మా కథ (దొమితిలా చుంగారా)- 51

(చివరి భాగం)

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

          మేం సమ్మె ప్రారంభించిన పదమూడు రోజులకు జూన్ 22న నాకు నొప్పులు రావడం మొదలైంది. నేను నా భర్తను రెడ్ క్రాస్ వాళ్ళ దగ్గరికెళ్ళి, పోలీసులు నన్ను ఆస్పత్రిలో వేధించకుండా, వాళ్ళేమన్నా హామీ ఇస్తారో అడగమన్నాను.

          నా రాకకు ఆస్పత్రి వాళ్ళు చాల ఆశ్చర్యపోయారు. అప్పటికే నా గురించి రెండు వదంతులు ప్రచారమై ఉన్నాయి. నాకు గనిలోనే కవల పిల్లలు పుట్టారని ఒక పుకారైతే నా పరిస్థితి చూసి కదిలిపోయి బన్ జెర్ భార్య స్వయంగా నన్ను తన పర్యవేక్షణలో ఒక ఆస్పత్రిలో జాగ్రత్తగా చూసుకుంటున్నదని మరొక పుకారు.

          ఇలాంటి హాస్యాస్పదమైన కథలు ఎందుకు ప్రచారం చేశారో నాకు తెలియదు. ప్రభుత్వం నాతో మంచిగా ఉంటానని హామీ ఇస్తోంది గనుక నమ్మి నేను బైటికొస్తానన్నా? కార్మికులు ఇవి విని నన్ను అమ్ముడుపోయిన దానికింద లెక్క కట్టెయ్యాలనా?

          ఆస్పత్రిలో నన్ను చాలా బాగా చూసుకున్నారు. అక్కడే నా పసికూన పావ్లా ఆరోగ్యం గా పుట్టింది. మగ శిశువు మాత్రం చనిపోయి ఉన్నాడు. లోపల పిండమే కుళ్ళిపోయిందట. అందుకనే ఈ సారి నాకు తేరుకోవడానికి చాల కాలం పట్టింది. నేను ఆగస్టు 6 దాకా ఆస్పత్రిలోనే ఉండవలసి వచ్చింది. అప్పుడు నాకు రెడ్ క్రాస్ వాళ్ళు ఎంతో సాయపడ్డా రు. వాళ్ళు నా మీద ఈగ వాలకుండా చూశారు. మొదట నన్ను కార్మికుల భార్యలందరూ ఉండే జనరల్ వార్డ్ లో ఉంచారు. గాని ఆ తర్వాత మరింత చిన్నగా, రక్షణగా ఉండే ఉద్యోగుల వార్డ్ లోకి మార్చారు.

          ఆస్పత్రిలో నన్ను కలవడానికి వచ్చిన వాళ్ళతో నాకు బైటి వార్తలు తెలిసేవి.అక్కడ అందరూ పాటించిన ఒక రోజు నిరాహార దీక్షలో నేను కూడా పాల్గొన్నాను.

          ప్రసవానికి ముందుగాని, తర్వాతగానీ నన్ను ప్రభుత్వ ఏజెంట్లు ఏ మాత్రమూ వేధించలేదు. ముందేమో నేను వాళ్ళకి దొరకలేదు. తర్వాత నాకు రెడ్ క్రాస్ వాళ్ళ రక్షణ ఉండింది. ఐతే నా కోసం పోలీసులు ఎందరినో వేధించారు. చివరికి నేనా తేదీల్లో ప్రసవిస్తానని తెలుసు గనుక, నేను ఆస్పత్రిలో చేరడానికి ముందు రోజు వచ్చి ఆస్పత్రి అంతా సోదా చేశారట.

          ఈలోగా జాతీయ మహిళలు గృహిణుల సంఘం పేర ప్రకటనలిచ్చి రేడియోల్లో చదివించుకున్నారు. జనాన్ని గందరగోళ పరచడానికి వాళ్ళిలాంటి నీచానికి దిగజారారు.

