తమసోమా జ్యోతిర్గమయ !

-విజయ తాడినాడ 

“బావా! ఒకసారి రాగలవా?” 

ఉలిక్కిపడ్డాను ఆ మెసేజ్ చూసి. త్రిపుర నుంచి వచ్చింది అది. అదీ చాలా రోజుల తర్వాత. ‘ఏమై ఉంటుంది?’ అంతుచిక్కని ఆలోచన …వెంటనే రామశాస్త్రి బాబాయ్ మొన్న కలెక్టర్ ఆఫీసు లో కనబడ్డప్పుడు అన్న మాటలు గుర్తొచ్చాయి. “ఏంటో రా మాధవా, మీ మావయ్య నాల్రోజుల నుండి గుడికేసి రావటమే లేదు. చూడడానికి ఎప్పుడు వెళ్ళినా నిద్రపోతూ కనిపిస్తున్నాడు. ఒంట్లో ఏమన్నా నలతగా ఉందో ఏమో. వీలైతే ఒకసారి వచ్చివెళ్ళరా!” బాబాయ్ అలా ఎందుకన్నాడో అర్థం కాలేదు.  

రేపే అమలాపురం  బయల్దేరుతున్నానని, నాల్రోజులు రావద్దని పనిమనిషికి చెప్పి,  ట్రైన్ టికెట్ బుక్ చేసుకుని, నిద్రకుపకరించాను. పేరుకి పడుకున్నానే గానీ నిద్రాదేవితో యుద్ధమే చెయ్యాల్సి వచ్చింది. తెల్లవారి ఐదింటికే నిద్రలేచి స్టేషన్ కి చేరుకుని, ట్రైన్ సిద్ధంగానే ఉండటం తో ఎక్కి కూర్చున్నాను. వర్షాల వల్ల మా ఊరి రోడ్లపై కారు ప్రయాణం కన్నా రైలు ప్రయాణమే హాయి. అయినా నేను డ్రైవింగ్ చేసే పరిస్థితిలో లేను. ‘ఏమి జరిగి ఉంటుంది’ ఊహించలేకపోతున్నాను.  ఒకే ప్రశ్న మనసులో అలజడి సృష్టిస్తోంది. ఇన్నాళ్ళుగా మావాళ్ళ నుండి కమ్యూనికేషన్ ఆగిపోయిన విషయం కూడా గమనించలేదు. నా ఉద్యోగ ధర్మం అటువంటిది.  

రామశాస్త్రి బాబాయ్ కళ్ళముందు కదిలాడు. నిజానికి ఆయన నా సొంత బాబాయ్  ఏమీ కాదు. మా మావయ్య ఇంటి పక్క ఇల్లు వాళ్ళది. సొంత మనుషుల్లా కలిసి పోయే తత్త్వం గల పల్లెటూరి మనిషి.

మరో పది నిముషాల్లో ట్రైన్ ముందుకు సాగింది. నా ఆలోచనలు వెనక్కు పరిగెత్తాయి. 

****************************

నేను తొమ్మిదో తరగతిలో ఉండగా మా నాన్న హఠాత్తుగా కాలం చేశారు గుండెపోటుతో. ఒక్కగానొక్క కొడుకునైనాగానీ  నన్ను పెంచటం అమ్మకి సవాలుగానే మారింది. వ్యవసాయం పై ఆధారపడిన కుటుంబం. పెద్దదిక్కు లేకపోవటంతో కూలీలు కూడా అమ్మ మాట వినేవారు కాదు. 

ఈ  పరిణామాలవల్లనేనేమో అమ్మ ఆరోగ్యం కూడా క్షీణించసాగింది. ఇది తెలుసుకున్న మావయ్య నాన్న మాసికానికి వచ్చినప్పుడు అమ్మతో పాటు నన్ను కూడా చూసి బాధ పడ్డాడు. పీలగా , పోషణ లేక బలహీనంగా ఉన్న నేను, అంతకన్నా బలహీనంగా ఉన్న నా మార్కులు చూసి కేకలేశాడు. తనతో వచ్చేయమన్నాడు. అమ్మ ‘పొలం వదిలి రావటం కుదరదు రా! పనివాళ్ళ మీద భారం వేసి  రాలేను.’ అంది. 

‘ పోనీ  శేఖరాన్ని అయినా నాతో పంపించు అక్కయ్యా, బళ్ళో వేసి చదివిస్తా, పదిలోకి వస్తున్నాడుగా, ఇలా వదిలేస్తే తెలివైన పిల్లాడు చదువు కుంటుపడుతుంది. వాడి చదువుతోనే నీ కష్టాలు గట్టెక్కుతాయి ’ అని అనునయంగా అడిగాడు. ఏమనుకుందో ఏమో అమ్మ ఒప్పుకుంది. ‘వెళ్తావా?’ అన్నట్టు నా వైపు చూసింది. తల వంచుకునే వెళ్తానని తల ఉపాను. మామయ్య ఊపిరి పీల్చుకుంటూ చిరునవ్వు నవ్వాడు. బట్టలు సర్దుకుని పడుకున్నాను. అనేక ఆలోచనలతో కలత నిద్రే గతి. మర్నాడు ఉదయమే ప్రయాణం. 

