అభిమతం

-వురిమళ్ల సునంద

కవిత్వాన్ని చూడగానే ముందుగా మనసులో కొన్ని రకాల ప్రశ్నలు మెదులుతుంటాయి.. అది సామాజిక బాధ్యత గల కవిత్వమా.. స్వీయానుభవాల వ్యక్తీకరణా?

భావోద్వేగాలతో ముడిపడిన స్పందనా… అస్తిత్వ స్పృహ..  సమస్యలకు పరిష్కారమా..

అని ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను వెతికే క్రమంలో ఆయా వ్యక్తులు  రాసిన కవితలను ఆద్యంతం చదవాలనే ఆలోచన  కలుగుతుంది.

భైరి ఇందిర గారు 2007 లో ప్రచురించిన కవితా సంపుటి ఇది. తెలంగాణలో మొట్టమొదటి గజల్ రచయిత్రిగా , ఫేస్ బుక్ లో నిత్యం సామాజిక స్పృహ తో కూడిన కవిత్వం రాసే కవయిత్రి గా అందరికీ సుపరిచితమే.

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైకూ రచనలో  మంచి గుర్తింపు పొందిన కవయిత్రి పేరొందారు.  వీరి రచనలను పరిశీలిస్తే భాధ, ప్రేమ , సమాజంలో జరుగుతున్న సంఘటనలు, సాంఘిక సామాజిక అసమానతల పై తన కలాన్ని శరంలా ఎక్కుపెట్టడమే కాకుండా మనం ఏం చేయాలి  మన సామాజిక బాధ్యత ఏమిటి.. అనేది గుర్తు చేసేలా ఉంటాయి.

ఈ కవితా సంపుటి *అభిమతం* – ఇందిర గారి విలక్షణమైన వ్యక్తిత్వాన్ని అద్దం పడుతుంది. 

 ఈ కవితా సంపుటి లో ఇరవై ఎనిమిది కవితలు ఉన్నాయి.   అందులో మతోన్మాదం,   మానవీయ విలువలు, అప్పటి రాజకీయ పరిస్థితులు, స్త్రీల అస్తిత్వానికి సంబంధించిన కవితలు ఉద్యమ స్ఫూర్తితో రాసిన కవితలు,.. స్వాతంత్ర్య దినోత్సవాలు,ఉగాదుల సమయం లో రాసిన కవితలు ఉన్నాయి. కవిత్వాన్ని బట్టి ఆ  కవి కవయిత్రి దృక్పథాన్ని తను సమాజాన్ని ఏ కోణంలో చూసి రాశారో చెప్పవచ్చు. 

ఈ కవితా సంపుటి లో మొదటి కవిత  *శస్త్ర చికిత్స*  ఇందులో  మతోన్మాదాన్ని నిరసిస్తూ.. కడుపు నింపుకోవడానికి/కంద మూలాలకు/ నేలను తవ్వాడు కానీ/…మత పిచ్చి రేగి/ఆట  మైదానం తవ్వాడా!.. చలి నెగళ్శలో మతోన్మాద కీలలు/ ఊళలేస్తున్నాయి/ . జడలు విప్పుకున్న మీడియా/ రేపుతున్న వికారాలు/….. సమాజ అంగాంగాలకు/ ఇన్ఫెక్షన్ సోకింది/ అది గాంగ్రిన్ కాకముందే/ శస్త్ర చికిత్స చేద్దాం రండి/ సమతా భావాల కొత్త రక్త దాతలమై సమాజాన్ని బ్రతికిద్దాం కదలండి.. అంటూ చైతన్యం కలిగిస్తారు. ఇలా ప్రగతి శీల కవయిత్రి గా మతోన్మాదం పై తీవ్రంగా స్పందిస్తూ .. మనిషికీ మనిషికీ మధ్య పెరుగుతున్న అంతరాలను తొలగించే ప్రయత్నం చేస్తారు. 

ఈ కవితా సంపుటి శీర్షికతో రాసిన కవిత *అభిమతం*  తాను 1998లో రాశారు. అప్పటికి స్వతంత్ర భారతికి యాభై సంవత్సరాలు నిండిన సందర్భమైనా  దేశమంతా విద్వేషాల విస్పోటనాలు / మత కలహాల పొగలు సెగలు/ ఇవే నీకు హారతులవుతుంటే  వేరే ఎందుకని  నిరసన ఆవేదన వ్యక్తం చేస్తూ మత రక్కసి కోరలకు/ మహాత్ముడే చిక్కాడు/ ఇక సామాన్యుడికి దిక్కెవరు” అని వాపోతారు. 

