మా బిచ్చవ్వ ( కవిత)

-ఈ. వెంకటేశ్

గ్రామంలో
సూర్యుడు నలుపు రంగు
పులుముకుని మేల్కొంటాడు
దళితులకు జరుగుతున్న
అన్యాయాలను చూడలేక.
 
గాలి మలయ మారుతంలా
మెల్లగా తాకుతూ వెళ్ళదు
తుఫానుల పెనుగాలులు వీస్తాయి
గడీలు ,మేడలు
నిజాం వారసుల గర్వాన్ని
సత్యనాస్ చేస్తాయి.
 
మాది ఊరంటే ఊరు కాదు
చైతన్యాన్ని రక్ష మాంసాలుగా
కలిగి జీవమున్న 
జవసత్వాలు కలిగిన పుణ్యభూమి.
 
మా యవ్వ తన అనుభవంతో
చెప్పే జీవిత సత్యాలముందు
నాలుగు వేదాలు నాలుక
గీసుకోవడానికి కూడా పనికిరావు.
 
ఉత్పత్తి కులంలో జన్మించి
వ్యవసాయంలో గిట్టుబాటు కాక
దళారీల మధ్య ఒంటరి ఖైదీలా
ఇప్పటికీ మోసపోతూనే ఉన్నాం..
 
పనిచేయడం చెమటోడ్చడం
తప్ప ఇతర వేషాలు వేయలేని వాళ్ళం
ఎప్పుడైనా నేను పని తప్పితే
మా బిచ్ఛవ్వ
పిచ్చలకు ఉరివేస్తా జాగ్రత్త అని
తియ్యగా తిట్టేది.
 
మా యవ్వ చీర కొంగు
మడిసి కలుపు తీస్తే
భూమంతా చెమట సువాసనలతో
మత్తెక్కి మూర్చపోయేది.
 
మగవాళ్ళని సైతం
వ్యవసాయ పనిలో
ముందుకు వెళ్ళనిచ్చేది కాదు
ఎవడైనా కారు కూతలు కూస్తే
దవడలు ఇరగకొట్టేది.
 
పిడకలు ఏరుకు రారా అని
నన్ను బాగా సతాయించేది
నేను ఎంతకు వెళ్ళక పోతే
నీ పెళ్ళాం పెద్దమనిషిగా గాను
అంటూ నవ్వుకుంటూ ఎక్కిరించేది.
 
చివరగా మా బిచ్చవ్వ ను చూస్తుంటే
నాకు చాకలి ఐలమ్మ వారసురాలిగా
నాకు స్పష్టంగా అనిపించేది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.