నా అంతరంగ తరంగాలు-11

-మన్నెం శారద

మనసున మల్లెల మాలలూ గెనే….
తొలి రోజుల్లో చెన్నై అక్కయ్య దగ్గరకు వెళ్ళడమంటే నాకు ఎప్పుడూ సంతోషమే!మణక్క కు నేనంటే చాలా ఇష్టం! అదీగాక చెన్నై నాకు తెగ నచ్చేసింది. మొదటిసారి చూసిన ప్పుడు చాలా థ్రిల్ ఫీలయ్యాను. అంత పెద్దనగరం చూడటం అదే మొదటిసారి.

          చిన్నప్పుడు హైదరాబాద్ ఒకసారి చూసినప్పటకీ ఎందుకో చెన్నై నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. సెంట్రల్ స్టేషన్ లోకి రైలు అడుగు పెట్టగానే చెప్పలేని ఉద్వేగం!
అక్కయ్యావాళ్ళని చూడగానే .. ఓహ్ మనసు ఉత్సాహంతో ఊరకలు వేసింది.
పళ్ళికిలించుకుంటూ నేనూ, హేమక్క రైలు దిగేం. స్టేషనకి మణక్క, సౌదా ఇద్దరూ వచ్చారు. ఒకర్నోకరు కౌగలించుకుని , గంతులు వేసి స్టేషన్ బయటకి వచ్చాం.

          ఎక్కడా ఫ్లై ఓవర్లు లేకుండా సరాసరి అన్ని ప్లాట్ ఫామ్స్ స్టేషన్ లోకి దారితియ్యడం చూడటం అదే మొదటిసారి! ఎర్రని రంగులో యమ స్టైల్ గా ఉన్న ఆఁ స్టేషన్ ని దాని పక్కన అదే రంగులో వున్న మూర్ మార్కెట్ ని వింతగా చూస్తూ కారులో మౌంట్ రోడ్డులో ప్రవేశించ్చాం.

          ఇప్పుడొక సందులా కళావిహీనంగా తయారైనా మౌంట్ రోడ్డు అప్పుడెంత విశాలంగా అందంగా అనిపించేదో చెప్పలేను. గోపురాలు గోపురాలుగా ఎర్రటి రంగులో ఉన్న స్పెన్సర్ బిల్డింగ్స్, పేపర్ మెష్ తో అపురూప శిల్పాలు చేసి అబ్బురపరచే పూంగ్ పుహార్, ఎంతో మంది సినీ తారల్ని చూసే అవకాశమిచ్చిన బుహారీ హోటల్,..ఇంకా ముందుకు సాగుతుంటె కుడి వైపు సఫయిర్, ఎమరాల్డ్, బ్లూ డైమండ్ పేర్లతో మూడు థియేటర్ లు ఉన్న పెద్ద కట్టడం! (ఇక్కడ ఎంతమంది సినీ తారల్ని చూసానో లెక్కేలేదు ) ఆ పక్కనే ఉన్న జెమిని స్టూడియో పక్కగా తిరిగి నుంగంబాకం వైపు సాగుతుంటే బర్క్లీ సిగరెట్స్ తాగుతూ విలాసంగా నవ్వుతున్న ఎస్ వీ ఆర్ హోర్డింగ్, ఆఁ పక్కన బ్రిటానియా బిస్కట్స్ హోర్డింగ్!

          అలా చెన్నయ్ నగరంలో సినిమాలు చూస్తూ షికార్లు చేసిన నాకు ఈ సారి ఎలాగయి నా అక్కడే అక్కయ్య దగ్గర సెటిలవ్వాలని మహా కోరిక కలిగింది. ఆఁ గాంధీ, మేరీనా బీచ్ విహారాలూ,, తిరిగి వస్తూ తాజ్ డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ లో టిఫిన్స్.. అమ్మ ఎప్పుడూ ఎక్కడ కూ వెళ్లనివ్వదేమో.. ఈ సారి చదువు పూర్తవ్వగానే అక్కడే అక్కా బావగారి దగ్గర ఉండి జాబ్ చేద్దామనే కోరిక కలిగింది.

          ఆఁ మాటే మణక్కతో అంటే తనూ సంతోషపడింది. “చిన్నమ్మ ఇక్కడ చెయ్యని స్తుందా నిన్ను? “అంది సందేహంగా.

          “అమ్మేవీ ఒప్పుకోదు.”అంది హేమక్క కరాఖండిగా.

          “అయినా ఇది తమిళ్ నాడు గవర్నమెంట్ కదా… నీకిస్తారో లేదో.. బావగారు వచ్చేక మాట్లాడుదాం.” అనుకున్నాం.

          ఆఁ ఊహే నాకు బోల్డంత సంతోషాన్నిచ్చింది.

