శ్రీకారం (కథ)

-పారుపల్లి అజయ్ కుమార్

అది జిల్లాపరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల..

          ఎనిమిదవ తరగతిగదిలో ‘జంతువులలో ప్రత్యుత్పత్తి’ జీవశాస్త్రం పాఠ్యబోధన జరుగుతున్నది.

          నల్లబల్ల మీద మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ ,స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ డయాగ్రమ్స్ వ్రేలాడదీసి ఉన్నాయి.

          ” ఆవులు దూడలకు జన్మనివ్వటం , మేకలు మేకపిల్లలకు జన్మనివ్వటం మీలో కొద్ది మందయినా చూసే వుంటారు కదా.

          తల్లి బిడ్డకు  జన్మనిస్తుంది. అలా జన్మనివ్వడంలో మగజీవి పాత్ర కూడా ఉంటుంది.

          ఒక పువ్వు నుండి  విత్తనం రావటానికి పరాగరేణువులు, అండాలు ఫలదీకరణం  చెందుతాయని ఇంతకు ముందు తెలుసుకున్నారు కదా.

          అలాగే జంతువుల్లో  కూడా ప్రత్యుత్పత్తి కొరకు శుక్రకణం మరియు అండం యొక్క కలయిక అవసరం.

          మనుషులలో పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ వేరువేరుగా వుంటాయి.”

క్లాసులో నాలుగు వైపులా చూస్తూ పాఠం బోధిస్తున్న మోహన్  దృష్టి మూడో బెంచీ మీదకు ప్రసరించింది.

          శ్రీలత పాఠం వినకుండా ముందున్న డెస్కు మీదకు తలవాల్చి వుంది. ప్రక్కనే వున్న జ్యోతి నెమ్మదిగా ఏదో అడుగుతుంది శ్రీలతను.

          పాఠం చెప్పటం ఆపేసాడు మోహన్.

          పాఠం వినకుండా మాట్లాడుతున్న వారిద్దరినీ చూస్తునే విపరీతమైన కోపంతో

          ” జ్యోతీ , లతా స్టాండ్ అప్ ” అని అరిచాడు గట్టిగా.

          జ్యోతి ఉలికిపాటుతో లేచి నిలుచుంది భయంగా మోహన్ సార్ ను చూస్తూ…

          శ్రీలత డెస్కు మీద నుండి తలఎత్తి చూసింది కానీ లేచే  ప్రయత్నం చేయలేదు.

          “లతా,నీకే చెప్పేది లే ,లేచి నిలబడు” మరింత కోపంగా అరిచాడు మోహన్.

జ్యోతి సార్ ను చూస్తూ…
“సార్ …లతకు …లతకు … ” అంటూ ఏదో చెప్పబోయింది.

          మోహన్ దూకుడుగా బెత్తం పట్టుకొని వారి దగ్గరకొచ్చాడు.

          “పాఠం  చెపుతుంటే వినకుండా కబుర్లు చెప్పుకుంటూ క్లాస్ ను డిస్టర్బ్ చేస్తున్నారా? క్లాస్ అయ్యేదాకా నిలబడి ఉండండి. లతా, చెపుతుంటే అంత నిర్లక్షమా? స్టాండ్ అప్ “
అంటూ బెత్తంతో బల్లమీద కొట్టాడు మోహన్.

          లతకు  తలనొప్పిగా,  చిరాకుగా వుంది. సార్ వైపు ఆందోళనగా చూసింది.భయంతో, బాధతో కళ్ళ వెంట నీళ్ళు తిరుగుతుండగా తల క్రిందికి దించేసింది.

          జ్యోతి మోహన్ ను చూస్తూ…” సార్ లతకు వంట్లో బాగాలేదు ” అంది చిన్నగా.

          “రోజంతా కబుర్లు చెప్పుకోమంటే ఏ రోగాలు ఉండవు. పాఠం వినటానికి మాత్రం ఎక్కడలేని రోగాలు పుట్టుకొస్తాయి. ఇందాకటి నుండి అరుస్తుంటే లేచి నిలబడవేం? లేచి నిలబడు ” బెత్తంతో లత భుజం మీద దెబ్బ వేసాడు.

