మారాల్సిన దృశ్యం(కథ)

-డా. లక్ష్మీ రాఘవ

          “రా.. రా.. ఇప్పటికి వచ్చావు …” తలుపు తీస్తూ ఎదురుగా నిలబడ్డ సవిత చేతి నుండీ సూట్కేసు అందుకుని గెస్ట్ రూమ్ వైపు నడిచింది రజని.

          “ఈ ఊరికి మా హెడ్ ఆఫీసు షిఫ్ట్ అయ్యింది. నాకు ఇక్కడ ఆఫీసులో మూడు రోజుల పని ఉందంటే, వెంటనే నిన్ను చూడచ్చనుకుని బయలుదేరా..”అన్న సవితతో

          “పోనీ, నాకోసం వచ్చావు..”అంది రజని సంతోషంగా.

          “బయట నుండీ మీ ఇల్లు చాలా బాగుంది…మీ స్టేటస్ సింబల్ లా” ప్రశంసా పూర్వకంగా చూసింది రజనిని సవిత.

          “వాసు సొంతంగా ఆఫీసు మొదలెట్టిన రెండేళ్ళకి ఇంత ఇల్లు కొనగలిగాము. ఈ ఇల్లు కొన్నప్పుడు అంత బాగుండేది కాదు. ఇల్లంతా నేనే డిజైన్ చేశా.. పూర్తిగా ఛూద్దూ గానీ ముందు స్నానం చేసిరా.. “ అని అక్కడే ఉన్న బాత్ రూమ్ చూపించింది.

          స్నానం చేస్తూ బాత్రూమ్ గమనించింది. పెద్ద అద్దం పక్కన పూల వేస్. గోడంతా
ముత్యపు చిప్స్ తో మెరుస్తూ ….రజని టేస్ట్ ఎప్పుడూ స్పెషలే. ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేస్తుంది అనుకుంది.

          టిఫిన్ తిన్నాక కబుర్లలో పడ్డారు.

          ఇల్లు కొన్నాక తాను ఎన్ని మార్పులు చేసిందో కూడా చాలా చెప్పింది. నిజంగానే ఎంతో మాడరన్ గా చేసినట్టు అనిపించింది. 

          భోజన సమయమయ్యే సరికి “ఆకలేస్తోందే.. ఏమి చేశావు? తిందామా” అంది సవిత.

          “బయట నుండీ తెప్పించేశానే..నీ వొస్తున్నావని ఇల్లంతా సర్దాను. టైమ్ లేక
తెప్పించేశా” అంటూన్న రజనిని ఆశ్చర్యంగా చూసింది. ఎందుకంటే ఎవరైనా వస్తున్నా రంటే స్వయానా వండటం అలవాటు తనకి.

          “అలా చూడకు. భోజనం బాగుంటుంది. పద“ అని డైనింగ్ హాలు వైపు కదిలింది.
రజిని అన్నట్టే భోజనం బాగుంది. అదేమాట అంటే ‘అందుకే.. ఎప్పుడూ అక్కడ నుండే
తెప్పిస్తా..’

          “ఎప్పుడూనా ?”

          “ఆ…వారంలో మూడుసార్లు అయినా..”

          “మరి మీ ఆయన వాసు ఇష్టంగా తింటాడా?

          “లేదు. శని ఆదివారాల్లో కొన్ని తనే స్పెషల్ గా ఏదైనా చేస్తాడు..నీకు తెలుసుగా నాకు వంట చేయడం ఇష్టం లేదని..”

          “అది అప్పట్లో.. పెళ్లయ్యాక చేయాలి కదా”

          “అలా ఏమీ రూలు లేదు..వాసు కూడా అలవాటు పడిపొయ్యాడు” అంది రజనీ నవ్వుతూ..

          ఎందుకో రజనీ అలా చెప్పడం బాగా అనిపించలేదు సవితకి. అయినా ఉండబట్ట లేక “భర్తను కడుపు ద్వారా గెలుచుకోవచ్చు..అంటే వంట ద్వారా … అన్న సామెత వుంది కదే.”

