క్షమాసమిధ

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-అనసూయ ఉయ్యూరు

          ప్రణవీ!” అనే పిలుపు విని అగింది. ఎదురుగా హెచ్చార్ ప్రభు. వారం క్రితం తను జాయిన్ అయినప్పుడు మాట్లాడటమే మళ్ళీ ఈ నెలలో తనతో మాట్లాడింది లేదు. అతనికి పెళ్ళయిందని‌, మంచివాడని,‌ మహిళా కొలీగ్స్ తో చాల మర్యాదగా నడుచు కుంటాడని అంతా అనుకుంటే వింది‌‌. అతను అలా పిలవగానే విషయం ఏంటోఅన్నట్లు ఆగింది.
 
          అతను చేతిలో ఆ రోజే వచ్చిన వార పత్రిక పైకి ఎత్తి చూపుతూ “ఇది నువ్వేనా?” అన్నాడు. అతను చూపుతున్న పత్రికలో తన కథ వున్న పేజీలు ఎత్తి పట్టుకుంటూ‌. 
 
          చిన్న సిగ్గుతో కూడిన సంతోషంతో “నేనే… మీరు పుస్తకాలు చదువుతారా?” అంది.
 
          ఆ మాట నేనడగాలి. ఈనాటి జనరేషన్ తెలుగు చదవటమే గొప్ప అయితే మీరు ఏకంగా కథలే రాసారంటే‌…నాకు చెప్పనలవి కాని సంతోషంగా వుంది. అందులోనూ మా కంపెనీలో పనిచేసే అమ్మాయి రచయిత్రి అంటే మాకు మరింత సంతోషం కదా. ఎనీ హౌ కంగ్రాట్యూలేషన్స్” అతని గొంతులో నిజంగానే ఎదో ఎక్జయిట్ మెంట్. తన ప్రతిభని చూసి ఇలా ముఖం మీద మెచ్చుకుంటే ఆమెకి కూడా థ్రిల్లింగ్ గా వుంది. 
 
          “పార్టీ”
 
          ష్యూర్, కానీ మరెప్పుడైనా. సున్నితంగానే చెప్పింది కానీ అతను అలా “పార్టీ” అని అడగటం ఎందుకో నచ్చలేదు తనకి.
 
          ఇంటికి వచ్చాక కూడా ఆ విషయం గురించి తెగ ఆలోచించింది‌. అతను పెళ్ళయిన వాడు, మంచివాడని అందరూ అంటున్నారు కదా, మరి అతని మాటల్లో మరో అర్థం వెతకాల్సిన అవసరం లేదు చాలా కాజువల్ గానే అడిగాడేమో అనిపించింది.  
 
          అతను ఆఫీసులో వున్నంత సేపూ చిరునవ్వుతో పని చేసుకుంటాడు, పని చేయించుకుంటాడు. బాసిజమ్ చూపడు సరికదా ఏ మాత్రం కాస్త ఖాళీ దొరికినా అందర్నీ ఓ చోటికి పిలిచి చిన్నపాటి ఎంటర్టెన్మెంట్ కార్యక్రమం పెడతాడు. అదెలా వుంటుందం టే ఆ నెల మొత్తం తాము ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపి ప్రాజెక్ట్ వర్క్ లో మునిగి పోయామో అనేది మర్చిపోయి మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. అలాంటి వ్యక్తి తనని పార్టీ అడగటంలో తప్పు లేదు.. కానీ ఎందుకో అతను అలా అడగటం నచ్చలేదు‌. కారణం ఏమై వుంటుంది తనకి తాను ప్రశ్నించుకుంది‌. 
 
          కాస్త కాస్త అర్థం అయింది. అతను చాలా సెల్ఫిష్. తను, తన పనికి ప్రాధాన్యత ఇచ్చుకుంటాడు. ఇతరుల గురించి ఆలోచించడు. తను బిజీగా వున్నప్పుడు ఎవ్వరినీ పలకరించడు. ఇతరుల నుండి పనితీసుకునేప్పుడు అదిగో అలా ఎదో ఎంటర్టయిన్ చేసినట్లుగా బిల్డప్ ఇస్తాడు అందులో కూడా స్వార్థం వుంది. అది తను పసిగట్టేసింది‌. అందుకే అతని ప్రశంశలో ఏదో స్వార్థం వుందని తనకు అనిపించింది. ఇలా అనుకున్నా క మనసు హాయిగా అనిపించింది.
 
