యాత్రాగీతం

అమెరికా నించి ఆస్ట్రేలియా

(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)

-డా||కె.గీత

భాగం-14

గ్రేట్ బారియర్ రీఫ్ టూరు (Great Barrier Reef Tour) తరువాయిభాగం 

దాదాపు పదిన్నర ప్రాంతంలో ఫిట్జ్ రాయ్ ద్వీపానికి (Fitzroy Island) చేరుకున్నాం. 

          ఇక్కడ కొందరు దిగి, మరి కొందరు ఎక్కారు. ఈ ద్వీపంలో కూడా స్నోర్కిలింగు వంటి యాక్టివిటీస్ ఉంటాయి. అక్కడ దిగినవారు నచ్చినంతసేపు అక్కడ గడిపి మళ్ళీ సాయంత్రం ఇలాంటి పడవ ఏదైనా ఎక్కి వెనక్కి వెళ్ళోచ్చు. కెయిర్న్స్ నించి ఇక్కడికి  ప్రతి 45 ని.ల కొక పడవ తిరుగుతూనే ఉంటుంది. ఈ ద్వీపం కెయిర్న్స్ నించి ఈశాన్య దిశగా 30 కి.మీ దూరంలో ఉంటుంది. ఇక్కడ రాత్రి పూట ఉండడానికి మంచి రిసార్టు కూడా ఉంది. 

          మరో అరగంటలో ఈ ఫిట్జ్ రాయ్ ద్వీప పరిధిలోనే ఉన్న పగడపు దీవుల సముదా యం దగ్గరికి మా పడవ చేరుకుంది. అక్కడొక పెద్ద డెక్ వంటిది ఏర్పాటు చేసి ఉంది. దాన్ని పాన్ టూన్ (Pontoon) అంటున్నారు. దానికి మా పడవని కట్టివేసేసరికి రెండిటి మీద నించి సులభంగా వెళ్ళి రాగలిగిన మార్గం ఏర్పడింది. ఆ డెక్ మా పడవకంటే రెండు రెట్లు పొడవైనది. 

          పదకొండు గంటల కల్లా ఏక్టివిటీస్ చేసే వాళ్ళంతా ఈ డెక్ మీదికి చేరుకున్నారు. అక్కడ నీళ్ళలో దిగినప్పుడు వేసుకునే ఫుల్ వాటర్ సూట్లు వరసగా హేంగర్లకి తగిలించి, స్నోర్కిలింగు చేసే వారికి కళ్ళద్దాలు, నీట్లో దిగినప్పుడు ఊపిరి పీల్చే మాస్క్, ఫిన్స్ వంటివి పెద్ద డబ్బాల్లో వేసి అందుబాటులో ఉంచారు. కాబట్టి ఈ టూరుకి వచ్చేవాళ్ళు ఇవన్నీ కొనుక్కుని వెంట తెచ్చుకోనవసరం లేదు. నిజానికి స్విమ్మింగ్ దుస్తులు కూడా తెచ్చుకోనవసరం లేదు. వాళ్ళిచ్చే వాటర్ సూట్లు వేసుకుంటే చాలు. ఇక నీటిలోకి దిగే వాళ్ళంతా లైఫ్ జాకెట్లు వేసుకోవడం తప్పనిసరి. 

          సత్య ఒక్కడే స్నోర్కిలింగు ట్రైనింగుకి వెళ్ళాడు. వరుకి పూర్తిగా స్విమ్మింగ్, స్నోర్కి లింగ్ వచ్చినందున తను విడిగా ఈత కొట్టసాగింది. సిరిని చూసుకుంటూ, పడవ మీంచి వీళ్ళకి వీడియోలు, ఫోటోలు తియ్యడం నా పని. స్నోర్కిలింగు ట్రైనింగులో ఒక  తేలే గుండ్రటి రింగు పట్టుకుని అయిదారుగురు ఒక్కసారే నీట్లోకి దిగి తలలు నీళ్ళలోకి పెట్టి చుట్టూ చూడడమన్నమాట. వాళ్ళ ఇన్స్ట్రక్టరు రింగుకి కట్టివున్న ఓ తాడు పట్టుకుని వీళ్ళని డెక్ కి దాదాపు వందమీటర్ల దూరంలో తాళ్ళతో కట్టిన పరిధి చుట్టూ లోపలే తిప్పుతూ ఉన్నాడు. వరు స్వయంగా ఈత కొడుతూ చేపపిల్లలా అలవోకగా తిరగసాగింది. ఇటు వంటివి చెయ్యడానికి దేహదారుఢ్యంతో బాటూ, మానసిక ధైర్యం కూడా ఉండాలి. సత్య, మా పెద్ద పిల్లలు ఇద్దరూ ఇలాంటి విషయాల్లో బాగా ధైర్యవంతులే. ఎటొచ్చీ నాకు, సిరికి భలే భయం. 

