పునాది రాళ్లు-15

-డా|| గోగు శ్యామల 

మేటి కళాకారిణి  చిందు ఎల్లమ్మ

కళా రూపాల్లో కులం జెండర్ రాజకీయాల పాత్ర 


ఇప్పటి వరకు మనం తెలుగు జనుల మనసును చూరగొని  ఆ తదుపరి  బాధితులైన మహా నటినే చూసాం. ఇప్పుడు మనం అదే తెలుగు జనుల మనుసును చూరగొని గెలిచి నిలిచిన మేటి  మహా కళాకారిణిని చూడాల్సి ఉంది. ఆమెనే  చిందు ఎల్లమ్మ.  చిందు యక్షగాన  కళారూపాన్ని, చిందు మేళాన్ని సబ్బండ పని పాటొల్ల చరిత్రలోని  కథలని  మోసుకొని  ఇప్పటికీ ఎప్పటికీ మన జ్ఞాప కాళ్ళోకి చొచ్చుకొని వస్తుందీమె. ఏ విధంగా నంటే  వందల సంవత్సరాల నాటి నుండి చిందుకళా రూపం ఎల్లమ్మతో సహా చిందు కమ్మూనిటీ  ప్రజల యొక్క జీవన విధానంగా కొనసాగుతూ వస్తుంది. అంతేకాదు అనేక కళారూపాలు ఆమె బాల్యంలో మరియు ఆమె కుటుంబమంతా ఒక భాగమై  నడిచిన తీరును ఆమె నోటి వెంట విందాం. నిజామాబాద్ జిల్లాలో   “పిల్లెట్లోళ్ల  కుటుంబంలో ముపై ఐదు మంది సభ్యులు ఉన్నారు. అందులో మేము పద్దెనిమిది మంది పిల్లలం ఉండేవాళ్ళం.  మా తాతా ముత్తాత  నుండి  చిందు యక్షగానాన్ని మా తల్లిదండ్రులు ఆడడం,  ప్రదర్శించడం చూశాము.  మా తల్లి తండ్రులు  ఆటా, పాట, రాగం, రిథమ్లతో మాకు గంటల తరబడి కఠినమైన శిక్షణను ఇచ్చేవారు. ఎందుకంటే నాటకంలో చాలా పాత్రలు ఉంటాయి కనుక వాటికి తగ్గా మేం  నైపుణ్యం సాధించాల్సి వచ్చేది.”  అని  వివరించడం చూస్తాం. ఐతే గమనించాల్సిందేమంటే  ఆమె కుటుంబంలోని సభ్యులందరూ కళాకారులే.  ప్రతి ఒక్కరు బహు   ప్రత్యేక నైపుణ్యాలను కలిగి ఉంటారు.   డ్రమ్, తబలా, హార్మోనియం, నేపథ్య గానం మరియు వేష భూషణాలను స్వతఃహగా తాయారు చేయడం, ధరించడం లో వారి  వారి పాత్రలను నిర్వహిస్తారు. ఇది ఒక కళారూపం కాబట్టి, ప్రతి ఒక్కరూ చరణాలు, కథలు, పాటలు, సంభాషణలు మరియు కవితలను చదవగల మరియు వ్రాయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాల్సి వస్తుంది. కళా  వృత్తిలో మనుగడ కోసం చిందోళ్లలో   ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలలకు పంపించాల్సి వచ్చేది.  అయిన కాని ఆ రోజుల్లో వారికి తగిన విద్య లభించలేదు. కారణం  మొత్తం కుటుంబం గ్రామం నుండి గ్రామానికి ప్రయాణించే  సంచార జీవనశైలి కనుక.  చిందు  కమ్మునిటీ షెడ్యూల్డ్ తరగతుల్లో ఒకటిగా ఉన్నప్పటికీ పాఠశాల విద్యను, రిజర్వేషన్లు ఉపయోగించుకోలేక పోయారు. కాని  కులం వివక్షని, అంటరానితనాన్ని అనుభవించారు .నేటికీ అనుభవిస్తున్నారు.   ఎల్లమ్మ కూడా పాఠశాలలో చేరినప్పటికిని  చాలా మంది చిందు  పిల్లలలాగే  బడి చదువును అందుకోలేక పోయింది. చిందు సమాజం యొక్క స్థితిని ఇంకొంత వివరంగా చూస్తే ఇతర కమ్మూనిటీలైన మాదిగ  మాలాలు   రిజర్వేషన్లను ఉపయోగించుకొన్నంతగా  చిందులకు అందలేదని చెప్పాలి.  నిరక్షరాస్యత మరియు బానిసత్వాన్ని అనుభవిస్తున్న మాదిగ మాలా  వెలి వాడల మరియూ పనిపాట సబ్బండ జాతుల యొక్క పుట్టు పురాణాలను, వంశ చరితలను చెపుతూ  చిందోళ్లు   జీవనం కొనసాగిస్తారు.  