ఉత్తరం-7

నీవొక్కడివే యుద్ధాన్ని ఆపగలవు

రచయిత: ఎం.కె.గాంధీ

స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి

 

నేపథ్యం:

మానవజాతికి పోరాటాలు, యుద్దాలు కొత్త కాదు.
కానీ, శాస్త్రవిజ్ఞానం తోడయి ……. రెండవ ప్రపంచ యుద్ధం సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు.

ఆ యుద్ధానికి ప్రధాన కారకుడు అడాల్ఫ్ హిట్లర్.

ఆ యుద్ధ మేఘాలు అలుముకొన్న దశలో … యుద్ధ ప్రారంభానికి కొద్దికాలం ముందుగా … యుద్ధం మానివేయమని సలహా ఇస్తూ గాంధిజీ హిట్లర్ కు రాసిన ఉత్తరం ఇది. 1939 జూలై 23 న రాసిన ఈ ఉత్తరం కాకుండా మరో ఉత్తరాన్ని కూడా 1940 లో గాంధిజీ హిట్లర్ కు రాసారు. కానీ, ఆ రెండింటిని హిట్లర్ కు చేరకుండా బ్రిటిష్ వారు నిరోధించారు.

హింస, అహింసలు …..
హిట్లర్, గాంధీ ….. రెండు భిన్న ధ్రువాలు.

రెండవ ప్రపంచ యుద్ధంలో విధ్వంసకాండకు తోడ్పడిన అణుబాంబు ఆవిష్కర్త, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ….. గాంధీ 70 వ జన్మదిన సందర్బంగా గాంధి గురించి ప్రస్తావిస్తూ, “రానున్న తరాలవారు ఇట్లాంటి మనిషి ఒకరు రక్తమాంసాలతో ఈ భూమ్మీద నడయాడినాడంటే ….. బహుశా నమ్మలేరు.” అంటాడు.

“అడాల్ఫ్ హిట్లర్” అనే పేరిట హిట్లర్ జీవిత చరిత్రను రాసిన జేమ్స్ బంటింగ్, ఆ పుస్తకం చివరి వాక్యాలుగా “ఈ యుగంలో పుట్టిన అత్యంత నిరంకుశుడు చనిపోయాడు, పూడ్చిపెట్టబడ్డాడు. అతనిలాంటి మరో వ్యక్తి పుట్టకుండా వుండాలని ఆశిద్దాం.” అని రాసాడు.

***


(ఉత్తరం)
————

భారత దేశం
వార్ధా నుండి
23.7.’39

ప్రియ మిత్రమా,

మానవాళి శ్రేయస్సు కోసం నీకో లేఖ రాయమని స్నేహితులు ఒత్తిడి చేస్తున్నారు. కానీ, వారి కోరికను నేను అణచుకొన్నాను. ఎందుకంటే, నా లేఖ ఎలాంటిది అయినా అది అసంబద్ధం అయినదే అయి వుంటుంది. నా విజ్ఞప్తి యోగ్యత ఎట్లా వున్నప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకోనక్కర్లేదని నాకు ఏదో ఉద్భోదిస్తున్నది.

మానవాళిని ఆటవిక రాజ్యంగా మార్చగలిగే యుద్దాన్ని ప్రపంచంలో నీవొక్కడివే ఆపగలవనేది నిర్వివాదాంశం. నీకు ఎంతటి విలువైనది అనిపించినా సరే, అంతటి మూల్యాన్ని నీవు చెల్లించాలా? ఎలాంటి విజయం సాధించకుండా యుద్దమార్గాన్ని ఉద్దేశ్యపూర్వకంగా వదలిపీట్టిన నా అభ్యర్థనను మన్నిస్తావా? ఏదైనా సరే, నీకు ఇలా రాయడంలో నేను పొరపాటుపడివుంటే, నన్ను మన్నిస్తావని ఆశిస్తున్నాను.

