నాతిచరామి
(నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)
-తెన్నేటి శ్యామకృష్ణ
ఈరోజుతో తన ఉద్యోగ జీవితం ఐపోయింది. రేపటినించి ఆఫీసుకి వెళ్ళక్కర్లేదంకుంటే ఎంతహాయిగావుంది! కెమికల్ ఇంజినీర్‌గా ముప్ఫైఏళ్ళు పనిచేశాడు తను ఓ ప్రభుత్వ సంస్థలో. వీడ్కోలు సమావేశం తాలూకు దండలు, షీల్డు అక్కడ టేబుల్మీద పెట్టేసి గట్టిగా ఊపిరిపీల్చుకున్నాడు దుష్యంత్.
“జాహ్నవీ!” గట్టిగా కేకేశాడు.
వంటింట్లోంచి కొంగుకు చేతులు తుడుచుకుంటూ వచ్చింది జాహ్నవి, “వచ్చారా?” అంటూ.
“ఈరోజునించి నేను ఫ్రీ బర్డ్! ఇవాల్టినించి ఏపనీ టైంప్రకారం చెయ్యనని ఒట్టేసుకుని వచ్చాను. లేవడందగ్గరినించి స్నానం పానం అన్నీ నాయిష్టం!”
“ఓహో, మరి నేను కాఫీ లేటుగా ఇస్తా రేపటినించి!” అన్నది జాహ్నవి నవ్వుతూ.
“అమ్మో, అది మాత్రం టైంకే! రా ఇలా నా పక్కన వచ్చి కూర్చో!”
“వంటింట్లో పప్పు మాడుతుంది బాబూ, కూర్చుంటే ఎలా? ఒక్క ఐదు నిమిషాలుంటే టీ ఇస్తాను, అప్పటిదాకా టీవీ చూడండి!” ఆమె వెనుదిరిగింది.
‘రిటైర్డ్’ అన్న పదం అనుకోడానికే వింతగావుంది. తనకిప్పుడు అరవై ఏళ్ళు అని తలుచుకోడానికి మరీ ఇబ్బందిగావుంది. మనసులో ఇంకా ఉత్సాహం ఉరకలువేస్తోంది. శరీరం గట్టిగానేవుంది. ఎన్నోప్లాన్లు వేసుకున్నాడు, రిటైర్మెంట్ తరవాత ఏంచెయ్యాలని. తొందరేముంది, ఇవాళేగా మొదలు? తనలో తను నవ్వుకున్నాడు.
ఫోన్ తీసాడు ఆప్తమిత్రుడు శశిధర్‌తో మాట్లాడాలని. అతను తమ కాలనీలోనే ఉంటాడు, “హ్యాపి రిటైర్మెంట్ లైఫ్!” చెప్పాడు ఫోన్ తియ్యగానే.
“థాంక్యూ, మన దుష్టచతుష్టయం వచ్చే ఆదివారం కలవాలి మాఇంట్లో!”
ఆ దుష్టచతుష్టయంలో వీళ్ళిద్దరు కాక జీవన్‌రెడ్డి, మహావిర్ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్– రిటైరై అక్కడ చేరాడు రెండేళ్ళక్రితం, ఇంకా చతుర్వేది తెలుగు లెక్చరర్ ఉన్నారు. వీలైనప్పుడల్లా కలుస్తుంటారు, పేకాట, చెస్,అన్నిరకాల ఎంటర్టైన్మెంట్లూ నడుస్తయక్కడ!
“అలాగేకానీగానీ, సాయంత్రం పార్కుకు వెళ్ళి మాట్లాడుకుందాం తీరిగ్గా, వచ్చెయ్,” శశిధర్ ఫోన్ పెట్టేసాడు. తనకంటే ఒక ఆరు నెలలముందు రిటైర్ అయ్యాడు ఇంజినియర్గా. అలా తనకు సీనియర్ అన్నమాట!
