అతడు

పద్మావతి రాంభక్త

 కొందరంతే అందమైన అట్టున్న పుస్తకాలను కొత్తమోజుతో కాలక్షేపానికి కాసేపు తిరగేసి బోరు కొట్టగానే

అవతల విసివేస్తారు.ఇతడూ అంతే.అయినా నేను అతడిలా ఎందుకు ఉండలేక పోతున్నాను.అతడు నా పక్కన ఉంటే చాలనిపిస్తుంటుంది.అతడి సమక్షంలో ఉంటే చాలు, నా మనసంతా వెన్నెల కురుస్తుంది.ఒక సుతిమెత్తని పరిమళమేదో చుట్టుముడుతుంది.ఆలోచనలలో పడి సమయమే  తెలియట్లేదు.బండి చప్పుడైంది.

గడియారం వైపు చూస్తే అర్ధరాత్రి పన్నెండు కొడుతోంది.

              ఊగుతూ తూగుతూ అతడు ఇంట్లోకి వచ్చాడు.ఇప్పుడిక ఇదివరలోలా గోల చెయ్యడం మానేసాను.

నెమ్మదిగా అలవాటు పడిపోయానో,అతడే అలవాటు చేసాడో మరి.అలాగే బూట్లు విప్పకుండా మంచంపైన పడి నిద్రపోయాడు.నేను బూట్లు విప్పి నిశ్శబ్దంగా దుప్పటి కప్పి అతడి పక్కన పడుకున్నాను.

       పొద్దున్న లేచి చూసేసరికి పక్కన లేడు.కాఫీ కప్పుతో బాల్కనీలోకి వెళ్ళేసరికి ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు.నన్ను చూడగానే ముఖం చిట్లించి అక్కడ పెట్టి వెళ్ళమని సైగ చేసాడు.అంతకు ముందు వరకు  దీపంలా వెలిగిన ముఖం చూస్తే నాకు అర్ధమైంది, అవతల ఎవరో.పాతస్మృతులు కళ్ళ ముందు ఒకమారు మెదిలాయి.

          నాకు మెలకువ రాగానే దాని కోసమే నిరీక్షిస్తున్నట్టుమృదూ గుడ్మాణింగ్అంటూ నుదుటి మీద ముద్దు పెట్టి,వేడి వేడి కాఫీ కప్పుతో ప్రత్యక్షమయేవాడు.”అయ్యో నేను పెడతాను కదా కాఫీఅని నేనంటే,”దేవత ఇప్పుడే కలలలోకంలోని స్వర్గం నుండి దిగివచ్చింది,భూమి మీద కాలు పెట్టడానికి అలవాటు పడద్దూఅని చిలిపిగా అంటుంటే నా అంత అదృష్టవంతురాలు లేదంటూ మురిసి పోయేదాన్ని.ఎన్ని అనుభవాలు మరెన్ని అనుభూతులు.అన్నీ పాత ఆల్బమ్ లాగా తిరగేయడానికే తప్ప సజీవంగా ఇంక ఎప్పుడూ నడిచిరావా?

            కాలేజ్ లో మృదుల అంటే అందరికీ ఎంత క్రేజ్,నాకు మాత్రం అతడే ప్రపంచం.ఎంతమంది ఎన్ని విధాల చెప్పి చూసారో,కానీ నేను వింటేనా.అతడి గొంతు మొదటిసారి కాలేజీ ఫంక్షన్ లో వినగానే నాగస్వరం విన్న నాగుపాములా అయిపోయింది మనసు.ఎంత బాగా పాడాడు.ఇప్పటికీ పాట నా చెవులలో మారుమోగుతూనే ఉంది.”ఆకాశదేశానా ఆషాఢమాసానా…….విరహమో దాహమో విడలేని మోహమో”.నాకు అత్యంత ఇష్టమైన పాట.నాకు అతడి పట్ల అటువంటి ఫీలింగే ఉన్నట్టుంది.ఇక తరువాత మది అతడి గురించిన

 ఊహలలోనే ఉయ్యాలలూగింది.

          అతడి వెనకే తిరిగి తిరిగి అతడిని గెలుచుకునే వరకూ నిద్రపోలేదు.నన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన అశ్విన్ కూడామృదులా నువ్వు అతడికి సొంతం అయిపోతున్నావన్న జెలసీతో చెప్పట్లేదు,మరోమారు ఆలోచించి నిర్ణయం తీసుకోఅన్నాడు.అతడి మనస్తత్వం అందరికీ తెలుసు,తనకి మాత్రం తెలీదా.నాకు అతడొక అడిక్షన్ అంతే.అయినా ఇప్పుడు మాత్రం ఏమైంది ?