          అప్పుడే మేము గృహిణుల సంఘం దృక్పథాన్ని వివరిస్తూ ఒక ప్రణాళిక విడుదల చేశాం. మేమా ప్రణాళికలో కొరొకొరొ డిమాండ్లన్నిటినీ మళ్ళీ ఓ సారి నొక్కి చెప్పాం. గనుల్లో సాగుతున్న అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్తాం. మేమింకా దాంట్లో “అధికారులారా! మీరు మా ఇళ్ళను ప్రస్తుతం చిందర వందర చేస్తున్నట్టు మేమెన్నడయినా మీ ఇళ్ళను చేశామా? గనుల్లో పనిచేయడమంటే ఏమిటో మీకు తెలుసా? కార్మిక వర్గపు దారిద్యాలూ, దుఃఖాలూ మీకేమైనా అర్థమవుతాయా? మిత్రులారా – మీకు జనాన్ని ఎలా చంపాలో తెలుసును గాని దేశ ఆర్థిక వ్యస్థకు చేయూతనివ్వడమెలాగో తెలియదు. మీకేమో మంచి వస్తువులన్నీ ఉన్నాయి, కార్లున్నాయి, బంగళాలున్నాయి, నౌకర్లున్నారు. మరి కార్మికు లకో? దారిద్యం ఉంది, ఆహార కల్తీ ఉంది, వాళ్ళ ఊపిరితిత్తులు సిలికోసిలో చిల్లులు పడిపోయాయి. ఇక ఇప్పుడు వాళ్ళ కణతలకు గురి పెట్టబడిన తుపాకి కూడ ఉంది. ఆరోగ్యవంతునిగా పనిచేయడం ప్రారంభించి పనిలో చనిపోవడమంటే, ముక్కలు ముక్కలై గాల్లో ఎగిరిపోవడమంటే ఏమిటో, కుటుంబాన్ని కటిక పేదరికంలో ముంచి పోవడమంటే ఏమిటో, మీకు తెలియదు… మేమింకా స్పానిష్ వలసవాదుల పాలనలో లేమనీ, తుపాకి మొనతో పనులు చేయమనీ ప్రభుత్వం గుర్తించినట్టు లేదు. మేం బానిసలం కాదు, కార్మికులం. మేం మా పెదవైనా విప్పకుండా మా పీడకులచేత వధించ బడడానికి సిద్ధంగా లేం. ప్రభుత్వం మాతో ఇలాగే వ్యవహరిస్తే మేమిక ఇతర దేశాలకు వెళ్ళిపోవాల్సి వస్తుంది. అక్కడ మేం మనుషులుగా గుర్తించబడతాం. మేమప్పుడు ఆ దేశాల ఆర్థిక వ్యవస్థల అభివృద్ధికి తోడ్పడతాం. అప్పుడిక మీ మిలటరీని తీసుకొచ్చుకుని గనుల్లో పనిచేయించుకోండి…” అని రాశాం. చివరికి యూనియన్లు చెప్పిన ప్రతిదానితోనూ మాకు ఏకీభావం ఉందని స్పష్టంగా ప్రకటించాం.

          మా దృక్పథమేమిటో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం మంచిది కదూ? లేకపోతే మరొక గృహిణుల సంఘం తయారయింది. లాపాజ్ నుంచి ఒక స్త్రీ వచ్చి కొత్త నాయకుల నెన్నుకోవడానికి, వాళ్ళకు చదువుకోవడం కోసం పదిహేడు స్కాలర్ షిప్ లివ్వడానికీ పూనుకుంటోంది. కొందరు స్త్రీ కార్మికులు అమ్ముడు పోయిన మాట నిజమే. నేను విన్న దాన్ని బట్టి మా సంఘంలోని కొందరు కార్యదర్శులు కూడ వాళ్ళతో చేరి పోయారట.

