ప్రాయశ్చిత్తము (హిందీ అనువాద కథ)

-దేవీ నాగరాణి 

తెలుగు అనువాదం : గాయత్రి లక్ష్మి 

          ఆమె చదువుకోలేదు. చదువు ఎలా ఉంటుంది? చదువుకుంటే ఎలా ఉంటుంది?అనే విషయం ఆ కోమలమైన మనసులో ఎవరూ నాటలేదు.

          ఆమెకున్న పరిస్థితులు కూడా ఆమెను చదువుకోనివ్వలేదు. ఒక చిన్న పల్లెలో అమాయకపు ఆడపిల్ల పొలం పనులు చేస్తూ పెద్దదయ్యింది. డబ్బున్న వాళ్ళు ఎలా ఉంటారో, సుఖం అంటే ఏమిటో ఇవేమీ తెలియదు ఆమెకి. డబ్బు విలువ తెలియడానికి ఆమె చేతికి ఎవరైనా డబ్బులిస్తే కదా! రోజంతా పొలంపని చేయడం, నీళ్ళు తోడి గోలాలు నింపడం పశువులకు మేత పెట్టడం, పాలు పితకడం ఇవే పనులు ఆమెకి.

          ఆమె ఎవరి దగ్గర పని చేస్తోందో… అతను ఆమెకి ఏమి అవుతాడో కూడా ఆమెకి తెలియదు. పల్లెప్రజలు.. “ఆమె చిన్నప్పుడు ఉప్పెన వచ్చి ఆమె తల్లీతండ్రీ కొట్టుకు పోయారనీ, ఈమెని ఈ వ్యక్తి కాపాడి తీసుకువచ్చాడని చెప్పుకుంటూ ఉంటే వినడమే.”

          అతను ఆమె తండ్రి వయసువాడు. కానీ, ఆమె ఎదిగే కొద్దీ అతని చూపులు ఆమె దుస్తులలోంచి కూడా గుచ్చుకున్నట్లు అనిపించేది ఆమెకు. ఆమె వయస్కురాలు అవ్వగానే అతను ఆమెని గుడికి తీసుకుని వెళ్ళి ఆమె మెడలో పసుపుతాడు కట్టేసాడు. అదే పసుపుతాడు.. ఆమెకి పలుపుతాడు అయ్యింది. అప్పుడు పెట్టాడు ఆమెకి లక్ష్మి అని పేరు. గుళ్ళో పంతులుగారితో చెపుతుంటే విన్నదామె. అంత వరకూ ఆమె పేరు “ఏమే, ఒసేయ్ “మాత్రమే. పెళ్ళి  అయ్యింది తమకని ఊర్లో అందరికీ చెప్పాడు. విందు భోజనం కాదుకదా పప్పన్నం కూడా ఎవరికీ పెట్టలేదు.

          పెళ్ళి అయినరోజు నుంచీ ఆమె శరీరం మీద కూడా అతనికి అధికారం లభించింది. భార్య అనే హోదా కల్పించినందుకు భర్తచేసే అత్యాచారాన్ని కూడా మౌనంగా భరించ డం నేర్చుకుంది ఆమె. భరించలేక బయటకి వెళితే పులులూ, తోడేళ్ళూ ఉంటాయని లోకుల మాటల్ని బట్టి అర్ధమయ్యింది ఆమెకు. సర్దుకుపోవడం అలవాటు అయిన ఆమె ఈ విషయంలో కూడా సర్దుకుపోవడం నేర్చుకుంది. శరీరం హూనం అయినప్పుడు మాత్రం కన్నీళ్ళు సర్దుకునేవి కాదు…బయటకి వచ్చేసేవి. ఈ బాధలు భరిస్తూనే ఆమె మాల, మోహన్లకి తల్లి అయ్యింది. మాలపుట్టిన మూడేళ్ళకి మోహన్ పుట్టాడు.

          పిల్లలతల్లి అయ్యేసరికి లక్ష్మికి మంచీ, చెడ్డా తెలిసింది. బయటి ప్రపంచంలో ముత్తయిదువుగా, పిల్లల తల్లిగా గౌరవం దొరికింది. పిల్లల ఎదురుగా భర్త తనని గొడ్డుని బాదినట్టు బాదుతుంటే ఈ గౌరవం ఇంట్లో ఉండదా !లేక గౌరవం అన్న పదానికి భర్తకి అర్ధం తెలీదా! ఆమెకి అర్ధం అయ్యేది కాదు. రాత్రి తాగి తూలుతూ ఇంటికి వచ్చిన భర్త చీకట్లో కొట్టిన దెబ్బల గుర్తులు పగటి వెలుగులో కనిపించి ఆమెని ఇంకా భయపెట్టేవి.