          “ఇంకా పాత చింతకాయ పచ్చడి లాగే ఉన్నావు నీవు. కొనుక్కో గలిగే సంపాదన ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి”

          ఇంట్లో వండకపోవడం ఎంజాయమెంట్ ఎలా అవుతుంది అని అడగలేదు. ఆ ఇంట్లో వారికి లేని అభ్యంతరం నాకెందుకు అనుకుంది సవిత.

          సాయంకాలం రజని అబ్బాయిలు రాకేశ్, రాజేష్ రావటం, మళ్ళీ ట్యూషన్ కి వెళ్ళటం జరిగాయి. ఇంటర్ లో ఉన్న వారిద్దరికీ రజని అవసరం అంతగా ఉన్నట్టు లేదు. వచ్చాక స్నాక్స్ పెట్టిన అల్మేరా నుండీ ఏదో తీసుకుని తిన్నారు. ఏది తింటున్నారో రజనీ చూడలేదు. ఫ్రిజ్ నుండీ పాలు తీసుకు తాగి వెళ్ళారు. తల్లిని ఏమీ అడిగే వయసు కాదనుకున్నా రజని అలా ఎలా ఉంటుందో అర్థం కాలేదు.

          వాసు ఆఫీసు నుండీ ఆలస్యంగా వచ్చారు. సవితని పలకరించాక ఫ్రెష్ అయి వచ్చారు. అందరూ కలసి పొద్దున తిన్నవే వేడిచేసి తిన్నారు. వాసు తనకు తానుగా ఆవకాయ సీసా తెచ్చుకు కూర్చున్నారు. అది సవిత దృష్టిని దాటిపోలేదు. వరసగా మూడు రోజులు సవిత ఆఫీసు మీటింగ్స్ తో పగటి పూట బిజీగా ఉన్నా, సాయంకాలం నుండీ రాత్రి దాకా రజనితో కలిసి షాపింగ్ చేస్తూ, అప్పుడప్పుడూ లేట్ అయితే బయటనే తిని వస్తున్నాఇంట్లో ఎవరూ ఇబ్బంది పడకుండా ఏదో ఒకటి తెప్పించుకుని లేదా చేసు కుని తిని, తమ పనులు తాము చేసుకోక పోవడం చాలా ఆశ్చర్యపోయింది. ఉండబట్టలేక అదేమాట రజనితో అంటే “పిల్లలు పెద్దవాళ్ళయ్యాక వారి పనులు వాళ్ళు చేసుకోవడం లో తప్పేముంది. వాసు ఇంటికి వచ్చాక చూసుకుంటాడు కదా..” అని తేలికగా అంది.

          “నాకు అలా కాదు రజని. మా ఇంట్లో ఎప్పుడూ పిల్లలకీ, ఆయనకీ అన్నీ నేనే చేసుకుంటాను. ఎప్పుడైనా బ్రేక్ కావాలనిపించి పని చెబితే చేసుకుంటారు. కానీ వాళ్ళు “అమ్మా ఈ రోజు బ్రేకఫాస్ట్ ఏమిటీ..” అని వస్తే చేసిపెట్టడం నాకు బాగుంటుంది”

          “ఇక వాళ్ళెప్పుడు నేర్చుకుంటారు?? నీవు ఉద్యోగమూ చేస్తూ, ఇంట్లో అన్నీ చేసి పెట్టే మర మనిషిలా ఉండిపోతావా?” రజని ప్రశ్నకు

          “ఏమిటోనే వాళ్ళు కానీ, మా ఆయన శ్రీకర్ కానీ నా మీద ఆధార పడ్డారు అన్న సంతోషం నాకు. ఇప్పుడు ఇక్కడకు మూడు రోజులు రావడానికి ఎంత ప్రీపరేషన్ తెలుసా. ఎన్నో రకాల వంటలు చేసి ఫ్రిజ్ లో పెట్టి వచ్చాను. అయినా రోజూ ‘ఇవాళ ఏమి వేడి చేసుకోవాలి?’ అన్న ఫోన్లు రావటం నీవు గమనించలేదా??” అంటూన్న సవితను చూసి నవ్వుతూ..

