బహుళ-4

                                                                – జ్వలిత

కె.సరోజిని కథ “తీరని బాధ”

తెలంగాణాలో గ్రంధాలయోద్యమంతో మొదలైన “చదివించే” ఉద్యమం “ఆది హిందూ ఉద్యమం” ప్రోత్సాహంతో 1906 లో స్త్రీ విద్యకు పునాదులు పడ్డాయి. 1920 నాటికి స్త్రీల సమస్యలపై హైదరాబాదులో చర్చలు ఆరంభమై మహిళా వికాసానికి దారితీశాయి.

1934 లో వెలువడిన గోలకొండ కవుల సంచికలో తెలంగాణ మహిళలు పది మంది మాత్రమే ఉన్నారు. ప్రతిభ కలిగినప్పటికీ అనేక కారణాల వల్ల తెలంగాణ కథయిత్రులు తగిన గుర్తింపు పొందలేక పోయారు.

19వ , 20ల శతాబ్దాలలో ప్రఖ్యాతి పొందిన యూరోపియన్ రష్యన్ అమెరికన్ కథకులు తమ కథలను స్నాప్ షార్ట్ గా చిత్రించారు. కథలు రాసేప్పుడు కథకులు పొందిన అనుభూతిని, తమ కథలు చదివేప్పుడు పాఠకులు కూడా పొందాలని ప్రయత్నించారు. అటువంటి ప్రయత్నమే తొలితరం తెలంగాణ రచయిత్రి కె.సరోజినీ కూడా తాను రాసిన “తీరని బాధ” అనే కథలో చేశారు.

“బహుళ” శీర్షికన నేటి కథ “తీరనిబాధ”

ముందుగా కథయిత్రి గురించి- కె.సరోజిని బహుశా కరీంనగర్కు చెంది ఉండవచ్చని విమర్శకుల అభిప్రాయం. ఆమెకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. డాక్టర్ పంతంగి వెంకటేశ్వర్లు సంపాదకత్వంతో వెలువడిన తెలంగాణ తెలుగు కథ వ్యాస సంపుటిలో “తొలితరం తెలంగాణ మహిళా కథకులు” అనే వ్యాసంలో కె.సరోజిని ప్రస్తావన ఉన్నది. తెలంగాణ తొలితరం ఆరవ కథా రచయిత్రిగా కొద్ది మాత్రం పరిచయాన్ని డాక్టర్ త్రివేణి అందించారు. “తీరని బాధ” అనే కథ 1954లో “సారస్వత జ్యోతి” పత్రికలో ప్రచురించబడింది.

కథంతా ప్రధమ పురుషలో అంటే మూడో మనిషి ఒక సంఘటనను చూసి వివరించినట్లుగా ఉంటుంది. కథలో ఎక్కడా కథ చెబుతున్నది స్త్రీయా పురుషుడా అన్నది తెలియకుండా కథ నడిపించారు కథకురాలు. ఇది ఆమె రచనా చతురతకు నిదర్శనం.

కథ ప్రారంభంలో ఒకరు చూసినది చెప్పినట్టుగా మొదలుపెట్టినా, కథలో కొంత భాగం సంభాషణల వలె సాగుతుంది. డాక్టర్ రోగికి మధ్య సంభాషణ. ఆ తర్వాత అతని భార్య కరుణకు మధ్య సంభాషణ. కథ చివరి ఘట్టంలో కైలాస్ కు అతని భార్య స్నేహితురాలయిన సూర్యకుమారికి మధ్య సంభాషణ.

“తీరని బాధ” అనే కథ చాలా చిన్న కథ. అయినప్పటికీ చెప్పదలచిన విషయాన్ని కథయిత్రి కె.సరోజిని చాలా స్పష్టంగా చెప్పగలిగారు.

ఈ కథ 1954లో ప్రచురించబడింది అంటే కథాకాలం 1953 అంతకుముందు అయి ఉండవచ్చు. స్వాతంత్రం వచ్చిన కొత్తలో కుటుంబ సంబంధాలకు, నాటి సమాజానికి ఈ కథ అధ్దం పడుతుంది.