          కొన్నిసంవత్సరాలు అలాగే గడిచిపోయాయి. మాలకి 10 ఏళ్ళు నిండాయి. ఆమె తన తండ్రిని చూస్తే భయపడి పోయేది … కానీ… తల్లిని అమితంగా ప్రేమించేది. ఆమె రోజూ తమ్ముడితో కలిసి బడికి వెళ్ళేది. బడిలో జరిగిన విషయాలన్నీ అమ్మకు చెపుతూ ఉండేది.

          ఒకరోజు అమ్మకి కూర తరిగిఇస్తూ తల్లితో ఇలా చెప్పింది”అమ్మా!అత్యాచారం చేయడం మాత్రమే నేరం కాదు దాన్ని సహించడం కూడా నేరమే” అని మా టీచర్చెప్పింది. ఈ మాటలు పుస్తకాల వరకేనా!”

          ఈ మాటే ఆమె తన తల్లితో పదేపదే అంటుండేది. “నువ్వు ఎందుకు అన్నీ భరిస్తున్నావు? నీ బాధని నాన్నకి తెలిసేలా చెప్పు”అనేది.

          తల్లి మౌనమే ఆమెకి సమాధానం అయ్యేది.

          “అమ్మా! ఏదో ఒకటి చెప్పు. ఎంత కాలం ఇలా భరిస్తావు?అని మాల మళ్ళీమళ్ళీ అడిగేది. లక్ష్మి ఆమెకి ఏమి చెప్పగలదు?దౌర్జన్యం చేయడం తప్పే కానీ తిరిగి తాను ఏమి చేయగలదు?ఇప్పుడు పిల్లలు కూడా ఎదుగుతున్నారు. ఈ ఇంట్లో ఇలా సర్దుకుపోతూ బతకాలనే తనకి రాసిపెట్టి ఉందేమో!ఇంకో దారేదీ కనబడడం లేదే..అనుకుంటూ ఉండేది లోలోపల.

          మాల,మోహన్ తండ్రి ప్రేమకి పెద్దగా నోచుకోలేదు. ఏదో పుట్టారు కాబట్టి కూడూ, గుడ్డా ఇవ్వాలి అన్నట్లు చూసేవాడు తండ్రి. తల్లి ఎప్పుడూ ఏదో పనిచేస్తూనే ఉండేది. వేళకి తిండిపెట్టేది. నిద్రపుచ్చేటప్పుడు తల్లి స్పర్శ వారికి హాయినిచ్చేది.. అంతే. ఈలోపు తండ్రి రాక్షసుడిలా తాగివచ్చి అమ్మని తన్నడం…వాళ్ళకి తెలిసినా గట్టిగా కళ్ళు మూసుకుని పడుకుండి పోయేవారు. ఎదురు తిరిగే వయసు కాదు వారిది. ఎప్పుడైనా తండ్రి పెందరాడే ఇంటికివస్తే పిల్లలు తండ్రి ఎదురుపడకుండా దాక్కునేవారు. తమ తల్లి కూడా తండ్రిని చూస్తే భయంతో గభాలున లేచి నించునేది.

          “అలా మొద్దులా నిలబడకపోతే తినడానికి ఏమైనా తీసుకురా” అని ఆజ్ఞాపించి బట్టలు మార్చుకుని లుంగీ, బనీను వేసుకుని వచ్చేవాడు. ఆమె తెచ్చినవి తిని పడుకునే వాడు. మరలా వంట అయ్యాక తాను ఎప్పుడు లేస్తే అప్పుడు అతనికి పెట్టి తాను తిని పడుక్కునేది లక్ష్మి.

          ఒక్కోసారి ఇంటికి వస్తూనే పోయిపోయి ఈ దరిద్రాన్ని తగిలించుకున్నాను నేను. దీనితో పాటు ఈ గుంట వెధవలు కూడా తయారయ్యారు. సంపాదించేది ఒక్కడు. తేరగా తినేది ముగ్గురు. నువ్వు ఇదివరకట్లా పొలంలో పని చేయడానికి రావచ్చు కదా! పోతులా తిని కూర్చోకపోతే. పైకెళ్లి సంపాదిస్తే తెలుస్తుంది డబ్బు విలువ అనేవాడు. ఆ మాటలు వింటే తల్లీ, పిల్లలకీ చాలా బాధగా ఉండేది.

