తంగేడు పూలు

-రావుల కిరణ్మయి

జీవాలన్నిట్ని గుట్ట కిందికి తోల్కపోయిన రెడ్డి, గుట్టను తవ్వేస్తూ మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు, టిప్పర్లు రేపుతున్న ఎర్ర మట్టిని దుబ్బ బుక్క గులాలు పెయ్యంత పులుముకున్నట్టు అయితాంటే

థూ …!నీయవ్వ …!నియతిలేని బతుకులు. కొనేది నిమ్మకాయ కోసరేది గుమ్మడికాయని ఒకట్రెండు ట్రిప్పులకు పైసలు కట్టి మెత్తంగ గుట్టను గుండు గోరుగుతాంటే ….నిమ్మకు నీరేత్తినట్టున్న వ్యవస్థ మీద అక్కసంతా ఎల్లగాక్కిండు.

గుట్టమీద నుర్సేరీలు పెంచుతరని ఎప్పటోల్గే అడవులు పెంపకమయితయని కలలుగన్నడు. గని, ఆ ఆశలు గూడ అడుగువట్టినయ్. తన యాతనంతా తన జీవాల కోసమే గాదు, జూడంగ కలలాగ మిగిలిపోతున్న విచ్చుకలు, ఊరవిచ్చుకలు, నెమళ్ళు, పాయిరాలు ఇట్ల తలకాయల మేసులుతుండంగ ఆ దాపున గూసున్నడు.

దూరంగ ఎర్ర చీర గోశి వెట్టుకొని పైట కొంగుల తంగేడు పూలు పోగేసుకత్తున్న కొంరు కనవడి ,రెడ్డి లోపలి సిటపట నిప్పులు సల్లవడి తెల్లచక్రం పువ్వై మనసు ఇప్పుకున్నది. రెడ్డి,

“తంగేడు పూవుల్లు తలనిండ ముడుతూవే సిన్నీ …!నా కొంరూ …!ఎర్ర చీరకు తోడు అవిగాదే కొంరూ ..!అవిగాదే కొంరూ …!ఎర్ర మందారాలు తెమ్మనీ నీవంటే ఎగిలివారంగ నేనె మందారమవుడునే …!”

………………………………………………అంటూ

పాటకైగట్టి పాటతోటే తనను చేరిండు.

కొంరు కిల కిలమని తిరిగి చూసింది.

గుట్టకు గువ్వా కండ్లవడ్తలేదనుకుంటి. అది నీకాడున్నది నేనెరుగనైతినని అన్నడు ఆ నవ్వు జూసి.

రెడ్డీ! సడిసప్పుడు జెయ్యక పోతున్న కాలం నీకు ఏడు దాసుల రెండేండ్ల ధోతిని కట్టిత్తే , ఈడనే నేత్తికోప్పుల ఎడుదసుల పూలు నాకు ముడిసింది మరసిఏం పాటలే? అన్నది.

ఆరు ఋతువుల్లల్ల ఆరు దసుల పున్నములు ఈ పరాచికంల ఎల్ల బారినయని గూడం ఎరికేనే కొంరూ !

పిల్లా పీసుతోటి నీ ఒడి నిండింది లేదు గని, పసుపు గౌరమ్మలొతికె ఈ పూలను నీ కొంగు ఉయ్యాలల ఊపి మంది పాణాలకు మందులు జేస్కుంట తల్లివైతున్న నిన్ను జూత్తే పడుచ్చోన్నయి పారాడుతనే.

మరి..!నువ్వో ..?జీవాలె పాణమని ఒంటరికోతోలె కొమ్మ కొమ్మల దిరిగి పెంపు జేత్తలేవె ? అన్నది.

ఆ …..ఆ …అని నిట్టూర్చి.

మన ముచ్చటకేంగని? ఎవలికిపుడు ఆపతి?