          లత బెదురుగా చూసింది. అవమానంతో, అసహనంతో లేచి నిలబడబోయి అంత లోనే బెంచీ పై కూలబడి చేతులలో ముఖం దాచుకుని ఏడ్చేసింది ఒక్కసారిగా.

          పొట్ట పట్టుకుని లుంగలు చుట్టుకుని బెంచీ మీద నుండి క్రిందకు పడిపోయింది.

          అదిచూస్తూనే జ్యోతి మోహన్ సార్ ను తప్పించుకుని బయటకు పరుగెత్తుకెళ్ళి   తెలుగు మేడమ్ ను తీసుకొచ్చింది.

          తెలుగు మేడమ్ భవాని, మోహన్ ను చూస్తూ

          ” మోహన్ గారూ , ఎందుకు ? ఏమిటి? అని ప్రశ్నించకుండా బాయ్స్ ను తీసుకొని మీరు బయటికి వెళ్ళండి.” అంది ఆందోళన నిండిన స్వరంతో.

          మోహన్ కు లత పరిస్థితి కొద్దిగా అవగాహన అయింది.

          వెంటనే మగ పిల్లలను తీసుకుని తరగతి గది నుండి బయటకు నడిచాడు.

          లత, మేడమ్ ను చూస్తూనే…

          ” మేడమ్…నాకు…నాకు.. కడుపులో నొప్పి ఎక్కువగా వస్తున్నది. అలసటగా వుంది.
తల పగిలి పోతున్నది. ఇంకా నాలుగు రోజుల టైమ్ వుంది కదా అని ప్యాడ్స్  వేసుకో లేదు. అనుకోకుండా బ్లీడింగ్ మొదలయింది. స్కర్ట్ వెనుక కూడా తడిసింది” అంది ఏడుస్తూ.

          “ఊర్కో లతా, ఏడవకు” అంటూ భవాని మేడం తన బ్యాగ్  లో నుండి ఒక టాబ్ లెట్ తీసి లతకు ఇచ్చి వేసుకోమని నీళ్ళ బాటిల్ అందించింది.

          లత ఏడుస్తూనే మాత్రను వేసుకుంది.

          జ్యోతిని పంపించి స్టాఫ్ రూంలో వున్న కమలా మేడంను పిలిపించింది భవాని.

          లత క్లాస్ మేట్ మేరీ ఇల్లు స్కూలు ప్రక్కనే వుంది. మేరీని ఇంటికి పంపించి ఉతికిన డ్రెస్ ఒకటి తెప్పించింది.

          కమల బ్యాగ్ లో ఎప్పుడూ రెండు మూడు శానిటరీ నాప్కిన్స్ స్పేర్ లో ఉంటాయి.

          ఒకటి లతకు ఇచ్చి, మేరీ తెచ్చిన డ్రెస్ కూడా ఇచ్చి నలుగురు అమ్మాయిలను తోడిచ్చి బాత్ రూముకు పంపించింది.

          బాత్ రూం నుండి వచ్చిన లతను… “లతా ,ఇంటికి వెళతావా? ” అని అడిగింది భవాని మేడమ్.

          “ఇంట్లో కూడా ఈ టైమ్ లో ఎవరూ వుండరు మేడమ్. ” అంది లత సిగ్గుతో ముడుచుకుపోతూ. క్లాసులో ఇలా జరగటం అందరికీ ఈ విషయం తెలియటం ఎలాగో వుంది.

          “కమలా లతను తీసుకెళ్ళి మన స్టాఫ్ రూం లో పడుకోబెట్టు. అటెండరును పంపించి టీ తెప్పించి లతతో తాగించు. నాకిప్పుడు క్లాస్ వుంది.”

          అంటూ లతను, కమలకు అప్పగించింది.

          లతను చూస్తూ… “లతా, మాత్ర వేసుకున్నావుగా. నొప్పి తగ్గిపోతుంది. ఏం భయం లేదు. టీ తాగి కాసేపు స్టాఫ్ రూం లో పడుకో.” అని చెప్పి క్లాసుకు బయలు దేరింది భవాని.

***

అది సెయింట్ మేరీస్ హైస్కూలు.