          “ఇక నీవు రిలాక్స్ అయ్యేది ఎప్పుడే? నాకేమో నీవు ఒక పనిమనిషిలాగా అయి పోయావు అనిపిస్తుంది. నా మాట విని నీవు అన్నీ మానేసి నాలాగ లైఫ్ ఎంజాయ్ చేయడం నేర్చుకో..” అంది రజని.

          ఎవరినీ పట్టించుకోకుండా రిలాక్స్ అవటం.. కుటుంబ వ్యవస్థకే దెబ్బకదా.. అనుకున్నా ఎందుకో చెప్పలేక పోయింది సవిత.

          మరు రోజు సవిత బయలు దేరి ఇల్లు చేరితే అందరి ముఖాల్లో కనిపించిన సంతోషం ఎంతో ఆనందాన్నిచ్చి “నేను ఇలాగే ఉంటా “అనుకుంది మనసులో గట్టిగా… వచ్చే సంపాదనలో ఇంటి ఖర్చులు, పిల్ల చదువులు, వైద్య అవసరాలు అన్నింటి గురించి ఆలోచించే తన జీవితానికి రజని జీవితానికి ఎంత తేడా…

          రజనితో అప్పుడప్పుడూ మాట్లాడుతూనే ఉంది.

          మళ్ళీ ఏదో అయిడియా వచ్చి ఇంటి వెనుక ఒక సిట్అవుట్ కోసం ప్లాన్ వేయించా ననీ, ఈ సారి వస్తే హాయిగా అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకోవచ్చనీ చెప్పింది. మరోసారి ఫోనులో రాకేశ్, రాజేష్ లను ఈ సారి నుండీ హాస్టల్ కు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పింది. సాధ్యమైనoత వరకూ పిల్లలు తమతోనే ఉండాలని తాపత్రయపడే సవితకు ఇది నచ్చలేదు. అయినా ‘ఎవరి లైఫ్ వారిది మధ్యలో తనకెందుకు’ అనుకుని మరీ రెట్టించి అడగలేదు.

          రెండు నెలలు గడిచాయి. వాసు మూడు వారాల కోసం అమెరికా వెడుతున్నాడనీ వీలైతే ఆ టైమ్ లో వారం సెలవు పెట్టుకుని వచ్చి వెళ్ళమని రజని ఫోను చేసింది.లక్కీగా హెడ్ ఆఫీసులో మూడు రోజుల పనిబడి సవిత అక్కడికి ఆ సమయంలో వెళ్ళాల్సి రావడం అదృష్టం అనుకుంటూ బయలుదేరి వెళ్ళింది.

          రజని కొంచెం వేరుగా ఉన్నట్టు అనిపించింది. ఎక్కువగా మాట్లాడ్డం లేదు. ఎక్కువ గా పాటలు వింటోంది. బహుశా ఒంటరి తనాన్ని ఫీల్ కానీయకుండా అలవాటు చేసుకుంటోందేమో..

          “వాసు ఎప్పుడు వస్తాడు?? పిల్లలు అడ్జస్ట్ అయ్యారా?” అని అడిగినది.

          “రాకేశ్ వాళ్ళు అడ్జస్ట్ అయినట్టే ఉన్నారు. వాసు మరో రెండు వారాలు ఉండాల్సి
వస్తుందేమో అన్నారు”

          “అందరూ ఫోన్లు చేస్తున్నారు కదా”

          “పిల్లలు వీక్లీ ఒకసారి చేస్తారు. వాసుకు ఫోను చేసే టైమ్ ఉండదుట. అమెరికా టైమింగ్స్ కూడా అలాగే ఉంటాయి కదా..”

          “నీకు బోర్ కొడుతుంది అయితే..”

          “ఎందుకూ ఇంత ఇల్లు సర్దుకోవడంతో అలసిపోతాను…” సవితకి ఆ సమాధానం ఎందుకో నచ్చలేదు.

          ఇంట్లో ఒక్కత్తీ ఉంటూ అదెందుకూ. డబ్బులు బాగానే ఉన్నప్పుడు క్లీనింగ్ కి వేరుగా
ఒకరిని పెట్టుకోవచ్చు. లేదా ఏదైనా సర్వీస్ చేయవచ్చు. లేకపోతే తనకిష్టమైన ఇంటీరి యర్ డిజైనింగ్ కపెనీల్లో పని చెయ్యచ్చు… అదే అంది రజనితో. 

