల పేజి’లో ప్రచురించరు. ఇన్ని రాసిందంటే వాళ్ళకి నచ్చే వేసుకున్నారు కదా!” అన్నాడట పెద్ద మామయ్య.

          అలాంటి పెద్ద మామయ్య హార్ట్ అటాక్ వచ్చి నవంబర్ 5, 1987 లో పోయారు. మా నర్మద నవంబర్ 17న పోయింది. అమ్మకి పెద్దమామయ్య, చిన్నమామయ్యలే తండ్రి లాంటి వారు. మా తాతయ్య మా అమ్మమని, 5 గురు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయి వేరే ఆవిడని పెళ్ళి చేసుకున్నాడు. పెద్దమామయ్య, జైలులో ఉన్నపుడు కమ్యునిస్ట్ పార్టీ వారే కుటుంబాన్ని చూసుకునేవారని చెప్పేది. అమ్మ, పిన్ని చిన్నపిల్లలపుడు అమ్మమ్మతో జైలులో మామయ్యను చూడడానికి వెళితే వాళ్ళ అండర్వేర్స్ జేబుల్లో పార్టీవారిచ్చిన మెసేజుల చీటీలు పెట్టుకుని వెళ్ళేవారని, ఎవ్వరూ చూడనపుడు మెల్లిగా తీసి ఇచ్చే వారమని చెబ్తుండేది. మా పెద్ద మామయ్యకు ముగ్గురు చెళ్ళళ్ళంటే చాలా ఇష్టం, అలాగే మా నాన్నకి ఆరుగురు అక్కాచెళ్ళేళ్ళంటే ప్రేమాభిమానాలు. నాన్న దాశరధి గారి చెల్లేల్ని మా అమ్మని చేసుకుంటే, మా నాన్న చెల్లిని దాశరధి గారు చేసుకున్నారు.  అమ్మ ఎపుడు ఎవరి గురించి చెప్పినా ఎవరినీ తక్కువ చేయకుండా చెప్పేది. మామయ్యలిద్దరు ప్రజల కోసం, సాహిత్యం కోసం, కుటుంబం కోసం పాటు పడితే, నాన్న కొంత మంది చెల్లెళ్ళకు విధవా వివాహం, కులాంతర వివాహాలు చేయించారు, మేనల్లుళ్ళని ఇంట్లో ఉంచుకుని చదివించారు, ఉద్యోగాలు వచ్చేదాక సాయం చేసారు, పెళ్ళిళ్ళకు సాయం చేసారు.