          కానీ ఆ అభిప్రాయం ఎక్కువ సేపు నిలవలేదు. మరుసటిరోజు అతను అందర్నీ పిలిచి మన ఆఫీసులో మంచి రచయిత్రి వున్నారు మీకు తెలుసా? అంటూ అందరికీ తాను రాసిన కథలు గురించి చెప్పటం మొదలు పెట్టాడు. “నీవు చదవటమే కాదు, రాస్తావు కూడానా?” అంటూ ఆశ్చర్యంగా ముఖం పెట్టారు తనతో క్లోజ్ గా వుండేవారు తప్ప మిగిలిన వాళ్ళంతా.  
 
          “మా నానమ్మకి తెలుగంటే చాలా ఇష్టం. అందుకని మా ఇంట్లో అందరికీ కండిషన్ పెట్టారు ఇంట్లో కంపల్సరీగా తెలుగు పదాలే వాడాలి. రోజూ తెలుగు పేపరో, పుస్తకమో తప్పకుండా చదవాలి. ఆ కండిషన్ వల్ల చాలా పుస్తకాలు చదివాను. అవి చదివినప్పుడు ఇలా ఎందుకు వుండాలి ఇలా క్కూడా వుండి వుండవచ్చు కదా అని ప్రశ్నించేదాన్ని. అప్పుడు నీవు రాయవచ్చు కదా అంటూ మళ్ళీ నానమ్మే ప్రోత్సహించించారు. అలా రచయిత్రి నయ్యాను” అంటూ తన గురించి చెప్పింది.
 
          “థ్యాంక్స్ టు యువర్ నానమ్మ ఇంత మంచి రచయిత్రిని అందించినందుకు” అన్నాడు అతను నవ్వుతూ.
 
          ఎందుకో తెలియదు కానీ అలా పరిచయం చేయటం కాస్త సంతోషమే అనిపిం చింది. అనవసరంగా తొందరపడ్డానా ఇతని గురించి అనుకుంది. ఆ రోజు మొదలు ప్రతి రోజూ సాయంత్రం ఇంటికి వెళ్ళే ముందు పదినిమిషాలు సాహిత్యం గురించి, కథల గురించి సంభాషణ జరిపిగాని అతను కదలడు.
 
          ఏదన్నా మంచి రచన కనబడితే వెంటనే తనకి వాట్సాప్ పంపుతాడు. దాని గురించి అభిప్రాయం అడుగుతాడు. నిర్మొహమాటంగా తన అభిప్రాయం చెప్తుంది‌‌. దాన్ని అతను గౌరవించినట్లు మాట్లాడతాడు.
 
          ఆ రోజు తను అతని కోసం కాంటీన్ లో ఎదురు చూస్తుంది‌. ఓ పత్రిక నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలకు తన కథకి మొదటి బహుమతి వచ్చిన విషయం చెబుదామని. కాని అతను ఏదో అన్యమనస్కంగా వున్నట్లు రాగానే టీ ఆర్డర్ ఇస్తూ నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి” అన్నాడు. 
 
          “ఏం? ఏమైనా ప్రోబ్లమా?” అడిగింది.
 
          “ప్రోబ్లం ఏం లేదు‌. నా శ్రీమతి పుట్టినరోజు.. త్వరగా రమ్మని చెప్పింది. కానీ తనతో బైటకు వెళ్ళినా ఇక్కడ కూర్చుని మాట్లాడినంత హ్యాపీగా వుండలేను‌ అందుకే ఆలోచిస్తు న్నా” అన్నాడు.
 
          “అయ్యో అదేంటి ప్రభు? ఆమె పుట్టిన రోజు డిజప్పాయింట్మెంట్ మెంట్ చేస్తారా‌‌! భలేవారే హ్యాపీగా వెళ్ళిరండి.
 
          “అంతే అంటారా?”
 
          “ముమ్మాటికీ అంతే. మీ సంతోషం కన్నా అవతలి వారి సంతోషం ముఖ్యం అది మర్చిపోకండి… పదండి” అంటూ అతన్ని లేవదీసినంత పని చేసి పంపించింది‌. 
 