పట్వారి పాపన్న మనుమరాలు కళ దప్పి, కండ్లు తిరిగుతానయని, వారానికోపారి శిఖాయతు జేత్తాండటమాపటీలి ఎట్లనే ?ఎన్కటి మనిషివి నువ్వే జెప్పాల్నే అని నాకాడికచ్చిండు. అన్నది ఇంకో రెండు చెట్ల గింజలు దీస్కుంట.

నెత్తిన ఎండ అగ్గయి అంటుకుంటాంది. సాలు గని, దావే …!నేను దెచ్చిన సద్ది దిందం. అన్న మాటలతో కొంరు, రెడ్డి ఎనుక నడిశింది. కొంరు, రెడ్డి ఇద్దరూ కొద్దిపాటి నీడల సదురుకొని సద్ది దిన్నరు.

రెడ్డి తువ్వాల్లనే తంగేడు పూలు, కాయలు, గింజలు ఆన్నే ఎందవోసింది.

రెడ్డి,కొంరు నే సూత్తాండు.

పాణమేట్లుంటాందే ?అడిగిండు.

–నాల్కకు చేదందుతాంది. యమభటులు నా జాడకు బైలెల్లిండ్రేమో! జాని..! నీకు కమస్కమ్ క్యాల గూడ తక్కువైతాందంటే కాడు దగ్గర వడుతున్నట్టేనే అన్నడు.

కొంరు, ఇచ్చత్రంగ జుసేటాళ్ళ్కు…

మొన్న సాదురకం పిల్లిని పక్కన వెట్టుకొని పండుకొని పిల్లిమొగం

జూసిన అని, వాతానికి కన్ను అదిరితే  అపశకునమాయెనని నడి జాము నా ఇంటి తలుపుల మీద చేతుల తోటి దరువేత్తివి. ఏమాయె? అని నడుం వాల్శిండు.

ఆ.. ఆ.. నీకు ఎకసెక్కం గాకుంటె ఆయాళ నేననుకున్నట్టే ఏనాడు ఏ పిట్ట ఎగిరచ్చి ఏత్తే  ఆకాశ మంత ఇసురుకొని, పుట్లకొద్దీ కథలను ఒడవ కుంట నోళ్ళళ్ళ చెరిగిపిచ్చి, తరాలు జాసిన తాతల మర్రి బాటెడల్పుల నేల ముద్దాడిందని సుక్కవ్వ జెప్పంగ చెవులకు కీడే సోకే కదా !

తాతల మర్రి కి నువ్వొక్కదానివే మనుమరాలవైనట్టు రంజ పడుతవెందుకే? కొంరు ? దొంగ శీకటి ఒక్కటయినట్టు ఊరు సప్పుడ్జెయ్యన్ది?

” అమ్మ పుట్టిల్లు మేనమామ కెరుకని” నాకూ, నీకూదప్ప  నిన్న మొన్నటి బుడ్డ పోరగాండ్లకేం దెలుత్తది ?” పంట గంజి పాసు పాసు కైకిలి గంజి కమ్మ కమ్మ” అని వెయిల పుట్లు దీసె ఎకరాలన్నీ సమాధులైతాంటే  ముందుగాల తెరువు జూపెట్టుండ్రి అని కొట్లాడుతానారె? అన్నది. “కట్టినిల్లు పెట్టిన పొయ్యోలె ఊరును మొలిపిచ్చి ఆమర్రి ఎన్నెన్నో అమాస పున్నముల ఊడలను దింపుకొని “తీరు తీరు చీరెలు గట్టు కొని తీర్థం బోతె ఊరుకొక్క చీర ఊడి పోయిందన్నట్టు ఇప్పుడు కులవడి  పాయెనా ?

ఔ..మల్ల..! నీకు నీ తాతలు ఆక్షకు ఆళ్ళ తాతలు చెప్పవట్కె దాని ఇలువ మనకెరుక. ఇప్పుడు చెప్పెటోళ్ళున్నా, ఇనెటోల్లెరి? నీ ముక్కేడున్నది ముత్తెమ్మా! అంటే, ఇగజూడు ఇగజూడు అని అరిపాదాలకెళ్లి సురువు జేసినట్టు జెయ్యకని గులుగవట్టిరి. అది సరి ! మర్రి గూలిందని మనాది పడితే తాడూ, బొంగురం లేకుంటున్నోళ్ళం  రేపు ఏదన్నయితే మన గతేంది ? ఈడు మీదికత్తాంతామరాకు మీద నీటి బొట్లుండాలె. అని ఓదార్చిండు.

