కనక నారాయణీయం -12

పుట్టపర్తి నాగపద్మిని

ఇంటి పనులూ, భర్త నారాయణాచార్యులవారి శిష్య వర్గానికి పాఠాలు పునస్చరణ చేయించటంలోనూ తలమునకపైపోతూకూడా, భర్త విద్వాన్ పరీక్ష బాగా వ్రాశారని విని చాలా సంతోషపడిపోయిందా నేదరి ఇల్లాలు – పుట్టపర్తి కనకవల్లి!!

   ఇక పరీక్ష ఫలితాలకోసం ఎదురుచూపు !!   ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. విద్వాన్ పరీక్ష ఫలితాలొచ్చాయి. అది విని కనకవల్లి దిగ్భ్రాంతి చెందింది!!

   కానీ పుట్టపర్తి కి యీ విషయాలే పట్టటం లేదు. పరీక్ష తరువాత, మళ్ళీ, తన దైనందిన చర్యలలో మునిగిపోయారు. కాకపోతే, ఒక విషయం. మళ్ళీ ఒకసారి తిరుపతి ఓరియెంటల్  కళాశాలలో తన ప్రవేశాం, తాను చదివిన పరిసరాలు..అక్కడ తిరుగుతున్నప్పటి అనుభవాలు – ఒక నవ్య స్ఫూర్తిని   నింపాయి వారిలో!!

   ఇప్పుడా కళాశాలలో తనతో చదివినవారెవ్వరూ  కనిపించకపోయినా, ఆ పరిసరాల్లో తిరుగాడేటప్పుడు, తనకు ఆఠాలు బోధించిన మహనీయులెందరో గుర్తుకు వచ్చారు.

   టీ.డీ.తాతాచార్యులవారు అప్పటి అధ్యాపకుల్లో ఒకరు. మీమాంసా శాస్త్రంలో వారు ఉద్దండ పండితులు. సంస్కృతంలో వారి అనర్గళోపన్యాసం వర్షఋతువులోని జలపాతాన్ని  స్ఫురణకు తెచ్చేది.  వారి ఇంటికి కూడా అప్పుడప్పుడూ వెళ్ళి, తెలియని విషయాలు తను తెలుసుకుంటూ ఉండటం గుర్తే!! వారు రచించిన పుస్తకాలన్నీ ప్రేమతో వారు ఇవ్వటం, తాను చదవటం – అదో గొప్ప అనుభూతే!! సంస్క్ర్త వ్యాకరణంలో మాంచి పట్టున్న నీలమేఘాచార్యులవారూ అప్పుడక్కడున్నారు. వ్యావహారికశైలిలో సంస్కృతంలో వారు చక్కటి హాస్య ధోరణిలో మాట్లాడుతుంటే, విద్యార్థులందరికీ – పడగే పండగ!! వ్యాకరణ శాస్త్రంలో వరినెదిరించేవారే లేరప్పట్లో!! కాశీ విశ్వవిద్యాలయంలో కొంత కాలం పనిచేసినవారు, ఇప్పుడు తిరుపతి ప్రాచ్య కళాశాలలో పనిచేయటం, ఒక విధంగా విద్యార్థుల అదృష్టమనే చెప్పాలి.వారి వద్దకూ అప్పుడప్పుడు వెళ్ళి, పలు విషయాలు తెలుస్కుంటూ ఉండేవారు పుట్టపర్తి .

   ఇక్కడే, కాదంబరిని గట్టిగా చదువుతూ, కంఠస్థం చేసిన రోజులను గుర్తు చేసుకున్నారక్కడ పుట్తపర్తి. అంతే కాదు, తెల్లవారుఝామున తక్కిన విద్యార్థులంతా వేదం పురశ్చరణలు చేసుకుంటుంటే, తాను బైబిల్ చదువుతుండటం చూసి మిత్రుడు శ్రీనివాసాచార్యులు తెగ ఆశ్చర్యపోయిందీ ఇక్కడే మరి!!

   ‘ఏమిటిదంతా?’ అని అడిగాడతను ఉండబట్టలేక!!

   ‘ దానిలో ఏముందో కూడ తెలుసుకుందామనిపించింది!!’ పుట్టపర్తి సమాధానం!!

   తిరుపతిలో యీ సంఘటన గుర్తుకు వచ్చి, చిన్న నవ్వొకటి మెరిసింది వారి పెదవుల మీద!!

