స్వర్ణపురి గ్రామస్థులు – 2

– మూలం- ‘ది పీపుల్ ఆఫ్ సునాపుట్’

– హృషికేష్ పాండా

అనువాదం – స్వాతి శ్రీపాద

ఇది జరిగినది 1945లో.

పక్కన ఉన్న నౌకా నగరంతో  అనుసంధానిస్తూ స్వర్ణపురి జిల్లా ప్రధాన నగరం నుండి ఒక తార్ రోడ్డు వెలిసింది.

ఆ రోడ్డు 1945 లో లేదు. ఆ వీధి పని వందేళ్ళ క్రితం మొదలైంది. అయినా దట్టమైన అడవి ప్రాంతం కావడం, ఎప్పుడేమవుతాయో తెలియని పర్వతాలు, కొండలు, కొండ వాగులు, వంకల వల్ల ఆ పని కష్టతరమైపోయింది. అంతే కాకుండా అతి ఖరీదైనది కూడా. బ్రిటిష్ ప్రభుత్వానికి కాని, స్థానిక పాలుకులకు కాని ఆ రోడ్ నిర్మాణానికి వనరులు లేకపోయాయి. అందువల్ల స్థానిక జనం స్వీయ సహకారంతో ఆ పని మొదలైంది. అంటే అలంకారికంగా చెప్పినా జీతభత్యాలు లేని శ్రమ రుద్దడంతో అనాలి. పనివాళ్ళు అవసరపడినప్పుడు రాజుగారి సైనికులు ఎర్ర కాప్సికమ్ గుత్తులుగా చేసి గ్రామాలకు పంపేవారు. గుత్తిలో ఎన్ని కాప్సికమ్ ఉంటే ఆ గ్రామం నుండి అంతమంది పనివాళ్ళు కావాలని అర్ధం. గ్రామ పెద్ద అంతమంది పనివాళ్ళను పంపేవాడు.

కేశవ్, రామహరి  శుక్ర ప్రభుత్వం కోసం అలాటి  ఉచిత వెట్టి చాకిరీకే వెళ్తున్నారు. వాస్తవానికి, 1945 నాటికి ఆ పనులను ప్రభుత్వం తాలూకు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ నిర్వహించేది. ఆ సంగతి గ్రామస్తులకు తెలియదు. అంతేకాక, అటువంటి ‘స్వచ్ఛంద’ శ్రమ ద్వారా జరిగిన పనులకు కొలతలు వేసి, బిల్లులు జారీ చేసి, దానికి వచ్చిన మొత్తాన్ని పర్యవేక్షకుడు తన ఆధీనంలోకి తీసుకునే విషయం కూడా తెలియదు.

కేశవ్ స్కూల్లో చదువుకుంటున్నాడు, అతని తండ్రి ‘పెద్ద ముఖ్య ‘, అంటే నాయకుడి క్రింద స్థాయివాడు, అంతేకాకుండా, ఆ గ్రామంలోనే అతిపెద్ద రైతు కూడా. అతను వేరొకరికి కూలి ఇచ్చి, తన బదులుగా పంపించవచ్చు, కానీ కేశవ్  ‘స్వచ్ఛంద’ కూలీగా వెళ్లాలని పట్టుబట్టాడు.

మధ్యాహ్నానికి వాళ్ళు ఒక గ్రామానికి చేరుకుని, బాలుర వసతిగృహంలో రాగులు, ఆకుకూరలతో చేసిన అంబలి తిన్నారు. రెండు రోజుల క్రితం, పని నుండి తిరిగి వస్తున్న ఒక ‘స్వచ్ఛంద’ కార్మికుడిని నరభక్షక పులి ఎత్తుకుపోయింది. అతని భార్య  వీధిలో కూర్చొని, నిశ్శబ్దంగా ఆగని కన్నీళ్లతో ఎక్కిళ్ళుపడుతూ విలపిస్తోంది. పులి ఎవరినైనా చంపినప్పుడు, చనిపోయిన వ్యక్తి ‘డూమా’ అనే దుష్ట ఆత్మగా మారిపోతాడు. ఆ వితంతువు భరించలేని దుఃఖంతో ఏడుస్తోందా లేక ఆమె శరీరంలోకి డూమా ప్రవేశించిందా అని గ్రామస్తులు ఆశ్చర్యపోతూ వాదించుకున్నారు.

