సరిహద్దు సాక్షిగా

-డా.కె.గీత

విరగకాసిన
ద్రాక్షతోట సాక్షిగా
‘సరిహద్దు
ప్రేమకు
అడ్డంకా?’
అని అతను
గుసగుసలాడినప్పుడు
గుండె
గజగజా కొట్టుకున్నా

అతని మీద ప్రేమ
ఎఱ్ఱసముద్రాన్ని
దాటింది

మా
ప్రేమమాధుర్యమంతా
నింపుకున్న
పవిత్రభూమి
ఇది-
ఇందులో
దేశాలు ఎన్నో
మాకు
లెక్క లేదు

పరమత సహనం
నించి
పుట్టిన
ప్రేమతో
ఏకమైన బంధం
ఇది-
ఇందులో
దేశాల పాత్ర
లేనే లేదు

ఆ పొద్దు
సరిహద్దులో
అతని
దేశపు వాళ్ళని
ఎత్తుకొచ్చేవరకు
అతని దేశం
నా దేశం
అనేవి లేవు

ఈ పొద్దు
నా దేశమంతా
కుళ్ళబొడుస్తున్న
బాంబుదాడుల
మధ్య
ప్రేమైక
బంధాలే
లేవు

సరిహద్దుకావల
అతను-
సరిహద్దుకీవల
నేను-

ఎవరిచేతుల్లోనో
కీలుబొమ్మయి
జెండాసాక్షిగా
తుపాకీ చేతబట్టి
అతను-

నాశనమైన
ద్రాక్షతోట
సాక్షిగా
రక్తపుటేరుల్లో
గిలగిలా కొట్టుకుంటూ
నేను-

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.