          సరిగ్గా గంటలో ఈ యాక్టివిటీలు  అక్కడ జరుగుతూ ఉండగానే భోజనాలకు పిలుపు వచ్చింది. 

          పన్నెండింటికే భోజనాలు ప్రారంభించడం వల్ల ట్రైనింగులకి వెళ్ళేవాళ్ళకి స్వయంగా మరి కాస్సేపు నీటిలో గడిపే సమయం ఉండదు. ఇక రెండు మూడు యాక్టివిటీస్ బుక్ చేసుకున్న వాళ్ళకి తినడానికి కూడా సమయం ఉండదు. 

          సత్య, వరు పన్నెండున్నర ప్రాంతంలో వచ్చి ఏదో గబగబా తిని సరిగ్గా పది నిమిషాల్లో అండర్ వాటర్  వాకింగ్ అంటూ వెళ్ళిపోయారు. 

          అండర్ వాటర్ వాకింగ్ కి పెద్ద బిందెల్లాంటి హెల్మెట్లు వంటివి ఉంటాయి. ఈ హెల్మెట్లు గాజుకుప్పె బోర్లించినట్లు నీళ్ళు లోపలికి చొచ్చుకురాకుండా కాపాడతాయి. అందులోకి వెనక కట్టుకున్న ఆక్సిజన్ ట్యాంకుల్లో నుంచి గాలి వస్తూ ఊపిరి తీసుకోవ డానికి అనువుగా ఉంటుంది. ఇక  అండర్ వాటర్ వాకింగ్ అంటే నీటిలో పూర్తిగా మునిగి పడవ అంతర్భాగంలోని నిర్ణీత స్థలంలో ఒక తాడు పుచ్చుకుని నడవడమన్నమాట. ఇందులోకి టూరు బుక్ చేసుకున్నవాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి ఫోటోలు, వీడియోలు అంటూ వెంట వెళ్ళడానికి కూడా అనుమతి లేదు. 

          ఇక భోజనం దగ్గిర నేను, సిరి స్థిమితంగా కూచున్నాం. బఫే భోజనంలో అన్నం, ఉడకబెట్టిన గుమ్మడికాయ ముక్కలు, స్వీట్ ఫ్రైడ్ చికెన్, ఉడకబెట్టిన ప్రాన్స్, సలాడ్, బ్రెడ్, కేక్స్, పళ్ళు అంటూ సుష్టుగా తిన్నాం. 

          కెయిర్న్స్లో టూర్లలో ఎక్కడ చూసినా అన్నం ప్రధానంగా భోజనంలో ఉండడం, చికెన్ కి స్వీట్ నెస్ కలపడం విశేషం. 

          భోజనంకాగానే పై డెక్ మీదికి చేరుకుని సోఫా సీట్లలో కాస్సేపు పడక వేసాం. ఈ సందట్లో గ్లాస్ బోట్, సబ్ మెరీన్ టూర్లకి చివరి ట్రిప్పు రెండింటికి అన్న విషయం ఎవరం పట్టించుకోలేదు. 

          ఒంటిగంట నలభై అయిదుకి సత్య, వరు టూర్లన్నీ పూర్తి చేసుకుని మా దగ్గరకి వచ్చి మళ్ళీ అందరం కలిసి తిరిగి డెక్ మీదికి వెళ్ళేసరికి 1.40 కి వెళ్ళే బోట్ మిస్సయిపోయాం. ఇక మాకు ఒకే ఒక్క రైడ్ కి అవకాశం ఉంది. 

          గ్లాస్ బోట్ రైడ్ అంటూ చిన్న పడవ మీద నీళ్ళలో ఉగిసలాడుతూ వెళ్ళడం కంటే సబ్ మెరీన్ టూరు బెస్ట్ అని నిర్ణయించుకుని ఇక ఆ ఒక్క టూరు తీసుకున్నాం. అది నిజానికి బెస్ట్ టూరు. కోరల్ రీఫ్స్ ని చూడడానికి సబ్ మెరీన్ లో వెళ్ళడమే సరైనది. 