          పెద్దమామయ్య పోయి అమ్మ చాలా బాధలో ఉంది, నాకూ చాలా బాధేసింది. నేను రాసినవి తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడదామనుకుంటుండగానే ఆయన సడన్ గా పోవడం, అమ్మ పెద్దమామయ్య ఇంట్లో ఉంటే నేను అక్కడ నుండి నర్మదని చూడడానికి వెళ్ళేదాన్ని. తను పోయిం తర్వాత నా గోలలో, నా ఏడుపులో నేనున్నాను. పిన్ని వాళ్ళు వచ్చి మా ఇంట్లో ఉన్నారు. ఇద్దరు పిన్నులతో నాకు చాలా చనువుంది, ప్రేమాభిమా నాలు ఉన్నాయి. పెద్దమామయ్య 13 రోజులు అయిపోయాక అందరు వెళ్ళిపోయారు. అమ్మ ఎంత బాధలో ఉందో నేను పట్టించుకోలేదు. (తల్చుకుంటే ఇపుడు చాలా బాధేస్తుంది, అపరాధ భావం ఇప్పటికీ నన్ను వెంటాడుతుంటుంది.) కానీ అమ్మ నా బాధని అర్ధం చేసుకుంది అందుకే నా స్నేహితురాళ్ళని వచ్చి నాతో కాసేపు కూర్చొని మాట్లాడమని పిలుస్తుండేది. నాకంతగా మాట్లాడాలని అనిపించేది కాదు. అమ్మకి నేనేమయిపోతానో అని భయం పట్టుకుంది. అపుడు చిన్న మామయ్య తన స్నేహితుడు ఒక సైకియాట్రిస్ట్ వాళ్ళింటికి రమ్మంటే వస్తాడు, ఒకసారి తీసుకురా అంటే అమ్మ, నేను వెళ్ళాము. అమ్మ నన్ను అంత జాగ్రత్తగా చూసుకునేది. డాక్టర్ గారు మేము వెళ్ళాక వచ్చారు. ఆయన చాలా నెమ్మదిగా ఒక్కో ప్రశ్న వేస్తున్నారు. నా ఆవేశం, నర్మద ఎలా పోయింది, మేమేం చేయలేక పోయమన్న బాధ, పెద్ద మామయ్యతో నా ఆలోచనలు పంచుకోలేక పోయాననే నిరాశ – వీటన్నిటి గురించి చెబుతుండగా మా చిన్న మామయ్య వచ్చి నా దగ్గర మా అన్నయ్య గురించి రాసిన “మై అంకుల్ పోయెట్ దాశరధి,” ఉంది అని తీసి ఇచ్చారు. నేను మామయ్య పోయాక రాత్రి నిద్రపోలేక నాకు ఆయన గురించి తెలిసింది రాసి  డెక్కన్ క్రానికల్ కి రాసి పంపిస్తే ఆ రోజు “లెటర్స్ ఆఫ్ ది ఎడిటర్” లో అది ఒక్కటే పబ్లిష్ చేసారు. డాక్టర్ గారు అవి చూసారు, “ఇవి రాసాక ఎలాఅనిపించింది?” అని అడిగారు. “రాసాక అందరూ చదువుతారు ముఖ్యంగా నర్మద గురించి ఇలాంటి తల్లితడ్రులుంటారని తెలియాలని రాసాను, టు క్రియేట్ అవేర్ నెస్ అమాంగ్ పీపుల్, మా మామయ్య గురించి అఫ్కోర్స్ న్యూస్ పేపర్స్ లో

          ఆయన గురించి అందరు రాస్తారు కానీ మామయ్యని చాలా మిస్ అవుతాము,” అన్నాను కళ్ళళ్ళో నుండి నీళ్ళు కారుతుంటే.

          “కొద్దిగానయినా రిలీఫ్ గా అనిపించిందా? కొంత మందికి ఫ్రెండ్స్ తో మనసులో భావాలు చెప్పుకుంటే రిలీఫ్ గా ఉంటుంది. కొంత మందికి మీ లాగ రాస్తే బాధ కొద్దిగా నయినా తగ్గుతుంది. అందుకని అడిగాను.” అన్నారు.

          ” రాసిన దానికి రెస్పాన్స్ బావుంది అని మెచ్చుకున్నారు కానీ కనీసం మా కాలేజ్ వాళ్ళందరం కల్సి నర్మద తండ్రిని బయటకు లాగి ప్రశ్నిస్తే ఆడపిల్లలకు తిండి తక్కువ పెట్టేవాళ్ళు, మొగపిల్లలకు ఆరోగ్యకరమైన తిండి పెట్టేవారికి, ఆడపిల్లలకు జబ్బులుంటే చికిత్స చేయించని తల్లి తండ్రులకు తెలిసేలా మేమంతా ఒక నిరసన ప్రదర్శన చేసినా బావుండేదనిపించింది.” అన్నాను.

          “మీ స్టడీస్ పై దృష్టి పెట్టి చదవ గలుగుతున్నారా?”

          “లేదండి.. చదవలేకపోతున్నాను, ఈసారి ఫైనల్ ఇయర్ చదవలేకపోతే ఫేయిల్ అవుతానని భయంగా ఉంది.”

          ఇంకొన్ని ప్రశ్నలు వేసాక కొన్ని మందులు రాసిచ్చారు ఆ తర్వాత అమ్మా, నేను ఇంటికి ఇంటికి వెళ్ళేపుడు మందులు కొనుక్కొని వెళ్ళాము.