స్వర్ణపురి గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు ఆ ముగ్గురు అబ్బాయిలకు తోడుగా కొంత దూరం వరకు వచ్చి జాగ్రత్తగా ఉండమని సలహా ఇచ్చి, తిరిగి వెళ్ళారు. కేశవ్ తన స్కూల్ యూనిఫాం, మెడ వరకు గుండీలు పెట్టిన చొక్కాను, వదులు వదులుగా ఉన్న పెద్దసైజ్ నిక్కర్ ను తీసేసి నడుముకు గోచీ కట్టుకుని, పొడవాటి, పలుచని గుడ్డను తలపాగాగా చుట్టుకున్నాడు. ఆ ముగ్గురూ బృందగానం చేస్తూ, సుదీర్ఘ ప్రయాణపు ప్రభావాలను అధిగమించి, పని చెయ్యాల్సిన ప్రాంతానికి  సూర్యాస్తమయానికి ముందే చేరుకున్నారు.

కొంతమంది అక్కడక్కడా చిన్న చిన్న గుంపులుగా పని చేస్తున్నారు. పనివారి కోసం కొన్ని గుడిసెల వరుసలు ఉండటంతో అది ఒక చిన్న గ్రామంలా అనిపిస్తోంది. కొంతమంది పిల్లలు మంట వేసి దాని చుట్టూ ఆడుకుంటున్నారు. పనికి వచ్చిన ఒక యువకుడికి యువతికి ఆ రోజే పెళ్లి జరిగింది. ఆ యువకుడు అందరికీ కొంచెం బియ్యపు బీరు ఇవ్వడంతో, సాయంత్రం పని తొందరగా ముగిసింది. కొంత మంది వెళ్లి ఒక మచ్చల జింకను వేటాడి, దాని మాంసాన్ని అందరికీ పంచారు. ఆడవాళ్లు వంట చేస్తున్నారు.

కేశవ్ , రామహరి, శుక్ర కాంట్రాక్టర్‌ వద్ద  హాజరై, రాత్రి గడపడానికి ఒక వరండా కోసం వెతికారు. పనసపూర్ కి చెందిన, పెద్ద కళ్ళ ఆ అమ్మాయి, గిడసబారిన సాల్  చెట్టుకు ఆనుకుని వ్యాకులపడుతూ ఆకాశం వైపు చూడటం, రామహరిని కలవరపరిచింది, అతనికి నిద్రలేకుండా చేసింది, దిగులుగా, నిశ్శబ్దంగా మార్చేసింది. కేశవ్ ఎక్కడికో అదృశ్యమయ్యాడు. అర్ధరాత్రి దాటాక, రామహరి ఆ పెద్ద కళ్ళ అమ్మాయి కోసం తపిస్తూ, లక్ష్యం లేకుండా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.

షాంటీస్ వీధిలో, కాంట్రాక్టర్ గుమాస్తా ఒక చక్రవర్తిలా నులక మంచం మీద కూచుని ప్రతి స్త్రీని తీరికగా కొలుస్తున్నాడు. అతని పనివాడు తిర్యక్ లొడలొడా వాగుతూ పదేపదే అతని కోసం ఏ అమ్మాయిలను పంపాలని అడుగుతున్నాడు. గుమాస్తా తన మీసాలను నెమ్మదిగా తిప్పుతూ, లోలోపల రహస్యంగా ఆహ్లాదం కలిగించే గిలిగింతలు అనుభూతిస్తూ, ఏ స్త్రీని పంపమనాలో నిర్ణయించుకోలేనట్టు సందిగ్ధంలో ఉన్నట్టు కనబడుతూ, ముడిపడిన అతని నుదురు నలిగిన మురికి గుడ్డలా కనిపిస్తోంది. .

శాంతిభద్రతలను కాపాడటానికి, సగం యూనిఫాంలో నీలిరంగు చొక్కా ధరించిన గ్రామ పోలీసు అయిన చౌకీదార్, తూలుతూ శాంతి భధ్రతలు రక్షీంచే అతని లాఠీతో దోమలను తరిమికొట్టే ప్రయత్నంలో ,  మాటిమాటికీ తననే కొట్టుకుంటున్నాడు.

శుక్ర ఒక వరండాలో ఒంటరిగా నిద్రపోయాడు. తెల్లవారుజామున అతనికి మెలుకువ వచ్చేసరికి , రామహరి అతను కప్పుకున్న వస్త్రాన్ని లాగుతూ, “వచ్చావా?” అని అడగడం కనిపించింది. ” ఇక్కడ పని చేయడానికి వచ్చారా లేక పడుకోవడానికా?”

పశ్చాత్తాపపడటానికి బదులుగా, శుక్ర విచారంగా, “రాత్రంతా మీరిద్దరూ ఎక్కడికి మాయమయ్యారు?” అని అడిగాడు.

రామహరి పగలబడి నవ్వి ఇలా అన్నాడు: ” ఆ పులి చంపిన మనిషిని డూమా చంపింది, మనం అంబలి తిన్న ఊరిలో అది నిన్ను ఆవహించి ఉండాలి. లేకపోతే  మేము రాత్రంతా ఇక్కడే ఉన్నా మమ్మల్ని నువ్వు ఎలా చూడలేదు”.