అమ్మను వదిలి బస్సు ఎక్కుతున్నప్పుడు దుఃఖం ఆపుకోలేకపోయాను. అమ్మ కూడా. కానీ అమ్మే అనునయించిది. ‘నానీ! నీ చదువుతోనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంది. మీ నాన్న ఎప్పుడు అంటూ ఉండేవారు గుర్తుందా?  ‘పెద్దవాడై కలెక్టర్ అవ్వాలి’ అని, అదే నీ లక్ష్యంగా చేసుకో. పట్టుదలతో కృషి చేస్తే సాధించలేనిది ఉండదు. అత్తయ్యని , మావయ్యని ఇబ్బంది పెట్టకు.’ అంటూ వీడ్కోలు పలికింది. బస్సు ఎక్కాము. మౌనంగా వెక్కిళ్ళు పెడుతున్న నన్ను మావయ్య దగ్గరకు తీసుకుని, వీపు నిమురుతూ ఉండిపోయాడు. ఎప్పుడు నిద్ర పోయానో తెలియదు. 

* * * *

బస్సు దిగి అరకిలోమీటరు దూరంలో ఉన్న మావయ్య ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాము. ఎంతో హాయిగా ఉంటుంది ఆ ఊరు, ముఖ్యంగా మావయ్య ఇల్లు. ఒక పక్క పచ్చని పంట పొలాలు, మరోపక్క అందంగా కుదుమట్టంగా  ఉండే పెంకుటిల్లు. మధ్యలో నల్లటి తారు రోడ్డు. మావయ్య ఇంటి వెనకాలే విష్ణ్వాలయం. 

ఇంటి చుట్టూ ఖాళీ స్థలం. ఇంటి ముందు కాంపౌండు వాల్ లోపల గేటుకి రెండు వైపులా నంది వర్ధన, మందారం మొక్కలు విరగపుసిన పూలతో వచ్చే వారినందరినీ ఆహ్వానిస్తూ ఉంటాయి. ముందు వైపు వాకిలి అంతా పద్దతిగా అమర్చిన అందమైన పూలమొక్కలతో అలరారుతూ ఉంటుంది. వెనక పెరటిలో వంటింటి గుమ్మానికి ఎదురుగా అమర్చిన తులసి కోట వీధి వాకిట్లోకి కనిపిస్తూ పవిత్రతను చాటుతూ ఉంటుంది. మామిడి, జామ, సపోటా, పనస చెట్లు, కాకర, బీర, దోస, సొర, పొట్ల పాదులు కాసిన కాయల భారంతో సిగ్గుపడుతూనే నిండు ముత్తైదువుల్లా ఆతిధ్యాన్ని ఇస్తున్నట్టుగా ఉండేవి. పూజ గదిలో నుంచి వచ్చే సాంబ్రాణి, అగర్బత్తీ ల సుగంధం ఇల్లంతా పరుచుకుని ఒక విధమైన దివ్యత్వాన్ని వెదజల్లుతూ ఉంటుంది. 

ఇంట్లోకి అడుగు పెట్టేసరికి మధ్యాహ్నం భోజనాల సమయం అయింది. అత్తయ్య ఎదురొచ్చి  మావయ్య చేతిలోని సంచి తీసుకుంటూ చల్లని మంచినీళ్ళు అందించింది. మావయ్య కొడుకు రఘు, కూతురు త్రిపుర గదిలో నుంచి బైటకొచ్చి పలకరింపుగా నవ్వారు. రఘు నా ఈడు వాడే. త్రిపుర మా కంటే మూడేళ్ళు చిన్నది. ఆరో తరగతి పూర్తి చేసింది.  మావయ్య ముందే చెప్పినట్టు ఉన్నాడు నన్ను తీసుకొస్తానని, అందరూ తెలిసిన విషయంలాగానే ప్రవర్తిస్తున్నారు. 

రఘు తన గదిలోకి తీసుకెళ్ళాడు. ముచ్చటగా ఏర్పాటు చేసిన రెండు మంచాలు, ఒక పెద్ద చెక్క టేబుల్, దాని కింద ఒక  చెత్తబుట్ట , దానిమీద కొన్ని పుస్తకాలూ ఒక పెన్ స్టాండ్, గోడకి వేలాడదీసిన ప్రపంచపటం, భారతదేశ పటం, ఒక మూలన పెట్టిన చెక్క బీరువా, దాని పక్కనే గోడకి అమర్చిన అలమరా……..మనసుని ఎంతో ఆకట్టుకున్నాయి. బట్టలు బీరువాలో సర్దుకుని, పుస్తకాలు అలమరాలో సర్దుకున్నాను. రఘు, త్రిపుర సాయం చేశారు. అందరం కలిసి మధ్యాహ్నం భోజనం చేశాము. పెద్దవాళ్ళు కునుకు తీశారు. పిల్లలం గుళ్ళోకి దారి తీశాము. గుడిలో ఎప్పుడు చెట్ల నీడ ఉంటుంది. ఆ గుడి పూజారే రామశాస్త్రి బాబాయ్.

