అమెరికా తెలుగు కథలు  – స్థానిక సమస్యలు

-డా||కె.గీత

(మధురై కామరాజ్ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ వెబినార్ “తెలుగుకథ- వస్తు రూప వైవిధ్యం” లో డా|| కె.గీత ప్రత్యేక ప్రసంగం)

ముందుగా నేను ఇవేళ ముఖ్యంగా తెలుగు సాహిత్య విద్యార్థులు కోసం నాలుగు మాటలు చెప్పాలనుకుంటున్నాను. 

మనకి సాహిత్య పఠనం అనేది దేనికి ఉపయోగపడాలి? అనేది ఆలోచించాలి మీరంతా. ఒక రచన చదివిన తరువాత మనకు మనమే కొన్ని  ప్రశ్నలు వేసుకోవాలి. సాహిత్య పఠనం కాలక్షేపం కోసమో, వినోదం కోసమో, స్వీయ రచనా స్ఫూర్తికో, వ్యక్తి వికాసం కోసమో మాత్రమే కాకుండా సామాజిక వికసనం కోసం ఉపయోగపడాలి. అంటే ఆ రచన మన చుట్టూ ఉన్న సమాజంలోని సమస్యల్ని అర్థం చేసుకోవడానికి ఎంత వరకు ఉపయోగపడ్తుందో ఆలోచించాలి. మన చుట్టూ ఏం జరుగుతోంది? మనం చదివిన సాహిత్యం ఏ విధంగా ఉపయోగపడ్తుంది? అనేవి ఆలోచించాలి. కొన్ని వైయక్తికంగా మనవిగానే అనిపించిన సమస్యలు నిజానికి మన చుట్టూ ఉన్న సమాజంలోని అందరివీ కూడానేమో అనే దిశగా ఆలోచించడం కూడా ప్ర్రారంభించాలి. ముఖ్యంగా మనదనే గొంతుకని గుర్తించాలి. అప్పుడే ఆ రచన ప్రయోజనం పొందినట్టు. ఇదంతా లేకుండా మనం ఎన్ని కథలు చదివినా ఉపయోగం ఉండదు. 

ఇక ఇవేళ అమెరికా తెలుగు కథలు  – స్థానిక సమస్యలు అనే అంశమ్మీద నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ఈ సందర్భంగా  కొన్ని కథల్ని రేఖా మాత్రంగా ప్రస్తావిస్తాను. ఒకవేళ నా దృష్టిలోకి రాని కథలేవైనా ఉండి, నేను ఎవరినైనా విస్మరించి ఉంటే క్షమించండి. 

ఉత్తర అమెరికా ఖండం నుండి మొట్టమొదటి తెలుగు కథ ఏప్రిల్ 24, 1964 లో అప్పటి ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ప్రచురించబడింది. ఆ కథ పేరు “వాహిని”. ఆ కథని దివంగత రచయిత శ్రీ పులిగండ్ల మల్లికార్జున రావు గారు (Edmonton, Canada) రాసేరు. ఆయన కలం పేరు ‘ఆర్ఫియస్”. కథ ప్రచురింపబడే ముందువారం ఎడిటోరియల్ లో “వచ్చే వారం మీరు ఊహించలేని ఒక ప్రత్యేక కథ ప్రచురణ” అవుతుందని కూడా ప్రత్యేకంగా వ్రాశారట.  

ముందుగా అమెరికాలో స్థానిక సమస్యలు అంటే ఏవిటో చూద్దాం. 

అసలు అమెరికా అంటే భూతలస్వర్గం కదా! అక్కడి సమాజంలో కూడా సమస్యలు ఉన్నాయా? అని మనలో చాలా మంది అనుకోవచ్చు. అంటే మనందరకూ తెలిసిన పాశ్చాత్య సమాజ సంస్కృతి సంబంధించినవో, వివక్షకు సంబంధించినవో  కాదు. అసలు ఇక్కడి అమెరికన్ సమాజంలో బతుకుతున్న వారికి, ముఖ్యంగా అట్టడుగు వర్గాల వారికి ఉన్న సమస్యలు ఏవిటి? అనేది ఆలోచిస్తే- 

అంటే మళ్లీ కేవలం  వలస వచ్చినవారు, మైనార్టీటీల సమస్యలే కాదు. పేదరికంలో మగ్గుతున్న అమెరికా పౌరులు కూడా ఉన్నారు. ఇక్కడ తినడానికి తిండి పెద్ద సమస్య కాదు, కడుపు నింపుకునే రొట్టె ముక్కలు ఉచితంగా అందజేసే ఏర్పాట్లు ఎక్కడికక్కడ ఉంటాయి.  కానీ ఉండడానికి ఇల్లు సమస్య. తల మీద గూడు లేక గడ్డకట్టే చలిలో రోడ్ల మీద బతికే “హోమ్ లెస్” నెస్ ఒక పెద్ద జీవన్మరణ సమస్య. భూతల స్వర్గంలో నరకాన్ని చవిచూసే అనేక మంది దౌర్భాగ్యుల సమస్య. 

