వాట్ ఏ రేపిస్ట్ డ్రామా (కవిత)

-పేర్ల రాము

ఎవర్ని నిలదీసి

అడగాలో అర్థం కావట్లేదు

సీతాకోకల్లా ఎగరాల్సిన వాళ్ళు 

ప్రాణం లేని నగ్నదేహాలతో కుప్పకూలుతున్నారు

పావురాల్లా పరుగులు పెట్టాల్సిన వాళ్ళు

కాలం కంచెల్లో బలైపోతున్నారు.

నడిరోడ్డు మీద నగ్నదేహాల్ని 

కలకంటున్న కళ్ళకి వయస్సుతో పనేముంది??

మొలకల్ని ,చెట్లను వేటినైన నరుక్కోవచ్చు .

కావాల్సినప్పుడల్లా న్యూడ్ వెబ్సైట్స్ ఓపెన్

సౌకర్యం పుట్టాక నేర్పేపనే ముంది??

వాడుకోవొచ్చు ,చంపేయొచ్చు 

అనే ఒక లోపలి నినాదానికి స్వేచ్ఛ 

చాలానే ఉందిగా.

అయ్యా మీరేం బాధని మోయకండి

కన్నీళ్ళను ఆగం చేసుకోకండి

ఏ సోషల్ మీడియాల్లోనే 

పోస్టులు రాయకండి

అప్పుడెప్పటి నుండో మొదలుకొని

ఇప్పటి కొత్తగూడెం

దేవిక దాకా ఎప్పటిలాగే జరుగుతుంది.

నా భయమంతా

దుమ్మెత్తిపోస్తూ 

ఏడుస్తున్న తల్లీ కన్నీళ్ళకి 

నా దగ్గర సమాధానం లేనేలేదని.

లోపలగుండెను పగలగొట్టుకొని దుఃఖిస్తున్న 

తండ్రీ పచ్చినొప్పులకి మందు వేతకలేకపోతున్ననని.

ఎన్నేన్ని 

రకాల కేసులొచ్చాయి

ఎన్నేన్ని 

రకాల చట్టాలొచ్చాయి

అయిన ఈ కథకి ముగింపే లేకపాయే.

ఎన్ని పేజీల గ్రంథంమో కదా

ఈ కామాంధుల కళ్ళలో రాయబడిన జీవితాలు

ఎన్ని సముద్రాల బాధనో కదూ

ఈ దేశంకళ్ళలో నుండి పుట్టినదుఃఖం.

మీరు 

ఈ గుండె బాధపడ్డప్పుడల్లా వొచ్చే

ఈ అక్షరాలనీ మాత్రమే చదవండి

నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది

నడుస్తున్న రేపిస్ట్ నాటకంలో 

బలికావాల్సిన  వాళ్ళమే కదా!!.

*****

ఆర్ట్: మన్నెం శారద

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.