ఎయిడ్స్ వైరస్ ఉన్న వాడినే చంపుతుంది కానీ.. మత వైరం అందరినీ మడత పెట్టి చంపుతుంది..ఇది ఇంకా భయంకరమైన వైరస్ అని రాస్తూ.. మతం హతం కావాలన్నదే/ మన అభిమతం/

అంతరాలను అగ్గితో కడుగుదాం/.. అభ్యుదయ భావాల యాంటీ బయోటిక్ ని/ సిరాగా మార్చి/ కలాల సిరంజీలతో/ గళాల నీడిల్స్ తో / మనసు పొరల్లో కి ఎక్కిద్దాం. జగానికి సరికొత్త వెలుగునిద్దాం‌. అంటూ పిలుపునిస్తారు.

 *మానవత్వం*  అనే కవిత గురజాడ అడుగు జాడల్లో రాసిన కవిత. దేశమును ప్రేమించుమన్నా అని గురజాడ గారు రాస్తే స్వార్థమును ద్వేషించుమన్నా అని ఇందిర గారు రాశారు. చివర్లో పుడమి తేజం ప్రజ్వలింపగ/ కరుణ స్నేహం విస్తరింపగ/ గగన సీమల కెగురుదామోయ్/ జగము మించి ఎదుగు దామోయ్/ అంటూ రాసిన కవిత  చూసి గురజాడ ఆత్మ సంతోష పడుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. 

 *ఇదీ స్వాగతమే* అనే కవిత ఉగాది పండుగ సందర్భంగా రాసింది.. అప్పటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ నీ కోసం సంబరంగా స్వాగత బ్యానర్ కట్టలేను.ఆ బట్ట ఇప్పుడే ఓ రైతన్న శవంపై కప్పి వస్తున్నాను/  .. రైతు దుస్థితి ని , ఒత్తిడి చదువును , నెత్తి కెక్కిన మత మౌఢ్యాన్ని నెలవంకలా భరిస్తున్నాం/ గళాన్ని – హలాన్ని- కలాన్ని/ త్రిశూలం లా చేబూనాము/ ఇక మిగిలింది .. మూడో కన్ను తెరవడమే.. అని  రాజకీయ చైతన్యం, సామాజిక స్పృహ కలిగి ఉన్న కవయిత్రి గా మనకు కనిపిస్తారు.

తన కవిత ఏం కావాలో  చెబుతూ *కావాలి నా కవిత*  లో ఆశల చుక్కాని, యాంటీ బయోటిక్, ఎరుపెక్కే తూర్పు దిక్కు, యువతకు దిశా నిర్దేశం సర్వ మానవ సమానత్వమనే శాంతి పావురం కావాలని కోరుకుంటారు.

 *నువ్వు -నేను*  లో తాను ఎలా ఉంటుందో  పురుషాధిక్యతపై విరుచుకుపడుతూ  “నీ కళ్ళు కలలను చేస్తుంటే/ నా కళ్ళు వెలుగుకై చూస్తున్నాయి.. నువు కరిగిన కాలాన్ని చూస్తుంటే/ నేను విరిగిన రెక్కలు సవరిస్తున్నా.. అంటూ ఇద్దరి మధ్య భావజాలం లోని వైరుధ్యాలను చాలా స్పష్టంగా వ్యక్తం చేస్తారు. 

ప్రతి కవి గానీ కవయిత్రి గానీ మొదటి కవితా సంపుటి లో అమ్మ గురించి కవిత రాయకుండా ఉండరు. అలాగే ఇందిర గారు కూడా వాళ్ళ అమ్మతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అమ్మ ఆఖరి దశలో ఎవరూ పట్టించుకోవడం లేదనే భాధతో శపించ వెందుకు అమ్మా! లేవలేని నిన్ను ఆశ్రయించిన వ్రణాలు జాలిగా రక్తాశ్రవులు స్రవిస్తున్నా.. అని ఎంతో ఆర్తిగా ఆవేదనగా రాశారు.

ఇక *అనాదిగా*  అనే కవితలో స్త్రీ ఎన్ని విధాలుగా ఈ  సమాజంలో అవమానింపబడుతుందో.. పురాణేతిహాసాల పాత్రల్లో చూపిస్తారు.  ఇవి చదువుతుంటే   ఓల్గా గారి కథలు  జయప్రభ గారి కవితలు  మొదలైనవి గుర్తుకు వస్తాయి. ఆచారాలు సాంప్రదాయాల వెనుక స్త్రీ పాత్రలు ఎలా బాధలను అనుభవించాయో  ఈ కవిత ద్వారా  చెబుతారు.. ” కాళ్ళ బేరానికొస్తుంటే/ కలవరపడి, కదిలి/ కాలు తగిలింది-అంతే/ మొగుడ్ని తన్నిందన్నారు/  శివుడి జటాజూటంలో బంధింపబడిన గంగను గయ్యాళి గంగమ్మ అన్నారు/  సీత అగ్ని పరీక్ష  , మేనక, శకుంతల, ద్రౌపది, అహల్య లాంటి స్త్రీ జీవితాలు పురుషాధిక్యత వలన ఎలాంటి క్షోభకు గురి అయ్యాయో ఆ కోణంలో ఆలోచింప చేస్తారు.

