నడక దారిలో-38

-శీలా సుభద్రా దేవి

జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతిపత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి కుటుంబం విడిపోవటం అయ్యాయి. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, మాకు పుట్టిన బాబు అనారోగ్యం, ఎమ్మే తెలుగు పరీక్షలు పూర్తయిన మూడు రోజులకు బాబు చనిపోయాడు. ఆంధ్రమహిళాసభ బియ్యీడీ కాలేజిలో చేరి హార్డిల్ రేసు లా ఒడిదుడుకులతో బియ్యీడీ పుర్తిచేసాను. ఒకటి రెండు స్కూల్స్ లో తాత్కాలికంగా పనిచేసి, ఎట్టకేలకు ఆర్టీసి హైస్కూల్ లో ఉద్యోగం వచ్చింది. తెలుదేశం ప్రభుత్వంలో వీర్రాజుగారు బిజీ అయ్యారు. తర్వాత—

***

          స్కూల్ లో ఉద్యోగం అంటే కేవలం పాఠాలు చెప్పటమే కాదు. విద్యార్థులతో మమేకం కావాలి. అప్పడే వాళ్ళు పాఠాల మూలసూత్రాల్ని అవగాహన చేసుకుంటున్నారో లేదో, అవగాహన చేసుకోకపోవటానికి గల కారణాల్ని కూడా టీచర్లు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనే కొత్తచూపు అలవడింది. దాంతో పిల్లల జీవన నేపధ్యాల పట్ల కూడా ఆసక్తి కలిగింది. స్కూల్లో అడుగుపెట్టాక ఇంక నా ఆలోచనలు, ధ్యాస అంతా బడి పిల్లలే  తప్ప మరి ఇల్లు, సమస్యలు అన్నీ మర్చిపోయే దాన్ని.
         
          ఉద్యోగ జీవితంలో చేసిన బడిబాట పట్టని 0-14 పిల్లల సర్వేలు, జనాభా లెక్కల సర్వేల వలన నేను మరింతగా ఆర్ధిక, సామాజిక, రాజకీయ సమస్యల పట్లా, కుల మత వివక్షల పట్లా ప్రాక్టికల్ గా జీవన వైరుధ్యాల లోతుపాటులు తెలుసుకోగలిగాను. ప్రభుత్వా లు అమలుచేసే పథకాలు ఆర్ధికంగా వెనుకబడిన వారికి ఎంత వరకు ఉపయోగపడు తుందనేది అర్ధం కావటం లేదు. చాలా మందికి తమకు గల హక్కులు కూడా తెలియదు.
 
          పేద పిల్లలు జీవన నేపధ్యాలపట్ల ఈ అవగాహన నాకు రచనలలో ఒక దృక్పథాన్ని మెరుగు పరచుకునేందుకు ఉపయోగపడింది. అందుకే పదవీవిరమణ తర్వాత నేను “ఇస్కూలు కతలు” రాయగలిగాను.
 
          నేను స్కూలుకు వెళ్ళేందుకు ఒక్కోసారి సూపర్ బజార్ స్టేజిలో బస్సు కోసం వేచి వున్నప్పుడు. బస్టాపు వెనుక అంతా రోళ్ళు తయారుచేసే కుటుంబాలు జీవిస్తుంటారు. వాళ్ళ జీవనవిధానం నాకు చాలా ఆసక్తి కలిగించేది. బస్సు అక్కడ దిగినప్పుడు వాళ్ళ మధ్య నుండి నడుచుకుంటూ వచ్చేదాన్ని. నేను పరిశీలించిన విషయాలతో కొంత కల్పనలతో దేవుడు బండ కథను రాసాను. విపుల మాసపత్రిక వారు పత్రిక పదేళ్ళ వార్షికో త్సవ సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో నేను మూడవ బహుమతి పొందాను. ఎప్పటి నుండో పెండింగులో వున్న కథల సంపుటిని మధురాంతకం రాజారాం గారి ముందుమాటతో ” దేవుడు బండ” పేరుతో వెలుగులోకి తెచ్చాము. ఆ కథలు చదివి వాసి రెడ్డి సీతాదేవిగారు ఫోన్ చేసి అభినందించారు. ఈ పుస్తకానికి మంచి సమీక్షలు వచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయంవారు అందించే పురస్కారాల ఎంపికకై వచ్చిన మధురాంతకం రాజారాం గారు ఫోన్ చేసి మరీ నా “దేవుడు బండ ” కథలు విభాగంలో ఎంపిక అయినట్లు చెప్పారు. కానీ తర్వాత నాది ఏమైందో తెలియదు. మరొకరికి వచ్చింది. నాకు పురస్కారం రాలేదు. అవార్డులు తెప్పించుకోవాలే కానీ వాటికవిరావు అనేది మొదటిసారి తెలిసింది.
 