ప్రేమంటే ఇవ్వడమే కానీ తీసుకోవడం కాదుగా,అతడంటే నాకు వల్లమాలిన ప్రేమ కాబట్టి నేను ఇస్తూనే ఉంటాను.ప్రేమకు డెఫినిషన్ ఇదేనేమో లేక ఇలా అనుకుని నాకు నేను  నచ్చజెప్పుకుంటున్నానా, ఏమో మరి?

        పోయిన నెల అమ్మ వచ్చినపుడు మళ్ళీ పిల్లల ప్రస్తావన తెచ్చింది.నిజమే నా ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి ఎవరో ఒకరు ఉండద్దూ,నేనూ అతడూ కలిసి ఒక అందమైన బొమ్మను తయారు చేస్తాం. బొమ్మతో ఆడుకోవడంలో నాకు టైమ్ అసలు తెలీదు. ఊహే ఎంత అద్భుతంగా ఉంది.అతడి రూపంతో నా పొట్టలో ఒక పసిప్రాణం నెమ్మదిగా రూపుదిద్దుకుంటూ,ఒక అమృత ఘడియలో హరివిల్లులా

నా చేతిలో వాలడం,సాయంకాలమవగానే నా నడుము చుట్టూ అతడి చేయి,నా భుజంపై పువ్వులా

ఒక పసిపాప,ముగ్గురం పార్కులో అలా షికారుకెళ్ళడంఇవేవీ గొంతెమ్మ కోరికలు కావే.

          మొదటిసారి నెలతప్పడం కళ్ళ ముందు మెదిలింది. ఇంట్లో కిట్ సహాయంతో చెక్ చేసుకుని

డాక్టర్ దగ్గరకు వెళ్ళి కన్ఫర్మ్ చేసుకున్నాక,ఎప్పుడెప్పుడు అతడొస్తాడా.. త్వరగా చెప్పేద్దామా అని

కాచుకుని కూర్చున్నాను.అతడు వచ్చాడు, చెప్పగానే అతడి ముఖం ముడుచుకుపోవడం గుర్తొచ్చినపుడల్లా

 ఇప్పటికీ లోపలేదో భళ్ళున పగిలినట్టే అనిపిస్తుంది.బాల్కనీలో మొక్క మొగ్గ తొడిగినపుడల్లా అది పువ్వై విచ్చుకునే వరకూ అస్తమానూ దానినే చూసుకుంటూ కూర్చుంటాను.బహూశా నేను పోగొట్టుకున్నది అక్కడ వెదుక్కుంటున్నానేమో.

      అప్పుడే అతడితో నడవడం మొదలుపెట్టి అయిదేళ్ళు గడచిపోయాయి.డబ్బులు కావాలంటే మాత్రం నా పక్కన కాసేపు టీవీ చూస్తూ కూర్చుంటాడు.అలా కూర్చున్న ప్రతీసారీ మనసు ఏదో ఆశ పడుతుంది,కానీ నిరాశే 

చివరకు  మిగులుతుంది. మధ్య బ్రతుకు మరీ నిస్సారంగా ఊపిరాడనట్టుంటోంది.

         అతడు చిన్నా చితకా సినిమాలలో పాటలు పాడతాడు. ఛాన్సూ దొరకనప్పుడు ఎవరెవరితోనో తిరుగుతూ నాలుగైదు రోజులు ఇంటికి రాడు.నేను ఫోన్ చేస్తేఅవును మరో రెండు రోజులుఅంటాడు.ఏవేవో కొత్త పరిచయాలు,పార్టీలుఎప్పుడూ బిజీనే,నేను మాత్రం ఖాళీగా ఉన్నానా?నచ్చినా నచ్చకపోయినా కాలేజ్ కెళ్ళి పాఠాలు చెప్పడం,ఏదో ఇంత వండుకుతినడం,అంతే.

         ఎవరితోనైనా మాట్లాడితే చాలు,వాళ్ళు అతడిని వదిలేయమంటూ హితబోధలూ,నా జీవితంలోకి తొంగి చూసి మొత్తం తెలిసేసుకుని ఊరంతా చాటింపు వేసి ఆనందపడాలని పాపం వాళ్ళ ఆరాటం.అందుకే  ముభావంగా మారిపోయి అందరికీ అన్నిటికీ ఇలా దూరంగా ఒంటరిగా నాలోకి నేను నడచిపోతూ, ఎక్కడికో 

ఎప్పటివరకో నాకు మాత్రం ఏం తెలుసు.అమ్మ వచ్చినపుడల్లా నా కళ్ళ కింద నల్లని వలయాలు చూసి కన్నీళ్ళు

        అశ్విన్ కి మాత్రం నాలోని కల్లోలాలన్నీ తెలుసు.అవును అతడెందుకు పెళ్ళి చేసుకోలేదో,నా కోసమేనా..నన్ను ప్రేమించడం వల్లేనాఏమో మరి.నేను ఎప్పుడూ అడిగే సాహసం చెయ్యలేదు.