 *మీడియా*  స్త్రీలను చూపించే తీరు వారిని ఎంతగా దిగజార్చి  చూపుతున్నాయో  నేటికీ చూస్తూనే ఉన్నాం. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం.. అలాంటిది ఎన్ని రకాలుగా కించపరిచేలా  నేటి ప్రకటనలు సీరియల్స్ చూస్తుంటే తెలుస్తుంది

. అందుకే ఈ ప్రచార భూతాలు తోక ముడిచేలా ఎదురు తిరగాలి అంటూ పిలుపునిస్తారు.. ఇక  నేను అనే కవిత అస్తిత్వ ప్రతీక గా చెప్పవచ్చు. తను ఎలా ఉండాలని వుందో చెబుతూ  సరళ రేఖ కు చివరి/ బిందువు కావాలని లేదు/ ఉప్పులో కలిసే నదిలా/ ఉనికి కోల్పోవాలని లేదు… చైతన్యానికి ఆకృతిని  కావాలనుంది/ చరచరాలకు జాగృతి కావాలనుంది/ అంది అంటారు.. అలాగే నువ్వు -నేను కవితలో ఇద్దరి మధ్య గల భావ వైరుధ్యాలను కవిత్వీకరిస్తూ.. తన మనసు ఎలా ఉంటుందో స్పష్టీకరిస్తారు. *ఓదార్పు*  చిన్న కవిత ఐనప్పటికీ స్త్రీ కార్చే కన్నీటి గురించి చక్కని ఎత్తుగడతో   కన్నీరు కార్చినంత మాత్రా నా ఓడిపొయినట్ట కాదు వర్షించే మేఘానిది దౌర్బల్యం కానట్టే ద్రవించే హృదయానికి ఉదాహరణ / ఓర్పుకి పరాకాష్ట అది అని చక్కని ముగింపు నిస్తారు..ఓ ఉపాధ్యాయిని గా

ఉపాధ్యాయుల గొప్ప తనం తెలిసేలా  మనీషి- మహర్షి మంచి ఉపాధ్యాయుడనీ.. రాసిన కవితను బట్టి ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి..ఎలా ఉండకూడదో తెలిపే మంచి కవిత.. అలాగే *ఒక పాటా* లో బాల్య వివాహం అయిన ఆడపిల్లకు మాంగల్యం ఎలా బరువుగా మారిందో.. ఆచారాల మధ్య ఆ హృదయం ఎంతగా తల్లడిల్లి పోయిందో.. ఎంతో ఆర్థ్రతతో రాసిన కవిత.

ఇలా ఎన్నో సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని కవిత్వ సృజన చేసిన ఇందిర గారి కవితలు సమాజంలోని అనేక అంశాలను తన దృక్కోణంలో గమనించి రాసిన చైతన్య  రూపాలు. తన కవితలు లయబద్ధంగా గానయోగ్యంగా కనిపించాయి చాలా చోట్ల.. ఇంకా అనేక కవితలు చదువు తుంటే పదమూడు సంవత్సరాల క్రితం రాసిన వాటిల్లా అగుపించవు శ్రీశ్రీ గారి పాడవోయి భారతీయుడా పాటలా  ప్రస్తుతాన్ని కళ్ళకు కట్టించినట్లుగానే ఉంటాయి ఎన్నో ఏళ్ల సాహిత్య అనుభవం కలిగిన ఇందిర గారి కలం నుండి గజల్ సంపుటాలు వచ్చాయి. ఇంకా కవితా సంపుటాలు వెలువరించడానికి సిద్ధంగా ఉన్నాయి. నేటి మేటి సీనియర్ కవయిత్రి గా  సాహిత్యంలో తనదైన ముద్ర వేసుకున్న భైరి ఇందిర గారు అభినందనీయులు.

 వీరి కవితా సంపుటిని సమీక్ష చేయడం ఎంతో ఆనందంగా ఉంది.

  *సమీక్షకురాలు* 

 వురిమళ్ల సునంద, 

తెలుగు భాషోపాధ్యాయిని,

కవయిత్రి రచయిత్రి

సాహితీ లోగిలి,

11-10-694/5,

బురహాన పురం,

ఖమ్మం-507001

చరవాణి 9441815722

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.