          ఒక రోజు ఉదయాన్నే నేను, సౌదా ఏదో గుడికి వెళ్ళి ప్రముఖ నిర్మాత, డైరెక్టర్ బి. ఎన్. రెడ్డి గారింటి ముందు నుండి వస్తున్నాం. బి. ఎన్. రెడ్డి గారు ఇంటి ముందున్న ఆవరణలో ఉన్న గులాబీపూల తోటలో వాకింగ్ చేస్తున్నారు.

          “ఆయనతో మాట్లాడుదామే!” అంది సౌద.

          “అంత పెద్దాయనతోనా ఎందుకు? ” అన్నాను నేను భయంతో అయోమయంగా చూస్తూ.

          “నీకేమన్నా ఉద్యోగం ఇప్పిస్తారేమో… అడుగుదాం, చాలా ఇన్ఫ్లుయెన్స్ వుంది ఆయనకు. “అంది సౌద.

          ఉద్యోగం అనగానే నాకూ ఆశ చిగురించింది.

          ఇద్దరం కారు దిగి గేటు తీస్తుంటే ఆయన మా వైపు చూసారు. మేం ఆయనకు నమస్కరం పెట్టాం. ఆయన ప్రతినమస్కారం పెట్టి “ఎక్కడ నుండి వచ్చారామ్మా, ఏ ఊరు?” అనడిగారు సౌమ్యంగా.

          “మాది కాకినాడ గానీ ఇక్కడే హబీబుల్లా రోడ్డులో ఉంటున్నాం “అని చెప్పాం.
“సరే, రండి ” అంటూ ఆయన హాల్లోకి దారి తీశారు. హాల్లో ఉన్న కేన్ కుర్చీల్లో ముగ్గురం కూర్చున్నాం.

          పనబ్బాయి మంచి నీళ్లు తెచ్చి ఇచ్చాడు.

          “నేనిప్పుడు సినిమాలు తియ్యడం మానేసాను తల్లీ. ఇంతకూ మీ ఇద్దరిలో ఎవరు యాక్ట్ చేయాలని?” అనడిగారు ఆయన మా ఇద్దరికేసి చూస్తూ.

          మాకు లోలోపల గిలిగింతలు పెట్టినట్లు నవ్వొచ్చింది ఎందుకంటే మాకు నటించడమంటే భలే సరదా… కానీ పైకి మర్యాదాగా “అద్భుతమైన సినిమాలు తీశారు కదా సర్, మిమ్మల్ని చూడాలని వచ్చాం! అన్నాం వినయంగా.

          అంతే!

          ఆయన సరదాగా సినిమా సంగతులు చెప్పడం ప్రారంభించారు. ఒక అసామాన్య మైన వ్యక్తి ముందు కూర్చుని మేం ఆయన మాటల్ని మంత్ర ముగ్దల్లా వింటున్నాం.
వందేమాతరం నుండి బంగారు పంజరం సినిమా వరకు ఆయన అనేక విషయాలు ఒక పసిపిల్లవాడిలా చెబుతుంటే గంటలు నిముషాలుగా మారిపోయాయి. మాకు ఈ లోపున కాఫీ టిఫిన్లు వచ్చాయి.

          మేం మల్లేశ్వరి, రంగులరాట్నం, బంగారు పంజరం గురించి పొగిడాం.

          ఆయన ఆనాటి సందర్భాలు, అప్పటి నటుల డెడికేషన్, హార్డ్ వర్క్, అన్నీ చెప్పుకుంటూ వచ్చారు. చివరిలో ఆయన వాణిశ్రీని పొగడడం నాకు బాగా గుర్తుంది.

          ‘ఏమి నటనమ్మా ఆమెది, ఎంత చక్కని ఎక్స్ప్రెషన్స్, మన బంగారు పంజరంలో ఎంత బాగా నటించింది! Really she is a wonderful artist!” అంటూ చాలా సేపు మెచ్చుకున్నారు.

          ఏ ఒక్కమాటలో కూడా అంత సుదీర్ఘ సినీ ప్రయాణం ఉన్న ఆఁ మహానుభావుడు ఏ ఒక్కరిని కించపరుస్తూ ఒక్క పొల్లు మాట కూడా మాట్లాడలేదు.

          “సర్, మీరిప్పుడు ఎందుకు సినిమాలు తియ్యడం మానేశారు? “అని అడిగాను.
ఆయన నిస్పృహగా నవ్వేరు.

          “కాలం మారిపోయిందమ్మా, మనుషుల్లో గౌరవమర్యాదలు పోయాయి. దర్శకత్వం లో అందరూ చెయ్యి పెట్టేవాళ్ళే! అలాంటప్పుడు ఏం డైరెక్ట్ చెయ్యగలం? అందుకే విరమించుకున్నా!”అన్నారు మాతో పాటూ లేచి నిలబడుతూ.