సెలవు,
నీ విశ్వాస మిత్రుడు
ఎం.కె.గాంధీ 

హెర్ హిట్లర్
బెర్లిన్
జర్మని

***

ముగింపు:
———–
స్వాతంత్ర్య పోరాటంలో గాంధీజీ పాత్ర అందరికీ తెలిసిందే.

రిచర్డ్ అటెన్బరో తీసిన “గాంధీ” సినిమా చూసిన తర్వాత నాకు అనిపించేదేమిటంటే ….. గాంధి పుట్టిన దేశంలో ఆయన గురించి ఎన్నెన్నో మాటలు చెప్పుకునే మనం …… ఓ బ్రిటిష్ జాతీయుడైన అటెన్బరో లాగ ….. కొన్ని దశాబ్దాల పాటు ఎందుకు ఓ గొప్ప సినిమా తీయలేకపోయాము …… అని.

నేను వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో బి.ఏ చదువుతున్న రోజుల్లో …… “వకీల్” గారు అనే లెక్చరర్ మాకు పొలిటికల్ సైన్స్ చెప్పేవారు. ఆయన పొట్టి మనిషి. “నా కన్నా హిట్లర్ రెండు ఇంచులు ఎత్తు తక్కువ.” అని సరదాగా చెప్తూండేవాడు.

***

ఉపన్యాసం-7

నాకు రక్తాన్నివ్వండి-నేను మీకు స్వాతంత్రాన్నిస్తాను

వక్త: సుభాష్ చంద్ర బోస్

స్వేచ్ఛానువాదం : చింతకుంట్ల సంపత్ రెడ్డి

నేపథ్యం:

స్వాతంత్ర్య పోరాటంలో గాంధి-బోస్ ….. రెండు భిన్న ధ్రువాలు.
ఆశయం ఒకటైనా …… దారులు వేరు.

సుభాష్ చంద్ర బోస్ హార్వర్డ్ యూనివర్సిటి పట్టభద్రుడు.
అప్పటి ఐ.సి.ఎస్ (ఇప్పటి ఐ.ఎ.ఎస్) పరీక్ష పాసయ్యాడు.
కానీ, జలియన్ వాలా బాగ్ దురంతం గురించి విని, శిక్షణ పూర్తికాకుండానే ఐ.సి.ఎస్ కు తిలోదకాలిచ్చాడు!

గాంధీజీ వల్ల ప్రాభావితుడై, స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకొన్నాడు.
కానీ, గాంధీ-ఇర్విన్ ఒడంబడికను (శాసనోల్లంఘన నిలిపివేయడం) నిరసించాడు.

భగత్ సింగ్ ను, ఆయన అనుచరులను ఉరి తీసిన తర్వాత అహింసామార్గంలో స్వాతంత్ర్యాన్ని సాధించలేమనే నిర్ణయానికొచ్చాడు.

1941 లో మారువేషంలో జర్మని చేరుకొన్నాడు. జర్మని (హిట్లర్) సహకారంతో బ్రిటిష్ వారిని యుద్ధం చేసి ఓడించాలని అతని ప్రయత్నం. కానీ, ఆ ప్రయత్నం ఫలించక ….. జపాన్ సహకారం కోరాడు.

తూర్పు ఆసియా దేశాల్లో అప్పటికే కొంత సంఘటితమై వున్న ఆజాద్ హింద్ ఫౌజ్ (ఇండియన్ నేషనల్ ఆర్మీ) ను బలోపేతం చేశాడు. ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని స్థాపించాడు. బర్మాలో సైనిక స్థావరాన్ని స్థాపించాడు.

జూలై 4, 1944 నాడు ఆజాద్ హింద్ ఫౌజ్ సైనికులనుద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఇది….