పార్కులో ఎత్తైన చెట్లదారిన నడవడం, పక్షుల కూతలు వింటూ చుట్టూ పరుచుకున్న పచ్చిక, పూలమొక్కల లాన్లను పరికించడం చాలా ఆహ్లాదంగా వుంటుంది తనకి. ఇప్పుడిక రోజూ నడక సాగించవచ్చు. అంతలో శశిధర్ అన్నాడు దూరంగా బెంచీలమీద కూర్చున్న కొందరిని చూపిస్తూ, “వాళ్ళంతా సీనియర్ సిటిజన్స్, రోజూ కాసేపు వాళ్ళతో కాలక్షేపం చేస్తాను, ఒకసారి వెళ్ళి కలుద్దామా?” అంటూ అటువైపు దారితీశాడు.
పరిచయాలయ్యాక కాసేపు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ నడక సాగించారు ఇద్దరూ, “నువ్వేమైనా అనుకో శశీ, నాకు అలా కూర్చుని మనకంటే పెద్దవాళ్ళతో ఊసుకోలు కబుర్లు చెప్పుకోవడం ఏదోలావుంటుంది. నా వయసు అమాంతం పెరిగిపోయినట్టుంటుంది, సారీ!” అన్నాడు నవ్వుతూ. శశిధర్ పెద్దగా వవ్వి, “అలాగే, ఐతే మన మిత్రులం నలుగురం ఉన్నాంగా అందుబాట్లో, వీలైనప్పుడల్లా కలుద్దాం!” అన్నాడు. ఇద్దరూ ఇంటిదారిపట్టారు.
వారం రోజులు ఇట్టే గడిచిపోయినయి, షాపింగ్ అనీ, సినిమా అనీ, అమెరికాలోఉన్న కొడుకుతో విడియోకాల్, కూతురు సుష్మిత రాకపోకలు, మనవడితో ఆటలు, అలా. దగ్గరలోనే సంగారెడ్డిలో వుంటుంది సుష్మిత. అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్.
ఆదివారం మిత్రులంతా దుష్యంత్ ఇంట్లో సమావేశమయ్యారు. శశిధర్ భార్య జీవిత, జాహ్నవి వంటింట్లో సతమతమౌతున్నారు పకోడీలు, టీలు తయారుచెయ్యడంలో. ఒకపక్క మాటల జోరుగా నడుస్తుంటే మరోపక్క ప్లేట్లు, టీకప్పులు ఇట్టే ఖాళీఅవుతున్నయిమరి! టాపిక్ ఆడవాళ్ళమీదికి మళ్ళింది. చతుర్వేది అన్నాడు, “మనవాళ్ళు ఆడవాళ్ళని దేవతలనిచెప్పి కొలిచారు పురాణకాలంనించి, లక్ష్మి, సరస్వతి, పార్వతి, ఇప్పటికీ …”
శశిధర్ అందుకున్నాడు, “అది పేరుకేలేవోయ్, చారిత్రక యుగంలోకి వచ్చేసరికి ఆడది మగాడి ఆస్థిగామారిపోయింది. ఏ రాజుకి బలం వుంటే వాడు యుద్ధంచేసి అవతలివాడి రాజ్యంతోపాటు స్త్రీలని వెంటతెచ్చుకోవడమే, కేవలం స్త్రీలకోసమే యుద్ధం చేసిన వాళ్ళున్నారు!”
“ఇప్పుడు, ఆడవాళ్ళు ఉద్యోగాలు చెయ్యడం మొదలుపెట్టాక, ఇద్దరూ సమానం అయ్యారుగా, వాళ్ళనిప్పుడు ఒక్క మాట అనలేం!” నవ్వాడు జీవన్‌రెడ్డి.
దుష్యంత్ అన్నాడు, “నిజమే, ఇప్పుడు పెళ్ళికోసం మగాళ్ళే ఆడవాళ్ళ తాలూకువాళ్ళని కలవాల్సొస్తోంది, సాలరీ ప్యాకేజి ఎంత అనేదాన్నిబట్టి సంబంధానికి మొగ్గుచూపడం, కలికాలం!”
