బంధం

(నెచ్చెలి-2024 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ)

-ఎస్. లలిత

          “అవమానం, ఆకలి, వేదన, నిస్సహాయత, దుఃఖం- పతనానికి ఇవన్నీ సోపానాలు. దిగితే క్రిందకు వెళతాం! ఎక్కితే పైకి వెళతాం… చిత్రం ఏమిటంటే దిగేవాళ్ళే  ఎక్కువవు తున్నారు..” అన్నాను నేను మిత్రుడు విశ్వనాథంతో…

          “ఎవరి గురించి నీవు చెప్పేది… నీవు గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్ వి. తాత, తండ్రులు సంపాదించిన ఆస్తి ఉంది. మా చెల్లి కూడా ఎం.ఎస్సీ, బీఈడీ చేసింది. టీచర్ ఉద్యోగం వచ్చినా కుటుంబం కోసం కాదనుకుంది.. ఒక్కర్తే కూతురు.. పెళ్ళి చేసేసావు… ఎక్కడో అమెరికాలో ఉంది.. కనుక పైకి, దిగువకు అనేది నీకు తెలియదు.. జాలి తప్ప” అన్నాడు విశ్వనాథం నవ్వుతూ…

          “నీకేమైంది… నీది కూడా నాలాంటి జీవితమే కదా.. మన మధ్య స్నేహానికి నాలుగు దశాబ్దాల కాలముంది.. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా…” అన్నాను.

          ఈ రోజు మా కాలేజీలో అకడమిక్ ఆడిట్ ఉంది.. తొందరగా వెళ్ళాలి.. అన్నీ సర్దుకునే ఉన్నాను.. ఈలోగా ఇదిగో మిత్రుడు విశ్వనాథం వాడి మనవరాలు గురించి మాట్లాడడానికి వచ్చాడు.. వాచీ చూసుకున్నాను.. ఉదయం.. ఎనిమిదయింది.. ఫర్వాలేదు.. మరో గంటన్నర సమయముంది.

          “ఇంతకీ… ఈ అవమానం, ఆకలి… డైలాగ్ ఎవరి కోసం నాయనా.. మీ కాలేజీలో మధుమిత కోసమేనా… మగాడు ప్రక్కన లేకపోతే… పూట గడవదట కదా…” అన్నాడు విశ్వనాథం.. ‘ప్రక్క’ అనే పదం మీద వత్తి పలుకుతూ…

          “ఆమెది కాంట్రాక్ట్ పోస్ట్… షోకులెక్కువ.. ఆదాయం తక్కువ, భర్త చనిపోయాడు. చంపేసిందనే అనుకుంటారు… ఒక్కగానొక్క కొడుకు డిగ్రీ చదువుతున్నాడు.. కులమే మిటో నాకు తెలియదులే.. తెల్లగా ఉంటుంది.. ఇంకా..” ఇంతలో మా ఆవిడ క్యారేజ్ తో వచ్చింది..

          బయలుదేరదామనుకున్నాము.. ఇద్దరం..

          ఒక పాపను ఎత్తుకొని.. ఓ మధ్య వయసు స్త్రీ “శంకరం మాష్టారిల్లు ఇదేనా..” అని అడుగుతున్నది గుమ్మంలో నుంచి.

          “ఇదేనమ్మా… నేనే ఆ శంకరం మాష్టారిని.. నువ్వెవరమ్మా… దామ్మా లోపలికి వచ్చి చెప్పు ఏం కావాలో..” మళ్ళీ ఇద్దరం కూర్చున్నాం… సమయం తొమ్మిది కావస్తున్నది…

          “నీవు.. రామనాథం మేస్త్రి దగ్గర పనిచేసేదానవు కదా..” అన్నాడు విశ్వనాథం.. అతని మాటల్లో నీ గురించి “నాకు  తెలుసులే” అనే సూచనుంది. ఆమె మౌనంగా నిలుచుంది.. చంకలో రెండేళ్ళ బాబు.. బహుశా ఉండవచ్చు.