          ఆ మందులు పనిచేయడం మొదలుపెట్టాయి. రాత్రి త్వరగా వేసుకుని పడుకుంటే బాగా నిద్ర పట్టేది, పొద్దున్న కాలేజ్ కి వెళ్ళేపుడు ఒక చిన్న టాబ్లెట్ వేసుకుని వెళ్ళేదాన్ని. ఏదైనా తట్టుకోలేని సంఘటన జరిగినపుడు మన మెదడు ఒకటే విషయం గురించి అతిగా ఆలోచించడం వల్ల మెదడు అతి వేగంగా పని చేయడం మొదలుపెడుతుంది. కొంత మందికి వారంతట వారే వారి మెదడులో చెలరేగుతున్న, బాధ, శోకం, భావాలను మెల్లిగా కంట్రోల్ చేసుకోగలుగుతారు. కొంత మందికి డాక్టర్ల సాయం అవసరం అవుతుంది.  పేషంట్స్ గురించి బాగా తెల్సిన డాక్టర్లు వారి బాధని అర్ధం చేసుకుని మందులు రాసేస్తారు. చిన్న మామయ్యకు సైకియాట్రిస్ట్ తెలుసన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాము.

          డిసెంబర్ నెలలో నేను, నా ఫ్రెండ్ ఫాతిమా ఇద్దరం కలిసి వైజాగ్ కి వెళ్ళాము. మా చిన్న పిన్ని అరుణక్కా అని పిలవడం అలవాటు అందరికి, తను అక్కడ ఉంటుంది. ఫాతిమా వాళ్ళ అత్త కూతురు, ఆమె కుటుంబం ఉంటారు. ఎపుడూ ఒక్కదాన్ని ఎక్కడికి వెళ్ళలేదు. నాకు సముద్రమంటే చాలా ఇష్టం, మా పిన్ని వాళ్ళు, ఫాతిమా బందువులు ఒకే కాలనీలో ఉండేవారు. ఫాతిమా తెల్లవారుఝామునే 5.30 కి వచ్చేది. ఇద్దరం కలిసి బీచ్ కి వెళ్ళి సూర్యోదయం చూసేవాళ్ళం. చాలా సంతోషంగా అనిపించేది. మేమిద్దరం కలిసి వైజాగ్ లో ముఖ్యమైన ప్రదేశాలు చూడడానికి వెళ్ళేవాళ్ళం. ఫాతిమా నా వెంట ఉండేది. నాకు ఒంట్లో బాగాలేకున్నా, ఇంట్లో ఏవైనా కలతల వల్ల మనసు బాగా లేకున్నా చాలా సపోర్ట్ చేసేది. ఇద్దరం మధ్యతరగతి వాళ్ళం కావడం వల్ల ఒకరినొకరం అర్ధం చేసుకునేవాళ్ళం. మాది సాంప్రదాయ కుటుంబం, వాళ్ళ కుటుంబం అలాగే ఉండేది కాబట్టి మేము మంచి ఫ్రెండ్సయ్యాము.

          ఒకసారి భధ్రాచలం వైపు వరదలొచ్చి చాలా మంది పోయారు, చాలా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించింది. అపుడు కాలేజ్ కి సెలవులనుకుంటాను. కూర్చుని ఊరికే ఆలోచిస్తుంటే పిచ్చేక్కేలా అనిపించింది. అపుడు నేను ఒక డబ్బా పట్టుకుని ఫాతిమా ఇంటికెళ్ళి ఇంటింటికెళ్ళి డబ్బులు కలెక్ట్ చేద్దాం వస్తావా? అని అడిగా. ఏమి ఆలోచించకుండా వాళ్ళమ్మకి చెప్పేసి వచ్చింది. ఇద్దర్మే ఉన్నాము, కాలనీలో ఉన్న మరి కొంత మంది స్నేహితురాళ్ళను పిలుద్దామని వెళ్ళాము. ఒకమ్మాయి ముక్కు మీద పెద్ద మొటిమ ఉంది రానని అంది, మేమెంత చెప్పినా వినలేదు. “ఎవ్వరూ నీ మొటిమ గురించి పట్టించుకోరు, మాతో రా, అందరం కలిసి వెళితే బావుంటుంది.” రానంటే రానంది. ఒకరిద్దరు కాసేపు వచ్చి, “మా నాన్న వచ్చే టైం అయ్యింది ఇంటికి వెళ్ళాలి, తను వచ్చే టైం కి ఇంట్లో లేకపోతే,” అని వెళ్ళిపోయారు. కానీ మేము కాలనీలో ప్రతి ఇంటికి వెళ్ళాము, ఎవరికి తోచినంత వారు ఇచ్చారు. ఒకావిడ 10 పైసలు ఇచ్చారు, మేమిద్దరం ఆశ్చర్యపోయాము. సాయంత్రం వర్షం మొదలయ్యింది, మేము గొడుగు పట్టుకుని తిరుగుతున్నాం. మాతో రానని అన్న, త్వరగా ఇంటికెళ్ళిపోయిన స్నేహితురాళ్ళందరూ పట్టు లంగాలు, ఓణీలు వేసుకొని, నగలేసుకొని శ్రావణమాసం పేరంటాలు తిరుగుతుంటే చాలా కోపం వచ్చింది. కానీ వాళ్ళని మేము మార్చలేమని పించింది.