***

(ప్రసంగ పాఠం)
———————

మిత్రులారా,

పన్నెండు నెలల క్రితం …… ‘సంపూర్ణ సమీకరణ’ లేక ‘గరిష్ట బలిదానం’ అనే కొత్త కార్యక్రమం తూర్పు ఆసియాలోని భారతీయుల ముందు ఉంచబడింది. గత సంవత్సరంలో మనం ఏమి సాధించాము ….. రానున్న సంవత్సరంలో మన డిమాండ్లు ఏమిటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను. కానీ ….. అంతకన్నా ముందు ….. మన స్వాతంత్ర్య సాధనకు ఓ సువర్ణావకాశం వుంది అని మీరంతా గ్రహించాలి. ప్రస్తుతం ….. బ్రిటిష్ వారు ప్రపంచవ్యాప్తంగా పోరాటాల్లో మునిగి వున్నారు. ఒకటి వెనుక ఒకటి ….. చాలాచోట్ల ….. వారు పరాజయాన్నే చవిచూస్తున్నారు. ఆ విధంగా ….. మన శత్రువు బలహీనమవడంవల్ల ….. అయిదు సంవత్సరాల ముందుకన్నా ….. మన పోరాటం సులువైంది. అరుదుగా లభించే ఇట్లాంటి భగవంతుడు ఇచ్చే అవకాశం శతాబ్దంలో ఒకసారి వస్తుంది. అందువల్ల, మన మాతృదేశాన్ని బ్రిటిష్ దాస్యబంధంనుండి … విముక్తి చేయడానికి ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవడానికి మనం ప్రతిన పూనాం.

మన పోరాట ఫలితం పట్ల ….. నేను చాల నమ్మకంతో, ఆశాపూర్ణంగా వున్నాను. ఎందుకంటే ….. తూర్పు ఆసియాలోని మూడు మిలియన్ల భారతీయుల ప్రయత్నాల పైన మాత్రమె నేను ఆధారపడిలేను. భారతదేశం లోపల భారీయెత్తున ఉద్యమం కొనసాగుతున్నది. స్వాతంత్ర్యసాధనకు మిలియన్లకొద్ది మన దేశవాసులు ….. ఎంతటి కష్టాలనైనా సరే ఎదుర్కొని ఆత్మసమర్పణకు సిద్దమయ్యారు.

 

దురదృష్టవశాత్తు ….. 1857 లో జరిగిన మహత్తరమైన తిరుగుబాటు తర్వాత భారతీయులు నిరాయుధులు గావించబడ్డారు. కానీ….. శత్రువుల వద్ద చాల ఆయుధాలు వున్నాయి. ఈ నవీన యుగంలో …. ఆయుధాలు, ఆధునిక సైన్యం లేకుండా నిరాయుధులైన ప్రజలు స్వాతంత్ర్యాన్ని సాధించడం అసంభవం. అదృష్టవశాత్తు …. నిప్పన్ (జపాన్) సహాయంతో తూర్పు ఆసియాలోని భారతీయులు ఆయుధాలు, ఆధునిక సైన్యం సమకూర్చుకొనేందుకు వీలయింది. అంతేగాక, తూర్పు ఆసియాలోని భారతీయులు స్వాతంత్ర్యసాధనకు ఒక్కత్రాటిపై నిలబడ్డారు. భారతదేశం లోపల బ్రిటిష్ వారు రెచ్చగొడ్తున్న మతపరమైనవి గానీ ….. ఇతరములైనవి గానీ భేదాలు ఇక్కడ లేవు. దానివల్ల ….. మన పోరాటంలో విజయం సాధించడానికి అనుకూల పరిస్థితులు ఇప్పుడు మనకు వున్నాయి. కావాల్సిందల్లా ఒక్కటే ….. స్వాతంత్ర్యసాధనకు చెల్లించాల్సిన మూల్యాన్ని చెల్లించడానికి ముందుకు రావడమే! ‘సంపూర్ణ సమీకరణ’ కార్యక్రమం ప్రకారం నేను అడిగింది ….. మనుషులు, ధనం, సామాగ్రి. మనుషులకు సంభందించినంతవరకు …… కావల్సినంతమంది ఇప్పటికే భర్తీ అయ్యారు. వీరంతా ….. చైనా, జపాన్, ఇండో-చైనా, ఫిలిప్పీన్స్, జావా, బోర్నెయో, సేలిబెస్, సుమత్రా, మలయా, థాయ్ లాండ్, బర్మా మొదలైన అన్ని మూలల వున్న తూర్పు ఆసియా దేశాలనుండి వచ్చి చేరారు.