          ఆమె.. వయసు నాలుగు పదులు దాటి ఉండవచ్చు. చామనఛాయ.. చర్మ సంరక్షణ లేక శరీరం శుష్కించి ఉన్నా, కళ్ళల్లో కాంతి ఉంది. ముఖం కళగా ఉంది.. నిద్రలేమి, భయం వలన కళ్ళు కింద నల్లని చారలు.. జీవితానుభావ పాఠాల సారాంశంను చెబు తున్న నుదుటి మీద గీతలు… వెలిసిన వాయిల్ చీర.. లోతుకుపోయిన బుగ్గలు.. చంకలో బాబుతో.. కళ్ళలో భయంతో.. ఆమె అలా నిలుచుండి పోయింది.. ఇంతలో.. నా భార్య వస్తూ..

          “ఏమండీ.. ఆ పనిమనిషికి ఫోన్ చేయండి.. రెండు రోజులుగా రాలేదు.. పండగ వస్తున్నది.. పాప అల్లుడు రావచ్చు. చేయవలసిన చాలా ఉన్నాయి..” అని వచ్చి.. ఆమెను చూసి ఆగి.. ‘ఎవరీమె’.. అన్నట్టుగా చూసింది..

          నేనేమీ చెప్పలేదు.. నాకు తెలియదుగా.. వాచి చూసుకున్నాను.. సమయం తొమ్మిదింపావు.. అమ్మో.. “ఆమె ఎవరో తెలియదు.. నా కోసం వచ్చిందట.. కాస్త కనుక్కో..” అని చెప్పి ఆమె వైపు తిరిగి “అమ్మ.. ఈమె నా ఇంటి హోమ్ మినిస్టర్.. నా గురించి ఏమైనా నీకు కావాలంటే ఆమెను అడుగు.. నాకు కాలేజీలో పని ఉంది.. పదరా…” అని ఇద్దరం బయటకు బయలుదేరాం.. ఇతరుల నుంచి తమకు కావాల్సింది అధికారంతో ఆత్మవిశ్వాసంతో తీసుకోగలిగిన వారే అంత నిస్వార్థంతో అంతే సంతోషంతో ఇతరుల కివ్వగలరు. ఇందుకు నా భార్య మినహాయింపు కాదు..

***

          సాయంత్రం ఆరైంది… మా కాలేజీలో ఆడిట్ ముగిసింది. ఇది ప్రతి సంవత్సరం రొటీన్ గా జరిగే తంతే.. నా ముందు ఆటో ఆగింది. నేను.. విశ్వనాథం ఎక్కాము.. ఆటో డ్రైవర్ చక్రవర్తి నాకు బాగా తెలుసు.. అతని తండ్రి ఇదే ఆటోలో మా పాపను బడి దశ నుండి కాలేజీ దశ వరకు తీసుకువెళ్ళాడు.. ఆక్సిడెంట్ లో చనిపోయాడు.. ఇద్దరు కొడుకుల్లో ఒకడికి బ్యాంకు జాబ్ వచ్చి… ప్రేమించిన అమ్మాయితో.. రెండు గదుల ఇంట్లో ఉండలేక తన దారి తాను చూసుకున్నాడు..” పిల్లల్ని ప్రేమించే ప్రయత్నం తప్పు కాదు.. వారు తిరిగి ఆ ప్రేమను ఇవ్వాలనే నిబంధన మహా పాపం” అనే ఖలీల్ జిబ్రాన్ మాటలు ఎంతవరకు నిజమో తెలుసుకునే తండ్రి లేడు.. తల్లికి చదువు లేదు.. ఉన్న ఒక తమ్ముడు తల్లిని ఎలా బ్రతికిస్తాడు అనే ప్రేమ పెద్ద కొడుకుకు రాలేదు.. ఇంజనీరింగ్ చదువుకున్న చక్రవర్తి నా కోసం ఆటో డ్రైవరయాడు.. నన్ను ఉదయం కాలేజీలో దింపేసి.. తను అదే ఆటో వేసుకొని సాయంత్రం వరకు సర్వీస్ చేసుకొని.. నా కోసం వస్తాడు.. అతనికి మూడు పదులు దాటాయి.. తోడు అవసరం.. కానీ.. ఎవరు పిల్లనిస్తారు.. వ్యసనాలు లేవు.. ఆటోకి డబ్బులు నేనే ఇచ్చాను.. అప్పు తీర్చేసాడు.. సొంత ఆటో యజమాని.. కానీ.. ఎవరికి కావాలి ఇవన్నీ.. ఇప్పటి ఆడపిల్లలకు.. ఏం కావాలో ‘వారికే  తెలియదు..’ మేమిద్దరం మౌనంగా ఉన్నాము.. ఆమె ఎవరు? నా కోసం ఎందుకు వచ్చింది.. ఇంటికి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయి.. నన్ను ఇంటి దగ్గర దింపేసి, విశ్వనాథంను తీసుకుని చక్రవర్తి ఆటో వెళ్ళిపోయింది.. నేను ఇంట్లోకి వెళ్ళాను..