          “నాకు అంతా ఓపిక లేదు లేవే”

          “ఇలా ఉండకూడదే రజనీ..”అంది చివరగా..

          మరు క్షణం రజనీ సవితను పట్టుకుని ఏడ్చేసింది.

          “ఏమైందే??” కంగారుగా రజనిని పట్టుకుంది.

          “వాసు అమెరికా ఒంటరిగా వెళ్ళలేదుట.. వాళ్ళ ఆఫీసులో సెక్షన్ హెడ్ గా ఉన్న ఒక
అమ్మాయితో వెళ్ళాడట. పోయిన వారం షాపింగ్ వెడితే వాళ్ళ ఆఫీసులో పనిచేసే ఆయన
కలిసాడట. ‘మేమంతా మీరిద్దరూ కలిసి వెడతారని అనుకున్నాం’ అంటే అనుమానం వచ్చిందట. అప్పుడు గమనిస్తే వాసు ఫోను కూడా ఎక్కువ చేయటం లేదన్నది గమనిం పుకు వచ్చిందట..

          అవును మరి నిజంగా ఫోను చేయాలనే అనుకుంటే టైమ్ కుదరదు అన్న ప్రశ్న ఉండదు కదా…

          ఇప్పుడేమి చేయాలి?? రజని ఏడుస్తుంటే కూడా సవిత బుర్ర ఎన్నో సమాధానాల కోసం వెదుకుతోంది.

          ఎంత ఆలోచించినా చివరకు మిగిలింది ఒక్కటే ‘రజనితో అన్నీ మాట్లాడాలి’ అని.
“పెళ్ళి అయ్యి ఇన్నేళ్ళ తరువాత నేను పనికి రాకుండా పోయానా? సంసారం ఇలా వదిలేసి తన సుఖం కోసం వేరే వేషాలు వేస్తాడా? ముందు అందరూ ఏమనుకుంటారు అన్నదైనా ఆలోచించాలి. నేను తనకి ఏమి తక్కువ చేశానని ..”మళ్ళీ ఏడుపు ఎక్కువ చేసింది రజని.

          టక్కున పాయింట్ దొరికింది సవితకు.

          పోయినసారి వచ్చినప్పుడు తను చాలా విషయాలలో రజనీతో ఏకీభవించలేదు. ఇంట్లో వండటం, పిల్లలను చూసుకోవడంలో లోపం అనిపించింది కానీ అందరూ సర్దుకు పోతున్నట్టే ఉన్నారు. తానే కొంచెం ఎక్కువగా పట్టించుకుంటుందా  అనిపించింది. ఇప్పుడిలా అయ్యిందంటే … కారణం??

          “రాకేశ్ వాళ్ళకు చెప్పావా ?“ అడిగింది సవిత.

          “వాళ్ళ కెందుకు ఈ సంగతులు? అని చెప్పలేదు అయినా నేను వాసుతో తేల్చు కోవాలి గానీ..” పిల్లలు ఎదిగాక ఫ్రెండ్స్ లాగా ఉంటారని సవిత నమ్మకం. తను మాత్రం ఇంట్లో విషయాలు కూడా వారికి చెప్పడం అలవాటు చేసింది. ఏ సందర్భానికి ఎలా స్పందించాలో అలవాటు అవుతుందని.. అందుకే అర్థం అయ్యింది. రజని అన్నీ విధాలా ఒంటరి అని..తప్పక ఏదైనా చేయాలి అనిపించి లేచీ బాత్రూమ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యింది.

          “రజనీ, కాస్సేపు బయట కూర్చుందాము” అని లేవదీసింది.

          ఇద్దరూ కొత్తగా వేయించుకున్న సిట్ అవుట్ లో కూర్చున్నారు.

          “ఒకటి చెప్పు రజనీ వాసు నిన్ను పట్టించుకోవడం లేదు అని నీకు ఎప్పుడైనా అని పించిందా..”