          తర్వాత ఆలోచించింది ఏమన్నాడతను?…ఇంటికి వెళ్ళటం కంటే తనతో మాట్లాడ టం చాలా హ్యాపీగా వుంటుందా? అదేం ఆలోచన? అలా ఎందుకు అన్నాడు? తన భార్య పై అతనికి ప్రేమ లేదా?… వుందో.. లేదో తనకి అనవసరం.. కానీ తనతో ఎందుకు పోలుస్తున్నాడు? ఎదో తేడా కొడుతోంది. మనిషి చాలా బాగా మాట్లాడుతాడు, తన కథలలో పాత్రల సంభాషణలు ఎత్తి ఆ థాట్ మీకెలా వచ్చింది? అంటూ పొగుడుతాడు. అందులో ఏ భావమూ కనబడదు కానీ ఇలా పర్సనల్ వచ్చేసరికి తాను కోరుతున్నది దక్కలేదు అన్నట్లు వుంటాయి మాటలు. ఈసారి ఇటు వంటి మాటలకు చెక్ పెట్టాలనుకుంది.
 
          మరుసటి రోజు తను ఛాంబర్ లోకి వస్తూనే “ప్రణవీ! మీరు చెప్పబట్టే నిన్నవెళ్ళాను. నిజంగానే మా ఆవిడ చాలా సంతోషపడింది. థాంక్స్” అన్నాడు.
 
          ఆ మాటకి తనుకూడ సంతోషపడింది. చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది కానీ ఆ సాయంత్రం కాంటీన్ లో అతన్ని కలవకుండా ఇంటికి వచ్చేసింది.
 
          రాత్రి పదకొండు గంటలప్పుడు సెల్ మోగింది. హెచ్చార్ ప్రభు పేరు డిస్ప్లే  అవుతుంటే ఈ టైంలో చేసాడేంటాని ఓ క్షణం ఆలోచించి ఎటెంప్టు చేయకూడదు అను కుని కూడా… ఒకవేళ ఏదన్నా అర్జంట్ కాల్ అవుతేనో అనుకుంటూ ఎత్తి ‘హలో’ అంది.
 
          “హాయ్! హబ్బ ఈ రోజు కాంటీన్ లో కనపడకపోయేసరికి ఏమైందో అని కంగారు పడ్డాను. అంతా ఓకేనా?” అన్నాడు. 
 
          “ఓహ్..ఇదేనా మరేం లేదుకదా? ఏదన్నా అర్జంట్ విషయం అనుకుని ఫోన్ ఆన్సర్స్ చేసాను”. 
 
          “లేకుంటే తీసేదానివి కాదా?” 
 
          “ఖచ్చితంగా కాదు. ఈ సమయంలో ఏదైనా రాసుకుంటా. ఈ సమయం నాకు చాలా ఇంపార్టెంట్.‌ ఎవ్వరి ఫోన్లు ఎత్తను అంది నిఖచ్చిగా. ఆఫీసులో పేర్లతో సంబోధించినా అందర్నీ మీరు అనే గౌరవిస్తాడు‌. ఇప్పుడు ఏక వచనంతో మాట్లాడటం గమనించింది. 
 
          “ఓ..సారి. నాకా విషయం తెలియక చేసాను. అయితే ఏం రాస్తున్నావు?” అన్నాడు.
 
          “కొత్త కథకి థీమ్ దొరికింది. ఇహ‌ పెన్ తీసుకుని కాగితం మీద పెట్టాలి”. 
 
          “ఎంత అదృష్టం ఆ పెన్నుకి. రాస్తూ రాస్తూ మధ్యలో నీ మెత్తని బుగ్గని అది మృదువుగా… తాకుతుంది కదూ!”
 
          సడన్ గా అతని నోటి నుండి అలాంటి పదాలు వచ్చేసరికి ఎలా రియాక్టు కావాలో అర్ధంకాక విస్తుపోయింది. 
 
          అతను ఆమె రియాక్షన్ కోసం చూడలే. “ఈ క్షణం ఆ పెన్ను నేనైతే ఎంత బావుండు” అన్నాడు.
 