***

          నన్ను చూడగానే.. ఉదయం నా కోసం వచ్చినామే ప్రక్కకు వెళ్ళిపోయింది.. మా ఆవిడ తనకున్న పాత చీరల్లో ఒకటిచ్చినట్టుంది. చీరలో ఆమె కడిగిన ముత్యంలా ఉంది.. నేను నా గదిలోకి వెళ్ళిపోయాను..

          అరగంట తర్వాత.. నా భార్య టీ గ్లాస్ తో వచ్చింది..

          “ఇంతకీ ఎవరామె.. ఎందుకొచ్చింది” అడిగాను.. టీ తాగుతూ.. వేసవి.. సాయంత్రం.. ఆరున్నర కావస్తున్నది.. నా భార్య చాలా రిలాక్స్డ్ గా ఉంది.. “పనులన్నీ తనకి అప్పగిం చేసాను.. మరి పనిమనిషి అవసరం లేదు. తను ఇక్కడే ఉంటుంది.”

          గదిలో ఏ.సీ.. చల్లగా ఉంది.. ఆమె హృదయం కూడా.. కానీ.. నా భార్య అంత అమాయకురాలు అయితే కాదని నాకు తెలుసు.. బహుశా వచ్చినామె గురించి పూర్తిగా ఎంక్వయిరీ చేసి ఉంటుంది. ‘ఇంతకీ ఏమిటామే కథ’  అన్నాను ఆసక్తితో.. ఆమె మెల్లగా చెప్పడం ప్రారంభించింది..

***

          “ఏమే.. రాజి.. నా దగ్గర జాయినయ్యి రెండు నెలలు కావస్తున్నది. ప్రతిరోజు నీకు పనిస్తున్నాను. ఎందుకో తెలుసా.. నీ బాబుని చూసి.. నీ లేచిపోయిన మొగుడిని చూసి కాదు. నిన్ను.. చూసి..” ఆమెను ఎగాదిగా చూస్తూ అన్నాడు పెద్ద మేస్త్రి రామనాథం..

          “అది కాదు.. బాబు.. నువ్వు దేవుడివే.. నేను కాదనను. అయినా.. నీ దగ్గరకు, ఎందరో వస్తున్నారు.. నేను చూస్తున్నాను.. నేను కూడా ఎందుకని.. కొద్దికాలం ఓపికపట్టయ్య.. ఈ పని కాక.. నీ దగ్గరకు రాక ఎక్కడికి పోతాను” రాజేశ్వరి మాటలు ఆమె గుండెలో మంటలు.. కళ్ళలో ఇంకిన కన్నీళ్ళు దూరంగా.. ఉయ్యాల్లో బాబు.. భవిష్యత్తు లేని ప్రశ్నార్ధకమైన జీవితం.. ఎలా.. ఏం చేయాలి.. ఈ మేస్త్రీకి పెళ్ళాం పిల్లలు ఉన్నారు. ‘అందరూ కావాలి..’ నాతో కూడా.. ఏదో పని మిషతో నా దగ్గరకు వచ్చి.. శరీరాన్ని తాకుతూ.. అప్పుడప్పుడు.. భోజనం ప్యాకెట్స్, బాబుకు పాల ప్యాకెట్స్ కొంటాడు.. వాటి అర్థం ‘తనకు’ తెలుసు..