రెడ్డి! నా బాధ మర్రి గూలిందొక్కటేగాదు, పదేండ్ల నుండి పైలంగ దాచిన నా  మేనమామ అస్థులు ఇయ్యాళ దిక్కులేదు. దివాణం లేదు అంగట్ల కుక్కలేదన్నట్టుగ ఆగంగ ఉండెగద! అవిటిని గోదాట్ల గలుపుకుంటె మేనమామ  ఋణమెట్ల తీర్తది? ఔనే.. నేను యాది మర్చిన.

పిచ్చకుంట్ల దానికి పిల్ల పుడితె నూనె లేదని నూతిలేసిందన్నట్టు మా నాయ్న నన్ను పట్టింపు జెయ్య కుంటె నా మేనమామ  “దోతంగి వెడితె దొరసొంటి  మొగుడత్తడని” మూడేండ్ల దాన్ని తోల్కచ్చి ” చింతపూవు చింతపూవు తాలింపు  అమ్మగారింటి కాడ బొమ్మ లాట” అని మల్లెపువ్వలే సాదిండు. తొమ్మండుగురు సంతున్నా కొతయినా కొమ్మ దప్పి దున్కదని పేరు వోయి దోతులు చిరిగినా, దొమ్మరాటాడించె అన్నట్టు ఇకమతులెంబడి ఓరేవు జేసె. ఇగ నన్ను రూపు రేఖలు జూసి , కొల్వు జేత్తాండని మిల్ట్రీ ఆయనకు ఇచ్చి జెత్తేరెన్నెళ్ళకె  నన్నిడ్శి పాయె. కొండకు జూస్కుంట ఎదురు జాస్కుంట నిత్తెముత్తైదునైతి. మేనమామను నా పాలు జేసి ఎవరి జాగల వారు కాళ్ళు జాపుకొని కూసునిరి.

ఆకు, అలములు, ఏర్లు నార్లని ఆయన నేర్పన ఇద్దె తోనే వైద్యం జెస్కుంట బతుకుతి .

ఆయన పండుటాకయి రాలిపాయె,  తొమ్మండుగురెట్ల ఇద్దరు తక్క అందరూ బతుకు రెక్కలు లేదని ఆపలెక్కువైతే అడుక్కు తినబుట్టైతదని గట్టుకొని ఎగిరపాయె, అద్దర్ని చేతిల పట్టుకొని అన్ని సవ్యంగ దీనాలు జెత్తి. అస్థులన్న అందరకి దండం బెట్టించి ఆళ్ళ నడుమన గోదాట్లెయ్యాలని మర్రి ఊడకు ఏలాడేస్తి. ఇన్నేండ్లు దాని గురించి రంది పల్లె గని, చెట్టు గూర్చిండ్రు అన్నంక నా మేనమామ తోని నా అనుబంధాన్ని గూల్చినట్టే అనిపిస్తొంది.

ఇద్దరు పెండ్లాడ్లోనికి ఇగురముండాలె, దున్న పోతుల వ్యవసాయమున్నోనికి నోరు పెద్దగుండాలె అని పైస పైన కూడేసినా, ఆస్తులు గోదాట్ల కలుపలేక పోతి.

ఈ ముచ్చట వాళ్ళకు జెపతే  సమాధులే కూలంగ ఆస్థులదేమున్నది ? అనవట్టిరి. గందుకే వాళ్ళను ఇచారించుడు ఊదుగాలది, పీరి లేవదన్న తరికేనని సమజయి ఈ పని ఒప్పుకున్న  అన్నది తంగేడు పూలను ఓ పారి కిందికి మీదకి మార్చి నేర్పి.