          మాకిప్పుడు పనిచేయడం చాల కష్టమవుతున్నది. సమ్మె తర్వాత మేం ఏవో ప్రతిపాదనలు పె. “గృహిణుల సంఘమా? అదింకా ఎక్కడుందీ?” అని కంపెనీ వాళ్ళడిగారు. కార్మిక వర్గపు అత్యున్నతాధికారం కలిగిన యూనియనే పనిచేయలేని స్థితి ఉంటే వాళ్ళతో భుజం కలపవలసిన మా సంఘం ఏం పని చేయగలుగుతుంది? మా సంఘాన్ని ఒక జాతీయవాద సంఘంగా మార్చి తద్వారా కార్మికుల్ని మోసగించాలని ప్రభుత్వం తల పెట్టింది. ఆ లెక్కన మా సంఘం నిషేధించబడిందన్న మాట. ఐనప్పటి కీ మేం ప్రభుత్వంతో మిలాఖత్తు కాలేం.

          ఐతే ఈ కొత్త సంఘం నిర్మాణంతో కింది స్థాయిలో ఎవరికైనా గందరగోళం ఏర్పడి నట్టు నాకు కనిపించలేదు. ఇలాంటి శ్రేణులే మమ్మల్ని సరైన సమయంలో సరిగా అంచనా వేస్తాయని నాకు తెలుసు.

          ఆ రోజుల్లో ఏం మాట్లాడాలో కూడా అర్థం కానంత గందరగోళపు సంగతులెన్నో జరిగాయి. కొందరు నాయకులు జైళ్ళలో ఉండిపోయారు. మరికొందరు అజ్ఞాతంలో ఉన్నారు. కొందరు అమ్ముడుబోయారు. కార్మికులేమో ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నారు. నిజానికి కార్మికవర్గంలో ఏ శక్తి లేదనీ నాయకులే ప్రజల్ని రెచ్చగొడతారని కూడా కొందరంటున్నారు.

          గతంలో కూడ మేం ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం నాకు గుర్తుంది. మా నాయకుల్ని గతంలో కూడ అరెస్టు చేశారు, చంపేశారు. ఐనా కొత్త నాయకులు పుట్టు కొచ్చారు. అలాగే ప్రస్తుతం కూడ మేం ఒక నిశ్శబ్ద దశలో ఉన్నామని నేననుకుంటాను. ఈ స్థితి తాత్కాలికమే. మళ్ళీ మేం యధావిధి పోరాటాల దశలోకి వెళ్తాం. ఈ వెనుకంజే శాశ్వత మైతే ప్రభుత్వం ఎప్పుడో నాయకుడనిపించిన వాడ్నల్లా చంపేసి బొలీవియా కార్మికవర్గ ఉద్యమానికి ముగింపు పలికేదే!

          ఐతే ఇప్పుడు మేం కొంచెం కష్టకాలం గడుపుతున్నామనే చెప్పాలి. 29 రోజులు సమ్మె చేసి ఏమీ సాధించకుండానే కార్మికులు పనిలోకి దిగవలసి వచ్చింది. మేమిప్పుడు మిలటరీ పాలనలో, బానిసల్లాగ బతుకుతున్నాం. ప్రభుత్వం కొన్ని పిసోలు జీతం పెంచుతానని వాగ్దానం చేసిందిగాని, అంతమేరా మరోచోట కోత పెట్టింది. జీతాల పెరుగుదల బూటకమని రుజువై పోయింది. ప్రభుత్వం ప్రకటించినట్టు జీతాల్లో 35 శాతం పెరుగుదల లేనేలేదు. రోజుకు ఐదు పిసోల పెరుగుదల మాత్రమే అమలయింది.

          ఇక మా రాజకీయ పార్టీల గురించి కొంచెం చెప్పాలి. మామూలు సమయాల్లో గంభీరంగా మాట్లాడే ఆ పార్టీలన్నీ ఇలాంటి కష్టకాలంలో మాతో ఎలా సహకరించవచ్చునో అర్థం చేసుకోవు. వాళ్ళలో చాలా మంది తమ ప్రాణాల్ని “ప్రజల కోసం” కాక “పార్టీ కోసం” పణం పెడుతున్నారని నాకనిపిస్తుంది. ఇందు వల్లనే వాళ్ళలో చాల చీలికలున్నాయేమో కదూ? వాళ్ళకు చాలా మంది క్యాడర్ ఉన్నారు. కాని వాళ్ళు జనం దగ్గరికి చేరేది తక్కువ.