          ఒకరోజు.. రాత్రి.. మేస్త్రి బాగా తాగి.. ఆమె ఉంటున్న పూరింట్లోకి వచ్చేసాడు..

          ఆమె బాబుతో… బయటకు వచ్చేసింది.. కానీ.. ఆ రాత్రివేళ.. ఎంతమంది.. ఆ తరహా ‘మేస్త్రీ’ల నుంచి తనను తానుగా కాపాడుకొందో..!?

          నా భార్య చెప్పటం ఆపింది. మా మధ్య క్షణం.. మౌనం..

          ‘మనసు ఆర్ధ్రమయినప్పుడు మౌనమే మాట్లాడుతుందని’ ఎక్కడో చదివిన వాక్యం గుర్తుకు వచ్చింది.

          ‘అవును.. మనమెంత కాలం.. ఆమెను..” అన్నాను. “మనకో పనిమనిషి కావాలి.. ఆమెకు తాత్కాలిక ఆసరా కావాలి.. రానున్నది పండుగ.. పిల్లలు వస్తారు.. నాకు తోడు కావాలి.. రాజేశ్వరి.. చక్కగా అల్లుకుపోతున్నది.. పిల్లాడు మంచివాడే అల్లరి చేయకుండా ఆడుకుంటున్నాడు.. ప్రస్తుతం అవనియ్యండి.. తర్వాత చూద్దాం..” అంది.. ఆమెకు.. రాజేశ్వరి నచ్చినట్టుంది..

          “ఇంతకీ ఆమె ఎక్కడ ఉంటుంది..” అన్నాను ప్రశ్నార్థకంగా..

          “పాప గదిలో.. క్రింద పడుకుంటానని చెప్పింది.. పాప వస్తే.. మెయిన్ హాల్లో పడుకుంటానంది.. తనను పంపవద్దని ఏడ్చింది..” చెబుతున్న నా భార్య గొంతు ఆర్ధ్రమవ్వటం నేను గుర్తించాను.. “సరే.. నీ ఇష్టం.. అదేదో నువ్వే చూసుకో.. ఒకే..నా..” అన్నాను.. “గుడ్ బోయ్..” అని లేచి.. టీ గ్లాస్ తీసుకుని.. నా బుగ్గ మీద ముద్దు పెట్టి, నవ్వుతూ వెళ్ళింది.. అంటే.. ఆమె.. చెప్పలేని ఆనందంలో ఉందన్నమాట..

          పండగ వెళ్ళిపోయింది.. పాప కూడా రాజేశ్వరితోను, బాబుతోను తిరగటం, అక్క అక్క అని మా పాప ఆమెను పిలవడం నాకర్థమయ్యాయి.. నాతోనూ.. ఎంతవరకు అంతవరకే ఉంటున్నది.. బాబు మెల్లగా నడుస్తున్నాడు.. పాప అల్లుడు వెళ్ళిపోయే ముందు ఆమె చేతిలో చీర, జాకెట్టు, కొంత డబ్బు పెట్టారు.. వారి మధ్య స్నేహం నాకు అర్థమైంది.. రాజేశ్వరి.. మునుపటికన్నా బాగా తయారయింది. గౌరవంగా ఉంటుంది. నా భార్య ఆమెకు కొన్ని మేనర్స్ నేర్పింది. ఆరు నెలలు.. సజావుగా గడిచాయి.. ఓ రోజు బయలుదేరుతుంటే నా భార్య నా దగ్గరకు వచ్చింది..

          “ఆమె, ఈ రోజు వరకు నయాపైస తీసుకోలేదు. పాప అల్లుడి ఇచ్చిన డబ్బులు కూడా నా దగ్గరే ఉంచేసింది. అడిగితే అన్ని మీరే ఇస్తున్నారు. నాకెందుకు డబ్బులు అంటుంది. ఆమె మనసులో ఏముందో అడగండి..” అంది..