ఆరోజు మొదలు వేసవి సెలవలన్నీ చాలా సరదాగా , హాయిగా గడిచిపోయాయి. మధ్యాహ్నం అవ్వగానే వెనక పెరట్లోకో, గుళ్ళో కో చేరిపోయే వాళ్ళం. సాయంత్రాలు అత్తయ్య చేసే వేడివేడి పకోడీలు, కారప్పూస, వామాకు బజ్జీలు, సాతాళించిన శనగలు…వాటితో పాటు ఒక చిన్న కప్పుతో వేడి వేడి హార్లిక్స్ …ఇవీ మా స్నాక్స్. తినటం పూర్తి అవ్వగానే మావయ్య తో కలిసి మొక్కలన్నిటికి నీళ్ళు పోయటం ఒక అద్భుతమైన అనుభవం. ఒక్కొక్కరం ఒక్కో చెట్టుని దత్తత తీసుకుని, దాని బాధ్యతంతా మీద వేసుకుని పెంచేవాళ్ళం. మాతోపాటు రామశాస్త్రి బాబాయ్ కొడుకు అవధాన్లు కూడా జత చేరేవాడు ఈ మహా యజ్ఞం లో. ఒక క్రమబద్ధమైన జీవన శైలి. ఆరోగ్యవంతమైన వాతావరణం. పిల్లలిద్దరూ నన్ను వారితో త్వరగానే కలిపేసుకున్నారు. అత్తయ్య, మావయ్య ఉగ్గుపాలతో పెట్టి పెంచిన సంస్కారం. 

సెలవలు అవ్వగానే నన్ను కూడా తను పనిచేసే బళ్ళోనే  వేశాడు మావయ్య తనకున్న పలుకుబడి ఉపయోగించి. నేను రఘు పోటీ పడి చదివే వాళ్ళం. ఎప్పుడూ తరగతిలో మొదటి, రెండో స్థానాలు మా ఇద్దరికే వచ్చేవి. మావయ్యకి మంచి పేరు ఉంది ఆ బళ్ళో, ఊళ్ళో కూడా. అది నేనెప్పుడు పోగొట్టలేదు. త్రిపుర చదువు కూడా మెరుగయ్యింది నా రాకతో అని అత్తయ్య అంటూ ఉండేది. ఎంతైనా చిన్న పిల్ల కదా! గారాబంతో మాట వినేది కాదుట. నేనొచ్చాక నా క్రమశిక్షణ, చదువుపై నా శ్రద్ధ చూసి, తను కూడా బాగా చదవటం మొదలు పెట్టిందిట. అలా పెద్దవాళ్ళు పొగుతున్నప్పుడు, అమ్మకి చెబుతున్నప్పుడు కించిత్ గర్వం గా అనిపించేది. 

పదో తరగతి మంచి మార్కులతో పాస్ అయ్యాము నేను, రఘు.  ఇద్దర్నీ ఇంటర్మీడియెట్ లో చేర్చాడు మావయ్య. అదే ఊపు, పట్టుదలతో చదివి, మంచి మార్కులతో పాస్ అయ్యాము. ఎం.సెట్ లో మంచి రాంక్ కొట్టి అదే ఊరిలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్  లో నేను, చెన్నై ఎం.ఐ. టి లో రఘు చేరాము. అలా మూడేళ్ళు కలిసి చదువుకున్న నేను, రఘు విడిపోవాల్సి వచ్చింది. రఘుని చెన్నై లో దించటానికి నేను కూడా వెళ్ళాను. హాస్టల్ లో అన్నీ సర్దుకున్నాక మేము తిరుగు ప్రయాణం అయ్యేటప్పుడు, మా ఇద్దరి కంట్లో సన్నటి నీటి పొరలు తారట్లాడటం, ఒకరినొకరు కౌగలించుకుని వీడ్కోలు చెప్పుకోవటం పెద్దవాళ్ళను కదిలించేసింది. అయినా ఇద్దరి లక్ష్యం ఒక్కటే పెద్ద చదువులు చదువుకోవాలి. పెద్దవాళ్ళను సుఖపెట్టాలి. 

అప్పటి నుండి ఇంట్లో అన్ని పనులకు చేదోడువాదోడుగా  ఉంటూ రఘు లేని లోటు లేకుండా చేశాను. త్రిపురకి పదోతరగతిలో దగ్గరుండి చదివించి మంచి మార్కులతో పాస్ అయ్యేలా చేశాను. అత్తయ్య, మామయ్య ఎంతో సంతోషించారు. 

ఈ నాలుగేళ్ళలో అమ్మ నాలుగుసార్లు వచ్చి వెళ్ళింది. వచ్చినప్పుడల్లా నా వంక తృప్తిగా చూసుకునేదే గానీ ఎన్నడూ ‘ఎలా ఉన్నావురా?’ అని అడగనేలేదు. నా ప్రవర్తన మీద నమ్మకమో, తన తమ్ముడి పెంపకం మీద భరోసానో…వెళ్తూ వెళ్తూ బుగ్గలు పుణికి, మెటికలు విరిచేది. అది నాలో కొండంత ధైర్యాన్ని, ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని నింపేది. దానితోపాటు తెలియకుండానే బాధ్యతను కూడా గుర్తు చేసేది. 