          “గమనించలేదు నేను. పెళ్లై ఇన్నేళ్ళకి అసలు డౌట్ ఎందుకు వస్తుంది? తను ఆఫీసు పనులతో బిజీగా ఉంటాడని నేను ఎక్కువ పలకరించను…”

          “అదేంటి పెళ్లై ఎన్నేళ్ళయినా భార్యాభర్తల స్పేస్ ఉండాలి. ప్రేమ కబుర్లు కాదు. ఎన్నో విషయాలు ఉంటాయి. కనీసం ఆయన ఆఫీసు పనుల ఒత్తిడి గురించి ఆయన గానీ, ఇంట్లో కలిగే ఇబ్బంది గురించి నీకు గానీ వాసుకు చెప్పాలనిపించదా?”

          “ఏమో అవి అడగాలని నాకు అనిపించదు. ఆఫీసు పెట్టిన కొత్తలో కొద్ది రోజులు వాసు ఆఫీసు సంగతులు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తే “నాకెందుకు?” అంటే మానేశాడు.

          నేను కూడా అలసిపోయి ఇంటికి వచ్చిన అతనికి ఏదైనా చెప్పి విసిగించడం ఎందుకు. అని ఏమీ చెప్పేదాన్ని కాదు..”

          “అలా ఎలా అనుకుంటావు??”

          “ఏమీ మాట్లాడకుండానే కాపురం చేశావా?”

          “అదేంటి..అలా అంటావు. కాపురం చేస్తేనే కదా పిల్లలూ..”

          “నేను అలా అనలేదు. పెళ్లై ఎన్నేళ్ళయినా ఒకరి కోకరు మాట్లాడుకోవాలన్న తపన ఉండాలి.. ఇల్లు అందంగా ఉంచుకున్నంత మాత్రాన సంసారం చక్కగా ఉంటుంది అనుకోకూడదు. ఆయన విషయంలో నీ అవసరం ఉండాలి. అన్నీ అమర్చేసాను అను కుంటే ఆయనకు నిన్ను పిలిచే అవకాశం కూడా ఉండదు…”

          ఏమీ మాట్లాడకుండా తల దించుకుంది రజని.

          “ఒక్క సారి ఆలోచించు. పిల్లల విషయానికి వచ్చినా, వారికి అమ్మ అవసరం ఎప్పుడూ కనబడుతూ ఉండాలి.

          వారు ఏమి చేస్తున్నారు, ట్యూషన్ ఎలా ఉంది? ఇలాటివి గమనించడమే కాదు అడుగుతూనే ఉండాలి. ఎదిగారు కదా పరవాలేదు అని వదిలిపెడితే ఎలా?. కొంతవరకూ గైడెన్స్ ఇవ్వాలి కదా. మీ ఆలోచనలు ఏమిటి అని వారికి చెప్పాలి. “

          “అంటే పిల్లల విషయంలో కూడా నాదే తప్పంటావా?” రజనికి కోపం వచ్చింది.

          “రజనీ, కోపం తెచ్చుకోకు, మనం పెరుగుతున్న సమాజంలో అలవాటు పడ్డ మన కట్టుబాట్లు. పెద్దలు చెప్పి, మనం ఆచరించే కొన్ని చిట్కాలు సుఖ సంసారానికి పనికి వస్తాయి. సంసారంలో ఎప్పుడూ ‘ఎవరికి వారే…’ కాదు. ఒకవేళ అలా ఉన్నా ఒక బంధన కలుగజేసి, చక్కదిద్దు కునేది తల్లి. జీవితంలో ప్రతిరోజూ నేర్చుకోవడానికి ఎన్నో పాఠాలు ఉంటాయి. ఎలాంటి పరిస్థితికి ఎలా ఎదుర్కోవాలి అన్నది తెలుసుకునేది ఇక్కడే.