   అంతేనా?? శిరోమణి చదివే రోజుల్లోనే బెటెడెల్ కీత్ అనే జర్మన్ సంస్కృత పండితుడు తన భారత దేశపర్యటనలో భాగంగా తిరుపతికి వచ్చాడు!! ఆయన ఉపన్యాసాలు ప్రధానంగా అలంకార శాస్త్రం,  సంస్కృత నాటకాలమీద సాగాయి. అవి చాలా శ్రద్ధగా వినటం, ఆయన రచనలూ కొన్ని చదవటం వల్ల, సంస్కృతం పట్ల ప్రేమ దినదినాభివృద్ధి చెందింది. ఎక్కడో జర్మనీ దేశస్థుడైన యీ పండితునికే మన సంస్కృత సాహిత్యం మీద ఇంత మక్కువ ఉన్నప్పుడు, మనకు అందులో కాస్తైనా ఉండకపోతే ఎలా??   

   బాణ  విరచిత కాదంబరినంతా కంఠస్థం చేసేశాడు తాను!! అంతేనా, అశ్వఘోష, లీలాశుక, జయదేవ, మయూర, మాఘ, భారవి, హర్ష, ఆనందవర్ధన, జగన్నాధ పండిత రాయలు, అమరుకాది  గీర్వాణ దురంధరుల రచనలు చదువుతుంటే, వీరి రచనలముందు, మనమెంత?? అన్న సందేహం  కూడా  – తనను  పీడిస్తూ ఉండేది.         

  ఇటువంటి సంఘటనలతో కూడిన తన జీవితంలో,  మొదటి వివాహం మిగిల్చిన వేదనాభరిత స్మృతుల ప్రభావం నుండీ తప్పించుకునే యత్నంలో ధూమ పానానికి అలవాటు పడటం, అది కాస్తా ఇంతై వటుడింతింతై వలె తననిన్ని విధాలుగా తిప్పలు పెట్టటం – పుట్టపర్తిని కలవరపెడుతూనే ఉన్నా, పెనుగొండలక్ష్మి, షాజీ రచనల వల్ల తనకందివచ్చిన గుర్తింపు తృప్తి కరంగా ఉంది. పైగా, ఇప్పుడు యీ విద్వాన్లో, తన రచన పెనుగొండ లక్ష్మి కావ్యమే తనకు పాఠ్య భాగమవటం, ఎంత వింత? ఈ ఆలోచనల్లోనే తాను చదివిన ఆ కళాశాలలో పచార్లు చేశారు విద్వాన్ పరీక్ష వ్రాసిన ఆనాడు పుట్టపర్తి!

   ఈ ఊహల్లో తేలియాడుతున్నట్టే ఉన్న పుట్టపర్తి తన నిత్య కృత్యాలలో మార్పులేకుండా నడిపిస్తూనే ఉన్నారు!!    

   ఇలా జరుగుతుండగా, చేతిలో బీడీతో అమ్మవారిశాల వీధిలో ఏవో ఆలోచనల్లో తలవొంచుకుని  వెళ్తున్నారోరోజు!!

  ఉన్నట్టుండి, ఫెళ్ళున నవ్వినట్టనిపించి తలెత్తి చూస్తే ఎదురుగా కొప్పరపు సుబ్బయ్యగారు, వారితో మరొకతను!!

  చటుక్కున చేతిలో బీడీ దూరంగా పడేసి, కొప్పరపు సుబ్బయ్యగారికి నమస్కారం చేశారు పుట్టపర్తి.

  ‘ఏమప్పో..ఆచార్లూ..బాగున్నావా? ఎదురుగా మనుషులున్నదే గమనించకుండా రోడ్డుమీద పోతాంటే, ఎట్టయ్యా?? ఏ సైకిలో గుద్దితే ఏమౌతాది??”అని పలకరించారు నవ్వుతూ కొప్పరపు సుబ్బయ్య గారు!!

  ఏదో ఆలోచనల్లో ఉన్న తనకా ముందుటి పిలుపు సరిగ్గా వినబడలేదు మరి!!

  కొప్పరపు వారి పక్కనే ఉన్న మరో వ్యక్తి, అందుకున్నాడు “కుర్రవాడు కదా. ఏదో ఆలోచనల్లో ఉన్నాడులేయ్యా??

 ‘ఏదో’ అన్న మాటకు ఎన్ని అర్థాలైనా చెప్పవచ్చు మరి!!

  ఈ మాటలైతే పుట్టపర్తి చెవిన పడ్డాయి బాగానే!!

  తృటిలో యీ లోకంలోకి వచ్చి పడ్డారు.

  తొట్రుపాటుతో,’క్షమించండి..ఏవో ఆలోచనల్లో…’ ఆగిపోయారు.