          “ఏం మాట్లాడుతున్నారు మీరు? కోపంగానే అడిగినా అతను తన హెచ్చార్ అనే సంగతి గుర్తొచ్చి దానికి కంటున్యూగా ఇంట్లో మీ శ్రీమతి లేదా?” అంది.
 
          అదే పొరపాటయినట్లుంది. వెంటనే అతనందుకున్నాడు. “వుంటే నాకీ పాట్లెం దుకు? ఒకవేళ వున్నా నా కొరిగిందేమిటి?” గొంతులో జీర. 
 
          ఒకవేళ అతను తాగి మాట్లాడుతున్నాడేమో అని “సరే రేపు మాట్లాడుకుందాం” అంటూ ఫోన్ పెట్టేసి ఊపిరి పీల్చుకుంది.
 
          ఏంటి అతని బాధ. ఎందుకంత ఇంబాలెన్సు అవుతున్నాడు? ఇలా ఫోన్ చేయట మేంటి? అని చిరాకు పడుతుంటే మళ్ళీ ఫోన్ మోగింది. 
 
          తను ఎటప్ట్ చేయకూడదని గట్టిగా నిర్ణయించుకుంది. 
 
          రెండు నిమిషాలు ఆగి మళ్ళీ ఫోన్ మోగింది. తర్వాత మెసేజ్ సౌండ్ విని ఓపెన్ చేసి చూసింది. ప్లీజ్ నేను చెప్పేది విను. ఫోన్ ఎత్తు. లేదంటే ఇంటికి వచ్చి మాట్లాడతా” అని వుంది.
 
          ఏంటి నాకు ఈ టార్చర్? అతనెందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఆన్సర్ చేయక పోతే నిజంగానే వస్తాడా? అసలే తాను వంటరిగా వుంది. ఇంట్లో అంతా పెళ్ళికి వెళ్ళారు. తను కొత్తగా జాయిన్ అయింది కనుక అప్పుడే లీవ్ తీసుకుంటే బాగోదని వాళ్ళని వెళ్ళి రమ్మంది. మూడ్ అంతా అప్ సెట్ అయి టేబుల్ దగ్గర నుంచి లేచి వచ్చి మంచం పై వాలింది. 
 
          కాలింగ్ బెల్ పదే పదే మోగుతుంటే ఉలిక్కిపడి చూసింది. సమయం నాలుగవు తోంది. ఓ క్షణం ఏం అర్థం కాలేదు తర్వాత బైట నుంచి తండ్రి గొంతు విని ఊపిరి పీల్చుకుని గబగబా వెళ్ళి తలుపు తీసింది.
 
          “ఏంటి ఫోన్ చేస్తే తీయవు? ఎంత కంగారు పడ్డామో” అంటున్న అమ్మ మాట విని ఫోన్ వైపు చూసుకుంది. రాత్రి తను స్విచ్చాఫ్ చేసినట్లుంది, అందుకే ప్రశాంతంగా నిద్ర పోగలిగాను అనుకుని “రాత్రి కథ రాసుకుంటూ కూర్చున్నా..టైం తెలియలేదమ్మా” అంటూ మళ్ళీ బెడ్ పైవాలి ఫోన్ ఆన్ చేసింది. మెసేజ్ లు గానీ, మిస్డ్ కాల్స్ గానీ లేవు. 
 
          ఉదయం ఆఫీసుకి వెళ్ళాక అతన్ని ఎలా ఫేస్ చేయాలా అని రకరకాలుగా ఆలోచిం చింది. కానీ అతను రోజులాగే చాలా మామూలుగా వున్నాడు. అసలు తన వైపే చూడ లేదు. 
 
          లంచ్ తర్వాత తన కోలిగ్ అశ్విన్ తో తన ఛాంబర్లోకి పిలిపించాడు ప్రభు. చాలా మండిపోయింది ప్రణవికి రిజిగ్నేషన్ లెటర్ రాసుకుని ఏదైనా తేడా వస్తే అది ఇచ్చి చంప పగులగొట్టి వద్దామని రెడీ అయిపోయింది. 
 