త్రిపుర చదువంతా నేనే చూసుకుంటున్నాను.  క్రమంగా మా వయసూ, చదువూ పెరుగుతున్నకొద్దీ మా ఇద్దరి మధ్య దూరం తగ్గుతూ వచ్చింది. అయినా ఇద్దరం హద్దులు మీరలేదు, ఒకరితో ఒకరం ప్రేమను వ్యక్తపరిచింది లేదు. త్రిపుర ఇంటర్ తొంభై ఎనిమిది శాతం మార్కులతో పూర్తిచేసింది. ‘అంతా నా చలువే’ అంటూ అత్తయ్య ఊరంతా సంబరంగా చాటుకుంది. అత్తయ్యది చాలా మంచి మనసు. నన్ను చాలా బాగా చూసుకునేది. మావయ్య మాట్లాడటం తక్కువ.

త్రిపుర మా లాగా ఇంజనీరింగ్ చెయ్యాలనుకోలేదు. బి.ఏ. ఎకనామిక్స్ చేస్తానంది. ఇంట్లో వాళ్లకి నచ్చక పోయినా, తన మొండి పట్టుదలచూసి ఒప్పుకున్నారు. ఆనాడు త్రిపురను చూసి నేను కూడా ఆశ్చర్య పోయాను. తన కళ్ళలో కనబడే మెరుపు తనేదో సాధిస్తుంది అని చెప్పకనే చెబుతున్నట్లు అనిపించింది. 

ఇంజనీరింగ్ చదువుతూనే సివిల్స్ కి ప్రిపేర్ అయ్యేవాడిని. పూర్తి అవ్వగానే పరీక్ష రాయటం, ప్రిలిమ్స్ , మెయిన్స్  పాసవ్వటం, ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవటం జరిగిపోయింది. ఊరంతా అభినందించింది. మా రామశాస్త్రి బాబాయ్ అయితే ఇంట్లో లడ్డులు తయారుచేసి నా నోట్లో కుక్కుతూ  ‘మా శేఖరం కలెక్టర్ అయిపోయాడు. నీ మాట దక్కించాడు బావా. అయినా ఇదంతా మా చెల్లెమ్మ చేతి వంట మహిమ గానీ నీ ప్రతాపమేమీ కాదులేవోయ్, నువ్వూ , నీ బడాయి’ అంటూ హడావిడి చేసేశాడు. మావయ్య ముసిముసి నవ్వులు నవ్వేవాడు. అత్తయ్య పెళ పెళ నవ్వుతూ తన ఆనందాన్ని వ్యక్త పరిచేది. త్రిపుర మాత్రం సంతోషాన్నంతా కళ్ళలో నింపుకుని ‘యూ ఆర్ గ్రేట్ బావా’ అంటూ అభినందించింది. 

ఎందుకో ఆ రోజు త్రిపుర ముఖం ఎంతో అందంగా కనిపించింది. ఎప్పుడూ మెరుస్తూ ఉండే ఆల్చిప్పల్లాంటి కళ్ళు, చిన్న ఎర్ర రాయి ముక్కుపుడకతో సన్నటి ముక్కు, ఎవరో శ్రద్ధగా గీసినట్లున్న ఎర్రటి పెదాలు, నున్నటి మెడ,  మేని ఛాయతో పోటీపడుతోందా అన్నట్టున్న బంగారు గొలుసు…..ఇంకా అంతకన్నా చూడటానికి నా సంస్కారం అడ్డొచ్చింది. ఇన్నాళ్ళుగా చూడలేదా? చూసినా పట్టించుకోలేదా? లేదా నా లక్ష్యం ముందు ఇలాంటివన్నీ ముఖ్యమనిపించలేదా? ఏమో………..అదేదో సినిమా లో చెప్పినట్టు, నా మరదలేగా ఎక్కడికి పోతుంది లే అనుకున్నానేమో!

ఆ తర్వాత వారం రోజులకి ముస్సోరీ కి ట్రైనింగ్ కి రమ్మని పిలుపొచ్చింది. రైల్వేస్టేషన్ కి అందరూ వచ్చారు రామశాస్త్రి బాబాయ్ తో సహా. అక్కడ త్రిపురకి, ‘నువ్వు ఏదో లక్ష్యం తో బి.ఏ లో చేరావని అర్థం అయింది. నా సహాయం ఎప్పుడూ ఉంటుంది, అనుకున్నది సాధిస్తావనే నమ్మకం నాకుంది. అమ్మానాన్న జాగ్రత్త’ అని చెప్పాను. అత్తయ్య దిగులుగా ఏడ్చింది. మావయ్య కళ్ళలో నీళ్ళు చూసి చలించి పోయాను. వాళ్ళిద్దరి కాళ్ళకు నమస్కరించి లేచాను. మావయ్య కౌగిలించుకున్నారు. ట్రైన్ ఎక్కాను. ఆ తర్వాత రెండు నెలలకొకసారి త్రిపుర నుంచి ఫోన్, మెసేజ్, లేదా లెటర్ వచ్చేవి. ఏడాది గడిచింది. నాకు చండీగఢ్ లో పోస్టింగ్ ఇచ్చారు. తర్వాత హైదరాబాద్ డెప్యుటేషన్ పై పంపారు. త్రిపుర నుండి కమ్యూనికేషన్ ఆగిపోయిన విషయం కూడా గమనించలేనంత బిజీ అయిపోయాను. అన్నట్టు రఘు బి.టెక్ అవగానే ఎం.ఎస్ చేయటానికి అమెరికా వెళ్ళిపోయాడు. 