          రాత్రికల్లా కలెక్ట్ చేసిన డబ్బు లెక్కపెట్టి ఒక గ్రూప్ వాళ్ళు భద్రాచలం వెళ్తున్నారు, వాళ్ళకిస్తే మమ్మల్ని అడిగారు, “మీరిద్దరూ కష్టపడి కలెక్ట్ చేసిన డబ్బులు, మీరు ఎలా చేయమంటే అది చేస్తాము.” ఫాతిమా, నేను మాట్లాడుకుని,”బ్లాంకెట్స్ కొనండని.” చెప్పాము. 

          నేను మా ఆడపడుచు శైలజని చూసుకోవడం ఇష్టంలేక ట్రీట్మెంట్స్ కోసం, స్కూల్స్ కోసం చూస్తున్నానని అంటే చాలా బాధేసింది. తన ఆరోగ్య పరిస్థితి కొద్దిగా బాగు పడే అవకాశం ఉన్నా, ఇంట్లో ఉండి ఏమి చేయడానికి లేక అందరితో గొడవలు పెట్టుకుంటుం టే తనకి మంచిది కాదు, ఇంట్లో వారికీ రోజూ మానసిక వత్తిడి పెరుగుతుంది.

          అందుకనే నేను చెప్పాను కాని నాకు చేయడం ఇష్టం లేక కాదు. ఇంట్లో వాళ్ళు నాకేమి చెప్పకుండానే ఉప్పల్ లో ఒక హాస్టల్ ఉందని మా మామగారికి తెల్సిన ఫ్రెండ్ ద్వారా అక్కడ సీట్ కోసం ప్రయత్నించసాగారు. నాకీ విషయం తెలియదు. ఒకరోజు నేను లేచి వచ్చేవరకు శైలజ ని తీసుకొని ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతున్నారు. నేనెక్కడికి వెళ్తున్నారని అడిగాను. అది విన్న అమ్మమ్మగారు, “మేమెపుడు ఇలాంటి రోజొస్తుందని అనుకోలేదమ్మా…”అని ముక్కు జిర్రున చీదారు.

          “ఏమైంది? ఎవరికైనా ఒంట్లో బాగాలేదా?” అని అడిగాను కంగారుగా.

          మా అత్తగారు, “ఏం లేదమ్మా! అమ్మానువ్వూరుకో.”

          “ఊరుకుంటానమ్మా! మీకు కోడలొస్తే మనందరిని బాగా చూసుకుంటుందని అను కున్నాం కానీ అపుడే మీరిల్లు వదిపెట్టిపోవాల్సి వస్తుందనుకోలేదమ్మా!” అని ఏడవడం మొదలెట్టారు.

          “ఎవరిల్లు వదిలిపెట్టి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు?”

          “ఏం లేదమ్మా ఉప్పల్ దగ్గర ఒక హాస్టల్ ఉందట శైలజ లాంటి పిల్లలకు, అక్కడ సీట్ దొరుకుతుందేమోనని ప్రయత్నిస్తున్నాం. ఇంకా సీట్ దొరుకుతుందో, లేదో తెలియదు. దొరికితే బావుంటుంది. ఒకవేళ దొరికితే శైలుకి దగ్గర ఉండదానికి మేము అక్కడ చిన్న ఇల్లు చూసుకుంటే బావుంటుందేమో అని ఆలోచిస్తున్నాము. ఆలు లేదు, చూలులేదు కొడుకు పేరు సోమలింగం అని మా అమ్మ ఊరికే కంగారు పడుతుంది.” అన్నారు మా అత్తగారు కానీ ఆమె మొహంలో భయం కనిపించింది.