          లోపలికి వెళ్ళగానే “అయామ్ సారీ ప్రణవి. సభ్యత మర్చిపోయి మీతో రాత్రి ఏదైనా తప్పుగా మాట్లాడినట్లనిపిస్తే నిజంగా అయామ్ సారీ” అన్నాడు.
 
          అతని దగ్గర నుండి ఇది ఎక్సపెక్ట్ చేయలేదు ఆమె. కానీ ఆ సారీలో కూడా అతను… “తప్పుగా మాట్లాడినట్లు అనిపిస్తే..” అంటున్నాడు. అది తప్పు అనిపించటం లేదా.. లేకపోతే నీవు ఇలా మాట్లాడావని ఇప్పుడు తను గుర్తుచేయాలా? 
 
          ఇప్పుడు తనేం మాట్లాడాలి. ఇట్స్ ఓకే అనాలా?… లేదు గట్టిగా అరిచి నీవు చేసింది తప్పు అనాలా? ఆవేశాన్ని ఆపుకోలేక ఏదన్నా అన్నా తర్వాత బైటికి వెళ్ళితే కొలీగ్స్ రీయాక్షన్ ఏంటి? ఒకవేళ అది జరిగితే తాను రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వాల్సిందే అను కుంటూ బ్యాగ్ లో చెయ్యి పెట్టబోతుంటే అతనన్నాడు “ఈ సంస్థలో పదేళ్ళుగా చేస్తున్నా ఇప్పటి వరకూ ఎవరితోనూ ఇలా బిహేవ్ చేయలేదు. నాకు నేను పనిష్మెంట్ ఇచ్చుకుని రిజైన్ చేసి వెళ్దామని వుంది” అన్నాడు.
 
          విస్తుపోయింది. సరిగ్గా తనలాంటి నిర్ణయమే తీసుకున్నాడేమా అని ఓ క్షణం ఆలోచించి “అంత అవసరం లేదు ఇంక మీదట హద్దుల్లో మాట్లాడండి చాలు” మారు మాట్లాడటానికి అతనికి అవకాశం ఇవ్వకుండా అనేసి బైటికి వచ్చేసింది‌. ఎందుకు అతన్ని క్షమించాను అనుకుంటే కారణం దొరకలేదు. స్త్రీ సహజమైన మానవత్వంగా సరిపుచ్చుకుంది.
 
          కానీ అది అతనిలో వున్న టాలెంట్ అని ఓ సంవత్సరం తర్వాత అతనితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయినాక తెలిసింది. ఇంత నిక్కచ్చిగా వున్న తాను ఎలా ఈ పెళ్ళయిన మగవాడి ప్రేమలో పడిందో అర్థం కాకుండా వుంది ఆమెకి. 
 
          బహుసా ఆ రోజు సంఘటన తర్వాత అనుకుంటా నానమ్మకి వంట్లో బాగోకపోతే హాస్పిటల్ తీసుకువచ్చింది. అక్కడ దిగులుతో వున్న ఓకామెని ఓదార్చుతూ కనిపిం చాడు. తనని చూసి ఆమె తన భార్య సుమలత అని పరిచయం చేసాడు. ఆమెకి మిస్ క్యారేజ్ అయిందని తెల్సి బాధపడుతుందని చెప్పేసరికి ప్రణవి, నానమ్మా కూడ బాధ పడ్డారు. నానమ్మ ఆమెకి కాసేపు ధైర్యం చెప్పింది.
 
          జరిగిన పాత సంగతి మర్చిపోయి మంచి స్నేహితుడిలా మాట్లాడటం మొదలు పెట్టాడు‌‌. ఎప్పుడైతే అవతలి వ్యక్తి తన ముందు తల వంచుతారో అప్పుడు సహజ సిద్ధంగా వారి పై కొంచెం అధికారం చెలాయిస్తారు‌. ఆ అధికార చెలాయింపు తనకి తెలియకుండానే అతనితో ఎక్కువ సేపు గడపటానికి, కలిసి పనిచేయటానికి దోహద పడింది. అప్పుడు సహజంగానే ఇద్దరి మధ్యా చాలా పర్సనల్ విషయాలు షేర్ చేసుకో వటంతో అతని మాట, చేత ఆమెకి నచ్చటం మొదలైనాయి. ఎంతలా అంటే అతను అందరిలా స్త్రీత్వాన్ని కాక తన వ్యక్తిత్వాన్ని గుర్తించి గౌరవిస్తున్నాడు. అది బాగా నచ్చింది ఆమెకి.
 