          “సరే.. రేపు ఆదివారం.. ఇంటి దగ్గరే ఉంటాను కదా.. అడుగుదాం..” అని..  బయలు దేరాను..

          ఆ రోజు.. క్యాంటీన్లో విశ్వనాథం.. మధుమిత నా దగ్గరకు వచ్చారు..

          “మాస్టారు.. ఎవరో.. ఒకామె… ఆరు నెలలుగా మీ ఇంట్లోనే ఉంటుందట.. ఏమిటో.. ఎందుకో..” అంది.. వ్యంగ్యంగా మధుమిత..

          స్త్రీలు ద్రవపదార్థంలా ఏ పాత్రలో పోస్తే ఆ ఆకారం ధరించడం వింతేమీ కాదు.. మధుమిత.. అటువంటిదే.. ఆమె కథలు నాకు తెలియనిది కాదు.. “రేపు ఆదివారం మీ ఇద్దరూ మా ఇంటికి రండి మా ఆవిడ కూడా ఉంటుంది ఆమె చెబుతుంది. ఏమిటో.. ఎందుకో..” అన్నాను ఆమె అన్న ధోరణితోనె మధుమిత విసవిసా వెళ్ళిపోయింది.. నేను విశ్వనాథంతో.. టీ తాగుతూ..

          “మధుమిత ఎటువంటిదో నీకు తెలుసు. పిల్లాడి హాస్టల్లో పడేసి.. ఇక్కడెవరో కలెక్టరేట్లో పని చేస్తున్నవాడితో తిరుగుతున్నదని అందరికీ తెలుసు.. నువ్వు కూడా ఆమెతో కలిసి.. తిరిగితే.. ఎలా.. నీకో విషయం చెప్పనా.. మన స్త్రీల మీద మనకి ఎంతో చిన్నచూపు.. మధుమిత గురించి మనం ఇలా మాట్లాడుకోవడం కూడా తప్పే.. రేపు ఆదివారం ఆమెను తీసుకువచ్చే బాధ్యత నీదే సుమ.. తనకి చెబుతాను మీరిద్దరూ వస్తారని” అన్నాను.. ఇద్దరం లేచాం.. నాలుగడుగులు వేశాక.. ‘బహుశా ఆమె రాక పోవచ్చు..’ అన్నాడు. విశ్వనాథం సాలోచనగా నా వైపు చూస్తూ..

          ‘ అవునా.. సరే..’ అన్నాను.. ముక్తసరిగా

***

          ఆ రాత్రి పదిగంటల సమయంలో…

          “ఈ మధ్య అన్ని పనులు.. అంటే బజారు పనులు కూడా రాజేశ్వరం మీదనే పడేస్తున్నావు. ఒళ్ళు పెరిగి.. వందకేజీలు అయిపోగలవు చూడు..” అన్నాను నా భార్యతో సరదాగా..

          “ఆ ఇబ్బంది లేదులెండి.. అమ్మా.. నేను వచ్చి దాదాపు ఆరేడు నెలలు కావస్తు న్నది.. ఇంకెన్నాళ్ళు మీ ఇంట్లో.. అయినా.. నాకు మీరు దేవుళ్ళు.. మిమ్మల్ని వదులు కోను.. వదలను.. కానీ.. ఇలా.. మీ ఇంట్లో ఉండటం వలన.. పదిమంది.. పది రకాలుగా.. ముఖ్యంగా బాబు గారి గురించి.. నాకు ఏడుపు వస్తున్నదని ఏడ్చింది ఏం చెప్పమం టారు.” అంది నెమ్మదిగా.

          “అవును.. మా కాలేజీలో విశ్వనాథం, మధుమిత అని ఓ లెక్చరర్ క్యాంటీన్లో ఇదే ప్రశ్న వేశారు..” అన్నాను.

          “ ఏంటి విశ్వనాథం అన్నయ్య అలాగన్నాడా..” అంది ఆశ్చర్యంగా..