అలా ఆరోజు న వెళ్ళిన నేను తిరిగి ఇన్నాళ్ళకి మళ్లీ ఇలా వస్తున్నాను.

******

నేను వెళ్ళేసరికే అమ్మ కూడా వచ్చి ఉంది. ఎదురొచ్చింది. ఇంట్లో అంతా నిశ్శబ్దం. మావయ్య పడకకుర్చీలో కూర్చొని పేపెర్ చదువుతున్నాడు. అత్తయ్య వంటింట్లో పనిలో ఉంది. ఉద్యోగంలో చేరిన తర్వాత  మొట్టమొదటిసారి వచ్చాను. మావయ్య కాళ్ళకు నమస్కరించాను. పేపెర్లోంచి తలెత్తి చూశాడు. వంటింట్లోకి వెళ్ళిన నన్ను చూసి అత్తయ్య ఒక జీవం లేని నవ్వుతో ‘కాఫీ ఇస్తాను ఉండు నాయనా’ అంది. కాఫీ అందుకుంటూ ఆవిడ కళ్ళలోకి చూశాను. కన్నీటి చెలమలయ్యాయి. గుండెనెవరో పిండినట్లయింది. ఆవిడ భుజం చుట్టూ చెయ్యివేసి ఓదార్చాను. అమ్మది కూడా అదే పరిస్థితి అయినా ఇప్పుడు ఓదార్చే స్థానంలో ఉంది. 

హాల్లోకి వచ్చాము. ‘అసలేమైంది మావయ్యా’ అన్నాను లాలనగా. ‘చూడరా అదెంత పని చేసిందో. ఇంట్లో బంగారమంటి అయిన సంబంధం ఉండగా, ముక్కూ మొహం, కులం, గోత్రం తెలియని వాడిని పెళ్లి చేసుకుంటానని మొండి పట్టు పట్టుక్కూర్చుందిరా!  అయినా అంతా మాదే తప్పులే….అడిగిన చదువు చదివించటం, నువ్వే దాని మొగుడివని చెప్పకపోవటం…..

నాకేమీ వినబడటం లేదు ఇంకా ….కాళ్ళ కింద భూమి కంపించిపోయి, అందులో నేను కూరుకు పోయిన భావన. చెవులన్నీ ఎర్రబడిపోయి, వేడి ఆవిర్లు బైటకొస్తున్నాయి. కళ్ళలో చేరిన నీటిపొర ఎదుటి మనుషుల ముఖాలను కనబడనివ్వటం లేదు.  ఎలాగో తేరుకుని మావయ్యకేసి చూశాను. ఆయన చూపులు అభావంగా ఉన్నాయి. ఎందుకు నాకింత బాధ? త్రిపురను ప్రేమించాననా? కానీ తనతో ఏనాడూ చెప్పలేదు. “నాయనా మాధవా, నువ్వే దానితో మాట్లాడి దాని అభిప్రాయం మార్చాలి రా” అంటూ అత్తయ్య వేడుకోలు…. అవును మాట్లాడాలి. నేనే మాట్లాడాలి. తనను ప్రేమించిన వాడిగా అది నా బాధ్యత, హక్కు, అవసరం కూడా. 

ఎలాగో గొంతు పెగుల్చుకొని “త్రిపుర ఎక్కడ?” అన్నాను. ఈ రోజు శనివారం కావడంతో అనాధ శరణాలయంలో పిల్లలకు చదువు చెప్పటానికి వెళ్లిందని చెప్పింది అమ్మ. సాయంత్రం ఐదింటికి ఇంటికి వచ్చిన త్రిపుర నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయింది. కాసేపటికి వేడి వేడి కాఫీ తీసుకుని తన గదిలోకి వెళ్ళాను. ఏదో రాసుకునేది తలెత్తి చూసి, ‘రా బావా! ఎప్పుడొచ్చావ్’ అంది ముభావంగా.  కుర్చీ లాక్కొని కూర్చున్నా. 

“ఏంటి ఇదంతా త్రిపు?” అన్నా అనునయంగా నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ…

‘ఓ! విషయం తెలిసిందా! బావా! అన్నయ్య చెన్నై వెళ్ళిన తర్వాత నుండి  నిన్ను మించిన ఆప్తుడు ఎవరూ లేరు నాకు. నీకు చెప్పుకుంటే గుండె బరువైనా తగ్గుతుంది. ఒక మంచి పరిష్కారాన్ని చెబుతావని రమ్మన్నాను.’ అని ఆగింది.

