నిరంతర యాత్రికుడు: ఒక అంతరంగ అన్వేషణ

-వి.విజయకుమార్

(కే వి వి ఎస్ మూర్తి గారి నిరంతర యాత్రికుడు నవలపై చిరు పరామర్శ)

 

          ఏ మనిషి జీవితం అయినా ఒక నిరంతర ప్రయాణం. ఆటుపోటుల్లేని సముద్రాన్ని ఎలా ఊహించుకోలేమో సుఖ దుఃఖాలు లేని జీవితం కూడా ఊహకందని విషయం. 

          సంతోషమూ, విషాదమూ రెండూ పడుగు పేకల్లా కలగలిసిన జీవితమనే కాన్వాస్ మీద వెలుగులే కాదు నీడలు సైతం తారట్లాడుతూ ఉంటాయి. ప్రతీ జీవితం వర్ణ వివర్ణాల సమ్మిళితం.

          నిరంతర యాత్రికుడు వైయక్తిక అనుభూతుల పరంపర. ఎదురైన జీవితాన్ని తనకే సొంతమైన మార్మిక అనుభూతుల్ని, విభ్రమకొల్పే విచిత్రానుభూతుల్ని అర్థ శతాబ్దపు జీవిత పుటల్లో మరుగున పడిపోయి, అంతర్లీనంగా మిగిలి, వెలికి వస్తే తప్ప శాంతించని మిస్టిక్ అనుభూతుల్ని బ్లెండ్ చేసి అన్వేషణ కొనసాగించిన ఈ నవల చదువుతున్నంత సేపూ వెంట తీసుకు వెళుతుంది. 

          ఇంద్రియానుభూతులు వ్యక్తి చైతన్యంలో నిద్రాణంగా ఉంటాయి. పరిసరాల సంఘర్షణతో అవి భేటీ అయినప్పుడు చైతన్యపు ఉపరితలంలోకి వెల్లువెత్తి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నప్పుడు నచ్చిన శిల్పాన్ని వెతుకుని పదంగానో, పాదంగానో, గళంగానో, గానంగానో ఆకృతి పొందటం అత్యవసరం. ఇందులో రచయితపడే తాపత్రయం అంతా తన చుట్టూ చిక్కగా పేరుకుపోయిన జీవన సంఘర్షణను వైవిధ్య భరితంగా, ఆలోచనాత్మకంగా నవలా రూపంలో చిత్రీకరించడమే. దాంట్లో ఈ రచయిత విజయం సాధించారనే చెప్పాలి.

          మూర్తి గారి జీవన ప్రయాణం జేమ్స్ జాయిస్ స్ట్రీమ్ ఆఫ్ కాన్షస్నెస్ ప్రక్రియలో మనోవీధుల్లోకి అంతర్ముఖుడై చేసే అన్వేషణలా ఉంటుంది. అదే సమయంలో వర్డ్స్ వర్త్ ప్రాకృతిక బాంధవ్యపు స్పిరిట్ చెట్టులోనూ, పుట్టలోనూ, పాములోనూ, పడగలోనూ అనిర్వచనీయమైన తాత్వికాన్వేషణలో వెంటాడుతున్న భావన కలిగిస్తుంది. ఎక్కడో పుట్టి, ఇక్కడికొచ్చి, మాతృభూమికి దూరంగా, ఈ రాతి తుప్పల మధ్య నిశ్శబ్దంగా ఎవరికి పట్టని సమాధుల్లో దాగిన ఎముకల మూలుగుల్లో జీవిక తాలూకూ ఆనవాళ్ళను ఒక డీ ఎన్ యే శాస్త్రవేత్త, శిలాజాల్లో మిగిలిన జీవపు కూజాడ వెతుక్కున్నట్టు, మూర్తి గారి అన్వేషణ కొనసాగుతుంది.

          ఎలిగారికల్ చూస్తే ఇదొక అంతః శోధన. మనోవల్మీకంలోకి జ్యూల్స్ వెర్న్ అరౌండ్ ది వరల్డ్  ప్రయాణం. భూగర్భంలో తప్పిపోయిన ఎలిస్ ఇన్ వండర్ లాండ్ సంభ్రమం. దండకారణ్యాల గంభీరమైన అటవీ సహచర్యంలో థోరో ఒంటరితనపు అన్వేషణ కనిపిస్తే, గోదారి గట్టులెంట ఆధ్యాత్మిక గురు సాహచర్యంలో ఈ చిత్తభ్రమల వెనుక ఒక తాత్విక పరవశం సైతం అంతర్లీనంగా దోబూచులాడుతుంది. పోగొట్టుకున్నదేదో వెతుక్కోవడం, విఫలయత్నాల్లో మిగిలిన జీవితం తాలూకూ పొరలని ఒక్కొక్కటిగా విప్పి హృదయాన్ని ఆవిష్కరింప చేసుకోవడం.