          “అతడనలేదు.. ధైర్యం కోసం.. అతనిని మధుమిత వెంట తెచ్చుకుంది.. ఆమె అన్నది.. అతడు విని ఊ..రు..కు..న్నా..డు”

          ఆమె ఏదో అడగబోయింది.. ‘వదిలేయ్.. ఎవరిని తప్పు పట్టవద్దు.. ఆమె కూడా అడుగుతున్నది కదా.. చూద్దాం.. కాలం చాలా వాటికి సమాధానాలు ఇస్తుంది.. రిలాక్స్.. లైటార్పి పడుకో అన్నాను.. కాలం నాకో చక్కని పరిష్కారం రేపటి ఆదివారం నాడు సూచిస్తుందని నేనూహించలేదు..

***

          ఆదివారం ఉదయం పదిగంటల సమయం..

        ఆకాశం మబ్బులు పట్టి ఉంది. బహుశా వాన రావచ్చు.. వేసవిలో వర్షం.. నేను కిటికీ తలుపులన్నీ తీసేసాను.. కమ్మని మట్టి వాసనతో కూడిన పరిమళం.. బాగుంది..

          విశ్వనాథం.. నేను.. నా భార్య సోఫాలలో కూర్చున్నాం..

          “అన్నయ్య.. మీ స్నేహితుడు గురించి నీకు తెలియదా.. చెప్పండి” అంది..

          “తెలుసమ్మా.. కానీ.. నీ గురించి కూడా బయట అనుకుంటున్నారు. మన సంగతి మనకు తెలుసు. ఆమె సంగతి కూడా..” అని ఆగిపోయాడు.

          రాజేశ్వరి మా ముగ్గురికి కాఫీలు తెచ్చింది.. ఇంతలో “అధ్యయనం చేయాలంటే మనిషి జీవితం కన్నా గొప్ప వేదం లేదు.” ఇది కూడా నా భావన కాదు.. రాజేశ్వరిని ఆగమన్నాను. ఎదురు సోఫాలో కూర్చోమన్నాను. ఆమె నిలబడే ఉంది. కాస్త దూరంలో ఉయ్యాలలో బాబు నిద్రపోతున్నాడు.. బయట మబ్బులు పెరుగుతున్నాయి.. దూరంగా మెరుపులు కూడా.. దట్టమైన నల్లని మబ్బులు.. నగరం పైన, మబ్బులు.. వర్షిస్తాయా..? ఏమో..

          ఆమె నిలబడే ఉంది.. మా ఆవిడ అనునయంగా..

          “రాజేశ్వరి.. నీవు మా ఇంట్లో మనిషివే.. ఏనాడు నిన్ను పనిమనిషిలా చూడలేదు. పర్వాలేదు కూర్చో..” నా భార్య మాటలు

          ఆమె నిలబడే ఉంది’

          “ సరే.. నీ గురించి చెప్పగలవా.. ఇబ్బంది లేకుంటే.. సుమా” నా భార్య మరో ప్రశ్న     

          “ఏముందమ్మ చెప్పడానికి.. మాది కాకినాడ దగ్గర సర్పవరం. మా నాన్న వ్యవసాయ దారుడు. అక్కడ ఐదు ఎకరాల పొలం ఉంది. మేము ఇద్దరం ఆడపిల్లలమే. నేను పదవ తరగతి తప్పాను. నాకు చదువు మీద కంటే వ్యవసాయమంటేనే ఇష్టం. కానీ.. అక్క బాగా చదువుకుంది. ఎక్కడో టీచరుగా ఉందని విన్నాను. కాకినాడ చదువుకుంటున్నప్పుడే మంచి డబ్బున్న వాడిని చూసి ప్రేమించి పెళ్ళి చేసుకుంది..” ఆమె మాటల్లో ఇది అని చెప్పలేని బాధ ఉన్నా పిసరంత ‘హేళన’ కూడా ఉంది.