“కావచ్చు”  భయం ఆవరించిన శుక్ర సందేహిస్తూ అన్నాడు. రాత్రంతా అతనికి భయంకరమైన కలలు వచ్చాయి. జనం భీకరమైన పోరాటాలకు దిగినట్టు; గ్రామం ఒక చివరన అగ్నిప్రమాదం జరిగినట్టు. కలలలో నీరు ప్రవహించినట్లు,  పులి పొదలో దాక్కున్నట్లు, ఆ మంటలు వ్యాపించాయి. ఆ మంటల నుండి, పులి నుండి తప్పించుకోవడానికి శుక్రుడు ఒక చెట్టెక్కాడు. ఒక మంత్రగత్తె అతన్ని వెంబడించింది. ప్రతి కల ఒక దుశ్శకునమే. అతను తీవ్ర భయాందోళనకు గురయ్యాడు. తనను దెయ్యం పట్ట బోతోందా, లేక పులి-డూమా ఇప్పటికే తనను ఆవహించిందా?

“త్వరగా లే, లేకపోతే నేను తిర్యాక్ అనే పనివాడిని  పిలుస్తాను,” అన్నడు రామహరి.

శుక్రుడు వెంటనే లేచి కూర్చున్నాడు. పొద్దున్నే ఆ పనివాడి స్పర్శతో అపవిత్రం కావడం అతనికి ఇష్టం లేదు. నదిలో స్నానాదులు ముగించుకుని వచ్చాడు. వణికిపోయాడు. తన అబద్ధాలు కలిగించిన నష్టాన్ని చూసిన రామహరి, కన్నుగీటి అన్నాడు: “శుక్రా, నేను అబద్ధం చెప్పాను. మేము రాత్రి బయటకు వెళ్ళాం. మాతో అందమైన యువతులు ఉన్నారు. చాలా సరదాగా గడిచింది.”

పనివాళ్ళు విధులకు హాజరయ్యారు. ఇక్కడ వారు భిన్నంగా కనిపించారు. స్త్రీలు జుట్టుకు నీలం, ఊదా రంగు రిబ్బన్లను కట్టుకుని, ప్రకాశవంతమైన ఆకుపచ్చ, పసుపు రంగు చీరలను మోకాళ్ళ వరకు  చుట్టుకున్నారు. అడవి నుండి వచ్చిన ఒక కులీనుడు, చిన్న పంచ చుట్టుకుని , ఖరీదైన వెల్వెట్ చొక్కాతో ఒక పర్యవేక్షకుడిలా, అధికారిలా  చుట్టూ చూస్తున్నాడు. ఆ చొక్కాకు ఒక్క గుండీ కూడా లేదు. మొదటి రోజు నుండి, అతను పని జరిగే స్థలానికి వచ్చిన ప్రతి సాయంత్రం తన సమావేశం నిర్వహించేవాడు. ఎవరైనా అతనికి నచ్చినప్పుడు, అతను తన చొక్కా నుండి వెండిలా మెరుస్తున్న ఒక బటన్ తీసి బహుమతిగా ఇచ్చేవాడు. ఇప్పుడు మొత్తం బటన్లు బహుమతిగా ఇచ్చేసాడు.  ఈసారి అతను ఎవరికైనా అనుగ్రహం చూపాలనుకుంటే, ఆ చొక్కాను ఇచ్చేయాలి.

ఎవరో ఒక పాటను కూనిరాగం తీస్తున్నారు. ఆ పాట వసంత గాలిలా పెదవుల నుండి పెదవులకు ఎగురుతూ వచ్చింది. పనివాడు తిర్యాక్, అసభ్యంగా గొణుక్కున్నాడు: ‘వేశ్యా సంతానమా  , మీరిక్కడికి పని చేయడానికి వచ్చారా?  పాడటానికి వచ్చారా?’ ఉదయం పది గంటలకల్లా, ఆ చౌకీదార్ బాగా తాగి, నేల మీద కూర్చున్నా తూలుతున్నాడు. అతను పక్కన కూర్చున్న ఒక మనిషి భుజం మీద ఒక చేయి వేసి,  వాగుతున్నాడు: ” అనాది, నా మాట విను, ఇది తీసుకో. ఈ విషయంలో నేను నీకు సహాయం చేయలేకపోతే, ప్రభుత్వ సేవకుడిగా నా ఉద్యోగాన్ని వదిలేస్తాను.”

అనాది చట్టబద్ధమైన దొంగ, బందిపోటు; అతను తను చేసే పనికి కొంతమంది అధికారులకు అక్రమ పన్ను చెల్లించాడు. ఇటీవల, ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రమైన కాట్‌పాడ్‌లో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది, ఎంత పెద్దదంటే బ్రిటిష్ ప్రభుత్వ పోలీసులు రంగంలోకి దిగారు.