మనుషుల జీవితాల్ని తలకిందులు చేసే ఆర్థిక కారణాలు మనుషుల్ని రోడ్డుకీడిస్తే, ఎక్కడ పడితే అక్కడ గుడారాలు వేసుకునైనా  బతకనివ్వని నియమ నిబంధనలు మనుషులకు తలదాచుకుందుకు ఇంత చోటు లేకుండా చేస్తాయి. 

అలాగే అందరికీ అమలుకాని ఆరోగ్య విధానాలు, ఇన్సూరెన్సు వ్యవస్థలు మనుషుల్ని జీవచ్ఛవాలుగా మిగులుస్తున్నాయి. ఇక సామాన్యులు కాలేజీల్లో చదువుకోవడానికి వీలులేని భయంకరమైన ఫీజులు, నిలకడలేని ఉద్యోగాలు….. ఒక్కటేవిటి ఇలా ఎన్నో ఉన్నాయి. 

ఇక అమెరికా తెలుగు కథ గత యాభయ్యారేళ్లలో  స్థానిక అమెరికా సమాజాన్ని, స్థానిక సమస్యల్ని ఎంత వరకు ప్రతిబించింది? 

అంటే వేమూరి వెంకటేశ్వర్రావు గారి మాటల్లో చెప్పాలంటే “ఈ వ్యక్తి అమెరికా వెళ్లి అక్కడ నివసించి ఉండకపోతే ఈ కథ రాయగలిగి ఉండేవాడు కాదు అనిపించుకోదగ్గ కథలు ఉన్నాయా?” అనేది చూస్తే 

అమెరికా తెలుగు కథ ప్రధానంగా ఐసోలేషన్  చుట్టూనో, చిన్నప్పటి జ్ఞాపకాలు, తన ప్రాంతపు  నాస్టాల్జియా చుట్టూనో,  స్థానిక సంస్కృతి, భారతీయ సంస్కృతికి మధ్య సంఘర్షణ చుట్టూనో, వీసా మొదలైన “దేశీ” సమస్యలు, ఇంకొంచెం ముందుకు వెళ్లి   “వలస”  జీవనాన్ని  ప్రభావితం చేసే అంశాల చుట్టూనో తిరుగుతుంది. ఇదంతా సహజం కూడా. 

మానవ సహజంగా ముందు మనం మన సమస్యలు తీరినప్పుడే కనీసం పక్కవారి గురించి ఆలోచిస్తాం. 

అయితే భారతీయులు ఎందుకు ఇక్కడ స్థానిక సమాజంలో భాగస్వాములు ఎందుకుకాలేకపోతున్నారు? అంటే 

వలస వచ్చి మనకు తెలీని ఒక కొత్త సమాజంలోకి అడుగుపెట్టినప్పుడు సహజంగా ఉండే భయం ఒక కారణమైతే, ఎక్కడికక్కడ ఎవరి ప్రాంత సంఘాలు వారు ఏర్పరుచుకుని వారి సంస్కృతిని కాపాడుకోవడమే ప్రధాన ధ్యేయంగా బతకడం మరొక కారణం. 

ఇక స్థానికులు వలస వచ్చినవారిని కలుపుకోకపోవడం మరొక ముఖ్య కారణం. ఇరుగుపొరుగు వారిని కూడా లోపలికి పిలిచి కాఫీ ఇచ్చి కబుర్లు చెప్పే సంస్కృతి ఉండదు ఇక్కడ. ఇది వివక్ష కాదు వ్యక్తుల “ప్రైవసీ” కి ఇచ్చే రెస్పెక్ట్ అంతే. ఇది కలుపుగోలుతనం లేనిదిగా అనిపించినా , అనవసరంగా పక్కవారి విషయాలలోకల్పించుకోకూడని  ఒక  “డిసిప్లిన్” అన్నమాట. 