          మమ్మల్ని మేం మరింత బాగా రక్షించుకోవాలంటే మరో రకమైన నిర్మాణ పద్ధతులు నేర్చుకోవడం చాల అవసరమేమో అని నేననుకుంటాను. ఎందుకంటే మాకు ఒక మహత్త రమైన పోరాట సంప్రదాయం ఉంది. మా ఆశయం కోసం ఇప్పటికే ఎంత మంది జనం ప్రాణాలు బలి పెట్టారు! కాని మేం తీసుకున్న చర్యలు సాయుధంగా, నలు మూలల నుంచీ మమ్మల్ని చుట్టుముట్టే శత్రువుల్ని సరిగా అడ్డుకోలేక పోయాయి.

          స్వల్పకాలిక పరిష్కారాల గురించి మాకు ఆసక్తి లేదు. మాకు అన్ని ముద్రల, అన్ని రకాల ప్రభుత్వాల్ని చూసిన అనుభవం ఉంది. “జాతీయవాద”, “విప్లవ”, “క్రిస్టియన్” ప్రభుత్వాల పాలన సంగతి మాకు బాగా తెలుసు. 1952లో ఎం.ఎన్.ఆర్. ప్రభుత్వం నాటి నుంచి ఇప్పటిదాకా ఏ ఒక్క ప్రభుత్వమూ ప్రజల అవసరాలను తీర్చలేదు. ఉదాహరణ కు ప్రస్తుత ప్రభుత్వాన్నే తీసుకుంటే అది మాకేమీ మేలు చేయలేదు. సరిగదా, రోజురోజూ కార్మికుల్ని దారిద్యంలోకి నెట్టి విదేశీయులకీ, ప్రైవేట్ వ్యాపారస్తులకీ, ప్రభుత్వ కంపెనీ లకీ, మిలిటరీకీ లాభాలు దోచి పెడుతోంది. పెట్టుబడిదారీ వ్యవస్థ ఉన్నంత కాలమూ పరిస్థితి ఇంతే. ఒక్క సోషలిస్టు వ్యవస్థ మాత్రమే ఎక్కువ న్యాయమైన సమాజాన్ని తేగలదు. ఇవాళ ఏ గుప్పెడు మంది చేతుల్లోనే ఉండిపోయిన ప్రయోజనాలు సర్వ మానవాళికీ అందగలవు.

          మేమీ మార్గానికి రావడానికి మా ప్రభుత్వమే కారణం. ఉదాహరణకు నా విషయం చూడండి. నన్ను వాళ్ళు “కమ్యూనిస్టు” నైనందుకూ, “ఉగ్రవాది” నైనందుకూ డిఐసి కొట్ల లో చావబాదారు. ఈ మాటలు నాకు చాల కుతుహలాన్ని కలిగించాయి. “కమ్యూనిజ మంటే ఏమిటి? సోషలిజమంటే ఏమిటి?” వాళ్ళు నన్ను ఆ పదాలతో తిట్టి తూర్పార పట్టినప్పుడల్లా నేను ఆలోచిస్తుండే దాన్ని. ‘సోషలిస్టు దేశమంటే ఏమిటి? అక్కడ సమస్య లెట్లా పరిష్కారమవుతాయి? అక్కడ జనం ఎట్లా బతుకుతారు? అక్కడ కూడ గని కార్మికు ల మీద మూకుమ్మడి హత్యాకాండలు జరుగుతాయా?’ ఈ ఆలోచన లోంచి నేను విశ్లేషించే దాన్ని. ‘నేనేం చేశాను అసలు నాకేం కావాలి? నేను ఏం ఆలోచిస్తున్నాను? నేనిక్కడ ఎందుకు పడి ఉన్నాను? ప్రజలందరికీ న్యాయం దొరకాలని మాత్రమే నేనడిగాను. ప్రతి ఒక్కరికి తినడానికి చాలినంత ఉండాలని నేనన్నాను. విద్యా విధానం బాగుండాలన్నా ను. ఆ దారుణమైన సాన్ జువాన్ హత్యాకాండల్లాంటివి జరగొద్దన్నాను… సోషలిజమంటే ఇదేనా? కమ్యూనిజమంటే ఇదేనా?…”