          ఇంటర్వల్ సమయంలో బాత్ రూంకు వెళ్ళిన పదమూడేళ్ళ సుస్మిత పెద్దగా కేకలు పెట్టింది. 

          ప్రక్క బాత్ రూంలో ఉన్న రోజీ ఆ కేకలు విని సుస్మిత ఉన్నబాత్ రూం తలుపు తట్టింది.

          తలుపు తెరుచుకోలేదు.

          వెళ్ళి ఆయా సీతమ్మను పిలుచుకొచ్చింది.

          సీతమ్మ తలుపును గట్టిగా తోసింది. మూడుసార్లు గట్టిగా తోసాక తలుపు గడి వదులై తలుపు తెరుచుకుంది.

          బాత్ రూంలో సుస్మిత క్రింద పడిపోయివుంది. స్పృహలో లేదు.

          నేల మీద, పాదాల పై రక్తపు మరకలు కనిపించాయి.

          సీతమ్మ , సుస్మితను రెండు చేతులతో లేపి ఇవతలికి తీసుకొచ్చింది.

          ప్రక్కనే వున్న స్టోర్ రూంలో పడుకో బెట్టి ముఖం పై నీళ్ళు చిలకరించి, పాదాల పై వున్న రక్తపు మరకలను తుడిచింది.

          సిస్టర్ స్టెల్లాను పిలుచుకురమ్మని రోజీని పంపించింది. మరొకసారి నీళ్ళు ముఖం పై చల్లి “స్మితా,  స్మితా ” అని బుగ్గలను చేతులతో తడుతూ పిలిచింది.

          స్మిత నెమ్మదిగా కళ్ళు తెరచి సీతమ్మను చూస్తూ…

          ” ఆయా నేను చచ్చిపోతున్నాను. రక్తం అంతా కారిపోతున్నది. రక్తంపోతే నేను బతకనుగా. ” అంది ఏడుస్తూ.

          సీతమ్మ బుజ్జగిస్తూ…

          “నీకేం కాలేదు స్మితా! భయపడకు.” అంది.

          ” లేదు.నేను చచ్చిపోతున్నాను. నాకు భయం వేస్తున్నది. రక్తం మొత్తం కారిపో యింది. నేను చూసాను.మొన్న ఒక సినిమాలో కూడా చూపించారు. రక్తం కారిపోయి  మనిషి చనిపోయినట్లు. నేను చనిపోతున్నాను. “

          బిగ్గరగా ఏడుస్తూ సీతమ్మ చేతులలో వాలిపోయింది స్మిత.

          స్టెల్లా సిస్టర్ ఇంకో ఇద్దరిని వెంట పెట్టుకుని వచ్చింది.

          సీతమ్మ జరిగింది చెప్పింది.

          ” ఇదే మొదటిసారి అనుకుంటా అమ్మా. బాగా బెదిరిపోయింది. ఈ వయసులో ముందుగానే తల్లి చూచాయగా ఈ  విషయాల గురించి చెప్పివుంటే బాగుండేది.”అంది సీతమ్మ.

          స్టెల్లా సిస్టర్, స్మిత చేయి పట్టుకుని…

          “స్మితా… స్మితా…” అని పిలిచింది.

          స్మిత కళ్ళు తెరచి సిస్టర్ ను చూస్తునే…

          “సిస్టర్ … నాకు భయంగా వుంది సిస్టర్… నేను చచ్చిపోతానేమోననిపిస్తున్నది”  అంది ఏడుస్తూ.

          స్టెల్లా సిస్టర్ , స్మితను చూస్తూ ” స్మితా యు ఆర్ ఎ బ్రేవ్ గర్ల్. ధైర్యం తెచ్చుకో.  నీకేం కాలేదు. మేమంతా వున్నాం నీ ప్రక్కనే. ఏడవవద్దు. ఇది యుక్త వయసు వచ్చిన ప్రతీ ఆడపిల్లల్లో జరిగే సహజ ప్రక్రియ. మీ మమ్మీ, డాడీకి కబురు చేస్తాం. వాళ్ళు వస్తారు.  అప్పటిదాకా మన రెస్ట్ రూంలో పడుకో. డాక్టరు వచ్చి చూస్తుంది. అప్పటిదాకా సీతమ్మ నీకు తోడుగా ఉంటుంది.”