అనాది తన బందిపోట్ల గాంగ్ వదిలేసి ఈ ప్రాంతం లో పనికి స్వచ్ఛంద ‘కార్మికుడిగా’ చేరాడు. కానీ అతను అలాంటి కాయకష్టం ఎప్పుడూ చెయ్యలేదు, చేయలేడు. అందుకే అతను చౌకీదారుతో ఈ స్నేహాన్ని ఏర్పరుచుకున్నాడు.

మధ్యాహ్నం పని ముగిసింది. స్త్రీలు కట్టెలు ఏరడానికి వెళ్లారు. కొందరు  చురుకైన యువకులు నాటుసారా కొట్టు దగ్గర ఆగారు. ఒక యువతి తన మందపాటి ఇత్తడి గాజులను ప్రవాహంలో కడిగి మెరుగుపెట్టుకుంటోంది.  పిల్లలు కొందరు నీళ్ళలో కేరింతలు కొడుతున్నారు. సంధ్యవెలుగు నీడలో ప్రవాహపు నీళ్ళు చల్లగా, ఆకుపపచ్చ కలిసిన సముద్రపునీటిలా కనిపించాయి. లోపల గుడిసెలో ఒక మనిషి మలేరియాతో బిగుసుకుపోయి మూలుగుతున్నాడు.

అప్పుడే అది జరిగింది.

ఒక పదిహేను మంది యువకులు కాంట్రాక్టర్ చుట్టూ మూగి డబ్బులు డిమాండ్ చేశారు. ‘

“ఏం డబ్బు?’ అని ఆశ్చర్యపోయిన కాంట్రాక్టర్ అడిగాడు.

” మా కూలి డబ్బు.”

” ఏం కూలీ?”

” మేం చేసిన పనికి కూలీ?”

“ఏ పని? ”

” రోడ్డు పనులు”

” ఏ రోడ్డు?”

” ఈ రహదారి”. దాని చివరలో ఒక లావుపాటి కప్ప బెకబెకలాడింది. కాంట్రాక్టర్ కళ్ళు రెపరెపలాడించి , నులుముకున్నాడు.

ఇది కలా తను కలగంటున్నాడా ? ఎవరు ఎవరిని డబ్బు అడుగుతున్నారు, ఎందుకు? కాంట్రాక్టర్ గట్టిగా  అన్నాడు: ‘వెళ్ళిపోండి, దయచేసి ఇక్కడి నుండి పోండి.’

“మేం పనిచేశాం కదా,” అన్నాడు కేశవ్. “మాకు కూలి అడుగుతున్నాము సరేనా?.”

కాంట్రాక్టర్ సవాలు విసిరాడు, ” ఏం పని? జైలుకు వెళ్లాలనుకుంటున్నారా? ఇక్కడి నుండి వెళ్ళిపోండి వెధవల్లారా ! వాళ్ళనేది నిజమే, అబ్బాయిలు కోతుల లాంటివారే!”

“అయితే వెళ్లి మీ పని చేయించుకోవడానికి కోతులను తెచ్చుకోండి.  మేము పనిచేశాము. మాకు ఎందుకు డబ్బులు ఇవ్వరు?”

కాంట్రాక్టర్ చెప్పాడు: “మీరు మీ గ్రామానికి తిరిగి వెళ్ళి, మీ గ్రామ పెద్దను కూలి అడగండి. మీ పశువులు అడవులలో మేస్తాయి, కదా? ఆ అడవి మీ అయ్యది కాదు కదా ? మీ పశువులు ప్రభుత్వ అడవిలో మేస్తుంటే, మీరు ప్రభుత్వానికి ఉచితంగా పని చేయాలి, కదా? మీరు ప్రభుత్వానికి చెందిన  కొండలలో పంటలు పండిస్తారు, పన్నులు చెల్లించరు, కదా?”

ఆ కాంట్రాక్టర్ చాలా భారీగా, ఒక పెద్ద జలగలా కనిపించాడు. అతను ముక్కు చిట్లించి, వెక్కిరిస్తూ అన్నాడు: ‘ఇక్కడి నుండి దొబ్బెయ్యండి, ఈ విషయం ఈ చౌకీదార్‌కు తెలిస్తే, అతను పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేస్తాడు. పోలీసులు నిన్ను ఉరి తీస్తారు. ఇది సాధారణ సమయం కాదు, యుద్ధ సమయం.”

ఒక కూలీ ఎముకలకు అతుక్కుపోయిన పొట్టను చూపిస్తూ బ్రతిమాలాడు: “నేను ఏం  తినాలి? మీరు కూలీలు ఇవ్వరు. పంట మొత్తం భూమి పన్నులు, అప్పులు తీర్చడానికే పోయింది. నా దగ్గరున్న రెండు నాణేలు కూడా అయిపోయాయి. ఇప్పుడు నేను ఏం తినాలి?”