          చదివిన పుస్తకాల నుంచీ, చాలా మందితో జరిపిన సంభాషణల నుంచీ నేను కొన్ని విషయాలు గ్రహించాను. ఫలానా సోషలిస్టు దేశంలో జనం మంచి జీవన పరిస్థితుల్లో బతుకుతున్నారు. అక్కడ మంచి ఆరోగ్య పరిస్థితులున్నాయి. ఇళ్ళున్నాయి. చదువుంది. అక్కడ కార్మికుల్ని అందరూ గౌరవిస్తారు. రైతుల్ని తరిమేయరు. స్త్రీలకు ఉత్పత్తి క్రమం లో పాల్గొనే హక్కు ఉంటుంది. ఈ పరిస్థితుల్లో జనం తమ బతుకుల్ని మరింత మరింత బాగు చేసుకోగలరు. స్త్రీలు తాము స్త్రీలై పుట్టినందుకుగానీ, పనితోగానీ, పిల్లల భవిష్యత్తు గురించిగానీ, భర్తల ఆరోగ్యం గురించిగానీ మాలాగ బాధతో కుమిలిపోనక్కరలేదు.

          సోషలిస్టు వ్యవస్థలో అందరికీ సమానావకాశాలుంటాయి గనుక, శిశు పోషణ లయాలుంటాయి గనుక, స్త్రీల పరిస్థితుల్లో గొప్ప మార్పు వస్తుందని మాకు తెలుసు. అలాగే అక్కడ ప్రభుత్వమే వృద్ధుల, వితంతువుల, నిరాశ్రితుల బాధ్యత తీసుకుం టుంది.

          మాకున్న ఆకాంక్షలు కూడ ఇవే కదూ? మా దేశం కూడ ఇలా మారాలనేకదా మా కోరిక! అలాగే సోషలిస్టు నిర్మాణంలో జనం ఎప్పుడూ పాల్గొంటూ ఉండాలనీ, లేకపోతే మళ్ళీ దోపిడీ కోరల్లో పడిపోవచ్చనీ కూడ నాకు అర్థమైంది.

          సోషలిజం సాధించిన దేశాలన్నింటిలోనూ ఇంకా గెలవవలసిందెంతో ఉందని నాకు తెలుసు. కాని వాళ్ళు మాకు కావలసిన వాటితో పోలిస్తే చాల సాధించుకున్నారు.

          అందుకే నేనేమనుకుంటా నంటే మేం, బొలీవియన్ ప్రజలం, ఆయా దేశాల అనుభవాలను జాగ్రత్తగా పరిశీలించాలి. వాళ్ళ తప్పుల్నీ, ఒప్పుల్నీ సరిగా అవగాహన చేసుకోవాలి. అప్పుడు సవ్యంగా ఆలోచించి బొలీవియాలాంటి దేశంలో, మా పరిస్థితిలో, మా ప్రజలతో ఏం చేయగలమో నిర్ణయించుకోవాలి. అంతేగాని రష్యా, చైనా, క్యూబాలు ఏం చెపుతాయో అని ఎదురుచూస్తూ వాటిలో ఒక దృక్పథాన్ని సమర్థిస్తూ, మరో దృక్పథా న్ని విమర్శిస్తూ కాలం వృథా చేయగూడదని నా అభిప్రాయం. నా కర్థమైనంత వరకూ మార్క్సిజం అనేది ఏ దేశపు వాస్తవ పరిస్థితి ననుసరించి ఆ దేశానికి అన్వయించ వలసిందే.