హు … కొంరూ ! ఇదయ్యే పని గాదుగని ఎవలనన్న బదులడిగి పని కానీయ్, మాఘ మాసం జీరవడ్డది. మంచి రోజులు మాయక ముందే ఏగిరపడు.

ఎగిరెగిరి దంచినా గదే  కూలి , కూసుండి దంచినా గదే కూలన్నట్టు గావట్టె. ఇంట్ల సోడన్న అమ్ముదమనుకుంటె ఆయిమన్నది ఒక్కటి లేకపాయె. ఇగ ఏంజేసుడు ? అని కడుపుల దుఃఖం ఎల్లబోసుకొని పొద్దెక్కుతాంటె మల్ల తంగేడు పూలన్ని కొంగుల గట్టుకున్నది. పోవడానికన్నట్టు.

రెడ్డి సుతం దిగ్గున లేసిండు.

కొంరు  ! నువ్వు నిమ్మలంగుండు. మేనమామ ఋణం అస్థులు గలిపి తీర్చుకుందువు గాని, అని ధైర్యం జెప్పి ఆమె వోయిన దిక్కే  జూస్కుట నిలబడి పోయిండు.

ఆమెను జూస్కుంటనే మర్రి ఊడల్లా తనలో  పాతుక పోయిన మర్రి ముచ్చట్లను మనసు ఊయల  గట్టి గతంలోకి ఊపి వదిలేసిండు.

కొంరూ మేనమామ పసరు వైద్యం, తన భార్య అనారోగ్యం ఆకుటుంబంతో రెడ్డికి పరిచయం చేయించింది.

రెడ్డి భార్య తినని మందు లేదు తాగని పసరు లేదు. ఆయుషు అవుసు లేనోనికి  అన్నం సుత దండుగేనని ఆమె అంత దండుగజేపిచ్చి తన జాగల తను పోయింది.

రెడ్డికి పిల్లా జెల్లా లేరు. మల్ల మనువు ముచ్చట దియ్యలే. ఉన్న కాడికి ఊడ్సుక పొయినంక జీవాల గాసుడు పని వెట్టుకున్నడు. కడుపు నిండ తిండి కంటి నిండ నిద్ర పోకుంట గతమంత  మరుస్తడు. గని కొంరు గనపడ్డప్పుడు అదో  ప్రేమ మైకంల వడ్డట్టు సంబుర వడుతడు.

కొంరూ అంతే.

ఆ ఇద్దరికీ ఇంతకు మించి ఏమి లెదు. రాయప్రోలు అమలిన శృంగారం వాళ్లు ఇనలే , సదవలె . కానీ, ఇన్నీళ్ళకి తెలిసినాళ్ళకి ఆ పవిత్ర బంధం అదేనని ఋజువు దొరుకుతది.

రెడ్డి తల్లి తాడి చెట్టుకు జీడికట్టు దాకని ఎడ్డి బసవమ్మ, ఐతే, రూపును చూసి మురిసినొగడు దొరహంకారంతో  తల్లిని జేసిండు. కన్నోళ్ళు గుట్టు సప్పుడు కాకుండ దెచ్చి గుట్టమీది జాతరని తోల్కచ్చి గుట్టకే అప్పజెప్పిండ్రు. గుట్ట దేవతే తల్లి అయి పురుడు పోసినట్టు జీవాలు గాసెటోళ్లకు దొరికి తన వాళ్ళ బంధాలల్ల  కాటగల్శిండు.