          “అది హాస్టల్ అంటున్నారు. అక్కడ చిన్నప్పట్నుండి పెరిగే పిల్లలకు అన్నీ నేర్పిస్తారు కదా! ఇక్కడ కూడా పీరియడ్స్ అపుడు తనంతట తను చేసుకోగలగాలి అంటారేమో!

          వస్తే సంతోషించాల్సిన విషయమే. మీరు ఇల్లు అక్కడికి మారినా వాళ్ళు రోజు శైలుని చూడనిస్తారో లేదో కాబట్టి అలాంటి ఆలోచనలు పెట్టుకోకండి. అమ్మమగారు మీరంతా ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నట్టు అన్నారు. అలాంటి పరిస్థితి రాకూడదు ఒకవేళ వస్తే నేనే బయటకు వెళ్తాను. మీ ఇంటి నుండి అందరిని వెళ్ళగొట్టేంత రాక్షసిని కానండి.” అని నా పనులు చేసుకోవడానికి వెళ్ళాను. కానీ మనసంతా భారంగా అయిపోయింది.

          ఎవ్వరికీ చెప్పుకోవడానికి లేదు. శ్రీనివాస్ కి చెబితే మౌనంగా అయిపోతాడు. అమ్మ, నాన్నకి చెబితే, ’కాపురమంటే ఇలాంటివన్నీ వస్తుంటాయి, సర్ధుకుపోవాలమ్మా,’ అని నాకు చెప్తారు కానీ తాము ఏమి చేయలేమని బాధ పడతారు.

          చాలా రోజులు తిరిగారు ఆ హాస్టల్ లో సీట్ కోసం. కానీ పిల్ల పెద్దదని, తనంతట తను నెల నెల బహిష్టు పని చేసుకోవడం రాదని తీసుకోలేదు. మళ్ళీ కొన్నాళ్ళు ఇంట్లో నిరాశ ఛాయలు అలముకున్నాయి. నేను జర్నలిజం క్లాస్ కి వెళ్ళొస్తున్నాను. నాకిష్టమైన సబ్జెక్ట్ కావడంతో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. ఒకోసారి ఏదైనా ఒక టాపిక్ ఇచ్చి దాని గురించి ఇన్వెస్టిగేటివ్ ఆర్టికల్ చేయమంటారు. నాకు మాదక ద్రవ్యాల గురించి ట్విన్ సిటీస్ లో రిసెర్చ్ చేసే టాపిక్ ఇచ్చారు. అన్ని రకాల ప్లేసెస్స్ కెళ్ళి సమాచారం సేకరించాలి. మళ్ళీ పొద్దున్నే కాలేజ్ కి వెళ్తున్నట్టుగా అనిపించేది. ఇంట్లో ఎక్కువ సేపు ఉండకుండా పని మీద దృష్టిపెట్టడం వల్ల కొంచెం ఉత్సాహంగా, సంతోషంగా అనిపిం చేది. ఫాతిమా కంప్యూటర్ కోర్సులు చేస్తుంది. తన క్లాస్ అయిపోగానే నేను తన ఇన్సిటిట్యూట్ కి వెళితే తను నాతో వచ్చేది. ఇద్దరం కలిసి కాసేపు పని చేసుకుని యునివర్సిటిలో మిగతా ఫ్రెండ్స్ కూడా కలిస్తే అందరం కల్సి టీ, సమోసాలు తిని రాత్రికి ఇంటికి వెళ్ళేవాళ్ళం. నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన సైకియాట్రిస్ట్ దగ్గరకి వెళితే ఆయన డ్రగ్స్ తీసుకునేవారి గురించి, వారి ట్రీట్మెంట్స్ గురించి చెప్పి సాయం చేసారు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.