“ఏమిటి, మేం లేనిది చూసి మాగురించి ఏదో ఆడిపోసుకుంటున్నారు!” జీవిత పకోడీలు ట్రేలో తెస్తూ అన్నది. “అబ్బే, అంత ధైర్యమా మాకు!” శశిధర్ నవ్వాడు, “మగవాడి జీతం అడగొద్దనేది పాతమాట, ఇప్పుడు అదే డిసైడింగ్ ఫాక్టర్ అంటున్నా,” జీవిత మూతి మూడువంకర్లు తిప్పింది, “నేనూ సంపాదిస్తున్నా నీతోపాటు, మరి జీతం తక్కువంటే మీ మగాళ్ళకదొక ఇన్ఫిరియారిటీ కాంప్లెక్సాయె!”
“మరి నేను ఉద్యోగంలేకున్నా పెళ్ళిచేసుకోలా మాఅవిడని కట్నంలేకుండా?” కాలర్ ఎగరేశాడు దుష్యంత్ జాహ్నవిని చూసి. “ఓ పెళ్ళిలో ఆమెని చూసి ఆమె అందానికి మూర్ఛపోయి లేచి ఆనక పెళ్ళిచేసుకున్నారు. ఐనా, మీరు నయమే, ఈరోజుల్లో ప్రేమపెళ్ళిళ్ళలో కూడా కట్నాలు అడుగుతున్నారు మొహమాటంలేకుండా!” అన్నది జీవిత.
“మీ ఆడవాళ్ళతో వాందించలేంగాని, కూర్చోండి అంతా కలిసి కాసేపు రమ్మీ ఆడుకుందాం!” జీవన్‌రెడ్డి అన్నాడు.
కాసేపు అంతాకలిసి పేకాడారు సరదాగా. అంతా వెళ్ళిపోయేసరికి జాహ్నవి విపరీతంగా అలిసిపోయి సోఫాలో అలాగే కూర్చుండిపోయింది. “ఫస్ట్ షో ఏదైనా సినిమాకి వెళ్దామా?” బాత్రూంలోంచి ఫ్రెషప్అయి వస్తూ దుష్యంత్ అడిగాడు. జాహ్నవి మొహం చూసి ఆగిపోయాడు, “జానూ, ఏమయింది? ఆర్ యూ ఆల్రైట్?” ఆత్రుతగా అడిగాడు, “ఏంలేదండి, అలసట, వొళ్ళునెప్పులు, తొందరగా పడుకుంటాను ఇవాళ …”
“ఓఁ ఓకే, నేను కాసేపు టీవీ చూసి ఎంజాయ్ చేస్తాను,” రిమోట్ చేతిలోకి తీసుకున్నాడు, “నీకేమైనా మెడిసిన్ కావాలా?” “నిద్రే మెడిసిన్!” నవ్వుతూ బెడ్రూంవైపు నడిచింది జాహ్నవి.
మరోరోజు జీవన్‌రెడ్డి ఇంట్లో సమావేశం. జీవన్ అన్నాడు, “దుష్యంత్, ఎలాగూ రిటైరైనావు, మా కాలెజీలో ఫస్ట్ ఇయర్‌కు కెమిస్ట్రీ హ్యాండ్ కావాలి, వచ్చిచేరరాదు? మంచి జీతం, నీకూ కాలక్షేపంగా ఉంటుంది!”
దుష్యంత్ ఠక్కున అన్నాడు, “అప్పుడు నీదగ్గర చేతులు కట్టుకున్ ‘జీ హుజూర్’ అనాలి, ఇలా నవ్వుతూ మాట్లాడగలనా?“, అంటూనే మళ్ళీ నవ్వి, “అలాఅని కాదు, నాకు అలాంటి కమిట్మెంట్స్ వద్దనుకుంటున్నాను, ఏ పాబందీ లేకుండా ఫ్రీ బర్డ్లాగా గడపాలని వుంది ఇప్పటికైతే,” అన్నాడు. అంతా కలిసి ఫస్ట్‌షో ‘శశివదనే‘ సినిమాకివెళ్ళి హోటల్లో భోజనంచేసివచ్చారు. కారులో తిరిగొస్తూ సినిమా ఎందుకుబాగులేదో విశ్లేషించుకుని నవ్వుకున్నారు సరదాగా. “అసలు నాకు ఇస్తేనా డైరెక్షన్ …” అని శశిధర్ అనగానే వాళ్ళావిడ “నిర్మాత నెత్తిన గుడ్డవేసుకునేవాడు!” అని ముగించింది. అంతా నవ్వుకున్నారు.