రెడ్డి  తల్లికి దెలిసిన ఒక్క మనిషి రెడ్డి గావడం తో ఆమె ఆ పేరే ఆనవాలు జేసింది. అట్ల ఊర్లె తొక్కుడు బండయ్యిండు. నోట్లే నాలుకయ్యిండు

రెడ్డీ, కొంరూ ఇద్దరూ పని ఉన్నంతసేపు పన్జేసుడు లేనప్పుడు ఆ మర్రి కిందనే ఆటలాడేది. “అరికెడబ్బా’ ఆటైతే రికాం లెకుంట ఆడేది. అరికెడబ్బా ఆటల టెంకేసి దొంగలాగ ఒక గీత అవతల నిలబడి గోడ దగ్గర ఉన్న వారిని తన వైపునకు లాక్కునేటప్పుడు ఎప్పడూ కొంరుని లాగక పొయ్యేది. లాగనియ్యక పొయ్యేది . తనూ అంతే. ఎందుకంటే, ఆ ఆటల ముందుగా గుంజ బడిన వాళ్ళు దొంగలుగా  రావాలి . ఇద్దరికీ సుతారమూ నచ్చక పోవు. దొరలకు మల్లె మిగిలిపొయ్యేవారు.

రాత్రుళ్ళు భాగోతాలు, తోలు బొమ్మలాటలు, కోలాటాలు అన్నిటికి  ఆ మర్రి సభాగద్దె అయ్యేది. అప్పుడప్పుడు కళాకారులు తేరిక లేకుంట ఉన్నప్పుడు తానే కళాకారుడయి గొల్లసుద్దులు, భజన పాటలు, చెక్క భజన పాటలు పాడేది. ఇనసొంపైన, ఖంగుమనే కంఠం అలావోకగా అందరి యెతలు కైగట్టి పాడ్తాంటె జనాలు కట్టేసినట్టే కూసునెటోళ్లు, ఆనాడు సాహితీ, సామాజిక, సాంస్కృతిక  క్షేత్రంగా నిలబడి, సరదాలకు, సంబరాలకు ఆలవాలమైన ఆ సాంస్కృతిక వృక్షం తాతలమర్రికి నూకలు చెల్లడం రెడ్డిని కూడా బాగా ఆలోచింపజేసింది.

ఇలా ఎన్నో ఎన్నెన్నో ఊసుల డోలాయమానమైన మనసు ఒక చక్కని ఆలోచనకు ప్రాణం పోసుకొని ఆగిపోయింది.

***

జీవాలను గుట్టకు దోలి  కొంరు కోసం కాచుక్కూచున్నాడు. కొంరు ఎండలో చెమటలు గ్రక్కుతూ తట్ట పట్టుకొని రానే వచ్చింది. ఆత్రంగా ఆమెను కుర్చోబెట్టి,

కొంరూ ! తాతలమర్రి తో  నికున్న అనుబంధం సన్నూ సోచాయింప జెసింది. గందుకే ఓ పని చేద్దామను కుంటానా.

ఏందది ? అన్నట్టు చూసింది కొంరు,

ఈ మధ్యన పతేరా ఉన్నోడు, లేనోడు ఎవ్వడు సచ్చిపోయినా బలగమంత పదకొండోద్దుల పండుగ దినాము ధూమ్ ధామ్ గ జెయ్యపట్టిరి.గసొంటిది , మన మర్రి మాత్రం తక్కువదా ? మన మెందుకు చెయ్యద్దని? అట్లజేత్తే  చెట్టు, పుట్ట , గుట్ట ఋణం తీర్చుకున్నోల  మైతం గద ! కొత్త తరానికి ఆటిని పెంపు జేసే బాధ్యత ఒప్పజెప్పినట్లయితది గదా! ఏమంటావ్ ?

రెండు చేతులతో బంగారం లాంటి ఆలోచన అని తల మీదుగా చేతులాన్చి మెటికలిరిసింది. మరి.. ఖర్చతదేమో..! రెడ్డి!

కానీయ్. నాకాడున్న కొద్ది పైకం తోటి షురూ జేద్ధం. దినం బుట్టిద్ధం. నచ్చినోళ్ళు మనెంట గల్సత్తే  బ్రహ్మాండంగ జరుగుతది.

ఔ.. రెడ్డీ ! నేను సుత మా మేనమామ అస్థులకని, అన్నదానానికని పోగిసింది పెడుత. ఓ దినం ఆయ్న పేరు మీదనే. అన్నది.