ఇదేదో సినిమాలలోలాగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఏమో.ఎప్పుడైనా మరీ ఎమ్టీనెస్ తో ఉన్నట్టు అనిపిస్తే

అశ్విన్ తో ఫోన్ లో మాట్లాడుతానంతే.ఇంటికొస్తానంటే మాత్రం అలౌ చెయ్యను.ఒకసారి పెళ్ళైన కొత్తలో

అశ్విన్ వచ్చినపుడు తన  ముందర అంతా బాగానే మాట్లాడి,తను వెళ్ళాక. “మృదూ ఇలాంటి వాళ్ళని ఎంటర్ టైన్ చెయ్యకుఅన్నాడు.”జలసీనా నీకుఅంటూ మురిపెంగా అతడిని హత్తుకుపోగానేఅలాగే అనుకోఅన్నప్పుడు నేనెంత మురిసిపోయానో.ప్రేమలో పొజెసివ్ నెస్ ఉంటే ఇంకా బలమైనబంధమది అని అప్పుడనుకున్నాను.ఇప్పుడు అదంతా తల్చుకుంటే విరక్తితో కూడిన నవ్వొకటి పెదవులపై మెరిసింది.

          అసలు అతడికీ నాకూ దూరమెప్పుడు ఎలా పెరిగిందో, నాకు తెలీకుండానే అలా అలా అంతా అయిపోయింది.నేనెప్పుడూ అతడిని నెగ్లెక్ట్ చెయ్యలేదు.నా ప్రపంచమంతా అతడే నిండిపోయి ఉన్నాడు.కానీ మొదటి నుండి నేను అతడి ప్రపంచంలో ఒక చిన్న భాగం మాత్రమే.అతడు పెళ్ళికి ముందు నుండే చాలా స్పష్టంగా ఉన్నాడు.నేనే అతడి మాయలో మత్తులో మునకలేస్తూ దేన్నీ ఎవరినీ ఖాతరు చెయ్యలేదు.ఒకోసారి అనిపిస్తుంది,నాకు అతడు అసలు కనపడకపోతే ఎంత బాగుండివుండేదో,అప్పుడు జీవితం వేరేలా ఉండుండేది.కానీ అలా జరగాలని ఉందంతేనేమో.ఏమీ చెయ్యలేనపుడు ఇలా వేదాంతమే వస్తుంది.

        టీపాయ్ మీద అతడి ఫోటో చేతిలోకి తీసుకుని చూస్తుంటే ,అబ్బా ఎంత స్వచ్ఛంగా నవ్వుతున్నాడుమల్లెలవాన కురిసినట్టు. నవ్వుకే కదా,నేను ఫిదా అయిపోయింది. ఫోటోను అలా గుండెలకు హత్తుకుని అతడిని కౌగిలించుకున్నట్టు అనుకుని ఎన్నిమార్లు నిద్రపోయానో. నా పక్కన పడుక్కోడానికి కూడా అతడికి ఇష్టం లేదెందుకో.కనీసం అతడు గాఢనిదురలో ఉన్నప్పుడైనా దగ్గరగా చూస్తూ, నుదుటిపై వాలిన జుట్టుని సర్దాలని నాకు ఎంతలా అనిపిస్తుందో.తన గదిలో లాక్ చేసుకుని మరీ పడుకునేవాడు.ఇక ఇప్పుడు తూలుతూ వచ్చి పడుకున్నాక, వాసనకి అతడి దగ్గరకెళ్ళగానే నాకు వాంతయిపోతుంది.ఒక ఏడాదిలోనే నేను బోరు కొట్టేసానా,కాదు కాదు అతడు నిత్యం కొత్త కొత్త పువ్వులను వెతుక్కునే తేనెటీగ.అతడికి అందమైన రంగులూ రుచులూ కావాలంతే.

                    ఈసారి అతడెళ్ళి పదిహేను రోజులైంది.ఫోన్ కలవట్లేదు,ఎవరిని అడగాలో కూడా తెలియట్లేదు.