          అని స్మితకు  ధైర్యం చెప్పి సీతమ్మ సాయంతో స్మితను రెస్టు రూంకు తరలించింది సిస్టర్ స్టెల్లా.

          సిస్టర్ స్టెల్లా నుండి ఫోన్ రాగానే మోహన్ స్కూలుకి ఒకపూట సెలవుపెట్టి భార్యను తీసుకుని సెయింట్ మెరీస్ స్కూలుకు వచ్చాడు.

          అప్పటికే డాక్టరు హిమబిందు  స్మితను పరీక్షించి ధైర్యం చెప్పి రుతుస్రావం అనేది సహజమైన జీవ ప్రక్రియ అని వివరించి చెప్పింది.

          మోహన్ దంపతులు రాగానే వాళ్ళను కంగారు పడొద్దని చెప్పింది.

          “మనదేశంలో పీరియడ్స్ లేదా ఋతుస్రావం ఇప్పటికీ బహిరంగంగా ఎక్కువ మంది మాట్లాడలేని అంశంగా ఉండిపోతున్నది. యుక్తవయస్సులో ఉన్న బాలికలలో దాదాపు 80% మంది మొదటిసారి పీరియడ్స్ వచ్చినప్పుడు ఆశ్చర్యానికి గురయ్యారని,  కొంత మంది భయభ్రాంతులకు గురయ్యారని, కొద్ది మంది తాము చనిపోతున్నామనే మానసిక భ్రాంతికి గురిఅయ్యారు అని పరిశోధనలు చెపుతున్నాయి. ఒక అమ్మాయికి మొదటి ఋతుస్రావం వచ్చినప్పుడు భయం, అవమానం, ఇబ్బంది మరియు అపరాధ భావనలు లేకుండా ఉండటానికి తల్లి కూతురుకి ఈ విషయంలో ముందుగానే కొంత అవగాహన ఏర్పరచాలి.

          మీరిద్దరూ వెల్ ఎడ్యుకేటెడ్. ఎందుకు మీ అమ్మాయికి మీరీ విషయాన్ని ముందు గానే చెప్పలేదు?

          చూచాయగానన్నా చెప్పి దీనికి సంసిధ్ధం చేసివుంటే ఈ రోజు మీ అమ్మాయి ఇంత భయపడిపోయేది కాదు.

          బాలికలకు చిన్న వయసులోనే చెప్తే తొందరగా అర్థం చేసుకుంటారు.

          ఇప్పటికైనా ఇంటికి వెళ్ళాక తనకు అంతా వివరించి చెప్పండి. నేనూ చెప్పాను.
కానీ తల్లి చెప్పితేనే తనకు నమ్మకం వస్తుంది.

          తను ఎన్నో ప్రశ్నలు వేస్తుంది. నెలసరి ఎందుకొస్తుందని అడుగుతుంది?  అమ్మాయిలకు మాత్రమే ఎందుకొస్తుంది? ఆ సమయంలో నొప్పి ఎందుకొస్తుంది? వంటి చిన్నిచిన్న ప్రశ్నలు వేస్తుంటారు.

          ఈ ప్రశ్నలను దాటవేయకూడదు. వారికి వివరించేందుకు ప్రయత్నించాలి.

          మిష్టర్ మోహన్ మీరు బైయాలజీ టీచరు. క్లాసులో పిల్లలకు చెప్పినట్లుగానే మీ అమ్మాయికి కూడా మీరు చెప్ప గలగాలి”

          అంటూ డాక్టరు హిమబిందు మోహన్ దంపతులకు కౌన్సిలింగ్ చేసింది.

          మోహన్ సీతమ్మకు కృతజ్ఞతలు తెలియచేసాడు.

          ” మీ స్కూల్లోనే మా అమ్మాయి చదువుతుంది సారూ. మీరు పాఠాలు బాగ చెపుతారని మా అమ్మాయి చెప్పింది. నేను మీకు తెలియకపోయినా మీరు నాకు తెలుసు సారూ. ” అంది సీతమ్మ.