ముందుగాల అయ్యగార్ని గల్స మంచిరోజు  అడిగచ్చి పనులు షురూ జీదమసుకున్నారు.

ఇద్దరి లోను ఒక కొత్త ఉత్సాహం.

అయ్యగారు రెడ్డి ఆలోచనను మెచ్చిండు. చెట్టుతల్లికి పిండప్రదానం, పూజలకు తాను పుక్కిడికే  వస్తనన్నడు. కన్నీళ్లకి చేయి దరియ్యని ఈ రోజుల్ల నువ్వు జేస్తున్న ఈ పని ఎందరికో గుణపాఠమైతదని తన సంబురం భుజం తట్టి చెప్పిండు.

“స్వస్తిశ్రీ శోభకృత్ నామ సం॥ ర మాఘ మాస బహుళ తదియ…..” అంటూ మహోత్సవ ఆహ్వాన పత్రికను ప్లెక్సీగ వేయించి  అందరికి తెలిసేలా చేశారు.

ఆ రోజు రానే వచ్చింది.

ఎట్ల జేత్తర జూడాలని కొందరు, సెభాషైన పని అని కొందరు ఉత్సాహం, ఉత్సుకత కలగలిపి వాళ్ళ వాళ్ళ పెద్దల పేర్ల మీద దినం జెయ్య ఖర్సు ఇయ్యడానికి ముందుకచ్చిండ్రు.

ఇండ్ల కొంరు పిలిచేటోళ్ళు లేక మూలకు వున్న కళాకారుల తోని రోజో  కథ చెప్పిద్ధమని చెప్పే ఆళ్లను పిల్సింది . చుట్టుముట్టు ఊరు కళాకారులంత జమయిండ్రు. ఆడీ జాతర మొదలయింది. ఆరాత్రి బుడిగె జంగాలొల్ల  వంతు. వాళ్ళు “పొగిడుపు పోట” ఈ తీరుగ పాడవట్టిండ్రు..

హర హర మా దేవ హర హార మాదేవ

అయ్యయ్యో దైవాము హర హార మాదేవ….

ఏదయ్య తాతల  మర్రి ఈనాడూ ….ఎడగానారాదు

పాణము బోయ్యేనా …..మనమే దీసినామా

నువ్వేస్తవ ఇత్తు….నేనేస్తిన ఇత్తు

చత్తీరయ్యి మర్రి…బువ్వ చెతాయే

ఇట్ల పొడ్తాంటె జనాల కళ్ళు  శోకించినవి. ఆత్మీయత పొంగింది. తాతల మర్రి కండ్ల ముందు కదలాడింది. అనుబంధం గుర్తొచ్చి మనసులు మూలిగినవి.

పాట ముగిసేటాళుకు అందరిట్ల ఇసొంటి చెట్టు నేనూ నాటుత అనే ఆలోచన పొడసూపింది.

ఇట్ల పన్నెండోద్దులు రెడ్డి, కొంరూ  అనుకున్నట్టే బ్రహ్మాండంగ జరిగినయి. మెనమామ  అస్థులు కలవనికి అయ్యగారు ఆసరకాంగ కొంరు  ఆ పని గూడా పూర్తి చేసింది.

రెడ్డి పుర్సతైండు. ముందుగాల కొంరును నిమ్మకం జెయ్యటానికని ఆమెకు కాన్కగా అస్తులను గోదాట్ల కలుపాలను కున్న రెడ్డి, తలుపని తలంపుగా తాతలమర్రి గొప్పతనం తెలియజేసేలా, మొక్కలు నాటిలా సాగడం ఉపయోగమైనందుకు, బతుకమ్మ పేర్పుటకు “తంగేడు పూలు” ముఖ్యమైనట్టి, ఆ ఊర్ల తాతలమర్రి  లాంటి మిగతా చెట్లకు కాపుగా తాము చేసిన ఈ పండుగ ప్రతి ఒక్కరికీ ‘తంగేడు పూలంత ఇలువిచ్చినందుకు మురిసిండు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.