దారి పొడవునా సముద్రమే (శ్రీలంక యాత్ర)

-డా.కందేపి రాణి ప్రసాద్

          దేవశిల్పి, మహాద్భుత ప్రతిభాశాలి విశ్వకర్మ నిర్మించిన స్వర్ణలంకా నగరాన్నీ, భారత దేశ పటం కిందుగా చిన్న నీటి బిందువు ఆకారంలో ఉండే శ్రీలంక దేశాన్నీ, హిందూ మహా సముద్రంలో మణి మకుటంగా వెలిగిపోయే ద్వీపాన్ని చూడటానికి మేము ఈనెల 8వ తేదిన బయలు దేరాం. ఈ సంవత్సరం మాకు మంచి అవకాశం వచ్చింది. భారతదేశ పటం పైభాగాన ఉన్న కిరీట కాశ్మీరాన్ని, భారత దేశ పటం కిందుగా ఉండే శ్రీలంకా ద్వీపాన్ని చూసే అవకారం వచ్చింది . ఎప్పటిలాగానే మా వారి కాన్ఫరెన్స్ కారణంగా శ్రీలంక దేశాన్ని వీక్షించే ఆవకాసం వచ్చింది. మా అబ్బాయి, మా వారు, నేను శ్రీలంకను చూద్దామని వెళ్ళాము. 8వ తేదీ నుంచి 12వ తేదీ దాకా ఐదు రోజులు శ్రీలంకలో ఉండి అన్ని ప్రదేశాలనూ చూశాము. కోలంబో అంతా కారులో తిరిగింది తిరక్కుండా తిరిగాము. దాదాపు ఇండియాలాగానే ఉన్నది. వాతావరణం వేడిగా ఉన్నది. సముద్రం మధ్యలో ఉన్నందు వల్ల బాగా చెమటలు పోస్తున్నాయి. సమయం ఏమీ మారలేదు అక్కడ. భారత్ సమయమే.

          ఇండిగో ఫ్లైట్ లో ఉదయం 11-గం లకు చెన్నై మీదుగా కోలంబో ప్రయాణించాము. సాయంత్రం 5.30కు శ్రీలంకలోని బండారునాయకే ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగాము. 1956 లో బండారు నాయకే శ్రీలంకకు ప్రధానమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో సింహళ భాషను మాత్రమే అధికార భాషగా ప్రకటించారు. ఈ విషయం తమిళులకు నచ్చక పోరాటం మొదలు పెట్టారు. 1959 లో రాజకీయ అస్థిరతతో బండారు నాయకే కాల్చి వేయబడ్డారు . ఆ తర్వాతే బండారు నాయకే భార్య సిరిమావో బండారు నాయకే ప్రధాని పదవిని చేపట్టారు. ఇక్కడ సిరిమావో గురించి నేనోక విషయం చెప్పాలి.
చిన్నప్పుడు తొలి మహిళ ప్రధాన మంత్రి ఎవరు? అని జికె క్వశ్చన్స్ లో అడిగినపుడు సిరిమావో బండారు నాయకే అని తెగ చదివి బట్టిపట్టాం. తోలి మహిళా ముఖ్యమంత్రి ఎవరు? తోలి మహిళా ప్రధాని ఎవరు? అంటూ ప్రశ్నలు ఎక్కువగా జీకె టెస్టుల్లో అడగటం వలన సిరిమావో బండారునాయకే, సుచేతా కృపలాన్ని పేర్లు బాగా గుర్తుపెట్టుకున్నాం. నేను శ్రీలంకలో దిగి ఎయిర్ పోర్టు పేరు చూడగానే నాకీ విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి. సిరిమావో శ్రీలంకకు మూడుసార్లు ప్రధాన మంత్రిగా ఎన్నికయ్యారు.

          కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్లు అన్ని పూర్తయ్యాక కారులో మా హోటల్ కు బయల్దేరాం. మౌంట్ లవీనియా అనే బీచ్ హోటల్లో దిగాము. చాలా బాగుంది. బాల్కనీ తలుపు తీయగానే సముద్రం కనిపిస్తున్నది. అలల సవ్వడి వినిపిస్తున్నది. ఉవ్వెత్తున అలలు లేస్తూ మాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. సముద్ర ఘోష దగ్గరగా వింటుంటే గమ్మత్తుగా ఉంది. ఇంతకు పూర్వం మేము బాంబే లో సన్ అండ్ శాండ్ హోటల్లో దిగినప్పుడు అరేబియా సముద్రం ఇలాగే స్వాగతం పలికింది. నేను పుట్టిన చీరాల పట్టణం కూడా సముద్ర తీరమే కానీ రెండు కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంటుంది. అదే చాలా దగ్గరగా ఉన్నది అనుకునే వాళ్ళం. తెల్లని ఇసుకతో పాలు కారేలా ఉండటంతోనే మా ఊరికి చీరాల అనే పేరు వచ్చింది. పాలధారలా అంటే క్షీరంలా అనే అర్ధంతో ‘క్షీరాల’ అనే వాళ్ళట . అదే చీరాలగా మారిందట.

          శ్రీలంక దేశ రాజధాని “కోలంబో’ నగరం చాలు పరిశుభ్రంగా ఉన్నది. ఎక్కడా చెత్తా చెదారం కొద్దిగా కూడా కనిపించలేదు. మేము టీ తాగటానికి ఒక షాపు దగ్గర అగాం. అందరూ టీ తాగాక పద్ధతిగా డస్ట్ బిన్ లో వేస్తున్నారు. ఒక్క టీ కప్పు కూడా కింద పడేసి లేదు. మేము కూడా జాగ్రత్తగా డస్ట్ బిన్ లోనే ఖాళీ టీ కప్పులు పడేశాం. మామూలుగా మనం నెస్ కేఫ్ తో కాఫీ తాగుతాము కదా ! కానీ ఇక్కడ ‘ నెస్ టీ’ అని ఉన్నది తాగితే టేస్టీగా ఉన్నది. మొత్తానికి శ్రీలంకలో టీ తాగాము.

          మా చిన్నతనంలో రేడియోలో సిలోను వార్తలు అని వచ్చేది. సిలోను అంటే శ్రీలంక అన్నమాట. క్రికెట్ వార్తలు కుడా సిలోన్ స్టేషన్ నుంచి వస్తుండేవి. 1972 సంవత్సరానికి పూర్వం శ్రీలంకను సిలోను అని పిలిచేవాళ్ళు. పోర్చుగీసు వాళ్ళు 1505 లో ఈ ద్వీపానికి వచ్చినప్పుడు దీనికి ‘శిలయో’ అని నామకరణం చేశారు. అదే తర్వాత సిలోన్ గా మారి పోయింది. 1972 తర్వాత “ఫ్రీ సోవరిన్ అండ్ ఇండిపెండెంట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక” అనే అధికారిక నామం ఏర్పడింది. ఆ తర్వాత 1978 సం. తర్వాత అధికారికంగా “డెమోక్రటిక్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక” అని పేరు మార్చారు. రామాయణ కాలం నుండి ఈ శ్రీలంక ప్రస్తావన వస్తూనే ఉది. లంకాధిపతి రావణాసురుడు సీతమ్మను బంధించి లంక కు తీసుకెళ్ళి బంధించి ఉంచాడు. ఆ తర్వాత శ్రీరాముడు వానరసేనతో కలసి రావణుని తో యుద్ధం చేసి సీతమ్మను తమ రాజ్యానికి తీసుకు వచ్చాడు. భారతీయులు అందరు రామాయణాన్ని విని, చదివి లంకను దష్ట పాలకుడి నగరంగా గుర్తుపెట్టుకున్నారు. దేవ శిల్పి విశ్వకర్మ రూపొందించిన లంకా నగరాన్ని కుబేరుడి కోసం కట్టారు. కుబేరుడ్ని తరిమేసి రావణుడు హస్తగతం చేసుకున్నాడు.