          తన కథల్లో హీరోకి వుండే లక్షణాలన్నీ వున్నాయి. కానీ తానెప్పుడూ భార్య వుండగా మరో స్త్రీ పట్ల ఆకర్షితుడైన మగవాడి పాత్ర ఎప్పుడూ రాయలేదు. భార్యకి ఇవ్వాల్సినంత స్పేస్ ఇస్తూనే తనని ప్రేమలోకంలో విహరింపచేయటం ఇప్పుడు నచ్చుతుంది. తన ప్రేమ కోసం అతను ఏమైనా చేస్తాడు‌.
 
          కానీ భార్యని మాత్రం వదులుకోలేడు. అదెలా అంటే, ప్రణవి “మా ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు” అని చెప్పినప్పుడు అతను ముభావంగా వుంటే ప్రేమను జయించటం కోసం భార్యకి ఎప్పుడు విడాకులు ఇస్తాడో చెప్తాడనుకొంది. కానీ అతని దృష్టిలో ఆమె చాల అమాయకురాలు‌. అతను తప్ప ఆమెకి ఎవరూ లేరు కాబట్టి ఆమెకి ద్రోహం చేసే ఉద్దశ్యం లేదు. ఇది తెలిసి అగ్గి మీద గుగ్గిలం కాకుండా వుంటుందా. ఫైర్ బ్రాండ్ లా ఊగిపోయింది.
 
          ప్రభు మొదటిసారి కాస్త గట్టిగా చెప్పాడు. నేను నిన్ను పెళ్ళి చేసుకుంటానని కానీ, ప్రేమిస్తున్నానని కానీ చెప్పానా? అని..
 
          అప్పుడు తెలిసొచ్చింది తనకేదో అసంతృప్తి వున్నట్లు బిల్డప్ ఇవ్వటం, తన ప్రేమ కోసం వెంపర్లాడటంలో ఆంతర్యం‌. తన లాంటి అమ్మాయి అతనితో గడిపితే అదో స్టేటస్. వైవాహిక బంధంతో వచ్చే స్త్రీ గౌరవం‌కి భంగం రానివ్వరన్నమాట. 
 
          అతను తనని మోసం చేయలేదు. వంచన లేదు. ‘మీటూ’ అనేందుకు లేదు అలాగని ప్రేమ వున్నట్లు చెప్పలేదు. మొదట అతన్ని తాను జాగ్రత్తగానే అంచనా వేసింది‌. చనువు తీసుకున్నప్పుడు ఛీదరించుకుని దూరంగా పోదామనుకుని స్త్రీ సహజ మైన గుణంతో క్షమించింది. ఫలితం తానే అతని పట్ల ప్రేమ పెంచుకునేలా చేసాడు… అంటే నటించాడు.. నటన ఎంతటి మాయనైనా కమ్మేస్తుంది. కథలు రాసే తనకే అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడంటే ఎంతటి నటుడో అర్థం చేసుకోవాలి. క్షమా గుణం వల్ల ఆడవాళ్ళు నటుల పాత్రపోషణకి సమిధులు కావాల్సిందేనా? 
 
          మరుసటి రోజు ప్రణవి రిజైన్ చేసిందని, త్వరలో పెళ్ళి చేసుకుని అమెరికా వెళుతుందని అంతా చెప్పుకుంటుంటే విన్న ప్రభుకి గుండెల్లో ఎక్కడో ముల్లులా గుచ్చుకుంది ఈ విషయం తనకి చెప్పలేదని.

*****

Please follow and like us:

23 thoughts on “క్షమాసమిధ (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)”

 1. చాలా బాగుంది అండి కథ నడిపిన విధానం🙏

 2. ఎదుట మనిషి బలహీనతే అవతల వ్యక్తికి బలం. అందరిలోనూ ముఖ్యంగా ఆడవారిలో క్షమా గుణం కొన్ని సార్లు వాళ్ళకే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఈ విషయాన్ని చక్కగా వివరించారు
  అభినందనలు

 3. క్షమా సమిధ శీర్షిక చాలా బాగుంది. కథకు తగిన శీర్షిక. ఒక్కొక్కసారి పాఠకులకు శీర్షిక చూసి, చదవాలనిపిస్తుంది.
  కథ చాలా బాగుంది.