తెల్లారి పనిమనిషి రాలేదు. దేవుడా అనుకుంటూ ఇల్లూడ్చి అంట్లుతోమింది జాహ్నవి. దుష్యంత్‌కి ఒకటే ఆశ్చర్యం, ఫోన్లో స్పీకర్పెట్టుకుని కూతురు సుష్మితతో మాట్లాడుతూనే అంట్లు కడిగేస్తోంది. మధ్య మధ్య స్టవ్‌మీద కూర కలియబెడుతోంది, “ఈ ఆడవాళ్ళ్ళు సవ్యసాచులు బాబోయ్!” అని బోలెడు ఆశ్చర్యపోయాడు.
రిటైరై ఇంట్లోఉంటున్నప్పటినించి దుష్యంత్ రెండు, మూడుసార్లు కాఫీ కావాలని అడుగుతున్నాడు. “ఓఁ సారీ, పనిమనిషి రాలేదుగదూ, కప్పు నేనే కడిగేస్తా!” అన్నాడు. “ఎందుకూ, రిటైరై ఇంట్లో ఉన్నందుకు ఇదా శిక్ష అని తరవాత నన్ను దెప్పిపొడవడానికా?” నవ్వుతూ అతని చేతిలో కప్పు లాగేసుకుంది జాహ్నవి. మధ్యాహ్నం అన్నంతిని ఒక క్రోసిన్ టాబ్లెట్ వేసుకుంది వొళ్ళు నెప్పులు, జ్వరంలా అనిపిస్తే. దుష్యంత్ చూడకుండా జాగ్రతపడింది, హడావిడి చేస్తాడని.
రోజులు గడిచిపోతున్నయి. చదివెయ్యాలని మొదలుపెట్టిన ఓ నాలుగు పుస్తకాలలో బుక్మార్కులు దుష్యంత్‌ని చూసి వెక్కిరిస్తున్నట్టున్నయి. ఎంతసేపూ స్నేహితులు, కబుర్లు, ఆటలతో సమయం తెలియకుండానే గడిచిపోతున్నది. అదేగా తనకి కావలసిందీ …
ఆరోజు ఇండియా, ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్. దుష్యంత్ మరీ హుషారుమీదున్నాడు. తొందరగా తయారై టీవీ ముందు కూర్చున్నాడు. “జాహ్నవీ, ఒక ఫ్లాస్క్ నిండా టీ పెట్టు. తినడానికి ఏంచేస్తావు?”
జాహ్నవి తన పూజ కానిస్తూ మధ్యలో తనకి కావల్సినవి అందిస్తూ పూజ రూంకి వంటింటికి, డ్రాయింగ్ రూంకి మధ్య బొంగరంలా తిరుగుతున్నది.
విరాట్ కోహ్లి బ్యాటింగ్ కళ్ళార్పకుండా చూస్తూ, “జాహ్నవీ, టీ వేడిగాలేదు, వేడిచెయ్యమని చెప్పానా?” అరిచినంతపనిచేశాడు దుష్యంత్. “వస్తున్నానండీ,” టీకప్పు పట్టుకుని హడావిడిగా పీటవున్నది చూసుకోకుండా అడుగేసింది ముందుకు. అంతే, పీట తట్టుకుని దభేలున ముందుకు పడింది, టీకప్పు ఎగిరిపడి ముక్కలై టీ నేలపాలయింది.
“అమ్మా!” అనే కేకతో దుష్యంత్ పరిగెత్తుకువచ్చి “అరెరె!” అంటూ ఆమెని లేవదీయబోతే గిలగిలలాడింది బాధతో. కాలు కదపరావడంలేదు, కదిలిస్తే కలుక్కుమంటోంది.