  ‘అదే  అదే !! ..యే సాకీనో పాకశాలకు పోదాం రమ్మంటూఉంటే..ఆమెతో కలిసి నడుస్తున్నాననుకుంటున్నాడేమో  అయ్యవారు!!’ పక్కనున్నతను మళ్ళీ మరో విసురు విసిరాడు. 

‘అదంతా ఎందుకులే గానీ ..ఇదో ఆచార్లూ.. విద్వాన్ పరీక్షాఫలితాలొచ్చినాయని ఎవరో అన్నారయ్యా నిన్న!! నీవూ రాసినావుగదా?? మరి ఆ రిజల్టు తెలుసుకోవద్దూ నువ్వు??’ కొప్పరపు సుబ్బయ్యగారందుకున్నారు.

  అప్పుడు తట్టింది, పుట్టపర్తికి, ఔను కదా, తన ఫలితమేమైందో, తెలుసుకోవాలని!! పైగా అది పాసైతేనే, ఉద్యోగ జీవితంలో మరో మెట్టు పైకెక్కే వీలు కల్పిస్తానన్నారుకదా కొప్పరపు వారు!!

  ‘ఔను సుబ్బయ్యగారూ, తిరుపతికి పోయి తెలుసుకుని రావల్సిందే !! రేపు పోయి వస్తాను. సెలవు..’ అని నమస్కరించి, ఇంటికి వచ్చి పడ్డారు పుట్టపర్తి.

  ఇంట్లో అర్ధాంగి కనకవల్లి బొగ్గుల కుంపటిముందు కూర్చుని మటిక్కాయలకూర (గోరుచిక్కుడును మటిక్కాయలు అంటారు రాయలసీమలో) చేస్తూంది.

  ‘వంటైందా??’ పుట్టపర్తి ప్రశ్న.

  భయపడుతూ చెప్పింది కనకవల్లి,’అన్నమయింది..ఇదుగో కూరవుతూ ఉంది..’

  ‘ఆ..సరే! పిల్లలెవరైనా వచ్చి నారా   పాఠం కోసం?’

  భర్త తదుపరి ప్రశ్న ఊహించిందా ఇల్లాలు.”ఆ..వాళ్ళకు పాఠం చెప్తూ కూర్చుంటేనే ఆలస్యమైంది.’

  ”ఆ..నువ్వు యీ మటిక్కాయల కూరే ఎన్ని రోజులు పెట్టినా సరే కానీ, పిల్లలకు పునశ్చరణా, నీ కాళిదాసు పాఠం ఒప్పజెప్పడం  మర్చిపోతే మాత్రం ఊరుకోను..’ ఇదీ పుట్టపర్తి సమాధానం.

 ఈ మాటంటూనే మరో మాటన్నారు,’విద్వాన్ రిజల్టు వచ్చిందంట కొప్పరపు సుబ్బయ్యగారన్నారు – ఇప్పుడే పేటలో కనబడి! రేపు తిరుపతికి పోయి రావాల మరి!!’

   విద్వాన్ పరీక్ష ఫలితాలొచ్చాయని భర్త చెప్పగానే, ఎంతో ఆనందమైంది, ఆ లేతబుగ్గల ఇల్లాలికి!! హమ్మయ్య, విద్వాన్ పరీక్ష పాసైపోతే, భర్తకు, ఉద్యోగంలో మరో మెట్టు ఎక్కే అవకాశం వస్తుంది. జీవితం గాట్లో పడుతుందని సంబరం వేసింది కూడా!! తనకసలు పాఠశాల చదువు గుర్తే లేదు. ఎప్పుడూ తాతగారు ధన్నవాడ కిడాంబి రాఘవాచార్యులవారి ఒళ్ళో కూర్చుని సంస్కృత శ్లోకాలు వల్లెవేయటమే జ్ఞాపకం!!

   ఈ ఆలోచనల్లోనే ఆమె వంట ముగించటం, పుట్టపర్తి సాపాటు (మా ఇంట్లో  భోజనాన్ని సాపాటు అనటం అలవాటు) కూడ ఐపోవటమైంది.కనకవల్లి తళిహిల్లు (వంటిల్లు) సర్దుకుంటూఉండగా, పుట్టపర్తి, రేపు పొద్దున్న మొదటి బస్సుకే తిరుపతికి పోవాలన్న ఆలోచనల్లో మునిగిపోయారు- ఎవరి ఊహల్లో వారు!!

(సశేషం)

****

ఫోటో: పుట్టపర్తి శిరోమణి చదివిన తిరుపతి ఓరియెంటల్ కళాశాల  – శ్రీ బడిమెల వేణుగోపాల్ (తిరుపతి) సౌజన్యంతో –

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.