          ” ఏ క్లాసు? ” అడిగాడు మోహన్.

          “ఎనిమిదో తరగతి.”

          “పేరు?”

          ” శ్రీ లత. “

          మోహన్ ఒక్కక్షణం సీతమ్మ వంక చూసి చూపు మరల్చుకున్నాడు.

          ప్రొద్దున క్లాసులో జరిగిన సంఘటన గుర్తొచ్చి తప్పు చేసిన వాడిలా తల దించు కున్నాడు.

          ” సార్, మా అమ్మాయి బాగా చదువుతుందా?” అడిగింది.

          మోహన్ తడబడుతూ  “ఆ…  ఆ… బాగానే చదువుతుంది.”అన్నాడు.

          సిస్టర్ స్టెల్లా పర్మిషన్ తీసుకుని సుస్మితను ఇంటికి తీసుకొచ్చారు మోహన్ దంపతు లు.

          ఆ రోజు రాత్రంతా మోహన్ అంతర్ముఖుడై ఆలోచిస్తూ ఉండిపోయాడు.

          తాను జీవశాస్త్ర ఉపాధ్యాయుడై ఉండి కూడా క్లాసులో శ్రీలత ఫీలింగ్స్ ను కొంచెం కూడా గమనించలేకపోయాడు.

          పీరియడ్స్ అప్పుడు అమ్మాయిలు, మహిళల శరీరాల్లో చాలా మార్పులు వస్తాయి. ఈ మార్పులు చాలా రకాలుగా ఉంటాయని వైద్య శాస్త్రం చెబుతోంది.

          మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కొంత మందిలో చిరాకుతో పాటు నొప్పి కూడా ఎక్కువగా ఉంటుంది. చిన్న విషయానికే ఏడుస్తుంటారు. ఒత్తిడి, ఆందోళనతో పాటు నిద్ర లేమి, తలనొప్పి, అలసటగా ఉంటుంది.

          అన్నీ తెలిసి కూడా అనాగరికంగా ప్రవర్తించాను క్లాసులో అని మధనపడ్డాడు.

          లాప్ టాప్ లో గూగుల్ లోకి వెళ్ళి పీరియడ్స్ గురించి మరింత సమాచారం సేకరిం చాడు.

          ఆలోచనలతో నిద్రకు దూరమై గడిపాడు రాత్రంతా.

***

          ఉదయం స్కూలుకు వెళ్ళగానే హెడ్ మాస్టర్ దగ్గిరకు వెళ్ళి నిన్న క్లాసులో జరిగిన సంగతి చెప్పాడు.

          ” సార్, అది అలా జరిగినందుకు చాలా బాధ పడ్డాను రాత్రంతా. మీరు అనుమతి ఇస్తే అమ్మాయిలతో ఒక సమావేశం ఏర్పాటు చేద్దాం. ఇక ముందు ఇటువంటివి  పునరావృతం కాకుండా, ఒక సైన్స్ టీచర్ గా వారికి కొన్ని విషయాలు తెలియ చేయాలని వుంది.

          అలాగే శ్రీలతకు సారీ చెపుతాను అందరి ముందు. మీరు పర్మిషన్ ఇవ్వాలి” అన్నాడు కొద్దిగా బాధపడుతూ.

          ” మోహన్ గారూ, నేనే మిమ్ములను పిలిచి మాట్లాడుదాము అనుకున్నాను ఈ విషయం గురించి. యిప్పుడే గర్ల్స్ రిప్రజెంటేటివ్ ఉష, మరి కొందరు వచ్చి నిన్న క్లాసులో జరిగిన దానికి మీ సంజాయిషీ అడుగుతున్నారు.

          మీరు స్పందించకపోతే  ఈ విషయం పై అధికారులకు చెపుతాం అని అంటున్నా రు. మీరు రియలైజ్ అయ్యారు కాబట్టి ఇక సమస్య లేదు. ఇవి సున్నితమైన విషయాలు.
మనలో మనమే పరిష్కరించుకోవాలి. యిప్పుడే నోటీస్ పంపిస్తాను.