కష్టంమీద క్యాబ్‌లో కూర్చోపెట్టి తెలిసిన ఆర్థొపీడిక్ డాక్టర్దగ్గరికి తీసుకెళ్ళాడు దుష్యంత్. ఎక్స్‌రే తీస్తే తెలిసింది, కుడికాలు చిన్నగా ఫ్రాక్చర్.
కాలుకి ప్లాస్టర్వేసినాక చెప్పాడు డాక్టర్ అగర్వాల్, “కొన్ని రోజులు బెడ్‌రెస్ట్ అవసరం. కాలిమీద బరువు వెయ్యొద్దు, వాకర్ వాడండి. ఈ మందులు వాడండి!” మందు చిట్టీ అందించాడు.
ఇంటికి తీసుకొచ్చి ఆమెని మంచంమీద పడుకోబెట్టాడు. మందిచ్చినాక వచ్చి పక్కనే కుర్చీలో కూర్చున్నాడు దుష్యంత్, “అయాం సారీ!” అన్నాడు ఆమె చేతిని తనచేతిలోకి తీసుకుని, “తప్పు నాదే!”
అంత బాధలోనూ చిరునవ్వు నవ్వింది జాహ్నవి, “ఛ, అదేమిటండీ, జరగాల్సింది జరిగింది!”
ఆ మధ్యాహ్నం … జాహ్నవికి మందిచ్చి పడుకోబెట్టి, తను హోటల్నించి తెప్పించిన అన్నం తినేసి తన స్టడీరూంలోకి వచ్చాడు. ఏదైనా రాసుకుందామని ల్యాప్‌టాప్ తెరిచి కూర్చున్నాడుగానీ మనసొప్పలేదు. ఆలోచనలు తమ వైవాహిక జీవితం మొదలైన దగ్గరికి మళ్ళినయి …
ఆఫీసుకి వెళ్ళడానికి తనకి అన్నీ సమయానికి సిద్ధంచేసిపెట్టడం, సాయంత్రందాకా ఒంటరిగా కాలక్షేపం చెయ్యడం, రాత్రి మళ్ళీ మర్నాటికి ఏర్పాట్లు, ఇదే హడావిడి జీవితం జాహ్నవిది. ఇక పిల్లలు పుట్టిన దగ్గర్నించి ఇంకా బిజీ లైఫ్, వాళ్ళకి అన్నీ అమర్చిపెట్టడం, బడికి సాగనంపడం, వాళ్ళకి స్నాక్స్ తయారుచెయ్యడం వగైరా. కొన్నాళ్ళు తనకి ట్రాన్స్ఫరైతే ఇంటిపనులు బయటి పనులు తనేచూసుకుంది. తను వీకెండ్లో వచ్చిపోయేవాడు. నిజానికి ఒక్క జ్వరం వచ్చినప్పుడే విశ్రాంతి తనకి! ఇప్పుడు తలుచుకుంటే బాధగావుంది, తనను విహారయాత్రకి తీసికెళ్ళడం చాలా అరుదు, టైంలేక. ఎవరైనా బంధువులు వెళుతుంటే వాళ్ళతో వెళ్ళొచ్చేది. చాలాసేపు అలా తన ఆలోచనల్లోంచి బయటికిరాలేకపోయాడు.
ఆ సాయంత్రం సంగారెడ్డినించి సుష్మిత ఫోన్ చేసింది. కాసేపు మాట్లాడాక, “నాన్నా, నేను రేపొచ్చి అమ్మను తీసికెళతాను కారులో, నువ్వు చూసుకోవడం కష్టం!” అన్నది.
వెంటనే అన్నాడు, “లేదమ్మా, కష్టం అనుకుంటే అన్నీ కష్టమే, వంటకాలు అమ్మని ఫార్ములా కనుక్కుని నేనే చేస్తాను. మా కెమికల్ ఫార్ములాలకంటే కష్టమేమీకాదు!” అని నవ్వేశాడు. ఆమె నివ్వెరపోయి, “అదికాదు నాన్నా …” అంటే, “ఫరవాలేదు, నువ్వేం దిగులు పడకు!” అని ఫోన్ పెట్టేశాడు.