‘ఇంతకీ ఎవరతను?’

నా ప్రశ్నకు సమాధానంగా .. ‘బావా! గుర్తుందా…నా డిగ్రీ సెకండ్ ఇయర్ లో నువ్వు ముస్సోరీ వెళ్ళిపోయావు. ఆ తర్వాత ఇంట్లో ఒక్కదాన్నే అయిపోయాను. నువ్వు చాలా బిజీ అయిపోయావు అక్కడ. స్నేహితులతో ఏమి మాట్లాడినా అది కేవలం కాలక్షేపానికే అనిపించేది. నా మనసుకి నచ్చిన సంభాషణ చేసింది నీ ఒక్కడితోనే బావా. అలా నా జీవితంలో ఒక స్తబ్ధత ఏర్పడిపోయింది. ఇంతలో సెకండ్ ఇయర్ రిజల్ట్స్ వచ్చాయి. ఎప్పటిలాగానే నాకే కాలేజ్ ఫస్ట్ వచ్చింది, కానీ నాతోపాటు ఇంకొకరికి కూడా వచ్చింది. అతను మిత్ర. మొదటిసారి కాలేజీ లైబ్రరీ లో చూశాను అతన్ని. ఇద్దరం ఒకే పుస్తకం కోసం వెతుకుతున్నాం. అది మా ప్రొఫెసర్ తీసుకెళ్ళారుట. లైబ్రేరియన్ చెబుతుండగానే ప్రొఫెసర్ పుస్తకం తో వచ్చారు. ‘ఒహోహో! టాపర్స్ ఇద్దరూ ఇక్కడే ఉన్నారే….’ అంటూ. అప్పుడే తెలిసింది అతనే మిత్ర అని. ‘వాట్ మిత్ర! వాట్ ఆర్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్’ అని ఆయన అడిగినప్పుడు అతను ఎంతో స్థిరంగా చెప్పాడు ‘పి.హెచ్.డి.’ చేస్తాను సర్. అని. ద్రవ్య సమతుల్యతను సాధించటమే నా లక్ష్యం సర్. ఎన్నో కోట్ల ప్రజలున్న ఈ దేశంలో కొన్ని కోట్లమంది పేదరికంలో మగ్గుతున్నారు. ఇంకా కొన్ని కోట్లమంది అసలు తినడానికే తిండి లేక అలమటిస్తున్నారు. ఇంకొంతమంది బిచ్చమెత్తుకుంటూ ఇతరులపై ఆధారపడి బ్రతికేస్తున్నారు. ఎన్నాళ్ళు ఈ పరిస్థితి. భారత దేశం ఎన్ని సంవత్సరాలైనా అభివృద్ధి చెందుతున్న దేశం గానే ఉండిపోవటానికి కారణం ఏంటి? ధనవంతుడు సంపాదించి, సంపాదించి ఇంకా ధనవంతుడు అవుతూనే ఉన్నాడు. కష్టపడే తత్త్వం లేని వాడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు. సోమరిపోతులు ఎందుకూ పనికి రాకుండా పోతున్నారు. ఈ వ్యవస్థ మారాలి సర్. ప్రజలు తమకేంకావాలో తెలుసుకోవాలి. సోమరితనం విడనాడి, బ్రతుకు పోరు సాగించాలి. దానికోసం వారికి చేయూత నివ్వటం నా కర్తవ్యం సర్’

చెప్పటం ముగించిన మిత్ర ను అలానే చూస్తూ ఉండిపోయాను. నాకు తెలియదు నా ఒళ్ళు గగుర్పొడిచిన విషయం. అతని కళ్ళలో ఒక మెరుపు, మాటలో స్థిరత్వం, ముఖంలో ప్రశాంతత, సాధించగలననే నమ్మకం…… ఆ రాత్రి అంతా ఆలోచిస్తూనే ఉన్నాను. 

అలా మొదలైన పరిచయం ప్రతిరోజూ మాట్లాడుకోవటం, అభిప్రాయాలను పంచుకోవటం, దేశ స్థితిగతులను గురించి చర్చించుకోవటం, చదువు కై ప్రణాళికలు రూపొందించుకోవటం, కాలేజీలో, బైట అవగాహనా సదస్సులు నిర్వహించటం లాంటి పనులు ఎన్నో కలిసి చేసేవాళ్ళం. మా స్నేహం ఒక ఆరు నెలలు గడిచేసరికి చాలా దగ్గరభావం కలిగింది ఇద్దరికీ. అప్పుడడిగాను అతని కుటుంబ వివరాలు. మిత్ర చెప్పిన మాటలు విని నిశ్చేష్టితని అయిపోయాను. 

మిత్ర ఒక అనాథ. తల్లిదండ్రులెవరో తనకే తెలియదు. ఒక అనాథాశ్రమంలో పెరిగాడు. వాళ్ళే చదివించారు. అతని ప్రతిభ, పట్టుదల, ఏదైనా అనుకుంటే సాధించాలి అనే గుణాలు అతని చదువు ముందుకు సాగేలా తోడ్పడ్డాయి. అతను అనాథ అని తెలిసిన దగ్గరి నుండి అతని పట్ల ఆరాధన పెరిగింది.

