కథా మధురం
ఆ‘పాత’ కథామృతం-17
” పరివర్తనము” -శ్రీమతి అలివేలు మంగతాయారు
-డా. సిహెచ్. సుశీల
సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యుల వారు పరదేవతను తన్మయత్వంతో కీర్తించారు. భక్తి తో అర్చించారు. ఆ “సౌందర్యం” కేవలం శారీరక సౌందర్యం కాదు. మాతృమూర్తి అన్న భావం. జ్ఞానప్రదాయిని అన్న భావం. ప్రబంధ కవులు కూడా ప్రబంధ నాయికను నఖశిఖ పర్యంతం వర్ణనలతో నింపివేశారు. ప్రబంధ లక్షణాల్లో ,’అష్టాదశ వర్ణనలు’ ఒకటి. ఇక్కడ ఈ వర్ణనలు కేవలం బాహ్య సౌందర్యమే. తర్వాతి కాలంలో అతివేలమైన శారీరక వర్ణనలు కళ్ళు మిరుమిట్లు గొలిపేలా కవులు వర్ణించారు. ఆధునిక యుగంలో ఆంగ్ల భాషా సాహిత్య ప్రభావం వల్ల “రొమాంటిజం” ప్రభావంతో భావ కవిత్వం తెలుగు కవులను ఆకర్షించింది. స్త్రీ బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యా నికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి నాయికలను అపురూపంగా వర్ణించడమే కాక స్త్రీకి పూజ్య స్థానం ఇచ్చి ‘ఊహా ప్రేయసి’ లను సృష్టించుకుని భావ కవిత్వ ధోరణిలో ఆధునిక కవులు అనేక కావ్యాలు రచించారు. ఏది ఏమైనా పురుషుని దృష్టిలో స్త్రీకి ‘వ్యక్తిత్వం’ కంటే ‘సౌందర్యమే’ ప్రధానమైనది అని తెలుస్తోంది. మిరుమిట్లు గొలిపే, మిలమిల మెరిసే మేని ఛాయ నుండి స్త్రీ అంగాంగ వర్ణనలతో, కేవలం భోగ వస్తువుగా పరిగణించి ఆ దృష్టితోనే చూశారు. క్రమంగా స్త్రీలలో కూడా పురుషుణ్ణి ఆకర్షించే అందమే నిజమైన అందమని, అది లేకపోతే తమ జీవితం వృధా అన్న అభిప్రాయం ఏర్పడిపోయింది. అందం లేని స్త్రీని కుటుంబం, సమాజం చిన్నచూపు చూడటం దౌర్భాగ్యమైన స్థితి అని చెప్పక తప్పదు. అదే ఇతివృత్తంగా “నాది ఆడజన్మే”, “ముక్కుపుడక”, “ఊర్వశి” వంటి సినిమాలు కూడా వచ్చాయి. నల్లటి మేని ఛాయగల స్త్రీ ని భర్త చిన్నచూపు చూడడం వీటిలోని కథాంశం.
అయితే శ్రీమతి అలివేలు మంగతాయారు నవంబర్ 1952 గృహలక్ష్మి పత్రికలో “పరివర్తనము” అనే కథ రాశారు. రమేషు భార్య విజయ. ఇంటి పనులలో నిపుణురాలు, మంచి ఆలోచనా పరురాలైనా మిత భాషణి. సౌందర్య విహీనురాలు అగుటచే భర్త కంటికి ఆనలేదు. రమేషు మద్రాసులో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. మంచి జీతం. అతడు కాలేజీలో చదువుకునే రోజుల్లో పెళ్లి గురించి, కాబోయే భార్య అందచందాల గురించి కలలు కన్నాడు. కానీ తల్లిదండ్రుల బలవంతం వల్ల నల్లటి రూపం గల విజయను వివాహమాడవవలసి వచ్చింది. పెళ్లయిన తర్వాత అత్తవారింటికి విజయ వచ్చింది. కానీ భర్త తాను ఉద్యోగం చేసే మద్రాసు కు తీసుకు వెళ్ళలేదు. అతనిలోని విముఖతను గమనించిన తండ్రి కోడలు విజయను, ఆమెకు తోడుగా తన మనవరాలు – కూతురు కూతురు కమలను కూడా మద్రాసు లో దిగ విడిచి వెళ్ళాడు. తన ఎదురుగా తిరుగుతున్న విజయ పట్ల అసహ్యంతో ఆమెను తప్పుకొని తిరిగేవాడు రమేషు. ఆమె అంటే అసహ్యంతో మాట్లాడేవాడు కూడా కాదు. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో మేనమామకు కావలసిన పనులు కమలే చేస్తుండేది. అక్క కూతురు పట్ల అతనికి వాత్సల్యం మెండు.