అశ్విన్ కు ఫోన్ చేసి చెప్పానునేను కనుక్కుంటాలేఅన్నాడు.ఏంటో చాలా గాభరాగా ఉంది.ఎక్కడికి వెళ్ళాడు,ఇక

 రాడా?రాకపోతే నేనేం చెయ్యాలి.అబ్బా ఆలోచనలతో బుర్ర వేడెక్కిపోతోంది.

వేడి వేడిగా టీ తాగాలిప్పుడు.వంటింట్లోకి వెళ్ళి స్టౌ వెలిగించాను  పరధ్యానంగా,ఏదో మంటగా అనిపించి చూస్తే చీర అంటుకుపోతోంది.గబగబా సింక్ లో నీళ్ళతో ఆర్పేసాను.ఏంటో ఇదేదో బాడ్ ఓమెన్ లా ఉందే అనుకున్నాను.నా జీవితంలో చెడు జరగడానికైనా ఏముందిక.

          టీ తెచ్చుకుని బాల్కనీలో కూర్చోగానే అశ్విన్ ఫోన్ఇంట్లోనే ఉన్నావాఅంటూ

నేనెక్కడికెడతాను,నాకు ఎవరున్నారు కనుక,ఎక్కడికైనా వెళ్ళడానికి నాకు  ఎవరూ లేరు అనేకన్నా, నేనే అందరినీ దూరంగా నెట్టేసానేమో అనడం కరెక్టేమో.కాసేపటికి డోర్ బెల్ మోగింది.తీయగానే అశ్విన్ లోపలకొచ్చి నన్ను కూర్చోమని నా భుజం మీద చెయ్యేసాడు.అంతకు మునుపు ఎప్పుడూ అతడు నన్ను తాకలేదు.

అయోమయంగా చూస్తుండగానే నెమ్మదిగా నా ముఖంలోకే తదేకంగా చూస్తూ,

నా అరచేతిని  తన అరచేతుల మధ్యన మెత్తగా నొక్కుతూ అసలు విషయం చెప్పాడు.నాకు అసలంతా,అతడు చెప్పేదంతా అర్ధమయీ కానట్టుంది.ఇక తను ఎంతగా పిలుస్తున్నా వినిపించుకోకుండా ఇంట్లోంచి బయటకు పరుగెత్తాను.అక్కడ రోడ్డు మీద ఫ్రీజర్ బాక్స్ లోఅతడు” ,నా ప్రాణానికి ప్రాణం నిద్రపోతున్నట్టే ఉన్నాడు.కానీ నుదుటికి తెల్లగా కట్టు కట్టి  ఉంది.”పాపం ఆక్సిడెంట్, మధ్య బాగా తాగుడెక్కువైంది.మహాతల్లి ఎలా భరించిందో,దండం పెట్టాలి” “ఇలాంటి వాడు ఉంటే ఎంత….లేకపోతే….” ఇక వినలేకపోతున్నాను.గాజుపెట్టెలోని  అతడిని చూస్తూ నోట మాట లేకుండా నేను….నేనునేను.అదిగో అతడు వెళ్ళిపోతున్నాడుఅతడి చేతిలో చెయ్యి వేసి నేను కూడామరో అందమైన లోకంలో,అక్కడ ఎవరూ లేరుజస్ట్ మేమిద్దరమే అంతే….

ఎంతో ప్రేమగా ఆప్యాయంగా అతడు నన్ను తన గుండెల్లో పొదువుకుంటున్నాడుఅక్కడంతా చిక్కని చక్కని  పూలవనాలూ రంగురంగుల సీతాకోకచిలుకలూ  సెలయేళ్ళూ జలపాతాలూ ..స్వచ్ఛమైన ప్రేమాఅన్నిటి నడుమ మేమిద్దరమే అక్కడఏకాంతంగా

 

****

Please follow and like us:

5 thoughts on “అతడు (కథ)”

 1. పద్మావతి గారు
  అతడు చాలా చాలా బాగుంది అభినందనలు 💐
  సుభాషిణి ప్రత్తిపాటి

  1. కథ చదివి స్పందించినందుకు, అభినందించినందుకు ధన్యవాదాలు సుభాషిణిగారు

 2. నా కథకు “నెచ్చెలి”లో చోటు కల్పించినందుకు ధన్యవాదాలు గీతాజీ

  1. థాంక్స్ పద్మావతి గారూ! మంచి కథలకు “నెచ్చెలి”లో ఎప్పుడూ చోటు ఉంటుంది. “నెచ్చెలి” కోసమే ప్రత్యేకంగా మరిన్ని కథలు తప్పకుండా రాయండి.

   1. ధాంక్యూ గీతగారూ…తప్పకుండా రాసి పంపుతాను

Leave a Reply

Your email address will not be published.