          నా జనం ఒక చిన్న విజయం కోసం, ఒక చిన్న జీతం పెరుగుదల కోసం, మరొక పరిష్కారం కోసం పోరాడడం లేదు. నా జనం తమ దేశం నుంచి పెట్టుబడిదారీ విధానా న్నీ, దాని తైనాతీలనూ శాశ్వతంగా వెళ్ళగొట్టడానికి సిద్ధపడే పోరాటంలో నిమగ్నమై ఉన్నారు. నా ప్రియతమ ప్రజానీకం సోషలిజం లక్ష్యాన్ని చేరేందుకు పోరాడుతున్నారు.

          ఇది నేను కని పెట్టిన సంగతేమీ కాదు. సిఓబి మహాసభలో మేం “బొలీవియా సోషలిస్టు దేశమైన నాడు మాత్రమే స్వతంత్రంగా ఉండగలదు” అని ప్రకటించాం.

          ఈ విషయమై అనుమానం ఉన్న వాళ్ళెవరైనా ఎప్పుడైనా బొలీవియా వచ్చి చూస్తే నా ప్రజలు కోరుతున్నదేమిటో వాళ్ళ ముఖాల మీద వెలుగులో తప్పకుండా అర్థం చేసుకో గలరు.

తాజాకలం: 1978

దొమితిలాతో మొయిమా ఇంటర్వ్యూ

మొయిమా: దొమితిలా – నువ్వు చేసిన కొన్ని ప్రకటనలను ఎలా అవగాహన చేసుకోవాలో స్పష్టంగా చెప్తానని అన్నావు గదా! ఇప్పుడా విషయం ఏమైనా చెప్తావా?

దొమితిలా: సరే – మొదట నేనేమనుకుంటున్నానంటే ఈ పుస్తకం ఒక స్వీయ కథనం. దీన్ని మొదటి నుంచి చివరి దాకా ఆగకుండా చదవాల్సిందేగాని ఏదో ఒక పేరా దగ్గర ఆగిపోయి తమకు తోచిన వ్యాఖ్యానం చేసుకోవద్దని కోరుతున్నాను. ఈ పుస్తకమంతా ఒక గొలుసు. మొదటి నుంచి చివరిదాకా దీన్ని దీనిగానే అర్థం చేసుకుంటూ చదవాలి. ఈ కథనాన్ని ఎవరైనా విశ్లేషించవచ్చును, విమర్శించవచ్చును. కాని దీంట్లో ఉన్న సైద్ధాంతిక దృక్కోణం కోసం గానీ, ఈ పుస్తకం మీద ఒక దృక్పథం ఏర్పరచుకొని గానీ చదవవద్దని కోరుతున్నాను. ఇది కేవలం నా అనుభవాల కథనం.

          ఉదాహరణకు రాజకీయ పార్టీల గురించి నేను చెప్పింది చూద్దాం. నేను యూనియన్ గురించే ఎక్కువ మాట్లాడినప్పటికీ, ప్రజా విముక్తి తప్పని సరిగా ఒక పార్టీ చేత, అదీ పీడిత, తాడిత వర్గాల పార్టీ చేత, కార్మిక వర్గ పార్టీ చేత నడపబడాలని నేను గుర్తిస్తాను. అంటే మరో మాటల్లో చెప్తే మనకు ఒక సొంత పార్టీ ఉండాలి. దాన్ని మనమే నడిపించాలి. ప్రస్తుతం బొలీవియా వాస్తవికత గురించి నాకు ఎంతో ఎక్కువ తెలుసుకో వాలని ఉన్నా, నాకు ఉన్న అవకాశాల ప్రకారం తక్కువే తెలుసు. ఈ వాస్తవికతలో మేధావులు మాతో కలిసి పని చేయవలసిన అవసరం ఎంతో ఉందని నేననుకుంటు న్నాను. కార్మికులం, కర్షకులం మా అంతట మేమే పోరాడుతామని మేమేమీ అనడం లేదు. మేధావులు కూడా ఈ పోరాటంలో పాలుపంచుకోవాల్సిందే. ఐతే వాళ్ళు ఎల్లవేళలా వాస్తవికతకు దగ్గరగా ఉంటూ, ఆ వాస్తవికతకు మార్క్సిస్టు – లెనినిస్టు సిద్ధాంతాన్ని సరిగా అన్వయించాలి. పార్టీని కార్మికవర్గమూ, రైతాంగమూ నడిపించాలి. మిగతా ప్రజా రంగాలన్నీ ఇందులో పాల్గొవాలి. నా కథనంలో నేను మురికి వాడల గురించి చెప్పలేదని ఎవరో అన్నారు. అది నిజమే. కాని నాకు వాటి గురించిన వాస్తవ స్థితి సరిగ్గా తెలియదు. మురికి వాడల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాను. గాని నేనెప్పుడూ అక్కడ ఉండ లేదు. వాళ్ళస్థితి మాకన్నా హీనంగా ఉంటుంది. కార్మికుల స్థితే ఇంత హీనంగా ఉంటే రైతులూ, మురికి వాడల నివాసులు ఎలాంటి జీవన పరిస్థితుల్లో బతుకులీడుస్తున్నారో గదా అని నేను అనుకుంటాను. కాని నేను నా ప్రజల గురించి సైద్ధాంతిక పద్ధతిలో మాట్లాడ దలచుకోలేదు. అందువల్లనే నేను కొన్ని వర్గాల ప్రజల గురించి ప్రస్తావన కూడ చేయను.