          11 గంటలకు ఆడిటోరియంలో సమావేశం ఉంటుందని. చాల మంచి నిర్ణయం తీసుకున్నారు.” అని హెడ్ మాస్టర్ మోహన్ ను ప్రశంసించాడు.

          సమావేశంలో మోహన్ మాట్లాడుతూ…

          ” రుతుస్రావం లేదా పీరియడ్స్  .. ఇప్పటికీ చాలా దేశాల్లో మన దేశంతో సహా  ప్రజలు ముఖ్యంగా స్త్రీలు దీన్ని గురించి బాహాటంగా మాట్లాడలేక పోతున్నారు.

          దీని గురించి ప్రజల్లో అనేక అపోహలు, మూఢనమ్మకాలు నాటుకుపోయి ఉన్నాయి.

          యుక్త వయస్సు వచ్చిన దగ్గర నుండి బాలికల్లో, మహిళల్లో ఇది సాధారణ జీవ ప్రక్రియ. రుతుస్రావం ఒక వ్యాధి కాదు. మహిళలకు నెలకు ఒకసారి పీరియడ్స్ వస్తాయి. మహిళల్లో రుతుక్రమం సగటున 28 రోజులుగా ఉంటుంది.

          21వ రోజు నుంచి 35 రోజుల మధ్యలో మహిళలకు ఎప్పుడైనా పీరియడ్స్ రావొచ్చు.

          రుతుస్రావం సమయంలో గర్భాశయం లోపలి నుంచి రక్తం బయటకు వస్తుంది.

          రుతుక్రమం మొదలవ్వడం అంటే స్త్రీ శరీరం గర్భం దాల్చే ప్రక్రియకు అనువుగా మారుతున్నట్లు అర్థం.

          మహిళల శరీరంలో వచ్చే హర్మోన్ల మార్పులను కూడా ఇది సూచిస్తుంది.

          ఇది ఆడపిల్లల పునరుత్పత్తి వ్యవస్థ, లైంగిక ఆరోగ్యానికి సంబంధించిన విషయం. సంవత్సరాల తరబడి ప్రతీ నెలా అది వారి జీవితంలో భాగం అవుతుంది. బయాలజీ పుస్తకాల్లో రుతుక్రమం గురించి ఉంటుంది. అయితే చాలా స్కూళ్ళలో దీని గురించి సరిగ్గా బోధించక పోవడంతో పాటు విద్యార్థులు కూడా సరిగా అవగాహన చేసుకోవడం లేదు.

          ఉపాధ్యాయులు ఈ అంశాన్ని సరిగ్గా బోధించినా లేదా విద్యార్థులు సరిగ్గా చదివినా, స్త్రీ జీవితంలోని ఈ ముఖ్యమైన చక్రం గురించి వారికి ఖచ్చితంగా తెలుస్తుంది.

          నేను కూడా అన్ని పాఠాలలాగానే దీన్ని కూడా బోధించాను తప్ప విడమరచి అన్ని సంగతులు అవగాహనచేయలేక పోయాను. ఇక నుండి నేను కూడా నా బోధనా పద్ధతు లను మార్చుకుంటాను.

          అవిద్య, అవగాహన లేమి ఎంతపని చేస్తుందో ఈ మధ్య ఒక పేపర్ లో చదివాను.

          మహారాష్ట్రలోని ఉల్హాస్‌నగర్‌లో ఒక బాలికకు తొలిసారిగా రుతుస్రావం (పీరియడ్స్) మొదలైంది. ఆమె వయస్సు 12 ఏళ్ళు. దుస్తులకు రక్తపు మరకలు అంటుకున్నాయి. వాటిని ఆమె సోదరుడు చూశాడు.

          తన 12 ఏళ్ళ చెల్లికి రుతుస్రావం అవుతుందని ఆ అన్న అనుకోలేదు.

          రక్తపు మరకలను లైంగిక సంబంధమని భావించి ఆమెను చంపేశాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన.