అయితే రచయిత్రి దాదాపు 70 సంవత్సరాల క్రితం రాసిన సంఘటనలు ఇంకా కొనసాగుతూ ఉండడం విచారకరం. కథలో వివరించినటువంటి హత్యలు, పితృస్వామ్య అహంకార పూరిత నేరాలు, స్త్రీలపై హింస ఎక్కువ రెట్లు పెరిగినట్టు మనం గమనిస్తూన్నాము. కథలో చెప్పినటువంటి సంఘటనలు దేశ వ్యాప్తంగా రోజుకు పదుల సంఖ్యలో జరుగుతున్నాయి.

అంటే సమాజంలో స్త్రీలను చూస్తున్న కోణం, పురుషుల ఆలోచన తీరు ఏ మాత్రం మారలేదు. పెరిగిన సాంకేతికత, నాగరికత, విద్య ఉద్యోగావకాశాలు స్త్రీలపై హింసను ఆపలేకపోయాయి. పైగా బాధ్యతలను పెంచి మరింత కష్టాలపాలు చేస్తున్నాయి.

తోడునీడగా ఉండవలసిన కుటుంబ సభ్యులు, తండ్రి, తాత, మేనమామలు, సోదరులు, భర్త కుమారులు ఎవరైనా, తమకు సంబంధించిన స్త్రీలపై అధికారం దాష్టికం హింస కొనసాగిస్తున్నారు. ఎంత చదువుకున్నా, సంపాదించినా, కష్టజీవులైనా, తెలివి కలిగినా స్త్రీలంటే వారి చెప్పుచేతల్లో ఉండవలసిందే. అటువంటి అభిప్రాయం పురుషుల మెదళ్ళలో పీఠం వేసి ఉన్నది. పనిచేసే స్థలాలలో, ప్రయాణాలలో తమకు సంబంధం లేని స్త్రీలపై కూడా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు పురుషులు. కొన్నిసార్లు పరువు పేరుతో మరికొన్నిసార్లు అనుమానంతో స్త్రీల హత్యలు సాగుతున్నాయి. ధరించిన బట్టలు, చేస్తున్న వృత్తి, సంచరిస్తున్న సమయం, ప్రదేశాలు స్త్రీలపై దాడులకు కారణాలుగా సమర్థించు కుంటున్నారు. చాలా సందర్భాలలో బాధిత స్త్రీలు నిందితులుగా వేధింపులకు శిక్షలకు గురవుతున్నారు. కొన్నిసార్లు ఈ వేధింపులు స్త్రీలు కూడా భాగస్వామ్యం వహిస్తారు.

ఇక కథలోకి వస్తే కథానాయకుడు కైలాస్. అందమైన అనుకూలవతి అయిన అతని భార్య కరుణ. కొత్తగా పెళ్లైన జంట.

రోజూ భర్త ఆఫీస్ నుండి వచ్చే సమయానికి అన్నీ సమకూర్చి, అతని ఆలోచనలకు అనుగుణంగా నడుచుకుంటుంది. ఒకరోజు కైలాస్ ఆఫీస్ నుండి వచ్చేసరికి కరుణ అలంకరించుకుని ఉండటం చూసి, కారణం అడుగుతాడు. శ్రావణ మంగళవారం పేరంటానికి తన స్నేహితురాలు విమల పిలిచింది వెళ్లాలి అంటుంది.

వెళ్ళు కానీ వచ్చేటప్పుడు చీకట్లో ఒంటరిగా రావద్దు. ఎవరినైనా తోడు తెచ్చుకోమని సలహా చెప్తాడు కైలాస్. కరుణ పేరంటానికి వెళ్ళిన తరువాత కైలాస్ కు దొరికిన ఒంటరితనం, కరుణ పాలిటీ మృత్యువుగా మారింది. గదిలో అద్దం ముందు ఉన్న తాళంచెవిని చూసి, దానితో బీరువాలో ఛందనపు చెక్కపెట్టెను తెరిచి చూస్తాడు. ఆ చెక్క డబ్బాలో కరుణ దాచుకున్న ఉత్తరాలను చదవగానే అతన్ని అనుమానం ఆవహిస్తుంది. క్రింద రాసిన సూర్యం అనే పేరు చూసి చూడగానే, అప్పటివరకు ప్రేమమయిగా ఉన్న భార్య ద్రోహి, భూతం, ఘాతకిగా అనిపిస్తుంది అతనికి. అతడు వివేకాన్ని కోల్పోతాడు. అప్పటివరకు కరుణ పట్ల ఉన్న కరుణ ప్రేమ మాయమై ద్వేషం అసహ్యం పెంచుకుంటాడు. కొన్ని గంటల సమయంలోనే ఆమెను అంతం చేయాలని నిర్ణయానికి వస్తాడు.