మనుషులు, ధనం, సామాగ్రి మనమింకా పెద్దమొత్తంలో సమీకరించాలి ….. ముఖ్యంగా సరఫరా, రవాణా ఇబ్బందులను సంతృప్తికరంగా పరిష్కరించాలి.

స్వాతంత్ర్యం సాధించిన ప్రదేశాల్లో….పరిపాలన, పునర్వివస్తికరణ __ కోసం ఇంకా ఎక్కువమంది స్త్రీ పురుషులు మనకు కావాలి. బర్మాలో చేసినట్లుగా … వెళ్ళిపోయేముందు సాధారణ ప్రజానికాన్ని ఖాళి చేయించి, భూ దహన విధానాన్ని నిర్దాక్షిణ్యంగా శత్రువులు అమలుచేస్తే…..దాన్ని ఎదుర్కోవడానికి మనం సిద్దమైవుండాలి.

అన్నిటికంటే ముఖ్యమైన ఇబ్బంది…..అదనపు బలగాలను, వస్తువులను పోరాట ప్రదేశాలకు పంపడం. అది మనము చేయలేకపోతే, ఆ ప్రదేశాల్లో విజయాన్ని ఆశించలేము. అట్లాగే మనం భారతదేశపు లోపలి ప్రాంతాల్లోకి చొచ్చుకు పోలేము గూడను.

మన స్వాతంత్ర్య సంగ్రామానికి తూర్పు ఆసియా….. ముఖ్యంగా బర్మా స్థావర కేంద్రం అనే విషయం ‘హోంఫ్రంట్’ (స్వదేశానికి దూరంగా ఏర్పరచుకొన్న యుద్ద స్తావరం) లో పనిచేస్తున్నవారెవ్వరు మరచిపోకూడదు. ఈ స్థావరం ధృఢంగా లేనట్లయితే, మన పోరాట సైన్యాలు విజయం సాధించలేవు. ఇది పూర్తి స్థాయి సంగ్రామం అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇది కేవలం రెండు సైన్యాల మధ్య యుద్ధం కాదు. అందువల్ల సంవత్సరం పాటుగా నేను ‘సంపూర్ణ సమీకరణ’ విషయం పట్ల అంతగా శ్రద్ధ తీసుకుంటున్నాను.

‘హోంఫ్రంట్’ ను బాగా చూసుకోవాలని నేను చెప్పేందుకు మరో కారణం కూడా వుంది. ఇంకా కొద్ది నెలల్లో నేను, క్యాబినెట్ యుద్దకమిటిలోని నా సహచరులు ….. పోరాట ప్రాంతాలు ….. అలాగే భారతదేశం లోపలి ఉద్యమంపై మా పూర్తి దృష్టిని కేంద్రీకరించాలని అనుకొంటున్నాము. దానివల్ల, మేము లేకపోయినప్పటికీ ….. ఈ స్థావరంలో పనులు నిరాటంకంగా సాగిపోగలవని మీరంతా హామీ ఇవ్వాలి.