తెల్లారే లేచి వంటింట్లోకి వెళ్ళాడు దుష్యంత్, కాఫీ చెయ్యడానికి. జాహ్నవి వారించబోతే, “జానూ, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు, గరళకంఠుడిలాగా నేను తాగి బాగుంటేనే నీకు పోస్తాను,” అని హామీ ఇచ్చాడు. అలాగే అన్నమూ వండాడు పాళ్ళు తెలుసుకుని. క్యాబేజీ కూర మాత్రం యూట్యూబ్‌లో చూసి ప్రయోగం చేశాడు. “ఎక్స్పెరిమెంట్ సక్సెస్!” అన్నదామె రుచిచూసి నవ్వుతూ. బాత్రూంకి వెళ్ళాల్సివొస్తే జాగ్రత్తగా భుజమ్మీద చెయ్యేసి తీసికెళ్ళాడు, వేళకి మందులిచ్చాడు. ఇద్దరూ కలిసి ‘ప్రైం’ ప్లాట్ఫారంలో పాత తెలుగు సినిమా చూశారు. జాహ్నవి మొహంలో మెదిలిన ఆరాధనా భావం చూసి ముచ్చటపడ్డాడు దుష్యంత్.
ఒక వారం రోజుల తరవాత వచ్చిన సుష్మిత ఆశ్చర్యపోయింది, తండ్రి సేవలుచూసి,”అమ్మ ఫోన్లో చెపితే ఏమోఅనుకున్నాను, ఏమయింది నాన్నా నీకు?” విప్పారిన కళ్ళతో అడిగింది. “ఇప్పుడో సినిమా డైలాగ్ చెపుతా విను, నేను సరిగా పట్టించుకోనప్పుడు ఎవరూ ఏమీ అడగలేదు, ఇప్పుడు నేను మారిపోతే మాత్రం ఏమయింది వీడికి అంటున్నారంతా, ఇదేనమ్మా లోకం తీరు!” అన్నాడు దిగులు నటిస్తూ. సుష్మిత గట్టిగానవ్వేసింది. “అన్నట్టు, నేను అమ్మకి మాత్రం జవాబుదారీ, నీకు కాఫీ కావాలంటే నువ్వు పెట్టుకో, మాకూ పొయ్యి!” అన్నాడు.
మరునాడు వంటింట్లోకి వచ్చిన సుష్మిత ఖంగుతిన్నది, దుష్యంత్ కళ్ళలో నీళ్ళు! “ఏమయింది నాన్నా?” అడిగింది ఆతృతగా. “ఉల్లిగడ్డలు, ఏడిపిస్తున్నయి కట్చేస్తుంటే!” నవ్వుతూ అన్నాడు టేబుల్‌వైపు చూపిస్తూ, “అమ్మకి చెప్పకు, ఆ ప్లాస్టర్ వేసిన కాలు ఈడ్చుకుంటూ వచ్చి నేను కట్చేస్తానంటుంది, అదేదో ఆమె కట్‌చేస్తే కన్నీళ్ళు కాకుడా పన్నిరు కారినట్టు!”
సుష్మిత గట్టిగా నవ్వేసింది, “నాన్నా, ఈసారికి నాకొదిలెయ్, ప్లీజ్” బ్రతిమిలాడింది.
ముగ్గురు మిత్రులు భార్యలను తీసుకుని వచ్చారు పరామర్శించడానికి. జీవన్‌రెడ్డి దిగులుగా, “ప్చ్, ఇప్పుడు రేఖ కూడా నన్ను నిలదీస్తుందేమో ఇలా సేవలు చెయ్యమని!” అన్నాడు భార్యవంక చూస్తూ. “ రేఖ కాదు, నీ అంతరాత్మ నిలదీస్తుంది, అడిగిచూడు!” అన్నాడు దుష్యంత్. అంతా నవ్వారు.