          దాదాపు ఇరవై నిమిషాల ప్రయాణంలో సబ్ మెరీన్ లో దిగువన అద్దాల గదిలో చేసిన ఆ ప్రయాణం మరపురానిది. అక్కడి పగడాల దీవుల్లో మత్స్యకన్యకలా తిరుగాడిన అనుభూతి. 

          ఉన్నట్టుండి ఒక విశాలమైన పగడపు శిఖరం కనిపిస్తుంది. తనలోని ఎన్నో రకాల చిత్ర విచిత్ర అందాల పగడపు మొలకలతో అలరిస్తుంది. లేత పసుపు, లేత ఇటుక రంగు, తెలుగు, అక్కడక్కడా నీలం. అందులోనే చిన్న చిన్న చేపలు అటూ ఇటూ దాగుడుమూతలాడుతూ, నక్షత్ర చేపలు అక్కడక్కడా అంటుకుని మెరుస్తూ..  ఎంత అద్భుతమైన ప్రపంచమో అది! 

          ఇలా దీవి మాయమయ్యి అంతలోనే ముదురు నీలం రంగులోకి చుట్టూ ప్రపంచం మారిపోతుంది. పై నించి సూటిగా పడ్తున్న సూర్య కిరణాల్ని ఓడించే సముద్రపు లోతు. సముద్ర అంతర్భాగం కనబడని నీటి పొరలు చుట్టుముడతాయి. ఒకానొక భయం చుట్టు ముడుతుంది. అంతలోనే మేమున్నామంటూ అక్కడ పెద్ద పెద్ద చేపలు తండోపతండా లుగా దర్శనమిస్తాయి. మళ్ళీ లేత నీలం రంగు వెలుతురు కమ్ముకున్న ప్రాంతానికి తిరిగి వస్తాం. అక్కడ మరొక పగడపు దీవి ప్రత్యక్షమవుతుంది. సముద్రపు లోతుని నీలం రంగులోని భేదాల్ని బట్టి ఇట్టే అంచనా వెయ్యొచ్చక్కడ. 

          ఇక పడవ దరిదాపుల్లో కట్టి ఉన్న డెక్ అక్కడ నీటిలో అలా తేలుతూ ఉండడానికి గాను కింద పెద్ద పెద్ద ఇనుప తాళ్ళతో కట్టి నీటిలోకి అట్టడుగుకి వదిలిన పెద్ద గదంత సిమెంటు దిమ్మెల మీద, దిగువ చుట్టూ కట్టిన తాళ్ళ మీద నాచు పట్టి ఉండడం వల్ల ఆ చుట్టూ చిన్న చేపల సందోహం చూడాలి. అంతేకాకుండా చేపలకు మేత కూడా పై నించి వేస్తూ ఉన్నందు వల్ల డెక్ చుట్టూ అందమైన రంగుల్లో గుమిగూడి చెదిరిపోతున్న చిన్న చేపలు. కెమెరాల్లో ఎంత బంధించినా కంటితో చూసి తీరవలసిన అందం అది. నిజానికి కెమెరాల్లో ఆ అందాన్ని బంధించలేకపోయామనే చెప్పాలి. ఇక సిరి ఆనందం చూడాలి. మా ఇద్దరికీ బాగా నచ్చింది ఆ టూరు. 

          అది కాగానే డెక్ కి ఒక వైపు దిగువన మెట్లుదిగి వెళ్తే చిన్న చిన్న అద్దాల్లో నుంచి అక్కడే కూర్చుని చూసే చిన్న ఆక్వేరియం వంటిది చూసి వచ్చాం.  

          మూడు గంటల కల్లా అన్ని యాక్టివిటీస్ ఆపేసారు. తడి బట్టలు మార్చుకోవడం, డెక్ పైకెక్కి ఎండలో కాస్సేపు ఒంటిని ఆరబెట్టుకోవడం చేసే సమయం అది. మూడున్నర ప్రాంతంలో మళ్ళీ తిరిగి పడవ వెనక్కి బయలుదేరిపోతుంది అని ఎనౌన్సు చేసారు. అందరికీ కాఫీ, బిస్కెట్లు ఇచ్చారు. 

          అక్కడ గంటలు నిమిషాల్లా దొర్లిపోయాయి. తిరిగి కెయిర్న్స్ కి చేరుకునే సరికి అయిదున్నర కావచ్చింది. 

*****

(సశేషం)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.