మిత్రులారా, సంవత్సరం క్రితం ….. నేను కొన్ని విషయాలు మీ నుండి కోరినపుడు ….. మీరు ‘సంపూర్ణ సమీకరణ’ ఇస్తే, నేను మీకు ‘రెండవ ఫ్రంట్’ ను ఇస్తానని చెప్పాను. నేను నా ప్రతిజ్ఞను నిలబెట్టుకొన్నాను. మన ఉద్యమపు మొదటి భాగం ముగిసిపోయింది. మన సైన్యాలు, నిప్పనీస్ (జపానీస్) సైన్యాలతో కలిసి ….. విజయవంతంగా ….. శత్రువును వెనక్కి తోసివేసి ….. మన మాతృభూమి పవిత్రనేల మీద ధైర్యంగా పోరాటం చేస్తున్నాయి.

ప్రస్తుతం, మన ముందున్న కార్యసాధనకు నడుం బిగించండి. నేను మిమ్మల్ని మనుషులు, ధనం, సామాగ్రి కావాలని అడిగాను. అవి నాకు పుష్కలంగా లభించాయి. ఇప్పుడు మీనుండి మరింతగా కోరుతున్నాను. మనుషులు, ధనం, సామాగ్రి ….. వాటంతట అవే విజయాన్ని, స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టలేవు. సాహసకృత్యాలు, వీరోచిత మహత్కార్యాలు చేసేందుకు స్పూర్తినిచ్చే ప్రేరేపక శక్తిని మనం పొందాలి.

విజయం దగ్గరలోనే వుంది కాబట్టి ….. మనం బ్రతికి వుండి ….. స్వాతంత్ర్య భారతదేశాన్ని చూస్తామని అనుకొంటే అది ప్రాణాంతకమైన పొరపాటు అవుతుంది. బ్రతికి వుండి స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తామనే కోరిక ఇక్కడ ఎవరికి వుండకూడదు. సుదీర్ఘ పోరాటం ఇంకా మనముందున్నది.

ఇవ్వాళ మనకొక్కటే కోరిక వుండాలి…..అది మనం చనిపోయి ….. మన దేశం బతకాలనే కోరిక!
వీరుల నెత్తురు చింది ….. స్వాతంత్ర్యానికి బాట వేసేందుకు ప్రాణాన్ని పణంగా పెట్టగలిగే బలిదానపు కోరిక!

మిత్రులారా! ఈ స్వాతంత్ర్య పోరాటంలో నాతో పాటు వున్న సహచరులారా! అన్నిటిని మించి…..ఈ రోజు నేను మిమ్మల్ని ఒక్కటే కోరుతున్నాను. నేను మీ రక్తాన్ని కోరుతున్నాను. కేవలం రక్తం మాత్రమే … శత్రువు చిందించిన మన రక్తానికి బదులు ప్రతీకారం తీర్చుకోగలదు. కేవలం రక్తం మాత్రమే స్వాతంత్ర్యపు మూల్యాన్ని చెల్లించగలదు.

నాకు రక్తాన్నివ్వండి, ….. నేను మీకు స్వాతంత్యాన్ని వాగ్దానం చేస్తాను.

***

ముగింపు:
———-
ఒక మహత్తర ఆశయాన్ని సాధించేందుకు ….. దేశం కాని దేశం వెళ్లి అనేక వ్యయప్రయాసలకోర్చి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సవాలు చేసిన సుభాష్ చంద్ర బోస్ ను భారతదేశం మరువజాలదు.

హన్మకొండలో ….. నా హైస్కూల్, కాలేజి విద్యాభ్యాసం రోజుల్లో ….. నేను చౌరస్తాకు దగ్గర్లో వుండేవాన్ని. దాదాపు రోజూ సుభాష్ బోస్ విగ్రహం ముందు నుండి వెళ్లేవాన్ని. ఆ విగ్రహం చిన్నగా వుండేది. నేను ఈ మధ్య అటువైపు వెళ్ళలేదు కానీ …. ఇప్పుడు కూడా అలాగే వున్నట్టుంది. అది ఇంకాస్త ఎత్తుగా, గంభీరంగా వుంటే బాగుండేదేమో అని అనిపించేది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.