“నవ్వారుగద, సరే, ఇపుడొక గంభీరమైన విషయం చెపుతా వినండి. మామూలుగా గృహహింస అంటే ఏమిటో అందరికి తెలుసు, భార్యను కొట్టడం, తిట్టడం లాంటివి. కానీ ఈ చట్టానికి అందని ఒక హింస వుంది …” ఆగి ఒకసారి ఊపిరి తీసుకుని చెప్పాడు, “అది భార్యని ఒక పనిచేసే మిషన్లా చూడటం, ముఖ్యంగా ఒక ఉద్యోగం చెయ్యని ఇల్లాలు తెలియకుండానే ఇలాంటి వివక్షకు గురౌతోంది. ఇద్దరూ ఉద్యోగస్తులైతే భర్త తప్పనిసరిగా ఆమెకి ఇంటిపనిలో సాయంచెయ్యాల్సివస్తుంది, చేస్తారు!” నిట్టూర్చాడు.
“నిజమే!” అన్నాడు శశిధర్ జీవితకేసిచూస్తూ.
చతుర్వేది జేబులోంచి ఒక కాగితం బయటికి తీశాడు, “ఇంత గంభీరమైన విషయం విన్నాక వాతావరణం కొంత తేలికైతే బాగుంటుంది. అందుకే ఒక కవిత వినిపిస్తాను, ఈ సందర్భానికి తగినదే!
అర్థనారీశ్వరత్వం, ఈశ్వరతత్వం
అర్థమైతే అర్థాంగి పదం పరమార్థం
మనువాడినపుడు ఇచ్చిన ఒక వచనం,
‘నాతి చరామి’
మరవొద్దు మన్వంతరం!”
అంతా చప్పట్లుకొట్టారు, “భేష్!” “బాగుంది!”
అమెరికానించి అబ్బాయి జ్వలన్ కాల్, “నాన్నా, అమ్మ కాశీవెళ్ళడానికి మీ ఇద్దరికీ టికెట్స్ బుక్చెయ్యమంది, ఓకేనా?” అడిగాడు.
దుష్యంత్ బదులిచ్చాడు, “అదొక పిచ్చిది, కాశ్మీర్‌కి వెళ్ళాకగద కాశీకి, ముందు కాశ్మీర్‌కి బుక్చెయ్యి!” నవ్వుతూ అని ఫోన్‌పెట్టేశాడు.
వెనుదిరిగి చూసేసరికి జాహ్నవి, ‘ఏం సంగతి?’ అన్నట్టు కళ్ళెగరేసింది తనని చూస్తూ. ఇప్పుడామె కాలు పూర్తిగా నయమైపోయింది.
“అదికాదు జానూ, అప్పుడు నేనులేకుండా ఒక్కదానివి వెళ్ళావు కాశ్మీర్‌కి, మీ అన్నయ్యా, వొదినా వాళ్ళతో. అలాంటి రొమాంటిక్ ప్లేస్‌కి మనిద్దరం కలిసికదా వెళ్ళాలి?” అన్నాడు. జాహ్నవి మొహంలో వెలిగిన చిరునవ్వును చూస్తూ అన్నాడు, “అర్థాంగీ, ఇంకొక ముఖ్య విషయం, నేను రిటైర్ అయ్యానంటే నువ్వూ అయినట్టే, ఇకనించి ఇంటిపని ఏంవున్నా ఇద్దరం కలిసి చేసుకోవాలి, ఓకేనా?” ఆమె భుజాలమీద చెతులేసి కళ్ళల్లోకిచూస్తూ అన్నాడు.
*****
ఉద్యోగరీత్యా జూనియర్ లెక్చరర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసాను. హైదరాబాదులో నివాసం. మా నాన్న గారు కీ.శే. టీ.వి. సుబ్బారావు గారు పుస్తక రచయితలు. వారి స్ఫూర్తితో రచనా వ్యాసంగం సాగించాను. రేడియోలో కథలూ, భాషణలూ ప్రసారంకాగా, పిల్లల కోసం నాటికలు రచించి ప్రదర్శింపజేశాను. వివిధ పత్రికలలో కథలు అచ్చయినయి. రామోజీ ఫౌండేశన్ వారి 2019 కథల పోటీలో బహుమతి గెలుచుకున్నాను.