మొయిమా: సోషలిజంతోనే స్త్రీల సమస్యలన్నీ పరిష్కారమవుతాయని నువ్వు భావిస్తు న్నావని కొందరు అనుకుంటున్నారు…

దొమితిలా : నేనేమనుకుంటానంటే బొలీవియాలోనైనా, మరే దేశంలోనైనా సోషలిజం అనేది స్త్రీలు ఒక స్థాయికి చేరేందుకు అవసరమైన పరిస్థితుల్ని సృష్టించి పెట్టే సాధనం. ఆ తర్వాత స్త్రీలు తమ పోరాటం తాము సాగిస్తారు. తమ భాగస్వామ్యంతో తమ స్థానాన్ని నిలబెట్టుకుంటారు. వాళ్ళ విముక్తి వాళ్ళ సమస్యే అవుతుంది.

          కాని, నేనేమనుకుంటానంటే ప్రస్తుత పరిస్థితిలో మన ప్రజల విముక్తి కోసం పురుషు లతో కలిసి పోరాడడమే ముఖ్యం. నేను పురుషాధిపత్యాన్ని అంగీకరిస్తానని కాదు. పురుషాధిపత్యం కూడా ఫెమినిజం లాగనే సామ్రాజ్యవాదుల చేతిలోని ఆయుధమే. మౌలికమైన పోరాటం స్త్రీ పురుషుల మధ్య కాదు – ఈ పోరాటం దంపతుల పోరాటం. నేను దంపతులంటున్నానంటే దాంట్లో పిల్లల్ని, మనవల్నీ కూడ కలుపుతున్నాను. వీళ్ళం దరూ ఒక వర్గ దృక్పథం నుంచి పోరాటంలో చేరాలి. అదే ప్రస్తుతం ప్రాథమికమైనదని నేననుకుంటున్నాను.

మొయిమా: ఈ పుస్తకంలో అంశాలు గుదిగుచ్చడంలో, వివరించడంలో నేను వాడిన పద్దతి మీద నీ అభిప్రాయమేమిటి?