          తిరుపతి పద్మావతి విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన కోలా రాజ్య లక్ష్మిగారు హైదరాబాద్ వచ్చాక సీతాదేవిగార్ని కలిసి రచయిత్రుల సమావేశం ఏర్పాటు చేయాలనుకున్నట్లు తెలిపి జంటనగరాల్లోని రచయిత్రులను వారింటికి ఆహ్వానిం చారు. అయితే నాకు ఎక్కువ మందితో పరిచయం లేదు.పెద్దవాళ్ళతో మనకెందుకులే అని ఆ రోజు నేను వెళ్ళలేదు. తర్వాత నెలలో మళ్ళా యశోదారెడ్డి గారి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసారు. సీతాదేవి గారు తప్పక రమ్మని మరీమరీ చెప్పారు. ఇక తప్పదని వెళ్ళాను. ఆ రోజుల్లో తమ రచనలతో పత్రికలను ఏలుతున్న రచయిత్రులు అందరూ ఓ నలభై మంది వరకూ వచ్చారు. కుముద్ బెన్ జోషి, ఇందిరాధన్ రాజగిరి కూడా వచ్చారు. అందరిలో నేనే అన్నివిధాలా చిన్నదాన్ని. దాంతో కొంచెం ముడుచుకు పోయాను. ఆ సందర్భంలోనే రచయిత్రుల సమూహానికి “సఖ్యసాహితి”అని పేరుతో కుముద్ బెన్ జోషి, ఇందిరాధన్ రాజగిరి గౌరవ అధ్యక్షులుగా సీతాదేవి అధ్యక్షురాలిగా రిజిష్టర్ చేయా లని నిర్ణయించారు. ఇప్పటిలాగే ప్రతీనెల ఒకరింట్లో కలిసి, కొత్తగా రాసిన స్వీయరచన లు గూర్చి తెలియజేయటం, సమకాలీన సాహిత్య చర్చలు చేసుకుందామనే నిర్ణయిం చారు. ఒకసారి మా యింటిలో కూడా సమావేశం జరిగింది. మా స్కూల్ కి దగ్గరలోనే బాగ్ లింగంపల్లిలో అబ్బూరి ఛాయాదేవి గారి ఇల్లు. అందువలన స్కూల్ అయ్యాక వాళ్ళింట్లో రిఫ్రెష్ అయ్యి ఆమెతో కలిసి సమావేశాలకు వెళ్ళేదాన్ని.
 
          తర్వాత్తర్వాత కోలా రాజ్యలక్ష్మి, కుముద్ బెన్ జోషి, ఇందిరాధన్ రాజగిరిగార్లు రావటం మానేసారు. కేవలం రచయిత్రులమే కలిసేవాళ్ళం. ఆ క్రమంలో హైదరాబాద్ కి వచ్చిన మాలతీ చందూర్ గారిని, ఏచూరి కల్పాక్కం గారినీ ( ఏచూరి సీతారాం గారి తల్లి ) కలవటం జరిగింది. ద్వివేదుల విశాలాక్షి గారికి తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చిన సందర్భంలో విశాలాక్షి గారిని సఖ్యసాహితి సభ్యులు అందరం ఆమెని కలిసి సత్కరించాము. తర్వాత సభ్యులు అందరం సహకార పధ్ధతిని కథల సంపుటి వేయాలని ప్రచురించారు. కదంబం పేరిట మా అందరి కథల సంకలనం రావటం ఆనందం కలిగించినా పొరపాటు వలన భయంకరమైన అచ్చుతప్పులుతో రావటం విచారకరం.
 