          శ్రీలంక కరెన్సీ కూడా రూపాయే. శ్రీలంక రూపాయలు భారతీయ రూపాయల కన్నాతక్కువ విలువ కలిగినది. అందుకే అక్కడ ఏమి కొన్నా వేలల్లో ఉంటుంది . డీజిల్ లీటర్ 370 రూ. అట. మా కారు డ్రైవరు వేయించుకుంటుంటే అడిగితే చెప్పాడు. ఒక రోజుకు కారు వాడుకుంటే 30,000 బిల్లు అయింది. ఎయిర్ పోర్టు నుంచి హోటల్ కు వెళ్ళటానికి పదిహేను వేలు అడిగారు.హోటల్ కు వెళ్ళి భోజనం చేస్తే పదివేలు బిల్లు తెచ్చిచ్చాడు. ఇలా రేట్లు చూస్తే మనకు బిపి పెరగడం ఖాయం. ఐదారు రోజులకు లక్షల్లో బిల్లు వస్తుంది. మన భారతీయ రూపాయికి లంక రూపాయలు మూడు వస్తాయి. అయినా ఈ రేట్లు చూస్తే కొనబుద్ధి కాలేదు.అక్కడ న్యూస్ పేపర్ కొందామని వెళితే డ్రైవరుకు వందరూపాయలు ఇచ్చి తెమ్మన్నాను ! చాలవు మేడమ్’ అన్నాడు. న్యూస్ పేపర్ కు ఇంత డబ్బులు పెట్టాలా అని ‘కోనద్దులే’ అనుకున్నాం. కానీ నాకేమో ఏ దేశం వెళ్ళినా అక్కడి న్యూస్ పేపర్లు సేకరించడం అలవాటు. ఏం చెయ్యాలా అనుకున్నాను. మా కాన్ఫరెన్స్ లో నాకు పేపర్లు కనిపించాయి వాళ్ళ నడిగి ఒక న్యూస్ పేపర్ తెచ్చు కున్నాను. దాంతో నా కోరిక తీరింది. దాదాపు ఇరవై దేశాలకు పైగా ఆయా దేశాల వార్తా పత్రికలను తెచ్చుకున్నాను. అలాగే కరెన్సీ కూడా భద్ర పరుస్తున్నాను.

          శ్రీలంకనూ భారతదేశాన్ని విడదీస్తూ పాక్ జల సంధి ఉంటుంది. ఇది కూడా వెడల్పు తక్కువ గానే ఉండటంతో రామేశ్వరం నుంచి చూసే కోలంబో తీరం కనిపి స్తుందని చెపుతారు. మేము కేరళలోని కొచ్చి వెళ్ళినపుడు అక్కడ నుంచి కేవలం 24 కి.మీ దూరమే అని నావికులు చెప్పారు. ప్రాచీన కాలం నుంచి బౌద్ధ మతానికి సంప్రదాయానికీ కేంద్ర బిందువుగా శ్రీలంక దేశం పేరుపొందింది. శ్రీలంకను కూడా బ్రిటిష్ సామ్రాజ్యం ఆక్రమించింది. వీళ్ళకి 1948 వ సం.లో స్వాతంత్య్రం లభించింది. కాఫీ, టీ, రబ్బరు, కొబ్బరి కాయల ఎగుమతిలో శ్రీలంక పేరు తెచ్చుకున్నది. రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ మీద దాడి చేసేందుకు శ్రీలంక దేశం ప్రధాన స్థావరంగా ఉపయోగపడిందట. ప్రకృతి అందాలు, సముద్ర తీర ప్రాంతాలు అధికంగా ఉండటం వలన యాత్రా ఆకర్షణగా సాగుతోంది.

          ప్రస్తుతం శ్రీలంకలో సింహళంతో పాటు తమిళం కూడా అధికారక భాషలే. ఎయిర్ పోర్టులోని దుకాణాల్లోని మహిళలు వేసుకున్న డ్రస్ విచిత్రంగా ఉంది. ఇది శ్రీలంక ట్రెడిషనల్ డ్రస్సా అని అడిగాను అవునన్నారు. వాళ్ళతో ఫోటో తీసుకున్నాను. కింద లుంగీలా చుట్టుకున్నారు. నడుం చుట్టూ కుచ్చుల్లా పెట్టి ఉంటాయి. మళ్ళీ పైట వేసు కుంటారు గమ్మత్తుగా ఉంది. నేను కూడా కోనుక్కుందాం అనుకున్నాను కానీ కుదరలేదు. స్థానికంగా ఉన్న మహిళలు ఈ డ్రెస్ తో లేరు . కచ్చుల లంగా కట్టుకుని పైన పొడవు చేతుల చోక్కా వేసుకున్నారు. యువత మాత్రం ఈ కాలం నాటి ఆధునిక వస్త్రాలలో ఉన్నారు. చీరలో మాత్రం నాకు కోలంబో మొత్తం చూసినా ఎవరూ కనిపించలేదు. సింహళం, తమిళం రెండు భాషలూ మాట్లాడుతున్నారు. తమిళంలో కొన్ని పదాలు నేర్చుకున్నాం కదా ! అక్కడ ప్రయోగించాం!