దొమితిలా: నేనీ సంగతే చెప్తామనుకుంటున్నాను. నన్నెంతో మంది జర్నలిస్టులు, చరిత్రకారులు, వివిధ దేశాల నుంచి టెలివిజన్ కెమెరాలతో, మూవీ కెమెరాలతో వచ్చి ఇంటర్వ్యూ చేశారు. ఎంతో మంది మానవ శాస్త్రవేత్తలు, సాంఘిక శాస్త్రవేత్తలు, ఆర్థిక శాస్త్రవేత్తలు దేశంలో ఎన్నో ప్రాంతాలు తిరిగి పరిశోధనలు చేశారు. అలా వాళ్ళు మా దగ్గర తీసుకుపోయిన సమాచారంలో చాల తక్కువ భాగం మాత్రమే మళ్ళీ కార్మిక వర్గానికి అందించబడుతున్నది. అందుకే నేను ఆ వ్యక్తులందరినీ, వాళ్ళకు కార్మిక వర్గానికి సాయపడదామనే కోరిక ఉంటే నీలాగ మా సమాచారాన్ని మాకు అందించమని కోరుతు న్నాను. ఆ రకంగా మా వాస్తవికతను మేమే చదివి మరింత బాగా అర్థం చేసుకోగలం. ఈ పుస్తకం ప్రజలకు ఇవ్వబడుతున్నది. గనుక వాళ్ళకు ఉపయోగపడాలి. అలాగే బొలీవియా గురించిన సినిమాలు, డాక్యుమెంట్లు, పరిశీలనలు జనానికందాలి. వాళ్ళవి చదివి బాగోగులు నిర్ణయించగలరు. ఇది జరగకపోతే మేం ఎక్కడేసిన గొంగళి అక్కడే లాగ ఉండిపోతాం. మాలో అభివృద్దేమీ ఉండదు. మా సమస్యల్ని సరిగా అర్థం చేసుకోలేం. సరైన పరిష్కారాలు కని పెట్టలేం.

          అందుకే మనం వాడిన పద్ధతి నాకు చాల నచ్చింది. నేను ఏం చెప్పదలచు కున్నానో, ఏం వ్యాఖ్యానించదలచుకున్నానో నువ్వు సరిగా అర్థం చేసుకున్నావు. సరిగ్గా అదే ఇక్కడ రాశావు. బొలీవియాలోనూ, ఇంకా ఇతర దేశాల్లోనూ, పరిచయం లేని సిద్ధాంతా లను మేధావుల కర్థమయ్యేట్టుగా వ్యాఖ్యానాలు చెయ్యటానికి కాదు మనం ప్రజల అనుభ వాలను సేకరించేది. వాటిని ఉపయోగించుకోవాలి. ఈ పుస్తకానికి నువ్వు పెట్టిన పేరు (స్పానిష్ లోనూ, ఇంగ్లీషులోనూ ఈ పుస్తకం పేరు ‘నన్ను మాట్లాడనివ్వండి’) సూచిస్తున్నట్టుగా ప్రజలకు మాట్లాడే అవకాశం దొరకాలి.

          పని పద్ధతి గురించి నేనొక విషయం ప్రత్యేకంగా చెప్పదలచుకున్నాను. రికార్డ్ చేసిన మాటలు రాసీ, ఒక్క దగ్గర చేర్చి ఈ కథనం మళ్ళీ కార్మిక వర్గం దగ్గరికి ఎందుకు పంపుతున్నామంటే, కార్మికులు, రైతాంగం, గృహిణులు, ప్రతి ఒక్కరూ, యువకులూ, మాతో ఉండదలచుకున్న మేథావులూ, అందరూ ఈ అనుభవాలు తెలుసుకుని, విశ్లేషించి, మేం గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాలని. ఈ తప్పుల్ని సవరించుకోడం ద్వారా భవిష్యత్తులో సరిగా పనిచేయొచ్చు. మనను మనం సరిగా నడుపుకోవచ్చు. మనదేశపు వాస్తవికతను గుర్తించడానికీ, మన పోరాటాన్ని పురోగమింప జేయడానికవసరమైన మన సొంత సాధనాలు తయారు చేసుకోవడానికి, సామ్రాజ్యవాదం నుంచి ఖచ్చితంగా విముక్తి పొంది, బొలీవియాలో సోషలిజం స్థాపించడానికి ఈ అనుభవా ల విశ్లేషణ పనికొస్తుంది. ఇలాంటి పనికి ఉండే ప్రధాన లక్ష్యం అదే!

దొమితిలా బారియోస్ ద చుంగార

మొయిమా వీజర్

లాపాజ్, బొలీవియా

మార్చ్ 10, 1978.

*****

(సమాప్తం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.