ఈ విధంగా  సమాజంతో “ప్రత్యక్ష” సంబంధం లేని జీవితంలో ఏదో ఊహించుకుని ఒక కథ రాసినా పేలవంగా తేలిపోతుంది. 

స్థానిక సమాజంలో నిజమైన భాగస్వాములుగా మారితేనే తప్ప అర్థం చేసుకోలేని సమస్యలు పైన చెప్పినవన్నీ. 

ఇక్కడి సమాజాన్ని, సమాజ ప్రభావాన్ని ప్రతిబింబించే కథలు కొన్ని ఉదహరిస్తాను.

అఫ్సర్ గారు రాసిన “చోటీ దునియా” భారతీయులు తమ కంఫర్ట్ జోన్ లోనే ఉండి ఇక్కడి సమస్యల గురించి ఆలోచించుకోవడానికి కూడా ఎలా భయపడతారో చెప్పే కథ.  

హిమబిందు గారు రాసిన “అలజడి” కథ సర్రోగసి ప్రెగ్నెన్సీ గురించిన కథ, “తూర్పు వాకిటి పశ్చిమం!” కథ పిల్లల పెంపకంలో కల్చరల్ ఎస్పెక్ట్ ని అంది పుచ్చుకున్న కథ, “ప్రవాహం”  కథ లెస్బియన్ కపుల్ పట్ల భారతీయ కుటుంబం ఆలోచనాసరళిని తెలిపే కథ. లెస్బియన్ ఇతివృత్తంతో కల్పన గారు రాసిన “The Couplet”  అనే కథ ఇక్కడ చెప్పుకోవచ్చు.  

ఆరి సీతారామయ్య గారి కథ “మళ్ళా నాలుగేళ్లు” ఎలక్షన్ కాంపెయిన్ అనుభవాల గురించిన కథ. 

నిడదవోలు మాలతిగారు రాసిన “రంగుతోలు” -ఏ రంగైనా మానవీయత ఒక్కలాగే ఉంటుంది అందరిలో అని ,  వర్ణ వివక్ష పై రాసిన కథ. అలాగే ఆవిడ రాసిన “పలుకు వజ్రపుతునక”  అద్దె ఇళ్లలో భారతీయుల్ని స్థానికులు పెట్టే అవస్థలపై రాసిన కథ. 

అమెరికాలో ట్రాఫిక్ రూల్స్ కి సంబంధించిన కథ సత్యం మందపాటి గారి “పోలీసోపాఖ్యానం”  అనే కథ.  

ఆయనే రాసిన వర్ణ వివక్ష కు సంబంధించిన కథ  “పంటి క్రింద రాయి”. ఇది భారతీయుల పట్ల ఆఫీసుల్లోవివక్షని,  అనుభవం ఉన్నా ఒకస్థాయికి మించి వెళ్లనివ్వకపోవడాన్ని చెప్తుంది. ( ఒక సత్య నాదెళ్ల లాగా, సుందర పిచ్చయ్య లాగా ఉన్నత స్థాయికి ఎంత మంది వెళ్లగలుగుతున్నారు అనేది ఇంకా ప్రశ్నార్థకమే) 

సత్యం గారు రాసిన ఎన్నారై   కథల్లో వీసా సమస్యల గురించి రాసిన కథ “మనిషికో చరిత్ర”. 

ఇక 9/11 గురించి రాసిన కథల్లో కె.వి గిరిధరరావు గారు రాసిన అటాఇటా?, కన్నెగంటి చంద్ర గారి “బతుకు” కథ,  కూనపరాజు కుమార్ గారి “ఊదా రంగు తులిప్ పూలు”,  అక్కిరాజు భట్టిప్రోలు గారు రాసిన “నాక్కొంచెం నమ్మకమివ్వు” కథ మొ.నవి చెప్పుకోదగ్గవి. 

ఇక హాస్య భరితంగా కథలు చెప్పడంలో దిట్ట, “అమెరికా హాస్య కథా బ్రహ్మ” మా వంగూరి చిట్టెంరాజు గారు రాసిన  అమెరికామెడీ కథల్లో “చేగోడీ కంప్యూటర్ కంపెనీ కథ” కంప్యూటర్ రంగంలో ఉద్యోగాలకోసం  డబ్బు ధారపోసి ఇక్కడికి వచ్చి మోసపోయే వారి గురించిన కథ. అలాగే ఆయనే రాసిన మరోటి “రెండో చేగోడీ కంప్యూటర్ కంపెనీ కథ”- వైటుకే సమస్య పరిష్కారమైన నేపథ్యంలో భారతీయులు ఉద్యోగాలు ఎలా కోల్పోవాల్సి వచ్చిందో తెలిపే కథ.