          అందుకే పిల్లలకు మన అవసరం లేదు అని ఎప్పుడూ అనుకోకూడదు. అన్నీ ఇస్తున్నాం, పనులు చేసుకోగలరు’ అని అనుకుంటే వారిని దూరం చేసుకున్నట్టే… మానసికంగా వారు మనకి దగ్గరవ్వాలి. అంతే” రజని ముఖంలో మారుతున్న భావాలను చూస్తూ దగ్గరగా వెళ్ళి…

          “రజనీ… ఇదే సూత్రం భర్తకు కూడా వర్తిస్తుంది. భార్యా భర్తల మధ్య ఆకర్షణ కొద్ది రోజులే. పిల్లలు పుట్టాక బాధ్యత ఇద్దరిదీ… బాధ్యతలు పెరిగినా ప్రేమ తరగదు. ఒక ఎదురు చూపు, ఒక చిన్న స్పర్శ ఎప్పుడూ అవసరమే అంతే కాదు ప్రతి విషయంలోనూ
ఒకరికొకరు పంచుకునే అంశాలు ఉంటాయి. ‘నీ కోసం నేనున్నా…’అన్న భరోసా ఇద్దరికీ రావాలి.

          ఆయన ఆఫీసు విషయాలు చెప్పినా, నీవు ఇంట్లో ఇబ్బందులు చెప్పినా వినే పరిస్థితి ఉండాలి. ఆఫీసు విషయాలు నాకెందుకు అని, ఇంటి విషయాలు చెప్పడం అనవసరమని నీవెప్పుడు అనుకున్నావో అప్పుడే మీ మధ్య దూరం పెరిగింది. దూరం పెరిగితే మనిషి అవసరం తగ్గుతుంది. ఇంట్లో దొరకనిది బయట వెతుక్కునే పరిస్థితి ఎప్పుడూ తీసుకురాకూడదు. అలా కాకుండా నీ కోసం అతను, అతని కోసం నీవు ఎప్పుడు దగ్గరగా ఉండాలని అనిపిస్తుందో అప్పుడే అంతా చక్కబడుతుంది.

          ఇవన్నీ నీకు తెలియదని కాదు. నీవు అనుసరించలేదు అనిపించింది కాబట్టి చెప్పాను. ఇప్పుడు కూడా ఆలస్యం కాదు..” అనగానే వెంటనే సవిత చెయ్యిపట్టుకుంది రజని.

          “అయితే సరిపోతుందంటావా?? ఎలా?“ అని అడిగి౦ది.

          “అవ్వచ్చు కానీ ముందు నీ మనసుకో క్లారిటీ ఉండాలి. ఇన్ని రోజులూ వాసును పట్టించుకోని నువ్వు ఇప్పుడెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నావు? నీ నుండీ దూరంగా వెళ్లాడనా? నీవు కాకుండా ఇంకోకరితో ఎంజాయ్ చేస్తున్నాడనా లేక భర్తగా సంఘంలో నీకిచ్చే హోదా కోసమా లేదా తను లేకపోతే ఇంత సౌకర్యంగా ఉండదనా?…‘

          ఒక క్షణం ఆగింది సవిత. రజని తల ఎత్తలేదు.

          “ఇవేమీ కాదు.. కుటుంబం సఖ్యతగా ఉంటేనే మనశ్శాంతిగా ఉంటుంది అని ఖచ్చితంగా కనిపిస్తే నీ ప్రయత్నం ఎలా చేస్తే బాగుంటుందో నాకనిపించింది నేను చెబుతాను…“

          “అదేంటే ఇన్ని అర్థాలు తీస్తున్నావు??” రజని గొంతులో కొంచెం కోపం.

          “ఎందుకంటే అతను ఇచ్చిన డబ్బుతో అన్నీ బాగా జరిగిపోతున్నాయని  అను కుంటూ ‘హాయిగా ఎంజాయ్ చేస్తున్నాన’ని పోయినసారి నాకు అనిపించింది. కుటుంబం లో మూల స్థంబం తల్లి!. అటు పిల్లలు, భర్తకు ఒక బైండింగ్ లా పని చేస్తూ ఆసరా కల్పి స్తుంది. ఎవరికి వారే యమునా తీరే అయితే జస్ట్ అందరికీ డబ్బు చాలు కదా…“

          “అలా పెడర్థాలు తియ్యకు సవితా, వాసు నాకు భర్త గా, పిల్లలకు తండ్రిగా, ఈ ఇంటికి గొడుగులా ఉండాలి. “అంది చిన్నగా రోధిస్తూ..