ఆమె తిరిగి వచ్చేవరకూ చీకట్లోనే ఉంటాడు ఆమె వచ్చి లైట్ వేసి భోజనానికి పిలిచిననా నిరాకరించి కఠినంగా సమాధానం ఇస్తాడు. విషయం తెలియని కరుణ విచారంతో నిద్రలోకి జారుకుంటుంది. అర్ధరాత్రి అమాయకంగా నిద్రిస్తున్న భార్యను గొంతు నులిమి చంపేస్తాడు. ఆమె చేతులెత్తి దండం పెడుతూ ఏదో చెప్పాలని ప్రయత్నించినా వినిపించు కోడు.

కరుణ మరణం తర్వాత ఆమె కర్మల రోజు, ఆమె మిత్రురాలు వచ్చి, తాను కరుణ పెళ్లికి రాలేకపోయాననీ, అంతకు ముందు కరుణకు బహుమతిగా ఇచ్చిన ఛందనపు చెక్క పెట్ఠె, తాను రాసిన ఉత్తరాలు ఇవ్వమనీ, కరుణ స్నేహానికి గుర్తుగా వాటిని తన వద్ద దాచుకుంటానని అడుగుతుంది.

ఆమె పేరు సూర్యకుమారి. స్నేహితులు ఆమెను సూర్యం అని పిలిచేవాళ్ళు. అప్పటికీ నిజం అర్థం చేసుకున్న కైలాస్ భార్యను చేజేతులా చంపుకున్నానని పశ్చాత్తాపంతో వెర్రిగా ప్రవర్తిస్తూ డాక్టర్ వద్దకు వస్తాడు.

జరిగిన కథ అంతా చెప్పి నేను కరుణ వద్దకు వెళ్లాలంటూ, టేబుల్ మీద నుంచి కిందకు దొర్లుతాడు. అతని నోటి నుండి రక్తం వస్తూ ఉంటుంది. అదంతా చూస్తూన్న తోటి రోగి వెళ్లిపోతారు. “తరువాత కైలాస్ ఏమయ్యాడో తెలియదు” అనే వాక్యంతో కథ ముగుస్తుంది.

అనుమాన పిశాచం నిండు జీవితాలెన్నింటినో బలి తీసుకుంటున్న తీరును ఒక సంఘటనతో కథయిత్రి చాలా సంక్షిప్తంగా, అవసరానికి మించి ఒక్క అక్షరం కూడా రాయకుండా చెప్పగలిగారు.

కథ రాసే లక్షణాలలో ముఖ్యమైనది సంక్షిప్తత.

*********

కథయిత్రి గురించి- కె.సరోజిని బహుశా కరీంనగర్కు చెంది ఉండవచ్చని విమర్శకుల అభిప్రాయం. ఆమెకు సంబంధించిన సమాచారం అందుబాటులో లేదు. డాక్టర్ పంతంగి వెంకటేశ్వర్లు సంపాదకత్వంతో వెలువడిన తెలంగాణ తెలుగు కథ వ్యాస సంపుటిలో “తొలితరం తెలంగాణ మహిళా కథకులు” అనే వ్యాసంలో కె.సరోజిని ప్రస్తావన ఉన్నది. తెలంగాణ తొలితరం ఆరవ కథా రచయిత్రిగా కొద్ది మాత్రం పరిచయాన్ని డాక్టర్ త్రివేణి అందించారు. “తీరని బాధ” అనే కథ 1954లో “సారస్వత జ్యోతి” అనే పత్రికలో ప్రచురించబడింది. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.