          ఇలా ఏడాది అయ్యాక వార్షికోత్సవం తలపెట్టి ఇతర రచయిత్రులకు అవార్డులు కూడా ఇవ్వటం జరిగింది. తర్వాత కార్యవర్గ సభ్యుల్ని ఏర్పాటు చేసి కొన్ని ఏళ్ళు నడిచింది.
 
          తురగా జానకీరాణి గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు యునిసెఫ్ సహకారంతో పిల్లల సమస్యలతో రెండు రోజులపాటు ఘనంగా సదస్సులు నిర్వహించారు. అందులో నేను ఆడపిల్లలు చదువులకు కలుగుతోన్న అవరోధాలు గురించి పత్రసమర్పణ చేసాను.
 
          అయితే తర్వాత్తర్వాత కొన్ని అపార్థాలతో సఖ్యసాహితి విచ్ఛిన్నం అయ్యింది. వాసా ప్రభావతి గారు ” లేఖిని రచయిత్రుల సాహితీ సంస్థ ‘ ఏర్పాటు చేసారు. సీతాదేవి గారు చనిపోవడంతో అంతవరకూ ఆమెతో ఉన్నవారు కూడా క్రమక్రమంగా లేఖినిలో చేరిపోయారు. నేనూ ఛాయాదేవిగారి లాంటి వాళ్ళం అందరితోనూ సమానంగానే తట స్థంగా ఉండేవాళ్ళం.
 
          ఇంక రాష్ట్ర రాజకీయాలు చూస్తే ఎన్టీఆర్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లోనే పోటీ చేసినా జాతీయ పార్లమెంటులో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా మారటం ఆశ్చర్యం.
 
          ఐదేళ్ళ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎన్టీఆర్‌ నాయకత్వంలో ప్రతిపక్షాలు ఏకగ్రీవంగా ఎన్టీఆర్ ని నేషనల్‌ ఫ్రంట్‌ ఛైర్మన్‌గా కూడా చేశాయి. నేషనల్ ఫ్రంట్ కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చింది.
 
          1983లో ఆంధ్ర ప్రదేశ్‌లో ఎన్టీఆర్ మొదటి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి కావటంతో ఆగిపోక 1989లో జాతీయ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ఆధిపత్యానికి ముగింపు పలికేలా ప్రతిపక్ష కూటమికి ఎన్టీఆర్ నాయకత్వం వహించటం వలన భారతదేశంలో ప్రజా స్వామ్యాన్ని విస్తరించిన వ్యక్తిగా కూడా ఎన్టీఆర్ గుర్తింపు పొందాడు. ఇది భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక గొప్ప మలుపుగా చెప్పొచ్చు.
 
          ఎన్టీఆర్ ప్రభుత్వంలో టాంక్ బండ్ మీద తెలుగు ప్రముఖుల విగ్రహాల ప్రతిష్టాపన లోనూ వీర్రాజు గారు పనిచేసారు. వీర్రాజుగారిని ఒక ఆయన కలిసి తన కొడుకు విగ్రహాలు చెక్కడం నేర్చుకున్నాడనీ ఏదైనా పని ఇప్పించమని అడిగాడు. హుస్సేన్ సాగర్ లో ప్రతిష్టించడం కోసం బుధ్ధవిగ్రహం చెక్కే వారి దగ్గరికి వెళ్ళమని చెప్పారు. ఆ అబ్బాయి అదృష్టం కొద్ది అక్కడ పని దొరికింది. అతను చాలా సంబరపడి వీర్రాజు గారితో “మీకు తక్కువ ధరలో సరస్వతి విగ్రహం చెక్కి ఇస్తానని చెప్పి అదేవిధంగా  గ్రానైట్ తో చెక్కిన సరస్వతి విగ్రహం తీసుకుని వచ్చి ఇచ్చాడు. హుస్సేన్ సాగర్ లోని బుధ్ధవిగ్రహ ప్రతిష్టా పన కూడా వీర్రాజు గారికి ఆయనకి గల కళాభిరుచి వల్ల వీర్రాజు గారికి ఎన్టీఆర్ పట్ల ఇష్టం పెరిగింది. ఒకసారి వీర్రాజు గారిని ఎన్టీఆర్  “నా దగ్గర పనిచేసే వాళ్ళంతా తమ కోసం ఏవైనా సహకారం కోరుకుంటారు. మీరు ఎప్పుడూ ఏమీ అడగలేదు?” అని ప్రశ్నించా రుట. వీర్రాజు గారు ” నాకేమీ అక్కర్లేదు. నాకు ఈ ఉద్యోగం నుండి విముక్తి చేయండి చాలు ” అని సమాధానం చెప్పేసరికి ఎన్టీఆర్ పెద్దగా నవ్వారట.
 