          సరియైన అవగాహన లేకపోవడం మరియు లైంగిక  విద్య సరిగా చెప్పలేకపోవడం   వల్ల, ఇది ఇప్పటికీ మన సమాజంలో నిషిద్ధంగానే చలామణి అవుతున్నది. దీనిని మనం అందరం కలసి విచ్ఛిన్నం చేద్దాం. ఈ విషయాల గురించి దాపరికాలు వద్దు. యింటిలో తలనొప్పి వస్తే మాత్ర  తెచ్చిపెట్టమని అన్ననో, తమ్ముడినో అడుగుతాం. మరి పాడ్స్ తెచ్చిపెట్టమని ఎక్కువ శాతం ఇళ్ళల్లో మగవారికి చెప్పటం జరగటం లేదు. దీని నుండి మనందరం బయటకి రావాలి. నాకు తలనొప్పి పుడుతున్నది అని చెప్పినట్లుగానే నాకు పీరియడ్స్ టైమ్ అని సిగ్గుపడకుండా చెప్పగలగాలి.

          మహిళలకు రుతుస్రావం ఉంటుంది. ఈ సమయంలో పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అవగాహన శానిటరీ ప్యాడ్‌ల వరకే పరిమితం కాకుండా దాన్ని గురించి సవివరంగా ప్రతీ ఆడపిల్ల సరి అయిన అవగాహన ఏర్పరుచుకోవాలి.

          ఏదైనా డౌట్ వస్తే ఎవరినయినా అడిగితే ఏమనుకుంటారో నన్న సంకోచాలను వదిలి వేయాలి. ఇది తెలుసుకోవటం తప్పు కాదు.

          స్త్రీ శరీరం యొక్క సహజ జీవసంబంధమైన విధులను చుట్టుముట్టే ఋతుస్రావం చర్చను ప్రోత్సహించాల్సిన సమయం ఆసన్నమైంది.

          పీరియడ్స్ గురించి అందరు తమ ఆలోచనలను విస్తృతం చేసుకోవాలి. కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు, మొత్తం సమాజం కూడా ఈ దిశగా అడుగులు వేయాలి.
ప్రపంచ వ్యాప్తంగా దీని మీద చర్చలు జరుగుతున్నాయి.

          నెలసరి సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి చాలా మందికి అవగాహన ఉండదు. కొందరికి ప్యాడ్స్ కూడా అందుబాటులో ఉండవు. ఇది కాకుండా నెలసరి సమయంలో ఆడవారిని దూరంగా ఉంచడం, అంటరాని వారిలా చూడటం, కొన్ని మూఢ నమ్మకాలను పాటించడం కూడా చాలా చోట్ల ఇప్పటికీ గమనించవచ్చు. ఆడవారు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి అవగాహన పెంచడానికి ప్రతీ ఏడాది మే 28న ప్రపంచ ఋతుక్రమ పరిశుభ్రత దినోత్సవంగా పాటిస్తున్నారు.

          పీరియడ్స్ గురించి జనంలో పాతుకుపోయిన మూఢ నమ్మకాలను దూరం చేసే ఆలోచనతో ఈ సంవత్సరం ఫిబ్రవరి 5న ఢిల్లీ లో  ‘పీరియడ్ ఫెస్ట్’ జరిగింది.

          ‘హమ్ బోలేంగే, ముహ్ ఖోలేంగేతాభి జమానా బద్లేగా!’

          బహిష్టు పై ఈ నినాదంతో, వందలాది మంది పాఠశాల విద్యార్థినులు మంగళవారం కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్ చుట్టూ కవాతు నిర్వహించారు.

          50 ప్రభుత్వ మరియు నవయుగ పాఠశాలల్లోని 8, 9 మరియు 11 తరగతులకు చెందిన బాలికలు, ఎర్రటి చీరలు మరియు కార్డ్‌బోర్డ్ కటౌట్‌లను ధరించి, రుతుక్రమ ఆరోగ్యం పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన పీరియడ్ ఫెస్ట్‌ జరిగింది.

          అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ‘ప్యాడ్ యాత్ర’ చేశారు.

          “ఈ రోజు పీరియడ్స్ గురించి బహిరంగంగా మాట్లాడుతున్నందుకు మేము నిజంగా సంతోషంగా మరియు గర్వంగా భావిస్తున్నాము. మా సందేశంతో వీధుల్లో నడవడానికి మేము నిజంగా సిగ్గుపడము. రుతుక్రమం గురించి అందరికీ తెలియచేయడం గర్వించ దగ్గ విషయం’’

          అని అందులో పాల్గొన్న విద్యార్థినులు అన్నారు.