          మేం ఆయనకు నమస్కరించి మిమ్మల్ని కలవడం మా అదృష్టం సర్!” అన్నాం సంతోషంగా.

          ఆయన మాతోపాటూ గేటు దాకా వచ్చి నిలబడ్డారు.

          సర్… అంది మా సౌద ఆయన వైపు తిరిగి.

          “ఇది మా చెల్లెలు, ఇక్కడ జాబ్ చేయాలని.. అంటూ నా క్వాలిఫికేషన్ చెప్పింది.
ఆయన నవ్వి “మరి అసలు సంగతి చెప్పరేం? రేపు ఉదయం 9గంటలకి మౌంట్ రోడ్డు లోని ‘రాఘవ &వీర కన్స్ట్రక్షన్స్ ‘కి వచ్చేయండి. నేనక్కడ వుంటాను “అన్నారు మరేం ఆలోచించకుండా.

          అలా ఎవరన్నా చెబుతారా…చేయగలిగినా చూస్తాం, ఆలోచిస్తాం అంటారు.

          మేం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ ఇంటికొచ్చి మణక్కకి చెప్పాం.

          మణక్క కూడా ఆశ్చర్యపోయింది.

          “ఏంటి, బియన్ రెడ్డి గారేంటి… మీ కింత టైం ఇవ్వడమేంటి?” అంటూ ఆశ్చర్య పోయింది.

          “అసలాయన సినిమాలు తియ్యడం లేదుగానీ లేకపోతేనా… నాకు హీరోయిన్ వేషం ఇచ్చేసేవారే!”అన్నా చిందులు వేసి నవ్వుతూ.

          “అవును, అప్పుడుగానీ మీ అమ్మ వచ్చి వళ్ళంతా వాతలు పెట్టదు “మా అక్క.
అన్నిటి కన్నా ఆశ్చర్యం.. ఆఁ మర్నాడు మేం రాఘవ &వీరాకి వెళ్ళేసరికి రెడ్డిగారు మా కోసం వెయిట్ చేస్తూ పేవమెంట్ మీద అటూ ఇటూ పచార్లు చేస్తూ తిరుగుతున్నారు.

          మేం కారు దిగడం చూడగానే ఆయన మమ్మల్ని చూసి “రండి, రండి మీ కోసమే చూస్తున్నా “అంటూ లిఫ్ట్ లో పై అంతస్తుకి తీసుకెళ్ళారు.

          ఏడెనిమిది అంతస్థుల భవనం అనుకుంటా, గుర్తు లేదు.

          లోపల రాఘవరెడ్డి గారు గంభీరంగా కూర్చుని వున్నారు. నేను నా రెస్యూమ్ ఆయన చేతిలో పెట్టాను.

          ” మనమ్మాయి “అన్నారు బియన్ గంభీరంగా.

          రాఘవరెడ్డి గారు నాకు అప్పోయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి స్టాఫ్ లో ఒకాయన్ని పిలిచి సీటు చూపించమన్నారు.

          బియన్, మా అక్క వెళ్ళిపోయారు.

          ఆఁ రోజంతా ఒక డిటైల్డ్ ఎస్టిమేట్ చేస్తూ కూర్చున్నాను. బియన్ గారికి స్వీట్స్ తీసుకెళ్ళి థాంక్స్ చెప్పాను.

          నాలుగు రోజులు సరదాగా గడిచిందో లేదో. మా అమ్మ సర్కార్ ఎక్ష్ప్రెస్స్ లో ఆటంబాంబులా దిగి గొడవ గొడవ చేసింది.

          ‘మా దగ్గరే కదా ఉంటుంది , ఎందుకలా గొడవ చేస్తున్నావ్?” అని మా సిస్టర్స్ ఎంత నచ్చ చెప్పినా వినలేదు.

          ‘పెళ్ళిళ్ళయ్యే వరకూ వీళ్ళు నా దగ్గర వుండాల్సిందే’ అని హుకుం జారీ చేసి ఎంత బ్రతిమిలాడిన వినకుండా తీసుకెళ్ళి పోయింది .

          అదీ చివరకు మిగిలింది.

          ఏది ఏమయినా మొట్టమొదటి దాదాసాహెబ్ పురస్కారగ్రహీత,, పద్మ భూషణ్ అయిన ఒక గొప్ప దర్శక నిర్మాతని కలిసి మాట్లాడగల్గడం…. నేను చేసుకున్న అదృష్టం కాక మరేమిటి. (ఆయన పేరు T నగర్ లో ఒక వీధికి పెట్టడం తమిళులు ఆయనపట్ల చూపించిన గౌరవం ).    

*****

(సశేషం) 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.