          ఇండిపెండెన్స్ స్క్వేర్ అని ఒక కట్టడం ఉన్నది. అక్కడ ఒక పెద్ద విగ్రహం పెట్టబడి ఉన్నది. ఇక్కడే జెండా ఎగరేస్తారట. చుట్టూ తిరిగి చూశాం. ఖాళీ మండపంలా ఉన్నది. అక్కడక్కడ కొందరు ఉన్నారు. ఫిబ్రవరి 4 వ తేదీ స్వాతంత్య్రం పొందిన రోజు ప్రతిఏటా పండుగలా చేసుకుంటారు. దాని తర్వాత ఎర్ర మట్టితో కట్టిన కోట లాంటిది కనిపించింది. ఇది పాత పార్లమెంట్ భవనమట . ఇక్కడ ఆగి ఫోటో తీసుకునే లోపలే పోలిస్ వచ్చి వెళ్ళి పొమ్మన్నాడు. చాలా అందంగా ఉంది.

          శ్రీలంకలో చూడటానికి చాలా ప్రదేశాలున్నాయి. కోలంబో తర్వాత సిగిరియా,కాండి, గాల్, జెంటోటా, ఎల్లా, సువరాఎలియా, అనురాధపురా, పోలోన్నారువా వంటి ఎన్నో సిటీలున్నాయి. కానీ సమయం తక్కువున్నందున బెంటోటా పట్టణానికి మాత్రమే వెళ్ళ గలిగాం. అక్కడ బీచులున్నాయి. బుద్ధుని దేవాలయులు ఉన్నాయి. బెంటోటా బీచ్ కు వెళ్ళి గవ్వలు ఏరుకొచ్చుకున్నాను. ఇవి హిందూ మహా సముద్రపు గవ్వలు. నేను అరేబియా సముద్రం, అట్లాంటిక్ మహా సముద్రం, బంగాళాఖాతం వంటి వాటితో పాటు ఎన్నో సముద్రాల నుంచి గవ్వలు తెచ్చి బొమ్మలు చేశాను. నాకదో అలవాటున్నది.
సీమ మలక దేవాలయాన్ని చూశాము . ఈ బెంటోటా పట్టణం కోలంబో నుంచి 70 కి.మీ దూరంలో ఉన్నది. బుద్ధుని గుడిని కూడా చూశాం. దాదాపు వంద అడుగుల ఎత్తులో బుద్ధుడు ఉన్నాడు. అర్థ నిమీలిత నేత్రాలతో బంగారు వర్ణంలో మెరిసిపోతూ కొలువు దీరి ఉన్నాడు. లోపల చాలా గుడులున్నాయి. రావి చెట్టు చుట్టూరా బుద్ధుని ప్రతిమలున్నా యి . ఏనుగు ప్రతిమలు కూడా చాలా ఉన్నాయి. పెద్ద గంటకు చుట్టూ బంగారు రంగు కిటికీల మాదిరిగా పెట్టి ఉన్నాయి. గుడుల లోపల సిలింగ్ భాగంలో కూడా ప్రతిమలు చెక్కబడి ఉన్నాయి. రాతి మీద సన్నని గీతలతో కూడా కోన్నిచోట్ల చెక్కబడి ఉన్నాయి.
తాబేళ్ళ సంగ్రహాలయం ఒకటి చూశాం. అక్కడ టికెట్ ధర చాలా దారుణంగా అనిపిం చింది. ఒక్కొక్క వ్యక్తికి మూడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. లోపల ముప్పై రకాల తాబేళ్ళు కూడా లేవు. తాబేళ్ళలో రకాలను గుడ్లను పొదగడం వంటివి చూపిం చారు. పెద్ద బండ రాళ్ళలా ఉన్నాయి. మనుషులు కనిపించగానే దగ్గరకు వస్తున్నాయి ఏమైనా ఆహారం కోసమేమో అనిపించింది. వాళ్ళు వాటికి ఆహారం సరిగా పెడతారో లేదో అనిపిచింది.