          లక్ష్మికి ఇలాంటి విషపు మాటలు వినడం అలవాటయి పోయింది చిన్నప్పటి నుంచీ. పెళ్లి అయ్యాక ఈ మాటలు ఎక్కువయ్యాయి అంతే. కొత్త పెళ్ళికూతురని 16 రోజుల పండుగ వరకూ కూడా కూర్చోపెట్టలేదు తనని.పెళ్లి దారి పెళ్ళిదే పనిదారి పనిదే. ఎప్పుడూ సరిగా తయారవ్వడం కూడా ఎరగదుతను. వంటిల్లు, గొడ్లపాక తప్ప వేరే ప్రపంచంలేదు తనకి. ఇదిగో ఇప్పుడు ఈ పిల్లలు…అనుకునేది.

          ఒకరోజు అతను తాగి వచ్చి లక్ష్మిని కొట్టిన దెబ్బలకి లక్ష్మికి తెల్లారేసరికి జ్వరం వచ్చేసింది. మంచం మీద నుంచి బలవంతంగా లేద్దామన్నా శరీరం సహకరించ లేదు.

          తల్లి మూలగడం చూసి మాల తట్టుకో లేకపోయింది. తల్లి దగ్గరకి వచ్చి ఇలా అంది” ఇలాంటి తండ్రి బతికున్నా, చచ్చినా ఒకటే” అని. తల్లిని బలవంతంగా లేపి పాలు తాగించి పడుకో బెట్టింది. ఏదో మందు మందులషాపులో తెచ్చి వేసినా జ్వరం తగ్గలేదు. తండ్రి ఏ కళనున్నాడో ఆస్పత్రికి పోయి మందులు తెచ్చి కూతురికి ఇచ్చి ఇలా అన్నాడు “ఈ మాత్రలు వేసి …ఈ ఆయింట్మెంట్ దెబ్బలకి రాయి”అని.

          మాల కోపం పట్టలేక పోయింది.”ఎందుకు? అమ్మలేస్తే మళ్ళీ కొడదామనా!నీ చేతులకి దురద పుడుతోందా?        మళ్ళీలేస్తే మళ్ళీ కొట్టేకన్నా అమ్మని ఒక్కసారి పీకపిసికి చంపెయ్యి. ఆ తరువాత తమ్ముడినీ, నన్నూ చంపెయ్యి. నీకూ, మాకూ కూడా దరిద్రం వదిలి పోతుంది. నీ కంటే కసాయివాడు నయం. చంపే వరకూ గొర్రెలని ప్రేమగా సాకుతాడు. మేము పుట్టేక అమ్మ నవ్వడం, నువ్వు మమ్మల్ని చేరదీయడం చూడలేదు. నీ లాంటి రాక్షసుడికి భార్య, పిల్లలూ అనే ప్రేమ ఉండదు” అంటూ ఏడవడం మొదలెట్టింది. మాల ఏడుపు చూసి మోహన్ కూడా ఏడుపు మొదలెట్టాడు.

          కూతురు ఛీత్కరించుకునే సరికి మనసుకి గట్టిగా తగిలింది మాల తండ్రికి. కసాయివాడు అనే మాట జీర్ణించుకో లేకపోయాడు అతను. ఈ రోజు తన బిడ్డ తనని అసహ్యించు కుంటోంది. రేపు తిరగబడుతుంది. లక్ష్మి ఎప్పుడూ ఎదిరించి మాట్లాడలేదు. ఇది తన రక్తమే కదా. పిల్లలు తన పిల్లలే కదా. మరి తను ఏమిటి ఇలా ప్రవర్తించాడు. తిండి పడేస్తున్నావు కానీ కసాయివాడు గొర్రెలని నీ కంటే ప్రేమగా చూసుకుంటాడు…అని కూతురు అంటే తన చెవిలో తుప్పు వదిలి పోయింది. శిల లాంటి తను ఛిద్రమైపోయా డు. ఛీ!నాదీ ఒక జన్మేనా…అనిపించిందో ఏమో వంటింట్లోకి వెళ్లి అన్నం వండి చారు కాచాడు. అన్నం చారేసి కలిపి కంచంలో పెట్టి కూతురికి ఇచ్చాడు. ఇది మీ అమ్మకి తినిపించు అని కూతురితో చెప్పాడు. చురుక్కుమని తల ఎత్తి చూసింది మాల.” నువ్వే తినిపించుకో” అంది.