కొందరు యువకులు అరిచారు “ఈ కాంట్రాక్టర్ ప్రభుత్వం నుండి డబ్బు తీసుకుని దాన్ని దుర్వినియోగం చేస్తున్నాడు. అతన్ని చితకబాదండి,”

కాంట్రాక్టర్ వినయంగా మారి బ్రతిమాలాడు: ‘” ప్రభుత్వం నాకు ఏ జీతమూ చెల్లించడం లేదు. సోదరులారా, దయచేసి నన్ను నమ్మండి.”

అతను ఇంతటి అపూర్వమైన తిరుగుబాటు ఊహించలేదు.

గుమస్తా, చౌకీదార్ అక్కడికి చేరుకుని ఆ యువకులను  తరిమివేయడానికి చూసారు. చౌకీదార్ తన లాఠీకర్రతో వాళ్ళను కొట్టాడు. కేశవ్ అతని చేతిలోని లాఠీ లాక్కుని అన్నాడు: “చౌకీదార్, మమ్మల్ని ఎందుకు కొడుతున్నావు? మేం పనిచేశాం. మా కూలి అడుగుతున్నాము.”

చౌకీదార్ ముఖం ఆశ్చర్యంతో బుట్టలా విప్పారింది. అతను కేశవ్ ను నిశితంగా పరిశీలించాడు. అవును, ఆ పిల్లాడు ఊరివాడిలానే కనిపించాడు.కాని ఎందుకిలా మాట్లాడుతున్నాడు?

గుమస్తా అన్నాడు: “ఏమిటీ  పోలీసు లాఠీని ఆపేయ్యడమే !  సముద్రాలు కావల బహిష్కరణ తప్పదు”

బయట ఒక చిన్న తోపులాట జరిగింది. ఆ తరువాత యువకులు ఆ చిన్న స్టోర్   నుండి సిమెంట్, సున్నం బస్తాలను ఒకరి వెనుక ఒకరుగా వాగు వద్దకు ఈడ్చుకు వెళ్లారు. వాటిని ప్రవాహం లోకి విసిరేసారు.  తర్వాత పనివాళ్ళు మూడు నాలుగు బస్తాలను ఈడ్చుకెళ్లారు. ఎవరో సగం కట్టిన చెక్క వంతెనను గొడ్డలితో నరికారు. వాగులోకి వాటిని విసిరి నీటిలో పడేశారు. సిమెంట్, సున్నం బస్తాలు పడగానే ఆ చిన్న వాగులోని నీరు మరిగింది. అమాయకమైన చేపలు ఉక్కిరిబిక్కిరై  ప్రవాహ తీరానికి కొట్టుకు వచ్చి వెల్లకిలా పడ్డాయి.

కాంట్రాక్టర్ గట్టిగా ఏడుస్తూ, గట్టు వెంబడి పరుగెత్తుతూ, ” ఓ ప్రభుత్వమా, ఓ ప్రభుత్వమా! (ఓ దేవుడా ఓ దేవుడా అన్నట్టుగా!) అతను ప్రవాహంలోకి దిగి , ఒక సున్నపు బస్తా లాగాడు. కాళ్ళు కాలాయి. ఇప్పుడిహ విపరీతమైన, భయంకరమైన, శక్తివంతమైన, పలుకుబడిగల అహంకారి అయిన కాంట్రాక్టర్ ఒక చిన్నపిల్లవాడిలా అరిచి, చౌకీదార్‌తో  అన్నాడు: “చూడు అన్నా చౌకీదార్, నా కాళ్ళకు బొబ్బలు వచ్చాయి, నేను కన్నీళ్ళతో నీళ్ళలో నుండి  సిమెంట్, సున్నం బస్తాలు రక్షించుకుంటున్నాను.  ప్రభుత్వ డబ్బు ఆదా చేయాలనే ఉద్దేశంతో వారికి డబ్బు చెల్లించలేదు. నేను ప్రతిదీ ప్రభుత్వం మంచికోసమే చేస్తాను. ఇది మీరు ఖచ్చితంగా గమనించే ఉంటారు. విచారణ జరిగినప్పుడు, నేను ప్రభుత్వానికి ద్రోహం చేయలేదని మీరు వారికి చెప్పాలి.”

కేశవ్ మొహం పరిశీలనగా గమనిస్తుంటే చౌకీదార్ ముఖంలో భయం ఆవరించింది. అతను ఉత్తర ధ్రువాన్నో లేదా నిప్పునో కనుగొన్న వాడిలా ఉత్సాహంతో అరిచాడు: “ఓహో, ఇతను పల్లెటూరి కుర్రాడు కాదు, ఇతను ఒక అండర్‌గ్రౌండ్ మనిషి, ఒక ఉగ్రవాది” అని . అప్పుడు కాంట్రాక్టర్, గుమస్తా, చౌకీదార్  (పగలు రాత్రి గొడవ చేసిన) తిర్యక్  కూడా మౌనం వహించారు.