          “తను లేకపోతే అందరమూ బాధ పడతాము అనుకుంటే ఇక్కడ డబ్బు కాదు ప్రేమ, ఆప్యాయతా ముఖ్యం..అంతే కాదు ఎంత సంపాదన ఉన్నా ప్రణాళిక అవసరం అనిపిస్తోంది కదా..” అవునన్నట్టు తల ఊపింది రజని

          “సరే అయితే ఈ కుటుంబం నుండీ అతను దూరం కాకూడదు అంటే మొదట ఈ రోజు నుండీ నీవు టైమింగ్స్ చూసుకుని వాసుతో మాట్లాడు… ఎలా ఉన్నావని … పని ఎలా జరుగుతూందని.. అలాగే పిల్లలకు ఫోను చేస్తూ వారి విషయాలు ఎలా ఉన్నాయో కనుక్కో… వారి అవసరాలు గురించి వాసుకు చెప్పవచ్చు అలా క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే భార్యకు ఇచ్చే విలువ పెరుగుతుంది.

          ఎక్కడా మన ప్రయత్న లోపం ఉండకూడదు. ఎప్పుడు గానీ అతనితో అమెరికా ఎవరు వెళ్ళారని ఆడగవద్దు. నీకు తెలియనట్టే ఉండు . చూద్దాం….”

          రజనీ తలదించుకుంది. రజని ముఖం ఎత్తి కన్నీరు తుడుస్తూ “నీవు ఎప్పుడూ ధైర్యస్తురాలివి. చిటికెలో సరి చేసుకోగలవు. ఆ నమ్మకం నాకుంది.”అంది సవిత.
ఇలాటి చర్చలు కొన్ని జరిగాక రజనికి సవిత మాటల మీద నమ్మకం పెరిగింది.

          ఆ రోజే పిల్లలతో మాట్లాడింది. కోచింగ్ ఎలా జరిగేది, కొన్ని అడ్జస్ట్మెంట్స్ కష్టాలు చెప్పుకున్నారు. అవి విన్నాక ఇన్నిరోజులూ తాను ఎందుకు పట్టించుకోలేదు అన్న
ఫీలింగ్ రజనికి రావటం గమనించి, వాసు విషయం కూడా చక్కదిద్దుకో గలదు అన్న భరోసా వచ్చి త్వరలో ఆ ఇంటి దృశ్యం తప్పక మారుతుందన్న నమ్మకంతో సవిత ఊరికి వెళ్ళడానికి సిద్దమవసాగింది.

*****

Please follow and like us:

8 thoughts on “మారాల్సిన దృశ్యం (కథ)”

 1. కథ బాగుంది లక్ష్మీ. ఎవరికి వారే యమునాతీరే అనుకునే మనస్తత్వం ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. మంచి పాఠం చెప్పారు చివర్లో.

 2. చాలామంది సమస్యలకు చక్కని పరిష్కారం ఈ కథ..హృదయపూర్వక అభినందనలు

 3. Nenu iteevala chaduvutunna kathalu anni ekkuvagaa teecharlu vidyadhikulu raasinave !
  prati kathalonu aadarsam kanipistundi. anubhavaalu koodaa rachanalu avutaaie!
  inta bagaa patrikanu naduputunna Dr Geetaa Madhavi is VERY GREAT. CONGRATULATIONS !

  1. Thank you అండీ . అనుభవాలే ఎక్కువగా కథలుగా వస్తాయి. రచయిత పరిశీలనా శక్తి. బట్టి కొన్ని సంఘటనలు. సమాజానికి పనికివచ్చేలా చెయ్యచ్చు 🙏🏼
   లక్ష్మీ రాఘవ

 4. మీ కథలు ఎప్పుడూ ఏదో ఒక మంచిని బోధిస్తాయమ్మా. నిరాశ పరచవు. ఈ కథ ఇప్పుడు నిర్లిప్తంగా జీవితం గడిపే జంటలకు చాలా అవసరమైన సందేశం అందించారు.

Leave a Reply

Your email address will not be published.