ఎందుకు వెనుకబడింది

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

– జగ్గయ్య.జి

అరచేతిలో సూర్యున్ని చూపగలదు
హృదయాన చంద్రున్ని నిలపగలదు 
ఎదిరిస్తే పులిలా, ఆదరిస్తే తల్లిలా 
కోరిన రూపం ప్రదర్శిస్తుంది!
 
తను కోరుకున్నవాడికి
హృదయాన్ని పరుస్తుంది 
ఆకాశమంత ఎత్తుకు ఎదిగి
తన ఒడిన మనను పసివాడిగా చేస్తుంది!
 
సృష్టి కొనసాగాలన్నా
కొనవరకు జీవనం సాగిపోవాలన్నా
మూలం ఆమె, మార్గం ఆమె
విషయాంతర్యామి విశ్వ జననీ!
 
వెదకకున్నా ఎందైనా కనిపించే ఆమె
ఎందుకు వెనుకబడింది
మన వెన్నై దన్నుగా నిలచినందుకా
తోడుగా అంటూ నీడగా ఉన్నందుకా!
 
సగభాగం తనకు తక్కువేమో 
సమ భాగం కావాలేమో
సూర్యచంద్రులు తన కన్నులుగా
పగలూ రాత్రీ మనల్ని వెలుతుర్లో నిలుపదా!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.