ఆ యువకులు కూర్చుని, ప్రతి పనివాడి కూలీ లెక్కవేసారు. వారు కాంట్రాక్టర్‌తో అందరి జీతాలు చెల్లించేలా చేశారు. కాంట్రాక్టర్ దగ్గర డబ్బు అయిపోగానే,  కల్తీ మద్యం దుకాణం నుండి అప్పు తీసుకున్నాడు; నిజానికి ఆ కల్తీ మద్యం దుకాణం కాంట్రాక్టర్‌దే. స్వచ్ఛంద సేవా శిబిరం ముగిసిందని, కార్మికులు ఇళ్లకు తిరిగి వెళ్ళవచ్చని ఆ యువకులు ప్రకటించారు. వాళ్ళు కాంట్రాక్టర్ దగ్గర నుండి , ఖాతాలు, పటాలు, అంచనాలు, జీతాల పట్టికలు, రసీదులు, ఇతర కాగితాలన్నింటినీ తీసుకుని వీధిలో కుప్పగా వేశారు; ఎవరో ‘మహాత్మా గాంధీ కీ జై’ అని నినాదాలు చేస్తుండగా, ఒక మహిళ పొయ్యిలో నుండి మండుతున్న కట్టెను లాగి ఆ కాగితాల కుప్పకు నిప్పంటించింది, దాంతో మంటలు ఎగసిపడ్డాయి.

చాలా మంది కార్మికులు అర్ధం కాని భయాందోళనలగుప్పిట్లోనో, దుష్టశక్తుల గుప్పిట్లోనో ధృవీకరించలేని పుకార్లకు భయపడి రాత్రికి రాత్రే అదృశ్యమయ్యారు.

చాలా మంది జనం వెళ్లిపోయి నిశ్శబ్దం రాజ్యమేలుతున్నప్పుడు, కేశబ్, రామహరిలతో సహా ఐదుగురు అబ్బాయిలు ‘మహాత్మా గాంధీకి జై! భారత్ మాతాకి జై!’ అని నినాదాలు చేశారు.

శుక్ర స్వర్ణపురికి తిరిగి వచ్చాడు. కాంట్రాక్టర్, గుమస్తా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. ఆ గుడిసెల వీధిలో ఆ ఐదుగురు అబ్బాయిలు, చౌకీదార్, లైసెన్స్ పొందిన బందిపోటు అనాది మాత్రమే ఉండటంతో అది దాదాపు నిశ్శబ్దంగా ఉంది. మలేరియాతో బాధపడుతున్న వ్యక్తి తన గుడిసెలో మూలుగుతున్నాడు.

లైసెన్సు పొందిన బందిపోటు అనాది, మాయం కావడానికి పథకం వేశాడు. పోలీసులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కానీ విధి అతనికి అనుకూలించలేదు. ఈ నిర్జన ప్రదేశానికి చేరుకోవడానికి అతను మైళ్ళ కొద్దీ నడిచాడు.  మట్టిని తవ్వడానికి ప్రయత్నించాడు, కానీ ఆ కఠినమైన శారీరక శ్రమ  శక్తికి మించినది. ఇప్పుడు అతను ఏం  చేయాలి? అతను చౌకీదార్‌ను ఎంతగానో పొగిడాడు, అతని కాళ్ళు మర్దనా చేశాడు, కానీ ఈ ఐదుగురు దుర్మార్గులు తమ రోడ్‌షో ప్రదర్శించడానికి ఎక్కడినుంచో హఠాత్తుగా ప్రత్యక్షమయ్యారు. అతను తన దురదృష్టానికి ఏడ్చాడు; వెళ్ళడానికి ఎక్కడా చోటు లేదు.

కేశవ్  మిగతా యువకులకు  వివరించాడు: ‘మనం పారిపోము. మనం జైలుకు వెళ్ళాలి. లేకపోతే,  అల్లరి మూకలకూ మనకూ ఎలాంటి తేడా ఉండదు, మనం జైలుకు వెళ్ళకపోతే ఈ దోపిడీకి అంతం ఉండదు.  బ్రిటిష్ ప్రభుత్వం ఈ దేశాన్ని విడిచి వెళ్ళదు.” అనాది అడిగాడు,

మీరు జైల్ కి వెళ్తే బ్రిటిష్ వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళకేం ఇబ్బంది ఉంది గనక ?'”

కేశవ్ వాదన అతన్ని అయోమయానికి గురిచేసింది.