బావా! ఆకర్షణ వేరు, ఆరాధన వేరు. నాకు ఏనాడూ తన పట్ల ఆకర్షణ లాంటి భావాలు కలగలేదు. కానీ తన ప్రవర్తనపై ఒక గౌరవం. ఈ రోజుల్లో మనుషులు తమ అలక్ష్యాన్ని, సోమరితనాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఎన్నో సాకులు చెప్తూ, ఎదుటి వాళ్ళపై నిందలు వేస్తూ కాలం గడిపేస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. కానీ తన పరిస్థితులేవీ తన లక్ష్య సాధనకు అడ్డంకిగా భావించలేదు మిత్ర. పైపెచ్చు మా పరిచయాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని గానీ, నా సానుభూతి పొందాలని గానీ ఎలాంటి ప్రయత్నం చేసేవాడు కాదు. అదే అతని పై నా గౌరవాన్ని రెట్టింపు చేసింది. 

డిగ్రీ లో ఇద్దరం గోల్డ్ మెడల్ తీసుకున్నాం. పి.జి. పూర్తి అవ్వడం, ఎం.ఫిల్ పూర్తి చేయటం తోనే పి.హెచ్.డి. కి దరఖాస్తు పెట్టాము. ఈ అన్ని పనుల్లోనూ మిత్ర నాకు చాలా సహాయం చేశాడు. ఒకరోజు నేనే నా మనసులో భావాన్ని చెప్పేశాను. తను కొంచెం ఆశ్చర్య పోయాడు ముందు. తర్వాత తేరుకుని, ‘పెళ్లి అనే ఆలోచన గాని, అలాంటి కార్యక్రమం కానీ నా అజెండా లో లేదే ఇప్పటివరకు….ఎలాగబ్బా!!’ అంటూ ఆటపట్టించాడు. ఇంకొక ఆర్నెలల్లో మా థీసీసు పూర్తి అవుతుంది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఇంతలో అమ్మానాన్నలు పెళ్లి ప్రస్తావన తేవడంతో ఇంట్లో చెప్పాల్సివచ్చింది. నాన్న ఏమీ మాట్లాడలేదు. విని సైలెంట్ అయిపోయారు. అప్పటినుండి నాన్న పెద్దగా నోరు తెరిచింది నేను చూడలేదు. అమ్మ చాలా అభ్యంతర పెట్టింది. ఏడ్చింది. తిట్టింది. ‘కులంగోత్రం లేని అనాథ ని చేసుకుంటావా? పెళ్ళంటే తమాషా అనుకున్నావా’ అంటూ దుమ్మెత్తిపోసింది.

బావా! పెళ్లి అనేది ఇద్దరు వ్యక్తులకు సంబంధించినది కాదు, రెండు కుటుంబాల కలయిక అని నాకు తెలుసు.సంబంధాలు చూసేటప్పుడు అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూడాలి అంటారు. ఎందుకు? వారిలో ఎవరికైనా ఏ రోగాలున్నా, చెడు స్వభావలున్నా, చెడ్డ అలవాట్లున్నా జాగ్రత్త పడతారని. కానీ మిత్ర పోతపోసిన మంచితనం బావా. అతను అనాథ అవ్వడానికి అతను కారణం కాకపోయినా , సమాజం పట్ల ఏహ్య భావాన్ని ఏర్పరుచుకోలేదు. పైగా ఎంతో బాధ్యత కలవాడు. ఎవరిపట్లా కోపం గాని, అసూయ గాని, ద్వేషం, పగ లాంటి విపరీత ధోరణులేవీ లేవు. కేవలం తన గురించి మాత్రమే ఆలోచించేవాడు తానొక్కడే సుఖపడతాడేమో గానీ కనీసం పక్కన ఉన్న వాడికి కూడా గుర్తుండడు. కానీ మిత్ర అలా కాదు బావా,  తన బాగు కోసం అహర్నిశలు కష్ట పడతాడు, ఎవరికి కష్టం వచ్చినా పరిగెడతాడు. ‘నా’ అనే దానికన్నా ‘మన’ అనే పదానికే ఎక్కువ విలువనిస్తాడు. ‘మన’ అని ఆలోచించేవాడు మొదట్లో కష్టపడతాడు కానీ ప్రజల మనసులో సుస్థిరంగా నిలిసిపోతాడు బావా. ‘నేను,నాది, మనము, మనది’ అనే పదాల మధ్య సహస్రాంతరం ఉంది బావా. 