          ఇంతలో ఉయ్యాల కదిలింది.. బాబు లేస్తాడేమోనని ఊపి వచ్చింది.. నిశ్శబ్దం.. బయట జోరుగా వాన పడుతున్న శబ్దం.. ఇంకా మబ్బులు వీడలేదు. ఆమె తిరిగి “నాకు మా అయ్య లక్షలు ఖర్చుపోసి ఓ ఆఫీసరని చెప్పుకునే దొంగను తెచ్చి నాకు పెళ్ళి చేశారు. వాడు నాకో బిడ్డనిచ్చి.. ఎక్కడికో పోయాడు. అప్పులుకు ఆస్తి కరిగిపోయింది. నాన్న ప్రాణం పోయింది..’ ఆమె కళ్ళలో నీరు.. తుడుచుకుంది.. “నేను అనాధగా మిగిలాను. ఎన్నెన్నో పనులు చేశాను. బాబు కోసం వాడిని అనాధను చేయదలుచుకో లేదు. నేను ఒళ్ళు దాచుకోకుండా పనిచేశాను.. ఒళ్ళమ్ముకొని మాత్రం కాదు.. “ఆమె మాట్లాడలేక, క్రింద కూర్చుండిపోయింది.. గబగబా నా భార్య వెళ్ళి భుజం పైన చేయి వేసి..” వద్దులే మరి చెప్పకు..” అని ఓదార్చింది. “లేదమ్మా.. మీ ఇంట్లో నాకు లభించిన ధైర్యం, ఆదరణ.. నేనేనాడు.. నా ఇంట్లో కూడా చూడలేదు..” అని చెబుతుండగా చక్రవర్తి వచ్చాడు. ఈ మధ్యనే అతనికున్న ఒక్క తల్లి చనిపోయింది. నేను విశ్వనాథం సహాయం చేసాం.. ఆటో మీద వచ్చే డబ్బుతో నెలవారి  వద్దన్నా సరే.. వద్దన్నా సరే..

          చక్రవర్తి రాగానే రాజేశ్వరిలో మార్పు.. చక్రవర్తి మెల్లగా..

          “ అయ్యా మీ దగ్గర ఏమీ దాచకూడదు.. నేను.. రాజేశ్వరి..” అని ఆగాడు.

          మా అందరికీ అర్థమైంది.. రాజేశ్వరి బయటకు వెళ్ళినప్పుడు.. ఆమె, చక్రవర్తి..

          ఇక నేను.. నా భార్య ‘ఆమె’ కోసం ఇబ్బంది పడనవసరం లేదు.. చక్రవర్తి.. రాజేశ్వరి..  మా దగ్గరే ఉంటారు.. వారింట్లో వారు ఉంటారు. బయట వర్షం ఆగింది.. మబ్బుల్లో ఏముందో.. తెలిసింది.

          నా దినచర్యలో మార్పు లేదు..

          చక్రవర్తి, రాజేశ్వరిల వయసులో తేడా ఉంది కానీ, వారి జీవితాల్లో లేదు.. కనుకనే కొత్త జీవితం ప్రారంభించారు..

          చీకట్లో ఉన్నామని దిగులు పడుతూ కూర్చుంటే జీవితం చివరి వరకు అగ్గిపెట్టి గూట్లోనే ఉండిపోతుంది.. ఆఫ్ కోర్స్ ఇది కూడా నాది కాదండోయ్..

          ఒకరోజు విశ్వనాథం.. క్యాంటీన్లో టీ తాగుతున్న నా దగ్గరకు వచ్చి.. “నీకు తన అక్క ఎవరో రాజేశ్వరి చెప్పిందా” అని మెల్లగా అడిగాడు..

          “లేదు.. ఎవరుట…” అన్నాను…

          దూరంగా.. మధుమిత.. రావటం చూసి విశ్వనాథం ఆ..గి..పో..యాడు..

*****

Please follow and like us:

3 thoughts on “బంధం (నెచ్చెలి-2024 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ)”

  1. కథ ఇతివృత్తం సహజత్వానికి దగ్గరగా చాలా బాగుంది…అభినందనలు…

Leave a Reply

Your email address will not be published.