చౌకీదార్ తడబడుతూ వెలుగులోకి వచ్చాడు, ఇప్పుడు అతను విచారపడుతున్నాడు.  కాగితాల చితి చల్లారిపోయింది. ప్రభుత్వం ఎప్పుడైనా ఈ దేశాన్ని విడిచిపెడుతుందా? నేను దూరంగా ఉన్నాను, ఎక్కడో విశ్రాంతి తీసుకుంటున్నాను. ఏం జరిగిందో తెలియదు. కాగితాలా? వాగులో సున్నం, సున్నపురాయి ఎవరు పోశారు? సరే, ఇప్పుడు అనాది భుజం మీద చేయి వేసి అడిగాడు: “వీటిని ఎవరు కాల్చారు? సున్నం , సిమెంట్ ఎవరు నీళ్ళ పాలు చేసారు? సరే, నాకిప్పుడు అర్ధమైంది. అడవిలోకి పారిపోయిన ఆ వ్యక్తులు, నిశ్చయంగా వాళ్లే ఇది చేసారు.”

యువకులు అన్నారు: ‘వాళ్ళు కాదు. మేమే. మేమే ఆ కాగితాలను కాల్చేశాం . మేమే సున్నం, సిమెంట్  వాగులో పోశాం . ఎందుకంటే కాంట్రాక్టర్ కార్మికులకు వేతనాలు చెల్లించలేదు.”

చౌకీదార్ ఏమీ విననట్టు నటిస్తూ, పైపై మెచ్చుకోలుగా : ‘ఏరా కుర్రాళ్ళూ, ఇక్కడ ఎందుకు తిష్ట వేశారు? వెళ్ళిపోండి. ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగించిన వాళ్ళందరినీ చచ్చిన కుందేళ్ళలా నిప్పుల మీద వేలాడదీస్తారు. చచ్చిన కుందేళ్ళలా ఉరి తీయించుకోవడం మీకు ఇష్టం లేకపోతే, ఇక్కడ తిష్ట వేయకండి.’వెళ్ళిపొండి”.

అడవిలో  చీకటిలోకి చూస్తూ అన్నాడు, ‘మీరు తప్పించుకోగలమని అనుకోవద్దు. మీరు బ్రిటిష్ ప్రభుత్వ పనులను చెడగొట్టారు; చూస్తూ ఉండండి, మీలో ప్రతి ఒక్కరినీ ఉరితీస్తారు.”

కేశవ్ మళ్ళీ చెప్పాడు: “మేము సిమెంట్, సున్నం బస్తాలను పారేశాము. మేము ఐదుగురం ఉన్నాము. మా పేర్లు రాసుకోండి. మేము కాగితాలను కాల్చేశాము.” చౌకీదార్ ఏమీ విననట్టు నటిస్తూ చీకటి అడవిలోకి గద్దించాడు:

‘అమ్మ నా  వెధవల్లారా, మీరు మీ అమ్మల్లో దూరాలని ప్రయత్నిస్తున్నారు. గుర్తుంచుకోండి, ఈ ప్రభుత్వం చాలా కౄరమైనది. మూర్ఖులారా! గాలిని పట్టుకోవడానికి మీరు ఎలుకల బోనులు పెడతారా? మూర్ఖులారా! పాముకు కర్రతో రెండు దెబ్బలు కావాలి, కానీ ఎలుకకు ఒక్క దెబ్బ చాలు… ”

“మేము, మేము, మేము,’ అన్నారు ఆ ఐదుగురు యువకులు.

కేశవ్  అన్నాడు: ‘మేం   ప్రభుత్వం పనులను నాశనం చేశాం . జీతాలు లేకుండా కార్మికులుగా పనులకు వచ్చిన వారందరినీ పోలీసులు కనుక్కోకుండా ఉండేందుకు, మేం  ప్రభుత్వ పత్రాలను తగలబెట్టాం .’ అప్పుడు అతను, ‘బ్రిటిష్ ప్రభుత్వమా! భారతదేశాన్ని విడిచిపెట్టండి!’ అని గట్టిగా అరిచాడు. చివరికి చౌకీదార్ ఆ పిల్లల వైపు దృష్టి సారించి, ‘ఇప్పుడు ఎందుకు ఇంకా ఉండిపోయారు? వెళ్ళిపోండి, దయచేసి వెళ్ళిపోండి’ అని గట్టిగా అరిచాడు.