          అతను ఏమీ మాట్లాడకుండా కంచం పట్టుకుని భార్య దగ్గరికి వెళ్ళి కొంచెం ఎంగిలిపడు లక్ష్మీ అని ఆమెని లేపాడు. ఆమె లేవలేకపోతే కంచం బల్లమీద పెట్టి నెమ్మదిగా తానే ఆసరా ఇచ్చి లేపాడు.

          “నువ్వు అన్నం తిని మాత్రలు వేసుకో లక్ష్మీ. నీకేమైనా అయితే నేనూ..పిల్లలూ ఏమయిపోతాము.” అతనిలో పశ్చాత్తాపం కనబడుతోంది. బహుశా తాను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తము చేసుకుందాము అనుకుంటున్నాడేమో!అతని మాటలకు లక్ష్మి కన్నీరు కార్చింది.

          లక్ష్మికళ్ళు తుడుస్తూ ఇలా అన్నాడు అతను. నేను పెట్టిన బాధలు నువ్వు నోరెత్తకుండా భరించావు. నా కూతురు నన్ను కసాయివాడివి అంది..మిమ్మల్ని ఒక్కసారి చంపెయ్యమంది. అది చెప్పే వరకూ నేనెంత చెడ్డవాడినో నాకే తెలియ లేదు. నిన్ను చాలా బాధపెట్టాను. నన్ను క్షమించు లక్ష్మీ!” అతని పాపం కన్నీటి రూపంలో కరిగిపో సాగింది.

          ఇది చూసిన మాల నెమ్మదిగా లేచి తల్లి దగ్గరకి వచ్చి చెప్పింది. అమ్మా!అన్నం తిని. నాన్న మారాడు. నీ కోసం స్వయంగా అన్నం వండి తెచ్చాడు. ఇంకెప్పుడూ నాన్న నిన్ను బాధపెట్టడు. లే అమ్మా!”అంది.
తండ్రీ, కూతురూ నెమ్మదిగా లక్ష్మికి అన్నం తినిపించారు. మింగుతున్న ఒకో ముద్దా అమృతంలా తోస్తోంది లక్ష్మికి. అన్నం కడుపులో పడగానే కొంచెం ఓపిక వచ్చింది లక్ష్మికి. మాత్రలు వేసుకుని గోడకి జారబడి కూర్చుంది మంచం పైనే. తండ్రి..మాలతో అన్నాడు” నువ్వూ, తమ్ముడూ అన్నం తినండి. నేను అమ్మ దగ్గర కూర్చుంటాను అని లక్ష్మి చేతిలో చేయివేసి రాయసాగాడు.

          మాల లోపల నుంచీ అరిచింది” నాన్నా!చారులో ఉప్పు వేయలేదు నువ్వు.”

          ఈసారి అతనికి కోపం రాలేదు. ఫక్కున నవ్వి “నాకు వంట అలవాటు లేదు కదా.. ఉప్పు కలుపుకొని తినండమ్మా. ఈ సారి అమ్మనడిగి జాగ్రత్తగా వంట చేస్తాను …సరేనా!” అన్నాడు. ఆ మాటలకి లక్ష్మి ఫక్కున నవ్వింది. నీరసంలో కూడా ఆమె నవ్వుతుంటే అందంగా కనిపించింది మాల తండ్రికి. పిల్లలు తినేసి తండ్రికి కంచంలో అన్నం పెట్టి తెచ్చారు. నువ్వూ తినునాన్నా!చారులో ఉప్పు సరిపడా వేసి తెచ్చాను అని తినిపిస్తున్న కూతురినీ, వింతగా చూస్తున్న కొడుకునీ దగ్గరకి తీసుకున్నాడు ఆ తండ్రి.
ఇక మిమ్మల్ని ఎప్పుడూ బాధపెట్టను. నా మీద ఒట్టు . మిమ్మల్ని సంతోషంగా ఉంచి నేను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తము చేసుకుంటాను అని ఒట్టు పెట్టుకుంటున్న భర్త చేతిని మొదటిసారి గట్టిగా పట్టుకుంది లక్ష్మి. ఇక లక్ష్మికే కాదు ఆ కుటుంబానికే మంచి రోజులు వచ్చాయి.

(ఈ కథ చూడగానే మనసును కదిలించి తెలుగులో అనువదించాలి అనిపించింది. అంత చక్కటి కథవ్రాసి అనువదించడానికి అనుమతి ఇచ్చిన శ్రీమతి దేవి నాగరాణి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను… వేంకటలక్ష్మీ గాయత్రి రేగులగెడ్డ.)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.