తొలకరిజల్లుతో చెరువు

-సుగుణ మద్దిరెడ్డి

పాడి పశువులకు

గడ్డి మేత లందించు

పచ్చని పచ్చిక బీళ్లు! 

చెరువులో చెట్ల మధ్యన ఆడిన

 దాగుడు మూతలజోరు!

పేడ ముద్దలు ఏరి

సేకరించిన పిడకలకుప్పలెన్నో!

ఎంత గిల్లినా తరగని

పొనగంటాకు దిబ్బ లెన్నో! 

చెరువునిండాక

నీటి కోళ్ల  తల మునకలు

రెక్కలు ఇదిలించే నీటి తుంపరలు

నీటి పాముల

 సొగసైన ఈతలు!

చెరువుగట్టు అడుగున

ఎండ్రకాయ బొక్కలుజూసి

వాటిలో పుల్లలతో కలబెట్టి

అవి బొక్కనుంచి బయటకొస్తే

ఆనంద డోలికలూగినవేళ!

ఆవులు, ఎనుములను

చెరవునీళ్లతో కడిగి

తోక లాగినరోజులెన్నో! 

బట్టలు ఉతికి, బండపై ఆరేసి

మూటగట్టి, వీపుపై వేసికొని

వయ్యారపు నడకల

మంగత్తా మరువలేను

నిన్నీజన్మలో! 

గోగు కట్టలు నానేసి

వెండి నార వెలికి దీసి

ఎంగ మావ పాడిన పాటలెన్నో! 

గట్టున కాసే బోలెడు

బొక్కిన కాయలు

ఊగిసలాడే

ఉమ్మెత పూవులు! 

కొంగల గుంపుజూసి

పూలేయమని మేము

పాడిన కొంగ పాటలు!

‘”రంగున్ చేత రాళ్లు

మా చేతికి పూలు'” 

తూముపై

జారాడే చక్కని చోటు

 పావడా రవికతో

వాననీటిలో 

జలకాలాట!

చెరువు నీటిలో విసిరే

గులకరాళ్లు

ఆ కమనీయ నీటి వలయాలు 

జూసి పులకరించిన  తనువు!

ఇంటింటా వంట చెరకు

రబ్బరు కట్టెల

బరువులేని మోపు! 

కప్పల బెకబెక శబ్దపు  కొలువు

వాటినీటిలో విన్యాసాలేన్నో!

చేపలు  నిండిన చక్కనిచెరువు

ఉల్సలు, పక్కిలు, జల్లలు

కోరలు తిప్పే కొరమేన్లెన్నో

చూడలేనేమో  ఆ సంపద  మళ్లీ! 

చేపలు బట్టి బండకి చేర్చి

బూడిద పూసి మెండుగ రుద్ది

మట్టికుండలో చేప కూర జేసి

కడుపునిండా  ఆరగించిన

అరుదైన ఆ రోజు

రాదేమో ఇక.! 

అల్లంత దూరాన గొర్రెల కాపరి

 సంకన  చిక్కంలో  దాగిన

రాగి ముద్ద

దానిపై పక్కిల చారు ముంత!

కనుమరుగైనది

కమనీయ ముంత కనిపించదాయె! 

తిరిగిరాని కాలమా!

తీసికెళ్లు బాల్యపు తీరానికి

కలలోనైనా కాసేపు

ఆ చెరువు గట్టుపైకి

*****

ఆర్ట్: మన్నెం శారద

Please follow and like us:

7 thoughts on “తొలకరిజల్లుతో చెరువు (కవిత)”

 1. తొలకరిజల్లు తో చెరువు”
  కవిత ను బాల్యపు స్మృతులను వెలుగులోకి తెచ్చి
  నా మదిని
  ఆనంద తొలకరిజల్లులతో నింపిన నెచ్చెలి సంపాదకులు
  డా’గీత మేడమ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు🙏.
  మీరిచ్చిన ఈ స్ఫూర్తి
  గగనతలంలో మెరిసే ధృవతార లా
  మరిన్ని సృజనాత్మక రచనలకు
  అంకురం కావాలని కోరుతూ
  మీ ప్రియ నెచ్చెలి
  సుగుణ మద్దిరెడ్డి 🌹

 2. థాంక్యూ సుగుణక్క.
  ఇలాంటి కవితలతో నీకు మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని ఆశిస్తూ
  మీ మిత్రుడు
  వెంకటాద్రి.

 3. థాంక్యూ సుగుణక్క.
  ఇంకా ఇలాంటి కవితలు రాసి మంచి పేరు తెచ్చుకుంటారు.తెచ్చుకుంటావుకూడా!

Leave a Reply

Your email address will not be published.