భర్త పై అనురాగంతో విజయ అతనికి పనులు చేయ ప్రయత్నించినా అతడు లెక్క చేయలేదు. అతని అనురాగాన్ని పొందలేకపోతున్నాను అని ఆమె నిరంతరం కృంగి పోతుండేది. ఒకరోజు కమలకు జ్వరం వచ్చింది. రోజు ఆమె తెచ్చి ఇచ్చే టీ ని విజయ తీసుకొని వచ్చింది. అతడు చిరాకు పడ్డాడు. కమలకు జ్వరం అని చెప్పడంతో కలవర పడ్డాడు. మాట్లాడుతున్న విజయ ముఖమైన చూడకుండా కమల దగ్గరకు వెళ్ళాడు. ఆమె జ్వర తీవ్రత వల్ల స్పృహ లేకుండా ఉన్నది. దాంతో అతను అక్కకి ఏం సమాధానం చెప్పాలి అని భయపడ్డాడు. డాక్టర్ని పిలిపించడానికి తగినంత డబ్బు చేతిలో లేదు. నిస్సహాయంగా ఊరంతా తిరిగి రాత్రి ఇంటికి వచ్చాడు.
మేజా బల్లమీద ఉత్తరం ఉంది. ‘తనకు తండ్రి ఇచ్చిన 30 రూపాయలు ఉంచు తున్నానని డాక్టర్ను పిలుచుకొని రమ్మని’ విజయ రాసిన ఉత్తరం అది. మొదటిసారిగా ఆమె ఉదాత్త స్వభావానికి రమేష్ లో సదాభిప్రాయం ఏర్పడింది. ఎదుటి వ్యక్తి ఆపదలో ఉంటే చలించే ఆమె మనసుకు, సహాయం చేయాలని తపించే ఆమె దయ, కరుణ స్వభావానికి అతనిలో ఆమె పట్ల ఉన్న ఏహ్యభావము తగ్గనారంభించినది. కమలకు జ్వరం ఎక్కువైంది. రమేషు డాక్టర్ని తీసుకొని రాగా అతను మందులు ఇచ్చి వెళ్ళాడు. కమల మాటా పలుకు లేకుండా పడి ఉండటం చూచి విజయ దుఃఖంతో ఏడుస్తూ అతని కాళ్లు పట్టుకొని ‘కమల తల్లి గారికి వైరు ఇవ్వండి’ అని కోరింది. అతను ఏమి మాట్లాడక పోవటంతో కురూపి అయిన తను కోరటం వల్ల తన పట్ల ఉదాసీనత ను కమల పై చూపించవద్దని కోరింది. అతనేమీ మాట్లాడకపోవటంతో “మీరు నేను అందంగా లేనందు వల్ల తోసివేయుచున్నారు. మీకు దీనికి స్వతంత్రం ఉన్నది. కానీ స్త్రీ కురూపి యగుటకు ఆమెయా కారణం ? నేను చనిపోయిన తర్వాత ఆ ఈశ్వరుని అడిగెదను నాకెందుకు అందము ఇవ్వలేదని. ఒక అందమైన స్త్రీ కురూపి యైన పతిని ఈ మాదిరిగా చేస్తే సంఘము ఆమెను కులట అంటుంది. కానీ కురూపి స్త్రీ మీద పురుషుని నిర్ధయలను చూచి చెప్పేవారు ఎవరూ లేరు. ఈ మాటలు పోనీయండి. నేను చనిపోయిన తర్వాత మీరు అందమైన కన్యను వివాహం చేసుకోండి” అన్నది ఏడుస్తూ.
ఆమె ఒక్కొక్క మాట అతని చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నది. ఆ రాత్రి నిద్రలో అతనికి విజయ సముద్రంలోకి దూకినట్లు, తాను పట్టుకోబోతుండగా అలలు ఆమెను లోపలికి లాగుకొని పోయినట్లు అనిపించింది. చెమటతో తడిసిపోయి అతనికి మెలుకువ వచ్చింది. ఒకవేళ అలా జరిగితే ఆమె మరణానికి తను మూల కారణమౌతాడని పశ్చాత్తాప పడ్డాడు. తన మూర్ఖత్వం తెలుసుకున్నాడు. నిద్రలేచి గబగబా వారి గదిలోకి వెళ్ళాడు. కమలకు జ్వరం తగ్గిందని ఆనందంతో విజయ ముఖం కళకళలాడుతోంది. అప్పుడు ఆమె అనాకారిగా కనిపించలేదు. ఆమె వ్యక్తిత్వం ఆమె అంతః సౌందర్యం ఆమె ముఖం మీద ఒక నిజమైన కాంతిగా ప్రజ్వరిల్లుతున్నది. తన నడవడిక వల్ల ఆమె కు కలిగిన దుఃఖానికి మనస్పూర్తిగా క్షమాపణ వేడాడు రమేష్. “విజయ! నన్ను క్షమించు. ఇన్ని రోజులు నేను నిన్ను తెలుసుకోలేకపోయాను. బాహ్య సౌందర్యం చుట్టూ నేను తిరుగు తున్నాను. ఈరోజున నేను నీ యొక్క సౌందర్యాన్ని చూడగలిగితిని” అన్నాడు. అతని లోని “పరివర్తనము”నకు ఆమె ఆశ్చర్య పోయినది. ఆనంద భాష్పములు రాలినవి. కళ్ళు తెరిచిన కమల మామ అత్తలను చూసి సంతోషపడింది.