భిన్న సంస్కృతుల మధ్య సంఘర్షణకి సంబంధించి పూడిపెద్ది శేషశర్మ గారు,  సుధేష్ణ గారు, రాధికా నోరి గారు, మాచిరాజు సావిత్రి గారు, గునుపూడి అపర్ణ గారు, కోసూరి ఉమాభారతి గారు వంటి వారు  రాసేరు. 

అక్కిరాజు భట్టిప్రోలు గారు రాసిన  “నందిని” కథ సహజీవనం, వివాహవ్యవస్థల గురించిన కథ. 

గృహ హింసకి సంబంధించిన కథ  కల్పన గారి “ఇట్స్ నాట్ ఓకే”.

వేమూరి వెంకటేశ్వర్రావుగారి కథ “ఎమిలీ” -కూతుర్ని పోగొట్టుకున్న అమెరికన్ తల్లి 20 యేళ్ల తరవాత కూతుర్ని కలుసుకునే కథ. 

అలాగే రూపపరంగా మెడికో శ్యామ్ గారి కథలు, అనిల్ రాయల్ గారి కథలు మొ.నవి పేర్కొనదగినవి.

ఇక అమెరికా తెలుగు కథల్లోని కొన్ని సమస్యల్ని స్థూలంగా చూస్తే  అవి కేవలం భారతీయుల సమస్యలు మాత్రమే కావు. భారతీయుల్లాగే వలస వచ్చిన ఇతరదేశ జనానీకానివి కూడా. అయితే రచయిత మూసలో నుంచి బయటికి అడుగుపెడితేనే ఇటువంటివి రచనలో ప్రతిఫలించే అవకాశం ఉంటుంది.

ఇక్కడ రచయిత పార్శ్వమ్  లోంచి చూస్తే వలస జీవితంలో ఎన్ని సమస్యలుంటాయో, వలస రచయితకి కూడా అన్ని సమస్యలూ ఉంటాయి. 

ముఖ్యంగా తను నివసిస్తున్న సమాజంతో ఎక్కడా  ప్రత్యక్షసంబంధం లేని పరిస్థితుల్లో రచనలో సమాజ ప్రయోజనాన్ని ప్రతిబింబించాల్సిన బాధ్యత ఒక పెద్ద సవాలుగా మారుతుంది. దీనిని అధిగమించగలిగినప్పుడు మాత్రమే సమాజాన్ని ప్రతిబింబించే ఉత్తమ రచనలు, పదికాలాలపాటూ నిలబడిపోయే రచనలూ వస్తాయి.

ఇక ఈ సందర్భంగా 2014లో వంగూరి ఫౌండేషన్ వారు ప్రచురించిన “అమెరికా తెలుగు కథా సాహిత్యం సమగ్ర పరిశీలన” అనే పుస్తకం-  1964 నుంచి 2013 వరకు – 50 ఏళ్లలో వచ్చిన అమెరికా కథలన్నీ సమీక్ష చేసి వేసిన ఉత్తమ పరిశీలనగా గ్రంథంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రతీ పదేళ్లకోసారైనా మారిన ప్రపంచాన్ని, ఆ తర్వాత వచ్చిన కథల్ని కూడా దృష్టిలోకి పెట్టుకుని ఒకో  అనుబంధ గ్రంథాన్ని తీసుకుని వస్తే అందరికీ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.  

అలాగే నేను రాసిన “సిలికాన్ లోయ సాక్షిగా” కథా సంపుటి లో పద్దెనిమిది కథల్లో స్థానిక సమాజ సమస్యల్ని కొన్నిటినయినా వివరంగా చెప్పి, లోటుని పూర్చడానికి ప్రయత్నించాను. ఎంత వరకు కృతకృత్యురాల్నయ్యానో చదివి మీరే చెప్పాలి.   2013-14 మధ్య కాలంలో వాకిలి అంతర్జాల పత్రికలో ధారావాహికగా వచ్చిన ఈ కథల్ని పుస్తకంగా నవచేతన పబ్లిషింగ్ హౌస్ వారు 2018లో ముద్రించేరు. 

డయాస్పోరా కథల్లోని అనేక అంశాల గురించి ఇంకా వివరంగా మరొకసారి ఎప్పుడైనా చెప్పుకుందాం.

 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.