          ఒక యాత్రికుడిగా, ఒక పరివ్రాజకుడిగా, నిరంతర అన్వేషిగా ఫీల్డా ప్యాలెస్, కాళీఘాట్, బేలూరి మఠం, కన్యాకుమారి సముద్ర ప్రాంతాల తాత్విక అన్వేషణకు విస్తృతమైన నేపథ్యాన్ని ఈ నవల్లో అల్లుకున్న విధానం బావుంది. నవల అంటేనే అనుభవాలను విస్తృతంగా, ఎంచుకున్న కాన్వాస్ అంచుల్ని మించి, పొంగి ప్రవహించాల్సిన వర్ణ శోభిత ప్రవాహ గతి. దుమ్ముగూడెం పరిసరాల్లో, ప్రకృతితో పెనవేసుకున్న ఈ అనుభవాలన్నీ మరింత రమణీయంగా, అవధులు మరచిన సముద్రపుటలల్లా, చెలియలి కట్టలు దాటాల్సిన సందర్భాలు చాలానే ఉన్నాయని పిస్తుంది. నవలా శిల్పంలో అతి ముఖ్యమైన ఈ విస్తృత ప్రవాహ గతిని అనేక సందర్భాల్లో రచయిత అడ్డుకట్ట వేస్తూ వచ్చారేమో అనిపించింది. 

          ఈ నవలలో జనార్ధన్, కట్టా సుబ్బారావు, గాంజా రవాణా చేసే వాళ్ళతో పాటూ ఇంకా అనేక పాత్రల్ని కాన్వాస్ పైకి చిత్రించాల్సిన సందర్భాలు మిస్సయినట్లు అనిపిస్తుంది. 

          ఆత్మకథకూ, డాక్యుమెంటరీకీ, ట్రావెలాగ్ కీ, నవలికకూ, నవలకూ మధ్య శిల్పరీత్యా వైవిధ్యాలు అనేకం. కథనంలో అనేకసార్లు ఒకదానికొకటి పోటీ పడుతూ ఈ రచన సాగినప్పటికీ, కొన్ని సందర్భాల్లో స్పష్టత కొరవడ్డదేమో అనిపిస్తుంది. 

          ఈ నవల్లో పారమార్థిక అనుభవాలు, అనుభూతులు, వైయక్తిక చిత్తభ్రమలు, ఆధ్యాత్మిక అనుభవాల పరవశాలు, ఇంద్రియాలకు అగోచరమైన విచిత్రానుభవాలు, భౌతిక దృక్పథాన్ని సవాలు చేసే విధంగా వుండడమూ చూస్తాం. బహుశా ఇటువంటి మార్మిక విషయాలనూ, అతీంద్రియ భావనలను భౌతిక వాద దృక్పధాన్ని కలిగి వుండే చదువరి ఎవరైనా సందేహించి సరిగ్గా కనక్ట్ కాలేకపోవడం కూడా వుండొచ్చు.

          నవలగా సామాజిక జీవితాన్ని ప్రతిఫలించినా, ప్రధానంగా రచయిత వైయక్తిక అనుభవాల చుట్టూ తిరుగుతూ వుండడమూ,  కొన్ని అలౌకిక అనుభవాలను ప్రస్తావించ డమూ వుండటం మూలంగా ఇది యే పాఠకలోకాన్ని అలరిస్తుందన్నది వారి విచక్షణ పై ఆధారపడుతుంది. మొత్తంగా చూసినప్పుడు రచయిత తన ఆత్మ కథాంశాలను నవలా రూపంలో విజయవంతంగా చిత్రీకరించడంలో సాఫల్యం చెందినందుకు మూర్తి గారికి అభినందనలు. 

          ఈ నవల కాపీ కావలసిన వాళ్ళు స్వయంగా వారి మొబైల్ నెంబర్ కు (7893541003) కాల్ చేసి తెప్పించుకోవచ్చు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.