ఈ కథ కేవలం స్త్రీ బాహ్య సౌందర్యం చుట్టూ తిరిగింది. ఈ రోజుల్లో ఈ కథ పూర్తిగా అసంబద్ధంగా ఉన్నదని అనుకోక తప్పదు. కానీ ఆ కాలపు అభిప్రాయాలు, నమ్మకాలు అవి. స్త్రీలు పెద్దగా చదువుకోని, ఉద్యోగము చేస్తూ తమకాళ్ళపై తాము నిలబడలేని రోజుల్లో, వంటింటికి పడకటింటికి మాత్రమే పరిమితమైన ఆ రోజుల్లో, పురుషుడు తన భార్య మంచి కుటుంబం నుండి రావాలని, అందచందాలతో ఉండాలని కోరుకునేవాడు. ఒకరకంగా అది మూర్ఖత్వము అని ఈనాడు మనకు స్పష్టంగా తెలుసు. కానీ మరో విషయం మనం గమనించాలి. ఈ ఆధునిక యుగంలో, స్త్రీ అన్ని రంగాల్లో దూసుకు పోతున్నా ఇంకా “సౌందర్య పోటీలు” జరగటం మనం చూస్తూనే ఉన్నాం. కొన్ని “కొలతల” ప్రకారం ఆమె శరీరానికి అందం ఆపాదించి “బ్యూటీ క్వీన్” గా నిర్ధారిస్తున్న సందర్భాలు ఉన్నాయి. పిచ్చి తగ్గింది తలకు రోకలి చుట్టండి అన్నట్టు ఉంది ఈ వ్యవహారం. సౌందర్య సాధనాల వస్తూత్పత్తి కోసం కొన్ని వ్యాపార సంస్థలే ఈ అందాల పోటీలను నిర్వహిస్తున్నాయి. ఎందరు స్త్రీలు దీనిని వ్యతిరేకించినా, నిరసనలు తెలియజేస్తూ ధర్నాలు చేసినా ఈనాడే మనం వీటిని నివారించలేకపోతున్నాం. ఆయా సంస్థల యాజమాన్యం, అధినేతలు, నిర్వాహకులు అందరూ పురుషులే. వారి దృష్టి ఆమె అంగసౌష్టవంపై, అందంపైనే ఉంటుంది. చివరిలో ఏవో కొన్ని ప్రశ్నలు అడిగి పైపై తంతుగా ముగిస్తారు. అది మసిబూసి మారేడు కాయ చేయడమే. నిజానికి “సౌందర్యం” అనేది చూసే కళ్ళను బట్టి ఉంటుంది. “కష్టజీవి శ్రమ”లో సౌందర్యాన్ని “శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేద”ని కీర్తించారు శ్రీశ్రీ. దయ, కరుణ, సేవలో సౌందర్యాన్ని గుర్తించి “మదర్ థెరీసా ” ను సౌందర్యరాశి గా భావించారు పాపినేని శివశంకర్.
అయితే, స్త్రీలలో కూడా కొందరు చర్మ సౌందర్యం కోసం, కేశ పోషణ కోసం అర్రులు చాచటం ఈ రోజుల్లో మరీ ఎక్కువైంది. ముఖంపై ఒక్క మొటిమ వస్తే డెర్మటాలజిస్ట్ దగ్గరికి పరిగెత్తే అమ్మాయిలు, కుంగిపోయే టీనేజ్ గర్ల్స్ ఉన్నారు. కానీ స్త్రీ బాహ్య సౌందర్యం ముఖ్యం కాదని రమేష్ లాంటి పాత్రను సృష్టించి అతనిలో “పరివర్తనము” వచ్చి, భార్య అంతః సౌందర్యాన్ని గుర్తించే పరిష్కారం చూపించిన ఆనాటి రచయిత్రి శ్రీమతి మంగతాయారు అభినందనీయురాలే కదా!
*****
వచ్చే నెల మరో ఆ’పాత’ కథామృతంతో కలుద్దాం