          వివిధ కళారూపాలు, ప్రదర్శనల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇలా ఇప్పుడిప్పుడే చైతన్యం వస్తున్నది ఈ విషయంలో.

          మనం కూడా మనవంతు కృషి చేయాలి. విద్యార్థినులుగా మీరే దీనికి శ్రీకారం చుట్టాలి. మన స్కూలు నుండే ఇది ఒక ఉద్యమంలా ముందుకు సాగాలి. మీలో నాయకత్వ లక్షణాలు వున్నవారు ముందుకు వస్తే ఒక కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేద్దాం.

          ఇక నిన్నటి సంఘటన పూర్తిగా నాదే తప్పు. అన్నీ తెలిసి వుండి కూడా ప్రాక్టికల్ గా వచ్చేసరికి తన ఫీలింగ్స్ అర్థం చేసుకోలేక పోయాను. శ్రీలతకు మీ అందరి ముందు క్షమాపణ చెపుతున్నాను.”

          అంటూ రెండు చేతులు జోడించాడు.

          శ్రీలత వెంటనే లేచి…

          ” సార్,మీరన్నట్టు  నా పొరపాటు కూడా వుంది. ముందుగానే నాకీ సమస్య వచ్చింది అని మీతో చెప్పలేకపోయాను. అది సిగ్గో,  భయమో, అవమానమో, సంకోచమో ఆ క్షణంలో నోరు విప్పలేక పోయాను. ఈ సమస్య ఒక నెలతో పోయేదికాదు. నలభయి సంవత్సరాలు మాతో పాటే ఉంటుంది. ఇక నుండి దీని గురించి మాట్లాడటానికి సంకోచించను.” అంది ధృఢంగా.

          అందరూ చప్పట్లు కొట్టారు.

          హెడ్ మాష్టర్ మాట్లాడుతూ…

          “మోహన్ గారు చెప్పినట్లు అందరూ సిగ్గు, సంకోచాలను విడిచిపెట్టి ఈ విషయం పై మీ ఇంటి దగ్గర, మీకు తెలిసిన చుట్టాలు, బంధువులు , స్నేహితుల దగ్గర మాట్లాడటానికి నేడే శ్రీకారం చుట్టండి.

          తెలియనివారికి విషయాలు తెలియ చెప్పండి. మార్పు మనతోనే  ప్రారంభిద్దాం.
అనేక స్కూళ్ళ కంటే మన స్కూలు చాలా నయం. బాలికలకు మూత్రశాలలు లేని స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి. మనకు గర్ల్స్ టాయ్ లెట్స్ వున్నాయి.

          అత్యవసర పరిస్థితులలో ఉపయోగించుకోవటానికి  స్టాఫ్ రూంలాగానే  గర్ల్స్ కు కూడా విడిగా ఒక రూం ఉండాలి. ఈ విషయం పై అధికారులకు ఒక లెటర్ రాస్తాను.

          ప్రస్తుతానికి లేడీస్ స్టాఫ్ రూం ప్రక్కనున్న స్టోర్ రూంలో ఉన్న చెత్తాచెదారాన్ని  తొలగించి, వారం రోజుల్లో దాన్ని కొద్దిగా బాగుచేసి గర్ల్స్ రూంగా మారుద్దాం. ప్రభుత్వం శానిటరీ నాప్కిన్స్ స్కూల్స్ కు సరఫరా చేస్తాను అంటున్నది. ప్రభుత్వం పంపినా పంపక పోయినా కొన్ని శానిటరీ నాప్కిన్స్ గర్ల్స్ రూంలో స్టాక్ వుండేలా నేను స్వయంగా ఏర్పాటు చేస్తాను.”

          అనగానే అడిటోరియం మొత్తం చప్పట్లతో మారుమ్రోగింది.

*****

Please follow and like us:

4 thoughts on “శ్రీకారం (కథ)”

  1. కధ ప్రస్తుత సమాజానికి చాలా అవసరం

Leave a Reply

Your email address will not be published.