          కానీ వీర్రాజుగారు ఉద్యోగంతో రానురానూ విసిగిపోయారు. సాహిత్యానికి, చిత్రలేఖ నానికి, స్నేహితులకు, కుటుంబానికి దూరం అయిపోయినట్లుగా చికాకుపడి వాలంటరీ రిటైర్మెంట్ కు అప్లై చేసారు. అయితే సమాచారశాఖకు కమీషనర్ గా ఉన్న ప్రసాద్ గారు తాను ట్రాన్స్ఫర్ అయినంత వరకూ ఉండమని కోరటంతో మౌనం వహించారు.
 
          ఎన్టీఆర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాల వలన 1989 ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ అధిక స్థానాల్లో గెలిచి మళ్ళీ అధికారానికి వచ్చింది. మర్రి చెన్నారెడ్డి రెండోసారి ముఖ్య మంత్రి అయ్యాడు. 1980 ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ ఉన్నప్పుడు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులను గుర్తించమన్న ఆదేశంతో  బి.పి.మండల్ అధ్వర్యంలో కమీషన్ ని  ఏర్పాటుచేసింది.
 
          1980లో మండల్ కమీషన్ తమ నివేదిక అమలుకు ఆదేశించిన కారణంగానే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఇక అప్పటి ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అయితే అప్పట్లో ఇందిరా గాంధీగానీ ఆ తర్వాత ప్రధాని అయిన రాజీవ్ గాంధీ ప్రభుత్వాలుగానీ ఈ నివేదికను ఆమోదించకుండా పక్కనపెట్టారు.
 
          కానీ 1990 ఎన్టీఆర్ నాయకత్వంలోని ప్రతిపక్ష కూటమి ద్వారా గెలిచి ఏర్పాటైన నాటి ప్రధాని వి.పి.సింగ్ మాత్రం తన ప్రభుత్వంలో నివేదికను అమలుచేయడానికి నిర్ణయించుకున్నట్టు ప్రకటించాకా విద్యార్థుల ఆందోళన ప్రారంభమైంది. దాంతో దేశ మంతా విద్యార్థులు కులపరంగా చీలిపోయి జరిగిన ఆందోళనలో విద్యావ్యవస్థ స్థంభించి పోవడమేకాక అనేక మంది విద్యార్ధుల ప్రాణనష్టం కూడా జరిగింది. దాంతో సంకీర్ణ ప్రభుత్వం కులం, మతం సంఘర్షణల్లో చిక్కుకోవటంతో ప్రధానమంత్రి వీపీ సింగ్ 1990 డిసెంబర్‌లో రాజీనామా చేయాల్సి వచ్చింది.
 
          ఆ సమయంలో డిగ్రీ చదువుతోన్న పల్లవి కూడా తన స్నేహితురాళ్ళ మనస్తత్వం లోను మార్పుకు, కాలేజీలో జరిగే చర్చలకు ఆందోళన చెందింది. దాంతో మరింత పట్టు దలతో చదువుకుంది. కాలేజీ ఉదయం షిఫ్ట్ కావటం వలన సాయంత్రం ఆప్టెక్ లో కంప్యూటర్ కోర్సులు చేస్తూ ఉండేది. ఆ సందర్భంలోనే నేనుకూడా పడుగూపేకా, శేషవస్త్రం వంటి కొన్నికవితలు రాసాను.
 