          కొలంబోలో చూడవలసిన అత్యంత ముఖ్యమైన దేవాలయం ఏమంటే గంగ రామయ్య దేవాలయం . దీన్ని19వ శబబ్ధంలో నిర్మించారు. కోలంబో నగరం మధ్యలో బైరా సరస్సు పారుతూ కనిపిస్తోంది. ఈ దేవాలయం ఆధునిక నిర్మాణ శైలిలో ఉన్నది. ఇక్కడున్న శిల్పాలు భారత్, చైనా, థాయ్, శ్రీలంక వాస్తు నిర్మాణ శైలిని ప్రదర్శిస్తోంది. దీనిని పడవతోట గంగరామయ్య విహారియా అని కూడా పిలుస్తారు.

          రెడ్ మాస్క్ అని పిలవబడే జామ్కి – ఉల్ – అల్ఫ్హర్ మసీదును చూశాం. ఎరుపు రంగులో అందంగా కనిపిస్తుంది ఇదోక చారిత్రాత్మక మసీదు. ఇదోక మంచి పర్యాటక ప్రదేశం. ఇది 1909 లో కట్టబడింది. ఎరుపు-తెలుపు చారలతో ఉంటుంది భవనం. విహార మహాదేవి పార్కును కూడా చూశాం. దారిలో వెళుతూ ఏదో ఆడిటోరియంను చూపిస్తే అక్కడ ఫోటో తీసుకున్నాం. మొయిన్ రోడ్డులో గల నాలుగు రోడ్ల కూడళ్ళలో కూడా ఫోటోలు తీసుకున్నాను. అలాగే ఫ్లోటింగ్ మార్కెట్ ను చూశాం. నీళ్ళ పైన పడవల్లో సామాన్లు అమ్ముతూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. అలాగే పూర్వకాలపు డచ్ హాస్పిటల్ కూడా చూశాం. ఇది కూడా పాత కట్టడాల వలె ఎర్రటి ఇసుకతో కట్టుబడి ఉంది. ప్రస్తుతం ఇది హోటల్ గా పని చేస్తున్నది.

          గల్లీ ఫేస్ బీచ్, క్రో ఐలాండ్ బీచ్, బెంటోటా బీచ్, మౌంట్ లవినియా బీచ్, వంటి బీచ్ లను చూశాం. బెంటోటా బీచ్ లోనూ, మౌంట్ లవినియా బీచ్ లోనూ ఒక చెట్టును చూశాం. గమ్మత్తుగా ఉంది. సీతాఫలం లాంటి కాయలు డబుల్ సైజులో ఉన్న కాయల్లా ఉన్నాయి. పండిన కాయలేమో ఆరెంజ్ రంగులో ఉన్నాయి. ఇది ఏమి చెట్టో ఏమో ! ఇంకో బీచ్ లో చాలా కాకులు కనిపించాయి. దగ్గరగా వచ్చి తిండి పదార్థాలకై ఎదురు చూస్తున్నాయి. నాకు ముచ్చటేసి’ కోలంబో కాకులు’ అని ఒక కవిత కూడా రాశాను.

          ఉర్లో ఎక్కడ చూసినా బుద్ధుడి బొమ్మాలే దర్శన మిస్తుండడంతో నాకు థాయిలాండే గుర్తుకు వచ్చింది. ఇంకా మేము ఎయిర్ ఫోర్స్ మ్యూజియం నూ, నేచురల్ సైన్స్ మ్యూజియంనూ చూశాం. వీటిని ఇంతకు ముందెన్నడూ చూడకపోవడంతో చాలా నచ్చాయి. నేచురల్ సైన్స్ మ్యూజియం ను చూస్తే, కాలేజిలో మా లేబరేటరీలు గుర్తు వచ్చాయి. ఎయిర్ ఫోర్సు మ్యూజియం అధ్బుతంగా ఉంది.

          శ్రీలంకలో జెమ్స్ బాగా దొరుకుతాయట. చాలా జెమ్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. కళ్ళకు ఎంత అందంగా కనిపిస్తున్నాయో! కానీ చాలా ఎక్కువ ఖరీదు ఉన్నాయి. నేనయితే ఏమి కోనుక్కోలేదు. ఇవండి శ్రీలంక విశేషాలు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.