మరో దుశ్శాసన పర్వంలో..!

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

– ఎన్. లహరి

నాలో నిత్యం జరిగే సంఘర్షణలకు 
కాస్త విరామమిచ్చి
నన్ను నేను వెతుక్కునే ప్రయత్నంలో
నాదనుకునే సమూహంలోకి ధైర్యంగా అడుగులేస్తుంటాను
 
నన్ను నేను నిరూపించుకోవడానికి ఎన్ని అడ్డంకులెదురైనా అధిగమిస్తాను
 
ఏమరపాటు జీవితాన్ని 
కోల్పోమంటుంది
మంట గలపిన సంప్రదాయం
విషసంస్కృతి పిడికిళ్ళలో ముడుచుకు పోయింది
 
వింత సమాజం, విభిన్న పోకడలు
సంస్కృతీ సాంప్రదాయలకు నెలవంటూ సెలవిస్తూనే
వావి వరసులు మరచిపోయి ప్రవర్తించే
విష సంస్కృతి తాండవిస్తోంది
 
కామాంధులు కారణాలెతుక్కొని మరీ
చేతులు చాస్తుంటారు
 
బంధాలు కరువైన చోట 
క్షేమ సమాచారాల ప్రసక్తే లేదు
 
ఏకాంతంలో కూడా 
కారుచీకట్లు కమ్ముకునేలా
అసభ్యకర మాటలు
హృదయాన్ని తూటాల్లా చీలుస్తాయి
 
స్వప్న లోకంలో విహరిస్తూ
ఈ కన్నీటికి అర్థం వెతుకుతూ ఉండాలి
చివరికి నీకు నువ్వు ఏమవుతావు 
అన్న ప్రశ్నే
చితి మంటై లేస్తుంది

*****

Please follow and like us:

One thought on “మరో దుశ్శాసన పర్వంలో..! (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)”

Leave a Reply

Your email address will not be published.