          ఆ రోజుల్లో మరో సంచలనం దూరదర్శన్ లో రామానంద్ సాగర్ భారీఎత్తున నిర్మించిన రామాయణం ధారావాహిక. అప్పట్లో అది ఎంత సంచలనం కలిగించిందంటే ఆదివారం ఉదయం సంగీతం, సాహిత్య  కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయటం మానేసా రు. ఉదయం ముహూర్తం పెళ్ళిళ్ళలో వేదిక మీద టీవీలు పెట్టటం కూడా జరిగిందంటే రామాయణం ధారావాహిక  జనంలో ఎంత క్రేజ్ ని రగిలించిందో అర్థమౌతుంది. ఆ రోజుల్లోనే మా ఇంట్లో నలుపు తెలుపుల టివీ పోయి రంగులటీవీ కొలువు తీరింది.
 
          ” తెలుగు దేశం ప్రభుత్వం పోయి కాంగ్రెస్ వచ్చింది కదా మీ నిర్ణయం మార్చుకుం టారా?” అని కమీషనర్  వీర్రాజుగారిని అడిగారు. కానీ విరమణ తీసుకుంటానని చెప్పే సరికి సంతకం పెట్టటంతో ఇంకా ఎనిమిదేళ్ళు ఉండగా వీర్రాజు గారు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు.
 
          ఈ విషయం తెలిసి వీర్రాజుగారి తోబుట్టువులు మాత్రం” వాళ్ళావిడని ఉద్యోగం మాన్పించవచ్చు కదా. ఇతనెందుకు మానేయడం. ఇంక వాళ్ళింటికి వెళ్తే జాకెట్టు బట్ట కూడా రాదు కాబోలు” అని చెవులు కొరుక్కున్నారనేది నా వరకూ వచ్చింది.          
 
          ఆ సమయంలోనే కోఠి ఉమెన్స్ కాలేజీ లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డా.పి.భార్గవీరావు తన పుస్తకాలకు ముఖచిత్రం కోసం వచ్చి పరిచయం అయ్యారు. ఆమె గిరీష్ కర్నాడ్ నాటకాలను తెలుగులోకి అనువదించారు. మాతృభాష కన్నడ అయినా తెలుగు సాహిత్యం మీద అభిరుచి, అభినివేశం కూడా ఉన్న ఆవిడ. ఆమె ఇల్లు సంతోష్ నగర్లో ఉండటం మలకపేటకి కొంచెం దగ్గర కావటంతో తరుచూ వచ్చేవారు. వీర్రాజుగారి కవిత్వాన్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేసారు. మేము ఏ మీటింగ్ కు వెళ్ళాలనుకున్నా ఆమె తన కారు తీసుకొని వచ్చి మమ్మల్ని సభలకు తీసుకు వెళ్ళేవారు. సంగీతం, సాహిత్యమే కాక కళాకృతులంటే కూడా ఆసక్తి ఉండటం వలన మా కుటుంబానికి చాలా దగ్గర అయ్యారు.
 
          ఉద్యోగం హడావుడి లేదు కనుక పూర్తిస్థాయిలో ముఖచిత్రాలు వేయటం, కవిత్వం రాసుకోవటం మొదలు పెట్టారు. నేను ఉదయమే టిఫిన్ ,కూరా,పప్పూ చేసి నాకూ,పల్లవికి బాక్స్ లు కట్టి ఎనిమిదిన్నరకల్లా బస్ కి బయలుదేరిపోయేదాన్ని. వీర్రాజు గారు పన్నెండుకి తన కోసం కుక్కర్లో అన్నం పెట్టుకొనేవారు. పగలు కబుర్లు చెప్పుకోవటానికి తరుచూ కె.కె.మీనన్ గారో, రామడుగు రాధాకృష్ణ మూర్తిగారో వచ్చేవారు. వాళ్ళకూడా తరుచూ వీర్రాజు గారితో బాటూ భోజనం చేసేవారు. ఇతర కవులూ,రచయితలు కూడా వస్తుండే వారు. అందుచేత ఆయనకు రోజంతా గడచిపోయేది.
 
          ఇక ఆదివారం, సెలవురోజుల్లో అయితే రోజంతా స్టౌ మీద టీలు కాగుతూనే ఉండేవి. సాహితీ మిత్రులతో వీర్రాజుగారు చాలా బిజీగా అయిపోయారు.
 
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.