 4. క్షమా సమిధ కధ చాలా సందేశాత్మకంగా సాగింది. ఆడ పిల్లలు మోస గాళ్ల విషయంలో ఎలా బోల్తా పడతారో వివరించిన ఉయ్యూరు అనసూయ గార్కి అభినందనలు.

 5. ‘క్షమా సమిధ’ అన్న పేరు చాలా బావుంది. కథా స్వరూపాన్ని సూచన ప్రాయంగా తెలియచేసింది. నామౌచిత్యం పూర్తిగా ఉన్న కథ. అయితే ప్రభు అన్న ప్రతీ మాటనీ అంత చక్కగా విశ్లేషించుకున్న ప్రణవి, అతని ప్రేమలో పీకల్లోతు మునిగిపోవడానికి ఇంకా బలమైన సంఘటనలు, కారణాలు చెప్పి ఉంటే ఈ కథ బహుమతి సాధించేది అని నా వ్యక్తిగత అభిప్రాయం. కథా కథనం చక్కగా ఉండి పూర్తిగా చదివించే గుణం ఉన్న మంచికథ.

  1. మీ ఆత్మీయ విశ్లేషణకు ధన్యవాదాలండీ

 6. ఒక విధంగా ఈ కథలో చెప్పిన విషయం ఒక హెచ్చరిక,. రచయిత్రికే మోసం గ్రహించడానికి టైం పడితే ఇక సామాన్యులు ఎలా ?..అన్న ఒక ఆలోచన కలుగజేసారు. 👏🏻👏🏻👏🏻

 7. Excellent story madam.. keep it up and expecting more good stories from you

 8. మగువ మానసిక సంక్షోభాన్ని, ఆమెలోని స్వల్ప బలహీనతను, మేల్కొని తీసుకున్న దృఢనిర్ణయాన్ని కథలో అద్భుతంగా ఆవిష్కరించారు రచయిత్రి గారు. చక్కని కథనంతో కథ ఆద్యంతం ఆకట్టుకుంది. అనసూయ గారికి అభినందనలు

 9. కథా శిల్పం చక్కగా ఉంది. ఎక్కడా అనవసర ప్రసంగం
  లేదు. కథను నడిపిన విదానం బావుంది. ప్రణవి
  చక్కటి డిశిషన్ తీసుకుంది. తన స్వతంత్ర, వ్యక్తిగత
  భావాలను ఎక్కడా అణచుకోక తనకు నచ్చినట్లు
  చేసింది.

 10. ఈ కథలో చెప్పినట్లే నేను కూడా మోసపోయాను. కానీ అతని గురించి నాకు తెలిసిపోయింది అని అతనికి అర్థమై నా మీద సెక్సువల్ అస్సాల్ట్ చేశాడు. అప్పటికే హృదయం నిండా ప్రేమ. దాని వలన నాకు అతనితో బంధం ఏర్పడింది. అతను నా మీద ఇంటెన్షనల్ గా ఇంటిమసీ కోసం ఎటాక్ చేశాడు. స్నేహితుడే కదా క్షమించాలి అనుకున్నా….

  1. మాటలు రావటం లేదండీ.
   ఇక అమాయకంగా వుండకండి. మనోధైర్యంతో ముందుకు సాగండి.

 11. క్షమయా ధరిత్రీ అన్న స్త్రీల సహజగుణానికి అద్దం పట్టిన కథ.చాలా హూందాగా సాగింది. శీర్షిక చాలా సృజనాత్మకంగా ఉంది. ఆలోచింపచేసింది. నెచ్చెలి లో కథ ప్రచురణ పొందడం బహుమతి తో సమానం.
  అనసూయ గారికి హృదయపూర్వక అభినందనలు.

  1. కథ చాలా సహజంగా ఉంది. కొన్ని సార్లు క్షమా గుణమే తప్పని పిస్తుంది. ఆలోచింపచేసే కథ.
   అనసూయ గారికి అభినందనలు.

Leave a Reply

Your email address will not be published.