“నేరస్థులం మేమే, మమ్మల్ని అరెస్టు చేయండి,’ అని కేశవ్ అన్నాడు. దానికి ఆ చౌకీదార్‌కు పిచ్చి  కోపం వచ్చింది, ఒక పోలీసుకి ఉండాల్సిన అసలైన కోపం అది. ఛీ, ఎంత మొండి అల్లరి మూక! అతను తన లాఠీతో వారిని తరుముతూ గట్టిగా అరిచాడు: ” మీ అక్కచెల్లెళ్ళు నా భార్యలు.   మీ తల్లిదండ్రులు మీ కోసం ఎదురు చూస్తున్నారు. మీరు పసికూనలు, మీ బుగ్గలు గిల్లితే  పాలు కారతాయి. బ్రిటిష్ వారి కత్తులు చాలా పదునుగా ఉంటాయి, వాటికి మీ మెడలు ఎందుకు బలి పెడతారు? వెళ్ళిపోండి. దయచేసి వెనక్కు వెళ్ళిపొండి.”  అర్ధరాత్రి దాటినా ఎవరూ వెళ్ళలేదు. చౌకీదార్ మనసు తలకిందులైంది. కల్తీ మద్యం దుకాణం కూడా మాయమైపోవడంతో, అతని మనసును శాంతపరచుకోవడానికి ఒక్క చుక్క కూడా దొరకలేదు. కేశవ్  చౌకీదార్‌ను ఓదార్చాడు: ‘చింతించకు. నీ బహుమతులు, భత్యాలు అలాగే ఉంటాయి. దానికి తోడు, నీకు ఒక బహుమతి కూడా ఇస్తారు. రేపు ఉదయం మమ్మల్ని అరెస్టు చేసి ఛతువాలోని పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్ళు. నువ్వు అంత దూరం నడవలేకపోతే, మేమే నిన్ను భుజాలపై మోసుకువెళ్తాము. అక్కడ ప్రథమ సమాచార నివేదిక నమోదు చేసి, నీ బహుమతులు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్ళు.’ చౌకీదార్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతనికి కుటుంబం లేకపోతే,  ప్రతిఫలాలను పట్టించుకునేవాడు కాదు. అతనికి మద్యపాన వ్యసనం లేకపోతే బ్రిటిష్ ప్రభుత్వానికి సేవ చేసేవాడు కాదు.  అతను భూస్వామి అయినా లేదా బందిపోటుగా లైసెన్సు ఉన్నా,  అబ్బాయిలను ఇలా ఇబ్బంది పెట్టేవాడా?

ముందుకు సాగాడు. మరుసటి ఉదయానికల్లా, చౌకీదార్ ఆత్మస్తుతితో, అతని ఛాతీ ఒక వీరుడిలా ఉప్పొంగింది. అతను ఇక ఏడవలేదు.  అడవి తీగల ముడులతో కట్టేసిన రామహరి కేశవ్ లతో సహా ఐదుగురు అబ్బాయిలతో, చాతీ విరుచుకుని నడిచాడు. ఎందుకంటే వారిని అడవి తీగలతో కట్టారు. ఈ యువ విప్లవకారులు ఎప్పుడైనా అవి విప్పుకుని వెళ్ళిపోయి ఉండవచ్చు, అడవి తీగలతో ఒక్కో చేతినే ముడి వేసారు.  లైసెన్స్ పొందిన దొంగ అనాది, చౌకీదార్ పక్కన నడిచాడు,

చౌకీదార్ ఒక ఈతచెట్టును చూడగానే  అతనికి దాహం వేసింది. రామహరి చెట్టు ఎక్కి, కొంత సారాయి సేకరించి తెచ్చి చౌకీదార్ కు ఇచ్చాడు. అతను దాన్ని గటగటా తాగేసి, ఇంకా కావాలని అడిగాడు; కానీ ఆ పిల్లలు తమకు ఆలస్యం అవుతుందని, ఇంకా వేగంగా నడవాలని బ్రతిమాలారు. అకస్మాత్తుగా అనాది అన్నాడు: ‘అన్నా, నా పేరును పోలీస్ స్టేషన్ డైరీలో రాయండి, నేను వెళ్తున్నాను.’ , ఏం జరుగుతోందో ఎవరైనా గ్రహించేలోపే అతను కొండల్లోకి అదృశ్యమయ్యాడు.

పోలీస్ స్టేషన్ ఒక కొండ శిఖరం మీద ఉంది. చౌకీదార్  అతని బందీలు కొండ ఎక్కి, పోలీస్ స్టేషన్ దాటి, వాలుగా కిందికి నడుస్తుండగా, ఆ ఐదుగురు యువ విప్లవకారులు అతన్ని ఆపారు. వారు తమను తాము కట్టుకున్న అడవి తీగలు తెగిపోయాయి. అరెస్టు అయిన వారిలో ఒకడు పొదల వద్దకు పరుగెత్తి మరిన్ని తీగలను సేకరించి, వారందరినీ మరోసారి ఖైదు చేశాడు. వారు పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడానికి ఈ ప్రక్రియకు మరో గంట ఎక్కువ సమయం పట్టింది. మరుసటి రోజు ఆ ఐదుగురు యువకులు జైలుకు వెళ్లారు. ఏ న్యాయమూర్తి తమను జైలుకు పంపారో,  ఏ చట్ట నిబంధనల ప్రకారం పంపారో వారికి తెలియదు.

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.