చిందు ఎల్లమ్మ తాను  బడిలో చేరిన  రోజుల్లో అంటరానితనం  గురించి అనుభవాన్ని తన మాటల్లో  “పంతులు మమ్ములను ముట్టుకోవద్దని ధూరం పెట్టిండు సదువనీయలేడు”(ఈ ఉపాధ్యాయుడు  మమ్మల్ని తాకకూడదని భావించినప్పటికీ , మమ్మల్ని చదువుకు  అనుమతించినప్పుడల్లా, మా క్లాస్‌మేట్స్ నుండి మమ్మల్ని దూరంగా ఉంచారు). ఐతే చిందువారి  వృత్తి  కళా ప్రదర్శన  కోసం ఊరూరు  పర్యటించడం ఒక రకంగా సంచార జీవితమే.  కనుక  చిందు ఎల్లమ్మ  తల్లిదండ్రులు ఆమె చదువు గురించి పట్టించుకోలేదని విశ్లేషకుల అభిప్రాయం.  ఐతే, ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్ళే సంచార జీవితానికి  ఆధునిక కాలంలో ఆదరణ  కరువైన స్తితి ఒక పక్క  పురాతన కళారూపమైన చిందు భాగోత  ప్రదర్శనలివ్వడం మరోపక్క కారణంగా చదువు కోసం పాఠశాలకు వెళ్ళడం సాధ్యం కాకపోవడం  వారి పిల్లలకు  శాపంగా మారిందనే చెప్పాలి. ఫలితంగా వారిలో అక్షరాస్యత రేటు పది శాతం కంటే తక్కువగా ఉంది. ఇంక  ఆడవారిలో చదువు  దాదాపుగా లేదనే చెప్పాలి. ఇంకా వారి నివాస గృహాల, ఉద్యోగ ఉపాధుల, ఆరోగ్య వసతులను గురించిన అద్వాన్నపరిస్థితిని గురించి వేరే చెప్పాల్సిన పని లేకుండానే అర్ధం చేసుకోవచ్చును.  ఈమె చదువు విషయానికొస్తే , కుటుంబమంతా  అర్ధ  సంచార జీవితం గడుపుతున్నపుడు  తన  చదువు కోసం కంటే నాటకాలు చూడటానికే ఎల్లమ్మ ఎక్కువ  ఆసక్తి చూపించారు. ఆమె మాటల్లోనే  “నా మనసు  ఎప్పుడూ ప్రదర్శనలోనే  ఉండేది. నేను వాటిని చూడటానికి  పరుగెత్తేదాన్ని. నా చెల్లెలు మాత్రం  ఇంట్లో అన్ని పనులు చేసింది. ”అని వివరిస్తారు.
కళారూపం కారణంగా  పనిబాట సబ్బండ సమాజంలో, ముఖ్యంగా చిందు కమ్మూనిటీలో ఎల్లమ్మ కుటుంబం ఎంతో గౌరవించబడింది. నాటి సమాజంలోని ఇతరుల మాదిరిగానే ఎల్లమ్మకు  చిన్నతనంలోనే వివాహం జ రిగినప్పటికి ఆమె కుటుంబం చిందు కళారూపాన్ని ప్రదర్శించడానికి  ఆట పాట  రిధం నేర్చుకోవాలని ఆమెను ప్రోత్సహించింది. ఆ తదుపరి ఆమె తనను తాను కళారూపానికి అంకితం చేసింది. ఆమె తండ్రి పిల్లెట్లనబిసాబ్ మరియు తల్లి యెల్లమ్మ  పదిహేనేళ్ళ వయసులో సైదులు అనే యువకుడితో  వివాహం జరిపించారు. అప్పటికె ఎల్లమ్మ ప్రదర్శనకారురాలిగా  ప్రసిద్ధి చెందారు. కాబట్టి, ఆమె తండ్రి నబీసాబ్ ఆమెకు  వివాహం జరిపించడానికి కొంత వరకు  సంశయించారు. అయినప్పటికీ, నబీసాబ్ ఇంటి అల్లుడిగా (ఇల్లరికం) నివసించడానికి సైదులు అంగీకరించాడు. ఇక తరువాత నబీసాబ్ తిరస్కరించలేదు. చిందు యక్షగానం మరియు కార్యకలాపాలలో నిండా మునిగిపోయిన ఎల్లమ్మ, కొన్ని రోజుల తరువాత,  తన చెల్లెలు రామవ్వను తన భర్త  సైదులును వివాహం చేసుకోమని కోరింది. అతన్నిదాదాపు  విడిచిపెట్టి, అంటే తన దాంపత్య జీవితానికి స్వస్తి చెప్పి చిందు కళారూపానికె  తన జీవితాన్నిపూర్తిగా అంకితం చేయడం ఆమె జీవితంలో మరపురాని సంఘటనలలో ఒకటి అని  ఇక్కడ చెప్పొచ్చు. ఈ అంశాన్ని ఉద్దేశించి ఆచార్య తంగేడు  కిషన్ రావు ‘ ఎల్లమ్మ నిబద్ధత మరియు అంకితభావంను ఎంతో ప్రశంసించాల్సిఉంది ’ అని చెప్పారు. ఆ విధంగా చిందు బాగోతంను తన జీవితంలో మమేకం చేసుకున్నరు.    90 సంవత్సరాలకు పైగా తన జీవిత కాలం  అద్భుతమైన కళారూపాలతో  జీవించారు. ఈ రకంగా చిందు కళారూపంలో భాగాంగానే ఎల్లమ్మ తన  జీవితాన్ని తీర్చిదిద్దుకుందని  చెప్పాలి. 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.