నిస్సహాయ స్థితిలో ఉన్న నిన్ను నాన్న ఆదుకొని, చదువు చెప్పించి, ప్రయోజకుడిని చెయ్యటం ఆదర్శం అయితే మరి నేను చేసింది ఏంటి బావా? నా తల్లిదండ్రుల సంస్కారం, ఆదర్శభావాలు నాలో కూడా నిక్షిప్తమై ఉన్నాయి బావా. నేను చేస్తున్న పని తప్పుకాదు అని నేను నమ్ముతున్నాను. నిజానికి మేము ఇద్దరం నమ్ముతున్నాం. ఇక పెద్దవాళ్ళు ఎప్పుడు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారో అప్పుడే పెళ్లి చేసుకుంటాం. ఇది విన్నాక నీకు సందేహం కలగచ్చు ..ఇదంతా అమ్మానాన్నలకు చెప్పి ఒప్పించవచ్చు కదా? అని, నిజమే చెప్పి ఉండాల్సింది కానీ చెప్పలేకపోయాను. నేను తన గురించి చెప్పిన వెంటనే వాళ్ళు అడిగిన మొదటి ప్రశ్న ‘ఎవరు వాళ్ళు?’ …దానికి నా సమాధానం వినటంతోనే యుద్ధ శంఖం పూరించింది అమ్మ. అంతే నా నోరు మరి లేవలేదు. నా కన్న తల్లిదండ్రులను, అన్నయ్యను, ఆప్తబంధువు అయిన నిన్ను ఎదిరించటం  గానీ, అగౌరవపరచటం గానీ, అవమానించటం గానీ నా అభిమతం కాదు బావా. కానీ నేను నమ్మిన సిద్ధాంతాన్ని మనసా, వాచా, కర్మణా పాటించాలని అనుకున్నాను. అందుకోసం మిత్ర, నేను ఇద్దరం ఎన్నిరోజులైనా ఎదురుచూస్తాం. ఇప్పుడు చెప్పు బావా, ఏది తప్పు, ఏది ఒప్పు?”

ఇక తాను చెప్పాల్సింది ఏమీ లేదు అన్నట్టు ఒక నిశ్వాస విడిచింది. అప్పటిదాకా కిటికీ లోంచి బైటకు చూస్తూ, వింటూ నిలబడిపోయాను. అంతా విన్న తర్వాత ఎంతో నిర్మలంగా అనిపించింది. ఒక గౌతమ బుద్ధుడి జీవిత చరిత్ర చదివినట్లు…ఒక యోగి ఆత్మకథ విన్నట్లు…..ఇక నాకు చెప్పటానికి ఏమీ మిగలలేదు. ఇంత నిర్మాలిన్యమైన మనసులను అభినందించకుండా ఉండలేకపోయాను. 

వాళ్ళ ముందు నాకు నేను వామనుడిలా కనిపిస్తున్నాను. నేను బాగా చదువుకుని కలెక్టర్ అయ్యి, ప్రజాసేవ చేసే అవకాశం వచ్చిందని గర్వంగా చెప్పుకుంటున్నాను. కానీ ఏ పదవులు లేకపోయినా ప్రజాసేవ చెయ్యచ్చని, కులాలు గోత్రాలు సమాజంలో క్రమబద్ధత ను తీసుకువచ్చే ప్రణాళికలే గానీ మనుషుల అస్థిత్వానికి ఏమాత్రం అవసరంలేదని తెలియజేసిన వీళ్ళిద్దరికీ శతకోటి నమస్సులు. శాంతిమంత్రం నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది….   

 “అసతోమా సద్గమయ……తమసోమా జ్యోతిర్గమయ….మృత్యోర్మా అమృతంగమయ” 

‘తమసోమా జ్యోతిర్గమయ’ అనే మహా మంత్రానికి నిలువెత్తు ప్రతిరూపాన్ని మొదటిసారి చూశాను. మెల్లిగా గదిలోంచి బైటకి వచ్చిన నేను మావయ్య, అత్తయ్య, అమ్మ….చెమ్మగిల్లిన కళ్ళతో ఉండటం చూసి  ఆశ్చర్య పోయాను. మావయ్య ‘తల్లీ త్రిపురా! రేపే మిత్రని భోజనానికి పిలువమ్మా!’ అనడం, సుడిగాలిలా త్రిపుర ఒక్క ఉదుటున బైటకి వచ్చి అత్తయ్యను చుట్టేసుకుని భోరుమనడం, మావయ్య లేచి వెళ్లి త్రిపుర తల పైన చెయ్యి ఉంచి నిమరటం అంతా క్షణాలలో జరిగిపోయి, ఒక అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది.

ఆ రాత్రి ఇంట్లో జరిగిన యుద్ధంలో నిద్రాదేవే జయించింది.

******

Please follow and like us:

9 thoughts on “తమసోమా జ్యోతిర్గమయ!(క‌థ‌)”

  1. Tholi Katha antunnaaru,chadavatam modalu pedithe apakundaa chadivinche Pattu vunna saili. Rachana rangamlo manchi sthayee lo vuntaavu Vijaya Durga.Geetha empika ante ilaage vuntundi.abhinandanalu.

  2. ఎవరు చెప్పారండి.. కెమెరా తోనే కథ చూపించోచ్చు అని! ఆ కథనం కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఆ కథ మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది

  3. సరికొత్త కోణం మామ్. కధనం బాగుంది. ఆలోచనాత్మకంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published.